Google+ Followers

Followers

Thursday, 10 September 2015

వేమన శతకము 7

 తనకుఁ గలుగు పెక్కు తప్పులునుండగా
ఓగు నేర మెంచు నొరులఁగాంచి
చక్కిలంబుఁ జూచి జంతిక నగినట్లు
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| తనలో చాల తప్పులుండినను అవేవియులేనట్లు దుర్మార్గుడు ఎదుట వారిలోని తప్పులను బయట బెట్టుటకు ప్రయత్నించును. జంతికలో చుట్లు వంకరలు ఎక్కువయుండును. చక్కిలములో తక్కువగా నుండును. అయినను జంతిక చక్కిలమును జూచి వెక్కిరించినట్లు దుష్టుడు ఎదుటివారి తప్పులనెంచును.

*******************************************************************************************  61

ఇనుము విరిగెనేని యినుమారు ముమ్మారు
కాల్చి యతుక వచ్చు క్రమముగాను
మనసు విరిగెనేని మరి కూర్పవచ్చునా
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| ఇనుప కమ్మి విరిగినచో రెండుసార్లైనను మూడుసార్లైనను అతికి సరిచేయవచ్చును. ఒకసారి మనసువిరిగినచో దానిని సరిచేయుట ఎవ్వరివల్లను గాదు. ఎదుటివారి ప్రవర్తనము వలన మన మనసు గాయపడి విరక్తమైనచో దానియందు మరల అనురక్తి కలిగించుట ఎవ్వరి వశమునుగాదు.

*******************************************************************************************  62

ఒరునిఁ జెఱచెదమని యుల్లమందెంతురు
తమకుఁ జేటెఱుగని ధరణి నరులు
తమ్ముఁ జెఱచువాడు దైవంబు లేడొకో!
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| ప్రపంచములోని మనుష్యులు తమకు గలుగు నష్టము నెఱుగక యితరులను నాశనము చేయుటకు ప్రయత్నింతురు. అట్లు ఇతరులను జెఱుపు వానిని జూచి దైవ మూరకుండునా? ఎప్పుడో వానిని నాశనము చేసి తీరును. అజ్ఞానులైన జనులు ఆ సంగతి గ్రహించక తమకు తోచినట్లు ప్రవర్తింతురు.

*******************************************************************************************  63

కాని వానిచేతఁ గాసు వీసం బిచ్చి
వెంటఁ దిరుగువాడు వెఱ్ఱివాడు
పిల్లి తిన్న కోడిఁ బిలిచిన పలుకునా?
విశ్వదాభిరామ వినుర వేమ!


తా||పనికి మాలిన ఆ ప్రయోజకునకు ధనమును అప్పుగా నిచ్చి, తిరిగి రాబట్టుకొనుటకై వెంట దిరుగువాడు చాల వెఱ్ఱివాడు. అది తిరిగి వచ్చునా? పిల్లి కోడిని తినును. ఆ తరువాత ఆ కోడిని పిలిచినచో అది పలుకునా? వచ్చునా? ఎప్పుడో పిల్లి కడుపులో జీర్ణమైయుండును.

*******************************************************************************************  64

మాటలాడ నేర్చి మనసురంజిలఁజేసి
పరగఁబ్రియము చెప్పి బడలకున్న
నొకరి చేతి సొమ్ము లూరక వచ్చునా?
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| చమత్కారముగా మాటలాడుట నేర్చికొని యెదుటివారికి ప్రియమైన మాటలు చెప్పి ఆనందపఱచి, ఇంత శ్రమ పడనిచో ఎదుటివారి చేతిలోని సొమ్ములు ఊరకేవచ్చునా?

*******************************************************************************************  65

చంపదగిన యట్టి శత్రువు తనచేతఁ
జిక్కెనేనిఁ గీడు సేయరాదు
పొసగ మేలు చేసి పొమ్మనుటేచాలు
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| చంపదగినంత మహాపకారము చేసిన శత్రువు తన చేతికి జిక్కినపుడు తిరిగి వానికి హాని చేయుట నీచలక్షణము. ఆ శతృవునకు మేలు చేసి అనగా చేతనైన యుపకారము చేసి పొమ్మన్నచో చాలు. వాని తప్పు వానికి తెలిసివచ్చును. అట్లు శత్రువు మనసు మార్చుట ఉత్తమ లక్షణము. చేతికి దొరికినాడు గదాయని మరల కీడు చేసినచో వాని మనసులో పగ పెరుగునుగాని మార్పురాదు.

*******************************************************************************************  66

వాన కురియకున్న వచ్చును క్షామంబు
వాన కురిసెనేని వరద పాఱు
వరద కరువు రెండు వరుసగా నెఱుగడీ
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| వానలు కురియకున్నచో పంటలు సరిగా పండక కరువు వచ్చును. వానలు కురిసినచో నీరు వరదలై ప్రవహించును.వరద, కరువు రెండును ఒకదాని వెనుక నొక్కటి యుండును. వానలు లేనప్పుడు కరువు వచ్చుట సహజము., అయితే, ఆ వానలే యెక్కువై వరదలతో పంటలు ముంచి వేసినచో అప్పుడును కరువు వచ్చును. ఏ దైనను మితిమీరకుండ ఉన్నచో సౌఖ్యము గలుగును. గాని లేనిచో సుఖము లేదు.

*******************************************************************************************  67

పుట్టిన జనులెల్ల భూమిలో నుండినఁ
బట్టునా జగంబు పట్టదెపుడు
యముని లెక్కరీతి నరుగుచునుందురు
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| పుట్టిన వారందరును చావకుండ భూమిపై నుండినచో ఈ భూమి, వారికి చాలునా? నిలుచుటకు గూడ చోటు ఉండదు. అందుచేతనే యముని లెక్కలలోని ఆయుర్దాయమున్నన్నినాళ్ళు భూమిపై జనులు బ్రతికి, ఆయువు తీరగానే పోవుచుందురు. మనము చేసికొన్న వస్తువు పాడైనచో విచారింతుము. దేవుని సృష్టిలోనే ఏదియు శాశ్వతముగా మిగులదు. అందుకు విచారింపవలసిన పని లేదని భావము.

*******************************************************************************************  68

వాన రాకడయును బ్రాణంబుపోకడ
కానఁబడ వెంత ఘనునకైనఁ
గానబడిన మీదఁగలియెట్లు నడచురా
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| వానయెప్పుడు వచ్చునో, ప్రాణమెప్పుడు పోవునో యెంత గొప్పవానికైనను దెలియదు. అట్లు తెలిసినచో ఇది కలియుగ మెందుకగును? అనగా కలియుగములో ప్రజలు తపశ్శక్తులు, యోగశక్తులు లేక భూతభవిష్యద్వర్తమానములు తెలిసికొను జ్ఞానము లేక యుందురు. అందుచేతనే తాము భూమి యున్నంతకాలము ఉండిపోవుదు మనుకొని, యెన్ని దుర్మార్గ కృత్యములైన చేసి ధనాదులు సంపాదించుటకై బ్రతుకును వ్యర్థము చేసికొందురు. తామెప్పుడు చనిపోవుదురో తెలిసినచో పరీక్షిత్తు వలె పరమార్థమును కొఱకు ప్రయత్నింపరా?

*******************************************************************************************  69

చిప్పఁబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయె
నీటఁబడ్డ చినుకు నీటఁ గలిసెఁ
బ్రాప్తి కలుగు చోట ఫలమేల తప్పురా
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| స్వాతికార్తెలో గురిసిన వాన చినుకు ముత్యపుచిప్పలో బడినచో ముత్యమగును. అదే నీళ్లలో బడినచో నీటిలో గలిసిపోవును. అట్లే మనకు ప్రాప్తమున్నచో రాజాశ్రయము దొరికి మన బ్రతుకు ముత్యమువలె మెరసిపోవును. ప్రాప్తము లేనిచో నీచునాశ్రయమే దొరికి, ఊరును పేరును లేకుండ నశించును.

*******************************************************************************************  70

Popular Posts