Followers

Saturday 7 February 2015

శ్రీ ఆంజనేయ మాహాత్మ్యం —2 ( విజయుని చరిత్ర )

   శ్రీ ఆంజనేయ స్వామి ని అర్చించి తరించిన భక్తుల చరిత్రలను పరాశర మహర్షి ,మైత్రేయునికి తెలిపాడు .అందులో విజయుని  చరిత్ర ను ముందుగా తెలియ జేస్తున్నాను .

         త్రేతాయుగం లో” చంద్ర కోణం” అనే ప్రసిద్ధి చెందిన నగరం  వుంది .దాన్ని విజయుడు అనే మహారాజు పాలిస్తున్నాడు .అతడు బలశాలి ,శత్రు సంహారకుడు ,సమర్ధుడు .యుద్ధ విద్యలో చేయి తిరిగిన వాడు .నాలుగు దిక్కుల లో వున్న రాజ్యాలన్నీ జయించి స్వాధీనం చేసు కోవాలనే బల మైన కోర్కె అతనికి కలిగింది .రాజ్యాన్ని కుమారులకు అప్పగించి,పెద్ద సైన్యం తో  ,జైత్ర యాత్రకు బయల్దేరాడు .కొంత ప్రయాణం చేసిన తరు వాత ”గర్గ మహర్షి ”ఆశ్రమం చేరాడు .సైన్యాన్ని దూరం గా వుంచి ,తానొక్కడే మహర్షిని సందర్శించాడు .భక్తి తో ఆయనకు నమస్కరించి నిలుచున్నాడు .ఆతని శ్రద్ధ  కు భక్తికి సంతోషించిన గర్గ మహర్షి  కుశల ప్రశ్న లతో  స్వాగతం పలికి ,ఆతిధ్యం ఇచ్చాడు .

      గర్గ మహర్షి  రాజైన విజయుడి తో ”రాజా !స్వాగతం .ఎక్కడి నుంచి బయలుదేరావు  ?ఎక్కడి దాకా ప్రయాణం ”?అని అడిగాడు .దానికి రాజు విజయుడు వినయం తో ”మహర్షీ !మీ అనుగ్రహం వల్ల అంతా బాగానే వుంది .ఇంటి నుంచే బయల్దేరాను .సర్వ దిక్కుల లో వుండే రాజ్యాలన్నీ జయిన్చాలనే కాంక్ష తో దిగ్విజయ యాత్రకు  బయలుదేరాను .నా దిగ్విజయ యాత్ర సఫలం కావటానికి మీ ఆశీర్వాదం ఇవ్వండి ,నాకు పని సానుకూలం  అవటానికి ఇంకా ఏదైనా ఉపాయం వుంటే సెలవివ్వండి ”అని విన్నవించాడు 
           గర్గమహర్షి సంతోషించి ”నీ కోరిక మంచిదే .అయితే ఏ పని కైనా దైవ అనుగ్రహం కావాలి .అప్పుడే ఆ కోరిక నెర వేరుతుంది .సఫల మనో రాదుడవై ”విజయుడు ‘అనే పేరు సార్ధకం చేసుకో .ఎన్నో మంత్రాలున్నాయి .కాని శీఘ్రం గా ఫలసిద్ధి నిచ్చేది మాత్రం ”హనుమన్మంత్రం ”ఒక్కటే .అది భక్తులకు అందు బాటు లో వుంటుంది .యుద్ధం లో జయాన్ని నీకు అందిస్తుంది నేను నీకు ఆ మహా మంత్రాన్ని ఉపదేశిస్తాను .దాన్ని త్రికరణ శుద్ధి గా ,భక్తీ ,శ్రద్ధలతో జపించు .నువ్వు అనుకొన్నది సాధించ గలుగుతావు ”అని చెప్పి ,బీజ సహితం గా ,మంత్ర ,ఉద్ధార ,,న్యాస పూర్వకం గా అష్టాక్షరీ హనుమంమంత్రాన్ని గర్గుడు ,విజయునికి ఉపదేశించాడు .
            గర్గాశ్రమం లోనే విజయ మహారాజు వుండి ,ఆయన సన్నిధి లోనే మంత్రం మీద ,మంత్ర దైవం అయిన ఆంజనేయుని మీద సమాన భావం తో విశ్వాసము ,గౌరవము చూపించి ,108 సార్లు జపించాడు .శ్రీ ఆంజనేయుడు పరమ ప్రీతి చెంది ,సుగ్రీవాదులతో కలిసి అక్కడ ప్రత్యక్షం అయాడు .ఆనంద బాష్పాలు కారుతుండగా ,విజయుడు ,వాయునందనుడికి సాష్టాంగ నమస్కారాలు చేశాడు .నాలుగు ముఖాలు కల బ్రహ్మ ,ఆరు ముఖాల కుమార స్వామి ,వెయ్యి ముఖాల ఆదిశేషుడు ఆశ్చర్య పడేట్లు ఒకే ఒక ముఖం గల విజయుడు హనుమను పెక్కు విధాల కీర్తించాడు .అనేక స్తోత్రాలు చేసి భక్తిని ప్రకటించుకొన్నాడు .
         హనుమ భగవానుడు సంతృప్తి చెంది ,విజయుని తో ”నీ యడల ప్రసన్నుడిని అయ్యాను  నీకు శుభం కలుగు తుంది .ఏదైనా వరం ఇస్తాను కోరుకో” అన్నాడు మనసులో సంతోషించి ,దోసిలి ఒగ్గి వాయుసుతునుకి మళ్ళీ నమస్కరించి ”అతి తక్కువ కాలము  లోనే నాకు దర్శనం ఇచ్చి ,నన్ను క్రుతార్దుడిని చేశావు మహా బలవంతా ,ఆంజనేయా !నీ దర్శనమే కోరిక లన్నిటినీ తీరుస్తుంది .అయినా నా మీద ప్రేమతో వరం కోరుకో మన్నావు ,తీరుస్తానని అభయం కూడా ఇచ్చావు .నీ కృప అపారం .నా మనసులో నాలుగు దిశలు జయించాలి  అనే  కోరిక వుంది .నీ అనుగ్రహం కావాలి దానిని తీర్చి ,నాకు మేలు చేయి ”అని ప్రార్ధించాడు .
         ఆంజనేయుడు అతని వినయ వచనాలకు సంప్రీతుడై ,వాత్సల్యం  తో ”రాజా !నాలుగేమిటి ?పది దిక్కులను జయించి విజయుడు అనే పేరు సార్ధకం చేసుకో .అయితే ,ఈ జన్మలో నీ కోరిక తీరదు .రాబోయే ద్వాపర యుగాంతం లో ఈ కోరిక నెర వేరుతుంది .అప్పుడు నువ్వు స్వర్గాది పతి దేవేంద్రుని కుమారుడి వైజన్మిస్తావు .శ్రీ కృష్ణుని సారధిగా చేసు కోని ,అన్ని దిక్కులను జయిస్తావు .కురు క్షేత్ర సంగ్రామం లో కౌరవులను జయిస్తావు .అప్పుడు నీ రధానికి నేను జెండా పై అధివసించి ,నీ కు విజయం చేకూరుస్తాను .నేను వుండే ఆ జెండాను ”కపిధ్వజం ”అంటారు .నిన్ను ”కపిధ్వజుడు ”అని పిలుస్తారు”అని వరం ప్రదానం చేసి మారుతి అంతర్ధానం అయాడు .హనుమ చెప్పిన మాట విని ,విజయ మహారాజు తన జైత్ర యాత్రను విరమించు కోని ,గర్గ మహాముని ఆశీస్సులను అందుకొని ,ఆయన కు నమస్కరించి ,,మళ్ళీ రాజా దానికి చేరు కొన్నాడు . .
రాజ్యాన్ని ధర్మ సమ్మతంగా ,ప్రజా క్షేమంగా పరిపాలించి ,చివరికి స్వర్గ లోకం చేరాడు .

ఈ కధ ఆధారం   గా   విజయుడు   తదుపరి  జన్మ లో  అర్జునుడు  గా  ద్వాపరయుగం   లో  జన్మించాడు  అని  తెలుస్తుంది 

Popular Posts