Followers

Thursday 10 September 2015

వేమన శరకము 6


అలను బుగ్గపుట్టినప్పుడే క్షయమౌను
కలను గాంచులక్ష్మి కల్లయగును
ఇలను భోగభాగ్య మీ తీరుకాదొకో
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| కెరటాలలో బుట్టు నీటి బుడగ కొంతసేపుండును. వెంటనే నశించును. కలలో చూచిన ధనధాన్యములు మెలకువ వచ్చునప్పటికి కనబడవు. లోకములో భోగభాగ్యములు గూడ ఇట్లే కాలపరిబ్రమణములో ఈనాడుండి రేపు నశించిపోవును. అవే శాశ్వతమనుకొని అందులోబడి కొట్టుమిట్టాడువాడు అజ్ఞాని సుమా!.

*******************************************************************************************  51

కోతినొకటి తెచ్చి క్రొత్తపుట్టముగట్టి
కొండమ్రుచ్చులెల్లఁ గొలిచినట్లు
నీతిహీనునొద్ద నిర్భాగ్యులుందురు
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| కొండమ్రుచ్చులన్నియు గలిసి ఒక కోతిని దెచ్చి దానికి క్రొత్తబట్టలు గట్టి రాజును జేసి సేవించినట్లుగా, నీతిలేని వాని నొకనిని నాయకునిగా జేసికొని నీతిమాలినవారు సేవించుచుందురు. అనగా చెడ్డవాని దగ్గరకు స్వభావ సామ్యమునుబట్టి చెడ్డవారే చేరుచుందురని యర్థము.

*******************************************************************************************  52

కల్లలాడు వాని గ్రామకర్తయెఱుగు
సత్యమాడువాని స్వామి యెఱుగుఁ
బెద్ద తిండిపోతుఁ బెండ్లామెఱుంగురా
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| ఎవ్వడసత్యములు మాటలాడునో గ్రామపెద్ద యెఱుగును. అతడు వానితో అందుకు తగినట్లే వ్యవహరించును. సత్యము చెప్పువానిని భగవంతుడెఱుగును. ఆయన అట్టివానికి తగిన ఫలములనే యిచ్చును. పెద్ద తిండిపోతును ఊరివారు తిండిపోతని యెఱుగక పోయినను వాని భార్య యెఱుగును. అందుచే వానికి సరిపడు తిండి పెట్టును. ఇతరులైనచో కసిరికొట్టుదురు. లేదా ఎగతాళి చేయుదురు.

*******************************************************************************************  53

కల్ల నిజములెల్ల గరళ కంఠుడెఱుగు
నీరు పల్ల మెఱుగు నిజముగాను
తల్లి తానెఱుగును తనయుని జన్మంబు
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| ఏది సత్యమో ఏది అసత్యమో ఆ పరమశివుడెఱుగును. పల్లమెటు వైపున నున్నదో నీరు ఎఱుగును. (కావున అటే ప్రవహించును). తన కొడుకు పుట్టుక తల్లికే తెలియును కాని యితరులకు దెలియదు. "వీడు నీ కొడుకు" అన్నచో భర్త నమ్మవలసినదే.

*******************************************************************************************  54

మైలకోక తొడ మాసిన తలతోడ
నొడలు మురికితోడ నుండెనేని,
నగ్రకులజుడైన నట్టిట్టు పిలువరు
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| మాసిపోయిన బట్టలతోను, ఎక్కువగా పెరిగి అసహ్యముగా నుండు జుట్టుతోను, స్నానము చేయక మురికిగా నుండు దేహముతోనూ కనిపించినచో, వాడెంత ఉన్నత వంశములో బుట్టినను మర్యాదస్థులు తమ యింటికి పిలిచి గౌరవించరు.

*******************************************************************************************  55

ఉప్పులేని కూర యొప్పదు రుచులకు
పప్పులేని తిండి ఫలములేదు
అప్పులేని వాడె యధికసంపన్నుడు
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| ఎంతచక్కగా వండినను ఉప్పులేకపోయినచో ఆ కూర రుచిగా నుండదు. పప్పులేకుండ ఎన్ని కూరలతో తిన్నను ఆ తిండి బలమునియ్యదు. ఎన్ని సంపదలు ఉన్నను అప్పులున్నచో అవి శోభించవు. అప్పులేనివాడు పెద్ద ధనికుడు కాకపోయినను వాడే మహైశ్వర్యవంతుడు.

*******************************************************************************************  56

చెట్టుపాలు జనులు చేదందురిలలోన
నెనుపగొడ్డు పాలవెంత హితము?
పదుగురాడు మాట పాటియైన ధరఁజెల్లు
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| కొన్ని చెట్లనుండి పాలు వచ్చును. వానిని పనికిరావని ప్రజలు తీసి పారవేయుదురు. మరి, గేదె పాలు మంచివా? అవి వాతదోషమును, అజ్ఞానమును పెంచును. చురుకుదనమును తగ్గించును గదా! అవి యెట్లు మంచివైవని? ఐనను, పదిమంది " మంచివి" అన్నారు గనుక మంచివిగానే ప్రసిద్ధికెక్కును.

*******************************************************************************************  57

పట్టుపట్టరాదు పట్టి విడువరాదు
పట్టెనేని బిగియఁ బిట్టవలెను,
పట్టి విడుచుకున్నఁ బడి చచ్చుటయె మేలు
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| ఏ విషయములోను, ఇది జరిగి తీరవలెనని పట్టుదల పూననే రాదు. ఒకవేళ అట్లు పట్టు పట్టినచో మధ్యలో వదలకూడదు. ఆ విధముగా మధ్యలో పట్టుదల విడిచిపెట్టుట కంటెను చచ్చుటయే చాల మంచిది.

*******************************************************************************************  58

తప్పు లెన్నువారు తండోపతండంబు
లుర్విజనులకెల్ల నుండుఁ దప్పు,
తప్పు లెన్నువారు తమ తప్పు లెఱుగరు
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| ఎదుటి వారిలోని తప్పులెన్నువారు చాలమందియే ఉందురు. కాని అందరిలోను తప్పులుండును. అయితే, ఎదుటివారిలోని తప్పులెన్నువారు తాము చేసిన తప్పులను గుర్తించరు.

*******************************************************************************************  59

అనగ ననగ రాగమతిశయిల్లుచు నుండుఁ
దినగదినగ వేము తీయగుండు
సాధనమునఁ బనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| పాడగాపాడగా రాగము బాగుగా వచ్చును. పాడుటమాని వేసినచో కంఠము సాధనము లేక మృదువుగా సాగదు. తినగా తినగా వేప చిగుళ్ళు కూడ తీయగా నుండును. అనగా చేదు నోటికి అలవాటై అదే బాగున్నట్లుండును. అట్లే మొదట ఏపనియైనను చేతకానట్లున్నను చేయగాచేయగా చేయి తిరిగి నైపుణ్యము వచ్చును.

*******************************************************************************************  60

Popular Posts