Followers

Monday 27 April 2015

శ్రీ మహాభారతంలో కథలు --- ధృతరాష్ట్రుడి పుత్రప్రేమ

కృష్ణద్వైపాయనుడు తన మందిరానికి వస్తున్నాడని తెలిసి విదురుని సాయంతో ఆ మహామునికి ఎదురువెళ్ళి సముచిత మర్యాదలతో స్వాగతం చెప్పాడు ధృతరాష్ట్రుడు. సత్కారాలు అందుకున్న తరువాత, "నాయనా! నువ్వూ, నేను , విదురుడూ, భీష్ముడూ బతికుండగానే ఇంత అధర్మం జరుగుతుంటే ఉపేక్షించటం న్యాయం కాదు" అన్నాడు వ్యాసభగవానుడు ధృతరాష్ట్రుడితో.

"స్వామీ! మళ్ళీ ఏం జరిగింది?" అని ధృతరాష్ట్రుడు భయపడుతూ అడిగాడు.

"పాండవులు వనవాసక్లేశాన్ని అనుభవిస్తున్న యీ సమయంలోనే దండెత్తి వెళ్ళి వాళ్ళను హతమార్చాలని కర్ణుడు నీ కొడుక్కి సలహా ఇస్తున్నాడు. పాపాత్ముడైన నీ కొడుకు అందుకు సంతోషించి సమరసన్నాహాలు చేస్తున్నాడు. వద్దని వారించాను కాని, వింటాడన్న నమ్మకం లేదు నాకు. నీకు చెబితే నువ్వయినా కొడుక్కి బుద్ధి చెబుతావేమోనని ఇలా వచ్చాను. రాజ్యం పోయి, అడవులలో కందమూలాలు తింటూ కాలం గడుపుతున్న పాండవులను వధించడానికి పూనుకున్నాడు నీ పుత్రరత్నం. నువ్వు కూడా అతన్ని వారించకుండా వూరుకున్నావు. అయినా యుద్ధం కోసం మీరింతగా ముచ్చటపడటం దేనికి? అన్నమాట ప్రకారం పన్నెండేళ్ళు అరణ్యవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసం పూర్తయ్యాక వాళ్ళే యుద్ధానికి సిద్ధమవుతారు. అప్పుడు చూపించమను నీ కొడుకు ప్రతాపం! వనవాసులూ , తాపసులూ నిరాయుధులు కదా! వాళ్ళమీదకు దండెత్తి వెళ్తే అవమానం తప్ప మరేం మిగలదు. ఇది ఉచితం కాదని నీ కొడుకుతో చెప్పు" అని వ్యాసభగవానుడు ధృతరాష్ట్రుణ్ణి మందలించాడు.

"మహాత్మా! దుర్యోధనుడి దుర్మార్గ ప్రవర్తన వల్ల నేనూ, గాంధారీ, విదురుడూ, ద్రోణుడూ, కృపుడూ బాధపడని క్షణం లేదు. వాడు దుర్బుద్ధి అని తెలిసి కూడా పుత్రప్రేమ వల్ల వాణ్ణి విడిచిపెట్టలేకపోతున్నాను. ఏం చెయ్యమంటారు?" అని ధృతరాష్ట్రుడు దుఃఖిస్తూ అడిగాడు.

"నాయనా! సంతానం మీద విపరీత మమకారం నీ ఒక్కడికే కాదు వున్నది - అది లోక సహజం. మానవులు తమ బిడ్డలను ప్రేమించినట్లు మరెవ్వరినీ ప్రేమించలేరు. ఎంత డబ్బున్నా బిడ్డలు లేకపోతే సంతోషం లేదు. పూర్వం సకల గోవులకూ తల్లియైన సురభి సురేంద్రుడి దగ్గరకు వెళ్ళి ఒకసారి జాలిగా ఏడ్చింది.

'అమ్మా! ఎందుకింతగా ఏడుస్తున్నావు? అందరూ క్షేమమే కదా!' అని ఇంద్రుడు విస్మితుడై అడిగాడు.

'దేవేంద్రా! త్రిభువనాలూ నీ వజ్రాయుధ రక్షణలో సుఖంగా వున్నాయి. ఒక్క నా సంతానానికి మాత్రమే కష్టం మిగిలింది ' అంది సరభి గద్గద స్వరంతో.

'అదెలా సంభవం తల్లీ?' అని అమరేంద్రుడు మరింత ఆశ్చర్యంతో అడిగాడు.

'దేవరాజా! బలమైన పశువులతో బలహీనమైన పశువులను కట్టి మనుష్యులు నాగళ్ళు తోలుతున్నారు. అవి ఆ భారం మొయ్యలేకపోతే ములుకోలతో కొట్టి పొడిచి హింసిస్తున్నారు. అది చూడలేకుండా వున్నాను నేను ' అని వెక్కి వెక్కి ఏడ్చింది.

'అమ్మా! నీకు వేలకొలదీ సంతానం వుంది. అన్నిటికీ ఇలాంటి దుఃఖం సంభవించలేదు! ఎందుకు ఇంతగా బాధపడతావు?' అంటూ సురపతి ఆమెను ఓదార్చబోయాడు.

'అయ్యా! నీకు తెలియని ధర్మమేముంది? తల్లికి బిడ్డలందరూ ఒకటే. కొందరి మీద ఇష్టం, మరి కోందరి మీద అయిష్టం వుండవు ఏ తల్లికీ. ఎందరు బిడ్డలున్నా అందరూ సుఖంగా వుండాలనే కోరుకుంటుంది. నిజానికి దెబ్బతిన్న వాళ్ళనూ పడినవాళ్ళనే తల్లి మరింతగా ప్రేమిస్తుంది. బలహీనులై దీనవదనాలతో బాధపడుతున్న నా బిడ్డలను కనికరించు ' అని సురభి అర్థించింది.

ఆ మాటలు విని ఇంద్రుడు నవ్వుకున్నాడు. ఆమెను చూసి జాలిపడి వర్షం కురిపించాడు. అందువల్ల భూములన్నీ గుల్లబారి తృణసంపద పెరిగింది. పుష్కలంగా పశుగ్రాసం వుండటంతో పశువులు బలిష్టమయ్యాయి.

"మహారాజా! ఈ కథ వేదాలలో వుంది. పశువులలోనే సంతానంపై అంత ఆపేక్ష వున్నప్పుడు ఇంక మనుష్యుల సంగతి వేరే చెప్పడమెందుకు? నీకున్న విచారం నాకు తెలుసు. పుత్రమోహం సామాన్యమైనది కాదు. అయినా నీ నూరుగులు కొడుకుల మీద వున్నట్టే పాండవులపైన కూడా నీకు ప్రేమ వుండాలి. నీ కుమారులూ, పాండుకుమారులూ నీకు రెండు కళ్ళతో సమానం. ఏ కంటికి నొప్పి వచ్చినా బాధే! కాదంటావా?" అన్నాడు వేదవ్యాసుడు.

"నిజమే స్వామీ" అని చేతులు జోడించాడు ధృతరాష్ట్రుడు.

"సరే, కాసేపట్లో మైత్రేయ మహాముని వచ్చి నీ కొడుక్కి ధర్మోపదేశం చేస్తాడు.." అంటూ సాగిపోయాడు కృష్ణద్వైపాయనుడు.

తరువాత కొంచెం సేపటికి మైత్రేయుడు రానే వచ్చాడు. ధృతరాష్రుడు ఆ యతిని అతిభక్తితో పూజించాడు. ఇంతలో దుర్యోధనుడు తండ్రి దగ్గరకు వచ్చి మైత్రేయుణ్ణి నిర్లక్ష్యంగా చూస్తూ నిలబడ్డాడు. మైత్రేయుడికి కోపం వచ్చినా అణచుకుని "నాయనా! దుర్యోధనా! పాండవులతో వైరం మంచిదికాదు. మీరూ, వాళ్ళూ కలిసివుంటే కురువంశానికి శుభమౌతుంది. యుద్ధమంటూ వస్తే పాండవులను నువ్వు జయించలేవు. వాళ్ళు వజ్రకాయులు. మహా పరాక్రమవంతులు. భీముడొక్కడే వెయ్యి ఏనుగుల బలం కలవాడు. నువ్వు పాండవులతో స్నేహం చేసుకో. నా మాట విను" అని అనునయించాడు.

దుర్యోధనుడు ఆ మాటలకు సమాధానం ఇవ్వలేదు సరికదా, కాలి బొటనవేలితో నేలను తాటిస్తూ చేతులెత్తి తొడలు చరుచుకుంటూ వెకిలిగా నవ్వాడు. అది చూసేసరికి మైత్రేయుడికి కోపం పెచ్చుమీరింది.

వెంటనే లేచి, "నీచుడా! మునుల దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలియని అవివేకివి. సంగ్రామరంగంలో భీమసేనుని గదాఘాతాలవల్ల నీ తొడలు తెగిపడును గాక" అని శపించాడు.

ధృతరాష్ట్రుడు భయపడిపోయి శాపం మరల్చమని మహర్షి పాదాలు పట్టుకున్నాడు. "వీడికి సమబుద్ధి కలిగితే నా శాపం తగలదు. లేకపోతే ఫలితం అనుభవించవలసిందే" అని పలికి మైత్రేయుడు వెళ్ళిపోయాడు.

ఆ తరువాత మైత్రేయుడు అన్నంత జరిగింది.

కురుపాండవ సంగ్రామంలో భీముడు చేసిన ఊరుభంగమే సుయోధనుడికి మృత్యుహేతువయింది.

కొడుకును మందలించి సరియైన తోవలో పెట్టుకునేందుకు గుడ్డిప్రేమ అడ్డువచ్చిన ధృతరాష్ట్రుడు అప్పుడు వగచీ ప్రయోజనం లేకపోయింది.

Popular Posts