Followers

Thursday 8 January 2015

నామరామాయణం ( యుద్ధకాండము- తాత్పర్యము తో పాటుగా )











రావణనిధనప్రస్థిత రామ | వానరసైన్యసమావృత రామ |
శోషితశరదీశార్థిత రామ | విభీషణాభయదాయక రామ |
పర్వతసేతునిబంధక రామ | కుంభకర్ణశిరశ్ఛేదక రామ |
రాక్షససంఘవిమర్ధక రామ | అహిమహిరావణచారణ రామ |
సంహృతదశముఖరావణ రామ | విధిభవముఖసురసంస్తుత రామ |
ఖఃస్థితదశరథవీక్షిత రామ | సీతాదర్శనమోదిత రామ |
అభిషిక్తవిభీషణవందిత రామ | పుష్పకయానారోహణ రామ |
భరద్వాజాభినిషేవణ రామ | భరతప్రాణప్రియకర రామ |
సాకేతపురీభూషణ రామ | సకలస్వీయసమానస రామ |
రత్నలసత్పీఠస్థిత రామ | పట్టాభిషేకాలంకృత రామ |
పార్థివకులసమ్మానిత రామ | విభీషణార్పితరంగక రామ |
కీశకులానుగ్రహకర రామ | సకలజీవసంరక్షక రామ |
సమస్తలోకోద్ధారక రామ ।

యుద్ధకాండము-  తాత్పర్యము

ఓ శ్రీరామా! నీవు వానర సైన్యముతో కూడి రావణుని సంహరించ బయలుదేరితివి. నీ క్రోధముతో ఎండిపోయిన సముద్రుని కాపాడినావు, విభీషణునికి అభయమిచ్చినావు, రాళ్ళతో వానరుల సహాయముతో సేతువును నిర్మించినావు. కుంభకర్ణుని సంహరించినావు. వేలాది రాక్షసులను అంతము చేసావు. అహిరావణ, మైరావణులచే పాతాళమునకు కొనిపోబడినావు, పదితలల రావణుని సంహరించినావు. బ్రహ్మ, శివులచే నుతించబడిన వాడవు, ఆకాశమునుండి తండ్రియైన దశరథునిచే చూడబడిన వాడవు, సీత సంయోగముతో ఆనందించిన వాడవు, నీ చేత లంకాభిషిక్తుడైన విభీషణునిచే పొగడబడిన వాడవు, పుష్పకమును అధిరోహించిన వాడవు. భరద్వాజుడు మొదలగు వారిచే పూజించబడిన వాడవు, భరతునికి ప్రాణము వంటి వాడవు, అయోధ్యకు ఆభరణము వంటి వాడవు, అందరిచే గౌరవించబడిన వాడవు, రత్నములచే అలంకరించబడిన పీఠాన్ని అధిరోహించిన వాడవు, పట్టాభిషిక్తుడవై శోభిల్లినావు, సామంతరాజులచే గౌరవించ బడినవాడవు, విభీషణునిచే పూజించబడిన వాడవు (ఎరుపు వర్ణపు లేపనముతో), వానర సమూహాన్ని అనుగ్రహించిన వాడవు, అన్ని జీవులను కాపాడే వాడవు, అందరిని రక్షించే వాడవు.

సీతారామునకు, రాజా రామునకు జయము జయము.

Popular Posts