Followers

Monday 27 April 2015

శ్రీ మహాభారతంలో కథలు --- శ్రీకృష్ణ లీలలు - ధేనుకాసుర సంహారము


శ్రీ భాగవతములోని కథ

బలరామకృష్ణులు వివిధ వర్ణముల గోవులను చక్కగా అలంకరించి చూచువారి కన్నులపండగుగా ఆలమందలను తోలుకొని పోయేవారు. పవిత్రమైన గోధూళి తనపై పడాలని నందకిశోరుడు ఆలమందల వెనుక నడచుచుండెడివాడు. కానీ భక్తి అనే అమృతమును హృదయముల నిండా నింపుకొన్న గోమాతలకు పచ్చికబయళ్ళకన్నా పరమాత్మ సందర్శనమే మిక్కిలి ప్రీతిని కల్గించుచుండెడిది. కావున గోమాతలు పరమాత్ముడైన యశోదాతనయుని చూడకపోతే అడుగులు ముందుకు వేసేవి కావు. అందుకని ఆ లీలామానుషవేషధారి తానే ఆలమందల ముందు నడుమ , వెనుక ఉండి అందరికి ఆనందమును అందించెడివాడు. భక్తునికి భగవంతునికి గల సంబంధము అవ్యక్తమధురము కదా!

మధురానగరములో తీయ్యని తాటిపండ్లు గల తాళవనము ఒకటి ఉన్నది. కానీ ఆ వనములో నివసించు ధేనుకాసురునికి భయపడి గోపబాలురు ఆ వనములోకి మునుపెన్నడూ ప్రవేశించలేదు. శ్రీకృష్ణుని శక్తిపై పరిపూర్ణ విశ్వాసమున్న గోపబాలురు బలరామకృష్ణులను తాటిపండ్లు ఇప్పించమని కోరిరి. నిజభక్తుల కోరికలు స్వామి తీర్చకుండునా? వెంటనే బలరామకృష్ణులు తాళవనములో ప్రవేశించి తాళవృక్షములను గట్టిగా వూపిరి. తాళఫలములు క్రిందపడిన ధ్వనులు విని ధేనుకాసురుడు బలరామకృష్ణులను చూచినాడు. బలముగా తన వెనుకకాళ్ళతో బలరామదేవుని నాలుగుక్రోసుల దూరము పడునట్లుగా తన్నెను. చలించని బలదేవుడు వానిని తాళవృక్షమునకేసి కొట్టెను. కుపితుడై ఆ ధేనుకుడు గోపబాలుల వెంటబడెను. నందకిశోరుడు విసిరిగొట్టగా ధేనుకుడు గోవర్ధనిగిరి వద్ద పడి మూర్ఛిల్లెను.

కొంతసేపటికి తేరుకొని ధేనుకుడు నందనందనుని ఆకాశములోకి గొనిపోయి పోరుసల్పెను. పరమాత్మ వానిని నేలపైకి విసిరిగొట్టెను. గోవర్ధనగిరిని బంతివలె ధేనుకాసురునిపైకి విసిరెను. ధేనుకుడు ఆ గిరిని తిప్పికొట్టెను! శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని యథాస్థానములో ప్రతిష్ఠించి బలరామునికి సైగచేసెను. అంతట బలరాముడు పడికిలి బిగించి ధేనుకుని పొడిచెను. రక్కసుడు మరణించెను. వాని తేజము పరమాత్మలో లీనమయ్యెను.

ధేనుకాసురుని వృత్తాంతము:

పరమ విష్ణుభక్తుడైన బలిచక్రవర్తి యొక్క కుమారుడు సాహసికుడు. అహంకారి అయిన సాహసికుడు ఒకనాడు పవిత్రమైన గంధమాదన పర్వతములపై పదివేలమంది వనితలతో విహారములు చేసినాడు. ఆ పవిత్ర ప్రదేశములో ఘోరతపస్సు చేసుకొంటున్న దుర్వాసమహర్షికి సాహసికుని వలన తపోభంగమైనది. మహర్షి “ఓరీ! ఏమాత్రమూ వినయవిధేయతలు లేకుండా గార్దభమువలె ప్రవర్తించినావు. పవిత్రమైన ఈ పర్వతముపై విలాసవిహారములు చేసి నా తపస్సును భంగపఱచినావు. గార్దభమువై జన్మించు” అని సాహసికుని శపించెను. చేసిన తప్పుకు పశ్చాత్తాపపడి మహర్షిని శరణువేడినాడు సాహసికుడు. కరుణించి మహర్షి “నాయనా! అహంకారముతో మనసుకు నచ్చినట్లు చేయుట వివేకవంతుల లక్షణముకాదు. ఉత్తముడైన వాడు ధర్మబద్ధమైన కార్యములనే చేస్తాడు. కాబట్టి ఎప్పుడూ వినయమును కలిగి ధర్మమార్గముననే నడువవలెను. నీవు చేసిన తప్పుకు ఫలితమును అనుభవించిన తరువాత ద్వాపరయుగములో బలరాముని చేతిలో మరణించి ముక్తిని పొందుతావు” అని ఆశీర్వదించెను. ఆ సాహసికుడే ధేనుకుడు. పూర్వం ప్రహ్లాదుని కాచినపుడు స్వామి ప్రహ్లాదుని వంశమువారిని సంహరించనని వరమిచ్చెను. అందుకనే బలరామునికి ధేనుకాసురిని సంహరించమని సైగచేసెను.

Popular Posts