Followers

Monday 20 April 2015

శ్రీ మహాభారతంలో కథలు --- విదురుడు

విదురుడు ధర్మశాస్త్రంలోనూ,రాజనీతిలోనూ బాగా ఆరితేరినవాడు. కోపతాపాలు, ఈర్ష్యాసూయలు లేని మహాత్ముడు. పెద్దలందరిచేతా మంచివాడనిపించుకున్నాడు. ధృతరాష్ట్ర మహారాజుకు మహామంత్రిగా పనిచేసాడు. విదురుడికి సాటివచ్చే విజ్ఞానవంతుడు,ధర్మనిష్ఠ్డుడూ ముల్లోకాల్లోనూ ఎవరూ లేరు.

పాండవులతో జూదం ఆడడానికి దుర్యోధనుడు తన తండ్రి అనుమతి కోరినపుడు విదురుడు ధృతరాష్ట్రుడి చేతులు పట్టుకుని, "మహారాజా! మీరు ఈ జూదానికి ఒప్పుకోవద్దు. ఈ జూదం వల్ల అన్నదమ్ముల మధ్య విరోధం వస్తుంది. కౌరవ రాజ్యానికే దీనివల్ల ముప్పు కలుగుతుంది" అని ఎన్నో విధాల చెప్పాడు.

ధృతరాష్ట్రుడికి విదురిడిమీద అపారమైన నమ్మకం. అందుచేత అతను చెప్పిన మాటలు విని కొడుకుతో, "అబ్బాయీ! ఈ జూదం మనకు వద్దు. పాచికలతో పరాచికాలు కాదని విదురుడు చెబుతున్నాడు. అతడు ఏది చెప్పినా మన మేలుకోరి చెబుతాడు.అతడు చెప్పిన ప్రకారం చేస్తే మనకు శుభం జరుగుతుంది. బుద్ధిలో బృహస్పతిలాంటివాడు. జరిగిందీ,జరగబోయేదీ అన్నీ చెప్పగలడు. ఈ జూదం వల్ల మీ అన్నదమ్ముల మధ్య తగాదా వస్తుందని విదురుడు చెబుతున్నాడు.అది సుతారమూ నాకిష్టం లేదు" అని శతవిధాల చెప్పాడు.

కాని అవేవీ దుర్యోధనుడి చెవికెక్కలేదు. కుమారుడి మీద గల మితిమీరిన ప్రేమకొద్దీ దృతరాష్ట్రుడు చివరికి తప్పనిసరై అతను జూదమాడటానికి సరేనన్నాడు.

ఆ తరువాత విదురుడు చెప్పినట్టే జరిగింది. కౌరవ వంశమంతా నాశనమైంది. చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు.

అసలింతకీ ఈ విదురుడు ఎవరంటే.....

ఊరికి దూరంగా ఒక వనంలో ఆశ్రమం కట్టుకుని మాండవ్య మహాముని జీవిస్తుండేవాడు. ఒకనాడు ఆయన తన ఆశ్రమం వెలుపల తపస్సు చేసుకుంటూ వుండగా కొందరు దొంగలు అటువైపు వచ్చారు. వారిని కొందరు రాజభటులు తరుముకొస్తున్నారు. వారిని తప్పించుకునేందుకు దొంగలు మాండవ్యముని ఆశ్రమంలోకి జొరబడ్డారు. దోచుకు తెచ్చిన సొమ్ములన్నీ ఓ మూల పడేసి మరోమూల వాళ్ళు దాక్కున్నారు.

రాజభటులు దొంగలు పారిపోయిన జాడ కనిపెట్టి ఆ దారినే ఆశ్రమం వద్దకు వచ్చారు.

అక్కడ తపస్సు చేసుకుంటున్న మాండవ్యముని కనిపించాడు వాళ్ళకు.

"ఏమయ్యా ఇప్పుడే కొందరు దొంగలు ఇటు వచ్చారే, నువ్వేమైనా చూశావా? వాళ్ళు ఎటు వెళ్ళారు?" అని అడిగారు. ధ్యానంలో నిమగ్నమైన మాండవ్యుడు బదులు చెప్పలేదు.

రాజభటులు మళ్ళీ గట్టిగా అడిగారు.
సమాధానంలేదు.

ఇంతలో కొందరు రాజభటులు ఆశ్రమంలోకి వెళ్ళి సోదా చెయ్యడం మొదలుపెట్టారు. లోపల ఓ మూల దొంగలెత్తుకొచ్చిన నగలు,డబ్బు కనిపించాయి.మరోమూల దొంగలు కూడా కనిపించారు.

'ఒహో! ఇదా కధ! ఈ బ్రాహ్మణుడు కపట సన్యాసన్నమాట. దొంగల నాయకుడు బహు గొప్పగా ముని వేషం వేసుకుని ఉలక్కుండా పలక్కుండా వున్నాడు. ఇతడి సలహా మీదనే ఈ దొంగతనం జరిగి వుంటుంది' అని రాజభటులు తీర్మానించుకుని వాళ్ళ చేతులకు బేడీలు వేశారు. వెంటనే ఈ విషయం రాజుగారికి చెప్పారు. రాజుగారికి చాలా కోపం వచ్చింది. కపట సన్యాసిని వెంటనే శూలానికి గుచ్చి కొరత వెయ్యండని ఆజ్ఞాపించాడు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం మాండవ్యుణ్ణి శూలానికి గుచ్చి , ఆశ్రమంలో దొరికిన సొమ్మంతా రాజుగారికి అప్పగించారు. ఇంత జరుగుతున్నా దొంగలు నోరు మెదపలేదు. కాని, మాండవ్యముని ధ్యానంలో వుండటం వల్ల శూలంపోట్లు ఆయనను ఏమీ చెయ్యలేకపోయాయి.

ప్రాణం నిలిచే వుంది. అడవిలో వున్న మునులందరికీ ఈ విషయం తెలిసి ఆయనను చూడటానికి వచ్చారు.

"ఇంతటి ఘోరానికి ఒడికట్టిందెవరు మహానుభావా?" అని దుఃఖిస్తూ అడిగారు.


"ఎవరని చెప్పను నాయనా? ఎవరి ధర్మం వాళ్ళు నెరవేర్చారు. రాజభటులు పట్టుకున్నారు, రాజుగారు నాకీ శిక్ష విధించారు" అని మాండవ్య ముని సమాధానం చెప్పారు. శూలనికి వ్రేలాడుతున్న మనిషి అన్నం,నీళ్ళూ లేకపోయినా ఇంకా అలాగే ప్రాణాలతో బ్రతికి వుండటం రాజుగారికి ఆశ్చర్యం కలిగించింది. ముని మహానీయుడని గ్రహించాడు.వెంటనే ఆయన్ను శూలం నుంచి దింపమని భటులను ఆజ్ఞాపించాడు.


మహాముని కాళ్ళమీద పడి క్షమించమని వేడుకున్నాడు.


ఇంత జరిగినా మాండవ్య మునికి రాజుగారిమీద కోపం రాలేదు.


తిన్నగా యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి " స్వామీ! ఇంతటి కఠిన శిక్షను నాకెందుకు విధించారు?" అని అడిగాడు.

యమధర్మరాజు మాండవ్యుడికి కలిగిన కష్టానికి విచారిస్తూ, "మహామునీ! మీరు చిన్న పిల్లవాడుగా వున్నప్పుడు పక్షులను,తుమ్మెదలను హింసించారు. పాపం ఎంత కొద్దిగా చేసినా దాని ఫలం చాలా ఎక్కువగా అనుభవించాలి" అన్నాడు.


"పసితనంలో తెలియక చేసిన తప్పుకి ఇంత పెద్ద శిక్ష విధిస్తావా? సరే - నువ్వు చేసిన పాపానికి భూలోకంలో మానవుడవై జన్మించు" అని ముని యమధర్మరాజుని శపించాడు.


ఆ విధంగా ధర్మదేవత మాండవ్యముని శాపం వల్ల అంబాలిక దగ్గర వున్న దాసీవనిత కడుపున పుట్టాడు. అతడే విదురుడు.

అందుకని ధర్మదేవత అవతారమే ధర్మకోవిదుడైన విదురుడని పెద్దలు చెబుతారు.

Popular Posts