Followers

Saturday 19 April 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం పదహారవ అధ్యాయం

                 ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం దశమ స్కంధం పదహారవ అధ్యాయం


శ్రీశుక ఉవాచ
విలోక్య దూషితాం కృష్ణాం కృష్ణః కృష్ణాహినా విభుః
తస్యా విశుద్ధిమన్విచ్ఛన్సర్పం తముదవాసయత్

ఇలా జలం విషయమయమవడం చూచిన కృష్ణుడు అవినయముతో ఆ సర్పము చేసిన పని తెలుసుకుని ఆ సర్పాన్ని అక్కడి నుంచి పంపించి వేసాడు.

శ్రీరాజోవాచ
కథమన్తర్జలేऽగాధే న్యగృహ్ణాద్భగవానహిమ్
స వై బహుయుగావాసం యథాసీద్విప్ర కథ్యతామ్

నీటిలో ఎక్కడో ఉన్న మహాసర్పాన్ని కృష్ణుడెలా పంపాడు. ఇంతకాల ఆ సర్పం ఎలా ఉన్నాడు. ఇంతకాలమున్న ఆ సర్పాన్ని కృష్ణుడు ఎలా బయటకు పంపాడు

బ్రహ్మన్భగవతస్తస్య భూమ్నః స్వచ్ఛన్దవర్తినః
గోపాలోదారచరితం కస్తృప్యేతామృతం జుషన్

అమృతాన్ని తాగుతున్న వాడికి తృప్తి ఉంటుందా. గోపాలుని యొక్క ఔదార్యాన్ని (తనని నమ్మి ఉన్న గోపాలబాలురకు శుభం చేకూర్చడానికి తనను తాను సర్పానికి అర్పించుకున్నాడు) పానం చేస్తున్న వాడెవడైనా తృప్తి పొందుతాడా

శ్రీశుక ఉవాచ
కాలిన్ద్యాం కాలియస్యాసీధ్రదః కశ్చిద్విషాగ్నినా
శ్రప్యమాణపయా యస్మిన్పతన్త్యుపరిగాః ఖగాః

కాళీయుని విషముతో ఈ సరస్సులో నీళ్ళు ఎప్పుడూ మరుగుతూ ఉంటాయి. ఆ మడుగుపైనుంచి కూడా పక్షులు వెళ్ళవు. తెలియక పక్షులు వస్తే ఆ విషవాయుకు కింద పడిపోతాయి

విప్రుష్మతా విషదోర్మి మారుతేనాభిమర్శితాః
మ్రియన్తే తీరగా యస్య ప్రాణినః స్థిరజఙ్గమాః

ఆ విషపు వాయువు వలన ఆ నది దగ్గరలో ఉన్న చెట్లు మాడిపోయాయి.

తం చణ్డవేగవిషవీర్యమవేక్ష్య తేన
దుష్టాం నదీం చ ఖలసంయమనావతారః
కృష్ణః కదమ్బమధిరుహ్య తతోऽతితుఙ్గమ్
ఆస్ఫోట్య గాఢరశనో న్యపతద్విషోదే

దుష్టులను నిగ్రహించడానికి అవతరించిన పరమాత్మ మహాభయంకరమైన వేగముతో విషయమయమైన ఆ నదిని చూచి, ఒక చెట్టు  ఎక్కి నడుము కట్టుకుని, చేతులు చరిచాడు, బాహువులను చరిచి, గట్టిగా వస్త్రాన్ని బిగించి, ఆ విష జలములో పడిపోయాడు.

సర్పహ్రదః పురుషసారనిపాతవేగ
సఙ్క్షోభితోరగవిషోచ్ఛ్వసితామ్బురాశిః
పర్యక్ప్లుతో విషకషాయబిభీషణోర్మిర్
ధావన్ధనుఃశతమనన్తబలస్య కిం తత్

అంత చిన్న పిల్లవాడు అందులో దూకితే నూరు ధనువుల దూరం పారిపోయాయి ఆ నదిలో తరంగాలు. ఇది వరకు సర్పము యొక్క విషముతో మరుగూ ఉన్నది. అందులో కృష్ణుడు  పడి ఆ నీటిని దూరముగా తరిమి వేశాడు. అనంత బలుడైన స్వామి బలానికి ఆ నీరు అంత దూరం పోవడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు

తస్య హ్రదే విహరతో భుజదణ్డఘూర్ణ
వార్ఘోషమఙ్గ వరవారణవిక్రమస్య
ఆశ్రుత్య తత్స్వసదనాభిభవం నిరీక్ష్య
చక్షుఃశ్రవాః సమసరత్తదమృష్యమాణః

స్వామి దూకి ఈదుతున్నాడు. ఒక ఏనుగు మడుగులోకి దూకి విహరిస్తున్నట్లు ఉంది. నా ఇంటికి వచ్చినది ఎవడని కాళీయుడు చూచాడు. తన ఇంటిని ఎవడు అవమానించాడని కన్నులే చెవులుగా గల (చక్షు శ్రవ) కాళీయుడు చూచాడు. మనను  కాపాడడానికి పరమాత్మ అవతరించి మన వద్దకు వస్తే "మనదగ్గరకు ఎందుకు వచ్చాడంటాం " మనం. మనం కూడా చక్షు శ్రవలమే.
మనం కూడా విషము నిండిన సంసారమనే హ్రదములో ఉన్నాము, శబ్దాది విషయములే విషములు. ఇదే కాళీయ హ్రదం. మనమంతా కాళీయులమే. అక్కడి నుంచి సముద్రానికి తరిమేసాడు స్వామి. ఏక పాత్ నుండి త్రిపాద్ విభూతికి పంపాడు స్వాము.

తం ప్రేక్షణీయసుకుమారఘనావదాతం
శ్రీవత్సపీతవసనం స్మితసున్దరాస్యమ్
క్రీడన్తమప్రతిభయం కమలోదరాఙ్ఘ్రిం
సన్దశ్య మర్మసు రుషా భుజయా చఛాద

విష జలములో ఈదు కొడుతున్నా, అందులో ఉన్న వారికి కూడా చూడాలనిపించేలా ఉన్న కృష్ణుడు, సుకుమారముగా ఉన్నవాడు, నీల మేఘశ్యాముడు, పీతాంబరధారి ఐన స్వామిని చూచి, చిరునవ్వుతో అందమైన ముఖం కలిగినవాడు, భయములేక హాయిగా ఆడుకుంటున్నవాడు, పద్మ గర్భము వంటి సుకుమారమైన పాదములు కల స్వామిని కాళీయుడు వచ్చి కాట్లు వేసాడు, విషమంతా కురిపించి, తోకతో స్వామిని చుట్టి వేశాడు.

తం నాగభోగపరివీతమదృష్టచేష్టమ్
ఆలోక్య తత్ప్రియసఖాః పశుపా భృశార్తాః
కృష్ణేऽర్పితాత్మసుహృదర్థకలత్రకామా
దుఃఖానుశోకభయమూఢధియో నిపేతుః

పాము తోకతో మొత్తం చుట్టేసి కాటేసే సరికి స్వామి కదలిక లేక చెతలుడిగి ఉన్నాడు. ఆయనను చూచిన నిరంతరమూ పరమాత్మ యందే మనసు ఉంచీ, తమను, పుత్రులనూ భార్యలనూ ఆయన యందే అర్పించిన మిత్రులందరూ మూర్చపోయారు, దుఃఖముతో శోకముతో భయముతో.

గావో వృషా వత్సతర్యః క్రన్దమానాః సుదుఃఖితాః
కృష్ణే న్యస్తేక్షణా భీతా రుదన్త్య ఇవ తస్థిరే

ఆవులూ కోడెలూ దూడలూ అరుస్తున్నాయి కృష్ణుని కోసం
కృష్ణుని మీదే కనులు ఉన్నాయి. బొమ్మల లాగ ఐపోయాయి.

అథ వ్రజే మహోత్పాతాస్త్రివిధా హ్యతిదారుణాః
ఉత్పేతుర్భువి దివ్యాత్మన్యాసన్నభయశంసినః

వ్రేపల్లె వాడలో దుశ్శకునాలు కనపడ్డాయి. ఆకాశములో భూమిలో ఉత్పాతాలు కనపడ్డాయి
కృష్ణునికేదో ఆపద జరిగింది అని సూచించే ఉత్పాతాలు కలిగాయి.

తానాలక్ష్య భయోద్విగ్నా గోపా నన్దపురోగమాః
వినా రామేణ గాః కృష్ణం జ్ఞాత్వా చారయితుం గతమ్

అందరికీ భయం వేసింది. అపుడు అర్థం అయ్యింది. ఆరోజు బలరాముడు లేకుండా కృష్ణుడు ఒక్కడే బయలుదేరాడని

తైర్దుర్నిమిత్తైర్నిధనం మత్వా ప్రాప్తమతద్విదః
తత్ప్రాణాస్తన్మనస్కాస్తే దుఃఖశోకభయాతురాః

కృష్ణునికి పెద్ద ఆపదే వచ్చింది. ప్రాణం కూడా పోయిందేమో అన్న భయముతో బయలుదేరారు. వ్రేపల్లెలో గోపాలురి ప్రాణాలన్నీ మనసులన్నీ కృష్ణుని మీదే ఉన్నాయి. దుఃఖమూ శోకమూ భయమూ కలిగాయి. శరీరానికి కలిగే బాధను దుఃఖం అంటారు. మానసిక వ్యధ శోకము. శరీరానికి కలిగిన హాని వలన కలిగే బాధను దుఃఖము అంటారు.

ఆబాలవృద్ధవనితాః సర్వేऽఙ్గ పశువృత్తయః
నిర్జగ్ముర్గోకులాద్దీనాః కృష్ణదర్శనలాలసాః

బాలురూ వృద్ధులూ స్త్రీలు అన్న భేధం లేకుండా పశువులతో బతికేవారందరూ కలసి వెళ్ళారు.
కృష్ణుని చూడడానికి ఆరాటముతో అందరూ వెళ్ళారు.

తాంస్తథా కాతరాన్వీక్ష్య భగవాన్మాధవో బలః
ప్రహస్య కిఞ్చిన్నోవాచ ప్రభావజ్ఞోऽనుజస్య సః

ఇందరూ ఇంతగా పరిగెత్తుతూ ఉంటే తమ్ముడి సంగతి తెలిసిన బలరాముడు మాత్రం ఒక నవ్వు నవ్వి మౌనం వహించాడు.

తేऽన్వేషమాణా దయితం కృష్ణం సూచితయా పదైః
భగవల్లక్షణైర్జగ్ముః పదవ్యా యమునాతటమ్

కృష్ణ పరమాత్మ అడుగుజాడలు చూచుకుంటూ ఆయన ఉన్న చోటికి వెళ్ళారు. కృష్ణుని పాదాలు గుర్తుపట్టవీలుగా శంఖ చక్ర గద మొదలైన గుర్తులు ఉన్నాయి.

తే తత్ర తత్రాబ్జయవాఙ్కుశాశని ధ్వజోపపన్నాని పదాని విశ్పతేః
మార్గే గవామన్యపదాన్తరాన్తరే నిరీక్షమాణా యయురఙ్గ సత్వరాః

శంఖమూ చక్రమూ అంకుశమూ వజ్రమూ ధ్వజమూ మొదలైన చిహ్నములు కలిగి ఉన్నాయి ఆ పాదాలు. కృష్ణ పరమాత్మ ఆవుల వెంట వెళ్ళడం కూడా ఒక విలక్షణముగా ఉండేది. పశువులు ఒక పక్క వెళుతూ ఉంటే సాధారణముగా వేరొక పక్క వెళుతూ ఉంటారు పశువులను కాచేవారు. ఒక వేళ పశువులు కొట్టుకుంటూ ఉంటే వారు మధ్యలో ఉంటే నలిగిపోతారు. ఇది సామాన్య గోపాలకుల విషయం. కానీ కృష్ణుడు మాత్రం ఆవుల మధ్యలోనే వెళతాడు. గోవుల యొక్క పాదముల మధ్య ఉన్న పాదములు కృష్ణుడివి. కృష్ణుడు ఒక్కడే అలా నడుస్తాడు. ( ఈ విషయం బ్రహ్మవైవర్తములో పాద్మములోనూ చెప్పబడింది)

అన్తర్హ్రదే భుజగభోగపరీతమారాత్
కృష్ణం నిరీహముపలభ్య జలాశయాన్తే
గోపాంశ్చ మూఢధిషణాన్పరితః పశూంశ్చ
సఙ్క్రన్దతః పరమకశ్మలమాపురార్తాః

అక్కడకు వెళ్ళి చూడగా పాము చేత చుట్టబడి నిశ్చేష్టుడై ఉన్నాడు కృష్ణుడు. శ్వాస కూడా తీయుట లేదు. అది చూచి గోపాలకులు అంతా బిత్తరపోయి నిలబడ్డారు. ఆవులన్నీ అరుస్తున్నాయి. అందరూ ఎంతో దుఃఖం పొందారు.

గోప్యోऽనురక్తమనసో భగవత్యనన్తే
తత్సౌహృదస్మితవిలోకగిరః స్మరన్త్యః
గ్రస్తేऽహినా ప్రియతమే భృశదుఃఖతప్తాః
శూన్యం ప్రియవ్యతిహృతం దదృశుస్త్రిలోకమ్

గోపికలు పరమాత్మ యందే నిరంతరం అనురాగం కలిగి ఉన్నారు కాబట్టి, ఈ స్థితిలో ఉన్న కృష్ణున్ని చూచి కృష్ణుడి అసలు స్వరూపాన్నీ జ్ఞ్యాపకాలనీ తలచుకుంటూ మూడులోకాలూ శూన్యమైపోయాయి అనుకుంటున్నారు. నిజముగా కృష్ణుడికే ఆపద కలిగి ఉంటే ఆయన లేని జగత్తు శూన్యముగా భావించారు.

తాః కృష్ణమాతరమపత్యమనుప్రవిష్టాం
తుల్యవ్యథాః సమనుగృహ్య శుచః స్రవన్త్యః
తాస్తా వ్రజప్రియకథాః కథయన్త్య ఆసన్
కృష్ణాననేऽర్పితదృశో మృతకప్రతీకాః

కృష్ణుని తల్లి కృష్ణుని కోసం ఎంత ఆవేదన పడుతుందో ఎంతగా ఆక్రోశిస్తుందో ఎంతగా బాధపడుతుందో అక్కడ ఉన్న గోప గోపిక గోపాలురలో అంతకన్నా తక్కువగా ఆక్రోశించినవారెవరూ లేరు. వారిని చూస్తే ఎవరు తల్లో ఎవరు ఇతరులో ఎవరూ గుర్తుపట్టలేరు. ఎంత బాధ కృష్ణుని తల్లికి ఉందో అంత బాధ వీరికీ ఉంది.
ఇంచు మించు చనిపోయిన వారితో సమానమైపోయారు. ఆయన అంతవరకూ చేసిన చేష్టములను తలచుకుంటూ నిలబడిన శవాలయ్యారు

కృష్ణప్రాణాన్నిర్విశతో నన్దాదీన్వీక్ష్య తం హ్రదమ్
ప్రత్యషేధత్స భగవాన్రామః కృష్ణానుభావవిత్

నంద యశోదులు బాధ భరించలేక ఆ మడుగులోకి వారు కూడా దూకబోయారు. వారిని పరమాత్మ ప్రభావం తెలిసిన బలరాముడు నిలువరించాడు

ఇత్థమ్స్వగోకులమనన్యగతిం నిరీక్ష్య
సస్త్రీకుమారమతిదుఃఖితమాత్మహేతోః
ఆజ్ఞాయ మర్త్యపదవీమనువర్తమానః
స్థిత్వా ముహూర్తముదతిష్ఠదురఙ్గబన్ధాత్

బలరాముడు నంద యశోదాదులతో ఆగమని చెప్పడాన్ని చూచిన కృష్ణుడు తన కంటే వేరే గతి లేని గోకులాన్ని చూచీ, స్త్రీలూ పెద్దలూ పిల్లలూ పడుతున్న బాధను చూచి మనిషిలాగ నటించిన కృష్ణుడు ఒక్క సారిగా చుట్టుకున్న పామును విదిలించాడు.

తత్ప్రథ్యమానవపుషా వ్యథితాత్మభోగస్
త్యక్త్వోన్నమయ్య కుపితః స్వఫణాన్భుజఙ్గః
తస్థౌ శ్వసఞ్ఛ్వసనరన్ధ్రవిషామ్బరీష
స్తబ్ధేక్షణోల్ముకముఖో హరిమీక్షమాణః

ఆ కాళీయుడు కృష్ణుని చేష్టితముకు ఆశ్చర్య్పడి విషం వెలువరించే తన శ్వాసను ఇంకొంచెం చిమ్ముతూ కాళీయుడు తన విష శ్వాసలనే మూకుడులో విషాన్ని వేడి చేసి పోస్తున్నట్లుగా విషాన్ని కృష్ణుడి మీద చిమ్మాడు. ఇక్కడ అంబరీష అంటే మూకుడు అని అర్థం. కాళియుని ముక్కు రంధ్రాలు వేడి మూకుడులా ఉన్నాయి. వాడి ముఖములోంచి మంటలు వస్తున్నాయి. అలా స్వామిని చూస్తూ నాలికలతో కృష్ణున్ని నాకుతున్నాడు.

తం జిహ్వయా ద్విశిఖయా పరిలేలిహానం
ద్వే సృక్వణీ హ్యతికరాలవిషాగ్నిదృష్టిమ్
క్రీడన్నముం పరిససార యథా ఖగేన్ద్రో
బభ్రామ సోऽప్యవసరం ప్రసమీక్షమాణః

ఎంత గొప్ప సర్పాన్నైనా గరుత్మంతుడు ముక్కుతో పట్టుకుని ఆడుకుంటాడో స్వామి కాళీయునితో వాడికి చిక్కకుండా అటూ ఇటూ తిరుగుతూ ఆడుకున్నాడు.  కాళీయున్ని ఆ హ్రదం చుట్టూ తిప్పాడు. సమయముకోసం స్వామి వేచి చూస్తున్నాడు

ఏవం పరిభ్రమహతౌజసమున్నతాంసమ్
ఆనమ్య తత్పృథుశిరఃస్వధిరూఢ ఆద్యః
తన్మూర్ధరత్ననికరస్పర్శాతితామ్ర
పాదామ్బుజోऽఖిలకలాదిగురుర్ననర్త

ఇలా తిరిగి తిరిగి బలము తగ్గిన కాళీయుడు ఎత్తుగా ఉన్న పడగ భాగాన్ని వంచి అతని పెద్ద శిరస్సును పరమాత్మ అధిరోహించాడు.
ఎర్రగా సుకుమారముగా ఉండే పరమాత్మ పాదాలు కాళీయుని పడగల పై ఉన్న పగడములతో మరింతగా ఎర్రబారాయి, అన్ని కళలకూ ఆది గురువైన స్వామి ఆ శిరస్సు మీద నాట్యం చేసాడు.

తం నర్తుముద్యతమవేక్ష్య తదా తదీయ
గన్ధర్వసిద్ధమునిచారణదేవవధ్వః
ప్రీత్యా మృదఙ్గపణవానకవాద్యగీత
పుష్పోపహారనుతిభిః సహసోపసేదుః

పైనుంచి గంధర్వాదులు చూచారు ఇదంతా. స్వామి నాట్యం చేయబోతున్నాడని తెలుసుకుని అందరూ వారి వారి వాద్యాలు మృదంగమూ పణవమూ దుందుభులూ వేణువులూ తీసుకుని సమీపించారు.

యద్యచ్ఛిరో న నమతేऽఙ్గ శతైకశీర్ష్ణస్
తత్తన్మమర్ద ఖరదణ్డధరోऽఙ్ఘ్రిపాతైః
క్షీణాయుషో భ్రమత ఉల్బణమాస్యతోऽసృఙ్
నస్తో వమన్పరమకశ్మలమాప నాగః

నూరు పడగలు ఉన్నాయి ఆ కాళీయునికి, వంచని తలను తొక్కుతున్నాడు కృష్ణ్డు. ఇది పరమాత్మ దయకు పరాకాష్ఠ. వంచని తలను మర్దించాడు. పరమాత్మ మనను "నీవే రక్షకుడవు"అనకుంటే శిక్షిస్తాడు.మనం ఒక క్షణం తల వంచితే నిరంతరం మనకు వంగి ఉంటాడు. మనం వంచకపోతే ఆయనే వంచుతాడు.
ఎంత దయాళువో ఎంత వాత్సల్యం చూపేవాడో అంత కఠినముగా శిక్షిస్తాడు స్వామి. అడుగులు పైకెత్తి వేస్తున్నాడు శిరస్సు మీద. ముక్కులోంచీ నోట్లోంచీ విషమును గక్కుతున్నాడు. ఆయుష్యం కూడా తగ్గిపోతోంది. ప్రాణాలూ తగ్గిపోతున్నాయి.

తస్యాక్షిభిర్గరలముద్వమతః శిరఃసు
యద్యత్సమున్నమతి నిఃశ్వసతో రుషోచ్చైః
నృత్యన్పదానునమయన్దమయాం బభూవ
పుష్పైః ప్రపూజిత ఇవేహ పుమాన్పురాణః

చెవులనుంచే కాకుండా కళ్ళ నుంచి కూడా విషాన్ని గక్కుతున్నాడు కాళీయుడు. కోపముతో బుసలు కొడుతూ ఏ ఏ పడగ పైకి లేస్తోందో దాని మీద నాట్యం చేస్తున్నాడు. వంగని తలని పాదములతో మర్దిస్తున్నాడు. వంగిన పడగలు ఎత్తిన పడగల మీద పెట్టిన కాళ్ళకు పూలలా కనపడుతున్నాయి.

తచ్చిత్రతాణ్డవవిరుగ్నఫణాసహస్రో
రక్తం ముఖైరురు వమన్నృప భగ్నగాత్రః
స్మృత్వా చరాచరగురుం పురుషం పురాణం
నారాయణం తమరణం మనసా జగామ

ఇలా విచిత్రమైన గొప్ప తాండవముతో బాగా అలసిపోయి అన్ని పడగలూ అలసిపోయాయి. నోటితో రక్తాన్ని వదులుతున్నాడు, కక్కుతున్నాడు. శరీరమంతా వాడిపోయింది.
నూరు శిరస్సులు ఉన్న తనను తన ఇంటికి వచ్చి ఆడి తన శిరస్సును అధిరోహించి నాట్యం చేసాడంటే ఈ వచ్చిన పిల్లవాడు పిల్లవాడు కాదు, ఇతను చరాచర గురువే, పురాణ పురుషుడే. ఈయన మాత్రమే రక్షకుడు అని తెలుసుకుని మనసులోనే ధ్యానించాడు

కృష్ణస్య గర్భజగతోऽతిభరావసన్నం
పార్ష్ణిప్రహారపరిరుగ్నఫణాతపత్రమ్
దృష్ట్వాహిమాద్యముపసేదురముష్య పత్న్య
ఆర్తాః శ్లథద్వసనభూషణకేశబన్ధాః

జగత్తు మొత్తాన్నే గర్భములో దాచుకున్న కృష్ణుని పాదముల వత్తిడికి ఆగలేకపోయాడు. బరువు మోయలేక అన్ని పడగలూ వంగాయి. అరి కాళ్ళ తాకిడికి అన్ని పడగలూ చితికిపోయాయి. అప్పటిదాగా చూస్తూ కూర్చున్న కాళీయుని భార్యలకు పరిస్థితి అర్థమయ్యింది. వస్త్రమూ ఆభరణాలూ జారిపోతూ ఉండగా ఆర్తితో వచ్చారు

తాస్తం సువిగ్నమనసోऽథ పురస్కృతార్భాః
కాయం నిధాయ భువి భూతపతిం ప్రణేముః
సాధ్వ్యః కృతాఞ్జలిపుటాః శమలస్య భర్తుర్
మోక్షేప్సవః శరణదం శరణం ప్రపన్నాః

ఆడవారిని దయ చూడాలంటే వారు ప్రయోగించే ఆయుధం ముందర పసిపిల్లలను పట్టుకు రావడం. ఈ నాగ పత్నులు కూడా పిల్లలను పట్టుకుని వచ్చారు. శరీరాన్ని కింద పడేసి దండ ప్రణామం చేసి నమస్కరించి తన భర్త యొక్క దుఃఖాన్ని తొలగించాలని కోరుతూ సకల లోకములకూ రక్షణ ఇచ్చే స్వామిని వీరు శరణు పొందారు

నాగపత్న్య ఊచుః
న్యాయ్యో హి దణ్డః కృతకిల్బిషేऽస్మింస్
తవావతారః ఖలనిగ్రహాయ
రిపోః సుతానామపి తుల్యదృష్టిర్
ధత్సే దమం ఫలమేవానుశంసన్

మేము నిన్ను తప్పు బట్టడానికి రాలేదు. తప్పు చేసిన వారిని దండించడం న్యాయమే. నీ అవతారం ఉన్నదే దుష్టులను శిక్షించడానికి. లోకములో ఉండే తక్కిన వారి విషయం పక్కన పెడితే నీవు మాత్రం శత్రువునైనా మిత్రున్నైనా సమదృష్టితోనే శిక్షిస్తావు. నీవు శిక్షిస్తే ఫలమే కలుగుతుంది. దీన్ని ఫలముగానే భావిస్తున్నాము.

అనుగ్రహోऽయం భవతః కృతో హి నో దణ్డోऽసతాం తే ఖలు కల్మషాపహః
యద్దన్దశూకత్వమముష్య దేహినః క్రోధోऽపి తేऽనుగ్రహ ఏవ సమ్మతః

పాదములతో శిరస్సున నీవు చేసిన తాండవం శిక్షణ కాదు అనుగ్రహమే. దురజనుల విషయములో దండించడం అనేది మా పాపములను పోగొట్టడానికే. శిక్ష వలన తప్పు చేయడం వలన వచ్చిన పాపం పోతుంది.
కాటేయడం బుసకొట్టడం పాము స్వభావం. అది నీవు సృష్టించినదే.నీ క్రోధం కూడా మాకు అనుగ్రహమే.

తపః సుతప్తం కిమనేన పూర్వం నిరస్తమానేన చ మానదేన
ధర్మోऽథ వా సర్వజనానుకమ్పయా యతో భవాంస్తుష్యతి సర్వజీవః

 పాముగా సృష్టించబడ్డాడు, మహా కోపిష్ఠీ, అందరినీ కాటేస్తాడు, ఇంతటి పాపపు జన్మ ఇచ్చావు. ఐన ఇతడు కొన్ని లక్షల జన్మలు గొప్ప తపస్సు చేసి ఉంటాడు. నీ పాదాలే ఎవరికీ కనపడవు. అటువంటి పాదాలతో తొక్కావు. ఇతను ఎంత తపస్సు చేసాడో. ఎంత మందిని దయతో కాపాడి ధర్మాన్ని ఆచరించాడో
పరమాత్మ నమస్కారాలతో ప్రదక్షిణలతో కానుకలతో తపస్సుతో సంతోషించడు, దీనులను సేవిస్తే ఆర్తులను కాపాడితే సంతోషిస్తాడు. ఇతను ఇంతకు ముందు జన్మలో ఎంత మందిని దయ చూచాడో, అందువలన నీవు అనుగ్రహించావు.

కస్యానుభావోऽస్య న దేవ విద్మహే తవాఙ్ఘ్రిరేణుస్పరశాధికారః
యద్వాఞ్ఛయా శ్రీర్లలనాచరత్తపో విహాయ కామాన్సుచిరం ధృతవ్రతా

మా భర్త ఏమి పుణ్యం చేస్తే ఈ అనుగ్రహం కలిగిందో మాకు అర్థం కావట్లేదు. నీ పాద పరాగం స్పృశించే యోగ్యత లభించింది. ఏ పాద పరాగాన్ని స్పృశించాలన్న కోరికతో లక్ష్మీ దేవి అన్నీ మానుకుని ఘోరమైన తపస్సు చేసింది. అమ్మవారికి కూడా పొందడానికి తపస్సు కావలసి వచ్చింది.అట్టిది నీ పాద పరాగం, అటువంటి దాన్ని పొందిన వీడు చాలా కాలం చాలా గొప్ప తపస్సు చేసి ఉంటాడు

న నాకపృష్ఠం న చ సార్వభౌమం
న పారమేష్ఠ్యం న రసాధిపత్యమ్
న యోగసిద్ధీరపునర్భవం వా
వాఞ్ఛన్తి యత్పాదరజఃప్రపన్నాః

పరమాత్మ పాద పరాగాన్ని ఆశించేవారు దాని కంటే వేరేదాన్ని దేన్నీ కోరదు. స్వర్గాన్నీ, చక్రవర్తిత్వాన్నీ, బ్రహ్మపదవినీ, రసాతలాధిపత్యాన్నీ, యోగ సిద్ధినీ, మోక్షాన్నీ కూడా కోరరు.

తదేష నాథాప దురాపమన్యైస్తమోజనిః క్రోధవశోऽప్యహీశః
సంసారచక్రే భ్రమతః శరీరిణో యదిచ్ఛతః స్యాద్విభవః సమక్షః

తమో జీవీ, కోపానికి లొంగేవాడు ఐన ఇతడు ఇతరులెవరూ పొందలేని నీ పాదపరాగాన్ని పొందగలిగాడు. సంసారములో సంచరించే జీవుడికి పొందేటువంటి భోగాలూ సంతోషాలూ సుఖాలూ  అన్నీ నీ సంకల్పముతోనే లభిస్తాయి. ఇతని శిరసు మీద నీ పాదం పడింది అంటే అది నీ దయే.
(మిమ్ము చేరడానికి నాకంటూ నేను చేసుకున్న పుణ్యం ప్రత్యేకముగా ఏమీ లేదు. నన్ను కాపాడుకోవడానికి నాకుగా నేను ఏర్పరచుకున్న రక్షత్వం లేదు. )

నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే
భూతావాసాయ భూతాయ పరాయ పరమాత్మనే

సకల భూతములకు నివాసము,నీవే సకల భూత స్వరూపుడవు, నీవే పరుడవూ, పరమాత్మవు, అటువంటి నీకు నమస్కారం.

జ్ఞానవిజ్ఞాననీధయే బ్రహ్మణేऽనన్తశక్తయే
అగుణాయావికారాయ నమస్తే ప్రాకృతాయ చ

ప్రకృతి గుణాలు లేనివాడవు, ప్రకృతిని అతిక్రమించినవాడవు

కాలాయ కాలనాభాయ కాలావయవసాక్షిణే
విశ్వాయ తదుపద్రష్ట్రే తత్కర్త్రే విశ్వహేతవే

కాల స్వరూపుడవు, కాలానికి మధ్య బిందువువు. కాలములో అన్నిటిలో దాగి ఉండి నీవే సాక్షిగా ఉంటావు. సూర్యునిగా అంతర్యామిగా నేత్రముగా శరీరావయములుగా, కాలముగా ఉండి సాక్షిగా ఉంటావు.

భూతమాత్రేన్ద్రియప్రాణ మనోబుద్ధ్యాశయాత్మనే
త్రిగుణేనాభిమానేన గూఢస్వాత్మానుభూతయే

సకల ప్రపంచాన్ని సృష్టించి రక్షించి నాశనం చేసేవాడవు నీవే. పంచభూతాత్మకమైన (పంచ భూతాలు పంచ తన్మాత్రలూ, పంచ జ్ఞ్యాన కర్మేంద్రియములూ మనసూ బుద్ధీ అన్నీ )జగత్తు నీవే.
అంతర్యామిగా ఉండి గుణాలు పెంచుతాడు. అలా పెంచిన గుణముల వలన ఎటువంటి అనుభూతులు కలుగుతున్నాయో చూస్తాడు. పాపములు చేస్తున్నప్పుడూ చూస్తాడు, చేసిన పాపం ఫల రూపములో అనుభవానికి వచ్చినపుడూ చూస్తాడు. మారిన ఫలం అనుభవించేప్పుడూ చూస్తాడు, అనుభవించేప్పుడు ఏమనుకుంటున్నాడో కూడా చూస్తాడు.
గుణ త్రయ అభిమాన అనుభూతి ప్రదాయకుడు స్వామి.

నమోऽనన్తాయ సూక్ష్మాయ కూటస్థాయ విపశ్చితే
నానావాదానురోధాయ వాచ్యవాచకశక్తయే

ఇంత చేయించి కూడా ఇవన్నీ చేయిస్తున్న పరమాత్మ నా హృదయములోనే దాగి ఉన్నాను కదా అని అనుకోడు. పరమాత్మ మాత్రం రహస్యముగా ఉండి, తాను రహస్యముగా ఉన్న అనుభూతిని తానే పొందేవాడు, చూడగలిగిన వారికి సాక్షాత్కరింపచేస్తాడు, చూడలేని వారిని చూచి దరహాసం చేస్తాడు. ఆయనే అనంతుడు సూక్ష్ముడు ఏమాత్రం మార్పు లేని వాడు, అన్నీ తెలిసినవాడు, ఎంత అతీతుడో అంత సులభుడు. ఎవరు ఏది వాదిస్తే అలాగే అంటాడు (నానావాదానురోధాయ).

నమః ప్రమాణమూలాయ కవయే శాస్త్రయోనయే
ప్రవృత్తాయ నివృత్తాయ నిగమాయ నమో నమః

శబ్దమూ తానే అర్థమూ తానే. అన్ని ప్రమాణాలకూ అతనే మూలం.
అతనే కవి. శాస్త్రాలకు మూలం. ప్రవృత్తీ నివృతీ ఆయనే. చేసే పనీ మానే పనీ ఆయనే. వేదములన్నీ ఆయనే

నమః కృష్ణాయ రామాయ వసుదేవసుతాయ చ
ప్రద్యుమ్నాయానిరుద్ధాయ సాత్వతాం పతయే నమః

వసుదేవుని పుత్రుడవైన, రాముడవైన కృష్ణుడవైన నీకు నమస్కారం. అన్ని గుణాలనూ ప్రకాశింపచేసేదీ కప్పి పుచ్చేదీ నీవే.

నమో గుణప్రదీపాయ గుణాత్మచ్ఛాదనాయ చ
గుణవృత్త్యుపలక్ష్యాయ గుణద్రష్ట్రే స్వసంవిదే

గుణప్రదీపుడూ, గుణాలను కప్పిపుచ్చుతాడు. మనం ఆయా గుణాలతో ప్రవర్తిస్తూ ఉండేట్లు చేసేవాడు.
గుణ వృత్తులతో గుర్తించదగిన వాడు.


అవ్యాకృతవిహారాయ సర్వవ్యాకృతసిద్ధయే
హృషీకేశ నమస్తేऽస్తు మునయే మౌనశీలినే

ప్రకృతి అంతా విహరించేవాడు, జరిగే ప్రతీ వికారం నీవు చేసేదే. ఇంద్రియాలకు అధిపతివి నీవు. మౌనశీలివి.

పరావరగతిజ్ఞాయ సర్వాధ్యక్షాయ తే నమః
అవిశ్వాయ చ విశ్వాయ తద్ద్రష్ట్రేऽస్య చ హేతవే

పెద్దవాళ్ళకూ చిన్నవారికీ ఆయనే రక్షణ. ఎవరికి ఎలాంటి ఫలితం ఎప్పుడు ఇవ్వాలో తెలిసినవాడు. ప్రపంచమూ ప్రళయమూ ఆయనే. ఆ ప్రపంచాన్ని చూచేవాడూ, ప్రపంచానికి కారణమూ తానే.

త్వం హ్యస్య జన్మస్థితిసంయమాన్విభో
గుణైరనీహోऽకృతకాలశక్తిధృక్
తత్తత్స్వభావాన్ప్రతిబోధయన్సతః
సమీక్షయామోఘవిహార ఈహసే

ఏ ప్రకృతి గుణాలూ లేకున్నా ఏ కోరికలూ లేకున్నా కాల శక్తి అనుసరించి ప్రపంచహాన్ని సృష్టించి రక్షిస్తావు. ఎవరికి ఏ ఏ స్వాభావాలు ఎపుడెపుడు కలగాలో కలిగిస్తావు. నీ విహారం ఏదీ వ్యర్ధం కాదు

తస్యైవ తేऽమూస్తనవస్త్రిలోక్యాం
శాన్తా అశాన్తా ఉత మూఢయోనయః
శాన్తాః ప్రియాస్తే హ్యధునావితుం సతాం
స్థాతుశ్చ తే ధర్మపరీప్సయేహతః

వీళ్ళందరూ నీ రూపాలే. సాత్విక రాజస తామసులూ మూర్ఖులూ ఉగ్రూ శాంతులూ అందరూ నీ రూపాలే. ఘోరులనూ  మూఢులనూ ఉగ్రులనూ శిక్షించి శాంతులను రక్షించడానికి నీవు వచ్చావు. మన శరీరానికి ప్రమాదకరమైన అంగమును మనమే తొలగించుకుంటాము.

అపరాధః సకృద్భర్త్రా సోఢవ్యః స్వప్రజాకృతః
క్షన్తుమర్హసి శాన్తాత్మన్మూఢస్య త్వామజానతః

యజమానీ ప్రభువూ ఐన వాడూ అప్పుడపుడైనా సేవకులు చేసిన తప్పులను క్షమించాలి. వాడు మూఢుడు, తెలియకవాడు చేసిన తప్పును క్షమించాలి

అనుగృహ్ణీష్వ భగవన్ప్రాణాంస్త్యజతి పన్నగః
స్త్రీణాం నః సాధుశోచ్యానాం పతిః ప్రాణః ప్రదీయతామ్

నీవిలాగే కొంతసేపు ఆటలాడితే అతను ప్రాణాలు కోల్పోతాడు. (మంచి వారి చేత కరుణించబడేవారమైన) స్త్రీలమైన మాకు భర్తే ప్రాణము.

విధేహి తే కిఙ్కరీణామనుష్ఠేయం తవాజ్ఞయా
యచ్ఛ్రద్ధయానుతిష్ఠన్వై ముచ్యతే సర్వతో భయాత్

మేము ఏమి చేయాలో ఆజ్ఞ్యాపించు. ఏ పరమాత్మ ఆజ్ఞ్యను పాలిస్తే అన్ని భయాలూ తొలగిపోతాయో అటువంటి ఆజ్ఞ్య ఇవ్వు

శ్రీశుక ఉవాచ
ఇత్థం స నాగపత్నీభిర్భగవాన్సమభిష్టుతః
మూర్చ్ఛితం భగ్నశిరసం విససర్జాఙ్ఘ్రికుట్టనైః

నాగపత్నుల ప్రార్థన విన్న కృష్ణుడు నాట్యం ఆపేసాడు.

ప్రతిలబ్ధేన్ద్రియప్రాణః కాలియః శనకైర్హరిమ్
కృచ్ఛ్రాత్సముచ్ఛ్వసన్దీనః కృష్ణం ప్రాహ కృతాఞ్జలిః

నాట్యమాపగానే బలం పుంజుకున్న కాళీయుడు స్వామితో చేతులు జోడించి ఇలా అన్నాడు

కాలియ ఉవాచ
వయం ఖలాః సహోత్పత్త్యా తమసా దీర్ఘమన్యవః
స్వభావో దుస్త్యజో నాథ లోకానాం యదసద్గ్రహః

నేను దుర్మార్గుడిని పుట్టుకతోనే, నీ ఆజ్ఞ్య వలనే మాకు తొందరగా కోపం వస్తుంది, చాలా కాలం ఆ కోపం ఉంటుంది.అది నీవు చెప్పినదే. ఎంత గొప్పవారైనా దేన్నైనా విడిచిపెడతారు గానీ స్వభావాన్ని వదిలిపెట్టరు.

త్వయా సృష్టమిదం విశ్వం ధాతర్గుణవిసర్జనమ్
నానాస్వభావవీర్యౌజో యోనిబీజాశయాకృతి

బ్రహ్మ చేత ప్రపంచాన్ని నీవే సృష్టించావు. రకరకాల స్వభావాలూ జాతులూ ప్రవృత్తులూ గుణాలు ఉండేట్లు నీవే సృష్టించావు. పాములమైన మమ్ము సృష్టించావు. గొప్ప కోపంగల మమ్మూ సృష్టించావు.

వయం చ తత్ర భగవన్సర్పా జాత్యురుమన్యవః
కథం త్యజామస్త్వన్మాయాం దుస్త్యజాం మోహితాః స్వయమ్

స్వభావం ఏర్పరచిన నీవే ఇపుడు ఆ స్వభావం ఎల వదలమంటున్నావు. ఎలా వదలాలి. నీ మాయచేత మోహించబడుతున్నాము.

భవాన్హి కారణం తత్ర సర్వజ్ఞో జగదీశ్వరః
అనుగ్రహం నిగ్రహం వా మన్యసే తద్విధేహి నః

ఇలాంటి మా స్వభావానికి కూడా నీవే కారణం. మా కోపం ఇలా ఉంటుంది అని నీకు చెప్పాలా. అది నీవు సృష్టించినదే. నీవే ఈశుడవూ, ప్రభువువూ. అనుగ్రహించినా నిగ్రహించినా అది నీ ఇష్టం.

శ్రీశుక ఉవాచ
ఇత్యాకర్ణ్య వచః ప్రాహ భగవాన్కార్యమానుషః
నాత్ర స్థేయం త్వయా సర్ప సముద్రం యాహి మా చిరమ్
స్వజ్ఞాత్యపత్యదారాఢ్యో గోనృభిర్భుజ్యతే నదీ

మానవ శరీరాన్ని ఏర్పరచుకుని వచ్చిన స్వామి, "ఇక్కడ నీవు ఉండవద్దు, సముద్రానికి వెళ్ళు. నీ భార్యా బంధువులను తీసుకుని సముద్రానికి వెళ్ళు, గోవులూ గోపికలూ గోపాలురు ఇక్కడ తిరుగుతూ ఉంటారు. ఇదంతా వారి భూమి"

య ఏతత్సంస్మరేన్మర్త్యస్తుభ్యం మదనుశాసనమ్
కీర్తయన్నుభయోః సన్ధ్యోర్న యుష్మద్భయమాప్నుయాత్

ప్రాతః కాలం సాయం కాలం నేను నీకు చెప్పిన ఈ ఆజ్ఞ్యను స్మరిస్తే అటువంటి వారికి సర్పముల వలన భయం కలగదు.

యోऽస్మిన్స్నాత్వా మదాక్రీడే దేవాదీంస్తర్పయేజ్జలైః
ఉపోష్య మాం స్మరన్నర్చేత్సర్వపాపైః ప్రముచ్యతే

తరువాత ఎవడైనా ఈ నదిలో స్నానం చేసి ఉపవాసం ఉండి నా లీలను స్మరించుకుంటే అన్ని పాపాలూ తొలగిపోతాయి

ద్వీపం రమణకం హిత్వా హ్రదమేతముపాశ్రితః
యద్భయాత్స సుపర్ణస్త్వాం నాద్యాన్మత్పాదలాఞ్ఛితమ్

సముద్రములో రమణక ద్వీపన్ని గరుత్మంతుని భయముతో విడిచిపెట్టి వచ్చావు.  ఆ గరుత్మంతుడు నీ  పడగల మీద ఉన్న నా పదముల గుర్తులను చూచి నిన్ను ఏమీ చేయడు

శ్రీఋషిరువాచ
ముక్తో భగవతా రాజన్కృష్ణేనాద్భుతకర్మణా
తం పూజయామాస ముదా నాగపత్న్యశ్చ సాదరమ్

ఇలా చెప్పగా కాళీయుడూ ఆయన భార్యలు స్వామిని పూజించారు. దివ్య మణులూ వస్త్రములూ మాలలూ

దివ్యామ్బరస్రఙ్మణిభిః పరార్ధ్యైరపి భూషణైః
దివ్యగన్ధానులేపైశ్చ మహత్యోత్పలమాలయా

గంధములూ వస్త్రములు మాలలూ మనులూ అర్ఘ్య గంధములూ ఇవన్నీ ఇచ్చి పరమాత్మను పూజించి ప్రసన్నున్ని చేసుకుని

పూజయిత్వా జగన్నాథం ప్రసాద్య గరుడధ్వజమ్
తతః ప్రీతోऽభ్యనుజ్ఞాతః పరిక్రమ్యాభివన్ద్య తమ్

సకలత్రసుహృత్పుత్రో ద్వీపమబ్ధేర్జగామ హ
తదైవ సామృతజలా యమునా నిర్విషాభవత్
 అనుగ్రహాద్భగవతః క్రీడామానుషరూపిణః

స్వామికి ప్రదక్షిణం చేసి భార్య పిల్లలతో కలసి సముద్రములో ఉన్న రమణుక ద్వీపాన్ని చేరారు. వారు వెళ్ళిన వెంటనే ఆ నదిలో ఉన్న నీరు ఆటగా ఒక మానుష్య రూపం ధరించిన పరమాత్మ అనుగ్రహం వలన అమృతమయం అయ్యింది. 


                                   సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు

Popular Posts