Followers

Saturday 18 April 2015

గజేంద్రమోక్షము - 11


వ. ఇట్లు భక్తజనపాలనపరాయణుండును నిఖిలజంతు హృదయా
రవింద సదనసంస్థితుండును నగునారాయణుండు కరితికులేంద్ర
విజ్ఞాపిత నానావిధ దీనాలాపంబు లాకర్ణించి లక్ష్మీకాంతా
వినోదంబులం దనివి సాలించి సంభ్రమించి దిశలు నిరీ
క్షించి గజేంద్రరక్షాపరత్వంబు నంగీకరించి నిజపరికరంబు
మరల నవధరించి గగనంబున కుద్గమించి వేంచేయునప్పుడు


తా!! భక్తజనోద్ధారకుడైన శ్రీమన్నారాయణుడిట్లు సమస్త జంతుకోటి హృదయములందు అమరియున్నవాడై, గజేంద్రుని మొఱనాలకించినవాడై గజేంద్రుని రక్షించుటే ప్రధమ కర్తవ్యముగా భావించి తనుపోవుట యాలస్యమగునని దలంచి దన కంటే ముందు చక్రాయుధమును పొమ్మని యానతిచ్చి ఆకాశంబున వేంచేయుచున్న సమయంబున

*******************************************************************************************  81

మ. తనవెంటన్‌సిరి లచ్చి వెంట నవరో| ధవ్రాతమున్‌ దాని వె
ంకను బక్షీంద్రుడు వాని పొంతను ధనుః కౌమోదకీశంఖ| చ
క్రనికాయంబును నారదుండు ధ్వజనీ కాంతుండు వచ్చి రొ
య్యనవైకుంఠపురంబునంగలుగువారాబాలా గోపాలమున్‌


కారణము తెలియక పతిని వెంబడించుచు లక్ష్మీదేవియు, ఆమెను గూడి యామె అంతఃపురజనంబులు, వారి వెనుక గరుత్మంతుడు, యాతని వెనుక విల్లును, కౌమోదకీ శంఖ చక్ర గదాధి ఆయుధంబులునూ, నారద మహర్షియునూ, విష్వక్సేనుడును తోడుగా వచ్చిరి. వైకుంఠపుర మందలి ఆబాలగోపాల మంతయు అబ్బుర పడుచు అరుదెంచిరి.

******************************************************************************************   82

వ. తదనంతరంబు ముఖారవింద మకరంద బిందుసందోహపరిష్యం
దమానానందదిందింధిరయగునయ్యిందిరాదేవి గోవిందకరారవింద
సమాకృష్యమాణ సంవాదచేలాంచలయై పోవును


తా: పిమ్మట లక్ష్మీదేవి, తన మఖాకమలము నుండి స్రవించు పూదేనెను గ్రోలుటకేతెంచు తుమ్మెదల సమూహముతో, శ్రీ మన్నారాయణుండు క్రొంగువీడుట మఱచుటచే ఈడ్వబడినదై యాతనిని వెంబడించుచు నిట్లు దలపోసెను.

******************************************************************************************   83

మ. తన వేంచేయు పదంబుబేర్కొన డనాథ స్త్రీజనాలాపముల్‌
వినెనో, మ్రుచ్చులు మ్రుచ్చిలించిరో ఖలుల్వేద ప్రపంచంబులన్‌
దనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో, భక్తులం
గని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించిరో దుర్జనుల్‌


తా!! తన పతియైన శ్రీమన్నారాయణుండెచటికి బోవుచున్నాడో చెప్పడు. ద్రౌపది మున్నగు అనాధస్త్రీల ఆర్తనాదము విని రక్షింపదలెంచెనో, వేదముల నెవరైననూ తస్కరులు తస్కరించిరో, రాక్షసులు దేవతా నగరిపై దండెత్తి వచ్చిరో, దుర్జనులు " మీ చక్రాయుధుడేడీ" యని దూషణ తిరస్కారములనిందించిరో (తరువాతి పద్యముతో అన్వయము)

*******************************************************************************************  84

వ. అని తర్కించుచు


తా!! యని ఈ ప్రకారంబుగా లక్ష్మీదేవి దలపోయుచు

*******************************************************************************************  85

శా. తాటంకాచలనంబుతో భుజనట| ద్ధమ్మిల్లబంధంబుతో
శాటీముక్తకుచంబుతో నదృఢ చం| చత్కాంచితో శీర్ణ లా
లాటాలేపముతో మనోహరకరా| లగ్నోత్తరీయంబుతో
గోటీందు ప్రభతో నురోజభర సంకోచద్వలగ్నంబులతోన్‌


తా!! ఊగుతూనున్న చెవికమ్మెలను సరిచేసుకొనక, విడిన కొప్పుముడిని మరలవేసికొనక, జారిన మొలనూలును సరిదిద్దుకొనక, చెదిరిన బొట్టును గమనింపక, తన బ్రాణేశ్వరునిజేత జిక్కిన పైటకొంగు చెదరగా, సిగ్గు జెందినదై, కోటి చంద్రకాంతులనుబోలు ముఖారవిందము గల లక్ష్మీదేవి....

*******************************************************************************************  86

క. అడిగెదనని కడువడిన జను
నడిగిన దను మగుడ నుడువ డని నడ యుడుగున్‌
వెడ వెడ జిడిముడి తడబడ
నడు గిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్‌


తా!! తొట్రుపాటుతో తన భర్త ఎచటి కేగుచున్నాడో తెలుసుకొన గోరి, ఒక యడుగు ముందుకువేసి, తనకు బదులిచ్చునో లేదో యని సంశయముతో వెనుకంజ వేయుచు, మఱల ముందరికేగి అడిగితే యేమగునోయని తొట్రుపాటుపడుచు నట్లే యుండిపోయెను

*******************************************************************************************  87

సీ. నిటలాలకము లంటి| నివుర జుంజుమ్మని
ముఖసరోజమునిండ| ముసరుదేంట్లు
నళుల జోపగ జిల్కలల్లనల్లనజేరి
యోష్టబింద్యుతు| లొడియ నుఱుకు
శుకములందోల జ| క్షుర్మీనములకు మం
దాకినీ పాఠీన| లోక మెగుచు
మీనపంక్తులు దాట| మెయిదీగెతో రాయ
శంపాలతలు మింట సరణిగట్టు

ఆ. శంపలను జయింప| జక్రవాకంబులు
కుచయుగంబు దాకి| క్రొవ్వుసూపు
మెలత మొగులు పిఱిది| మెఱుగుదీగెయుబోలె
జలదవర్ణు వెనుక| జనెడు నపుడు.


తా!! ఆ లక్ష్మీదేవి, ఘర్జించిన వెనుక మెఱుపువచ్చు మేఘము చందంబువోలె, నీలమేఘచ్ఛాయా శరీరుడగు ఆ శ్రీమహా విష్ణువు వెంబడిపోవునపుడు, నొసటి ముంగురులు అటు నిటు అణగి క్రొంగొత్త అందమును సతరించుకున్నాయి. ఆమె ముఖకమల మకరందమును గ్రోలుటకు ఝంఘంమ్మని తుమ్మెదలు వచ్చి ముట్టడిస్తున్నాయి. అంతటి ముఖారవిందమును గల్గిన లక్ష్మీదేవి యొక్క దొండపండు లాంటి ఎర్రని పెదవులను చుంభించుటకై చిలకలు ఆ తుమ్మెదలను పారదోలి వ్రాలజూస్తూన్నాయి. లక్ష్మీదేవి యొక్క కన్నులను జూచి, మందాకినీ నదిలోని పెద్ద చేపలు చిరుమీనములని ఎంచి దినుటకు జూస్తున్నాయి. ఆ చేపల గుంపును పారద్రోలి శరీర లతాస్పర్శకై మెఱుపులు ఆకాశములో బారులు దీరి యున్నాయి. ఆ మెఱుపులను గెల్చి చక్రవాకంబులు స్థనములను దాకి గర్వపడుతున్నాయి. అట్టి కుచద్వయముతో విరాజిల్లు లక్ష్మీదేవి నారాయణమూర్తిని వెంబడించెను.

*******************************************************************************************  88

క. విను వీధిం జనుదేరగాంచి రమరుల్వి ష్ణుంసురారాతి జీ
వనసంపత్తి నిరాకరిష్ణు గరుణా వర్థిష్ణు యోగీంద్రహృ
ద్వనవర్తిష్ణు సహిష్ణు భక్తజనబృం ద ప్రాభవాలంకరి
ష్ణు నవోఢోల్లస దిందిరా పరిచరిష్ణున్‌ జిష్ణురోచిష్ణునిన్‌


తా!! అసురుల ఆయుష్షును హరించువాడు, కరుణాసాగరుడును, మునీశ్వరుల మనస్సునందు వసించువాడును, భక్తులకు భక్తి మహాత్మ్యమును జూపువాడును, ప్రకాశవంతమైన లక్ష్మీదేవిచే బూజింప బడువాడును, సతతము విజయలక్ష్మీని వరించువాడునూ, స్వయం ప్రకాశకుడునూ, అయిన యా శ్రీమహావిష్ణువు ఆకాశమున ఆతురతతో ఏతెంచుచుండగా వేల్పులందరూ స్వామిని జూచి మిక్కిలిగా సంతోషించిరి.

*******************************************************************************************  89

Popular Posts