Followers

Saturday 18 April 2015

గజేంద్రమోక్షము - 8


ఉ. ఎవ్వనిచే జనించు జగ| మెవ్వనిలోపలనుండు లీనమై
యెవ్వనియందుడిందు బర| మేశ్వరుడెవ్వడు మూల కారణం
బెవ్వడ నాదిమధ్యలయు! డెవ్వడు సర్వము దానయైనవా
డెవ్వడు వాని నాత్మభవు| నీశ్వరునే శరణంబు వేడెదన్‌


తా!! ఈ విశ్వమంతయూ ఎవ్వనిచే జనింపబడనదో, ఎవ్వని యందిదంతయు బుట్టి బెరిగి నశించుచుండునో, ఎవ్వనియందు ఈ జగమంతయు అణగియుండెనో, ఈ సకల చరాచర జీవరాశికంతకూ ప్రభువెవ్వడో! దీనిమూలకారకుడెవ్వడో! దీనికంతటికిని మొదలు, మధ్య చివరలు లేనివాడెవ్వడో! ఈ విశాల విశ్వమంతటికి సమస్తమైన వాడెవ్వడో! సర్వాత్మ స్వరూపుడైనవాడెవ్వడో! తనకు తనై బుట్టిన దేవదేవుడైన ఈశ్వరుని నా ఆపదను దొలగించమని శరణు వేడెదను.

*******************************************************************************************  57

క. ఒకపరి జగముల వెలి నిడి
యొకపరి లోపలికి గొనుచు| నుభయము గనుచున్‌
సకలార్థసాక్షి యగు న
య్యకలంకుని నాత్మమయుని| నర్థింతు మదిన్‌


తా: యిచ్ఛాపూర్వకంగా ఎవ్వనియందీ విశ్వమంతయు బయటను, లోపలను ప్రకాశించియుండునో, ఈ విశ్వముయొక్క సృష్టి సంహారములను సక్రమముగా నడిపించు వాడెవ్వడో అట్టి సకలసాక్షి స్వరూపుడు, కళంకరహితుడు, జ్ఞానస్వరూపుడైన భగవంతుని మనస్సులో ధ్యానించెదను.

******************************************************************************************   58

క. లోకంబులు లోకేశులు
లోకస్థులు దెగిన దుది న లోకంబగు, పెం
జీకటి కవ్వల నెవ్వడు
నేకాకృతివెలుగు నతని| నే సేవింతున్‌


తా!! ఈ బదునాల్గులోకములు సృష్ఠి, స్థితి, లయము అయిన పిమ్మట ఈ అంధకార బంధురమయిన నిర్జనప్రదేశమందు ఏకాత్మ స్వరూపుడై మెలగి ప్రకాశించునట్టి భగవంతుని ప్రార్థించెదను.

*******************************************************************************************  59

క. నర్తకుని భంగి బెక్కగు
మూర్తులతో నెవ్వ డాడు| మునులున్‌ దివిజుల్‌
గీర్తింప నేర రెవ్వని
వర్తన యొరు లెఱుగ రట్టి| వాని నుతింతున్‌.


తా!! బలు వేషములు ధరించి, పెక్కు రూపములతో నెవడు ఈ చరాచర సృష్టితో మసలుచున్నాడో, మునీశ్వరులు, దేవతలు కీర్తింపలేని కీర్తిని బొందియున్న వాడెవ్వడో, ఎవనినెవ్వరూ ఎఱుంగలేరో అట్టి పరమేశ్వరుని స్మరింతును.

*******************************************************************************************  60

ఆ. ముక్తసంగులైన| మునులు దిదృక్షులు
సర్వభూతహితులు| సాథుచిత్తు
లసదృశవ్రతాఢ్యు| లై కొల్తు రెవ్వని
దివ్యపదము వాడు| దిక్కు నాకు


తా!! బ్రహ్మసాక్షాత్కారకామితులై, సమస్త ప్రాణులను సమదృష్టితో చూచు సత్పురుషులు, అత్యంత నియమ నిష్ఠలు గలవారైననూ ఎవరిని తెలుసుకొనజాలరో అట్టి పరమేశ్వరుని ప్రార్థింతును. నా కతడే రక్షయగుగాక!

*******************************************************************************************  61

సీ. భవము దోషంబు రూ| పంబు కర్మంబు నా
హ్వయమును గుణము లె| వ్వనికి లేక
జగముల గలిగించు| సమయించుకొఱకునై
నిజమాయ నెవ్వడి| న్నియును దాల్చు
నా పరమేశు న| నంతశక్తికి బ్రహ్మ
కిద్ధరూపికి రూప| హీనునకును
జిత్రచారునికి సా| క్షికి నాత్మరుచికిని
బరమాత్మునకు బర| బ్రహ్మమునకు

ఆ. మాటల నెఱుకల| మనముల జేరంగ
రానిశుచికి సత్త్వ| గమ్యు డగుచు
నిపుణడైనవాని| నిష్కర్మతకు మెచ్చు
వాని కే నొనర్తు| వందనములు


తా!! జన్మ, పాప, నామ, గుణ రూప రహితుడెవ్వడో, సృష్ఠి, స్థితి, లయాదినామ రూపములు గలవాడును, మాయను జయించిన వాడునూ, తేజోరూపుండును, పరాత్పరుడును, మిక్కిలి శక్తి పరుడైనవాడునూ, రూపరహితుడును, చిత్రాతిచిత్రమైన విచిత్ర చరిత్రలు కలవాడునూ, సాక్షియైనవాడును స్వయంప్రకాశము గలవాడును, పరమాత్మ పరబ్రహ్మము గలవాడను, మనోవాక్కాయికర్మలకు అగోచరుడును, సత్త్వగుణసంభూతుడును, సంసారత్యాగికి సాక్షాత్కరించువాడును అయిన ఆ విశ్వేశ్వరుని మ్రొక్కెదను.

*******************************************************************************************  62

సీ. శాంతున కపవర్గ| సౌఖ్యసంవేదికి
నిర్వాణ భర్తకు| నిర్విశేషు
నకు ఘోరునకు గూఢు| నకు గుణధర్మికి
సౌమ్యున కదిక వి| జ్ఞానమయున
కఖిలేంద్రియద్రష్ట| కధ్యక్షునకు బహు
క్షేత్రజ్ఞునకు దయా|| సింధుమతికి
మూలప్రకృతి కాత్మ| మూలున కుజితేంద్రి
యజ్ఞాపకునకు దుః | ఖాంతకృతికి

ఆ. నెఱి నసత్య మనెడి| నీడతో వెలుగుచు
నుండు నెక్కటికి మ| హోత్తమునకు
నిఖిల కారణునకు| నిష్కారణునకు న
మస్కరింతు నన్ను| మనుచుకొఱకు.


తా!! శాంతస్వభావునికి, మోక్షసంతోషమాధుర్యమును గ్రోలినవార్కి, మోక్షాతీతుడు, పామరులకు భయముగొల్పువాడును, ఎవ్వరికిని అంతుచిక్కనివాడును, సత్త్వ, రజ, స్తమోగుణ సంయుతుడునూ, సౌమ్యుడును, అధిక విజ్ఞానవంతుడును, సర్వులకధిపతియై కాపాడు వానికిని, సర్వేంద్రియముల నదుపులో నుంచుకొన్నవాడును, సర్వాంతర్యామి యనువాడును, మూలధారుడైన వానికిని, సర్వదుఃఖవినాశకునికి, మాయామోహితుడైనట్లగుపడువానికి, జగత్కారకునకు, ఉత్తమోత్తముడు అయిన యా భగవంతుని రక్షించమని వేడుకొందును.

*******************************************************************************************  63

క. యోగాగ్ని దగ్దకర్ములు
యోగీశ్వరు లే మహాత్ము| నొండెఱుగక స
ద్యోగవిభాసితమనముల
బాగుగ నీక్షింతు రట్టి| పరము భజింతున్‌


తా!! మాయమోహవర్జితులై, యోగీశ్వరులు తపోః నిష్ఠాగరిష్టులై సర్వమును త్యజించి ఏ భగవంతుని సాన్నిధ్యమునాశించెదరో అట్టి భగవంతుని, ఈ ఆపదనుండి నన్ను కాపాడమని వేడుకొంటున్నాను.

*******************************************************************************************  64

Popular Posts