Followers

Thursday 29 May 2014

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం ఆరవ అధ్యాయం


             ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం ఆరవ అధ్యాయం

పరీక్షిత్తు శుక యోగీంద్రున్ని "మరణించేవాడు దేన్ని జపించాలి దేన్ని ధ్యానించాలి,అనీ, పరమాత్మ ఏది చేయడానికి వచ్చాడు, చనిపోయే జీవుడు దేన్ని స్మరించాలి, ఏమి చేయాలి" అని అడిగితే అవి అన్నీ చెప్పిన శుకుడు, ఇంకేమైనా నీవు వినాలని అనుకుంటున్నావా అని అడిగాడు

సూత ఉవాచ
ఏతన్నిశమ్య మునినాభిహితం పరీక్షిద్
వ్యాసాత్మజేన నిఖిలాత్మదృశా సమేన
తత్పాదమూలముపసృత్య నతేన మూర్ధ్నా
బద్ధాఞ్జలిస్తమిదమాహ స విష్ణురాతః

వ్యాస కుమారుడైన, సకల పరిపూర్ణమైన ఆత్మ జ్ఞ్యానం గలవాడు, అందరి యందూ సమ భావన ఉన్నవాడైన శుకుడు అలా అడిగితే,
విష్ణువు చేత ఇవ్వబడిన (విష్ణు రాతుడు) పరీక్షిత్తు శుక యోగీంద్రుని పాదాల మీద తల ఉంచి చేతులు జోడించి

రాజోవాచ
సిద్ధోऽస్మ్యనుగృహీతోऽస్మి భవతా కరుణాత్మనా
శ్రావితో యచ్చ మే సాక్షాదనాదినిధనో హరిః

మీరు పరమ కరుణామయులై నన్ను అనుగ్రహించారు
ఏమి తెలుసుకోవాలి అనుకున్నానో అది మీ ద్వారా తెలుసుకున్నాను
ఆద్యంతములు లేని పరమాత్మ స్వరూప స్వభావాలను పరిపూర్ణముగా నాకు వినిపించారు

నాత్యద్భుతమహం మన్యే మహతామచ్యుతాత్మనామ్
అజ్ఞేషు తాపతప్తేషు భూతేషు యదనుగ్రహః

అజ్ఞ్యానులై సంసార తాపత్రయముతో పరితపించే జీవులను అనుగ్రహించుట మీవంటి వారికి అద్భుతమేమీ కాదు. అది మీ స్వభావం. పరమాత్మ యందు భక్తి గలవారు సంసారములో భ్రమించే అజ్ఞ్యుల తాపాన్ని పోగొట్టడం ఆశ్చర్యం కాదు

పురాణసంహితామేతామశ్రౌష్మ భవతో వయమ్
యస్యాం ఖలూత్తమఃశ్లోకో భగవాననవర్ణ్యతే

మీ నుంచి ఈ భాగవత సంహితను విన్నాను
దీని యందు ఉత్తమ శ్లోకుడైన పరమాత్మ ప్రతీ శ్లోకములో పాదములో వర్ణించబడుతున్నాడు

భగవంస్తక్షకాదిభ్యో మృత్యుభ్యో న బిభేమ్యహమ్
ప్రవిష్టో బ్రహ్మ నిర్వాణమభయం దర్శితం త్వయా

ఆత్మని పరమాత్మలో ఉంచి, మనసుని ఆత్మలో ఉంచి పరమాత్మ దర్శనం చేసుకుంటే తక్షకుడు కాటు వేసినా, నీ శరీరం దహించుకుని పోతున్నా నీకు తెలియదు అని అన్నారు
నేను తక్షకాదుల వలన భయపడడం లేదు
పరమానంద స్వరూపుడైన పరమాత్మ స్వరూపాన్ని చూపించి అభయాన్ని చూపారు

అనుజానీహి మాం బ్రహ్మన్వాచం యచ్ఛామ్యధోక్షజే
ముక్తకామాశయం చేతః ప్రవేశ్య విసృజామ్యసూన్

మీరు ఆజ్ఞ్య ఇస్తే నా వాక్కును నేను నియమించుకుని పరమాత్మ యందు మనసు లగ్నం చేస్తాను
అన్ని కోరికలూ అన్ని సంగములనూ విడిచిపెట్టి మనసును పరమాత్మ యందు లగ్నం చేసి శరీరాన్ని విడిచిపెడతాను మీరు అనుజ్ఞ్య ఇస్తే

అజ్ఞానం చ నిరస్తం మే జ్ఞానవిజ్ఞాననిష్ఠయా
భవతా దర్శితం క్షేమం పరం భగవతః పదమ్

మీరు బోధించిన జ్ఞ్యానముతో నా అజ్ఞ్యానం తొలగిపోయింది
పరమ పదమును నాకు దర్శింపచేసారు మీరు.ఇంక నాకు భయమేమిటి

సూత ఉవాచ
ఇత్యుక్తస్తమనుజ్ఞాప్య భగవాన్బాదరాయణిః
జగామ భిక్షుభిః సాకం నరదేవేన పూజితః

పరీక్షిత్తు పలికిన పలుకులు విని, రాజుగారి పూజలందుకుని శుకయోగీంద్రుడు తన తోటి శిష్యులతో బయలుదేరాడు

పరీక్షిదపి రాజర్షిరాత్మన్యాత్మానమాత్మనా
సమాధాయ పరం దధ్యావస్పన్దాసుర్యథా తరుః

పరీక్షిత్తు కూడా మనసును ఆత్మలోనూ ఆత్మను పరమాత్మలోనూ లగ్నం చేసి
కలదలిక లేని వృక్షం లాగ యోగములో కూర్చున్నాడు

ప్రాక్కూలే బర్హిష్యాసీనో గఙ్గాకూల ఉదఙ్ముఖః
బ్రహ్మభూతో మహాయోగీ నిఃసఙ్గశ్ఛిన్నసంశయః

యమునా నదిలో తూర్పుతీరములో దర్భల యందు ఉత్తరముఖముగా కూర్చుని
ఏ సందేహమూ లేక, దేని యందూ ఆశలేక పరమాత్మ యందే మనసు ఉంచాడు

తక్షకః ప్రహితో విప్రాః క్రుద్ధేన ద్విజసూనునా
హన్తుకామో నృపం గచ్ఛన్దదర్శ పథి కశ్యపమ్

అదే సమయములో బ్రాహ్మణ శాపమును నిజం చేయడానికి తక్షకుడు బయలుదేరాడు.
కశ్యపుడనే బ్రాహ్మణుడు పరీక్షిత్తును కాపాడడానికి బయలుదేరాడు

తం తర్పయిత్వా ద్రవిణైర్నివర్త్య విషహారిణమ్
ద్విజరూపప్రతిచ్ఛన్నః కామరూపోऽదశన్నృపమ్

ఎంత గొప్ప విషమైన తొలగించగల శక్తి కశ్యపునికి ఉంది.
ఆ బ్రాహ్మణున్ని ధనముతో వెనక్కు పంపాడు
బ్రాహ్మణ రూపములో లోపలకు వెళ్ళి పరీక్షిత్తుని కాటు వేసాడు
బ్రహ్మభూతస్య రాజర్షేర్దేహోऽహిగరలాగ్నినా
బభూవ భస్మసాత్సద్యః పశ్యతాం సర్వదేహినామ్

పరమాత్మ యందే మనసు లగ్నం చేసి సమాధిలో ఉన్న పరీక్షిత్తుకు ఈ విషయం ఏమీ తెలియలేదు
చుట్టూ ఉన్నవారు అది చూసారు

హాహాకారో మహానాసీద్భువి ఖే దిక్షు సర్వతః
విస్మితా హ్యభవన్సర్వే దేవాసురనరాదయః

అది చూసి ఆకాశములో భూమిలో అందరూ హాహాకారాలు చేసారు
పరీక్షిత్తు సమాధి చూసి దేవతలూ రాక్షసులూ మానవులూ ఇది చూసి పరమాశ్చర్యాన్ని పొందారు

దేవదున్దుభయో నేదుర్గన్ధర్వాప్సరసో జగుః
వవృషుః పుష్పవర్షాణి విబుధాః సాధువాదినః

దేవతలు పుష్ప వృష్ఠి కురిపించి పూల వర్షం కుర్పించారు
చాలా ఉత్తమ కార్యం చేసావని పరీక్షిత్తును మెచ్చుకున్నారు

జన్మేజయః స్వపితరం శ్రుత్వా తక్షకభక్షితమ్
యథాజుహావ సన్క్రుద్ధో నాగాన్సత్రే సహ ద్విజైః

ఈ విషయాన్ని , తన తండ్రి సర్పము కాటు వేయడం వలన మరణించాడని తెలుసుకున్న జనమేజయుడు
భూంలోకములో సర్పాలు లేకుండా చేస్తానని సర్పయాగం చేసాడు

సర్పసత్రే సమిద్ధాగ్నౌ దహ్యమానాన్మహోరగాన్
దృష్ట్వేన్ద్రం భయసంవిగ్నస్తక్షకః శరణం యయౌ

అన్ని పాములూ వచ్చి యజ్ఞ్య గుండములో పడిపోతూ ఉంటే
తక్షకుడు భయపడి ఇంద్రున్ని శరణు వేడాడు

అపశ్యంస్తక్షకం తత్ర రాజా పారీక్షితో ద్విజాన్
ఉవాచ తక్షకః కస్మాన్న దహ్యేతోరగాధమః

ఇంద్రుడు అభయమిచ్చాడు తక్షకునికి
అది గమనించాడు జనమేజయుడు

తం గోపాయతి రాజేన్ద్ర శక్రః శరణమాగతమ్
తేన సంస్తమ్భితః సర్పస్తస్మాన్నాగ్నౌ పతత్యసౌ

మీ మంత్రాలు చాలా శక్తి గలవి. మీరు యాగం చేస్తున్నా తక్షకుడు ఎందుకు రాలేదు అని అడిగాడు

పారీక్షిత ఇతి శ్రుత్వా ప్రాహర్త్విజ ఉదారధీః
సహేన్ద్రస్తక్షకో విప్రా నాగ్నౌ కిమితి పాత్యతే

ఇంద్రుడు తక్షకున్ని రక్షిస్తున్నాడని చెప్పగా ఆ ఇంద్రున్ని కూడా పడవేయండి అని అన్నాడు జనమేజయుడు
(సహేంద్రతక్షకాయ స్వాహా)

తచ్ఛ్రుత్వాజుహువుర్విప్రాః సహేన్ద్రం తక్షకం మఖే
తక్షకాశు పతస్వేహ సహేన్ద్రేణ మరుత్వతా

అది విన్న బ్రాహ్మణులు అలాగే చేయబోతే, ఇంద్రునితో కలసి తక్షకుడు కూడా వచ్చి పడమని బ్రాహ్మణులు మంత్రం చదవగా ఇంద్రుడు కూడా వచ్చేస్తున్నాడు

ఇతి బ్రహ్మోదితాక్షేపైః స్థానాదిన్ద్రః ప్రచాలితః
బభూవ సమ్భ్రాన్తమతిః సవిమానః సతక్షకః

మొత్తం లోకమంతా భయపడిపోయింది

తం పతన్తం విమానేన సహతక్షకమమ్బరాత్
విలోక్యాఙ్గిరసః ప్రాహ రాజానం తం బృహస్పతిః

అపుడు బృహస్పతి వచ్చి, తక్షకుడు మరణించరాదు, ఆయన అమృతం తాగి ఉన్నాడు

నైష త్వయా మనుష్యేన్ద్ర వధమర్హతి సర్పరాట్
అనేన పీతమమృతమథ వా అజరామరః

ఈయన అమృతాన్ని తాగాడు.
అతనికి వార్దక్యం గానీ మరణం గానీ ఉండదు.

జీవితం మరణం జన్తోర్గతిః స్వేనైవ కర్మణా
రాజంస్తతోऽన్యో నాస్త్యస్య ప్రదాతా సుఖదుఃఖయోః

మీ నాన్నగారిని సర్పం కాటు వేసి చంపింది అని పగబడుతున్నావు
ఎవరినీ ఎవరూ చంపరు, ఎవరినీ ఎవరూ సృష్టీ చేయరు, ఎవరినీ ఎవరూ బతికించరు
పుట్టుకా మరణం బతుకూ వారు వారు చేసుకున్న కర్మల వలననే వస్తాయి
కర్మ కంటే వేరే ఏదీ మనకు సుఖమును గానీ దుఃఖాన్ని గానీ ఇవ్వదు

సర్పచౌరాగ్నివిద్యుద్భ్యః క్షుత్తృద్వ్యాధ్యాదిభిర్నృప
పఞ్చత్వమృచ్ఛతే జన్తుర్భుఙ్క్త ఆరబ్ధకర్మ తత్

మరణించడానికి సర్పమో దొంగలో అగ్నో విద్యుత్తో ఆకలో దప్పో వ్యాధో కారణం కావొచ్చు. కానీ ఈ కారణాలన్నీ తాను చేసిన కర్మల రూపములో వచ్చేవే

తస్మాత్సత్రమిదం రాజన్సంస్థీయేతాభిచారికమ్
సర్పా అనాగసో దగ్ధా జనైర్దిష్టం హి భుజ్యతే

ఎలాంటి కర్మ చేస్తే ఎలా మరణిస్తాడో ధర్మ శాస్త్రం చెప్పి ఉంది.
వాడు ఆచరించిన కర్మ  మాత్రమే మరణాన్ని ఇస్తుంది
ఈ సర్పాభిచారమును ఆపండి
ఏ తప్పూ చేయని సర్పాలన్ని దహించిపోయాయి
లోకములో ఎవడి అదృష్టాన్ని వాడు అనుభవిస్తాడు

సూత ఉవాచ
ఇత్యుక్తః స తథేత్యాహ మహర్షేర్మానయన్వచః
సర్పసత్రాదుపరతః పూజయామాస వాక్పతిమ్

బృహస్పతి కోరగా ఆయన మాటను మన్నించాడు జనమేజయుడు.

సైషా విష్ణోర్మహామాయా బాధ్యయాలక్షణా యయా
ముహ్యన్త్యస్యైవాత్మభూతా భూతేషు గుణవృత్తిభిః

ఒకరు బాధించేవారు, ఒకరు బాధించబడే వారు అనేది విష్ణువు యొక్క మాయ. ఆ మాయతోనే ఒకరు బాధించేవారూ ఒకరు బాధించబడేవారూ అవుతారు
సత్వ రజస్తమో గుణాలు, శబ్దాది గుణాలతో అతని వారు కూడా మోహాన్ని పొందుతారు

న యత్ర దమ్భీత్యభయా విరాజితా మాయాత్మవాదేऽసకృదాత్మవాదిభిః
న యద్వివాదో వివిధస్తదాశ్రయో మనశ్చ సఙ్కల్పవికల్పవృత్తి యత్

పరమాత్మ మాయ ఎలాంటిందంటే ఎలాంటి చోట కూడా మనకు ఎలాంటి భయమూ లేదు
మనము సర్వత్రా భయం లేకుండా ఉన్నాము అనేవారు గానీ, భయము ఉన్నా లేనట్లు దంభం నటించేవారు గానీ,
ఎన్నో సార్లు ఏది ఆత్మ (మనసా ఇంద్రియాలా, విజ్ఞ్యానమా అంటూ దినకరి అనే తర్క గ్రంధములో 24 ఆత్మవాదాలు ఉన్నాయి) అని ఎన్ని వాదాల ఎన్ని తీరులా ప్రవర్తించినా అది అంతా భగవంతుని ఆశ్రయించేది కాదు
మనసు సంకల్పమూ వికల్పమూ చేసేది.

న యత్ర సృజ్యం సృజతోభయోః పరం శ్రేయశ్చ జీవస్త్రిభిరన్వితస్త్వహమ్
తదేతదుత్సాదితబాధ్యబాధకం నిషిధ్య చోర్మీన్విరమేత తన్మునిః

సృజించేవాడికన్నా సృజించబడేదానికన్నా పరమాత్మ పరుడు (వీటికి పైవాడు)
సత్వ రజస్తమో గుణములతో జీవుడు పొందే ఏ శ్రేయస్సు ఉందో అది అంతా కలసే ఉంటుంది.
కాబట్టి సృజించేవాడూ, సృజించబడేది గుణములూ గుణముల ప్రవృత్తీ, శ్రేయస్సూ ఆపదా
ఇవన్నీ ఆలోచించి, ఇవన్నీ వేరు కాదు, అంతా పరమాత్మే.
ఎవరూ బాధించడం లేదూ ఎవరూ బాధపడడం లేదూ అని తెలుసుకుంటే. అంతా పరమాత్మ మాయే అని తెలుసుకుని ఊర్ములను విరమించాలి
ఆకలీ దప్పి శోక మోహములూ జరా రోగములను ఊర్ములంటారు. వీటిని మొదలు గెలవాలి. ఇవన్నీ ప్రకృతికి సంబంధించినవి. వీటితో ఎలాంటి సంబంధమూ మనకు లేదు. ఆత్మ నిత్యమూ సత్యమూ.

పరం పదం వైష్ణవమామనన్తి తద్యన్నేతి నేతీత్యతదుత్సిసృక్షవః
విసృజ్య దౌరాత్మ్యమనన్యసౌహృదా హృదోపగుహ్యావసితం సమాహితైః

భగవనుతుడు ఉన్నాడా లేడా అంటే లేడు లేడనేవాడు కొందరైతే, ఆ లేదు అనేదే లేదనీ భగవంతుడు ఉన్నాడు అని కొందరు, అంటే ఉన్నాడనీ లేడనీ కనపడడనీ మనకు తెలియడనీ పలురకములుగా అంటూ ఉంటారు
దుష్టపు ఆలోచనను విడిచిపెట్టాలి, పరమాత్మ యందు మాత్రమే ప్రీతి కలవారై
సావధానములైన ఇంద్రియములతో పరమాత్మను హృదయములో భద్రముగా దాచుకోవాలి
నేను అనేది అహంకారం,నాది అనేది మమకారం. ఇదే దౌర్జన్యం.
ఎవరికైతే ఇవి ఉండవో వారే పరమపదమును పొందుతారు

అతివాదాంస్తితిక్షేత నావమన్యేత కఞ్చన
న చేమం దేహమాశ్రిత్య వైరం కుర్వీత కేనచిత్

అలా చేరాలంటే ఏమి కావాలి? మన గురించి చాలా మంది చాలా రకములుగా మాట్లాడుతూ ఉంటారు. అవి విని ఊరుకోవాలి. అతివాదాలను ఓర్చుకోవాలి.
ఎవరినీ అవమానించకూడదు. ఈ శరీరాన్ని ఆధారముగా చేసుకుని ఎవరితో వైరము చేయకూడదు

నమో భగవతే తస్మై కృష్ణాయాకుణ్ఠమేధసే
యత్పాదామ్బురుహధ్యానాత్సంహితామధ్యగామిమామ్

అకుణ్ఠమేథ ఐన పరమాత్మకు నమస్కారం
ఆయన పాద పద్మాలను ధ్యానం చేయడం వలన నేను ఈ భాగవత సంహితను పొందానో

శ్రీశౌనక ఉవాచ
పైలాదిభిర్వ్యాసశిష్యైర్వేదాచార్యైర్మహాత్మభిః
వేదాశ్చ కథితా వ్యస్తా ఏతత్సౌమ్యాభిధేహి నః

వ్యాసభగవానుడు వేదాలను విభజించాడని చెప్పారు
నలుగురు శిష్యులకు బోధించాడని చెప్పారు
ఆవేదాలను ఎన్నిభాగాలు చేసాడో ఎవరికి చెప్పాడో మాకు అందించవలసింది అని శౌనకుడు అడుగగా

సూత ఉవాచ
సమాహితాత్మనో బ్రహ్మన్బ్రహ్మణః పరమేష్ఠినః
హృద్యాకాశాదభూన్నాదో వృత్తిరోధాద్విభావ్యతే

మొదలు చతుర్ముఖబ్రహ్మ (పరమేష్ఠి) సావధానుడై పరమాత్మ యందు మనసు లగ్నం చేసినపుడు ఆయన హృదయములో ఒక నాదం వెలువడింది

యదుపాసనయా బ్రహ్మన్యోగినో మలమాత్మనః
ద్రవ్యక్రియాకారకాఖ్యం ధూత్వా యాన్త్యపునర్భవమ్

ఈ నాదో పాసనతో యోగులందరూ మనస్సు యొక్క మలాన్ని తొలగించుకుంటారు
మన మనసుకు మురికి - ద్రవ్యం క్రియా కారకము. (బియ్యాన్ని నిప్పుతో అన్నం చేస్తున్నాము)
ఈ మూటి జ్ఞ్యానం పోతే గానీ పరమాత్మ జ్ఞ్యానం కలుగదు
ఇది తెలుసుకున్న తరువాతే వారు మళ్ళీ పుట్టని మోక్షాన్ని పొందుతారు

తతోऽభూత్త్రివృదోంకారో యోऽవ్యక్తప్రభవః స్వరాట్
యత్తల్లిఙ్గం భగవతో బ్రహ్మణః పరమాత్మనః

ఆ నాదం నుంచే ఓంకారం పుట్టింది
ఆ ఓంకారం వచ్చిన అఖండమైన జ్ఞ్యానమే స్వారాజ్యం. దాన్నే స్వరాట్ అంటాము.
ఈ ఓంకారమే పరమాత్మ యొక్క సూచిక.

శృణోతి య ఇమం స్ఫోటం సుప్తశ్రోత్రే చ శూన్యదృక్
యేన వాగ్వ్యజ్యతే యస్య వ్యక్తిరాకాశ ఆత్మనః

ఈ ఓంకారాన్ని స్ఫోటం అంటారు. వయ్యాకరణులు (వ్యాకరణ శాస్త్రవేత్తలు) చెప్పేది కూడా పరమాత్మ గురించే. తర్క శాస్త్రం చెప్పేది కూడా ఈశ్వరుని గురించే. ఒక కుండ ఉంటే కుమ్మరి ఉంటాడు. ప్రతీ కార్యానికీ ఒక కర్త ఉంటాడు, ఆ కర్త మనలాంటి సామాన్యుడు కాలేడు కాబట్టి ఆయన పరమాత్మ.
వ్యాకరణములో స్పోట బ్రహ్మ అని చెబుతారు. సకల చరాచర జగత్తూ ఆయనలోంచి వస్తుంది. ఆ స్పోటం అంటే శబ్దం. అదే ఓంకారం. కనులూ చెవులూ కూడా మూసుకుంటే ఈ నాదాన్ని వింటారు(ప్రాణాయామం చేస్తున్నపుడు కళ్ళూ చెవులూ ముక్కూ మూయడం ఒక విధానం. అలా చేస్తే ఓంకార నాదమే వినవస్తుంది. అపుడు కూడా మరొక దాన్ని గురించి ఆలోచించదు. ఆ ఓంకార నాదం ఏ రూపములో విన వచ్చిందో దాన్ని బట్టి వాడు సాత్వికుడా తామసుడా రాజసికుడా చెప్పవచ్చు)
హృదయములో ఆ నాదం ఉన్నది కాబట్టే మన నోటినుండి ఇన్న నాదాలు వస్తున్నాయి. ప్రతీవారి హృదయములో ఓంకారం ఉంటుంది

స్వధామ్నో బ్రాహ్మణః సాక్షాద్వాచకః పరమాత్మనః
స సర్వమన్త్రోపనిషద్వేదబీజం సనాతనమ్

ఇదే పరమాత్మ యొక్క వాచకమైన శబ్దం. ఇదే ఓంకారం
ఈ ఓంకారమే, సకల మంత్రముల, సకల ఉపనిషత్తుల బీజం. ఇదే సనాతనం

తస్య హ్యాసంస్త్రయో వర్ణా అకారాద్యా భృగూద్వహ
ధార్యన్తే యైస్త్రయో భావా గుణనామార్థవృత్తయః

దీనికి అకార ఉకార మకారములనే మూడు అక్షరాలు ఉంటాయి
ఈ అకార ఉకార మకారములే - సత్వ రజస్తమో గుణాలు, ఇవే గుణమూ నామమూ అర్థము.
అకారం -నామము
ఉకారం గుణము
మకారం - అర్థం
అకారం  - సత్వం
ఉకారం - రజస్సు
మకారం - తపాసు
మూడు గుణాలూ మూడు లోకాలు, గుణ నామ అర్థాలూ ఓంకారమే

తతోऽక్షరసమామ్నాయమసృజద్భగవానజః
అన్తస్థోష్మస్వరస్పర్శ హ్రస్వదీర్ఘాదిలక్షణమ్

ఈ ఓంకారం నుంచే అకారం నుంచీ హకారం వరకూ ఉంటాయి. వీటినే మహేశ్వరసూత్రములూ అంటారు. పాణిని వ్యాకరణ సూత్రములు వ్రాయడానికి శంకరుని గురించి తపస్సు చేస్తే సనకుడూ సనందాదులూ కూడా తపస్సు చేస్తే స్వామి వచ్చి తాండవం చేస్తూ పధ్నాలుగు సార్లు ఢమరుకం మోగిస్తే, ఎవరు దేనిగురించి తపస్సు చేసారో వారికి ఆ ధ్వని ఆ రూపములో వినబడింది

పాణినికి అక్షర సమాన్యాయముగా వినబడింది.
కణాధునికి న్యాయసూత్రాలుగా గౌతమునికి గౌతమ సూత్రాలుగా వచ్చాయి. ఇలా ఒక్కొక్కరికీ వారనుకున్న ఆశించిన శాస్త్ర బోధకమైన సూత్రాలుగా, న్యా వైశేషిక మీమాంస వ్యాకరణ సూత్రాలుగా తయారయ్యాయి.
ఈ ఓంకారం నుండే అక్షర సమామ్నాయం వచ్చింది

అక్షరములు - మొదలు స్వరములూ అంటాము.
అ దగ్గర నుంచీ ఔ వరకూ - ఆ ఈ ఊ ఋ ౡఏ అఏ ఐ ఓ ఔ - స్వరములు
అనుస్వారం అంటే విసర్గలు.
వీటినే అచ్చులూ లేదా స్వరములూ అంటారు
క దగ్గర నుంచీ మా దగ్గర వరకూ ఉండేవాటిని స్పర్శలు అంటారు

    క వర్గము - క, ఖ, గ, ఘ, ఙ
    చ వర్గము - చ, ఛ, జ, ఝ, ఞ
    ట వర్గము - ట, ఠ, డ, ఢ, ణ
    త వర్గము - త, థ, ద, ధ, న
    ప వర్గము - ప, ఫ, బ, భ, మ

ఇవి స్పర్శలు
య ర ల వ - అంతస్థలు
శ     ష     స     హ - ఇవి ఊష్మలు
ఇలా స్వరములూ స్పర్శలూ అంతస్థలూ ఊష్మలు
ముక్కుతో పలికేవి అనునాసికలు.  ఙ, ఞ, ణ, న, మ లు అనునాసికలు.

అచ్చులు ఇంకో మూడు రకాలు  - హ్రస్వమూ దీర్ఘమూ ప్లుతము
హ్రసవమంటే - ఒక చిటిక - అ
దీర్ఘమంటే - రెండు చిటికెలు - ఆ
ప్లుతమంటే మూడు చిటికలు - ఆ
ఇవి కాక ఇంకో మూడు ఉన్నాయి - ఉదాత్తమూ అనుదాత్తమూ స్వరితము, ఇవి స్వరములు
అంటే ఒక్కొక్కటీ మూడు అవుతాయి.
హ్రస్వములో - ఉదాత్తమూ అనుదాత్తమూ స్వరితము
దీర్ఘములో - ఉదాత్తమూ అనుదాత్తమూ స్వరితము
ప్లుతములో - ఉదాత్తమూ అనుదాత్తమూ స్వరితమూ
ఇలా మూడు మూళ్ళు - తొమ్మిది.
ఈ తొమ్మిదిలో మళ్ళీ రెండు ఉంటాయి - అనునాసికమూ, అననునాసికము. ఒక అకారము ఇలా 9 * 2 = పద్దెనిమిది రకాలు.
ఆ ఈ ఊ - ఈ మూడు పద్దెనిమిదీ + పద్దెనిమిదీ + పద్దెనిమిది - 54
ఋకారము కూడా పద్దెనిమిది
ఌ కారం మాత్రం పన్నెండే ఉంటుంది. ఆరు పోతాయి. దానికి ప్లుతము లేదు
ఏ ఐ ఓ ఔ - కూడా పన్నెండే. వీటికి హ్రస్వం లేదు.
ఇలా అన్ని కలుపుకుంటే - అ ఇ ఉ ఌ - 18+18+18+18+12+12+12+12+12 =132 అవుతాయి
మొత్తం అచ్చులు నూట ముప్పై రెండు
ఇలాగే హల్లులకు కూడా.

తేనాసౌ చతురో వేదాంశ్చతుర్భిర్వదనైర్విభుః
సవ్యాహృతికాన్సోంకారాంశ్చాతుర్హోత్రవివక్షయా

ఈ నాదములతో వచ్చిన ఈ వర్ణములతో బ్రహ్మ నాలుగు ముఖములతో బ్రహ్మ వేదాన్ని ఆవిర్భవినంపచేసాడు
వ్యాహృతులు - భూః భువ@ సువ@ - వీటితో
స + ఓంకారం - ఓంకార సహితమైన వ్యాహృతులు - ఓం భువః...
ఇవన్నీ చాతుర్హోత్రం కోసం (యజ్ఞ్యం కోసం) ఏర్పాటు చేసాడు
అందులో నలుగురు ఉంటారు - ఋత్విక్కు అధ్వర్యువు హోత ఉద్గాత. యజ్ఞ్యములు ఆచరించడానికి పనికొచ్చే వేదాలను బ్రహ్మ తన ముఖం నుండి ఏర్పాటు చేసాడు

పుత్రానధ్యాపయత్తాంస్తు బ్రహ్మర్షీన్బ్రహ్మకోవిదాన్
తే తు ధర్మోపదేష్టారః స్వపుత్రేభ్యః సమాదిశన్

ఇలా తన నుండి వచ్చిన వేదాలని బ్రహ్మ జ్ఞ్యానం కల తన పుత్రులకు బోధించగా
వారు వారి పుత్రులకు బోధించారు

తే పరమ్పరయా ప్రాప్తాస్తత్తచ్ఛిష్యైర్ధృతవ్రతైః
చతుర్యుగేష్వథ వ్యస్తా ద్వాపరాదౌ మహర్షిభిః

ఇలా నాలుగు యుగాల దాకా వచ్చింది. కృత త్రేతా ద్వాపర యుగం దాకా వచ్చాయి. త్వరలో రాబోయేది కలియుగం అని తెలుసుకుని.

క్షీణాయుషః క్షీణసత్త్వాన్దుర్మేధాన్వీక్ష్య కాలతః
వేదాన్బ్రహ్మర్షయో వ్యస్యన్హృదిస్థాచ్యుతచోదితాః

కలియుగములో వారు మందబుద్ధులనీ, అల్పాయుష్కులనీ, ఈ వేదాలు వారి చేత కాపాడబడవనీ హృదయములో ఉన్న పరమాత్మ చోదన వలన బ్రహ్మఋషులు వేదాలను విభజించారు

అస్మిన్నప్యన్తరే బ్రహ్మన్భగవాన్లోకభావనః
బ్రహ్మేశాద్యైర్లోకపాలైర్యాచితో ధర్మగుప్తయే

ఈ మన్వంతరములో కూడా బ్రహ్మాది లోకపాలకులందరూ అడిగితే ప్రార్థిస్తే పరమాత్మ శ్రీమన్నారాయణుడు

పరాశరాత్సత్యవత్యామంశాంశకలయా విభుః
అవతీర్ణో మహాభాగ వేదం చక్రే చతుర్విధమ్

పరాశరుని వల్ల సత్యవతి యందు పరమాత్మ అంశాంశ ఐన వేదవ్యాసునిగా అవతరించి వేదమును నాలుగు భాగములుగా చేసాడు

ఋగథర్వయజుఃసామ్నాం రాశీరుద్ధృత్య వర్గశః
చతస్రః సంహితాశ్చక్రే మన్త్రైర్మణిగణా ఇవ

ఋగ్ యజు సామ అధర్వణ వేదాలుగా విభజించి
మంత్రములతో ఆయా మణులను ఎలా విభజిస్తామో రాశులను వ్యాసభగవానుడు విభజించాడు

తాసాం స చతురః శిష్యానుపాహూయ మహామతిః
ఏకైకాం సంహితాం బ్రహ్మన్నేకైకస్మై దదౌ విభుః

నాలుగు భాగములకు నలుగురు శిష్యులుగా చేసుకుని ఒక్కో శిష్యునికి ఒక్కో సంహితను అందించాడు

పైలాయ సంహితామాద్యాం బహ్వృచాఖ్యాం ఉవాచ హ
వైశమ్పాయనసంజ్ఞాయ నిగదాఖ్యం యజుర్గణమ్

పైలునికి ఋక్ వేదాన్ని
వైశంపాయునికి యజుర్వేదాన్ని
జైమినికి సామవేదాన్ని బోధించాడు
అంగీరసునికి (సుమతుడు) అధర్వణ వేదాన్ని బోధించాడు

సామ్నాం జైమినయే ప్రాహ తథా ఛన్దోగసంహితామ్
అథర్వాఙ్గిరసీం నామ స్వశిష్యాయ సుమన్తవే

పైలః స్వసంహితామూచే ఇన్ద్రప్రమితయే మునిః
బాష్కలాయ చ సోऽప్యాహ శిష్యేభ్యః సంహితాం స్వకామ్

అలా పైలుడు తనకు బోధించిన ఋగ్ వేదాన్ని ఇంద్రప్రమితునికీ, అతను బాష్కలునికీ బాష్కలుడు తన శిష్యులకూ చెప్పుకుంటూ వెళ్ళాడు

చతుర్ధా వ్యస్య బోధ్యాయ యాజ్ఞవల్క్యాయ భార్గవ
పరాశరాయాగ్నిమిత్ర ఇన్ద్రప్రమితిరాత్మవాన్

దాన్ని నాలుగు భాగాలుగా చేసి యాజ్ఞ్యవల్కునికి బోధించాడు
పరాశరునికీ అగ్ని మిత్రునికీ ఇంద్రప్రమితికీ

అధ్యాపయత్సంహితాం స్వాం మాణ్డూకేయమృషిం కవిమ్
తస్య శిష్యో దేవమిత్రః సౌభర్యాదిభ్య ఊచివాన్

తాము తాము తమ గురువుల వద్ద నేర్చుకున్నదాన్ని తమ శిష్యులకు బోధిస్తూ వచ్చారు
దేవమిత్రుడు సౌభరికీ,

శాకల్యస్తత్సుతః స్వాం తు పఞ్చధా వ్యస్య సంహితామ్
వాత్స్యముద్గలశాలీయ గోఖల్యశిశిరేష్వధాత్

అతనిపుత్రుడైన శాకల్యుడు దాన్ని ఐదు భాగాలు చేసి
వాత్స్య ముద్గల శాలీయ గోఖల్య శిశిర అనే ఐదుగురికి చెప్పాడు

జాతూకర్ణ్యశ్చ తచ్ఛిష్యః సనిరుక్తాం స్వసంహితామ్
బలాకపైలజాబాల విరజేభ్యో దదౌ మునిః

జాతూకర్ణుడు వారి శిష్యుడు. ఆయన ఈ సంహిత భాగాన్ని బాలక పైల జాబాల విరజుడనే నలుగురికి ఇచ్చాడు

బాష్కలిః ప్రతిశాఖాభ్యో వాలఖిల్యాఖ్యసంహితామ్
చక్రే వాలాయనిర్భజ్యః కాశారశ్చైవ తాం దధుః

బాష్కలి తాను చదువుకున్న భాగానికి వాలఖిల్య సంహిత అనే పేరు పెట్టి బాలాయనీ భజ్య కాశారి అనే వారికి చెప్పాగా వారు స్వీకరించారు.

బహ్వృచాః సంహితా హ్యేతా ఏభిర్బ్రహ్మర్షిభిర్ధృతాః
శ్రుత్వైతచ్ఛన్దసాం వ్యాసం సర్వపాపైః ప్రముచ్యతే

బహ్వృచ మంటే ఋక్కు. ఇంతమంది బ్రాహ్మణోత్తములచే మొదలుపెట్టిన ఈ సంహితను, ఈ వేద విభాగాన్ని వింటే అన్ని పాపాలూ తొలగిపోతాయి

వైశమ్పాయనశిష్యా వై చరకాధ్వర్యవోऽభవన్
యచ్చేరుర్బ్రహ్మహత్యాంహః క్షపణం స్వగురోర్వ్రతమ్

వీరి శిష్యులే అధ్వర్యులు. అధర్వణ వేదాన్ని వీరు విన్నారు.

యాజ్ఞవల్క్యశ్చ తచ్ఛిష్య ఆహాహో భగవన్కియత్
చరితేనాల్పసారాణాం చరిష్యేऽహం సుదుశ్చరమ్

ఇలాగే ఈయన శిష్యులందరూ కూడా గురువుగారు తనకు వచ్చిన బ్రహ్మ హత్యాపాతకాన్ని తన శిష్యులు నలుగురికీ చెప్పి, వారి తపశ్శక్తితో పోగొట్టమని వైశంపాయనుడు చెప్పాడు
అలా చెబితే యాజ్ఞ్యవల్క్యుడు నేనొక్కడినే చేస్తాను అని అన్నాడు. వీరు అలా చేయలేరు అని అన్నడు. తోటి బ్రాహ్మణులను అవమానించినందు వలన

ఇత్యుక్తో గురురప్యాహ కుపితో యాహ్యలం త్వయా
విప్రావమన్త్రా శిష్యేణ మదధీతం త్యజాశ్వితి

గురువుకు కోపం వచ్చి, నేను చెప్పిన వేదాన్ని విడిచిపెట్టు అని అన్నాడు
అపుడు యజ్ఞ్యవల్క్యుడు తాను నేర్చిన వేద భాగాన్ని వమనం (వాంతి)చేసుకున్నాడు

దేవరాతసుతః సోऽపి ఛర్దిత్వా యజుషాం గణమ్
తతో గతోऽథ మునయో దదృశుస్తాన్యజుర్గణాన్

యజూంషి తిత్తిరా భూత్వా తల్లోలుపతయాదదుః
తైత్తిరీయా ఇతి యజుః శాఖా ఆసన్సుపేశలాః

ఆయన వమనం చేయగా వచ్చిన భాగాన్ని కొన్ని పక్షులు తినేశాయి.వాటిని తిత్తిరి పక్షులు అంటారు. అవి తిన్న వాటిని వ్యాపింపచేసాయి. దాన్నే తైత్తిరీయ శాఖ అంటారు

యాజ్ఞవల్క్యస్తతో బ్రహ్మంశ్ఛన్దాంస్యధి గవేషయన్
గురోరవిద్యమానాని సూపతస్థేऽర్కమీశ్వరమ్

ఈ యాజ్ఞ్యవల్క్యుడే సూర్యభగవానుని ప్రార్థించి మా గురువుగారు స్పృశించని వేద శాఖలను నాకు ప్రసాదించండి అని వేడుకున్నాడు
కానీ అవి నిత్యం అధయయనం చేయబడుతూనే ఉండాలి. గురువు గారు నేర్వనిదీ, అధయయనం చేయబడుతూ ఉండేవి, ఐన వాటిని ఇవ్వమని ప్రార్థించాడు
సూర్యున్ని ఈ మంత్రాలతో ప్రార్థించాడు
సూర్యభగవానుని అనుగ్రహాన్నీ విద్యనూ ఆరోగ్యాన్ని కోరిన వారు ఈ మంత్రాన్ని రోజూ చదవాలి

శ్రీయాజ్ఞవల్క్య ఉవాచ
ఓం నమో భగవతే ఆదిత్యాయాఖిలజగతామాత్మస్వరూపేణ కాల
స్వరూపేణ చతుర్విధభూతనికాయానాం బ్రహ్మాదిస్తమ్బపర్యన్తానామన్తర్హృదయేషు
బహిరపి చాకాశ ఇవోపాధినావ్యవధీయమానో భవానేక
ఏవ క్షణలవనిమేషావయవోపచితసంవత్సరగణేనాపామాదాన
విసర్గాభ్యామిమాం లోకయాత్రామనువహతి

సూర్యభగవానుడు అఖిల జగత్తుకూ ఆత్మ. ఈయనే కాల స్వరూపుడు. ఆత్మ స్వరూపుడు. జలాయుజ(మావి నుండి పుట్టేవి) అండజ స్వేదజ ఉద్బిజ్జమూ (చెట్లు) , ఇలా నాలుగు రకాల జీవులూ, బ్రమ్హాది స్తంభ పర్యంతం ఉన్న ప్రాణుల హృదయములోపలా బయటా , ఎటువంటి వ్యవధానం లేకుండా ఉన్నది నీవు.
క్షణం లవం నిమేషం ఘడియ విఘడియ గంటలూ రోజులూ అనే విభాగము నీ వలననే.
నీరును తీసుకొనుట, విడిచిపెట్టుట వలన లోకాన్ని కాపాడుతున్నావు
వారిలో జ్ఞ్యానాన్ని ఆవిర్భవింపచేసి చీకటిని పోగొట్టి లోకాన్నీ కాపాడుతున్నావు
నీవే కాల స్వరూపుడవు ఆత్మ స్వరూపుడవు
సకల ప్రాణుల అంతర్యామివి నీవే

యదు హ వావ విబుధర్షభ సవితరదస్తపత్యనుసవనమహర్
అహరామ్నాయవిధినోపతిష్ఠమానానామఖిలదురితవృజిన
బీజావభర్జన భగవతః సమభిధీమహి తపన మణ్డలమ్

సకల పాప కల్మషాన్ని కాల్చిపారేసే నీ తపన మండలాన్ని ధ్యానం చేస్తున్నాను

య ఇహ వావ స్థిరచరనికరాణాం నిజనికేతనానాం మనైన్ద్రియాసు
గణాననాత్మనః స్వయమాత్మాన్తర్యామీ ప్రచోదయతి

మనసూ ఇంద్రియములూ ప్రాణములూ నీ చేతే కాపాడబడుతూ ఉంటాయి.
మనసూ బుద్ధీ ఇంద్రియాలను అంతర్యామిగా ఉండి ప్రేరణ చేస్తూ ఉంటావు

య ఏవేమం లోకమతికరాలవదనాన్ధకారసంజ్ఞాజగరగ్రహ
గిలితం మృతకమివ విచేతనమవలోక్యానుకమ్పయా పరమకారుణిక
ఈక్షయైవోత్థాప్యాహరహరనుసవనం శ్రేయసి స్వధర్మాఖ్యాత్మావ
స్థనే ప్రవర్తయతి

ఈ లోకం మహా భయంకరమైన నోటితో అంధకారం అనే లోకాన్ని కాలం అనే కొండచిలువ మింగివేస్తుంది.
ఆ లోకాన్ని చూచి పరమ దయ గలవాడవైన నీవు నీ చూపుతోనే లేపి ప్రతీ ఝామూ కాపాడుతూ ఉంటావు
అందరూ వారి వారి ధర్మాన్ని సక్రమముగా ఆచరించడానికి కావలసిన జ్ఞ్యానాన్ని ఉత్సాహాన్ని ఇచ్చి ప్రవర్తింపచేస్తూ ఉన్నావు

అవనిపతిరివాసాధూనాం భయముదీరయన్నటతి పరిత ఆశాపాలైస్
తత్ర తత్ర కమలకోశాఞ్జలిభిరుపహృతార్హణః

నీవు ఒక రాజువలే దుర్మార్గులకు భయం కలిగిస్తూ  సన్మార్గులకు రక్షణ కలిగ్స్తూ ప్రకాశిస్తూ ఉంటావు
నీ సంచరిస్తూ ఉంటే ఆయా లోకపాలకులు చేతులు జోడించి ప్రాథిస్తారు

అథ హ భగవంస్తవ చరణనలినయుగలం త్రిభువనగురుభిరభివన్దితమ్
అహమయాతయామయజుష్కామ ఉపసరామీతి

నీ పాదపద్మాలు మూడు లోకనాయకులకూ వందితము
యజుర్వేద జ్ఞ్యానం పొందడానికి నేను నిన్ను ఉపాసిస్తున్నాను

సూత ఉవాచ
ఏవం స్తుతః స భగవాన్వాజిరూపధరో రవిః
యజూంష్యయాతయామాని మునయేऽదాత్ప్రసాదితః

అని ప్రార్థిస్తే అలా స్తుతించబడి గుఱ్ఱం రూపములో వచ్చి ఆ పరమాత్మ అధ్యయనం, ఆగిపోని యజుర్భాగములను బోధించాడు

యజుర్భిరకరోచ్ఛాఖా దశ పఞ్చ శతైర్విభుః
జగృహుర్వాజసన్యస్తాః కాణ్వమాధ్యన్దినాదయః

గుఱ్ఱం రూపములో వచ్చాడు కాబట్టి యజుర్వేదములో ఈ శాఖకు వాజసనేయ శాఖ అంటారు
పదిహేను శాఖలు, అందులో ఒక్కోటి నూరు భాగాలు. ఈ మొత్తం పదిహేను శాఖలనూ పదిహేను మంది శిషుయులకు, కాణ్వాదులకు బోధించాడు


జైమినేః సమగస్యాసీత్సుమన్తుస్తనయో మునిః
సుత్వాంస్తు తత్సుతస్తాభ్యామేకైకాం ప్రాహ సంహితామ్

జైమిని సామ వేదాన్ని చదువుకున్నాడు, వారు వారి పుత్రులకు ఒక్కో సంహితను అందించాడు

సుకర్మా చాపి తచ్ఛిష్యః సామవేదతరోర్మహాన్
సహస్రసంహితాభేదం చక్రే సామ్నాం తతో ద్విజ

అతని కుమారుడు సుకర్మ. అతను వేయి శాఖలతో ఉన్న సామ వేదానికి వేయి మంది శిష్యులకు అందించాడు

హిరణ్యనాభః కౌశల్యః పౌష్యఞ్జిశ్చ సుకర్మణః
శిష్యౌ జగృహతుశ్చాన్య ఆవన్త్యో బ్రహ్మవిత్తమః

హిరణ్యనాభ కౌశల్య పౌష్యంకులు, ఈ ముగ్గురూ సుకర్మ శిష్యులు.
వీరు అవంతి వేదములను నేర్చుకున్నారు

ఉదీచ్యాః సామగాః శిష్యా ఆసన్పఞ్చశతాని వై
పౌష్యఞ్జ్యావన్త్యయోశ్చాపి తాంశ్చ ప్రాచ్యాన్ప్రచక్షతే

ఉత్తర దేశీయులు వేయిలో ఐదు వందలు తీసుకుని సామవేదాన్ని అధ్యయనం చేస్తున్నారు
పౌష్యంజన అవంత్యులు ప్రాచ్య ఉదీచ్య శాఖలు నేర్చుకున్నారు


లౌగాక్షిర్మాఙ్గలిః కుల్యః కుశీదః కుక్షిరేవ చ
పౌష్యఞ్జిసిష్యా జగృహుః సంహితాస్తే శతం శతమ్

వీరందరూ పౌష్యజ్ఞ్య శిష్యులు. ఈ ఐదుగురూ ఒక్కొక్కరూ నూరు శాఖలను తీసుకున్నారు

కృతో హిరణ్యనాభస్య చతుర్వింశతి సంహితాః
శిష్య ఊచే స్వశిష్యేభ్యః శేషా ఆవన్త్య ఆత్మవాన్

హిరణ్య నాభుని 24 సంహితలను ఇలా చదువుకున్నవారు వారి వారి శిష్యులకు శిష్య పరంపరగా పెరిగి వెళ్ళాయి.


                                                            సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Popular Posts