Google+ Followers

Followers

Monday, 27 April 2015

శ్రీ మహాభారతంలో కథలు --- భీష్మ ప్రతిజ్ఞ


గంగాదేవి తనను వీడి వెళ్ళినప్పటినుండి శంతన మహారాజు వైరాగ్యంతో ఉన్నాడు. కాని ఒక రోజు యమునాతీరానికి వాహ్యాళికని వెళ్ళి అక్కడ జగన్మోహినినా ఉన్న ఓ అమ్మాయిని చూసి ఆ పిల్లను తన భార్యగా చేసుకోవాలనుకున్నాడు.తనను పెళ్ళి చేసుకోమని ఆ అమ్మాయిని అడిగాడు. " నా తండ్రి దాశరాజు. బెస్త్ల్లందరికీ నాయకడు. మీరు ఆయనతో మాట్లాడి ఆయన అనుమతి తీసుకోండి. అది మీకూ నాకూ మంచిది " అని బదులు చెప్పిందాపిల్ల.

శంతనుడు వెళ్ళి దాశరాజును కలిశాడు. ఆయన నవ్వుతూ " మా అమ్మాయిని మీ చేతుల్ల్లో పెడతాను కాని నా కూతురి వల్ల మీకు కలగబోయే పిల్లవాడే మీ తరువాత రాజు కావాలి " అన్నాడు.

శంతనుడు ఒప్పుకోలేదు.

దేవవ్రతుణ్ణి తోసేసి మరొకరికి పట్టాభిషేకం చేయడం కుదరదన్నాడు.

అయితే ఈ పెళ్ళే జరగదన్నాడు దాశరాజు.

దిగులుతో హస్తినాపురానికి తిరిగి వచ్చాడు శంతనుడు. దేవవ్రతుడు తండ్రి మనసులోని విచారాన్ని ఆయన రధసారధి ద్వారా తెలుసుకొని వెంటనే దాశరాజు దగ్గరకు వెళ్ళి " నీ కూతురుకు పుట్టబోయే బిడ్డే రాజవుతాడు. నాకు రాజ్యం అక్కర్లేదు. నా పట్టాభిషేకాన్ని ఇప్పుడే పరిత్యాగం చేస్తున్నాను " అని శపధం చేశాడు. అయినా దాశరాజు భయం పోలేదు. దేవవ్రతుడు కాకయినా అతని సంతతివారెవరైనా ముందు ముందు అవరోధాలు కలిగించవచ్చు కదా అని సందేహించాడు. దేవవ్రతుడు అది గ్రహించి తాను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రమాణం చేశాడు. దీనినే భీష్మ ప్రతిజ్ఞ అంటారు. అప్పుడాపల్లెరాజు సంతోషించి తన కూతుర్ని శంతనుడికిచ్చి పెళ్ళిచేసాడు.

ఆ అమ్మాయి పేరు సత్యవతి.

శంతనుని వల్ల ఆమెకు చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అనే ఇద్దరు పిల్లలు కలిగారు.


శ్రీ మహాభారతంలో కథలు --- దేవవ్రతుడు(భీష్ముడు)


శంతనమహారాజు చంద్ర వంశానికి చెందినవాడు. హస్తినాపురాన్ని పరిపాలిస్తుండేవాడు. ఒకనాడు శంతనమహారాజు గంగా నది వైపు వెళ్ళాడు. అక్కడ ఆయనకు ఓ అమ్మాయి కనిపించింది. రాజుగారికి ఆ అమ్మాయి మీద ప్రేమ కలిగింది. 'నన్ను పెళ్ళి చేసుకుంటావా?'అని అడిగాడు. అందుకా అమ్మాయి నవ్వుతూ'నేనెవరో తెలుసా?' అంది. "నువ్వెవరివైనా సరే, నన్ను వివాహమాడు. నా రాజ్యం,నా డబ్బు,నా ప్రాణం,సర్వస్వం నీ కిచ్చేస్తాను " అని మ్రతిమాలాడు.

అప్పుడు ఆ అమ్మాయి,"మహారాజా! మీ ఇష్టప్రకారమే మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటాను.కాని కొన్ని షరతులు కోరుతాను. వాటికి మీరు ఒప్పుకోవాలి " అంది.

ఆవేశంలో "అలాగే!" అని మాట యిచ్చాడు శంతనుడు.

వెంటనే ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు.

ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు - గంగాదేవి.

పెళ్ళి జరిగాకా గంగాదేవి రాజుగారికి మరింత ఇష్టురాలైంది. వారిద్దరికీ చాలామంది పిల్లలు పుట్టారు. అందరూ పచ్చగా, పనసపండ్లలా వున్నారు. అయితే పుట్టిన ప్రతీ బిడ్డనూ అమె గంగానదిలో వదిలేసేది. ఆవిడ ప్రవర్తన చూసి శంతనుడికి ఒక వంక ఆశ్చర్యం, మరో వంక దుఃఖం వచ్చేవి. కాని ఏమీ అనడానికి వేల్లేదు. ఆవిడ పెట్టిన షరతుల్లో " నువ్వెవరు? ఎక్కడనుండి వచ్చావు? ఇలా ఎందుకు చేస్తున్నావు? " అని అడగడానికి వేల్లేదు. అందుకని శంతనుడు పల్లెత్తు మాట కూడా అనేవాడు కాదు.

ఏడుగురు కొడుకులు పుట్టారు.ఏడుగురూ ఏటిపాలయ్యారు.

చివరకు ఎనిమిదవ బిడ్డ పుట్టాడు. ఆ పిల్లవాణ్ణి కూడా గంగలో వదిలేయ బోతుంటే శంతనుడు సహించలేక " నువ్వు తల్లివి కావు...ఎందుకింత పాపం చేస్తున్నావు? " అని అడిగాడు.

వెంటనే ఆమె "మహారాజా! మీరు మరిచిపోయినట్టున్నారు. నన్ను గురించీ నేను చేసే పనుల గురించీ ఎప్పుడూ ఏమీ అడగనని మాటయిచ్చి వరించారు. ఇక నేను క్షణం కూడా ఇక్కడ వుండను. ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. ఈ పిల్లవాణ్ణి నేను చంపను. నేనొవరో మీకు తెలీదు. మునులూ , మహర్షులు నిత్యం పూజించే గంగానదికి ఆధిదేవతను నేను.

" పూర్వం ఒకానొకప్పుడు అష్ట వసువులు తమ భార్యల్ని వెంటబెట్టుకుని వశిష్ట మహాముని ఆశ్రమ ప్రాంతాలకు విహారానికి వెళ్ళారు. అప్పుడు అక్కడ వారికి నందిని అనే ఆవు కనిపించింది. అది వశిష్టులవారి పాడి ఆవు. అది చాలా అందంగా వుంది! అష్ట వసులు , వారి భార్యలు ఆ గోవును చూసి చాలా ఆనందపడ్డారు. అందులో ఒకామె ఆ ఆవు తనకు కావాలని తన భర్తను అడిగింది. 'ఈ ఆవు వశిష్ట మహామునిది. మనం ఆ ఆవును తీసుకుంటే ఆయన కోపానికి గురి కావల్సి వస్తుంది. వద్దు' అని చెప్పాడు భర్త.

ఆవిడ ససేమీరా వినలేదు. తనకు నందిని కావల్సిందేనని భర్తను బలవంత పెట్టింది. చివరకు ఎలాగైతేనేం అతను 'సరే' అన్నాడు. ఎనిమిది మంది వసువులూ కలసి ఆ ఆవును దూడతో సహా తోలుకుపోయారు.

" వశిష్టుడికీ సంగతి తెలిసింది. పట్టరాని కోపంతో,'మీరంతా మానవులై పుట్టండి' అని శపించాడు.

అష్ట వసువులు పరుగు పరుగున వచ్చి వశిష్టుల వారికి నందినిని అప్పగించి క్షమాపణ చెప్పుకున్నారు. శాపాన్ని ఉపసంహరించమని ప్రార్ధించారు.

కానీ వశిష్ట మహర్షి , 'నా శాపానికి తిరుగులేదు పొండి!' అన్నాడు. వసువులు ప్రాధేయ పడ్డారు.' నా ఆవును తోలుకుపోయిన వసువు మాత్రం భూలోకంలో మహా వైభవంతో చాలాకాలం జీవిస్తాడు. తక్కిన ఏడుగురూ భూలోకంలో పుట్టిన వెంటనే మరణించి శాపవిముక్తులౌతారు. ఇంతకంటే నేను చేయగలిగిందేదీ లేదు!' అని చెప్పాడు. పోని కొంతలో కొంత ఇదైనా మేలే అని సంతోషించి అష్ట వసువులు తిరిగి వెళ్ళిపోయారు.

" ఆ తర్వాత ఆ వసువులే నా దగ్గరకు వచ్చి, 'గంగాభవానీ! నువ్వే మాకు తల్లివి కావాలి. మా కోసం నువ్వు భులోకానికి వెళ్ళు, అక్కడ ఓ పునీతుడ్ని వరించు. మేము నీ పుణ్య గర్భాన జన్మిస్తాం. మాకు త్వరగా శాపవిమోచనం కలగాలి, మేం పుట్టిన వెంటనే గంగలో విడిచి పెట్టు తల్లీ!' అని మొరపెట్టుకున్నారు.అందుకని నేను భులోకానికి వచ్చి మిమ్మల్ని పెళ్ళి చేసుకన్నాను. అష్ట వసువులే మనకు జన్మించారు. ఈ చివరి సంతానాన్ని నేను కొంతకాలం పెంచి మీకు అప్పగిస్తాను, అని చెప్పి గంగాదేవి అంతర్ధానమైంది.

ఆ పిల్లవాడే దేవవ్రతుడు.

వశిష్ట మహాముని వద్ద వేద వేదంగాలు చదువుకున్నాడు.

శుక్రాచార్యుల వారి వద్ద శాస్రాలన్నీ నేర్చుకున్నాడు.

విలువిద్యలో ఆరితేరాడు. రాజనీతి కోవిదుడుగా పేరు పొందాడు.

ఆ దేవవ్రతుడే తర్వాత భీష్ముడయ్యాడు. ఆయన కౌరవ, పాండవ, వంశాలకు పితామహుడు.

శ్రీ మహాభారతంలో కథలు --- గురువు లేని విద్య

.
ధర్మరాజు, ఆయన తమ్ములు వనవాసం చేస్తున్నప్పుడు లోమశుడు అనే మహర్షి వాళ్లని చూడడానికి వచ్చాడు. కుశలప్రశ్నలు అయిన తరువాత లోమశుడు, "ధర్మరాజా! మీరు తీర్థయాత్రలు చెయ్యండి. మనసు కొంత కుదుటపడుతుంది. తీర్థయాత్రలు చేసుకుంటూ అక్కడి స్థల విశేషాలు తెలుసుకుంటూ కాలక్షేపం చెయ్యండి. కాలం ఇట్టే గడిచిపోతుంది" అని సలహా ఇచ్చాడు.

తరువాత పాండవులు పుణ్యక్షేత్రాలు దర్శించడానికి వెళ్ళారు.

అలా వెళ్ళినప్పుడు వాళ్ళకి గంగానది ఒడ్డున రైభ్యుడనే ఋషి ఆశ్రమం కనిపించింది. ఆ పక్కనే వున్నది భరద్వాజుని ఆశ్రమం.

భరద్వాజుడు, రైభ్యుడు మంచి స్నేహితులు. ఇద్దరు బాగా చదువుకున్నారు. నదీతీరాన పక్కపక్కనే ఆశ్రమాలు ఏర్పరుచుకొని నివసిస్తుండేవారు. రైభ్యుడికి ఇద్దరు కొడుకులు - పరావసు, అర్వావసు.

వాళ్ళిద్దరూ కూడా చక్కగా వేదం చదువుకొని గొప్ప పండితులుగా పేరుపొందారు.

భరద్వాజుడికి ఒక్కడే కొడుకు. అతని పేరు యవక్రీతుడు. యవక్రీతుడికి రైభ్యుడన్నా, ఆయన కొడుకులన్నా గిట్టేది కాదు.

పరావసు, అర్వావసులను చూసి యవక్రీతుడు అసూయపడేవాడు. వాళ్ళకన్నా తను గొప్పవాడు కావాలని ఇంద్రుడ్ని గూర్చి తపస్సు చేశాడు. నిప్పుతో ఒళ్ళంతా మండించుకున్నాడు. ఇంద్రుడికి జాలి కలిగింది. భూలోకానికి వచ్చి, 'ఎందుకు నాయనా ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నావు?' అని అడిగాడు. 'ఎవరూ చదవని వేదవిద్యలన్నీ నాకు రావాలి. నేను గొప్ప పండితుణ్ణి కావాలి. దానికోసం నేనీ కఠోర తపం చేస్తున్నాను. గురువుగారి దగ్గరకు పోవడం, కొన్నాళ్ళు అయనకు సేవ చేయటం అవేవి నాకు కుదరవు. అవేవీ లేకుండా విద్యలన్నీ క్షణాలమీద పొందటానికి ఈ తపస్సు చేస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి" అని యవక్రీతుడు వేడుకున్నాడు.

అది విని ఇంద్రుడు నవ్వాడు. "పిచ్చివాడా! నీ తెలివి అపమార్గాన పట్టింది. తక్షణమే వెళ్ళి గురువును ఆశ్రయించు. ఆయన వద్ద శుశ్రూష చేసి వేదవిద్యలన్నీ నేర్చుకో. గురువువద్ద విద్య నేర్చుకుంటేనే ఎవరికైనా చదువు అబ్బుతుంది. అది లేకుండా ఏం చేసినా ప్రయోజనం లేదు" అని చెప్పాడు.

కాని యవక్రీతుడికి ఆయన మాటలు నచ్చలేదు. ఇంకా ఘోరమైన తపస్సు చేశాడు. ఇంద్రుడు మళ్ళీ వచ్చి, "నాయనా! మూర్ఖంగా ఏ పనీ చెయ్యకూడదు. నీ తండ్రిగారికి వేదాలు తెలుసు. ఆయన నీకు నేర్పుతారు. వెళ్ళి వేదవిద్యలన్నీ నేర్చుకో. ఇలా ఒళ్ళు కాల్చుకోవటం మానుకో" అని చెప్పాడు.

యవక్రీతుడికి కోపం వచ్చి, "నేను కోరిన వరం కనుక మీరు ఇవ్వకపోతే నా శరీరంలోని అవయవాలన్నిటినీ విరిచి ఈ అగ్నిగుండంలో పడేస్తాను" అన్నాడు.

అలా వుండగా ఒకనాడు యవక్రీతుడు గంగానదిలో స్నానం చెయ్యడానికి వెళ్ళాడు. అక్కడ ఓ ముసలి బ్రాహ్మణుడు నది ఒడ్డున కూర్చొని పిడికెడు పిడికెడు ఇసుక తీసి నదిలోకి విసురుతున్నాడు. అది చూసి యవక్రీతుడు "ఏం చేస్తున్నావు తాతా?" అని అడిగాడు.

"గంగానది దాటడానికి వంతెన కడుతున్నా" అన్నాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు.

అది విని యవక్రీతుడు పెద్దగా నవ్వాడు. "వేగంగా పోయే ప్రవాహానికి ఇలా ఇసుకతో అడ్డంగా కట్ట వేయడం కుదరని పని. వేరే మార్గం చూడు" అని సలహా ఇచ్చాడు.

"గురువులేకుండానే, అసలు చదవకుండానే, కష్టపడకుండానే విద్య రవాలని కొందరు ఎలా తపస్సు చేస్తున్నారో అలాగే నేనూ గంగానదికి ఇసుకతో వంతెన కడుతున్నా" అని ముసలి బ్రాహ్మణుడు బదులు చెప్పాడు.

అప్పుడు అర్థమైంది ఆ ముసలి బ్రాహ్మణుడు ఎవరో యవక్రీతుడికి! వెంటనే కాళ్ళమీద పడ్డాడు.

ఇంద్రుడు నవ్వుతూ యవక్రీతుణ్ణి దగ్గరకు తీసుకొని, "నీ తండ్రి దగ్గర వేదవిద్యలు నేర్చుకో. అనతికాలంలోనే నువ్వు గొప్ప విద్వాంసుడివి అవుతావు" అని ఆశీర్వదించాడు.

శ్రీ మహాభారతంలో కథలు --- నిష్కమ కర్మ

ఒకసారి వేదవ్యాసుడు ధర్మరాజుకు జాబలి కథ చెప్పాడు.

"పూర్వం జాబలి అనే ముని వుండేవాడు. అతడు నిష్ఠగా తపస్సు చేసుకుంటున్నాడు. అతని నెత్తిమీద పిచికలు గూడు కట్టుకుని,గుడ్లు పెట్టుకొని పిల్లలతో హాయిగా కాపురమున్నాయి. జాబలి దయార్ద్ర హృదయుడు కావటం వలన వాటిని తరిమెయ్యకుండా తన నెత్తిమీద అలాగే ఉంచుకున్నాడు.

'ఆహా! నాకున్న ధర్మనిష్ఠ ఇంకెవరికైనా వుందా!' అనుకుంటూ తననితానే మెచ్చుకునేవాడు. ఒకసారి అశరీరవాణి అతని అహంభావాన్ని ఖండిస్తూ 'నీకెంటే ఎక్కువ ధర్మపరుడు తులాధారుడనే వర్తకుడు. అయితే అతను నీ మాదిరి ఎప్పుడూ గర్వపడలేదు' అంది.

"జాబలికి అసూయ కలిగింది. ఆ తులాధారుడెవరో చూడాలనుకుని విసవిస బయలుదేరాడు. వర్తకం చేసుకుంటున్న అతన్ని చూశాడు.

'అయ్యా వచ్చావా! రా! పిచికలు నెత్తిమీద గూడు కట్టుకుని పిల్లలతో సుఖంగా తిరుగుతున్నా చిత్తవికారం లేకుండా తపస్సు చేస్తున్న దయాసాగరా! ఎంత గొప్పవాడివి నువ్వు!!" అని అమితంగా గౌరవించి ఆదరించాడు తులాధారుడు.

జాబలి ఆశ్చర్యపోయాడు.

'ఈ సంగతి నీకెలా తెలిసింది?' అని అడిగాడు.

'మహర్షీ! నాకు దేనిమీదా, ఎవరిమీదా మమకారం లేదు. ధర్మమార్గంలో సంచరించడ మొక్కటే నాకు తెలుసు. ప్రపంచాన్ని రంగస్థలంగా చూసేందుకు నేను ఎప్పుడూ ప్రయత్నిస్తాను. అందుచేత నా మనస్సు దేనికీ ఆకర్షింపబడక తామరాకు మీద నీటి బొట్టులా వుంటుంది. అందువల్లే నీ గొప్పతనం తెలుసుకోగలిగాను' అన్నాడు తులాధారుడు.

'అయితే నేను ధర్మమార్గాన నడవడం లేదంటావా? నా తపస్సూ, యజ్ఞాలు ధర్మాలూ కావంటావా?' అన్నాడు జబలి కొంచెం కోపంగా.

'అహంకారంతో చేసే తపస్సునీ, ఫలం కోరి చేసే యజ్ఞాన్నీ దేవతలు మెచ్చరు. నిత్యతృప్తి అనేది మంచి యజ్ఞం. దానివల్ల దేవతలూ, మనమూ కూడా తృప్తి పొందుతాము' అన్నాడు తులాధారుడు.

'మరైతే నువ్వీ వ్యాపారం ఎందుకు విడిచిపెట్టవు? ధనాశ కాదా ఇది?' అని అడిగాడు జాబలి.

'అయ్యా! కర్తవ్యాలు విడిచిపెట్టడం తగదు. అయినా మనిద్దరికీ వాదం ఎందుకు! నేను చెప్పినదంతా సత్యమో కాదో అడుగుదాం - ఇన్నాళ్ళూ నువ్వు తండ్రిలా పెంచిన నీ పిచికలను పిలు' అన్నాడు తులాధారుడు.

పిలిచాడు జాబలి.

"అవి ముని కేశపాశంలో నుంచి రివ్వున ఎగిరి ఆకాశమార్గాన నిలబడి 'మేము ధర్మదేవత భటులం. ఆయన ఆజ్ఞవల్ల నిన్ను పరీక్షించడానికి వచ్చాం. మత్సరం మంచిది కాదు. అది సర్వధర్మాలనూ నాశనం చేస్తుంది. అందుచేత స్పర్ధ మాని శ్రద్ధగా అవలంబించాలి. శ్రద్ధలేని తపస్సూ, యజ్ఞాలూ వ్యర్థం. శ్రద్ధతో యాగం చేసినవాడు శుచి కాకపోయిన ఫరవాలేదు. శ్రద్ధ లేకూండా యాగం చేసినవాడు శుచి అయినా ప్రయోజనం శూన్యం. శ్రద్ధ వల్ల దానగుణం అబ్బుతుంది. అందువల్ల మేలు కలుగుతుంది. సర్వ సుఖాలూ చేకూరుతాయి ' అని వివరించి మాయమయ్యాయి.

'అయ్యా! మునుల నుంచి తత్త్వజ్ఞానం తెలుసుకోకపోవడం వల్ల నాకీ అసూయ కలిగింది. ఎవరికి వారు తమ తమ విధానాలైన కర్మలు చెయ్యటం మంచిదని నీ నుంచి గ్రహించాను. కాని వాటివల్ల ప్రయోజనం ఆశించకూడదు. అదీ నీ నుంచే తెలుసుకున్నాను. వెళ్ళొస్తాను' అని చెప్పి తులాధారుడి దగ్గర సెలవు తీసుకున్నాడు.

"ధర్మరాజా! ఆచార ధర్మాలు అలాంటివి. సూర్యుడి రూపం నీళ్లలో ప్రతిబింబించినట్లు ఆత్మస్వరూపం నిర్మల బుద్ధిలో ప్రతిబింబిస్తుంది. ఈ శరీరం యావత్తు మహాపట్టణం. దానికి బుద్ధి రాణి. సర్వ విషయాలూ చర్చించే మనస్సు మంత్రి. విషయాలు అయుదూ పురోహితులు. చెవి, ముక్కు మొదలైన ఇంద్రియాలు పౌరులు. ఈ శరీర సామ్రాజ్యంలో రజోగుణం, తమోగుణం అనే మోసగాళ్ళున్నారు. మనస్సు చెప్పిన మాట బుద్ధి వినకపోయిందంటే ఆ మోసగాళ్ల బారినపడి చెడిపోతుంది. మనస్సు, బుద్ధి కలిసి ఏకముఖంగా ప్రయాణిస్తే రాజ్యపాలన చక్కగా సాగుతుంది. శాశ్వత సౌఖ్యం లభిస్తుంది" అని చెప్పాడు వేదవ్యాసుడు.

"మహర్షీ! కార్యసమీక్ష త్వరగా చెయ్యడం మంచిదా? నిదానంగా చెయ్యడం మంచిదా?" అని అడిగాడు ధర్మరాజు.

"కార్యవిచారం చెయ్యడంలో తొందర ఎప్పుడూ పనికిరాదు" అని చెబుతూ ఒక కథ చెప్పాడు వ్యాసుడు.

"మేధాతిథి అనే మునికి చిరకారి అనే కొడుకుండేవాడు. అతడు ప్రతి పనీ బాగా ఆలోచించి చేసేవాడు. యుక్తాయుక్త విచక్షణ తెలిసినవాడు. అందుకే అతనికి ఆ పేరు వచ్చింది. ఒకనాడు మేధాతిథికి భార్య మీద కోపం వచ్చింది. ఆమెను చంపెయ్యమని చిరకారిని ఆదేశించి వెళ్ళిపోయాడాయన.

'నవమాసాలు మోసే కన్నతల్లి కంటే ఈ భూమి మీద ఎక్కువ ఏదీ లేదు. తల్లి దైవమంటారు. ఆమెను చంపటం కంటే పాపం వుందా! కాని తండ్రి ఆజ్ఞ మీరకూడదంటారు. ఏంచెయ్యను? ఇద్దరిమీదా గౌరవం వున్నవాడనే నేను!' అనుకుంటూ చిరకారి చాలాసేపు ఆలోచిస్తూ వుండిపోయాడు. ఆలోచనలో చాలా సమయం గడిచిపోయింది. ఏదో కోపంలో అన్న మాటలు పట్టుకుని కొడుకు తల్లిని ఎక్కడ చంపేశాడోనని విచారపడుతూ, తన కొడుకు అలా చెయ్యడని ధైర్యం తెచ్చుకుంటూ ఆశ్రమానికి వచ్చాడు మేధాతిథి. తండ్రిని చూస్తూనే చిరికారి చేతిలో వున్న కత్తి కిందపడేసి అతని కాళ్ళమీద పడ్డాడు. భార్య వచ్చి నమస్కరించింది. కన్నీటితో ముని భార్యాతనయుల్ని గుండెకు హత్తుకున్నాడు. కొడుకును మెచ్చుకుని దీవించాడు.

"ధర్మరాజా!కార్యవిచారం చాలా ధైర్యంగా, జాగ్రత్తగా చెయ్యాలి. తొందరపడి ఏ పని చేసినా చివరకు పశ్చాతాప పడవలసి వస్తుంది" అని ముగించాడు వ్యాసమహర్షి.

శ్రీ మహాభారతంలో కథలు --- శీలసంపద


ధర్మరాజు ఇంద్రప్రస్థంలో రాజసూయయాగం చేశాడు. అతని సభావైభవం చూసి అసూయపడి తండ్రి దగ్గరకు వెళ్ళి తన దుగ్ధ వెళ్ళబోసుకున్నాడు దుర్యోధనుడు.

"నాయనా! నీకుమాత్రం తక్కువ ఐశ్వర్యమా? అయితే ధర్మరాజు నీకంటే ఎక్కువగా ప్రకాశించడానికి కారణం అతడు శీలవంతుడు కావడమే. శీలవంతులను లక్ష్మి వరిస్తుంది. కనుక నువ్వు కూడా శీలవంతుడవై సకల సంపదలూ పొందు" అంటూ ధృతరాష్ట్రుడు కొడిక్కి ఓ ఇతిహాసం చెప్పాడు.

"ప్రహ్లాదుడు రాక్షస కులశ్రేష్ఠుడు. సకల విద్యాపారంగతుడు. జనరంజకంగా పరిపాలన చేయగల సమర్ధుడు. ఇంద్ర రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని ముల్లోకాలనూ ధర్మయుక్తంగా పరిపాలించసాగాడు. పదవీభ్రష్టుడైన ఇంద్రుడు తనకు ముల్లోకాధిపత్యం మళ్ళీ వచ్చే విధానం చెప్పవలసిందని బృహస్పతిని ప్రార్థించాడు.

బృహస్పతి భార్గవుణ్ణి అడగమన్నాడు.

ఇంద్రుడు వెళ్ళి భార్గవుణ్ణి ఆశ్రయించాడు.

'అతనికి అంత శక్తి ఎలా వచ్చిందో అతన్నే అడిగి తెలుసుకొని ఉపాయంగా ఆ శక్తిని అడిగి పుచ్చుకో' అని సలహా ఇచ్చాడు భార్గవుడు.

"ఇంద్రుడు విప్రుడి వేషం ధరించి ప్రహ్లాదుడికి శిష్యుడై భక్తితో సేవలు చెయ్యడం ప్రారంభించాడు. చాలాకాలం గడిచింది. ప్రహ్లాదుడు ప్రసన్నుడయ్యాడు.

'నాయనా! ఏమి కోరి నన్ను సేవిస్తున్నావు?' అని అడిగాడు.

'అయ్యా! మీకు త్రిలోకాధిపత్యం ఎలా వచ్చిందో తెలుసుకోవాలని వుంది ' అన్నాడు శచీపతి వినయంగా.

'ఏముంది! నేనెప్పుడూ రాజుననే గర్వంతో ప్రవర్తించను. ఎవరినీ నొప్పించను. ఈర్ష్యా, అసూయ, ద్వేషం, పగ మొదలైన దుర్గుణాలేవీ మనస్సులోకి రానివ్వను. ఎవరన్నా ఏదైనా అడిగితే లేదనకుండా సంతోషపెడతాను. పురాకృత పుణ్యం వల్ల బ్రహ్మర్షులు మెచ్చుకునే శీలం వున్నది. కనుక ఇంత మహోన్నత పదవి లభించింది నాకు' అన్నాడు ప్రహ్లాదుడు.

'అయ్యా! నిజంగా నువ్వు మహాత్ముడవు. దానశీలివి. నాయందు దయదలచి నీ శీలం నాకివ్వు' అని ఇంద్రుడు దీనంగా యాచించాడు.

'అయ్యో పాపం! ఎంత దీనంగా అర్థిస్తున్నాడు' అనుకుని 'సరే' అన్నాడు ప్రహ్లాదుడు.

ఇంద్రుడు పన్నిన పన్నాగంలో ప్రహ్లాదుడు చిక్కుకున్నాడు.

ఆ తరువాత ప్రహ్లాదుడి శరీరంలోంచి మహా తేజస్సుతో ఒక పురుషుడు బయటకు వచ్చాడు.

'నువ్వెవరు?' ప్రశ్నించాడు ప్రహ్లాదుడు.

'నేను నీ శీలాన్ని. నువ్వు నన్ను ఆ విప్రుడికి దానం చేశావుగా! అతని దగ్గరకు వెళ్ళిపోతున్నాను' అని వెనుదిరగకుండా వెళ్ళిపోయాడా దివ్యరూపుడు. ఆ వెనుకే ఒక్కొక్క వెలుగూ ప్రహ్లాదుడి శరీరం నుంచి మెల్లిగా బయటకు జారుకుంది.

"నువ్వెవరు మహానుభావా?"

'నేను సత్యాన్ని. శీలాన్ని ఆశ్రయించి ఉంటాను. నేను వేడుతున్నాను'

'నువ్వెవరు?'

'నేను ఋజువర్తనను. సత్యాన్ని ఆశ్రయించి బతుకుతాను. పోతున్నాను'.

'మహాశయా! నువ్వెవరు?'

'నేను బలాన్ని. సత్ప్రవర్తనకు తోడుగా ఉంటాను. శలవు.'

ప్రహ్లాదుడి విషాదానికి అవధులు లేవు.

అతను విచారిస్తుంటే అతిలోక సౌందర్యవతియైన ఒక స్త్రీ అతని శరీరంలోంచి బయటకు వచ్చింది.

'అమ్మా! నువ్వెవరు?'

'నేను లక్ష్మిని. బలం ఎక్కడుంటే అక్కడ వుంటాను. వేడుతున్నాను.'

'అయ్యో తల్లీ! నువ్వూ నన్ను విడిచిపోతున్నావా? ఇంతకూ అంత వినయంగా ఇన్నాళ్ళూ నన్ను సేవించిన ఆ విప్రుడెవరు?' అని సిరిని అడిగాడు ప్రహ్లాదుడు.

'అతను ఇంద్రుడు. నీ వైభవాన్ని ఎగరేసుకుపోవడం కోసం వచ్చాడు. నువ్వు అతని మాయలో పడి నీ శీలాన్ని అతనికి ధారపోశావు. శీలం వల్ల ధర్మం, ధర్మం వల్ల సత్యం, సత్యాన్ని అంటి మంచి నడవడి, దానివల్ల బలం, బలాన్ని ఆశ్రయించి నేను వుంటాం. కనుకనే అన్నిటికి 'శీలం' మూలమని చెప్తారు. నువ్వు అది పోగొట్టుకున్నావు. కనుక ఇంక నీ దగ్గర వుండటం అసంభవం' అని చెప్పి వెళ్ళిపోయింది శ్రీదేవి.

"కనుక - దుర్యోధనా! శీలవంతుడవై వర్థిల్లు నాయనా" అని కొడుక్కి హితవు చెప్పాడు ధృతరాష్ట్రుడు.

సకల జీవుల పట్ల దయతో వుండటం, ఎవరికీ ద్రోహం తలపెట్టకుండా పరులకు ఓపినంతవరకూ మేలు చేయడం, ఎదుటివాడు తప్పుచేస్తే వాడు సిగ్గుపడేలా కాక తన దోషాన్ని చక్కదిద్దుకునేలా బోధించటం, అందరూ మెచ్చుకునేటట్టు మంచిగా ప్రవర్తించడం, పేరాశను విడిచిపెట్టడం శీలవంతుల లక్షణాలు.

శ్రీ మహాభారతంలో కథలు --- కాకి - హంస


పూర్వం ఒకానొక ద్వీపాన్ని ధర్మవర్తి అనే రాజు పాలించేవాడు. ఆ రాజుగారి పట్టణంలో ఒక వర్తకుడుండేవాడు. చాలా మంచివాడు. గొప్ప భాగ్యవంతుడు. ఓ రోజు ఒక కాకి అతని పంచన చేరింది. అతని కొడుకులు దానికి ఎంగిలి మెతుకులు పెట్టి పెంచారు. అది బాగా బలిసి ఏ పక్షులూ తనకు సరిరావని విర్రవీగుతూండేది.

ఒకనాడు సముద్రతీరంలో కొన్ని రాజహంసలు విహరిస్తున్నాయి. వాటిని కాకికి చూపించి "అన్ని పక్షులు కంటే బలమైనదానివి నువ్వు! ఆ హంసల కంటె ఎత్తు ఎగరాలి. సరేనా" అన్నారు వర్తకుని పిల్లలు.

ఎంగిళ్ళు తిని బలిసిన ఆ వాయసం తారతమ్యజ్ఞానం లేక హంసల దగ్గరకు వెళ్ళి తనతో పందానికి రమ్మంది. హంసలన్నీ పకపక నవ్వాయి.

"మానస సరోవరంలో ఉంటాం. మహా బలవంతులం. హంసలతో సరియైన కాకులు లోకంలో ఉన్నట్లు ఎప్పుడైనా,ఎక్కడైనా విన్నావా?" అన్నాయి.

"నూటొక్క గతులలో పరుగెత్తడం చేతనౌను నాకు! ఒక్కొక్క రకం గమనంలో నూరు యోజనాలు వెళ్తాను. మీరెలా కావాలంటే అలా ఎగురుదాం - కావాలంటే పందెం కాద్దాం" అంది కాకి.

"ఆ గతులూ గమనాలూ మాకు తెలీదు! మామూలుగా సముద్రం మీద నిటారుగా ఎగురుదాం. మేమంతా రావటం వృథా. మాలో ఏదో ఒక హంస నీతో పోటీకి వస్తుంది" అన్నాయి మరాళాలు.

అనటమే తడవు ఒక హంస గుంపులోంచి బయటకు వచ్చింది. కాకి కూడా దాని వెనకాలే వెళ్ళింది. రెండూ సముద్రం మీదుగా ఎగరడం మొదలుపెట్టాయి. హంస నెమ్మదిగా వెళుతూంటే కాకి దానికి తన విన్యాసాలను చూపిస్తోంది. హంసను దాటిపోయి, మళ్ళీ వెనక్కి వచ్చి ఎగతాళిగా పిలవడం, ముక్కుమీద ముక్కు మోపడం, జుట్టు రేపుకుని తిరగడం, ఈకలు ఈకలతో రాయడం, నవ్వడం మొదలైన పనులన్నీ చేసింది. హంస చిరునవ్వు నవ్వి ఊరుకుంది. కాసేపటికి కాకి అలసిపోయింది. అప్పుడు పొడుగ్గా ఎగసి పడమరకు పరుగెత్తింది రాయంచ. కాకి ఇంక ఎంతమాత్రం ఎగరలేక రొప్పుతూ బిక్కమొహం వేసింది. హంసను మించలేకపోగా ప్రాణభీతితో వ్యాకులపడింది. 'అయ్యో! నా అవయవాలన్నీ వికలమైపోయాయి. కాసేపు ఎక్కడైనా ఆగుదామంటే పర్వతాలూ, చెట్లూ, లతలూ ఏవి లేవిక్కడ. ఈ సముద్రంలో పడితే మరణమే గతి' అనుకుంటూ భయపడుతూ కళ్ళు తేలేసింది కాకి.

అది చూసి హంస "నీకు చాలా గమనాలు వచ్చన్నావే. గొప్ప గొప్ప విన్యాసాలు చేస్తానన్నావు. ఒక్కటీ చూపవేం వాయసరాజమా?" అంది.

కాకి సిగ్గుపడింది.

అప్పటికే అది సముద్రంలోకి దిగబడి పోవడానికి సిద్ధంగా వుంది. "ఎంగిళ్లు తిని గర్వంతో కన్నూ మిన్నూ గానక నా కెదురెవరూ లేరనీ, ఎంతటి బలవంతుల్నయినా గెలవగలనని అనుకునేదాన్ని. నా సామర్ధ్యమేమిటో నాకిపుడు తెలిసివచ్చింది. నా యందు దయచూపి నన్ను రక్షించు" అంటూ ఆర్తనాదం చేసింది కాకి. నీళ్ళలో మునిగిపోతూ "కావుమని" దీనంగా అరుస్తున్న కాకిని చూసి జాలిపడి హంస తన కాళ్లతో దాని శరీరాన్ని పైకి లాగింది. చావు తప్పించింది.

"ఇంకెప్పుడూ గొప్పలు పోకు" అని మందలించి దానిని తీరానికి విసిరి, ఎగిరిపోయింది రాజహంస.

కాకి లెంపలేసుకుంది.

"అలాగే - వైశ్యపుత్రుల ఎంగిళ్లు తిన్న కాకిలాగ నువ్వు కూడా కౌరవుల ఎంగిళ్ళు తిని అర్జునుణ్ణి ధిక్కరిస్తున్నావు. దీనివల్ల చేటు కలుగుతుంది సుమా!! హెచ్చులకు పోకు" అని యుద్ధభూమిలో డాంబికాలు పలుకుతున్న కర్ణుడికి హితవు చెప్పాడు శల్యుడు.

శ్రీ మహాభారతంలో కథలు --- సువర్ణష్ఠీవిఒకనాడు సృంజయ మహారాజు కొలువు కిటకిటలాడుతోంది. ఎత్తయిన సింహాసనం మీద నారదమహర్షి కూర్చుని ఉన్నాడు. మహారాజుతో పాటు రాజపురోహితులందరూ ఆ మహర్షిని భక్తిశ్రద్ధలతో పూజించారు.

"మునీంద్రా! మహారాజు మీకు కావలసినవాడు. పైగా ధర్మపరుడు. నిరంతరం అన్నదానాలు చేస్తూ వుంటాడు. మీలాంటి పెద్దల అనుగ్రహం ఉండి కూడా ఆయన కోరిక తీరకపోవడం భావ్యమా?" అని ఒక బ్రాహ్మణుడు నారదుణ్ణి వినయంగా ప్రశ్నించాడు.

"ఆలాగా! ఆ సంగతి నాకు తెలీదు. మహారాజా! ఏమిటి మీ దిగులు! ఇన్నాళ్ళూ నాకు ఎందుకు చెప్పలేదు?" అని నారదుడు అడిగాడు.

"మహర్షీ! మరేం లేదు. గుణవంతుడూ, రూపవంతుడూ అయిన కొడుకు కావాలి నాకు" అన్నాడు సృంజయ మహారాజు.

"అంతే కదా!"

"అంతేకాదు స్వామీ! వాడి మలమూత్రాలు, చెమట, కన్నీళ్ళు, లాలాజలం అంతా బంగారం కావాలి. అలాంటి కొడుకు కావాలి. ఈ వరం నాకు ప్రసాదించండి"

నారదుడు అనుగ్రహించాడు.

సృంజయ మహారాజు పొంగిపోయాడు. సార్వభౌముడై భూమినంతటినీ ఏలుతున్నా సంతానం లేని దిగులు ఇన్నాళ్ళూ అయనను వేధించింది. ఇప్పుడది లేదు. మహాముని వరం వల్ల ఆ కోరిక కూడా తీరబోతోంది. రాజు పరమానందభరితుడయ్యాడు.

మహర్షి మాట ప్రకారం కొన్నాళ్ళకు కొడుకు పుట్టాడు. వాడికి 'సువర్ణష్ఠీవి' అని సృంజయుడు పేరు పెట్టాడు. అతి గారాబంగా వాడ్ని పెంచుకున్నాడు. వాడి వల్ల లభించే బంగారంతో కోట మొదలు పీట వరకూ అన్ని వస్తువులూ బంగారుమయం చేసి వైభవంగా ప్రకాశించాడు.

అలా కొంతకాలం గడిచింది.

ఒకరోజు కొందరు దొంగలు అంతఃపురంలో ప్రవేశించి సువర్ణష్ఠీవిని అపహరించుకుపోయారు. దూరంగా ఒక అడవికి తీసుకువెళ్ళి, అతని కడుపులో బంగారం ఉంటుందనుకొని వాడి పొట్ట చీల్చి చూశారు. మాంసం, ఎముకలు, నెత్తురు తప్పితే ఇంకేం కనిపించలేదు.

అందులో బంగారం లేకపోయేసరికి ఆ శవానక్కడే పారేసి వెళ్ళారు దొంగలు.

తెల్లవారాక సృంజయుడు కొడుకు కోసం అంతఃపురమంతా వెతికించాడు. కనిపించకపోయేసరికి కంగారుపడి నేల నాలుగు చెరగులకూ సేవకుల్ని పంపాడు. చివరకు అడవిలో కొడుకు శవంచూసి బావురుమని ఏడ్చాడు. మృతదేహానికి అంత్యక్రియలు జరిగాక కూడా వాణ్ణే తలుచుకుని కుమిలి కుమిలి రోదించసాగాడు.

సరిగ్గా అదే సమయంలో మళ్ళీ నారదులవారు వచ్చారు. "మహారాజా! నువ్వు ఏడిస్తే మాత్రం చనిపోయిన నీ కొడుకు ప్రాణంతో తిరిగి వస్తాడా? కాలాన్ని తప్పించుకోవాలనుకోవడం అవివేకం. గుణవంతుడు, రూపసి అయిన కొడుకును కోరుకున్నావు. బాగానే వుంది. అంతటితో ఆగక వాడేది ముట్టుకుంటే అది బంగారపు ముద్ద కావాలంటివి! మనిషికి ఆశ ఉండవచ్చు కాని పేరాశ వుండకూడదు. ఉంటే ఇదిగో ఫలితం ఇలాగే ఉంటుంది" అని ఓదారుస్తూనే దేవర్షి మెత్తగా మందలించాడు.

వైభవంగా రాజ్యాన్ని పాలించి, దానధర్మాలు చేసి, పుణ్యాత్ములుగా పేరుపొంది, దేవతల ఆశీస్సులందుకుని కూడా చిరంజీవులు కాలేకపోయిన మరుత్త మహారాజు, అంగరాజు, శిబిచక్రవర్తుల చరిత్రలు వివరించాడు. అ తర్వాత శ్రీరామచంద్ర ప్రభువు గురించి, భగీరథుడి గురించి, శశిబిందుడి గురించి రకరకాల కథలు చెప్పాడు నారదుడు.

"మునీంద్రా! నువ్వు చెప్పిన కథలన్నీ విన్నాక నా పుత్రశోకం తగ్గింది. నీ దయవల్ల నా మనస్సు నిర్మలమయింది" అని సృంజయుడు నారదుడికి నమస్కరించాడు.

నారదుడు సంతోషించి, "నీకేం వరం కవాలో అడుగు ఇస్తాను" అన్నాడు.

"దేవా! నువ్వు ప్రసన్నుడవయ్యావు! ఇంతకంటే కావల్సిందేముంది నాకు?" అన్నాడు వినయంగా మహారాజు.

"సృంజయా! దొంగల మూర్ఖత్వానికి బలైపోయిన నీ కొడుకును మళ్ళీ నీకు తెచ్చి ఇస్తాను. శోకం మానెయ్యి" అన్నాడు నారదుడు.

ఆ దీవెనతో సువర్ణష్ఠీవి సజీవంగా చిరునవ్వు నవ్వుతూ కళ్ళెదుట కనిపించాడు. కొడుకుని చూసి బ్రహ్మానందపడిపోయాడు సృంజయుడు.

తర్వాత సువర్ణష్ఠీవి వివాహం చేసుకొని, సంతానవంతుడై భోగభాగ్యాలు అనుభవిస్తూ, యాగాలు చేస్తూ, దానాలు చేస్తూ చాలాకాలం సుఖంగా వున్నాడు.

శ్రీ మహాభారతంలో కథలు --- అష్టావక్రుడుపాండవులు తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ఒకనాడు ఉద్దాలక మహర్షి ఆశ్రమం చేరుకున్నారు. లోమశుడు ఆ మహర్షికి సంబంధించిన ఒక కథను ధర్మరాజుకు చెప్పాడు.

వేదాంతం ఉపదేశించగల పెద్దలలో గట్టివాడు ఉద్దాలకుడు. ఆయన వద్ద కహోలుడనే శిష్యుడుండేవాడు. అతను చాలా బుద్ధిమంతుడు. మంచి గుణగణాలు, నీతినియమాలు కలిగినవాడు. కాని అతని దగ్గర ఒకే ఒక లోపం వుంది. అదేమిటంటే నిలకడ లేదు మనిషిదగ్గర. అందుకని ఏ విద్యా పూర్తిగా నేర్చుకోలేకపోయాడు.

అయినప్పటికీ ఉద్దాలకుడికి కహోలుడి పట్ల ప్రేమ వుండేది. అందుకని తన కూతురు సుజాతనిచ్చి పెళ్ళి చేశాడు.

కహోలుడికీ, సుజాతకూ ఒక కొడుకు కలిగాడు. తల్లి కడుపులో వున్నప్పుడే తాత చదివే వేదాలన్నీ విని నేర్చుకున్నాడు. కాని, తండ్రి కహోలుడు వేదాధ్యయనం చేసేటప్పుడు తప్పులు దొర్లేవి. ఆ అపశబ్దాలు వినలేక ఆ పిల్లవాడు తల్లి గర్భంలోనే వంకరలు వంకరలుగా ముడుచుకుపోయేవాడు. ఆ వంకరలు చివరకు అతని శరీరంలో అలాగే నిలిచిపోయాయి. అలా ఎనిమిది వంకర్లతో పుట్టడంవల్ల అతనికి అష్టావక్రుడని పేరు వచ్చింది.

అష్టావక్రుడు చిన్నతనంలోనే గొప్ప విద్వాంసుడైనాడు. పన్నెండేళ్ళు వచ్చేసరికి వేద వేదాంగాలన్నీ చదువుకున్నాడు. ఒకసారి జనకమహారాజు మిథిలా నగరంలో పెద్దయాగం చేస్తున్నాడని తెలిసింది. తన బంధువూ, మిత్రుడూ అయిన సువేదకేతువును వెంటపెట్టుకొని అష్టావక్రుడు మిథిలకు వెళ్ళాడు. అక్కడ రాజభటులు వాళ్ళిద్దర్నీ లోపలకు పోనీయలేదు. అప్పుడు అష్టావక్రుడు రాజభటులతో " నాయనలారా! గుడ్డివాళ్ళకు,కుంటివాళ్లకు, స్త్రీలకు మహారాజే తప్పుకుని దారి ఇవ్వాలి. వేదాలు,ఉపనిషత్తులూ చదువుకున్న విద్వాంసులూ, పెద్దలూ దారిన పోతుంటే - రాజైనా సరే - వారిని పక్కకు తొలగిపొమ్మనకూడదు. ఇది నేను చెబుతోంది కాదు, శాస్త్రం చెబుతోంది" అన్నాడు.

ఈ వాదం రాజుగారి చెవికి చేరింది.

ఆ పిల్లవాడి తెలివితేటలకు ఆనందపడి 'నిజమే! ఆ బాలకుడు చెప్పినదాంట్లో అబద్ధమేమీ లేదు. నిప్పుకి మన తన భేదం లేదు. కాలుతుంది,కాలుస్తుంది. పిల్లవాడు చిన్నవాడైనా ఉద్ధండుడిలా వున్నాడు' అనుకొని, " ఆ బాలకులిద్దర్నీ వెంటనే లోపలికి పంపండి" అని భటుల్ని ఆదేశించాడు.

ఆజ్ఞ ప్రకారం అష్టావక్రుడ్నీ సువేదకేతువునీ లోపలికి పంపారు.

కానీ, మరోచోట ఇంకో ద్వారపాలకుడు అడ్డగించాడు. "ఇక్కడికి మీబోటి చిన్నపిల్లలు రాకూడదు. వేదం చదివిన పెద్దలు మాత్రమే రావాలి" అన్నాడు.

"మేం చిన్నపిల్లలం కాము. వేదాలు అధ్యయనం చేసాం. అయినా పైపై మెరుగులు చూసి, ఆకారం చూసి, వయస్సు చూసి ఎవర్నీ పెద్ద, చిన్న అని అంచనా వెయ్యకూడదు. ఆకారాన్ని బట్టి పాండిత్యం రాదు. వయస్సు వచ్చినంత మాత్రాన వృద్ధులు గారు - జ్ఞానం చేత పండినవారే వృద్ధులు. తెలివి వున్నవాడే మనిషి" అని సుదీర్ఘంగా ప్రవచించాడు అష్టావక్రుడు.

ఇలా వాదన జరుగుతున్న సమయంలో రాజుగారు అక్కడకు వచ్చి, "మా పండితులందరూ మహా విద్వాంసులు. అటువంటి వాళ్ళతో వాదించాలనే కోరిక నీకెందుకు కలిగిందో నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ నువ్వు ఆ వాదంలో ఓడిపోతే వాళ్ళు నిన్ను సముద్రంలోకి తోస్తారు. అందుకు సిద్ధమేనా?" అని అడిగాడు.

"మహారాజా! మీరు చెప్పినట్లే కానివ్వండి. కాని వాళ్లు నాతో వాదించలేరు. ఆ సంగతి నాకు తెలుసు. పండితులమనీ, అన్నీ తెలిసినవాళ్ళమని అహంభావంతో వున్నారు వాళ్ళు. వాళ్ళు చేసిన అవమానం వల్లే మా తండ్రి సముద్రంలో దూకి ప్రాణాలు పోగొట్టుకున్నట్టు మా అమ్మ చెప్పింది. అందుకని పట్టుదలతో వచ్చాను. మీపండితుల్ని ఎదిరించి వాదించగలను. లేకపోతే నేను కూడా సముద్రంలోకి దూకుతాను. ముందు నన్ను లోపలికి రానీయండి" అని కోరాడు అష్టావక్రుడు.

అందుకు జనక మహారాజు ఒప్పుకున్నాడు. అష్టావక్రుడి ప్రశ్నలకు ఎవరూ సరిగా సమాధానం చెప్పలేకపోయారు.

అష్టావక్రుడు గెలిచినట్టు ప్రకటించారు. పందెం ప్రకారం వాదంలో ఓడిపోయిన వాళ్ళందరూ సముద్రంలో దూకారు. తన ప్రతిభాపాండిత్యాలతో తండ్రి కహోలుడికి ఆత్మశాంతి కలిగించాడని అష్టావక్రుణ్ణి లోకం కొనియాడింది.

అదీ కథ.

కనుక చదువు సంధ్యలు లేని తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు స్వయంకృషితో, పెద్దల ప్రోత్సాహంతో మేధావులుగా రూపొందవచ్చు. పండితుడి కడుపున పరమ శుంఠ జన్మించవచ్చు. దేహబలం లేని తండ్రికి బలాఢ్యులైన పిల్లలు పుట్టవచ్చు. కేవలం అనువంశిక లక్షణాల్ని బట్టి, పైపై ఆకారాలను బట్టి ఎవర్నీ అంచనా వెయ్యకూడదు.

శ్రీ మహాభారతంలో కథలు --- బంగారు ముంగిస


ధర్మరాజు వదిలిన యాగాశ్వం పార్థుడి సంరక్షణలో సమస్త భూమండలాల్నీ దిగ్విజయంగా చుట్టి వచ్చింది. దక్షప్రజాపతి యాగవైభవాన్ని గుర్తుచేస్తూ ధర్మతనయుడు నిర్విఘ్నంగా అశ్వమేథయాగాన్ని ముగించాడు. వ్యాసమహాముని, దేవతలు, మునులు ధర్మరాజుని ఆశీర్వదించారు. ఋత్విజులకు ఒక్కొక్కరికీ కోటీవేల బంగారు నాణాలను ఇచ్చి తన రాజ్యమంతటినీ వేదవ్యాసమహామునికి దక్షిణగా సమర్పించాడు ధర్మరాజు.

"ధర్మతనయా! నువ్వు నాకు దక్షిణగా రాజ్యమంతా ఇచ్చావు. కాని, నాకు బంగారం కావాలి. భూమి అక్కర్లేదు. కనుక ఈ భూమికి వెలకట్టి దానికి తగిన బంగారం ఇచ్చి ఈ భూమిని నువ్వే తీసుకో" అన్నాడు మహర్షి.

"స్వామీ! అశ్వమేథయాగానికి భూమి దక్షిణ అంటారు. అందుకే తమకు భూమిని సమర్పించుకున్నాను. నేను అరణ్యానికి వెళ్ళి సుఖంగా వుంటానిక. అంతేకాని బ్రహ్మధనాన్ని తిసుకుంటానా?" అన్నాడు ధర్మరాజు.

"రాజా! మేము అమ్ముతామంటే నువ్వు భూమిని కొనుక్కోవడంలో తప్పేముంది? ఇందులో ఏ దోషం లేదు, తీసుకో" అన్నాడు వ్యాసముని.

"సరే అయితే!" అంటూ కోటికోట్ల మాడలు కుప్పగా పోసి, "ఇది ఈ భూమికి వెల" అని చెప్పి ఆ ధనాన్ని వ్యాసమహర్షికి అర్పించాడు ధర్మరాజు. ఆయన అదంతా విప్రులకు, మిగతావాళ్ళకు పంచిపెట్టాడు. బంగారు పాత్రలు, యూపస్తంభాలు, తోరణాలను అందరికీ దానం చేశాడు ధర్మరాజు.

"రండి! మీకేం కావాలో చెప్పండి. ఇవిగో వస్త్రాలు! ధరించండి! రకరకాల బంగారు పాత్రలివిగో - స్వీకరించండి" అంటూ అందర్నీ పిలిచి పిలిచి ఇచ్చాడు భీముడు.

ఉపాధ్యాయుడు కానివాడు, వేదవేదాంగ నిరతుడు కానివాడు, వ్రతనిష్ఠలేనివాడు ఆ సదస్సులో లేనేలేరు. మునులందరూ ఆ యాగాన్ని మెచ్చుకున్నారు. సిద్ధులూ విప్రులూ అక్షింతలు జల్లుతూ ఆశీర్వదించారు.

తన భాగానికి వచ్చిన బంగారమంతా కుంతీదేవికి ఇచ్చాడు వ్యాసుడు. ఆమె దాన్ని అందరికీ దానం చేసింది. యజ్ఞానికి వచ్చిన రాజులందరికీ మణిభూషణాలు, ఏనుగులు, గుర్రాలు ఇచ్చాడు ధర్మరాజు. కృష్ణుణ్ణి విశేషంగ సత్కరించాడు. ఆనాడు ధర్మరాజు చేసిన దానాల వల్ల సమస్త ప్రజలూ తృప్తి పొందారు. అయితే, అప్పుడొక చిత్రం జరిగింది.

ఒక కలుగులోంచి ఒక ముంగిస బయటకి వచ్చి, "అబ్బ! ఎంత గొప్పగా పొగుడుతున్నారు! ఎంత దానం చేస్తే మాత్రం మరీ అంతగా మెచ్చాలా! సక్తుప్రస్ఫుడు చేసిన ధర్మంలో ఏ వంతు ఈ అశ్వమేథయాగం?!" అంటూ మూతి విరిచింది.

ఆ మాటలు విని అంతా ఆశ్చర్యపోయారు. "అదేమిటి అలా అంటున్నావు. ఈ యాగంలో నీకేం లోటు కనిపించింది?" అని విప్రులు ముంగిసను ప్రశ్నించారు.

"అయ్యా! ఆకలిని, తృష్ణను జయించినవాడు సక్తుప్రస్ఫుడు. అతనొక బీద బ్రాహ్మణుడు. ఉంచవృత్తితో జీవించేవాడు. నా, నేను అన్న ప్రీతిని త్యజించి సంపూర్ణార్పణతో అతిథిపూజ చేసిన మహానుభావుడు. భక్తి, వినయం, శ్రద్ధ, ఓర్పు, కరుణ అతనియందు స్థిరంగా వున్నాయి. నెల్లాళ్ళుగా కరువు వల్ల కడుపునిండా తిండి లేక ఆకలితో అలమటిస్తూ ఒకసారి ఎవరి దయవల్లనో కుంచెడు పిండి తెచ్చుకున్నాడు. అతనూ, భార్యా, కొడుకూ, కోడలూ ఆవురావుమంటూ తినడానికి కూర్చోబోతుండగా అనుకోకుండా ఒక అతిథి వచ్చాడు. ఆ అతిథికి వాళ్ళంతా సపర్యులు చేసి, "ఆరగించండి స్వామీ" అంటూ తెచ్చుకున్న ఆ కాస్త పిండినీ భక్తితో సమర్పించారు. నాటి అతని దానదక్షతను దేవతలే స్తుతించారు. ధర్మదేవత సంతసించింది. బ్రహ్మదేవుడు మణిమయ విమానం పంపి సక్తుప్రస్ఫుణ్ణి స్వర్గలోకానికి పిలిపించుకున్నాడు. అదంతా చూశాక కలుగులోంచి బయటకు వచ్చాను నేను. ఆ సక్తుప్రస్ఫుడు తయారుచేసిన పిండి వాసనా, అతిథి కాళ్ళు కడిగిన నీళ్ళూ సోకి నాతలా, శరీరంలో ఒక భాగమూ బంగారుమయమయ్యాయి! ఇదీ ఆ సక్తుప్రస్ఫుడి ధర్మమహిమ!!

"మిగిలిన శరీరం కూడా బంగారుమయం చేసుకుందామని ఎన్ని యజ్ఞ ప్రదేశాలకో వెళ్ళాను. లాభం లేకపోయింది. సక్తుప్రస్ఫుడి దాననిరతికి దీటైన దయాశీలత నాకు ఇంతవరకూ తారసపడలేదు. ఈ నాడు ధర్మరాజు యాగం చేస్తున్నాడుకదా, నా కోరిక తీరకపోతూందా అనుకున్నాను. కాని నా ఆశ నిరాశ అయింది. అందుకే ధర్మరాజు యాగం సక్తుప్రస్ఫుడి ధర్మానికి సరిపోదని అన్నాను" అని చెప్పి ఆ ముంగిస ఎవరికీ కనబడకుండా మాయమయింది.


శ్రీ మహాభారతంలో కథలు --- జనమేజయుడు


సూర్యవంశ ప్రభువుల్లో పరీక్షిత్తు మహారాజు గొప్పవాడు. ప్రజలను కన్నబిడ్డల్లా పాలించాడు. ఆయనకు వేటంటే చాలా ఇష్టం. ఒకసారి అడవికి వేటకు వెళ్ళాడు. జంతువులను వేటాడి అలసిపోయాడు. బాగా దప్పికయింది. మంచినీటి మడుగుకోసం వెతుకుతూంటే శమీక మహర్షి అశ్రమం కనిపించింది. లోపలికి వెళ్ళి " దాహంగా ఉంది. తాగేందుకు మంచినీళ్ళు కావాలి" అని అడిగాడు. మహర్షి ధ్యానసమాధిలో ఉండడం వలన ఆశ్రమం లోపలికి ఎవరు వచ్చింది కూడా ఆయనకు తెలీలేదు. అందుకని సమాధానమివ్వలేదు.

శమీకుడి మౌనాన్ని పరీక్షిత్తు తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఈ మహర్షి కింత అహంకారమా అనుకుని చచ్చిన పాము నొకదాన్ని ఆయన మెడలో వేశాడు. అది తెలిసి కోపించిన శమీకుని కొడుకు శృంగి " తపోనిష్ఠలో ఉన్న నా తండ్రిపైకి ఎవరైతే పామును వేశారో వాళ్ళు సర్పరాజు తక్షకుడి కాటుతో ఏడు రోజుల్లోగా మరణిస్తారు" అని తీవ్రంగా శపించాడు.

శృంగి దేవీభక్తుడు. అతని మాటకు తిరుగులేకుండా పోయింది.

తక్షకుడి కాటుతో పరీక్షిత్తు మరణించాడు. అప్పటికి మహారజు కుమారుడు జనమేజయుడు చిన్నవాడు. మంత్రులే మహరాజుకు అంతిమసంస్కారం చేశారు. రోజులు గడుస్తున్నాయి. జనమేజయుడికి యుక్తవయస్సు వచ్చింది. మంచి ముహుర్తాన రాజ్యపాలన స్వీకరించాడు. అనతికాలంలోనే సమర్థుడైన రాజుగా పేరు పొందాడు. కాశీరాజు సువర్ణవర్మకు జనమేజయుణ్ణి గురించి విన్నప్పటినుంచీ అతన్ని తన అల్లుడుగా చేసుకోవాలని కోరికగా ఉండేది.

సువర్ణవర్మ కుమార్తె వపుష్టకు కూడా జనమేజయుడే భర్త కావాలని ఉండేది. అనుకున్నట్టే జరిగింది.

జనమేజయుడికీ, వపుష్టకీ ముల్లోకాలూ మురిసిపోయేలా వైభవంగా పెళ్ళి జరిగింది.

ఒకసారి జనమేజయుడు కొలువుతీరి వుండగా ఉత్తాంక మహర్షి వచ్చాడు. జనమేజయుడు చేతులు జోడించి ఆయనకు నమస్కరించి, పద్మసింహాసనంలో ఆయనను కూర్చోబెట్టి, బంగారుపళ్ళెంలో అయన కాళ్ళు కడిగి మధుపర్కం సమర్పించి సత్కరించాడు.

రాజుగారి ఆదరోపచారాలతో ఉత్తాంకుడు సంతృప్తి చెందాడు.

అ తరువాత వాళ్ళమధ్య చాలాసేపు కుశలప్రశ్నలు జరిగాయి. మాటల మధ్యలో పరీక్షిత్తుమహారాజు ఎలా మరణించిందీ చెప్పాడు ఉత్తాంకుడు.

రాజు అగ్గిమీద గుగ్గిలమయ్యాడు.

సర్పాలన్నిటినీ సమూలంగా నాశనం చెయ్యాలని నిర్ణయించాడు.

"పాములు ఎక్కడ కనబడితే అక్కడే మట్టుపెట్టిండి" అని అజ్ఞ జారీ చేశాడు.

అంతటితో ఆగక ఋత్విక్కులందర్నీ సమావేశపరిచి పాముల మీద కక్ష తీర్చుకునే విధం తెలియచెప్పండని అడిగాడు. సర్పయాగం చెయ్యమని వాళ్ళంతా సలహా యిచ్చారు. క్షణాలమీద యగానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి.

ఉత్తాంక, చండభార్గవ, ఉద్దాలక, ఆత్రేయ, శ్వేతకేతు, నారద, దేవల, దేవశర్మ, మౌద్గల్య మహర్షులు యాగానికి ఆద్వర్యం వహించారు.

సర్పయాగం ప్రారంభమైంది. నల్లటి వస్త్రాలు ధరించి మంత్రగానం చేస్తున్న మునులు పాముల పాలిట యమదూతల్లా ఉన్నారు.

యజ్ఞగుండంలో ఆజ్యం పోస్తున్నప్పుడల్లా మంటలు ఉవ్వెత్తున లేస్తున్నాయి.

తాపసుల మంత్రోచ్చారణకు పాములు నిలవలేకపోతున్నాయి. ఎగిరొచ్చి ఒకదాని వెంట ఒకటి మంటల్లో పడుతున్నాయి. అన్నీ అగ్నికి ఆహుతవుతున్నాయి. తక్షకుడు అగ్నికి భయపడి ఇంద్రుణ్ణి అశ్రయించాడు. ఇంద్రుడు అతనికి అభయమిచ్చాడు.

ఈ సంగతి ఋత్విక్కులకు తెలీక అసలైన శత్రువు తక్షకుడు చావునుంచి తప్పించుకుంటున్నాడని యాగాన్ని ఉధృతం చేశారు. దానితో తక్షకుడికి ఒళ్ళంతా మంటలు లేచాయి. ఇక చావు తప్పేట్టు లేదనుకున్నాడు.

తన చెల్లెలు జరత్కారుప్రియను పిలిచి ఈ ఆపద నుంచి గట్టెక్కే ఉపాయమేదో ఆలోచించమన్నాడు. తక్షకుడి చెల్లెలు నాగేశ్వరి జరత్కారుమహర్షిని పెళ్ళాడినందువల్ల జరత్కారుప్రియ అని కూడా ఆమెను పిలుస్తారు. ఆమె ఆ భాద్యతను తన కొడుకు ఆస్తీకుడికి అప్పగించింది. అతను యాగం జరిగేచోటికి బయలుదేరాడు. తక్షకుడి జాడ తెలీక ఈలోగా ఉత్తాంకుడు కోపోద్రిక్తుడై తనకున్న దివ్యశక్తులతో లోకాలన్నీ గాలించాడు. తక్షకుడు అమరావతీ పట్టణంలో ఇంద్రుడితోపాటు సగం సింహాసనాన్ని అధిష్టించి ఉన్నాడు. అది చూసి ఉత్తాంక మహర్షికి మరీ కోపం వచ్చింది. 'ఇంద్రుడు నిన్ను రక్షించేవాడా' అనుకుని ఇంద్రుడూ, ఇంద్రసింహాసనమూ, తక్షకుడూ అందరూ యాగగుండంలో మాడి మసైపోవాలని ఉత్తాంకుడు దర్భలు చేతబట్టుకుని మంత్రాలు పఠించాడు.

ఇంద్రసింహాసనం కదిలింది. ఇంద్రుడూ, తక్షకుడూ నిలువెల్లా వణికిపోయారు. అదే సమయానికి ఆస్తీకుడు యాగశాలను చేరుకున్నాడు.

యాగశాలలోకి ప్రవేశించిన ఆస్తీకుడికి జనమేజయుడు ఉచితరీతిన మర్యాదలు చేసి, "కార్యార్థులై వచ్చినట్టున్నారు. నావల్ల కాదగిన సహాయమేమిటో చెప్పండి. తప్పకుండా చేస్తాను" అన్నాడు వినయంగా.

"సర్పయాగాన్ని తక్షణమే నిలుపుచెయ్యాలి". జనమేజయుడు నిశ్చేశ్టుడయ్యాడు. అయినా ఆడినమాట తప్పడానికి వీల్లేదు. తనవల్ల కాదగిన సాయమేదైనా సరే చేస్తానన్నాడు. చేసి తీరవల్సిందే.

"సర్పయాగం ఆగిపోయింది".

యాగంలో మృతిచెందిన పాములన్నిటికీ ముక్తి లభించి జన్మరాహిత్యం కలిగేలా దీవించాడు ఆస్తీకుడు. "జీవహింసకు మించిన పాపం లేదు. మనస్సులో చీకట్లు ముసిరిన వాడే హత్యలు చేస్తాడు. కక్షాకార్పణ్యాలు నిండిన మనస్సులోకి వెలుగు చొరబడదు. బుద్ధినీ, అంతరంగాన్నీ విశాలం చేసుకో" అని ఆస్తీకుడు జనమేజయుడికి ఉపదేశించాడు.

జనమేజయుడికి జ్ఞానోదయమైంది.

జనమేజయుడు సర్పయాగం నిలుపుచేసిన తరువాత అశ్వమేధయాగం చేశాడు. వేదవ్యాసుడు ఆ యాగానికి హాజరై జనమేజయుడికి జీవన్మరణ రహస్యాలను బోధించాడు. "నీ తండ్రిని నీకు చూపిస్తానుండమ"ని స్వర్గంలో ఉన్న పరీక్షిత్తుని కిందకు దిగిరమ్మని మహర్షి ఎలుగెత్తి పిలిచాడు.

అంతే!!

పరీక్షిత్తు మహారాజు దివ్యదేహంతో ప్రకాశిస్తూ జనమేజయుడి ముందు ప్రత్యక్షమయ్యాడు.

జనమేజయుడి ఆనందానికి అవధుల్లేవు. వినయంగా వంగి తండ్రి పాదాలను తాకాడు. తండ్రి బిడ్డను ప్రేమగా దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు. వెనువెంటనే అంతర్హితుడయ్యాడు.

వ్యాసమహర్షి మహిమకు అందరూ ఆశ్చర్యపోయారు. ఇదీ జనమేజయుడి కథ.

ఈ జనమేజయుడికే వ్యాసమహర్షి శిష్యుడు వైశంపాయనుడు మహాభారత కథను వినిపించాడు.

కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసాక దాదాపు ముప్ఫయి ఆరేళ్ళు పాండవులు రాజ్యపాలన చేశారు. అనంతరం పరీక్షిత్తుకి రాజ్యభారం అప్పగించి పాండవులు అరణ్యాలకు తపస్సు చేసుకునేందుకు వెళ్ళారు. పరీక్షిత్తు సుమారు అరవై సంవత్సరాలు రాజ్యాన్ని ఏలాడు. ఆ తరువాత జనమేజయుడు పరిపాలించాడు.

శ్రీ మహాభారతంలో కథలు --- స్వర్గారోహణం


శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు ధర్మరాజు. " నా తమ్ముల్నీ, భార్యనూ, పుత్రమిత్రుల్నీ చూసి వచ్చి, తరువాత స్వర్గలోక సుఖాలన్నీ హాయిగా అనుభవిస్తాను" అన్నాడు.

"సరే! అయితే వీళ్ళ వెంట వెళ్ళు. నీకు నీ బంధువులందర్నీ చూపిస్తారు" అని చెప్పి అందుకు తగినవాళ్ళను చూపించాడు ఇంద్రుడు. నారద మహర్షి కూడా వాళ్ళను అనుసరించాడు.

మార్గమధ్యంలో ఒకచోట ఉదయసూర్యునిలా ఉన్నతాసనం మీద ప్రకాశిస్తున్న దుర్యోధనుణ్ణి చూశాడు ధర్మరాజు. "వీడు వట్టి లోభి! వీడి మూలానే మా కులమంతా నాశనమైంది. రాజులంతా మరణించారు. పరమ సాధ్వి పాంచాలిని అవమానించిన తుచ్చుడు వీడు. ఇక్కడి నుంచి నన్ను తక్షణం తీసుకువెళ్ళండి" అని తనకు మార్గం చూపిస్తున్న దేవతలతో అన్నాడు ధర్మరాజు. అతడు ముఖం తిప్పుకోవడం చూసి నవ్వాడు నారదుడు.

"ధర్మనందనా! యుద్ధంలో శరీరం విడిచిపెట్టి వచ్చాడు దుర్యోధనుడు. క్షాత్రధర్మంతోనే గదా ఇతడు రాజులను చంపింది! అది దుర్మార్గమెందుకౌతుంది? పాంచాలిని అవమానించడం మొదలైనవన్నీ ఇక్కడ అనుకోకూడదు. ఇది దేవలోకం. మానవ సహజ వికారాలేవీ ఇక్కడ పనికిరావు!" అన్నాడు.

మహర్షి మాటలు ధర్మరాజుకు రుచించలేదు. "ముందు నన్ను నా వాళ్ళ దగ్గరకు పంపించండి. వాళ్ళు లేని స్వర్గం నాకు సహ్యం కాదు" అన్నాడు ధర్మరాజు.

అతని ఆనతి ప్రకారం దేవదూతలు ముందుకు కదిలారు. వారివెంట వెళ్ళాడు ధర్మరాజు. కొంతదూరం వెళ్ళేసరికి మార్గమంతా తల వెంట్రుకలతోనూ, ఎముకులతోనూ నిండి అసహ్యంగా వుంది. దుర్గంధం వీస్తోంది. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఉడుకుతున్న నూనె వంటి నీళ్ళతో నిండి వున్న ఒక ఏరు కనిపించింది. అది వైతరణీనది. దాని ఒడ్డున ఇనుప ముళ్ళున్నాయి. కత్తులవంటి ఆకులతో ఒక వనం కూడా కనిపించింది. అది అసిపత్రవనం. అక్కడ అనేక రకాల బాధలు అనుభవిస్తున్న పాపాత్ములున్నారు.

"అబ్బ! ఇదంతా చాలా అసహ్యంగా వుంది. వీళ్ళ బాధలు చూడలేకుండా వున్నాను. పదండి పోదాం" అని వెనక్కి తిరిగాడు ధర్మరాజు.

"మహాత్మా! దివ్య సువాసనలు గల నీ శరీరపు గాలి సోకి యిక్కడంతా పరిమళభరితమయింది. నిన్ను చూడటం వలన మా నరకయాతనలన్నీ తొలగిపోయాయి. ఇంకొంచెంసేపు దయతో ఇక్కడే నిలబడవా?" అని అక్కడ పాపకూపంలో బాధలనుభవిస్తున్న కొన్ని కంఠాలు దీనంగా అర్థించాయి. ఆ ప్రార్థనకు కరిగిపోయాడు ధర్మరాజు. 'పాపం! ఎంత కఠినమైన బాధలు అనుభవిస్తున్నారో వీళ్ళు ' అని కాసేపు అక్కడే నిలబడ్డాడు.

ఆయన తిరిగి వెళ్ళబోయేసరికి మళ్ళీ అలాంటి మాటలే వినిపించాయి.

"ఎవరు మీరు? ధర్మరాజు ప్రశ్నించాడు.

"నేను కర్ణుణ్ణి"

"మేము పాండుపుత్రులం"

"నేను ద్రౌపదిని"

అన్నాయి కంఠాలు.

"అయ్యయ్యో! ఇలాంటి ఘోరం అనుభవించడానికి వీళ్ళేం పాపం చేశారు? ఒక్క మంచిపని కూడా చెయ్యని దుర్యోధనుడు సకల సుఖాలు అనుభవిస్తున్నాడు. ఇతరులకు ఎన్నడూ ఇసుమంతైనా పాపం తలపెట్టని వీళ్ళు కష్టాలు పడుతున్నారు. ఏమిటీ తేడా! ధర్మదేవతకెందుకీ పక్షపాతం?" అంటూ దుఃఖించాడు ధర్మరాజు. "నా తమ్ములు ఇక్కడ బాధల్లో మునిగివున్నారు. కనుక ఇంక నేను ఇక్కడే వుంటాను. ఈ విషయం ఇంద్రుడితో చెప్పండి" అన్నాడు దేవదూతలతో.

వాళ్ళు వెంటనే వెళ్ళి ఆ సంగతంతా ఇంద్రుడికి చెప్పారు. ఇంద్రుడు వఛ్ఛాడక్కడికి. ధర్ముడు కూడా వచ్చాడు. అప్పుడు పాపాత్ములు బాధలు అనుభవించడం, దుర్గందం, వైతరణీనది, అసిపత్రవనం అన్నీ అదృశ్యాలయ్యాయి. దిక్కులన్నీ వెలిగాయి. "ధర్మతనయా! ఒక్క సంగతి చెబుతాను విను. రాజైనవాడు ప్రతీవాడూ నరకాన్ని చూసితీరాలి. వేదాల్లో వుందిది. పుణ్యం వల్ల స్వర్గం, పాపం వల్ల నరకం అనుభవించాలి. అల్పపుణ్యం చేసినవాడు ముందు అమర సుఖం అనుభవిస్తాడు. అధికంగా పుణ్యం చేసినవాళ్ళు ముందు కొద్దికాలం పాటు నరకయాతనలు అనుభవించి ఆ తరువాత మిగిలిన కాలమంతా సుఖపడతారు. ఇప్పుడు నినిక్కడికి పంపడం కూడా ఉత్తరోత్తరా నువ్వు సుఖపడటానికే" అన్నాడు ఇంద్రుడు.

వికసించిన ముఖంతో వినయంగా నమస్కరించాడు ధర్మరాజు. "ధర్మజా! విధివశం వల్ల తప్పింపరానివైన అల్పదుఃఖాలు అనుభవించావు నువ్వు. ఇదిగో! ఆకాశగంగ! ఇందులో మునిగి సకల సుఖాలనూ అనుభవించు. కర్ణుడితో సహా నీ తమ్ములందరూ వాళ్ళ వాళ్ళ స్థానాలలో ప్రకాశిస్తున్నారు" అన్నాడు ఇంద్రుడు.

"నాయనా! ఇదివరకు మూడుసార్లు పరీక్షించాను నిన్ను. ఇది నాలుగోసారి. నీ మనస్సులో ధర్మం ఎన్నడూ చలించలేదు. నా మీద భక్తి ఎక్కువ నీకు. మీ అన్నదమ్ముల అన్యోన్యత అపారం. నీ సోదరులు బాధలు పడడం మేము కల్పించిన మాయ! వాళ్ళు పుణ్యలోకాలలో వున్నారు. నువ్వూ అక్కడ హాయిగా వుందువుగాని పద" అన్నాడు ధర్ముడు.

వెంటనే ఆకాశగంగలో మునిగాడు ధర్మరాజు. మానుషదేహం పోయి దివ్యశరీరం వచ్చింది. ఆ తరువాత ఉత్తమగతులు పొందిన అన్నదముల్నీ, ఉదయసూర్యప్రభతో వెలుగుతూన్న ద్రౌపదినీ చూసి పరమానందభరితుడయ్యాడు ధర్మరాజు.శ్రీ మహాభారతంలో కథలు ---మహాప్రస్థానం


రక్తపుటేరుల మధ్య కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. ఆ తరువాత యదునాశనమూ జరిగింది. అంతటి బీభత్సాన్నీ, మృత్యునృత్యాన్నీ కళ్ళారా చూసాక సకలకర్మలూ త్యజించి మహాప్రస్థానం చెయ్యాలనే బుద్ధి పుట్టింది ధర్మరాజుకు. తక్షణం ఏకైక వంశాంకురం పరీక్షిత్తుకు పట్టాభిషేకం చేసి సామ్రాజ్యభారం అప్పగించారు పాండవులు.

అన్నదమ్ములైదుగురూ ఆభరణాలన్నీ తీసేసి, నారచీరలు కట్టుకున్నారు. ద్రౌపది కూడా అలాగే చేసింది. ముందు ధర్మరాజు, ఆయన వెనుక భీముడు, తరువాత అర్జునుడు, అతని వెంట నకులసహదేవులు, వాళ్ళననుసరించి ద్రౌపది కదిలి వెళ్ళారు.

వారి వెంట ఒక కుక్క బయలుదేరింది. యోగబలంతో అనేక నదులూ,పర్వతాలూ,అరణ్యాలూ దాటి వాళ్ళు తూర్పు సముద్రతీరం చేరారు. ఇంతలో ప్రకాశవంతమైన శరీరంతో ఒక మహారూపం వాళ్ళ ఎదురుగా నిలిచింది.

"అర్జునా! నేను అగ్నిని. దేవకార్యం కోసం వరుణదేవుణ్ణి అడిగి నీకు గాండీవాన్ని తెచ్చియిచ్చాను. అనుకున్న పని నెరవేరింది కనుక నీ వద్ద వున్న దివ్యధనువును ఆ మహానుభావుడికి యిచ్చేయ్యి" అన్నాడు అగ్నిదేవుడు.

వెంటనే సవ్యసాచి గాండీవాన్ని సముద్రానికి సమర్పించాడు. అగ్నిదేవుడు అంతర్హితుడయ్యాడు.

అక్కడి నుంచి బయలుదేరి మేరుపర్వతాన్ని సమీపించారు పాండవులు. యోగసాధనాపరులై ఆ పర్వతంపై వెళ్తూ వుండగా యోగబలాన్ని కోల్పోయి పాంచాల పుత్రిక కింద పడిపొయింది.

"అన్నా! అన్నా! ద్రౌపది పడిపోయింది" అరిచాడు భీముడు.

"పడనీ" అన్నాడు ధర్మరాజు నిర్లిప్తంగా. లిప్తకాలమైనా ఆగలేదు. "పాంచాలి యందు ఎన్నడూ అధర్మం లేదే! అయినా ఎందుకిలా అయింది?" భీముడు విషాదంతో ప్రశ్నించాడు.

"ఆమెకు అర్జునుడంటే ప్రేమ ఎక్కువ. ఆ పక్షపాతబుద్ధివల్ల ఆవిడ సుకృతాలు ఫలించలేదు" అన్నాడు ధర్మరాజు.

కొంచెం దూరం వెళ్ళేక, "అన్నా! సహదేవుడు పతనమయ్యాడు" అని కేకపెట్టాడు భీముడు. "తనకంటే ప్రాజ్ఞుడెవడూ లేడని అహంకారం వాడికి" అన్నాడు ధర్మరాజు.

మరికొంచెం దూరం సాగారు. భార్య, తమ్ముడు పడిపోవడం చూసి ధైర్యం పోయినవాడిలా కూలిపోయాడు నకులుడు. "అన్నా! నకులుడు నేలకూలాడు!" అర్తనాదం చేశాడు భీముడు."తనంత అందగాడెవడూ లేడని మిడిసిపాటు వాడికి. అదే కీడైంది" అన్నాడు ధర్మరాజు.

ఇంకొంచెం దూరం వెళ్ళారు. అంతలో అర్జునుడు ఒరిగిపొయాడు. "అన్నా! అర్జునుడు.." అని అరిచాడు భీముడు. "కౌరవులందరినీ కలిపి ఒక్కనాడే చంపుతానన్నాడు. అలా చేయలేకపోయాడు. ధనుర్థరులైన వాళ్ళకు మాట ఒకటీ, చేత ఒకటీ కాకూడదు. అది మహా దోషం" అన్నాడు ధర్మరాజు.

ఆప్తుల మరణాల్ని చూసేసరికి ధైర్యం జారిపోయింది భీముడికి. కుప్పగా కూలిపోయాడు. "అన్నా! నేనూ పడిపోయాను" అన్నాడు హీనస్వరంతో. "నువ్వు తిండి తెగ తింటావు. ప్రచండమైన భుజశక్తి కలిగి , ఎవరినీ లక్ష్యపెట్టవు. అందుకే యీ గతి పట్టింది నీకు" అని చెప్పి నిర్వికారంగా ముందుకు సాగిపోయాడు ధర్మరాజు. శునకం మాత్రం అతనిని భక్తితో అనుసరించి వెళ్ళింది.

కొంతదూరం వెళ్ళేసరికి దశదిశలూ దివ్యకాంతులతో వెలగసాగాయి. దేవేంద్రుడు స్వయంగా వచ్చి "ధర్మరాజా! ఉత్తమ పురుషుడవు నువ్వు. రా! ఇదిగో దివ్యరథం! ఎక్కు" అంటూ ఆహ్వానించాడు.

దుఃఖం ముంచుకువచ్చింది ధర్మరాజుకు. "తమ్ములంతా పోయారు. పాంచాలకుమారి దప్పికతో కూలిపోయింది. శోకం అగ్నిలా దహిస్తోంది నన్ను. వాళ్ళు లేకుండా నేను మీతో రాలేను" అన్నాడు.

"పాండవాగ్రజా! విచారించకు! శరీరాలు విడిచి నీవాళ్ళందరూ యిదివరకే స్వర్గానికి వచ్చారు. వాళ్ళను అక్కడ చూద్దువుగాని. నువ్వు శరీరం విడిచిపెట్టనక్కరలేదు. రా" అన్నాడు ఇంద్రుడు.

"నేను ఊరు విడిచింది మొదలు, భక్తితో నా వెంట వచ్చింది యీ జాగిలం. మరి దీనికి కూడా స్వర్గ ప్రవేశం కావాలి. అందుకు అనుమతించాలి" అన్నాడు ధర్మరాజు.

"ధర్మరాజా! జాగిలానికి దేవభావం ఎలా వస్తుంది! దీన్ని నీతో తీసుకురావడం సాధ్యం కాదు. పద. రథం ఎక్కు" అని దరహాసం చేశాడు ఇంద్రుడు.

"మహానుభావా! నీ వంటి దివ్యపురుషుడు తలుచుకుంటే సాధ్యం కానిదేముంటుంది! అశ్రయించిన వాళ్ళకోసం ఆ మాత్రపు కార్యం నెరవేర్చడం నీకు భారమా? ఆశ్రితుల్ని విడిచిపెట్టి పొందే సంపద నాకేం యింపుగా వుంటుంది?" అని దీనంగా ప్రార్థించాడు ధర్మరాజు.

"ధర్మజా! ఇదెక్కడి తెలివితక్కువతనం! శునకాలకు స్వర్గవాసం సంభవిస్తుందా? దీన్ని వదలడం కాఠిన్యమెంత మాత్రం కాదు. నా మాట విను."

"భక్తుడైన వాణ్ణి విడిచిపెడితే బ్రహ్మహత్యాపాతకం కలుగుతుందని పెద్దలంటారు. అందువల్ల దీన్ని విడిచిపెట్టను. దివ్యసుఖం కోసం పాపం మూట కట్టుకోలేను."

"నీకింత పట్టుదల ఎందుకు? తమ్ములనూ, భార్యనూ విడిచావా లేదా! జీవితాంతం అన్ని ఒడిదుడుకుల్లోనూ నీకు తోడుగా నిలిచినవారిముందు యీ శునకం ఎంత? దీన్ని విడవలేనంటావు. ఇదేమైనా బాగుందా?"

"స్వామీ! అఖిల లోకాలకు అధిపతివి నువ్వు. నీకు తెలీని ధర్మం లేదు. పైగా పెద్దలతో వాదించకూడదు. అయినా మీకొక విన్నపం చేసుకుంటున్నాను. తమ్ములూ,భార్యా ఎలాగో చనిపోయారు. ఇప్పుడు వాళ్లకోసం దుఃఖిస్తే మాత్రం ప్రయోజనమేమిటి? చావకుండా నాతో వచ్చిందీ కుక్క. శరణన్న వాణ్ణి ఉపేక్షించడం, సన్నిత్రుడికి ద్రోహం చెయ్యడం, స్త్రీని చంపడం, బ్రాహ్మణార్థం దొంగలించడం అనే మహాపాపాలెలాంటివో నిరపరాధి అయిన భక్తుణ్ణి విడిచిపెట్టడం కూడా అలాంటి పాపమే. నన్ను మన్నించు. నేనిక్కడే వుండి తపస్సు చేస్తూ నిన్ను సేవిస్తూ వుంటాను" అని ధర్మరాజు దృడంగా చెప్పాడు.

ఉత్తరక్షణమే శునకం ధర్మదేవతగా మారింది. అదిచూసి సంభ్రమానందాలతో నమస్కరించాడు ధర్మతనయుడు.

"కుమారా! నీ భూతదయకు మెచ్చుకున్నాను. నీపై విశ్వాసం చూపి నీతో భక్తిగా వచ్చిందని ఒక కుక్కను చేపట్టి ఇంద్రుడు తెచ్చిన దివ్యరథాన్ని కూడా ఎక్కనన్నావు! నీ ఉదాత్తత ఇంద్రుడు కళ్ళారా చూశాడు. ఇంక శరీరంతో పుణ్యలోకాలకు వెళ్ళు. అవ్యయపదాన్ని పొందు" అన్నాడు ధర్మదేవుడు ఆదరంగా.

శ్రీ మహాభారతంలో కథలు ---శ్రీ కృష్ణ నిర్యాణం


దారుకుణ్ణి, బభ్రుణ్ణి వెంటపెట్టుకుని బలరాముడిని వెతుకుతూ బయలుదేరాడు కృష్ణుడు. కొంచం దూరం వెళ్ళేసరికి ఒక చెట్టుకింద అన్న కనిపించాడు.

"దారుకా! నువ్వు వెళ్ళి పాండవులతో యాదవనాశనం గురించి చెప్పి అర్జునుణ్ణి తీసుకురా. బభ్రూ! నువ్వు ఆడవాళ్ళనందర్నీ పట్టణానికి చేర్చి మళ్ళీ రా" అని ఆజ్ఞాపించాడు కృష్ణుడు. ఇద్దరూ బయలుదేరారు. కనుచూపు మేరలోనే ఒక బోయవాడు బభ్రుణ్ణి తుంగతో మోది చంపాడు.

అది చూసి మునివర్యుల శాపశక్తికి ఆశ్చర్యపడ్డాడు కృష్ణుడు.

బలరాముని దగ్గరకు వెళ్ళి, "అన్నా! నేను ఈ వాహనాలనూ, వనితలనూ మన పురానికి తీసుకువెళ్ళి విడిచి, తండ్రి ఆజ్ఞ తీసుకుని వస్తాను. అందాకా నువ్వు ఇక్కడే వుండు" అని చెప్పి ద్వారకానగరానికి వెళ్ళాడు.

వసుదేవుణ్ణి చూసాడు. "తండ్రీ! ఇంతవరకు కౌరవ నాశనం, ఇప్పుడు యాదవ నాశనం చూశాను. బంధుమిత్రులెవరూ లేని ఈ నగరంలో వుండబుద్ధి కావడం లేదు నాకు. అన్న ఎలాగూ అరణ్యాల్లోనే వున్నాడు. నేను కూడా వెళ్ళి అన్నతోపాటూ తపస్సు చేసుకుంటాను. ఇక అన్ని విషయాలూ మీరే సమర్థించుకోండి. రేపోమాపో అర్జునుడు వస్తాడు. మీ ఆజ్ఞలను పాటిస్తాడు" అంటూ తండ్రి పాదాలకు నమస్కరించాడు కృష్ణుడు. ఆ వృద్ధమూర్తి మాటలు రాక, చేష్టలు దక్కి మొగబోయాడు.

యాదవస్త్రీలంతా గొల్లున ఏడ్చారు. కృష్ణుడు కరిగిపోయి, " ఇప్పుడే వస్తాడు అర్జునుడు, మీ కష్టాలన్నీ తీరుస్తాడు. ఊరుకోండి" అని వాళ్ళందర్నీ ఉరడించాడు. అందరికీ నచ్చచెప్పి తండ్రి దగ్గర సెలవు తీసుకుని బలరాముడి దగ్గరకు వచ్చాడు కృష్ణుడు.

"అన్నా! తపస్సు చేసుకోవడానికి తండ్రిగారి అనుమతి తీసుకుని వచ్చాను" అన్నాడు.

ఆ సమయంలో బలరాముని ముఖంలోంచి ఒక మహాసర్పం బయటకు వచ్చింది. ఎర్రటి తలలు వెయ్యి వున్నాయి దానికి. పడగలు మణులతో వెలిగిపోతున్నాయి. తెల్లని శరీర చాయ! పర్వతమంతటి దేహం! అలా బలరాముడు మోగబలంతో శరీరం విడిచి తన నిజరూపం ధరించి సముద్రమార్గాన సాగిపోతుండగా సర్పసమూహాలన్నీ వచ్చి భక్తితో సేవించాయి. గంగానది మొదలుగా గల మహానదులన్నీ ఆకారాలు ధరించి వచ్చి ఆయనను ఆరాధించాయి. అదంతా కృష్ణుడు దివ్యదృష్టితో చూస్తుండగానే అనంతుడు తన అంశ అయిన ఆ మహాసర్పాన్ని తనలో లీనం చేసుకున్నాడు.

చత్రమూర్తి తనను విడిచి వెళ్ళగానే కర్తవ్యచింత ఆవహించింది కృష్ణుణ్ణి. భూలోకంలో చెయ్యవలసిన పనులన్నీ అయిపోయాయి. శరీరం విడిచిపెట్టడానికి ఏ కారణం దొరుకుతుందా అని ఆలోచించసాగాడు అచ్యుతుడు. ఒకప్పుడు రుక్మిణీ సహితంగా దుర్వాసుని సేవించిన సందర్భంలో తను ఆయన అరికాలిలో పాయసం రాయకపోవడం, అందువల్ల "నీకు అరికాలి ద్వారా అపాయం కలుగుతుంది" అని ఆ మహర్షి అనడం గుర్తుకు వచ్చాయి. వెంటనే ఒక చెట్టునీడన పవళించి సమాధిగతుడయ్యాడు జలధిశయనుడు.

అప్పుడు జర భయపడుతూ మెల్లమెల్లగా అక్కడికి రాసాగింది. ఆ చుట్టుపక్కల తిరుగుతున్న వేటగాడొకడు కనిపించాడు దానికి. వాడికి కృష్ణుడి పాదం లేడిపిల్ల ముఖంలా భ్రమ గొలిపేటట్టు చేసింది జర. అల్లంతదూరం నుంచి చూసి ఆ వెటగాడు మా మంచి లేడి దొరికిందనుకుంటూ గురి చూసి బాణం విడిచాడు. అది వెళ్ళి హరి అరికాలిలో గుచ్చుకుని పాదం పైనుంచి దూసుకుపోయింది.

ఆ బోయవాడు దగ్గరకు వచ్చి పరమాత్ముణ్ణి చూసి, తన తప్పు తెలుసుకుని ఆయన పాదాల మీద పడి పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు. నిరాకరుడూ, నిర్గుణుడూ అయిన వేదమూర్తి వాణ్ణి ఓదార్చి పంపేసి ఆ వంకతో మానవదేహాన్ని విడిచిపెట్టాడు.

ఊర్ధ్వలోకాలకు వెళ్ళగానే అదివిష్ణువుకు ఇంద్రాది దేవతలంతా భక్తితో ప్రణమిల్లారు.

"ఆదిపురుషా! ధర్మరక్షణ కోసం లీలామానుషరూపుడవై పుట్టావు. శత్రువు లందర్నీ చంపావు. ప్రతీ యుగంలోనూ ఇలాగే అవతరించి ధర్మరక్షణ చేస్తూ వుండు" అంటూ ప్రార్థించాడు ఇంద్రుడు. మహావిష్ణువు మీద పుష్పవర్షం కురిసింది. బ్రహ్మదేవుడు హరి పాదాలకు నమస్కరించి వేదవాక్కులతో స్తుతించాడు. వాళ్ళ భక్తికి ప్రీతి పొంది "అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ, వాసుదేవ భావాలు కలిగే సిద్ధిని పొందాను. నా స్థానాన్ని నేను చేరుకుంటాను. మీరు సుఖంగా వుండండి" అని అంతర్హితుడయ్యాడు మహావిష్ణువు.

ఇంద్రియాలకు కనిపించని ఆ పరమాత్ముణ్ణి బుద్ధితో చూస్తూ ఆయన అద్భుత కృత్యాలను వర్ణించుకుంటూ బ్రహ్మాది దేవతలంతా తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు.

శ్రీ మహాభారతంలో కథలు ---యదువంశ క్షయం


కృష్ణుడి ఆజ్ఞ మేరకు అర్జునుణ్ణి వెంటబెట్టుకొచ్చేందుకు దారుకుడు పాండవుల దగ్గరికి వెళ్ళాడు. ఏడుస్తున్న దారుకుణ్ణి చూసేసరికి పాండవుల గుండెలు ఝల్లుమన్నాయి. యాదవులందరూ మరణించారని దారుకుడు చెప్పగానే కన్నీళ్ళు కార్చారు అన్నదమ్ములు అయిదుగురూ.

"కృష్ణుడు నిన్ను తీసుకురమ్మని పంపాడు నన్ను" అన్నాడు దారుకుడు అర్జునుడితో. అర్జునుడు ధర్మరాజు ఆజ్ఞ తీసుకుని ద్వారకకు బయలుదేరాడు.

చంద్రుడు లేని రాత్రీ, దినమణి లేని ఆకాశం ఎలా వుంటాయో అలాగ వుంది కృష్ణుడు లేని ద్వారక. తమ విభుని ప్రియసఖుణ్ణి చూడటంతోనే కృష్ణుడి భార్యలు పదహరువేలమందీ గట్టిగా ఏడుస్తూ చుట్టూ నిలబడ్డారు. దైన్యం స్త్రీల రూపాలు ధరించి వచ్చినట్టున్న వాళ్ళని చూసి అర్జునుడు మరింతగ దుఃఖపడ్డాడు.

ఏడ్చి ఏడ్చి కృశించి శయ్య మీద పడివున్న వసుదేవుడు అర్జునుణ్ణి చుట్టేసుకుని దుఃఖించాడు. "మనుష్యమాత్రులు కారు యదుకుమారులు! దేవ పరాక్రములు! దానవులనైనా చంపి ప్రకాశించే దర్పంగలవారు! అకారణంగా వైరం పెంచుకుని తమలో తాము కొట్టుకుని మరణించారు. అయినా వాళ్ళననడమెందుకులే! ముని శాపం అలా పరిణమించింది. చచ్చిన పరీక్షిత్తుని బతికించిన శౌరి, జరిగిన ఘోరమంతా చూస్తూనే ఉపేక్షించాడు!" అన్నాడు వసుదేవుడు కన్నీళ్ళు కారుస్తూ.

"బావ ఎక్కడ వున్నాడు!" అని అడిగాడు అర్జునుడు.

"పార్థా! 'అర్జునుడు వస్తాడు. నీ ఆజ్ఞలన్నీ అతడు నెరవేరుస్తాడు. కార్యజ్ఞుడూ శౌర్యశాలీ కూడా అతడు! కిరీటీ నేనూ ఒకటే! నువ్వు శోకం విడిచి అతన్ని చేతపట్టి అందర్నీ రక్షించుకో. ఇంక కొద్దిరోజుల్లో ఈ నగరాన్ని సముద్రం ముంచేస్తుంది ' అని చెప్పి నన్ను ఊరడించి, అన్నతో పాటూ తపస్సు చేసుకోవడానికి కృష్ణుడూ వెళ్ళి పోయాడు" అన్నాడు వసుదేవుడు.

అర్జునుడు దారుకుణ్ణి పిలిచి, "కృష్ణుడు వెళ్ళిన దిక్కుగా వెళ్దాం మనం. ఇక్కడ చెయ్యవలసిన పనులన్నీ మంత్రులకు అప్పగిద్దాం. మంత్రుల్నీ, పౌరుల్నీ పిలిపించు" అన్నాడు.

దారుకుడు వెంటనే అజ్ఞ పాటించాడు.

వాళ్ళందర్నీ ఒక్కసారి కలయచూసి "ఈనాటికి ఏడవరోజున ఈ పట్టణాన్ని సముద్రం ముంచేస్తుందని దేవతల వాక్కు! కనుక మనమందరం త్వరగా ద్వారకను విడిచివెళ్ళాలి. ఇంద్రప్రస్థానికి వసుదేవుడి మనుమడైన వజ్రుణ్ణి రాజుగా చేస్తాను. మీరందరూ వెళ్ళి అక్కడ అతని పరిపాలనలో సుఖంగా వుండండి. మొయ్యగలిగినన్ని సరుకులు మోయించండి. బళ్ళు సిద్ధం చెయ్యండి. ఇదివరకు గోవిందుని నీడన యాదవవీరులంతా ఎలా సుఖంగా ఉన్నారో, అలగే ఇప్పుడు ఈ దేశపు ప్రజలంతా ధర్మరాజు ఆదర గౌరవాలందుకుంటూ వుంటారు" అని ఆజ్ఞాపించాడు అర్జునుడు.

ప్రజలు వెళ్ళిపోయారు.

ఆ రాత్రంతా భారమైన మనస్సుతో కృష్ణమందిరంలోనే గడిపాడు అర్జునుడు.

తెలతెలవారే సమయంలో వసుదేవుడు యోగనిష్ఠతో శరీరం విడిచిపెట్టాడు.

అంతఃపురమంతా రోదన ధ్వనులతో మారుమోగిపోయింది.

వసుదేవుడి భార్యలు దేవకి, రోహిణి, భద్ర, మదిర సహగమనం చేశారు.

'నన్ను పిలిపించి తన తండ్రికి కావలి పెట్టాడు మాధవుడు. అలాంటివాడికి తండ్రి మరణవార్త ఎలా చెప్పను? ఈ చావుకబురు చెప్పి తపోనిష్ఠలో వున్న నారాయణుడికి బాధ కలిగించడమెందుకు?' అనుకున్నడు అర్జునుడు. అంతలోనే 'అయ్యో! పెదతల్లి గాంధారీదేవి శాపం ఎందుకో అస్తమానం జ్ఞాపకం వస్తోంది. ఏకాంత ప్రదేశంలో దిక్కులేని చావు చావమని కృష్ణుణ్ణి శపించిందామె. ఎలా వున్నాడో ఏమో!' అనుకుంటూ త్వరత్వరగా బయలుదేరాడు అర్జునుడు. కలతపడిన వృదయంతో కృష్ణుడి కోసం అరణ్యమంతా గాలించసాగాడు. ఒకనాడు అతనికొక బోయవాడు ఎదురయ్యాడు.

"ఎక్కడకు వెళ్ళాలి దొరా?" అని ప్రశ్నించాడు.

"కృష్ణభగవానుడు తపస్సు చేసుకుంటున్న చోటికి!" అర్జునుడు జవాబు చెప్పాడు.

"అ మహానుభావుణ్ణి ఒకనాడు ఒకచోట చూశాను. మరి ఇప్పుడు అక్కడున్నాడో లేడో తెలీదు. అయినా అ చోటు చూపిస్తాను రండి" అని బోయవాడు బయలుదేరాడు. ఇద్దరూ కలిసి తిన్నగా అచ్యుతుడు వున్న చోటుకు వెళ్ళారు. అక్కడ నేలమీద పడివున్న జగదేకవంద్యుడి మృతదేహాన్ని చూసి మూర్చపోయాడు అర్జునుడు.

'ఈ మహానుభావుడికి ఈ గతి ఎలా సంభవించింది?' అనుకుంటూ శరీరమంతా కలయచూశాడు అర్జునుడు. పాదంలో గుచ్చుకున్న బాణపు గాయం కనిపించింది. అది చూస్తూనే దుర్వాసుడి మాటలు గుర్తుకు వచ్చి ఆశ్చర్యపోయాడు అర్జునుడు. 'కృష్ణుడి కళేబరాన్ని నగరానికి తీసుకుపోవడమా? లేకపోతే బంధువులందర్నీ ఇక్కడికే పిలిపించడమా?' అని ఆలోచిస్తూ వుండగా సముద్రం పట్టణాన్ని ముంచేయబోతున్న విషయం జ్ఞాపకం వచ్చింది అర్జునుడికి.

వెంటనే చితి పేర్చి మృతదేహానికి అగ్ని సంస్కారం చేశాడు. గబగబ ద్వారకకు బయలుదేరాడు. తెల్లవారేలోపల బలరామకృష్ణుల భార్యలనూ, మిగిలిన ప్రజలనూ పురం దాటించాడు పార్థుడు. అందరికీ తానే దిక్కై ముందుకు నడిచాడు. ఇంతలో కిరాతకుల గుంపొకటి యాదవ స్త్రీలపై దాడి చేసింది. సవ్యసాచి అగ్రాహావేశాలతో అస్త్రప్రయోగం చెయ్యబోయాడు. చిత్రం - ఒక్క మంత్రం కూడా గుర్తు రాలేదు! ఆశ్చర్యం, విషాదం కూడా కలిగాయి విజయుడికి. గాండీవంతోనే అ దొంగలను మోదసాగాడు. చివరకు ఎలాగైతేనేం - కృష్ణుడి ఎనమండుగురి భార్యలనూ, బలరాముడి భార్యలనూ, ఇంకా కొంతమంది స్త్రీలనూ మాత్రం రక్షించగలిగాడు. వాళ్ళను వెంటబెట్టుకుని కురుక్షేత్రానికి చేరుకున్నాడు.

అక్కడ తాను కృష్ణుణ్ణి వెదకడానికి వెళ్ళింది మొదలు, మళ్లీ ద్వారకకు వచ్చేవరకూ జరిగినదంతా అందరికీ దీనంగా వివరించాడు అర్జునుడు. రామకృష్ణుల భార్యలు మొదలు నరికిన మానుల్లా నేలకొరిగారు.

శ్రీ మహాభారతంలో కథలు ---యాదవ ముసలం

కణ్వ, విశ్వామిత్ర, నారద మహర్షులు ముగ్గురూ కృష్ణభగవానుణ్ణి చూడటానికని ద్వారకానగరానికి బయలుదేరారు. వాళ్ళు రాజవీధిని వస్తూండడం చూసిన యాదవులకు దుర్బుద్ధి పుట్టింది. కృష్ణుడి కొడుకు సాంబుడికి ఆడపిల్ల వేషం వేసి తీసుకువచ్చి "అయ్యా! ఇది భద్రుడి భార్య. దీనికి సంతానం కలుగుతుందా?" అని అడిగారు మునుల్ని యదుకుమారులు.

అంతమాత్రం తెలుసుకోలేరు గనుకనా ఆ మహర్షులు!

"వీడు కృష్ణుడి కొడుకు సాంబుడని తెలుసు మాకు. వీడికి యాదవవంశాన్ని నాశనం చేసే ముసలం పుడుతుంది! కృష్ణుడూ, బలరముడూ తప్ప తక్కిన యాదవులంతా అ రోకలి వల్ల చస్తారు. బలరాముడు అదికనిష్ఠతో శరీరం విడిచి సముద్రంలో ప్రవేశిస్తడు. నేలమీద పడుకుని వుండగా కృష్ణుణ్ణి 'జర ' అనే రాక్షసి పుట్టి అక్రమిస్తుంది. పొండి" అన్నారు వాళ్ళు కోపంగా.

ఇంత చేసి ఇంక మనం వాసుదేవుణ్ణి చూడడం మంచిది కాదనుకుని మహర్షులు ముగ్గురూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు.

తరువాత కృష్ణుడు ఇదంతా తెలుసుకుని జరగవలసింది జరిగే తీరుతుందనుకుని ఉదాసీనంగా వూరుకున్నాడు.

ఆ మర్నాడు సాంబుడి కడుపులోంచి భయంకరంగా వున్న ఒక రోకలి పుట్టింది. యాదవులందరూ భయంతో పరుగెత్తుకు వెళ్ళి ఆ సంగతంతా వసుదేవుడికి చెప్పారు.

"ఆ రోకలిని పిండి పిండి చేసి సముద్రంలో కలిపిరండి" అని ఆజ్ఞాపించాడు. యాదవులంతా వెళ్ళి అయన చెప్పినట్లే చేశారు. కాని గాంధారి శాపం, మహర్షుల ఆగ్రహం ఎక్కడికి పోతాయి?

ద్వారకాపట్టణంలో అనేక ఉత్పాతాలు కనిపించాయి. రాత్రివేళల్లో చిలుకలు గుడ్లగూబల్లా అరవసాగాయి. పగలు మేకలు నక్కల్లా కూశాయి. ఆవులకు గాడిదలూ, ముంగీసలకు ఎలుకలూ, కుక్కలకు పిల్లులూ పుట్టాయి. కృష్ణబలరాములు తప్ప మిగిలిన యాదవులందరూ సజ్జనులను బాధపెట్టడం మొదలుపెట్టారు. గురువులను అవమానించారు. స్త్రీలు ఇష్టం వచ్చినట్లు సంచరించారు. కూడూ కూరలూ అప్పుడే పొయ్యిమీద నుంచి దింపినాసరే - పురుగులు పట్టడం మొదలెట్టాయి. ఈ అశుభ సూచనలన్నీ చూసి గాంధారి శాపం ఫలించే సమయం ఆసన్నమైందనుకున్నాడు కృష్ణుడు. యాదవులు తీర్థసమీపంలో చావడం మంచిదని భావించాడు కృష్ణుడు. ఇంక తెల్లవారితే వాళ్ళంతా కాలం చేస్తారనగా అంతకు ముందురోజే కొలువుతీర్చి "సముద్రానికి జాతర చెయ్యాలి. అందరూ బయల్దేరండి" అని ఆజ్ఞ ఇచ్చాడు.

రాబోతున్న ప్రమాదం గ్రహించుకోలేక పానీయాలూ, భక్ష్యభోజ్యాలు, మాంసాహారాలూ సమకూర్చుకుని, అందంగా అలంకారాలు చేసుకుని చతురంగ బలాలతో బయలుదేరారు యాదవులు.

నిర్వికారుడై బయలుదేరాడు కృష్ణుడు.

అందరూ సముద్రతీరాన వున్న పందిళ్ళ దగ్గరకు చేరుకున్నారు. బలరాముడు మాత్రం అరణ్యాలకు వెళ్ళాడు. యాదవులు తెచ్చుకున్న భక్ష్యాలన్నీ తిన్నారు. ప్రభువైన కృష్ణుడి ఎదురుగానే మత్తుపానీయాలు సేవించారు. అసంబద్ధపు ప్రేలాపనలు సాగిస్తూ నవ్వడం మొదలుపెట్టారు.


"ప్రద్యుమ్నా! అడుగో కృతవర్మ! చూశావా! నిద్రపోతున్న వాళ్ళను చంపాడు. ఏంపౌరుషంరా! ఎంత నీచుడైనా అలాంటి పని చేస్తాడా?" సాత్యకి కృతవర్మను ఎగతాళి చేశాడు.


"అర్జునుడు చెయ్యి నరికితే శాంతించిన భూరిశ్రవుణ్ణి చంపావు నువ్వు. అది మరిచిపోయావా? నువ్వు చేసింది రణనీతి కాబోలు!" కృతవర్మ ఆక్షేపించాడు.


సాత్యకికి కోపం వచ్చి కత్తి దూసి గబగబ వెళ్ళి కృతవర్మ కంఠం నరికేసాడు. సముద్రతీరాన తుంగగా మొలిచిన రోకలి ప్రభావం ఆ నిమిషంలో ఆ కత్తిని ఆక్రమించి వుంది. అంతటితో వూరుకోక సాత్యకి భోజులందరిమీదా విజృంభించాడు. వారించడానికి కృష్ణుడు వెళ్ళేలోగానే భోజులంతా సాత్యకిని చుట్టుముట్టారు. అయితే జరగబోయేదంతా తెలిసిన వాడవడం వల్ల కాలస్వరూపుడైన కృష్ణుడు సాత్యకిని రక్షించే ప్రయత్నం చెయ్యలేదు.


సాత్యకిని కాపాడడం కోసం ప్రద్యుమ్నుడు విజృంభించాడు. ఈ విధంగా వాళ్ళల్లో వాళ్ళకు కయ్యం ప్రారంభమైంది. ఆ సముద్రతీరంలో మొలిచిన తుంగ పీకి దాంతో ఒకరినొకరు కొట్టుకుని హతులయ్యారు వాళ్ళందరూ.


ఆనాడు వాళ్ళు అరగదీసి సముద్రంలో కలిపిన రోకలే అక్కడ తుంగగా మొలిచింది! అదే వాళ్ళ యుద్ధానికి సాధనమై చావుకు కారణమైంది!!


దారుకుడూ, బభ్రుడూ తప్ప మిగిలిన యాదవులంతా నాశనమయ్యారు. వాళ్ళిద్దర్నీ వెంటబెట్టుకుని బలరాముడు వెళ్ళినమార్గానే సాగాడు కృష్ణుడు.

శ్రీ మహాభారతంలో కథలు ---గాంధారి శాపం


కురు పాండవ యుద్ధంలో ధృతరాష్ట్ర పుత్రులు అందరూ హతమయ్యారు. ఐశ్వర్యం పోయింది. బంధువులంతా నాశనమయ్యారు. "ఇంత దారుణం జరిగినా చావురాలేదు నాకు" అని వాపోయాడు ధృతరాష్ట్రుడు.

వ్యాసమహాముని ధృతరాష్ట్రుణ్ణి ఓదారుస్తూ, "నాయనా! ఎవ్వరి ప్రాణాలూ శాశ్వతం కాదు. ఈ సత్యాన్ని మనస్సుకు బాగ పట్టించుకున్నావంటే ఇంక నీకే దుఃఖం వుండదు. ఇప్పుడు విచారిస్తున్నావు కాని , జూదమాడేనాడు విదురుడెంత చెప్పినా విన్నావా? దైవకృత్యాన్ని మనుషులు తప్పించగలరా?" అన్నాడు.

"రాజా! ఒకనాడు దేవసభకు వెళ్ళాను నేను. దేవతలతో, మహామునులతో మట్లాడుతున్న సమయంలో భూదేవి ఏడుస్తూ వచ్చిందక్కడికి.

'నా భారం తొలగిస్తానని మీరంతా బ్రహ్మసభలో ప్రతిజ్ఞలు పలికారు. ఇప్పుడిలా ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలీడం లేదు. ఇంక నా భారం తొలిగే మార్గమేమిటి?' అని దేవతలను ప్రశ్నించిందామె.

'ధృతరాష్ట్రుడనే రాజుకు నూరుగురు కొడుకులు పుడతారు. వాళ్ళలో పెద్దవాడైన దుర్యోధనుడి వల్ల నీ భారమంతా నశిస్తుంది. వాణ్ణి చంపడానికీ, రక్షించడానికీ ముందుకు వచ్చి భూమిమీద వున్న రాజులంతా సేనలతో సహా కురుక్షేత్రంలో హతులవుతారు. ఆ దుర్యోధనుడు కూడా తమ్ములతో పాటు మరణిస్తాడు. అంతటితో నీ భారం తీరిపోతుంది. వెళ్ళు! నిశ్చింతగా భూతధారణం చెయ్యి ' అన్నాడు నారాయణుడు చిరునవ్వుతో.

"విన్నావు కదా రాజా! మరి కౌరవులు నాశనమయ్యారంటే ఆశ్చర్యమేముంది! విధిని ఎవరు తప్పిస్తారు?"

ధృతరాష్ట్రుడు ధైర్యం తెచ్చుకుని గాంధారినీ, కుంతినీ, కోడళ్ళనూ వెంటపెట్టుకుని యుద్ధభూమికి బయలుదేరాడు.

పెదతండ్రి వస్తున్నాడని తెలిసి ధర్మనందనుడు ముందే అక్కడికి వెళ్ళాడు. అతని వెంట తమ్ములూ ద్రౌపదీ కృష్ణుడూ కూడా వున్నారు.

ధర్మరాజు కంటపడగానే ధృతరాష్ట్రుడి కోడళ్ళందరూ బిగ్గరగా ఏడ్చారు. దుఃఖంతో, అవేశంతో పేరుపేరునా పాండవులందర్నీ నిందించారు.

కళ్ళనీళ్ళు కారుస్తూ మౌనంగా తల వంచుకున్నాడు ధర్మరాజు. ధృతరాష్ట్రుడి పాదాలకు నమస్కరించాడు. తరువాత పాండవులు కృష్ణసహితంగా వెళ్ళి గాంధారికి నమస్కరించారు.

కోపంతో మండిపడిందామె.

"శత్రువుల్ని చంపొచ్చు. కాని ఈ గుడ్డివాళ్ళిద్దరికీ ఊతకర్రగా ఒక్కణ్ణయినా మిగల్చకుండా అందర్నీ నాశనం చేశారే! మీకు అపకారం చెయ్యనివాడు వందమందిలో ఒక్కడైనా లేకపోయాడా? ఒక్కణ్ణి అట్టేపెడితే మీ ప్రతిజ్ఞ భంగమౌతుందా? అ ఒక్కడూ మిమ్మల్ని రాజ్యం చెయ్యనివ్వకుండా అడ్డగిస్తాడా? ఇంతకూ ఏడీ మీ మహారాజు?" ఎర్రబడిన ముఖంతో ప్రశ్నించింది.

అజాతశత్రుడు మోకరిల్లాడు. గాంధారి తలవంచి దీర్ఘంగా నిట్టూర్చింది. నేత్రాలను బంధించిన వస్త్రం సందులోంచి ఆ మహాసాధ్వి దృష్టి లిప్తపాటు ధర్మరాజు కాలిగోళ్ళ మీద పడింది. ఆ గోళ్ళు వెంటనే ఎర్రగా కందిపోయాయి. అది చూసి హడలిపోయి కృష్ణుడి వెనకాల దాగాడు అర్జునుడు.

మహాజ్ఞానీ, సంయమనం కలదీ కనుక గాంధారి కోపాన్ని శమింప చేసుకుని "నాయనా! వెళ్ళి కుంతీదేవిని చూడండి" అంది.

కానీ ఇంతటికీ కారణమైన కృష్ణుడి పట్ల ఆమె క్రోధం కట్టలుతెంచుకుంది.

"వాసుదేవా! ఇలా రావయ్యా" అని పిలిచింది గాంధారి.

"కృష్ణా! కౌరవ పాండవ కుమారులు తమలో తాము కలహించుకున్నప్పుడు నువ్వు నచ్చచెప్పకపోయావు. కదన రంగాన కాలూనినప్పుడూ నువ్వు అడ్డుపడకపోయవు. సమర్ధుడవై వుండి కూడా ఉపేక్ష చేశావు. అందర్నీ చంపించావు. దేశాలన్నీ పాడుబెట్టావు. జనక్షయానికి కారకుడైన జనర్థనా! దీని ఫలం నువ్వు అనుభవించవలసిందే. నా పాతివ్రత్య పుణ్యఫల తపశ్శక్తితో పలుకుతున్నాను - నువ్వు వీళ్ళందర్నీ ఇలా చంపావు కనుక ఈనాటికి ముప్ఫై ఆరో సంవత్సరంలో నీ జ్ఞాతులు కూడా వీళ్ళలాగే పరస్పరం కలహించుకుని చస్తారు. అదే సమయాన నువ్వు దిక్కులేక నీచపు చావు చస్తావు. మీ కుల స్తీలు కూడా ఇలాగే అందర్నీ తలుచుకుని ఏడుస్తారు. ఇది ఇలాగే జరుగుగాక" అని శపించిండి గాంధారి.

సమ్మోహకరంగా చిరునవ్వు నవ్వాడు కృష్ణుడు.

"అమ్మా! ఈ శాపం యాదవులకు ఇదివరకే ఇచ్చారు కొందరు మునులు. నువ్విప్పుడు చర్చిత చర్వణం చేశావు. యదువంశీయులను దేవతలు కూడా చంపలేరు. అందుచేత వాళ్ళలో వాళ్ళే కొట్టుకుచస్తారు. పోనీలే కానీ అందువల్ల నీకేం వస్తుంది చెప్పు?" అన్నాడు నవ్వుతూనే.

పుత్రశోకంతో పరితపిస్తూ అవధులెరగని ఆక్రోశంతో అచ్యుతుని శపించిన గాంధారి జవాబు చెప్పలేక మౌనం వహించింది.

శ్రీ మహాభారతంలో కథలు ---ధృతరాష్ట్ర పరిష్వంగం


కురు పాండవ యుద్ధంలోకౌరవ సైన్యం మొత్తం మంటగలిసిపోయింది. పద్ధెనిమిది అక్షౌహిణుల సైన్యం నేలకూలింది. సుయోధనచక్రవర్తి భీమసేనుడి గదాఘాతం వల్ల తొడలు విరిగి దుమ్ములో ధూళిలో దొర్లి మరణించాడు.

"హా! నాయనా! ఎంత అనుచితంగా అస్తమించావురా!" అంటూ ధృతరాష్ట్రుడు ఏడ్చాడు. గాంధారీ, కోడళ్ళూ సృహతప్పి పడిపోయారు. హస్తినాపురంలో అడవాళ్ళూ, పిల్లలూ యుద్ధంలో చనిపోయిన వారికోసం ఆక్రందనలు చేస్తూ, కేకలు వేస్తూ వుంటే ఆ ధ్వనులు ఎక్కడచూసినా ప్రతిధ్వనిస్తున్నాయి.

"తమ్ముడా! విదురా! అనాథనయిపోయాను! అందరూ పోయారు! ఇంక నువ్వే నాకు దిక్కు" అంటూ దుఃఖించాడు ధృతరాష్ట్రుడు.

"మహారాజా! అజాత శత్రుడి మంచితనాన్ని బలహీనతగాను, చేతగానితనంగాను భావించి నిష్కారణవైరం కొనితెచ్చుకున్నారు. తాటాకు మంటలాంటి కోపం వల్ల హాని లేదు. దీర్ఘక్రోధం వల్ల కీడు కలుగుతుంది. తమకు బలం ఎక్కువగా వుంటే యుద్ధం చెయ్యాలి. శత్రువులకు బలం ఎక్కువుగా వుంటే సంధి చేసుకోవాలి. అది రాజనీతి. పైగా పాండవులను కంటికి రెప్పలా కాపాడుతున్నాడు హరి. అది తెలిసి కూడా మూర్ఖంగా పౌరుషానికి పోయరు. కృష్ణార్జునుల బలం తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు చింతించి ఫలమేమిటి?" అన్నాడు విదురుడు. ఇంతలో వ్యాసుడు కూడా వచ్చాడు. " నాయనా! నీకు తెలియనిదీ, నీకు కొత్తగా చెప్పవలసినదీ ఏదీ లేదు. భూభారం కొంత తగ్గడానికే ఈ యుద్ధం జరిగింది. ఇకమీదట ధర్మరాజునే నీ కుమారుడిగా భావించుకో. పాండవులందరినీ ప్రేమాభిమానాలతో చూడు" అని ధృతరాష్ట్రుడికి హితవు చెప్పాడు.

ఇలా అంటూ వుండగానే కృష్ణుడు, ధర్మరాజు వచ్చారు. ధర్మరాజు పిన తండ్రికి వంగి నమస్కరించాడు. శోకంలో వున్న ధృతరాష్ట్రుడు ధర్మరాజు శరీరమంతా తడిమి చూసి కౌగలించుకున్నాడు. మరి కాసేపటికి భీమసేనుడు వచ్చాడు. "రారా తండ్రీ! రా" అని భీముణ్ణి రెండు చేతులతోనూ దగ్గరకు తీసుకోబోయాడు ధృతరాష్ట్రుడు. భీముణ్ణి వద్దని సైగ చేసి ఇనుముతో చేసిన ఒక బొమ్మను ఆ ధృతరాష్ట్రుడు ముందు నిలబెట్టాడు కృష్ణుడు. ఇనుపమయంగా వున్న ఆ బొమ్మను భీమసేనుడే అనుకుని ధృతరాష్టుడు రెండు చేతులతోనూ గట్టిగా నొక్కి, తన ఉక్కు కౌగిలిలో బిగించి అమితమైన కోపంతో అలాగే హతమార్చబోయాడు. తీరా నొక్కాకా "అయ్యో! నా ప్రేమాతిశయం వల్ల ఏమీ తెలీలేదు. నా కౌగలిలో భీముదు మరణించలేదు కదా" అని కల్లబొల్లి విచారాన్ని నటించాడు.

"ప్రభూ! మీ వల్లమాలిన ప్రేమ ఇంతపని చేస్తుందని నేను ముందే గ్రహించను. భీముణ్ణి మీ పరిష్వంగంలోకి వెళ్ళవద్దని కళ్ళతోనే హెచ్చరించాను. మీ కౌగిలిలో విరిగిముక్కలైంది భీమసేనుడు కాదు, ఒక ఇనుప విగ్రహం! దైవానుగ్రహం వల్ల భీముడు క్షేమంగానే వున్నాడు" అన్నాడు కృష్ణుడు. గత్యంతరం లేక కోపాన్ని దిగమించుకున్న ధృతరాష్ట్రుడు పాండుపుత్రులందరినీ దగ్గరకు తీసుకుని ఆశీర్వదించాడు.

శ్రీ మహాభారతంలో కథలు ---ఉదంకుడు

కురు పాండవ యుద్ధం ముగిశాక ద్వారకకు బయలుదేరాడు కృష్ణుడు.

రథం బయలుదేరింది. కొంచెంసేపట్లో ఉదంకుడి ఆశ్రమాన్ని సమీపించింది. కృష్ణుడు అక్కడ దిగి ఉదంక మహామునికి వినయంగా నమస్కరించి ఆయన ప్రక్కనే దర్భాసనం మీద కూర్చున్నాడు.

"మాధవా! పాండవ కౌరవుల యుద్ధం చక్కబెట్టి వచ్చావా? అనుకున్న పని నెరవేరింది గదా! అయినా నువ్వు తలచుకుంటే కానిదేముందిలే!" అన్నాడు ఉదంకుడు ఎత్తిపొడుపుగా.

"నయానా భయానా చెప్పాను. బ్రతిమాలాను. కానీ, ఆ దుర్యోధనుడు నా మాట వింటేనా? భీష్మ ద్రోణులు కూడా ఎంతో చెప్పారు. ఊహూ! అతగాడికి చెవికెక్కితేనా! గర్వంతో, లోభంతో కళ్ళుమూసుకుపోయి యుద్ధం చేశాడు. బంధుమిత్ర పరివార సమేతంగా మరణించాడు. విధిని ఎవరు దాటగలరు?" అన్నాడు కృష్ణుడు.

ఉదంకుడు కోపం ఆపుకోలేకపోయాడు. "నువ్వు వట్టి మోసగాడవు! చేతనై ఉండి కూడా సంధి చెయ్యకుండా నిష్కారణంగా కౌరవకులాన్ని నాశనం చేశావు. నీకు శాపమిస్తాను" అన్నాడు.

"అయ్యా! నువ్వు మహర్షివి. తొందరపాటు తగదు. కోపం కూడదు. నన్ను శపిస్తే నువ్విన్నాళ్ళనుంచీ సమకూర్చుకున్న తపస్సంపదా, బ్రహ్మచర్యం వృథాగా నశించిపోతాయి. ముందు నేను చెప్పేది విను. తరువాత నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి" అన్నాడు కృష్ణుడు. ఉదంకుడు అంగీకరించాడు.

"ఓ తపస్వీ! బ్రహ్మస్వరూపం ధరించి అన్ని లోకాలనూ నేనే సృష్టిస్తాను. విష్ణురూపం ధరించి రక్షిస్తాను. శివస్వరూపం ధరించి సంహరిస్తాను. ధర్మం నశించి అధర్మం ప్రబలినప్పుడు అవతరించి, దుర్మార్గులను నాశనం చేసి ధర్మస్థాపనం చేస్తాను. అలాంటివాడినై వుండి కూడా అధర్మపరులై కౌరవులను ధర్మపరులైన పాండవులతో కలపాలని చూశాను. ఫలితం లేకపోయింది. కౌరవులు తమ దుర్మార్గం వల్ల ధర్మయుద్ధంలో పాండవుల చేతుల్లో మరణించారు. ఇందులో నువ్వు నన్ను శపించవలసిందేముంది?" అని ప్రశ్నించాడు కృష్ణుడు.

తల వంచుకున్నాడు ఉదంకుడు. "మహాత్మా! నా అనుగ్రహం, తొందరపాటు నీ అమృత వాక్కులు వినడం వల్ల పోయాయి. ప్రభూ! నీ దయకు నేను పాత్రుడనైతే, అనుపమానమైన నీ స్వరూపం నాకు చూపించవా? నా చూపులు సార్థకం చెయ్యవా?" అని నమస్కరించి ప్రార్థించాడు.

కృష్ణుడు ఆ ప్రార్థన ఆలకించి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఆశ్చర్యంతో చలించిపోయాడు ఉదంకుడు. "బహు పాదాలు, బహు శిరస్సులు, బహు గర్భాలు, బహు భుజాలు, సర్వం నువ్వే అయి కనిపిస్తున్నావు. భయమేస్తోంది. ప్రభూ! ఈ రూపం ఉపసంహరించి ఎప్పటిలా సౌమ్యాకారం ధరించి కనిపించు!" అని అర్థించాడు ఉదంకుడు.

"ఉకందా! నీకేం వరం కావాలో కోరుకో" అన్నాడు వాసుదేవుడు.

"దేవా, ఇది మరుభూమి. ఇక్కడ నీళ్ళు దొరకవు. నాకు నిరంతరం జలం లభించేట్టు అనుగ్రహించు".

"అలాగే! నన్ను తలచుకోగానే జలం లభిస్తుంది నీకు!" అని వాసుదేవుడు ఉదంకుడికి వరమిచ్చాడు.

ఆ తరువాత ఒకసారి ఉదంకుడికి దాహం వేసింది. కృష్ణుడ్ని తలచుకున్నాడు. వెంటనే భుజాన తోలుసంచితో నల్లటి మనిషొకడు ప్రత్యక్షమయ్యాడు. అతడిచుట్టూ వేటకుక్కలున్నాయి. దిగంబరుడు. చేతిలో విల్లూ, బాణాలు ఉన్నాయి.

"ఉదంకా! ఈ నీళ్ళు తాగి నీ దాహం తీర్చుకో" అన్నాడతను.

"చీ! ఆ నీళ్ళు నా కక్కరలేదు" అన్నాడు ఉదంకుడు అసహ్యించుకుంటూ.

"చూడు! నువ్వు దాహంతో బాధపడుతూంటే, నీమీద దయతో వచ్చాను. కాదనకుండా తాగు!" అన్నాడు దిగంబరుడు.

"నువ్వు నాకేం సలహా చెప్పనక్కర్లేదు. దయచెయ్యి" అన్నాడు ఉదంకుడు.

వెంటనే ఆ దిగంబరుడు కక్కతోసహా అంతర్థానమయ్యాడు. ఇంతలో కృష్ణుడక్కడికి రానే వచ్చాడు. "మాధవా! మా మంచి వరం ఇచ్చావులే! ఎంత దాహమైనా నిషాదుడిచ్చిన నీళ్ళు నేను తాగుతానా?" అని నిష్ఠూరంగా అడిగాడు ఉదంకుడు.

"అయ్యో! నీ కోసం నేనుపడ్డ శ్రమంతా వృథా అయింది. నేను ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి నీకోసం అమృతం ఇమ్మని అడిగాను. మానవులకు అమృతమెందుకు, ఇంకోటేదైనా అడగమన్నాడు. నేను ససేమిరా కాదన్నాను. 'నా మీద ఉన్న ప్రేమతోనైనా ఉదంక మహామునికి అమృతం ఇవ్వాలి ' అని ప్రార్థించాను. 'సరే అయితే! నేను మారురూపంలో వెళ్ళి అతనికి అమృతం ఇస్తాను. అతను కనుక సిగ్గుపడో, అసహ్యించుకునో ఆ అమృతం తాగకపోతే మాత్రం నేను దానికి బాధ్యుడ్ని కాను ' అన్నాడు ఇంద్రుడు. నేను సరేనన్నాను. అతడి రూపానికి రోసి నువ్వు ఆ అమృతాన్ని తిరస్కరిచావు. పోనీలే! ఏం చేస్తాం! నేనిచ్చిన వరం వృథా కాకుండా చేస్తాను. నీకు నీరు కావలసివచ్చినప్పుడు మేఘాలు ఈ మరుభూమిలో వచ్చి వర్షిస్తాయి. అవి ఉదంక మేఘాలనే పేరుతో ఇక్కడే సంచరిస్తూ మానవాళికి ఉదకం ప్రసాదిస్తూ నీ కీర్తిని చాటుతూ ఉంటాయి" అని పలికి కృష్ణభగవానుడు అంతర్హితుడయ్యాడు. ఇప్పటికీ ఆ ఉదంక మేఘాలు ఒక్కొక్క పుణ్యతిథిలో ఆ మరుభూముల్లో వర్షిస్తుంటాయి.


శ్రీ మహాభారతంలో కథలు ---గదా యుద్ధంభీముడూ, దుర్యోధనుడూ గదాయుద్ధానికి సిద్ధమయ్యారు.

ఇద్దరూ ఒరిలోకి దిగారు.

వాళ్ళిద్దరూ తన శిష్యులే కాబట్టి వాళ్ళపోరు చూడాలని వచ్చాడు బలరాముడు.

అందరూ ఆయనకు గౌరవంగా నమస్కరించారు.

భీముడూ, దుర్యోధనుడూ గదాహస్తాలతోనే మొక్కారు.

"మహాత్మా! అన్నదమ్ములు పోరాడుతున్నారు చూడు!" అన్నాడు ధర్మరాజు.

బలరాముడు మట్లాడలేదు. చిరునవ్వు నవ్వి, వెళ్లి దూరంగా కూర్చున్నాడు.

భీమదుర్యోధనులు యుద్ధం మొదలు పెట్టారు.

భూమి గడగడ వణికింది.

గ్రహణసందర్భం కాకపోయినా రాహువు సూర్యుణ్ణి పట్టాడు.

నక్కలు భయంకరంగా అరిచాయి. ఆకాశంలో మబ్బు లేకుండా పిడుగు పడింది. గదాఘాతాల చప్పుళ్ళతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. కాసేపటికి ఇద్దరి శరీరాలూ నెత్తురుతో తడిసి మోదుగువృక్షాల్లా ఉన్నాయి.

భీముడు రెండుసార్లు మూర్చపోయాడు. అది చూసి అర్జునుడు భయపడి "బావా! దుర్యోధనుడితో మనవాడు చాలలేడంటావా?" అని కృష్ణుణ్ణి అడిగాడు.

కృష్ణుడు నవ్వి, "గురూపదేశ సమన్వయం ఇద్దరికీ సమానమే. భీముడికి బలం ఎక్కువ. దుర్యోధనుడికి చాతుర్యం ఎక్కువ. బలం కలిగి కూడా భీముడు దుర్యోధనుడి ఒడుపులకు చాలలేకపోతున్నాడు. దుర్మార్గుల్ని మోసం చేసి చంపడం తప్పుకాదు. అయినా ఇంతకంటే తెలివితక్కువతనం ఉంటుందా! అందరూ చచ్చి రాజ్యం మీద అశ విడిచి, మడుగులో దాక్కున్నవాణ్ణి వెతికి పిలిచి ఒంటరి కయ్యానికి రమ్మంటారా ఎవరైనా? మీరు లేని పదమూడు సంవత్సరాలూ భీముణ్ణి జయించాలనే దుర్యోధనుడు గదాయుద్ధ పరిశ్రమ చేశాడు. ధర్మారాజుకు కౌరవుల మీద అనుగ్రహం ఎక్కువై ఆలోచన అడుగంటింది. ఆఖరికి ఇది పందెపు యుద్ధమైంది" అన్నాడు.

అర్జునుడి మనస్సు చివుక్కుమంది.

హిడింబ బకాసురులను చంపి, జరాసంధుణ్ణి సంహరించి, కిమ్మీరుని వధించి, కీచకుణ్ణీ వాడి నూటైదుగురు తమ్ముళ్ళనీ ఒకేఒక్క రాత్రిలో శవాలను చేసిన భీమసేనుడు ఇప్పుడు దుర్యోధనుడి గదాఘాతాలకు తట్టుకోలేక బిక్కుబిక్కుమంటూ తమ్ముళ్ళవైపు చూస్తున్నాడు.

"ఇప్పుడేం చెయ్యడం" అన్నాడు అర్జునుడు ఎటూ పాలుపోక.

"గదా యుద్ధంలో నాభికి దిగువ భాగాన కొట్టకూడదు. కాని అంతకుమించి మార్గం కనబడటం లేదు" అన్నాడు కృష్ణుడు.

ఆ మాటలు విని, భీముడు తనవైపు చూసినప్పుడు చేత్తో తొడలు చరిచాడు అర్జునుడు. ఆ సంజ్ఞ తెలుసుకున్నాడు భీముడు.

గద తిప్పుతూ దుర్యోధనుడు పైకి ఎగిరేసరికి అదే అదుననుకుని బలం కొద్దీ అతని తొడలమీద మోదాడు. తొడలు విరిగి దుర్యోధనుడు కుప్పకూలాడు. అంతటా గందరగోళం చెలరేగింది.

"పాంచాలిని సభలోకి ఈడ్చి, చీరలు విప్పి అవమానించినట్టు లేదూ.." అంటూ భీముడు ఎడంకాలితో దుర్యోధనుడి తలమీద బలంగా తన్నాడు.

బలరాముడు ఇదంతా చూస్తూనే వున్నాడు. పట్టలేనంత ఆగ్రహం వచ్చిందాయనకు. కోపంతో ముఖం ఎర్రబడింది.

"ఓ మహారాజులారా! చూశారా భీముడు చేసిన అన్యాయం! గదాయుద్ధంలో నాభికి దిగువ భాగాన్ని నొప్పించరాదనే నియమం మీరు వినలేదా? భీముడు ఎంత అన్యాయానికి తెగించాడో చూడండి" అంటూ ఎలుగెత్తి అరిచాడు హలాయుధుడు.

గబగబ తన రథం దగ్గరకు వెళ్లి నగలి భుజాన వేసుకుని భూమి అదిరిపోయేటట్లు భీమసేనుడి వైపు నడిచాడు. కృష్ణుడు ఒక్కక్షణం వూరుకుని "దుర్యోధనుడి తొడలు విరగ్గొడతానని భీముడు ప్రతిజ్ఞ చేసిన సంగతి నీకు తెలుసు. చేసిన ప్రతిజ్ఞ చెల్లించుకోవడం రాజులకు పరమధర్మమని నువ్వే ఒకసారి నాతో అన్నావు. అదీగాక దుర్యోధనుని తొడలు భీముని వల్ల విరిగి పడతాయని మైత్రేయ మహాముని శపించాడు. ఇప్పుడదే జరిగింది. ఇందులో తప్పేముంది?" అన్నాడు.

బలరాముడు మండిపడ్డాడు.

"ధర్మార్థ కామాలు ఒకదాన్నొకటి నశింపచెయ్యకుండా వాటిని జాగ్రత్తగా అనుభవించాలి. అదీ గొప్పతనం! ధర్మాన్ని విడిచి, అర్థకామాల్ని కోరే పురుషుడు నిందలకు గురి అవుతాడు. మునిశాపం, ప్రతిజ్ఞ వుంటే వుండుగాక, అవన్నీ ధర్మం తప్పకుండా తీర్చుకోవాలి గాని ఇంత అన్యాయమా?" అన్నాడు.

"ఇందులో అధర్మమేముంది? ఎదిరించినప్పుడూ నడిచేటప్పుడూ కాదు, ఎగిరినప్పుడు కొట్టాడు భీముడు. అదేం రణనీతికి విరుద్ధం కాదే! అదీకాక ప్రాణం రక్షించుకోవడానికి ఏం చేసినా తప్పులేదని పెద్దలంటారు. తన తల పగలకొట్టడానికి దుర్యోధనుడు ఎగిరితే, నాభి కింది భాగం కొట్టకూడదని ధర్మసూత్రాలు వల్లె వేసుకుంటూ ప్రాణాలు పోగొట్టుకుంటాడా భీముడు? కలియుగం దగ్గర పడింది. ధర్మాధర్మాల స్వరూపమే మారబోతోంది. అందుకే దుర్యోధనుడు అన్ని పాపపు పనులు చేసాడు" అన్నాడు కృష్ణుడు.

ఆ మాటలు అంటున్నప్పుడు 'ధర్మక్షేత్రాధిపతిని నేనే ' అన్నట్లు ఆయన వెనక క్షణకాలం ఒక మెరుపు మెరిసి మాయమైంది.

బలరాముడు ఆ వెలుగు చూడలేక కళ్ళు నులుముకుని వెంటనే మళ్ళీ బుసకొట్టాడు కోపంతో.

"ఇటువంటి తుచ్చపు గెలుపు పొందిన భీముడు తగిన సత్కారాలే పొందుతాడు" అని రథమెక్కి వెళ్లిపోయాడు.

ధర్మరాజు స్థాణువై నిలబడ్డాడు. ఇంతలో వెనుకనుంచి చేతులమీద పాక్కుంటూ దుర్యోధనుడు వచ్చాడు. అతన్ని చూడగానే ధర్మరాజు కళ్ళవెంట గిర్రున నీళ్ళు తిరిగాయి.

"..నాకు ఎవరి సానుభూతీ అక్కర్లేదు. కంసుడికి దాసుడైన వసుదేవుడి కొడుకు నన్ను దొంగదెబ్బ కొట్టించాడు కనుక మీరంతా బతికిపోయారు. సరిగ్గా యుద్ధం చేస్తే మీతోపాటూ ఈ కృష్ణుడికి కూడా యమదర్శనం చేయించి వుండేవాణ్ణి. శిఖండిని చాటుచేసుకుని భీష్ముణ్ణి అర్జునుడు చంపేటట్లు చేశాడు. ధర్మరాజు చేత ఆబద్దమాడించి ద్రోణుణ్ణి చంపించాడు. రథం భూమిలోకి దిగబడినప్పుడు కర్ణుణ్ణి చంపించాడు. భూరిశ్రవుణ్ణీ, సైంధవుణ్ణీ కూడా అన్యాయంగానే హతమార్చాడు. ఇప్పుడు యుద్ధనీతికి వ్యతిరేకంగా భీముడి చేత నా తొడలు విరగగొట్టించాడు. ఇంకా సిగ్గులేకుండా ఈ కృష్ణుడేదో కర్మ ధర్మ చక్రవర్తని మీరంతా చాటింపేస్తున్నారు" అన్నాడు దుర్యోధనుడు ఉక్రోషంతో.

కృష్ణుడు నవ్వాడు. "గదాయుద్ధంలో నీ తొడలు విరగ్గొడతానని ప్రతిజ్ఞ చేసిన భీముడు పోన్లే పాపం అని పిడికిటితో పొడుస్తాడనుకున్నావా? నువ్వు చేసిన ఘనకార్యాలు ఒక్కొక్కటే గుర్తుకు తెచ్చుకుంటూ ఇక్కడే ఏడుస్తూ పడివుండు" అని పాంచజన్యం పూరించేసరికి పాండవులంతా రథాల మీద బయలుదేరి కౌరవ నగరం చేరుకున్నారు.

"గాండీవం, అమ్ములపొదలూ అవతల పెట్టించి ముందు నువ్వు రథం దిగు. తరువాత నేను దిగుతాను అన్నాడు కృష్ణుడు అర్జునుడితో.

"విజయుడు ధనువూ, అమ్ములపొదలూ తీసుకుని దిగిన తరువాత కృష్ణుడు పగ్గాలు మడిచిపెట్టి రథం దిగాడు. జెండాలో వున్న కపి తన భూతగణాలతో సహా తొలగిపోయింది. వెంటనే ఆ రథం గుర్రాలతో సహా చురచుర కాలిపోయింది.

"దేవా! ఇది చాలా ఆశ్చర్యంగా వుంది. ఈ రథం ఎందుకిలా కాలిపోయింది?" అని అర్జునుడు అడిగాడు.

"ద్రోణ కర్ణ అస్త్రాగ్నులలో ఇదివరకే కాలవలసింది. యుద్ధం అయిపోయేదాకా కావాలని నేనే రక్షించాను" అన్నాడు కృష్ణుడు.

అర్జునుడు కృష్ణ ప్రభువుకు వందనం చేశాడు. నడుస్తున్న స్వామిపై పుష్ప వృష్టి కురిసింది.

శ్రీ మహాభారతంలో కథలు ---ఉత్తరకుమార ప్రజ్ఞలువిరాటరాజు గోవులను కౌరవులు దొంగతనంగా వచ్చి తరలించుకుపోయారు. రాజు నగరంలో లేని తరుణం చూసి దుర్యోధనుడు ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడు. విరటరాజు కుమారుడైన ఉత్తరుడికీ విషయం తెలిసింది. "నా రథాన్ని నడపగలిగే సారథి కనక దొరికితే నేనొక్కణ్ణే దండెత్తి ఆ గోవులను మళ్ళించుకుని రాగలను. నా యుద్ధం చూసి వాళ్ళు తోక ముడవాల్సిందే" అన్నాడు ఉత్తరకుమారుడు.

ఉత్తరుడీ మాటలు చెపుతూనప్పుడు ద్రౌపది అక్కడే వుంది. గబగబ విరాటరాజు కూతురు ఉత్తర దగ్గరకు పరుగెత్తుకుని వెళ్ళి, "బృహన్నలను ఉత్తరకుమారుడికి సారథిగా పంపించండి. మన బృహన్నల పూర్వం అర్జునుడికి సారథ్యం చేసింది. అతనివద్ద విలువిద్య రహస్యాలు తెలుసుకుంది. అందువల్ల కార్యసాధన అవుతుంది" అని ఆలోచన చెప్పింది.

ఉత్తర ఈ విషయం అన్నగారితో చెప్పింది.

ఉత్తరకుమారుడు సరే అన్నాడు.

రథం బయలుదేరింది. ఉత్తరుడు ఉత్సాహంగానే నగరం నుండి బయలుదేరడు.

"రథం వేగంగా పోనీ! కౌరవులు గోవులను తరలించుకుపోతున్న దిక్కుగా పోనిస్తే వారిని పారిపోకుండా పట్టుకుందాం" అన్నాడు బృహన్నలతో.

గుర్రాలు అఘమేఘాలమీద పోతున్నాయి. కౌరవసేన కనుచూపు మేరలో వుంది. మహసముద్రంలా కనిపిస్తోంది. అది చూడగానే ఉత్తరకుమారుడికి గుండెలు ఝల్లుమన్నాయి. బెదురు పుట్టింది. కళ్ళు బయర్లు కమ్మాయి. చేతులతో కళ్ళు మూసుకున్నాడు. రథం మీద నిలవలేకపోయాడు. "అయ్యయ్యో! ఇంతపెద్ద సేనను నేనెలా ఎదిరించగలను? నావెంట సైన్యమూ లేదు, సేనాపతీ లేడు. బృహన్నలా! నావల్లకాదు. రథం మరల్చు. తిరిగిపోదాం" అన్నాడు.

అది విని బృహన్నల నవ్వింది. "ఉత్తరకుమారా! నీవు రాకుమారుడివి. అడవాళ్ళ ముందు ఏవేవో ప్రతిజ్ఞలు పలికి నన్ను కూడా యుద్ధభూమికి తెచ్చావు. ఆవుల్ని తీసుకుని పోకుండా వట్టిచేతులతో వెడితే మనల్ని చూసి అందరూ పరిహాసం చేస్తారు. కనుక ధైర్యంతో నిలిచి పోరాడు" అని రథం ఆపకుండా ముందుకు పోనిచ్చింది బృహన్నల.

"నావల్ల కానేకాదు. ఆవుల్ని వాళ్ళు తోలుకుపోతే పోనీ. ఆడవాళ్ళు నన్ను చూసి ఎగతాళి చేస్తే చేయనీ! నేను మాత్రం క్షణం కూడా ఇక్కడ వుండను. రథం వెనక్కి తిప్పు. లేకపోతే నేనే నడచిపోతాను" అని ఉత్తరుడు విల్లూ, అంబులూ అక్కడే పారేశాడు. రథం మీద నుంచి కిందకు దూకి పిచ్చివాడిలా ఊరివైపు ఉరకడం మొదలుపెట్టాడు.

"రాకుమారా! నిలునిలు! పారిపోకు! క్షత్రియుడవు. ఇలా యుద్ధభూమి నుంచి పారిపోకూడదు" అని బృహన్నల వెంటపడింది.

"నన్ను పట్టుకోవద్దు. వదులు. నీకు పుణ్యం వుంటుంది. నీకు కావలసినంత ధనం ఇస్తాను. కానుకలు ఇస్తాను. చీరలు పెడతాను. ఏం కావాలంటే అది ఇస్తాను. నన్ను విడిచిపెట్టు. మా అమ్మకు నేనొక్కణ్ణే కొడుకును. నేను కుర్రవాణ్ణి. తల్లిచాటు బిడ్డను. నాకు భయం వేస్తోంది. నన్ను పోనీ" అని కేకలు పెడుతూ పరిగెత్తుతూనే ఉన్నాడు ఉత్తరకుమారుడు.

కాని బృహన్నల విడిచిపెట్టలేదు.

పట్టుకుని రథం మీద కూర్చోబెట్టింది.

కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు ఉత్తరుడు.

"రాకుమారా! భయపడకు. ఈ కౌరవులతో నేను యుద్ధం చేస్తాను. గుర్రాలను మాత్రం నీవు పట్టుకో. నీవు రథం తోలగలిగితే మిగతా కార్యమంతా నేను నడిపిస్తాను" అని ఉత్తరుడికి పగ్గాలు అందించింది బృహన్నల.

తరువాత రథాన్ని దూరంగా కనిపించే జమ్మిచెట్టు వద్దకు పోనిమ్మంది.

అక్కడికి చేరాక "విరాటపుత్రా! ఈ చెట్టెక్కి పైన వున్న ఆయుధాలు పట్టుకురా" అంది బృహన్నల.

ఉత్తరుడికి ఇదేమీ అర్థం కాలేదు. బిత్తరచూపులు చూస్తుంటే "ఉత్తరకుమారా! చెట్టెక్కి చూడు! అది పాండవుల ఆయుధాల మూట!! అనవసరంగా భయపడకు, ఆలస్యం చేయకు" అంది బృహన్నల.

ఉత్తరుడు బృహన్నల చెప్పినట్టే చేశాడు. ఆయుధాల మూటను చూసి సంభ్రమాశ్చర్యాలతో కళ్ళు మూసుకున్నాడు. "బృహన్నలా! ఆశ్చర్యంగా వుంది నాకు. పాండవులు సర్వం పోగొట్టుకుని అడవులపాలయ్యారు కదా! వాళ్ళ ఆయుధాలు ఇక్కడికి ఎలా వచ్చాయి? వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలుసా?" అని అడిగాడు.

అప్పుడు బృహన్నల తానెవరైందీ చెప్పి తన అన్నదమ్ములను గురించీ, ద్రౌపదిని గురించీ చెప్పింది.

ఉత్తరుడు నమస్కారం చేశాడు. బృహన్నల రూపంలో వున్న అర్జునుడు కౌరవ సేన వైపు రథాన్ని మళ్ళించి గాండీవం ఎత్తిపట్టాడు. మూడుసార్లు నారి సారించాడు. తన శంఖం దేవదత్తాన్ని గట్టిగా పూరించాడు.

అంతే! కౌరవసేనంతా ఆ గంభీరఘోషకు చెల్లాచెదురైంది. ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగెత్తారు.

గోవుల్ని తీసుకుని ఉత్తరుడూ, అర్జునుడూ నగరానికి తిరిగి వచ్చారు.

అదీ కథ!!

అంతఃపురకాంతల ముందు గొప్ప వీరుడులాగా బీరాలు పలికి తీరా యుద్ధభూమికి వచ్చిన తరువాత బెదిరిపోయి తిరిగుముఖం పట్టి పారిపోయిన ఉత్తరకుమారిడి కథ మహాభారతంలో చెప్పడం కేవలం హాస్యం కోసమే కాదు, గుణాలు కలవాళ్ళు గుణహీనులను చూసి గేలిచేయడం స్వభావసిద్ధం. అలాగే శక్తి సామర్థ్యాలు కలిగినవాళ్ళు అవి లేనివాళ్ళను చూసి కించపరచటం పరిపాటి. కాని ధనుంజుయుడు మాత్రం అలా చేయలేదు. వీరాధివీరుడు అయిన అతడు యుద్ధభూమిలో ఉత్తరుడు నిర్వీర్యుడు కావడం చూసి, అతణ్ణి నిలబెట్టి ధైర్యం చెప్పి చేరదీసి వీరుణ్ణిచేసాడు. ధైర్యం కోల్పోయిన ఉత్తరుడికి చేయవలసిన సహాయం చేసి, ధైర్యం నూరిపోసి వీరుడిగా నిలిపి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టాడు.

అర్జునుడి మూలంగా వీరుడైన ఉత్తరుడు కురుక్షేత్ర యుద్ధంలో శల్యుడితో తలపడి వీరస్వర్గం అలంకరించాడు.

శ్రీ మహాభారతంలో కథలు ---సైంధవ వధ


సూర్యుడు మెల్లగా ఎర్రబడడం చూసి దుర్యోధనుడు కర్ణుడి దగ్గరకు వచ్చాడు. "రాధేయా! సాత్యకీ, భీముడూ సహాయంగా అర్జునుడు సైంధవుణ్ణి తరుముకొస్తున్నారు. ఇంకెంచెం సేపు వాణ్ణి ముందుకు వెళ్ళకుండా నిలబెట్టగలిగావంటే సూర్యుడు అస్తమిస్తాడు. అర్జునుడు చస్తాడు. వాడితోపాటే మిగిలినవాళ్లూనూ! ' పద్మప్యూహంలో అభిమన్యుణ్ణి చంపడానికి సహయపడిన సైంధవుణ్ణి రేపు సుర్యాస్తమయం లోగా చంపుతాను ' అని డాంబికాలు పలికాడు. చేటుకాలం వచ్చే ఇలాంటి ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు కాస్త శ్రమకోర్చి నిలబడ్డామంటే ఇంక రాజ్యమంతా మనదే" అన్నడు.

కర్ణుడు సరేనని విల్లందుకున్నాడు.

కర్ణుడికి, అర్జునుడికీ మధ్య ఘోర యుద్ధం జరిగింది.

అందరినీ తరిమికొట్టి సైంధవుడి దగ్గరకు చేరాడు అర్జునుడు.

అతనిని చంపబోయే లోపల కౌరవదొరలంతా సైంధవుడికి అడ్డంగా నిలబడ్డారు. పొద్దుగుంకే లోపల వాళ్ళను జయించి సైంధవుణ్ణి చంపే వ్యవధి కనిపించక దిక్కులు చూస్తున్నాడు అర్జునుడు.

అది చూసి, అర్జునా! ఇంక వీళ్ళతో ఇలా యుద్ధం చేస్తూ కూర్చుంటే లాభం లేదు. సూర్యుడు అస్తమించబోతున్నాడు. దీనికి నేనో ఉపాయం చేస్తాను! దాంతో కాని సైంధవుడు చావడు. సూర్యుణ్ణి మబ్బులతో కప్పేస్తారు. ఆ చీకటి చూసి అందరూ సూర్యాస్తమయమైందనుకుని సంతోషంతో ఒకరినొకరు పొగుడుకుంటూ విచ్చిపోతారు. అప్పుడు నీ ప్రతిజ్ఞ చెల్లించుకో" అన్నాడు కృష్ణుడు. "బావా! ఇంత పరాక్రమం వుండి కూడా ఇలాంటి మిషతో ప్రతిజ్ఞ తీర్చుకోమంటావా?" అని అర్జునుడు బాధగా అన్నాడు.

"దుర్మార్గుల్ని దుర్మార్గంతోనూ, మోసగాళ్ళను మోసంతోనూ చంపడం తప్పు కాదు! నువ్వేం బాధపడకు" అంటూ మాధవుడు మాయాతిమిరంతో మార్తాండ మండలాన్ని మరుగుపరచాడు. అది చూసి సూర్యుడు అస్తమించాడనుకుని కౌరవ సైన్యాలన్నీ సింహనాదాలు చేస్తూ చెదిరిపోయాయి. సైంధవుడు సంతోషం పట్టలేక రథమెక్కి నిలబడ్డాడు. "అర్జునా! అడుగో సైంధవుడు. ఆలస్యం చెయ్యకు" అని కృష్ణుడు తొందరపెట్టాడు.

తక్షణం బాణం సంధించాడు అర్జునుడు. దాంతో సైంధవుడి తల తెగింది.

"పార్ధా! ఆ తల కింద పడనియ్యకు! అలాగే ఆకాశంలో ఆడించు. దాని సంగతి తరువాత చెబుతా నీకు" అన్నాడు కృష్ణుడు కంగారుపడుతూ. వెనక్కీ ముందుకీ కిందకీ పైకీ బాణాలు వేసి ఆ తలను ఆకాశంలో బంతిలా ఆడించాడు అర్జునుడు. ఇంతలో మాయచీకటి తొలిగి సూర్యబింబం ప్రకాశించింది. కౌరవులు దిక్కుతొచక పరుగులుపెట్టారు.

"బావా! వీడి తలకాయ ఇలా ఎంతసేపు వుంచమంటావు? దీన్ని ఎక్కడ పడెయ్యాలి? అసలు కధేమిటో చెప్పు?" అని అర్జునుడు అడిగాడు.

వృద్ధక్షత్రుడనే సింధురాజు పుత్రులకోసం ఎన్నెన్నో పూజలూ, తపస్సులూ చేసి చివరకు జయద్రథుణ్ణి కన్నాడు. వీడి చిన్నతనంలో ఒకనాడు 'వీడు యుద్ధంలో ఏమరి వున్నప్పుడు చంపబడతాడు' అని అశరీరవాణి పలికింది. వృద్ధక్షత్రుడు అది విని ఎంతో విచారించాడు. 'సైంధవుడి(జయద్రథుడు) తల ఎవడు నేల పడేస్తాడో వాడి తల నూరు చెక్కలగుగాక ' అని అతడు తన తపోబలంతో పలికాడు. అతనిప్పుడు శమంతపంచక సమీపంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఈ తల వెళ్ళి ఇప్పుడతని తొడమీద పడాలి. పాశుపతాస్త్రాన్ని ప్రార్థించు " అన్నాడు కృష్ణుడు.

అర్జునుడు వేసిన పాశుపతం అనేక బాణాల ఆకారం ధరించి అ శిరస్సును తీసుకువెళ్ళి వృద్ధక్షత్రుడి తొడమీద పడేసింది. తపస్సులో వున్న వృద్ధక్షత్రుడు స్పర్శకు ఖంగారుపడి దానిని కిందకు తోశాడు. వెంటనే అతని తల నూరు చెక్కలైంది. చిత్రమేమంటే సైంధవుడి తల నేల పడేవరకూ అతని మొండెం అలా రథం మీద నిలబడే వుంది.

ఇదంతా చూసి కౌవర సేనలు నిర్ఘాంతిపోయరు. తమ్ముడి ప్రతిజ్ఞ నెరవేరినందుకు ధర్మరాజు సంతోషించాడు.

శ్రీ మహాభారతంలో కథలు ---మరుత్తుడు


యవనాశ్వుడు, భగీరథుడు, కార్తవీర్యుడు, భరతుడు, మరుత్తుడు, పంచ మహాసామ్రాట్టులుగా ప్రసిద్ధి పొందారు.

మరుత్తుడు కృతయుగానికి చెందినవాడు. ధీశాలి. ఆదర్శ చక్రవర్తిగా వేయేళ్ళు రాజ్య పాలన చేశాడు. ఆయన చేసిన యజ్ఞ యాగాలకు లెక్కే లేదు. యజ్ఞమంటపాలన్నీ బంగారంతో చేయించాడు. ఆయన చేసిన యాగాలను చూసేందుకు దేవతలే దిగివచ్చారు.

మరుత్తుడు రాజ్యాధికారానికి రాగానే బ్రహ్మండమైన ఒక యజ్ఞం తలపెట్టాడు. దానికి బోలేడంత డబ్బు అవసరమైంది. యాగ నిర్వహణకు అవసరమైన నిధులు ఎలా సమకూర్చుకోవడమా అని మరుత్తుడు సతమతమయ్యాడు. దానికి తోడు యాగాన్ని భగ్నం చేసేందుకు ఇంద్రుడు కాచుకుని వున్నాడు. మరుత్తుడికి ఏం చేయాలో పాలుపోక నారదమహర్షిని సంప్రదించాడు.

"బృహస్పతి సోదరుడు సంవర్తకుడు అడవుల్లో తపోదిక్షలో వున్నాడు. నీవు కనక ఆయనను అర్థిస్తే యాగనిర్వహణకు అవసరమైన ధనాన్ని ఆయన నీకు ఇస్తాడు" అని నారదుడు సలహా ఇచ్చాడు.

మరుత్తుడు సంవర్తకుణ్ణి వెతుక్కుంటూ అడవులకు వెళ్ళాడు. సంవర్తకుడు శివుణ్ణి అర్థించమని మరుత్తుడికి సలహా ఇచ్చాడు. మరుత్తుడు కైలాసానికి వెళ్ళి పరమశివుణ్ణి ప్రార్థించాడు. శివుడు ప్రత్యక్షమై యాగ నిర్వహణకు కావల్సిన బంగారం, వస్తు వాహనాలూ ఇచ్చాడు. మరుత్తుడు అమితానందంతో తన దేశానికి తిరిగి వెళ్ళి యాగం ప్రారంభించాడు. ఆ యాగం చివరికంటా కొనసాగకుండా వుండేందుకు ఇంద్రుడు ఎన్నో ఆటంకాలు కల్పించాడు. అయితే అవేవీ ఫలించలేదు. యాగం నిర్వఘ్నంగా సాగిపొయింది. యాగానికి ఖర్చుపెట్టగా మిగిలిన సొమ్మును మరుత్తుడు హిమాలయపర్వతప్రాంతాలలోని తన రాజధాని నగరంలో భద్రపరిచాడు. అప్పటి నుంచి ఆయన ఐశ్వర్యవంతుడైన మహారాజుగా పేరు పొందాడు.

భారతయుద్ధం పరిసమాప్తమయ్యాక ధర్మపుత్రుడికి రాజ్యాభివృద్ధి చేసుకునేందుకూ, పట్టణాలూ, నగరాలూ నిర్మించేందుకూ, ఆశ్వమేథయాగం చేసేందుకూ అమితంగా సంపద అవసరమైంది. ఎవరిదగ్గరా యాగ నిర్వహణకు కావల్సినంత ధనం లేదు. కాని, అఖిలపాపాలనూ హరించే అశ్వమేథయాగం చెయ్యమని వ్యాసభగవానుడు తనని ఆజ్ఞాపించాడు. ధర్మరాజు సంకటంలో పడ్డాడు. దిక్కుతోచక మాధవుణ్ణి ప్రార్థించాడు. 'దామోదరా! నీవే గతి. మాకు తల్లీ, తండ్రీ, గురువూ, మంత్రీ, మిత్రుడూ సమస్తం నువ్వే మహాత్మా! అయినా నువ్వు మమ్మల్ని ఎప్పుడు రక్షించలేదు కనుక?! అంతా నీ దయ వల్ల జరగవల్సిందే' అని మనసులోనే కృష్ణుడికి అంజలిపడ్డాడు ధర్మరాజు.

వ్యాస మహర్షికి పరిస్థితి అర్థమైంది. ధర్మరాజుని దగ్గరకు పిలిచి "నాయనా! మరుత్తుడు గతంలో బ్రహ్మాండమైన యజ్ఞం చేశాడు. ఆ యాగం చూసేందుకు దేవతలూ, మునులూ వెళ్ళారు. ఆయన చేసిన దానాలు అన్నీ ఇన్నీ కావు. ఆ యాగ నిర్వహణకు అవసరమైన ధనాన్నంతటినీ పరమేశ్వరుడు సమకూర్చాడు గనుక సరిపోయింది. లేకపొతే మానవ మాత్రుల వల్ల అయ్యే పనేనా? ఆ యాగ నిర్వహణకు ఖర్చు చేసింది పోను మిగిలిన ధనాన్ని, బంగారాన్నీ మరుత్తుడు హిమాలయాలలో దాచి ఉంచాడు. మీరు వెళ్ళి అవి తీసుకురండి. అశ్వమేథయాగం నిర్విఘ్నంగా సాగుతుంది. మీరొచ్చేలోగా నేనూ, మజ్ఞవల్కుడూ యాగానికి కావల్సిన పనులన్నీ జరిపిస్తాం. కావల్సిన సంబరాలన్నీ తెప్పిస్తాం" అన్నాడు మహర్షి ఉపాయం చెబుతూ.

పాండవులు సంతోషించి హిమాలయాలవైపు కదిలి వెళ్ళారు. ఆ ధనరాసులతోనే ధర్మరాజు అశ్వమేథయాగం నిర్వహించాడు. ఆ డబ్బుతోనే బంగారు యజ్ఞశాలలూ, వేదికలూ, యూపస్తంభాలూ, తోరణాలూ, వివిధపాత్రలూ చేయించి దానం చేశాడు ధర్మరాజు.


శ్రీ మహాభారతంలో కథలు --- ధృతరాష్ట్రుడి పుత్రప్రేమ

కృష్ణద్వైపాయనుడు తన మందిరానికి వస్తున్నాడని తెలిసి విదురుని సాయంతో ఆ మహామునికి ఎదురువెళ్ళి సముచిత మర్యాదలతో స్వాగతం చెప్పాడు ధృతరాష్ట్రుడు. సత్కారాలు అందుకున్న తరువాత, "నాయనా! నువ్వూ, నేను , విదురుడూ, భీష్ముడూ బతికుండగానే ఇంత అధర్మం జరుగుతుంటే ఉపేక్షించటం న్యాయం కాదు" అన్నాడు వ్యాసభగవానుడు ధృతరాష్ట్రుడితో.

"స్వామీ! మళ్ళీ ఏం జరిగింది?" అని ధృతరాష్ట్రుడు భయపడుతూ అడిగాడు.

"పాండవులు వనవాసక్లేశాన్ని అనుభవిస్తున్న యీ సమయంలోనే దండెత్తి వెళ్ళి వాళ్ళను హతమార్చాలని కర్ణుడు నీ కొడుక్కి సలహా ఇస్తున్నాడు. పాపాత్ముడైన నీ కొడుకు అందుకు సంతోషించి సమరసన్నాహాలు చేస్తున్నాడు. వద్దని వారించాను కాని, వింటాడన్న నమ్మకం లేదు నాకు. నీకు చెబితే నువ్వయినా కొడుక్కి బుద్ధి చెబుతావేమోనని ఇలా వచ్చాను. రాజ్యం పోయి, అడవులలో కందమూలాలు తింటూ కాలం గడుపుతున్న పాండవులను వధించడానికి పూనుకున్నాడు నీ పుత్రరత్నం. నువ్వు కూడా అతన్ని వారించకుండా వూరుకున్నావు. అయినా యుద్ధం కోసం మీరింతగా ముచ్చటపడటం దేనికి? అన్నమాట ప్రకారం పన్నెండేళ్ళు అరణ్యవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసం పూర్తయ్యాక వాళ్ళే యుద్ధానికి సిద్ధమవుతారు. అప్పుడు చూపించమను నీ కొడుకు ప్రతాపం! వనవాసులూ , తాపసులూ నిరాయుధులు కదా! వాళ్ళమీదకు దండెత్తి వెళ్తే అవమానం తప్ప మరేం మిగలదు. ఇది ఉచితం కాదని నీ కొడుకుతో చెప్పు" అని వ్యాసభగవానుడు ధృతరాష్ట్రుణ్ణి మందలించాడు.

"మహాత్మా! దుర్యోధనుడి దుర్మార్గ ప్రవర్తన వల్ల నేనూ, గాంధారీ, విదురుడూ, ద్రోణుడూ, కృపుడూ బాధపడని క్షణం లేదు. వాడు దుర్బుద్ధి అని తెలిసి కూడా పుత్రప్రేమ వల్ల వాణ్ణి విడిచిపెట్టలేకపోతున్నాను. ఏం చెయ్యమంటారు?" అని ధృతరాష్ట్రుడు దుఃఖిస్తూ అడిగాడు.

"నాయనా! సంతానం మీద విపరీత మమకారం నీ ఒక్కడికే కాదు వున్నది - అది లోక సహజం. మానవులు తమ బిడ్డలను ప్రేమించినట్లు మరెవ్వరినీ ప్రేమించలేరు. ఎంత డబ్బున్నా బిడ్డలు లేకపోతే సంతోషం లేదు. పూర్వం సకల గోవులకూ తల్లియైన సురభి సురేంద్రుడి దగ్గరకు వెళ్ళి ఒకసారి జాలిగా ఏడ్చింది.

'అమ్మా! ఎందుకింతగా ఏడుస్తున్నావు? అందరూ క్షేమమే కదా!' అని ఇంద్రుడు విస్మితుడై అడిగాడు.

'దేవేంద్రా! త్రిభువనాలూ నీ వజ్రాయుధ రక్షణలో సుఖంగా వున్నాయి. ఒక్క నా సంతానానికి మాత్రమే కష్టం మిగిలింది ' అంది సరభి గద్గద స్వరంతో.

'అదెలా సంభవం తల్లీ?' అని అమరేంద్రుడు మరింత ఆశ్చర్యంతో అడిగాడు.

'దేవరాజా! బలమైన పశువులతో బలహీనమైన పశువులను కట్టి మనుష్యులు నాగళ్ళు తోలుతున్నారు. అవి ఆ భారం మొయ్యలేకపోతే ములుకోలతో కొట్టి పొడిచి హింసిస్తున్నారు. అది చూడలేకుండా వున్నాను నేను ' అని వెక్కి వెక్కి ఏడ్చింది.

'అమ్మా! నీకు వేలకొలదీ సంతానం వుంది. అన్నిటికీ ఇలాంటి దుఃఖం సంభవించలేదు! ఎందుకు ఇంతగా బాధపడతావు?' అంటూ సురపతి ఆమెను ఓదార్చబోయాడు.

'అయ్యా! నీకు తెలియని ధర్మమేముంది? తల్లికి బిడ్డలందరూ ఒకటే. కొందరి మీద ఇష్టం, మరి కోందరి మీద అయిష్టం వుండవు ఏ తల్లికీ. ఎందరు బిడ్డలున్నా అందరూ సుఖంగా వుండాలనే కోరుకుంటుంది. నిజానికి దెబ్బతిన్న వాళ్ళనూ పడినవాళ్ళనే తల్లి మరింతగా ప్రేమిస్తుంది. బలహీనులై దీనవదనాలతో బాధపడుతున్న నా బిడ్డలను కనికరించు ' అని సురభి అర్థించింది.

ఆ మాటలు విని ఇంద్రుడు నవ్వుకున్నాడు. ఆమెను చూసి జాలిపడి వర్షం కురిపించాడు. అందువల్ల భూములన్నీ గుల్లబారి తృణసంపద పెరిగింది. పుష్కలంగా పశుగ్రాసం వుండటంతో పశువులు బలిష్టమయ్యాయి.

"మహారాజా! ఈ కథ వేదాలలో వుంది. పశువులలోనే సంతానంపై అంత ఆపేక్ష వున్నప్పుడు ఇంక మనుష్యుల సంగతి వేరే చెప్పడమెందుకు? నీకున్న విచారం నాకు తెలుసు. పుత్రమోహం సామాన్యమైనది కాదు. అయినా నీ నూరుగులు కొడుకుల మీద వున్నట్టే పాండవులపైన కూడా నీకు ప్రేమ వుండాలి. నీ కుమారులూ, పాండుకుమారులూ నీకు రెండు కళ్ళతో సమానం. ఏ కంటికి నొప్పి వచ్చినా బాధే! కాదంటావా?" అన్నాడు వేదవ్యాసుడు.

"నిజమే స్వామీ" అని చేతులు జోడించాడు ధృతరాష్ట్రుడు.

"సరే, కాసేపట్లో మైత్రేయ మహాముని వచ్చి నీ కొడుక్కి ధర్మోపదేశం చేస్తాడు.." అంటూ సాగిపోయాడు కృష్ణద్వైపాయనుడు.

తరువాత కొంచెం సేపటికి మైత్రేయుడు రానే వచ్చాడు. ధృతరాష్రుడు ఆ యతిని అతిభక్తితో పూజించాడు. ఇంతలో దుర్యోధనుడు తండ్రి దగ్గరకు వచ్చి మైత్రేయుణ్ణి నిర్లక్ష్యంగా చూస్తూ నిలబడ్డాడు. మైత్రేయుడికి కోపం వచ్చినా అణచుకుని "నాయనా! దుర్యోధనా! పాండవులతో వైరం మంచిదికాదు. మీరూ, వాళ్ళూ కలిసివుంటే కురువంశానికి శుభమౌతుంది. యుద్ధమంటూ వస్తే పాండవులను నువ్వు జయించలేవు. వాళ్ళు వజ్రకాయులు. మహా పరాక్రమవంతులు. భీముడొక్కడే వెయ్యి ఏనుగుల బలం కలవాడు. నువ్వు పాండవులతో స్నేహం చేసుకో. నా మాట విను" అని అనునయించాడు.

దుర్యోధనుడు ఆ మాటలకు సమాధానం ఇవ్వలేదు సరికదా, కాలి బొటనవేలితో నేలను తాటిస్తూ చేతులెత్తి తొడలు చరుచుకుంటూ వెకిలిగా నవ్వాడు. అది చూసేసరికి మైత్రేయుడికి కోపం పెచ్చుమీరింది.

వెంటనే లేచి, "నీచుడా! మునుల దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలియని అవివేకివి. సంగ్రామరంగంలో భీమసేనుని గదాఘాతాలవల్ల నీ తొడలు తెగిపడును గాక" అని శపించాడు.

ధృతరాష్ట్రుడు భయపడిపోయి శాపం మరల్చమని మహర్షి పాదాలు పట్టుకున్నాడు. "వీడికి సమబుద్ధి కలిగితే నా శాపం తగలదు. లేకపోతే ఫలితం అనుభవించవలసిందే" అని పలికి మైత్రేయుడు వెళ్ళిపోయాడు.

ఆ తరువాత మైత్రేయుడు అన్నంత జరిగింది.

కురుపాండవ సంగ్రామంలో భీముడు చేసిన ఊరుభంగమే సుయోధనుడికి మృత్యుహేతువయింది.

కొడుకును మందలించి సరియైన తోవలో పెట్టుకునేందుకు గుడ్డిప్రేమ అడ్డువచ్చిన ధృతరాష్ట్రుడు అప్పుడు వగచీ ప్రయోజనం లేకపోయింది.

శ్రీ మహాభారతంలో కథలు --- ఊర్వశి శాపం


ధర్మరాజు దివ్యాస్త్రాలు సంపాదించుకురమ్మని అర్జునుణ్ణి హిమగిరి ప్రాంతాలకు పంపాడు. అర్జునుడు దక్షిణదిశగా వెళ్ళి ఇంద్రలోక పర్వతం మీద తపస్సు చేసాడు. ఇంద్రుడు సంతోషించి కోరినన్ని వరాలు ఇచ్చాడు. అటు తరువాత యమధర్మరాజు దండాస్త్రాన్నీ, వరుణుడు పాశాన్నీ, కుబేరుడు అంతర్ధానాస్త్రాన్నీ ఇచ్చారు. అర్జునుడు ఇన్ని దివ్యాస్త్రాలు సంపాదించడం ఇంద్రుడికి నిజంగా ప్రీతి కలిగించింది. తన రథ సారథి మాతలిని పిలిచి అర్జునుణ్ణి దేవలోకానికి తీసుకురావల్సిందిగా ఆజ్ఞాపించాడు.

మాతలి సరేనని వెళ్ళాడు.

మాతలి సారథ్యంలోని రథం బంగారు ఆభరణాలతో చూడముచ్చటగా వుంది. వాయువేగంతో పరుగులు తీసే గుర్రాలు ఆ రథానికి పూంచి వున్నాయి. అవి మహాఘోషతో మేఘాలను చీల్చుకుంటూ వెళ్ళాయి.

మాతలి అర్జునుడి దగ్గరకు వెళ్ళి, "అర్జునా! అమరనాథుడు నిన్ను స్వర్గానికి తీసుకురమ్మని నన్ను పంపాడు. దేవ, ముని, గంధర్వ, అప్సరసలతో కొలువుతీర్చి దేవేంద్రుడు నీ రాకకై ఎదురు చూస్తున్నాడు. కొన్నాళ్ళు అక్కడే అమర సుఖాలు అనుభవించి తిరిగి భూలోకానికి వెళ్లవచ్చని ఇంద్రుడు నీతో చెప్పమన్నాడు" అన్నాడు.

అది విని అర్జునుడు మహదానందపడ్డాడు. దేవరథం అధిరోహించాడు. తక్షణం అది దివ్యపథం పట్టింది.

అమరావతీనగర మొగసాలలో ఆగింది. రథం దిగి లోకానికి నడిచాడు. అక్కడ దేవేంద్రుడు కొలువుతీరి ఉన్నాడు.

సవ్యసాచి సాష్టాంగ ప్రణామం చేశాడు. ఇంద్రుడు అర్జునుణ్ణి కౌగలించుకుని ఆప్యాయంగా శిరస్సు నిమిరాడు. నారదుడు ఆశీర్వదించాడు. తుంబురుడు పాట పాడాడు. అప్సరసలు నృత్యం చేశారు.

పార్థుడు అమరలోకంలో కొన్నాళ్ళుండి భూలోకంలో లేని సంగీత నృత్యగానాలూ, విలువిద్యలో మెళకువలూ తెలుసుకున్నాడు.

అర్జునుడి అందానికీ, ఠీవికీ, శక్తియుక్తులకీ దేవలోకంలోని అప్సరస్త్రీలు సమ్మొహితులయ్యారు. పాండవ మధ్యముడికి తన ప్రేమను అర్పించాలని సౌందర్యరాశి ఊర్వశి తహతహలాడసాగింది. అర్జునుడితో తన ప్రేమ సఫలమయ్యేట్టు చూడమని ఇంద్రుణ్ణి ప్రార్థించింది.

పార్థుడికి తన కోరిక తెలియపరచమని పరిచారిక చిత్రసేనను వేడుకుంది.

చిత్రసేన వెళ్ళి "మన్మథాకారా! అప్సరకన్య మా ఊర్వశి నిన్ను మోహించింది. నీవు లేకుండా క్షణమైనా గడపలేనంటోంది. కనుక ఆమెను చేపట్టి సుఖాలు అనుభవించు" అని అర్జునుడితో చెప్పింది.

అది విని ధనుంజయుడు చెవులు మూసుకున్నాడు. "ఆమె నాకు తల్లితో సమానం. పూజ్యురాలు. మా వంశానికి మూల పురుషుడైన పురూరవుణ్ణి ఆమె వరించింది. కనుక ఇలాంటి చెడు ఆలోచన ఆమె మనస్సులో రావటం మంచిది కాదని చెప్పు " అని బదులు చెప్పాడు.

చిత్రసేన వెళ్ళి ఆ సంగతి ఊర్వశితో చెప్పింది.

జగదేకసుందరి ఊర్వశి చిరుకోపం తెచ్చుకుని అందెలు ఘల్లుఘల్లున మోగుతుండగా తానే బయలుదేరి పార్థుడి మందిరానికి వెళ్ళింది.

"మేము అప్సరకాంతలం. భూలోకంలో పుణ్యకర్మలు చేసి స్వర్గానికి వచ్చిన మహనీయులను సంతోషపెట్టటం మా విధి. పూరు వంశంలో జన్మించిన ఎందరో రాజులు స్వర్గానికి వచ్చి నాతో సౌఖ్యం అనుభవించారు. కాబట్టి నీవూ సంశయించక నాతో సుఖాలు అనుభవించు" అని చెప్పింది.

"తల్లీ! నీవు చెప్పింది నిజమే కావచ్చు. పెద్దలూ మహనీయులూ ఏమీ చేసినా ఒప్పే. కాని నా వంటి వాడికి అది తగని పని. ఈ అనుచితకార్యానికి నా మనస్సు అంగీకరించదు. నన్ను మన్నించు" అన్నాడు పార్థుడు.

అర్జునుడు అలా తిరస్కరించేసరికి ఊర్వశి కోపం పట్టలేకపోయింది. "పార్థా! నేను స్త్రీని. పైగా నా అంతట నేను వలచి వచ్చినందుకు నన్ను చులకన చేశావు. పరాభవించావు. కాబట్టి నిన్ను శపిస్తున్నాను. నీవు మానరహితుడవై ఆడపిల్లలకు ఆట పాటలు నేర్పుతూ స్త్రీ, పురుష జాతికి దేనికీ చెందకుండా వుందువు గాక!" అని తీవ్రంగా పలికి వెను దిరిగి వెళ్లి పోయింది.

ఇంద్రుడికి ఈ విషయం తెలిసింది. నాయనా! ఊర్వశి శాపానికి భయపడకు. నీకు ఒక ఏడాది అజ్ఞాత వాసం ఎలాగో చెయ్య వలసి ఉంది. ఆ సమయంలో ఇతరులు నిన్ను ఎవరూ పోల్చు కోకుండా ఉండేందుకు ఈ శాపం బాగా ఉపకరిస్తుంది. అజ్ఞాత వాసం పూర్తయ్యాక నీ అసలు రూపం నీకు వస్తుంది" అని దీవించాడు.

అర్జునుడు సంతుష్టుడైనాడు.

Popular Posts