Google+ Followers

Followers

Thursday, 10 September 2015

వేమన శతకము -1చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు 
కొంచమైన నదియుఁ గొదవ గాదు 
విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత? 
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| వైరాగ్యముతో ఆత్మానందము నోండేది ఓ వేమా! వినుము. నిర్మలమైన మనస్సుతో ఏ కొంచెము పుణ్యకార్యము చేసిననుఆది చాలా ఘనమైన ఫలము నిచ్చును. చాలా చిన్నదైన మఱ్రి విత్తనము నుండి మహావృక్షము పుట్టుట లేదా?

*******************************************************************************************  1

ఆత్మశుద్ధి లేని యాచారమది యేల? 
భాండశుద్ధి లేని పాకమేల? 
చిత్తశుద్దిలేని శివపూజలేలరా? 
విశ్వదాభిరామ వినుర వేమ!


తా||పెద్దల నుండి వచ్చిన యాచారమును అంతకరణ శుద్ధితో పాటించవలెను. ఆ శుద్ధి లేని యాచారము వ్యర్దము. వంట చేయు పాత్రలను ముందు శుబ్రపరచవలెను. ఆది లేనిచొ ఆ వంట తినుటకు యోగ్యము కాదు. అట్లే స్నానాదులతొ బాహ్యశుద్ది కలిగియుండుటే కాక మనసునుకూడా కామక్రోధాదులు లేకుండ ప్రశాంతముగా నుంచుకొని శివ పూజా చేయ వలెను. మనసున మాలిన్యములుంచు కొని పైకి ఆడంబరరముగా శివ పూజా చేసినా ఫలము శూన్యము.

*******************************************************************************************  2

గంగిగోవుపాలు గంటెడైనను చాలు 
కడివెడైన నేమి ఖరము పాలు 
భక్తి గలుగు కూడు పట్టెడైనను జాలు 
విశ్వదాభిరామ వినుర వేమ!


తా : మేలైన ఆవు పాలు గరిటెడైనను అవి పిల్లలకు ఆరోగ్యామును, దేవతలకు ప్రీతిని గలిగించును. గాడిద పాలు కుండెడు ఉన్నను వానికి ఈ గుణములు లేవు. గనుక నిష్ప్ర యోజనము. అట్లే భక్తి తోను, ఆదరణము తోను పెట్టిన అన్నము అన్నార్థికి తృప్తి నిచ్చును. నిరాదరణముతో బం డెడన్నము పెట్టినను అది అసహ్యమే యగును. "సంవిదాదేయమ్" అని వేదవాక్యము. నేను పెట్టుచున్నానను అహంకారముతో కాక, భగవత్ప్రీతికై పెట్టుచున్నానను భక్తి భావముతో పెట్టినది కొంచెమై నను గొప్పదే యగును.

*******************************************************************************************  3

నిక్క మైన మంచి నీల మొక్కటి చాలు 
తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల? 
చాటు పద్య మిలను చాలదా యొక్కటి 
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| మంచి జాతి కలిగిన ఇంద్రణీల మణి ఒక్కటైనను చాలా విలువ చేయును. మెఱసెడి రాళ్లు తట్టెడున్నను దాని విలువలు సరిపొవునా? సందర్భ శుధ్ధి గలిగిన అందమైన చాటు పద్యమొక్కటైనను లక్షల విలువ చేయును. గాని వట్టి చప్పని పద్యములు వంద యున్నను ఏమి లాభము?

*******************************************************************************************  4

మిరెపు గింజ చూడ మీద నల్లగనుండుఁ 
గొరికి చూడలోనఁ జురుకుమనును 
సజ్జనులగు వారి సార మిట్లుండురా
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| మిరియపుగింజ పైకి నల్లగా అందము లేకుండా ఉండును. కాని కొరికి చూచినచో కారము చురుక్కుమనును. అట్లే సజ్జనులైనవారు పైకి నిరాడంబరముగా కనబడుదురు. కాని వారిని కదిపి చూచినచో ఎన్నో మహావిషయములు తెలియును. మిరెపగింజ ఆరోగ్యకరమైనట్లు సజ్జనుడు చెప్పు మాటలు ఇహపరసాధనములుగా నుండును.

*******************************************************************************************  5

మృగమదంబు జూడ మీఁద నల్లగనుండు 
పరిఢవిల్లు దాని పరిమళంబు 
గురువులైన వారి గుణము లీలాగురా!
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| కస్తూరి పైకి నల్లగా పనికి రానిదిగా కనబడుచుందును. కాని దాని సువాసన మాత్రము చాలా దూరము వ్యాపించును. అట్లే గురువులైన వారు పైకి చాలా నిరాడంబరులుగా కనబడుచుందురు, గాని వారి యుపదేశములు మొక్షదాయకములగుచుండును.

*******************************************************************************************  6

మేడిపండు చూడ మేలిమై యుండును 
బొట్టవిచ్చి చూడఁ బురుగు లుండుఁ 
బిరికివాని మదిని బింక మీ లాగురా 
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| మెడి పండు పైకి చూచుటకు చాలా బాగుగా కనపడును. దాని పొట్ట చీల్చి చూచినచో పురుగు లుండును. పనికి వచ్చు గుంజు ఏమియు నుండదు. అట్లే పిరికి వాడు, పైకి మంచి శరీర పుష్టి గలిగి చూడముచ్చటగా నుండును. కాని ఏదైన అవసరము వచ్చినచో నిలబడి యెదిరించు దైర్యము లేక నగుబాటు నొందును.

*******************************************************************************************  7

నేర నన్నవాడు నెరజాణ మహిలోన 
నేర్తు నన్నవాడు నిందఁ జెందు;
ఊరకున్నవాడె యుత్తమయోగిరా
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| నాకేమీయు తెలియదని చెప్పి తప్పించుకొనువాడు చాలా తెలివి తేటలు గలవాడు. నా కన్నియు తెలియునన్నవాడు ప్రజలలో నిందల పాలగును ఆటునిటు చెప్పక మౌనముగా నుండు వాడే చాలా బుద్ధిమంతుడు.

*******************************************************************************************  8

గంగ పాఱు నెపుడుఁ గదలని గతితోడ 
ముఱికివాగు పాఱు మ్రోతతోడ 
పెద్ద పిన్నతనము పేర్మియీలాగురా!
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| పెద్దదైన గంగానది వరద రోజులలో దప్ప తక్కిన రోజులలో ఒడిదుడుకులు లేక ప్రశాంతముగా, నిండుగా ప్రవహించును. మురికి కాలువ ఎప్పుడును ఈగల మ్రోతతో గూడి ప్రవహించును. అట్లే పెద్దవారు అనుభవజ్ఞులై ఆవేశములకు లోనుగాక నిండుగా , హుందాగా ప్రవర్తింతురు. అల్పులైనవారు ఆవేశపరులై అరచుచు దుడుకుదనముతొ ప్రవర్తింతురు.

*******************************************************************************************  9

నిండునదులు పాఱు నిలిచి గంభీరమై 
వెఱ్ఱివాగు పాఱు వేగఁ బొరలి 
అల్పుడాడు రీతి నధికుండు నాడునా?
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| వరదలు లేని రోజులలో నదులు నీటితో నిండియుండి ప్రశాంత గంభీరముగా ప్రవహించును. అట్లే జ్ఞానులైన పెద్దలు వివేకముతో ప్రశాంతముగా మాటలాడుదురు. చిన్న సెలయేరు ఒడి దుడుకులతో ఒక్కసారి ఉద్రుతముగా ప్రవహించి అన్నిటినీ కూల్చివేయును. అట్లే అల్పు డైన వాడు ఆవేశపడి మాటలాడి కార్యములను చెద గొట్టును .

*******************************************************************************************  10

Popular Posts