Followers

Saturday 18 April 2015

గజేంద్రమోక్షము - 3


క. తలగవు కొండలకైనను
మలగవు సింగములకైన| మార్కొను గడిమిన్‌
గలగవు పిడుగులకైనను
నిల బల సంపన్నవృత్తి| నేనుగు గున్నల్‌


తా!! ఆ మత్తేభములు మిక్కిలి మదించి బలముగలవియై అడ్డు వచ్చిన పర్వతములను, సింహములను తమ పౌరుష పరాకమములతో ఎదిరించుచూ, పిడుగులు పడిననూ భయమునొందక బలగర్వముతో నొప్పారుచున్నాయి.

*******************************************************************************************  12

సీ. పులుల మొత్తంబులు| పొదరిండ్లలో దూఱు
ఘోరభల్లూకముల్‌| గుహలు సొచ్చు
భూదారములు నేల| బొరియలలో డాగు
హరిదంతముల కేగు| హరిణచయము
మడుగులజొఱబాఱు| మహిష సంఘంబులు

గండశైలంబుల| గపులు ప్రాకు
వల్మీకములు సొచ్చు వనభుజంగంబులు
నీలకంఠంబులు| నింగికెగయు

తే. వెఱచి చమరీమృగంబులు| విసరువాల
చామరంబుల విహరణ| శ్రమమువాయ
భయదపరిహేల విహరించు| భద్రకరుల
గాలి వాఱినమాత్రాన| జాలిబొంది


తా: పలుజంతువులను భయపెట్టే యా మత్తేభములు విలాసమైన ఆటలతో విహరించుచు వచ్చునపుడు యా భద్రగజేంద్రముల గాలి సోకుటవలన పులులు, పొదరిండ్లలోనూ, భీకరమైన ఎలుగుబంట్లు గుహలలోను, అడవిపందులు భూబొరియలలోను దాగుకొంటున్నాయి. జింకలు, దిక్కుల చివరలకు పారిపోతున్నాయి. అడవి దున్నల గుంపులు మడుగులలో దాక్కుంటున్నాయి. కొండచిలువలు చెట్టు పుట్టలనాశ్రయిస్తున్నాయి. కోతులు పెద్ద పెద్ద బండరాళ్లపైకి ప్రాకిపోతున్నాయి. నెమళ్ళు నింగికెగిరిపోతున్నాయి. చమరీ మృగములు తమతోకలతో విసరుతూ యేనుగుల సంచారబడలికను ఏమారుస్తూన్నాయి. (ఏనుగుల గాంభీర్యత, గంభీరముగా వర్ణించబడిందిక్కడ).

******************************************************************************************   13

క. మదగజ దానామోదము
కదలని తమకములద్రావి| కడుపులు నిండన్‌
బొదలుచు దుమ్మెదకొదమల
కదుపులు జుంజుమ్మటంచు| గానము సేసెన్‌


తా!! చిరుప్రాయపు తుమ్మెదల గుంపులు మదపుటేనుగుల మదజల పరిమళమును మిక్కిలి ప్రీతితో కడూపారా సేవించి (వాసన జూచి) ఝుంకార గీత ధ్వనులతో గానము జేయుచు తిరిగితున్నాయి.

*******************************************************************************************  14

క. తేటియొకటి యొరుప్రియకును 
మాటి మాటికిని నాగ| మదజలగంధం
బేటికి కని తన్నుఁ బొందెడి
బోటికి నందిచ్చు నిండు| బోటుదనమునన్‌


తా!! ఈ విధముగా తుమ్మెదలన్నియు యా మత్తేభముల మద జలంబును గ్రోలియానందించుచుండగా ఒక యాడుతుమ్మెద యా మదజలంబు నాఘ్రణించుటను ఒక మగ తుమ్మెద జూచి ఓర్వలేక "పరప్రియకాంతల కెందుకోయీ మదజల గంధమ్ము" యని తన ప్రియురాలైన యాడుతుమ్మెదకు బలుమార్లు నా మదజలంబును దెచ్చి ఇస్తూ దమతమ మగతనమును ప్రకటించు కొంటున్నాయి. (తమ యాడువాండ్రపై దాము గాక మరెవరు నెక్కువ ప్రేమ జూపిస్తారని నిది సర్వసాధారణమని విశదీకరించుటయే ఇందలి వైశిష్ట్యము.)

*******************************************************************************************  15

క. అంగీకృత రంగన్మా
తంగీ మదగంధమగుచు| దద్దయువేడ్కన్‌
సంగీత విశేషంబుల
భృంగీగణ మొప్పె మ్రాను| పెట్టెడిమాడ్కిన్‌


తా!! ఆడు తుమ్మెదలు తమ భర్తలు దెచ్చియిచ్చే మదజల పరిమళములనాఘ్రాణించి, మిక్కిలి సంతుష్ఠులై ఆనందామోదము వెల్లివిరియ శ్రోతలాశ్చర్యపడునట్లు పలుతెఱంగుల గానమాధుర్యముతో తమ భర్తలనానందింప జేయుచున్నాయి.

*******************************************************************************************  16

క. వల్లభలు పాఱి మునుపడ
వల్లభమని ముసరిరేని| వారణదానం
బొల్లక మధుకర వల్లభు
లుల్లంబుల బొంది రెల్ల| యుల్లాసంబుల్‌


తా!! తమ ప్రియురాండ్రు తమ కంటే ముందు ఆఘ్రణించుట కేతెంచి మదజలగంధముపై వ్రాలియున్నపుడు మగ తుమ్మెదలు వాటియానందమును భంగపరువక తమ ప్రియురాండ్రు త్రాగితే తామే త్రాఘినట్లు యానందపడుచూ సంతోషముతో నిరీక్షిస్తున్నాయి. (యిచ్చట మన సహజ పాండిత్యుడు " బమ్మెర పోతనామాత్యుడు" సంసార ధర్మప్రభోదము గావించుట తెలియనగును.)

*******************************************************************************************  17.

వ. అప్పుడు


తా!! సకల మృగంబులకు భీతిని కలిగించే ఆ మత్తేభములు మదజల గంధముచే దుమ్మెదలను దన్మయత్వము జేయుచు తిరుగుచున్న సమయమున (తరువాత పద్యముతో అన్వయము)

*******************************************************************************************  18

మ. కలభంబుల్‌ చెఱలాడు బల్వలము లా ఘ్రాణించి మట్టాడుచున్‌
ఫలభూజంబులు రాయుచుం జివురుజొంపంబుల్‌ వడిన్‌ మేయుచుం
బులులన్‌ గాఱెనుబోతులన్‌ మృగములన్‌| బోనీక శిక్షించుచున్‌
గొలకుల్సొచ్చి కలంచుచున్‌ గిరులపై| గొబ్బిళ్ళు గోరాడుచున్‌


తా!! ఆ యేనుగు గున్నలు, చిన్న చిన్న నీటి కొలనులను జూచి వాటి యందలి నీటిని దమ తమ కుంభస్థలముపై పోసికొనుచు, వాడియైన దమ కోరలతో మట్టిని, బురదను, ఇసుకను పెకలించి శరీరములపై జల్లుకొనుచూ ఆ మడుగులను చిందరవందర జేయుచు, ఎదురుపడిన ఫలవృక్షములను రాసికొనుచు, చిగుళ్ళగుబురులను వేగముగా నారంగించుచు కనిపించిన పులులను, అడవి దున్నలను, జింకలను నడ్డగించి వాటిని శిక్షించుచూ గుంటలను ముఱికి జేయుచు చిన్నపిల్లలు ఆటలాడినట్లు రాల్ళను గొబ్బిళ్ళ మాదిరి దన్నుతూ దుమ్మును రేపుతూ ఆటలాడుతుసాగుతున్నాయి.

*******************************************************************************************  19

Popular Posts