Followers

Monday 27 April 2015

శ్రీ మహాభారతంలో కథలు --- విష్ణు స్వరూపం


ఒకప్పుడు హిమవత్పర్వతం మీద మునులూ, సిద్ధులూ కలిసి గోష్టి చేస్తున్నారు. అప్పుడు అక్కడికి గురుత్మంతుడు వచ్చాడు. వాళ్ళందరూ అతన్ని గౌరవించి కూర్చోబెట్టారు.

"మహాత్మా! గరుత్మంతా! నువ్వు విష్ణుభక్తుడవు. ఆ స్వామి భక్తప్రియుడు. నువ్వెప్పుడూ ఆయన దగ్గర వుంటావు. విష్ణుమూర్తి గురించి వినయంగా మాకు చెప్పవా?" అని ప్రార్థించారు.

"లోకాలను రక్షించడానికి స్థూలరూపం ధరించి మనకు కనబడతాడాయన. ఆ మహానుభావుడు నామీద దయతో నాకు అనేక అద్భుతాలు చూపించాడు.

"ఒకసారి నేను దేవేంద్రుణ్ణి జయించి అమృతం తీసుకువెడుతూంటే ఆకాశం నుంచి 'పక్షిరాజా! మెచ్చాను నీ శౌర్యానికి! నీకు వరమిస్తాను. ఏం కావాలో కోరుకో!' అన్న మాటలు మృదుగంభీరంగా వినిపించాయి. ఆశ్చర్యం కలిగింది నాకు అమితానందపడ్డాను.

'నువ్వెవరో ఎక్కడి నుండి మాట్లాడుతున్నావో తేలీదు నాకు. తెలియచెప్పి వరమియ్యి ' అని వేడుకున్నాడు.

'కాలంతోపాటే నన్ను తెలుసుకుంటావులే! నాకు వాహనంగా వుండు' అంటూ ఉజ్ఞ్వలతేజోమయుడైన పురుషుడొకడు ప్రత్యక్షమయ్యాడు.

నాకు దేవదానవులందర్నీ గెలవగల శక్తి ఇచ్చాడు. జరామరణాలు లేకుండా చేశాడు. నేను ఆయనకు సాష్టాంగపడి, 'దేవా! నీకు వాహనాన్నవుతాను! నువ్వు రథమెక్కితే జెండానై ఉంటాను. నాకు ఈ వరం కూడా ఇవ్వు ' అన్నాను. సరేనని అంతర్థానమయ్యాడాయన. నేను సంతోషపడుతూ వెళ్ళి ఆ సంగతంతా మా తండ్రి గారితో చెప్పాను.

'నాయనా! ఆ మహాత్ముడు నారాయణుడు. నీమీద ఉన్న అనుగ్రహంతో నీకు కనబడి మాట్లాడాడు. ధన్యుడవు నువ్వు. ఆయనను చూడగోరి యోగసమాధి వహించాను నేను. నల్లని, తెల్లని, పచ్చని, ఎర్రని వర్ణాలతో అనేక పాణి, పాద, శిరో నేత్రాలతో దర్శనమిచ్చాడు నాకు. అలాంటిది మహానుభావుడికి శాశ్వతంగా పరిచర్య చేసే భాగ్యం లభించింది నీకు. తరించావు నీవు. బదరికాశ్రమానికి వెళ్ళి అక్కడ వున్న నారాయణమూర్తిని సేవించు' అన్నాడు.

గబ గబ అక్కడికి వెళ్ళాను.


అక్కడ నాకు ఆ దేవుడు పీతాంబరధారియై, ఎనిమిది చేతులుగల మూర్తిగా దర్శనమిచ్చాడు. నన్ను చూసి చిరునవ్వు నవ్వి, 'వచ్చావా! మంచిపని చేశావు! రా!' అంటూ ఈశాన్య దిక్కుగా పోసాగాడు. నేను ఆయనవెంట పరుగెత్తి వెళ్ళాను. అలా బహు సహస్రయోజనాలు వెళ్ళాకా, అక్కడ బ్రహ్మాండమైన అగ్ని వెలుగుతూ కనబడింది. కెట్టేలు లేకుండానే వెలుగుతోందది. ఆయన ఆ అగ్నిలో ప్రవేశించాడు. అందులో శివుడు పార్వతితో సహా తపస్సు చేస్తున్నాడు. కాసేపు ఆ శివపార్వతులతో ముచ్చటించి ఆ అగ్ని దాటి వెళ్ళిపోతున్నాడాయన. నేను అప్పటికే బాగా అలసిపోయాను. అయినా ఆయనవెంటే నడిచాను. ఆ దేవుడు అలా చాలాదూరం నడిచి సూర్యకిరణాలు చొరబడడానికి వీల్లేని మహా తపస్సులోకి ప్రవేశించాడు. అక్కడికి వెళ్ళేసరికి నాకు కళ్ళు కనిపించలేదు. భయమేసింది. 'దేవా! దిక్కు తెలియడం లేదు. నన్ను కరుణించు' అని ప్రార్థించాను.


వెంటనే 'ఇదిగో! ఇటువైపు రా' అనే శబ్దం వినబడింది.


'దేవా! మనస్సుకు ఖేదం, శరీరానికి అలసటా ఎక్కువైపోయాయి. ఈ చీకట్లో కళ్ళు కనిపించడం లేదు. శరణు! దయచూడవా!' అన్నాను దీనంగా.


వెంటనే ఆ చీకటంతా పోయింది. ప్రభాకరునిలా వెలిగిపోతూ కనిపించాడాయన. ఆ ప్రదేశం సూర్యచంద్రనక్షత్రాలకూ కూడా చేరరానిది. తామర కొలనులున్నాయక్కడ. మృదుమధుర గీతాలు వినిపిస్తున్నాయి. అప్సరసలను మించిన దివ్యాంగనలు కనిపించారు. వాళ్ళందరి పూజలూ అందుకుంటూ వెళ్ళాడా మహాత్ముడు. ఒక ప్రదేశానికి వెళ్ళేసరికి అదంతా అగ్నిమయమై భయంకరంగా వెలగసాగింది. ఆయన కనిపించలేదు. భయమేసింది. 'దేవా! రక్షించు!' అని ప్రార్థించాను.


'వినతాసుతా! భయపడకు! మమతాహంకారాలు విడిచిన శాంతమూర్తులు మాత్రమే నన్ను చూడగలుగుతున్నారు. నువ్వు నిష్ఠతో నన్ను తెలుచుకుంటున్నావు గనుక నీకు స్థూలరూపంలోనే కనిపిస్తాను' అనే చల్లని మాటలు వినిపించాయి.


ఆ అగ్ని ఆరిపోయింది.


నేను ఆయనతో మరికొంత దూరం వెళ్ళాను.


కాసేపటికి ఆ స్వామి అంతర్హితుడయ్యాడు.


కనిపించని స్వామి 'ఇటు! ఇలా' అంటూ చేసిన సూచనలను ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళాను నేను. అందమైన సరస్సు కనిపించింది. అందులో ఆనందంగా స్నానం చేస్తూ కనిపించాడాయన. నన్ను దగ్గరకు రమ్మని సైగ చేశాడు. తీరా వెళ్ళే సరికి మాయమయ్యాడు. నేను విచారంగా నాలుగు దిక్కులూ చూసేసరికి అనేక వేల అగ్నిహోత్రాలు వెలుగుతూ కనిపించాయి. వేదశబ్దాలు వినిపించాయి. కాని ఎవరూ కనిపించలేదు. అనేకమంది సుపర్ణులు నా మీద విరుచుకుపడ్డారు. నారాయణమూర్తిని స్తుతిస్తూ చేతులు జోడించాడు.


'భయపడకు' అని అభయం వచ్చింది. కళ్ళు తెరిచేసరికి ఎప్పటికిమల్లే బదరికాశ్రమంలో ఉన్నాను. నా ఎదురుగూండా ఆయన ఎనిమిది చేతులతో కూడిన స్వరూపంతో నిలబడ్డాడు. సంతోషం, సంభ్రమం కలిగాయి నాకు. ఆయన పాదాలను తాకాను. కళ్ళకు అద్దుకున్నాను.


దయతో నావైపు చూసి, 'వినతాతనయా! నా స్వరూపం ఎవరికీ తెలియదు! సకల భూతాల్లోనూ ఉంటాను. అవన్నీ నాలో ఉంటాయి. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధులనే పేర్లతో నాలుగు రకాలుగా విభజింపబడి ఉంటాను నేను. ఆత్మ, బుద్ధి, అహంకారం, మనస్సు, అనే రూపాలతో వ్యాపించి వుంటాను. అయితే ఏకాంతధ్యానపరులు మాత్రమే నా సూక్షరూపం తెలుసుకోగలరు. నువ్వు నా భక్తుడవై నన్ను తెలుసుకో' అన్నాడా మహానుభావుడు.


"మహాత్ములారా! నాకు తెలిసిన హరి దివ్యచేష్టలన్నీ మీకు చెప్పాను" అని గురుత్మంతుడు మునులకూ, సిద్ధులకూ విష్ణురూపాన్ని వివరించాడు.


Popular Posts