Followers

Monday 27 April 2015

శ్రీ మహాభారతంలో కథలు ---మహాప్రస్థానం


రక్తపుటేరుల మధ్య కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. ఆ తరువాత యదునాశనమూ జరిగింది. అంతటి బీభత్సాన్నీ, మృత్యునృత్యాన్నీ కళ్ళారా చూసాక సకలకర్మలూ త్యజించి మహాప్రస్థానం చెయ్యాలనే బుద్ధి పుట్టింది ధర్మరాజుకు. తక్షణం ఏకైక వంశాంకురం పరీక్షిత్తుకు పట్టాభిషేకం చేసి సామ్రాజ్యభారం అప్పగించారు పాండవులు.

అన్నదమ్ములైదుగురూ ఆభరణాలన్నీ తీసేసి, నారచీరలు కట్టుకున్నారు. ద్రౌపది కూడా అలాగే చేసింది. ముందు ధర్మరాజు, ఆయన వెనుక భీముడు, తరువాత అర్జునుడు, అతని వెంట నకులసహదేవులు, వాళ్ళననుసరించి ద్రౌపది కదిలి వెళ్ళారు.

వారి వెంట ఒక కుక్క బయలుదేరింది. యోగబలంతో అనేక నదులూ,పర్వతాలూ,అరణ్యాలూ దాటి వాళ్ళు తూర్పు సముద్రతీరం చేరారు. ఇంతలో ప్రకాశవంతమైన శరీరంతో ఒక మహారూపం వాళ్ళ ఎదురుగా నిలిచింది.

"అర్జునా! నేను అగ్నిని. దేవకార్యం కోసం వరుణదేవుణ్ణి అడిగి నీకు గాండీవాన్ని తెచ్చియిచ్చాను. అనుకున్న పని నెరవేరింది కనుక నీ వద్ద వున్న దివ్యధనువును ఆ మహానుభావుడికి యిచ్చేయ్యి" అన్నాడు అగ్నిదేవుడు.

వెంటనే సవ్యసాచి గాండీవాన్ని సముద్రానికి సమర్పించాడు. అగ్నిదేవుడు అంతర్హితుడయ్యాడు.

అక్కడి నుంచి బయలుదేరి మేరుపర్వతాన్ని సమీపించారు పాండవులు. యోగసాధనాపరులై ఆ పర్వతంపై వెళ్తూ వుండగా యోగబలాన్ని కోల్పోయి పాంచాల పుత్రిక కింద పడిపొయింది.

"అన్నా! అన్నా! ద్రౌపది పడిపోయింది" అరిచాడు భీముడు.

"పడనీ" అన్నాడు ధర్మరాజు నిర్లిప్తంగా. లిప్తకాలమైనా ఆగలేదు. "పాంచాలి యందు ఎన్నడూ అధర్మం లేదే! అయినా ఎందుకిలా అయింది?" భీముడు విషాదంతో ప్రశ్నించాడు.

"ఆమెకు అర్జునుడంటే ప్రేమ ఎక్కువ. ఆ పక్షపాతబుద్ధివల్ల ఆవిడ సుకృతాలు ఫలించలేదు" అన్నాడు ధర్మరాజు.

కొంచెం దూరం వెళ్ళేక, "అన్నా! సహదేవుడు పతనమయ్యాడు" అని కేకపెట్టాడు భీముడు. "తనకంటే ప్రాజ్ఞుడెవడూ లేడని అహంకారం వాడికి" అన్నాడు ధర్మరాజు.

మరికొంచెం దూరం సాగారు. భార్య, తమ్ముడు పడిపోవడం చూసి ధైర్యం పోయినవాడిలా కూలిపోయాడు నకులుడు. "అన్నా! నకులుడు నేలకూలాడు!" అర్తనాదం చేశాడు భీముడు."తనంత అందగాడెవడూ లేడని మిడిసిపాటు వాడికి. అదే కీడైంది" అన్నాడు ధర్మరాజు.

ఇంకొంచెం దూరం వెళ్ళారు. అంతలో అర్జునుడు ఒరిగిపొయాడు. "అన్నా! అర్జునుడు.." అని అరిచాడు భీముడు. "కౌరవులందరినీ కలిపి ఒక్కనాడే చంపుతానన్నాడు. అలా చేయలేకపోయాడు. ధనుర్థరులైన వాళ్ళకు మాట ఒకటీ, చేత ఒకటీ కాకూడదు. అది మహా దోషం" అన్నాడు ధర్మరాజు.

ఆప్తుల మరణాల్ని చూసేసరికి ధైర్యం జారిపోయింది భీముడికి. కుప్పగా కూలిపోయాడు. "అన్నా! నేనూ పడిపోయాను" అన్నాడు హీనస్వరంతో. "నువ్వు తిండి తెగ తింటావు. ప్రచండమైన భుజశక్తి కలిగి , ఎవరినీ లక్ష్యపెట్టవు. అందుకే యీ గతి పట్టింది నీకు" అని చెప్పి నిర్వికారంగా ముందుకు సాగిపోయాడు ధర్మరాజు. శునకం మాత్రం అతనిని భక్తితో అనుసరించి వెళ్ళింది.

కొంతదూరం వెళ్ళేసరికి దశదిశలూ దివ్యకాంతులతో వెలగసాగాయి. దేవేంద్రుడు స్వయంగా వచ్చి "ధర్మరాజా! ఉత్తమ పురుషుడవు నువ్వు. రా! ఇదిగో దివ్యరథం! ఎక్కు" అంటూ ఆహ్వానించాడు.

దుఃఖం ముంచుకువచ్చింది ధర్మరాజుకు. "తమ్ములంతా పోయారు. పాంచాలకుమారి దప్పికతో కూలిపోయింది. శోకం అగ్నిలా దహిస్తోంది నన్ను. వాళ్ళు లేకుండా నేను మీతో రాలేను" అన్నాడు.

"పాండవాగ్రజా! విచారించకు! శరీరాలు విడిచి నీవాళ్ళందరూ యిదివరకే స్వర్గానికి వచ్చారు. వాళ్ళను అక్కడ చూద్దువుగాని. నువ్వు శరీరం విడిచిపెట్టనక్కరలేదు. రా" అన్నాడు ఇంద్రుడు.

"నేను ఊరు విడిచింది మొదలు, భక్తితో నా వెంట వచ్చింది యీ జాగిలం. మరి దీనికి కూడా స్వర్గ ప్రవేశం కావాలి. అందుకు అనుమతించాలి" అన్నాడు ధర్మరాజు.

"ధర్మరాజా! జాగిలానికి దేవభావం ఎలా వస్తుంది! దీన్ని నీతో తీసుకురావడం సాధ్యం కాదు. పద. రథం ఎక్కు" అని దరహాసం చేశాడు ఇంద్రుడు.

"మహానుభావా! నీ వంటి దివ్యపురుషుడు తలుచుకుంటే సాధ్యం కానిదేముంటుంది! అశ్రయించిన వాళ్ళకోసం ఆ మాత్రపు కార్యం నెరవేర్చడం నీకు భారమా? ఆశ్రితుల్ని విడిచిపెట్టి పొందే సంపద నాకేం యింపుగా వుంటుంది?" అని దీనంగా ప్రార్థించాడు ధర్మరాజు.

"ధర్మజా! ఇదెక్కడి తెలివితక్కువతనం! శునకాలకు స్వర్గవాసం సంభవిస్తుందా? దీన్ని వదలడం కాఠిన్యమెంత మాత్రం కాదు. నా మాట విను."

"భక్తుడైన వాణ్ణి విడిచిపెడితే బ్రహ్మహత్యాపాతకం కలుగుతుందని పెద్దలంటారు. అందువల్ల దీన్ని విడిచిపెట్టను. దివ్యసుఖం కోసం పాపం మూట కట్టుకోలేను."

"నీకింత పట్టుదల ఎందుకు? తమ్ములనూ, భార్యనూ విడిచావా లేదా! జీవితాంతం అన్ని ఒడిదుడుకుల్లోనూ నీకు తోడుగా నిలిచినవారిముందు యీ శునకం ఎంత? దీన్ని విడవలేనంటావు. ఇదేమైనా బాగుందా?"

"స్వామీ! అఖిల లోకాలకు అధిపతివి నువ్వు. నీకు తెలీని ధర్మం లేదు. పైగా పెద్దలతో వాదించకూడదు. అయినా మీకొక విన్నపం చేసుకుంటున్నాను. తమ్ములూ,భార్యా ఎలాగో చనిపోయారు. ఇప్పుడు వాళ్లకోసం దుఃఖిస్తే మాత్రం ప్రయోజనమేమిటి? చావకుండా నాతో వచ్చిందీ కుక్క. శరణన్న వాణ్ణి ఉపేక్షించడం, సన్నిత్రుడికి ద్రోహం చెయ్యడం, స్త్రీని చంపడం, బ్రాహ్మణార్థం దొంగలించడం అనే మహాపాపాలెలాంటివో నిరపరాధి అయిన భక్తుణ్ణి విడిచిపెట్టడం కూడా అలాంటి పాపమే. నన్ను మన్నించు. నేనిక్కడే వుండి తపస్సు చేస్తూ నిన్ను సేవిస్తూ వుంటాను" అని ధర్మరాజు దృడంగా చెప్పాడు.

ఉత్తరక్షణమే శునకం ధర్మదేవతగా మారింది. అదిచూసి సంభ్రమానందాలతో నమస్కరించాడు ధర్మతనయుడు.

"కుమారా! నీ భూతదయకు మెచ్చుకున్నాను. నీపై విశ్వాసం చూపి నీతో భక్తిగా వచ్చిందని ఒక కుక్కను చేపట్టి ఇంద్రుడు తెచ్చిన దివ్యరథాన్ని కూడా ఎక్కనన్నావు! నీ ఉదాత్తత ఇంద్రుడు కళ్ళారా చూశాడు. ఇంక శరీరంతో పుణ్యలోకాలకు వెళ్ళు. అవ్యయపదాన్ని పొందు" అన్నాడు ధర్మదేవుడు ఆదరంగా.

Popular Posts