Followers

Saturday 18 April 2015

గజేంద్రమోక్షము - 1


గజేంద్రమోక్షము

కం. శ్రీమన్నామ పయోద
శ్యామ ధరాభృల్లలామ | జగదభిరామా
రామా జనకామ మహో
ద్దామ ! గుణస్తోమధామ | దశరథ రామా !


తా!! ఓ నీలమేఘశ్యామా! సర్వసంపదప్రదాత! జగద్రక్షకా! సర్వ సద్గుణోపాసా! జగదభిరామా! మనోహరవరదా! స్త్రీలను సమ్మోహనపరిచే గంభీరమైన శరీరము గలవాడా! సకల సద్గుణోపాసా! దశరథ రామా! (నీకు నమస్కారము.)

*******************************************************************************************  1

సీ. మానవాధీశ్వరా! మనువు నాల్గవవాడు
తామసుండనగను| త్తమునిభ్రాత
పృథివీపతులు కేతు! పృథునరఖ్యాతాదు
లతని పుత్త్రులు పదుగు! రధికబలులు
సత్యక హరివీర! సంజ్ఞులు వేల్పులు
త్రిశిఖనామమువాడు| దేవవిభుడు
మునులు జ్యోతిర్వ్యోమ| ముఖ్యులు హరి పుట్టె
హరిమేథునకు బ్రీతి| హరిణియందు

ఆ. గ్రహనిబద్ధుడయిన| గజరాజు విడిపించి
ప్రాణభయమువలన| బాపి కాచె
హరి దయాసముద్రుడఖిలలోకేశ్వరు
డనిన శుకుని జూచి| యవనివిభుడు.


తా!! ఓ పరీక్షిణ్మహారాజా! మూడవ మనువైన ఉత్తముని తమ్ముడు తామసుడనే వాడు నాల్గవ మనువుగా వున్న సమయమున బలవంతులైన యాతని కుమారులు పదిమంది రాజ్యమునేలుచూండేవారు. అందు సత్యక, హరివీరులు దేవతలుగను, త్రిశికుడు ఇంద్రుని గను, జ్యోతి సువ్యోమాదులు ఋషులుగను ఉండేవారు. ఆ కాలమున హరిణ హరిమేధులకు, విష్ణుమూర్తి పుత్రుడుగా జన్మించాడు. జగత్ప్రభువు, దయాసముద్రుడు అయిన విష్ణుమూర్తి ఒకసారి మొసలి బారిన పడిన గజేంద్రుని రక్షించాడు" అని శుకమర్షి పరీక్షణ్మహారాజుతో చెప్పగా రాజిట్లనెను. (కేతువు , పృథుడు, నరుడు, క్యాతుడు, సత్యకుడు, హరివీరుడు, త్రిశికుడు, జ్యోతిసుడు, హ్యోముడు, హరి యను ఈ పదుగురు తామసుని కుమారులు.)

******************************************************************************************  2

క. నీరాట వనాటములకు
బోరాటం బెట్లు గలిగె| బురుషోత్తముచే
నారాట మెట్లు మానెను
ఘోరాటవిలోన భద్ర| కుంజరమునకున్‌


తా!!"ఓ మునీంద్రా! నీటిలో ఉండే మెసలికిని, అడవియందుండే ఏనుగునకు విరోధమెందుకు వచ్చింది? గజేంద్రుని మొఱను శ్రీ మహావిష్ణువు ఎట్లు నివారించెనో విపులముగా చెప్పు" మన్నాడు.

*******************************************************************************************  3

క. మునినాథ! యీ కథాస్థితి
వినిపింపుము వినగ నాకు| వేడుక పుట్టెన్‌
వినియెద గర్ణేంద్రియములు
బెనుబండువు సేయ మనము| బ్రీతిం బొందన్‌.


తా!! "ఓ శుకమహర్షి! నేనీ కధను వినాలనే ఉత్సాహముతోవున్నాను. దయతో విన్నవించండి. వీనుల విందుగా మనోల్లాసంగా వింటాను" అని కోరాడు.

*******************************************************************************************  4

క. ఏ కథలయందు బుణ్య
శ్లోకుడు హరి సెప్పబడును| సూరిజనముచే
నా కథలు పుణ్యకథలని
యాకర్ణింపుదురు పెద్ద| లతి హర్షమునన్‌



తా!! పండితులచే గొ్ప్ప పుణ్యమూర్తియని కీర్తింపబడే శ్రీమహావిష్ణువు యొక్క గాధలు వినినంతనే మహోన్నత పుణ్యము అబ్బునని పండితులు కడునుత్సాహముతో విన వేడుకతో నుంటారు." అన్నాడు పరీక్షిణ్మహారాజు.

******************************************************************************************   5

వ. ఇవ్విధంబున బ్రాయోపవిష్ణుడైన పరీక్షిన్నరేంద్రుడు
బాదరాయణినడిగెనని చెప్పి సభాసదులైన మునుల
నవలోకించి సూతుండు పరమహర్ష సమేతుండైచెప్పె, నట్లుు
శుకుండు రాజునకిట్లనియె


ఈ విధంగా సర్వసంగపరిత్యాగియై ప్రాయోపవేశం చేయబూనిన శ్రీ పరీక్షిణ్మహారాజు శ్రీ మహావిష్ణుగాధాశ్రవణ ప్రియుడై వ్యాస మహర్షి కుమారుడైన శుకమహర్షిని వేడుకున్నాడు అని సూతమహర్షి శౌనకాదిబ్రహ్మర్షులతో చెప్పాడు. పిమ్మట శుకమహర్షి చెప్పుచున్నాడు.

******************************************************************************************   6

Popular Posts