Followers

Thursday 10 September 2015

వేమన శతకము 10

తల్లిదండ్రుల పయి దయలేని పుత్రుండు
పుట్టనేమి? వాడు గిట్టనేమి?
పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా?
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| కనిపించిన తల్లిదండ్రుల మీద దయతో, వారు పెద్దవారైనపుడు వారి కష్టసుఖములను చూచుచు ఆదరించుట పుత్రధర్మము. అట్లు చూడని కొడుకు పుట్టినందువలన ప్రయోజనమేమి? చచ్చినందువలన నష్టమేమి? పుట్టలోని చెదలు పుట్టుచున్నవి. ఎవరి నుద్ధరించుటకు? చచ్చుచున్నవి. ఎవరికి నష్టము?

*******************************************************************************************  91

తనకు లేని నాడు దైవంబు దూరును
దనకుఁ గలిగెనేని దైవమేల?
తనకు దైవమునకుఁ దగులాట మెట్టిదో!
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| మానవుడు తనకు సంపదలు లేక పోయినచో, వాని నియ్యలేదని దైవమును నిందించును. ఒకవేళ సంపదలే కలిగినచో దైవము మాట స్మరింపడు. తన ప్రజ్ఞయేయని గర్వించును. అంతేకాదు , తనకును దైవమునకును గల సంబందమెట్టిదో యేనాడును ఆలోచించడు. అనగా పరమార్థము నెఱుంగుటకు ధనమదము వలన ప్రయత్నించడని తాత్పర్యము.

*******************************************************************************************  92

మాటలాడుటొకటి, మనసులో నొక్కటి,
బడలి గుణము వేరె, యోజవేరె
ఎట్లు గలుగుముక్తి యీలాగుతానుండ?
విశ్వదాభిరామ వినుర వేమ!


తా||మనసులోని ఆలోచన ఒకటి, పైకి చెప్పునదొకటి, చేసెడిది వేరొకటి ఇది దుర్జన స్వభావము. ఇటువంటి వారికి ముక్తి యెట్లు వచ్చును?

*******************************************************************************************  93

మ్రుచ్చు గుడికి బోయి ముడివిప్పునేకాని
పొసగ స్వామిఁ జూచి మ్రొక్క డతడు
కుక్క యిల్లు సొచ్చి కుండలు వెదుకదా!
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| దొంగవాడు గుడికి వెళ్ళి డిబ్బీలోని డబ్బుకోసమే వెదుకును గాని దేవునికి నమస్కారము చేయడు. వాని దృష్టి డబ్బుల మీదనే కాని దేవుని మీద నుండదు. కుక్క యింటిలో దూరి అంటకుండల కోసము వెదుకును గాని దేవతార్చన పెట్టె దగ్గరకు బోవునా? దాని స్వభావమంత .

*******************************************************************************************  94

అంతరంగమందు నపరాధములు చేసి
మంచి వానివలెనె మనుజు డుండు
ఇతరులెఱుగకున్న నీశ్వరుడెఱుగడా?
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| మనుష్యుడు తన మనస్సులో ఎన్నో దురాలోచనలు చేయుచుండును. ఎవరికిని దెలియకుండ కొన్నింటిని వీలైనచో ఆచరణలో గూడ పెట్టును. కాని పైకి మాత్రము అందరికిని మంచివాని వలెనే కనబడుచుండును. తోడి మానవులకు వాని లోగుట్టు తెలియకపోవచ్చును. కాని సర్వాంతర్యామియైన ఆ భగవంతునకు వాని నైజము తెలియదా?.

*******************************************************************************************  95

వేషభాషలెఱిగి కాషాయవస్త్రముల్‌
కట్టగానె ముక్తి కలుగఁబోదు
తలలు బోడులైనఁ దలపులు బోడులా
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| వేషములు ఆడంబరముగా వేసికొని, అనేక బాషలు మాటలాడుచు అచ్చమైన సన్న్యాసివలె కాషాయవస్త్రములు గట్టుకొని, ప్రజలకు వేదాంతములు చెప్పుచున్నంత మాత్రమున ముక్తి కలుగదు. అందుకు నిజమైన వైరాగ్యము కావలెను. " త్యాగేనైకే అమృతత్వ మానశుః" అని వేదవాక్యము. " సర్వసంగ పరిత్యాగము చేసి మానసికముగా వైరాగ్యము సంపాదించుకొన్నవారే ముక్తి నొందుదు" రని దీని యర్థము.

*******************************************************************************************  96

ఓగునోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని
భావమిచ్చి మెచ్చుఁబరమ లుబ్ధుఁ
బంది బురద మెచ్చుఁ బన్నీరు మెచ్చునా?
విశ్వదాభిరామ వినుర వేమ!


తా||దుర్జనుడు తనవలెనే దుష్కార్యములు చేయు ఇంకొక దుర్జనుని మెచ్చుకొనును. వానికిని వీనికిని ఆలోచనలు సమానము గనుక మనసులు కలియును. మెచ్చుకొనును. తన భావమునకు విరుద్ధములైన హితబోధలు చేయు సజ్జనుని సర్వదా ద్వేషించును. అట్లే ఒక జ్ఞానహీనుడు ఎదుటివారికింత పెట్టుట పరమార్థమని గ్రహింపడు. తనవలెనే పిసినిగొట్టు తనముతో నున్నవానిని చాల అభినందించును. దాతను ఆక్షేపించును. పంది యెప్పుడైనను బురదనే కోరుకొనును గాని పన్నీరు వాసనను భరింపలేదు.

*******************************************************************************************  97

గాజు కుప్పెలోనఁ గదలక దీపంబ
దెట్టులుండు జ్ఞాన మట్టులుండు
తెలిసినట్టి వారి దేహంబులందున
విశ్వదాభిరామ వినుర వేమ!


తా||తపములు, యోగాభ్యాసములు చేసి, పరమాత్మ స్వరూపమును దెలిసికొన్నవారి జ్ఞాన దీపము, వారి హృదయములలో, గాజు కుప్పెలో బెట్టిన దీపమువలె నిశ్చలముగా, స్థిరముగా నుండును. ఆ జ్ఞానదీపమే వారికి మోక్షమునకు దారిచూపును.

*******************************************************************************************  98

అన్నమిడుట కన్న నధికదానంబుల
నెన్ని చేయనేమి యెన్నబోరు
అన్నమెన్న జీవనాధార మగునయా
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| మనము ధనములు, వస్తువులు యెన్నియో దానము చేయుదుము. వానిచేత యాచకుని తృప్తిపరచలేము. ఇంతే ఇచ్చినాడేమి? మనకు మరింత యివ్వరాదా? యని అసంతృప్తిగానే వెళ్ళును. మనమొకనికి భోజనము పెట్టుదుము. కావలసిన దానికన్న నెక్కువ వడ్డించినచో " చాలు, చాలు, ఇంకవద్దు" అనును. అనగా ఆ భోజనముతో అతనికి తృప్తి కలిగినదన్నమాట. అట్లు తృప్తి కలిగించు అన్నదానము కంటె మరియే దానము గొప్పది గాదు. అంతే కాదు. అన్నము సర్వ ప్రాణులకు జీవించుట కాధారము.

*******************************************************************************************  99

చదివి చదివి కొంత చదువంగ చదువంగ
చదువు చదివి యింకఁ జదువు చదివి
చదువు మర్మములను చదువలేడయ్యెను
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| ఎంతకాలము చదివినా, ఎన్నెన్ని చదువులు చదివినా, చదువులలోని మర్మము అయిన ఆత్మతత్త్వము తెలియకపోతే ఆ చదువులన్నియు ఎందుకూ పనికిరావు. అనగా నిరర్థకములు, వ్యర్థములని యర్థము.

*******************************************************************************************  100

Popular Posts