Followers

Saturday 18 April 2015

గజేంద్రమోక్షము - 12



వ. ఇట్లు పొడగని

తా!! ఆకాశమార్గమున శ్రీమహావిష్ణువును దేవతలు జూచి,

*******************************************************************************************  90

మ. చనుదెంచెన్‌ ఘనుడల్లవాడె హరిపజ్జంగంటిరేలక్ష్మి శం
ఖనినాదం బదె చక్ర మల్లదె భుజంగ| ధ్వంసియున్‌ వాడెక్ర
న్నన నేతెంచె నటంచు వేల్పులు 'నమో నారాయణా' యేతిని
స్స్వనులై మ్రొక్కిరి మింట హస్తిదురవ| స్థా వక్రి కిం జక్రికిన్‌


తా!! "అదిగో శ్రీ మహావిష్ణువు వచ్చుచున్నాడు. లక్ష్మీదేవి గూడ ఆతనిని వెన్నంటి వచ్చుచున్నది. సుదర్శనచక్రము, గరుత్మంతుడు కూడా వెన్నంటి వచ్చుచున్నారు. వీరందరూ భక్తాగ్రేసరుడైన గజేంద్రుని కాపాడుటకు పోవుచున్నారు. ఆహా! యాతని భాగ్యమే మనవచ్చును " ఓం నమోనారాయణాయ హరి" యని విష్ణువును స్మరించి మొక్కుచుండిరి.

*******************************************************************************************  91

వ. అయ్యవసరంబున గుంజరేంద్రపాలనపారవశ్యంబునదేవ
తానమస్కారంబు లంగీకరింపక, మనస్సమానసంచారుండై
పోయిపోయి కొంత దూరంబున శింశుమారక చక్రంబునుం
బోలె గురుమకరకుళీరమీనమిథునంబై కిన్న రేంద్రునిభాం
డాగారంబునుంబోలె స్వచ్చవరకచ్చపం బై భాగ్యవంతుని
భాగధేయంబునుం బోలెసరాగజీవనంబై వైకుంఠపురంబు
నుంబోలె శంఖచక్ర కమలాలంకృతంబై ద్వంద్వసంకులసంసార చక్రంబునుబోలె
వంక సంకీర్ణంబై యొప్పునప్పంకజకరంబు బొడగని.


గజేంద్రుని రక్షించాలనే తాపత్రయంతో వేల్పుల మ్రొక్కులు స్వీకరింపక, సాటిలేని వేగమునబోయి, కొంతదూరములో శింశుమారచక్రంబువలె నుండు, గొప్పదైన మొసళ్ళు, ఎండ్రకాయలు, మండ్రకప్పలు, మీనదంపతులు, కర్కాటక మకర, మీన మిధున రాశితో కూడియున్న సొంపైన, కుభేరుని ఖజానా వలె ప్రశస్తమై, తాబేళ్ళు, పుప్పొడి నీటి సంయుతమై, శంఖ, చక్ర, కమలపుష్పములతో గూడి అలరారుచున్న చల్లని, వేడి నీటి కుటుంబమున సుఖదుఃఖములు, కలిమిలేములు కలదియై నొప్పారు చున్న, అల్లకల్లోలమైయున్న కరిమకరిలు పోరు చేయు ఆ తామర కొలనుని జూచి

******************************************************************************************   92

మ. కరుణాసింధుడు శౌరి వారి చరమున్‌ ఖండిపగా బంపె స
త్వరితాకంపితభూమిచక్రము మహోద్య ద్విస్ఫులింగచ్ఛటా
పరిభూతాంబర శుక్రమున్‌బహు విధ బ్రహ్మాండభాండచ్ఛటాం
తరనిర్విక్రము బాలితాఖిల సుధాంధశ్చక్రమున్‌జక్రమున్‌


తా: కరుణాసముద్రుడైన శ్రీహరి గజేంద్రుని సత్వరమే కాపాడదాల్చి ప్రచండ ప్రళయ భీకరమైన తెల్లని కన్నులు మిరుమిట్లు గొల్పు నట్టి ప్రకాశవంతమైన, నిప్పురవ్వలు వెదజల్లుతున్న, భూమి అదురునట్లు మిక్కిలి వేగముతో, కోటికాంతుల సమూహముతో ప్రకాశించుచున్న, నిరాటంక వ్యాపితమైన దేవతలనందరిని శత్రువుల నుండి కాపాడు సదర్శన చక్రాయుధమును విడిచెను.

******************************************************************************************   93

వ. ఇట్లు పనిచిన - విడువగా

తా!! ఆ విధముగా చక్రమును ప్రయోగింపగా

*******************************************************************************************  94

శా. అంభోజాకరమధ్యనూతన నళి| న్యాలింగనక్రీడనా
రంభుండైన వెలుంగురేని చెలువా| రన్వచ్చినీటన్‌గుభుల్‌
గుంభద్వానముతోగొలంకును గలంకంబొందగాజొచ్చిదు
ష్టాంభోవర్తి వసించు చక్కటికి డాయంబోయి హృద్వేగమై


తా!! ఆ సుదర్శనచక్రము ప్రయోగించిన వెంటనే భుగభుగధ్వనులతో జ్వలించుచు కొలనును కల్లోల పరచుచూ లోపలికేగి యా క్రూర మకరంబున్ను చోటికి తీవ్రవేగము గలదియై ప్రకాశించెను. వెలుగుఱేడయిన సూర్యుడు కొలనియందున్న నళినియను తామరతీగను ఆలింగనము చేసి క్రీడించాలనే తలంపుతో హోరుహోరు నగు భేల్‌ గుభేల్‌ మనుచు తామర కొలనిని ప్రవేశించెనని అన్యాపదేశము.

*******************************************************************************************  95

శ. భీమంబై తలద్రుంచి ప్రాణముల బా| పెం జక్రమాశ్రు క్రియన్‌
హేమక్ష్మాధరదేహమున్‌ జకితన న్యేభేంద్రసం దోహమున్‌
గామక్రోధన గేహమున్‌ గరటి ర క్తస్రావగాహంబు ని
స్సీ మోత్సాహము వీతదాహము జయ శ్రీమోహమున్‌గ్రాహమున్‌


తా!! మేరు పర్వత శరీరాకృతిగలదియు, కరిసమూహమును కంగారు బెట్టినదియు, కామక్రోధములు యందు మిక్కిలి ఆసక్తి గలదియు, యేనుగు యొక్క రక్తముతో వ్యాపింపబడిన ప్రదేశమున మునుగియుండినదియు, దప్పికలేక, శక్తి తగ్గక, కడునుత్సాహముతో పోరాటమందింకనూ ఆసక్తి గలదియు, ఏనుగు నెట్లయినజయించి జయలక్ష్మిని వరించాలనే తపన గలదియు, మిక్కిలి పట్టుదలతో నున్న యా మొసలి దాపునకు సుదర్శనచక్రము జేరి వేగముతో తటాలున దాని శిరస్సుద్రుంచి సంహరించెను.

*******************************************************************************************  96

వ. ఇట్లు నిమిషస్పర్శంబున సుదర్శనంబు మకరిదల ద్రుంచు సమయమున


తా!! సుదర్శనచక్రము ఒక్క క్షణములో మొసలితలను తెగవేసిన నవసరంబున

*******************************************************************************************  97

క. మకర మొకటి రవిజొచ్చెను
మకరము మఱియొకటి ధనదు మాటున డాగెన్‌
మకరాలయమున దిరిగెడు
మకరంబులు కూర్మరాజు| మఱువున కరిగెన్‌


తా!! ఒక మకరము మకరరాశిని ప్రవేశించెను. మరియొకటి కుబేరుని చేరెను. మిగిలిన మకరములన్నియు ఆదికూర్మమును జేరిదాగుకొనెను. (అతిశయోక్తాలంకారము ఉపయోగింపబడినది) జలచర, మకరములన్నియు భీతినందినవని యర్థము.

*******************************************************************************************  98

Popular Posts