Followers

Thursday 6 August 2015

విభూతి యోగః 1 (అథ దశమోధ్యాయః)-శ్రీ భగవద్గీత

శ్రీ భగవానువాచ :-
భూయ ఏవ మహాబాహో
శృణు మే పరమం వచః,
యత్తేహం ప్రీయమాణాయ
వక్ష్యామి హితకామ్యయా.


శ్రీ భగవానుడు చెప్పెను- గొప్ప బాహువులుకల ఓ అర్జునా! (నామాటలు విని) సంతసించుచున్న నీకు హితమును గలుగజేయు నుద్దేశ్యముతో మరల ఏ శ్రేష్ఠమగు వాక్యమును నేను చెప్పబోవుచున్నానో దానిని వినుము.

******************************************************************************************* 1

న మే విదుః సురగణాః
ప్రభవం న మహర్షయః
అహమాదిర్హి దేవానాం
మహర్షీణాం చ సర్వశః‌‌.


నాయొక్క ఉత్పత్తిని (అవతార రహస్యమును లేక ప్రభావమును) దేవగణము లెఱుగవు. మహర్షులున్ను ఎఱుగరు. (ఏలయనిన) నేను ఆ దేవతలకును, మహర్షులకును సర్వవిధముల మొదటివాడను (కారణభూతుడను) గదా .

******************************************************************************************* 2

యో మామజమనాదిం చ
వేత్తి లోకమహేశ్వరమ్‌,
అసమ్మూఢస్స మర్త్యేషు
సర్వపాపైః ప్రముచ్యతే.


ఎవడు నన్ను పుట్టకలేనివానిగను, అనాదిరూపునిగను, సమస్తలోకములకు నియామకునిగను తెలిసికొనుచున్నాడో, అతడు మనుష్యులలో అజ్ఞానములేనివాడై సర్వపాపములనుండి లెస్సగా విడువబడుచున్నాడు.

*******************************************************************************************  3

బుద్ధిర్జ్ఞాన మసమ్మోహః
క్షమా సత్యం దమశ్శమః,
సుఖం దుఃఖం భవోభావో
భయం చాభయ మేవ చ.

అహింసా సమతా తుష్టి
స్తపో దానం యశోయశః
భవంతి భావా భూతానాం
మత్త ఏవ పృథగ్విధాః


బుద్ధి, జ్ఞానము, మోహరాహిత్యము, ఓర్పు, సత్యము, బాహ్యేంద్రియ నిగ్రహము, అంతరేంద్రియ నిగ్రహము, సుఖము, దుఃఖము, పుట్టుక (ఉత్పత్తి) నాశము, భయము, భయములేకుండుట, అహింస, సమత్వము, సంతుష్టి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి ప్రాణులయొక్క ఈ ప్రకారములైన నానా విధములగు గుణములు నా వలననే కలుగుచున్నవి.

*******************************************************************************************  4, 5

మహర్షయస్సప్త పూర్వే
చత్వారో మనవస్తథా,
మద్భావా మానసా జాతా
యేషాం లోక ఇమాః ప్రజాః.


లోకమునం దీప్రజలు యెవరియొక్క సంతతియై యున్నారో, అట్టి పూర్వీకులైన సప్తమహర్షులును సనకాదులైన నలుగురు దేవర్షులున్ను, మనువులు పదు నలుగురున్ను నాయొక్క భావము (దైవభావము) గలవారై నాయొక్క మనస్సంకల్పమువలననే పుట్టిరి.

*******************************************************************************************  6

ఏతాం విభూతిం యోగం చ
మమ యో వేత్తి తత్త్వతః,
సోవికంపేన యోగేన
యుజ్యతే నాత్ర సంశయః‌.


నాయొక్క ఈ విభుతిని (ఐశ్వర్యమును, విస్తారమును) యోగమును (అలౌకికశక్తిని), ఎవడు యథార్థముగ తెలిసికొనుచున్నాడో అతడు నిశ్చలమగు యోగముతో కూడుకొనుచున్నాడు. ఇవ్విషయమున సందేహము లేదు.

*******************************************************************************************  7

అహం సర్వస్య ప్రభవో
మత్తః సర్వం ప్రవర్తతే,
ఇతి మత్వా భజంతే మాం
బుధా భావసమన్వితాః.


'నేను సమస్త జగత్తునకును ఉత్పత్తి కారణమైన వాడను, నావలననే ఈ సమస్తము నడుచుచున్నది' అని వివేకవంతులు తెలిసికొని పరిపూర్ణ భక్తిభావముతో గుడినవారై నన్ను భజించుచున్నారు .

*******************************************************************************************  8


మచ్చిత్తా మద్గతప్రాణా
భోధయంతః పరస్పరమ్‌,
కథయంతశ్చ మాం నిత్యం
తుష్యంతి చ రమంతి చ.


(వారు) నా యందు మనస్సుగలవారును, నన్ను బొందిన ప్రాణములు (ఇంద్రియములు) కలవారును (లేక, నాయెడల ప్రాణమునర్పించినవారును) అయి నన్ను గూర్చి పరస్పరము బోధించుకొనుచు ముచ్చటించుకొనుచు ఎల్లప్పుడును సంతృప్తిని, ఆనందమునుబొందుచున్నారు.

*******************************************************************************************  9


Popular Posts