Followers

Thursday 6 August 2015

విజ్ఞానయోగః 2 (అథ సప్తమోధ్యాయః, శ్రీ భగవద్గీత)-శ్రీ భగవద్గీత

బలం బలవతాం చాహం
కామరాగవివర్జితమ్‌,
ధర్మావిరుద్ధో భూతేషు
కామోస్మి భరతర్షభ.


భరతకుల శ్రేష్ఠుడవగు ఓ అర్జునా! నేను బలవంతులయొక్క ఆశ, అనురాగములేని బలమును ప్రాణులయందు ధర్మమునకు వ్యతిరేకము కాని కోరికయు అయియున్నాను.

*******************************************************************************************  11

యే చైవ సాత్త్వికా భావా
రాజసా స్తామసాశ్చయే,
మత్త ఏవేతి తాన్విద్ధి
న త్వహం తేషు తే మయి.


సత్త్వరజస్తమోగుణములచే గలిగిన పదార్థములు (లేక స్వభావములు) ఎవ్వి కలవో అవి నావలననే కలిగినవని నీవెఱుగుము. అయితే నేను వానియందులేను. అవి నాయందున్నవి. (నేను వానికి వశుడనుగాను. అవి నాకు వశవర్తులై యున్నవని భావము).

*******************************************************************************************  12

త్రిభిర్గుణమయైర్భావై
రేభిస్సర్వమిదం జగత్‌,
మోహితం నాభిజానాతి
మామేభ్యః పరమవ్యయమ్‌.


ఈ చెప్పబడిన ముడు విధములగు సత్త్వరజస్తమో గుణములయొక్క వికారములగు స్వభావముల చేత ఈ ప్రపంచమంతయు మోహమును (అవివేకమును) బొందింపబడినదై ఆ గుణములకంటే వేఱై (అతీతుడనై) నాశరహితుడనైనట్టి నన్ను తెలిసికొనజాలకున్నది.

*******************************************************************************************  13

దైవీ హ్యేషా గుణమయీ
మమ మాయా దురత్యయా,
మామేవ యే ప్రపద్యంతే
మా యా మేతాం తరంతితే.


ఏలయనగా, దైవసంబంధమైనదియు (అలౌకిక సామర్థ్యము కలదియు) త్రిగుణాత్మకమైనదియునగు ఈ నాయొక్క మాయ (ప్రకృతి) దాటుటకు కష్టసాధ్యమైనది. (అయినను) ఎవరు నన్నే శరణుబొందుచున్నారో వారీ మాయను దాటివేయగలరు.

*******************************************************************************************  14

న మాం దుష్కృతినోమూఢాః
ప్రపద్యంతే నరాధమాః,
మాయయా పహృతజ్ఞానా
ఆసురం భావ మాశ్రితాః.


పాపము చేయువారును, మూఢులును, మాయచే అపహరింపబడిన జ్ఞానము గలవారును, రాక్షస స్వభావమును (అసుర గుణములను) ఆశ్రయించువారు నగు మనుజాధములు నన్ను బొందుటలేదు. (ఆశ్రయించుటలేదు).

*******************************************************************************************  15

చతుర్విధా భజంతే మాం
జనాస్సుకృతి నూర్జున,
ఆర్తో జిజ్ఞాసు రర్థార్థీ
జ్ఞానీ చ భరతర్షభ.


భరతవంశ శ్రేష్ఠుడవగు ఓ అర్జునా! ఆపత్తునందున్నవాడు, (భగవంతుని) తెలిసికొనగోరువాడు, ధనము (సంపత్తు) నభిలషించువాడు, (ఆత్మ) జ్ఞానముకలవాడు అను నీ నాలుగు విధములైన పుణ్యాత్ములగు జనులు నన్ను సేవించుచున్నారు. (భజించుచున్నారు).

*******************************************************************************************  16

తేషాం జ్ఞానీ నిత్యయుక్త
ఏకభక్తిర్విశిష్యతే,
ప్రియో హి జ్ఞాని నూత్యర్థ
మహం స చ మమప్రియః.


వారి (నలుగురిలో) నిత్యము పరమాత్మతో గూడి యుండువాడును, ఒక్క పరమాత్మయందే భక్తిగల వాడునగు జ్ఞాని శ్రేష్ఠుడగుచున్నాడు. అట్టి జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టమైనవాడను; అతడున్ను నాకు మిగుల ఇష్టుడే.

*******************************************************************************************  17

ఉదారాః సర్వ ఏవైతే
జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్‌,
ఆస్థితః స హి యుక్తాత్మా
మామేవానుత్తమాం గతిమ్‌.

వీరందరున్ను (పైన దెలిపిన నలుగురు భక్తులు) మంచివారే. కాని అందు జ్ఞానియో సాక్షాత్‌ నేనేయని నా అభిప్రాయము. ఏలయనగా ఆతడు నాయందే చిత్తమును స్థిరముగ నెలకొల్పి నన్నే సర్వోత్తమమైన ప్రాప్యస్థానముగ నిశ్చయించి ఆశ్రయించుకొనియున్నాడు.

*******************************************************************************************  18

బహూనాం జన్మనామంతే
జ్ఞానవాన్మాం ప్రపద్యతే,
వాసుదేవస్సర్వమితి
స మహాత్మా సుదుర్లభః.


అనేక జన్మలయొక్క అంతమున మనుజుడు జ్ఞానవంతుడై సమస్తము వాసుదేవుడే (భగవంతుడే) యను సద్బుద్ధి గల్గి నన్ను పొందుచున్నాడు. అట్టి మహాత్ముడు లోకములో చాలా అరుదు.

*******************************************************************************************  19

కామైస్తై స్తైర్హృత జ్ఞానాః
ప్రపద్యంతే న్యదేవతాః,
తం తం నియమమాస్థాయ
ప్రకృత్యా నియతాస్స్వయా.


(కొందరు) తమయొక్క ప్రకృతి (జన్మాంతర సంస్కారము) చే ప్రేరేపించబడిన వారై విషయాదులందలి కోరికలచే వివేకమును గోల్పోయి, దేవతారాధనా సంబంధమైన ఆయా నియమముల నవలంబించి ఇతర దేవతలను భజించుచున్నారు.

*******************************************************************************************  20


Popular Posts