Followers

Wednesday 5 August 2015

సాంఖ్య యోగః 8 (అథ ద్వితీయోధ్యాయః, శ్రీ భగవద్గీత)-శ్రీ భగవద్గీత




రాగద్వేష వియుక్తైస్తు
విషయా నింద్రియై శ్చరన్‌,‌
ఆత్మవశ్యై ర్విధేయాత్మా
ప్రసాద మధిగచ్ఛతి.


కాని, స్వాధీనమైన మనస్సుకలవాడు, రాగద్వేష రహితములను, తనకు ఆధీనములైయున్నవియునగు ఇంద్రియములచే (దేహయాత్రోపయుక్తములగు) అన్నపానాది విషయములను అనుభవించుచున్న వాడైనను మనోనిర్మలత్వమును(మనశ్శాంతిని) బొందుచున్నాడు.

*******************************************************************************************  64

ప్రసాదే సర్వదుఃఖానాం
హాని రస్యోపజాయతే,
ప్రసన్న చేతసో హ్యాశు
బుద్ధిః పర్యవతిష్ఠతి.


మనోనిర్మలత్వము కలుగగా దానివలన మనుజునకు సమస్త దుఃఖములున్ను ఉపశమించిపోవుచున్నవి. నిర్మలమనస్కునకు బుద్ధి శీఘ్రముగ (పరమాత్మయందు) స్థిరత్వమును జెందుచున్నది.

*******************************************************************************************  65

నాస్తి బుద్ధి రయుక్తస్య
న చాయుక్తస్య భావనా,
న చాభావయతః శాంతి
రశాంతస్య కుతః సుఖమ్‌.


ఇంద్రియనిగ్రహము, మనస్సంయమము లేని వానికి వివేకబుద్ధి కలుగదు. ఆత్మచింతనయు సంభవింపనేరదు. ఆత్మ చింతనలేనివానికి శాంతి లభించదు; శాంతిలేనివానికిక సుఖమేచట?

*******************************************************************************************  66

ఇంద్రియాణాం హి చరతాం
యన్మనో నువిధీయతే,
తదస్య హరతి ప్రజ్ఞాం
వాయుర్నావమివాంభసి.


విషయములందు ప్రవర్తించుచున్న ఇంద్రియములలో నెద్దానిని మనస్సు అనుసరించిపోవునో, అయ్యది మనుజునియొక్క వివేకమును - జలమందు ఓడను ప్రతికూలవాయువు పెడదారికి లాగుకొని పోవునట్లు హరించివేయుచున్నది.

*******************************************************************************************  67

తస్మాద్యస్య మహాబాహో
నిగృహీతాని సర్వశః
ఇంద్రియాణీంద్రియార్థేభ్య
స్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా.


కాబట్టి ఓ అర్జునా! ఎవడు తనయింద్రియములను విషయములపైకి పోనీయక సర్వవిధముల అరికట్టుచున్నాడో, అతని జ్ఞానమే మిగుల స్థిరమైయుండును.

*******************************************************************************************  68

యా నిశా సర్వభూతానాం
తస్యాం జాగర్తి సంయమీ
యస్యాం జాగ్రతి భూతాని
సా నిశా పశ్యతో మునేః .


సమస్త ప్రాణులకును (సామాన్యజనులకు) ఏది (పరమార్థతత్త్వము) రాత్రియై (దృష్టికి గోచరము కాక) యున్నదో, దానియందు ఇంద్రియ నిగ్రహపరుడగు యోగి మేలుకొనియుండును. (ఆత్మావలోకనము జేయుచుండును). దేనియందు (ఏ శబ్దాది విషయములందు) ప్రాణులు మేలుకొనియున్నారో (ఆసక్తితో ప్రవర్తించుచున్నారో) అది (విషయజాలము) పరమార్థతత్త్వమును దర్శించు మునీంద్రునకు రాత్రిగా నుండును (దృష్టి గోచరముకాకయుండును).

*******************************************************************************************  69

ఆపూర్వమాణ మచల ప్రతిష్ఠమ్‌
సముద్రమాపః ప్రవిశంతి యద్వత్‌,
తద్వత్కామా యం ప్రవిశంతి సర్వే
స శాంతి మాప్నోతి న కామకామీ.


జలముచే సంపూర్ణముగ నిండింపబడినదియు, నిశ్చలమైనదియునగు సముద్రమును నదీజలము మున్నగునవి యేప్రకారము ప్రవేశించుచున్నవో, ఆ ప్రకారమే భోగ్యవిషయములన్నియు ఏ బ్రహ్మనిష్ఠుని పొంది (ఆతనిని వికృతముచేయలేక) అణగిపోవుచున్నవో, అతడే శాంతినిపొందునుగాని విషయాసక్తి కలవాడు కాదు.

*******************************************************************************************  70

విహాయ కామాన్‌ యస్సర్వాన్‌
పుమాంశ్చరతి నిస్స్పృహః,
నిర్మమో నిరహంకారః
స శాంతి మధిగచ్ఛతి.


ఎవడు సమస్తములైన కోరికలను, శబ్దాదివిషయములను త్యజించి, వానియం దేమాత్రము ఆశలేక, అహంకార మమకార వర్జితుడై ప్రవర్తించునో అట్టివాడే శాంతిని పొందుచున్నాడు.

*******************************************************************************************  71

ఏషా బ్రాహ్మీస్థితిః పార్థ!
నైనాం ప్రాప్య విముహ్యతి
స్థిత్వాస్యామంతకాలేపి,
బ్రహ్మనిర్వాణమృచ్ఛతి.


అర్జునా! ఇదియంతయు బ్రహ్మసంబంధమైన స్థితి; ఇట్టి బ్రాహ్మీస్థితిని బొందినవాడు మఱల నెన్నటికిని విమోహమును జెందనేరడు. అంత్యకాలమునందుగూడ ఇట్టి స్థితియందున్నవాడు బ్రహ్మానందరూపమోక్షమును బడయుచున్నాడు.

*******************************************************************************************  72

ఇతి శ్రీమద్భాగవద్గీతానూపనిషత్సు, బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే, శ్రీకృష్ణారునసంవాదే, సాజ్ఖ్యయోగో నామ ద్వితీమోధ్యాయః

Popular Posts