Followers

Thursday 6 August 2015

కర్మసన్న్యాసయోగః 1 (అథ పంచమోధ్యాయః, శ్రీ భగవద్గీత)-శ్రీ భగవద్గీత


అర్జున ఉవాచ :-

సన్న్యాసం కర్మణాం కృష్ణ
పునర్యోగం చ శంససి,
యచ్ఛ్రేయ ఏతయోరేకం
తన్మే బ్రూహి సునిశ్చితమ్‌.


అర్జునుడు చెప్పెను: ఓ కృష్ణమూర్తీ! నీవొకప్పుడు కర్మలయొక్క త్యాగమును (కర్మత్యాగ పూర్వకమగు జ్ఞానమును) మఱియొకప్పుడు కర్మయోగమును ప్రశంసించుచున్నావు. కావున ఈ రెండిటిలో నేది శ్రేష్ఠమైనదో బాగుగ నిశ్చయించి ఆ ఒక్కదానిని నాకు జెప్పుము.

*******************************************************************************************  1

శ్రీ భగవానువాచ:-

సన్న్యాసః కర్మయోగశ్చ
నిశ్శ్రేయసకరా వుభౌ,
తయోస్తు కర్మసన్న్యాసా
త్కర్మయోగో విశిష్యతే.


శ్రీ భగవానుడు పలికెను: కర్మత్యాగము (కర్మత్యాగ పూర్వకమగు జ్ఞానయోగము), కర్మ యోగము అను రెండును మోక్షమును గలుగజేయును. అయితే ఆ రెండిటిలోను (ప్రారంభమున) కర్మత్యాగముకంటె కర్మయోగమే శ్రేష్ఠమైనది.

*******************************************************************************************  2

జ్ఞేయస్స నిత్యసన్న్యాసీ
యో న ద్వేష్టి న కాజ్క్షతి,
నిర్ద్వనె హి మహాబాహో
సుఖం బంధాత్ప్రముచ్యతే.


గొప్పబాహువులు కల ఓ అర్జునా! ఎవడు (ఏ కర్మ యోగి) దేనిని గూడ ద్వేషించడో, దేనినిగూడ కోరడో, అట్టివాడు ఎల్లప్పుడును సన్న్యాసి (త్యాగి) యే యని తెలియదగినది. ఏలయనగా (రాగద్వేషాది) ద్వంద్వములు లేనివాడు సులభముగ సంసారబంధము నుండి విముక్తుడు కాగలడు.

*******************************************************************************************  3

సాంఖ్యయోగౌ పృథగ్బాలాః
ప్రవదంతి న పణ్డితాః,
ఏకమప్యాస్థితః సమ్య
గుభయోర్విందతే ఫలమ్‌.


(కర్మసన్న్యాస పూర్వకమగు) జ్ఞానయోగము, కర్మయోగము వేఱువేఱు ( వేఱువేఱు ఫలములు కలవని) అవివేకులు పలుకుదురేకాని వివేకవంతులు కాదు. ఆ రెండింటిలో ఏ ఒక్కదానినైనను బాగుగ అనుష్ఠించినచో రెండిటియొక్క ఫలమును (మోక్షమును) మనుజుడు పొందుచున్నాడు.

*******************************************************************************************  4

యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం
తద్యోగైరపి గమ్యతే,
ఏకం సాంఖ్యం చ యోగం చ
యః పశ్యతి స పశ్యతి.


జ్ఞానయోగులచే ఏ స్థానము (మోక్షము) పొందబడుచున్నదో, అది కర్మయోగులచేతను పొందబడుచున్నది. జ్ఞానయోగమును, కర్మయోగమును ఒక్కటిగ (ఒకే ఫలము గలుగజేయునదిగ) చూచువాడే నిజముగ చూచువాడగును (తెలిసినవాడగును).

*******************************************************************************************  5

సన్న్యాసస్తు మహాబాహో
దుఃఖమాప్తు మయోగతః,
యోగయుక్తో మునిర్బ్రహ్మ
న చిరేణాధిగచ్ఛతి.


గొప్ప బాహువులుగల ఓ అర్జునా! ( కర్మసన్న్యాస రూపమగు) జ్ఞానయోగమైతే కర్మయోగము లేకుండ పొందుటకు కష్టతరమైనది. కర్మయోగముతో గూడిన (దైవ) మననశీలుడు శీఘ్రముగ (లక్ష్యమును) బ్రహ్మమును బొందుచున్నాడు.

*******************************************************************************************  6

యోగయుక్తో విశుద్ధాత్మా
విజితాత్మా జితేంద్రియః,
సర్వభూతాత్మభూతాత్మా
కుర్వన్నపి న లిప్యతే.


(నిష్కామ) కర్మయోగము నాచరించువాడును, పరిశుద్ధమైన హృదయము గలవాడును, లెస్సగ జయింపబడిన మనస్సు గలవాడును, ఇంద్రియములను జయించినవాడును, సమస్త ప్రాణులయందుండు ఆత్మయు తన ఆత్మయు నొకటేయని తెలిసికొనినవాడు నగు మనుజుడు కర్మలను జేసినను వానిచే నంటబడడు.

*******************************************************************************************  7

నైవ కించిత్కరోమీతి
యుక్తో మన్యేత తత్త్వవిత్‌,
పశ్యన్‌ శృణ్వన్‌ స్పృశన్‌ జిఘ్ర
న్నశ్నన్‌ గచ్ఛన్‌ స్వపన్‌ శ్వసన్‌.

ప్రలపన్‌ విసృజన్‌ గృహ్ణ
న్నున్మిషన్నిమిషన్నపి
ఇంద్రియాణీంద్రియార్థేషు
వర్తంత ఇతి ధారయన్‌.


పరమార్థతత్త్వము నెఱిగిన యోగయుక్తుడు (ఆత్మయందు నెలకొనిన చిత్తముగలవాడు) చూచుచున్నను, వినుచున్నను, తాకుచున్నను, వాసనచూచుచున్నను, తినుచున్నను, నడచుచున్నను, నిదురించుచున్నను, ఊపిరి విడుచుచున్నను, మాట్లాడుచున్నను, విడుచున్నను, గ్రహించుచున్నను, కండ్లను తెరచుచున్నను, మూయుచున్నను ఇంద్రియములు(వాని వాని) విషయములందు ప్రవర్తించుచున్నవని నిశ్చయించినవాడై 'నేనొకింతైనను ఏమియు చేయుటలేదు' అనియే తలంచును. (ఆయా కార్యములందు కర్తృత్వబుద్ధి లేకుండును.)

*******************************************************************************************  8,9

Popular Posts