Followers

Monday 21 April 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఇరవై మూడవ అధ్యాయం


         ఓం నమో భగవతే వాసుదేవాయ 

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఇరవై మూడవ అధ్యాయం


శ్రీగోప ఊచుః
రామ రామ మహాబాహో కృష్ణ దుష్టనిబర్హణ
ఏషా వై బాధతే క్షున్నస్తచ్ఛాన్తిం కర్తుమర్హథః

మహాయోగీ దుష్ట సంహారకా కృష్నా రామా ఆకలి మమ్ము బాధిస్తోంది మీరే మాకు శాంతి కలుగజేయాలి.

శ్రీశుక ఉవాచ
ఇతి విజ్ఞాపితో గోపైర్భగవాన్దేవకీసుతః
భక్తాయా విప్రభార్యాయాః ప్రసీదన్నిదమబ్రవీత్

దగ్గరలో ఉన్న ఋషుల పత్నులను అనుగ్రహించదలచి ఇలా అన్నాడు

ప్రయాత దేవయజనం బ్రాహ్మణా బ్రహ్మవాదినః
సత్రమాఙ్గిరసం నామ హ్యాసతే స్వర్గకామ్యయా

దగ్గరలో ఋషులు ఉన్నారు ఆంగీరస సత్ర యాగం చేస్తున్నారు. అక్కడకు వెళ్ళి మాకు భోజనం పెట్టమని అడగండి.

తత్ర గత్వౌదనం గోపా యాచతాస్మద్విసర్జితాః
కీర్తయన్తో భగవత ఆర్యస్య మమ చాభిధామ్

బలరామ కృష్ణులు వచ్చారు. ఆకలిగొన్నారు. వారికీ మాకు భోజనం కావాలి అని వారిని అడగండి అని స్వామి ఆజ్ఞ్యాపిస్తే

ఇత్యాదిష్టా భగవతా గత్వా యాచన్త తే తథా
కృతాఞ్జలిపుటా విప్రాన్దణ్డవత్పతితా భువి

అందరూ చేతులు జోడించి వెళ్ళీ బ్రాహ్మణోత్తములకు దండ ప్రణామం చేసారు.

హే భూమిదేవాః శృణుత కృష్ణస్యాదేశకారిణః
ప్రాప్తాఞ్జానీత భద్రం వో గోపాన్నో రామచోదితాన్

మేము కృష్ణ పరమాత్మ చెబితే వచ్చాము. బ్రాహ్మణోత్తములారా వినండి. వారు పంపగా వచ్చాము.

గాశ్చారయన్తావవిదూర ఓదనం రామాచ్యుతౌ వో లషతో బుభుక్షితౌ
తయోర్ద్విజా ఓదనమర్థినోర్యది శ్రద్ధా చ వో యచ్ఛత ధర్మవిత్తమాః

ఆవులను మేపుతూ వచ్చాము. మాకు ఆకలి వేస్తోంది భోజనం కావాలి. ధర్మము తెలిసిన వారు కాబట్టి, మీకు శ్రద్ధా భక్తీ ఉంటే అన్నాన్ని కాంక్షించే కృష్ణ బలరాములకు భోజనం పెట్టండి

దీక్షాయాః పశుసంస్థాయాః సౌత్రామణ్యాశ్చ సత్తమాః
అన్యత్ర దీక్షితస్యాపి నాన్నమశ్నన్హి దుష్యతి

ఇది వేద వాక్యం. కొందరు యజ్ఞ్యం ఆచరిస్తూ ఉంటే యజ్ఞ్యం ఆచరించని వారు ఆకలి వేస్తే  భోజనం చేస్తే అది దోషం కాదు.

ఇతి తే భగవద్యాచ్ఞాం శృణ్వన్తోऽపి న శుశ్రువుః
క్షుద్రాశా భూరికర్మాణో బాలిశా వృద్ధమానినః

వారు ఇలా స్వామి అడిగాడు అన్న మాటను విని కూడా విననట్లే ఉన్నారు. అందుకు కారణం వారు చిన్న (క్షుద్రమైన) ఆశతో పెద్ద పని చేసే వారు. తెలివైన వారిమనుకునేవారు. వీరు శిశువులకంటే చిన్నవారు, కానీ వృద్ధులమనుకుంటున్నారు.

దేశః కాలః పృథగ్ద్రవ్యం మన్త్రతన్త్రర్త్విజోऽగ్నయః
దేవతా యజమానశ్చ క్రతుర్ధర్మశ్చ యన్మయః

వీరు ఆచరించే యజ్ఞ్యమునకు పనికొచ్చే వస్తువులన్నీ కృష్ణుడే. ఆ పరమాత్మ అన్నం అడిగితే పెట్టలేదు. దేశ కాల ద్రవ్య హవ్యం మంత్ర తంత్ర ఋత్విక్ దేవతలూ యజన్మానీ అన్నీ ఆయన స్వరూపం.

తం బ్రహ్మ పరమం సాక్షాద్భగవన్తమధోక్షజమ్
మనుష్యదృష్ట్యా దుష్ప్రజ్ఞా మర్త్యాత్మానో న మేనిరే

అటువంటి స్వామిని మనుష్య బుద్ధితో భగవంతుడని తెలుసుకోలేకపోయారు

న తే యదోమితి ప్రోచుర్న నేతి చ పరన్తప
గోపా నిరాశాః ప్రత్యేత్య తథోచుః కృష్ణరామయోః

అవునూ అనలేదూ కాదు అనలేదు. ఇలా అనేసరికి గోపాల బాలకులు వెనక్కు వచ్చేశారు.

తదుపాకర్ణ్య భగవాన్ప్రహస్య జగదీశ్వరః
వ్యాజహార పునర్గోపాన్దర్శయన్లౌకికీం గతిమ్

ఒక సారి నవ్వాడు భగవానుడ్. లౌకిగ గతిని చూపుతూ

మాం జ్ఞాపయత పత్నీభ్యః ససఙ్కర్షణమాగతమ్
దాస్యన్తి కామమన్నం వః స్నిగ్ధా మయ్యుషితా ధియా

వారిని కాదు, వెళ్ళి వారి భార్యలను అడగండి. బల రామ కృష్ణులు వచ్చారు అని చెప్పండి. వీళ్ళంతా నా యందు బాగా స్నేహముతో ఉన్నారు. అందుకు వారి వద్దకు వెళ్ళి అన్నం అడగండి.

గత్వాథ పత్నీశాలాయాం దృష్ట్వాసీనాః స్వలఙ్కృతాః
నత్వా ద్విజసతీర్గోపాః ప్రశ్రితా ఇదమబ్రువన్

పత్నీ శాలకు వెళ్ళగా వారు చక్కగా అలంకరించుకుని ఉన్నారు. వారికి వినయముతో నమస్కరించి

నమో వో విప్రపత్నీభ్యో నిబోధత వచాంసి నః
ఇతోऽవిదూరే చరతా కృష్ణేనేహేషితా వయమ్

అమ్మలారా మీకు నమస్కారం. మా మాటలు వినండి. కృష్ణ బలరాములతో కలసి వచ్చాము. వారికి ఆకలి వేస్తోంది. వారు ఇక్కడకు పంపారు

గాశ్చారయన్స గోపాలైః సరామో దూరమాగతః
బుభుక్షితస్య తస్యాన్నం సానుగస్య ప్రదీయతామ్

ఆకలిగా ఉన్న బలరామ కృష్ణులకు అన్నం ప్రసాదించండి

శ్రుత్వాచ్యుతముపాయాతం నిత్యం తద్దర్శనోత్సుకాః
తత్కథాక్షిప్తమనసో బభూవుర్జాతసమ్భ్రమాః

బలరామ కృష్ణులు వచ్చారని విన్న ఋషిపత్నులు, నిరంతరం ఆయనను చూడాలని అభిలషించే వారు, ఆయన గురించి బాగా విని ఉన్నారు. అలా విన్నవారు ఒక సారి కృష్ణ బలరాములు అక్కడ ఉన్నారు, అన్నం అడిగారని తెలుసుకుని,

చతుర్విధం బహుగుణమన్నమాదాయ భాజనైః
అభిసస్రుః ప్రియం సర్వాః సముద్రమివ నిమ్నగాః

యజ్ఞ్యం కోసం తయారయి ఉన్న అన్నాన్నీ, పాలూ పెరుగూ నేయీ వెన్నా, ఇలా నాలుగు రకాలుగా ఉన్న అన్నాన్నీ, పాలు పెరుగునూ కూడా తీసుకుని సముద్రములోకి నదులు ప్రవహిస్తున్నట్లుగా అభిసరించారు. (అభిసస్రుః - అభిసారికలు - అంటే తనకు నచ్చిన ప్రియునికోసం అతను ఉన్న చోటికి వెళ్ళే స్త్రీని అభిసారిక అంటారు. మనమందరం అభిసారికలమే, నిరంతరం భగవంతుని చేరడానికి చేతగాకున్నా ప్రయత్నం చేస్తూనే ఉంటాము. మనం చేసే ప్రయత్నం ఫలించదు. ఆయనకు ఆయనగా తీసుకురావాలి. అది చెప్పడానికే పరమాత్మ తనవారిని పంపి ఋషిపత్నులను తీసుకు వచ్చాడు. విరజానదిలో స్నానం చేసిన తరువాత ఐదువేల మంది అప్సరసలను పంపుతారు ఆ జీవుడు పరమాత్మను చేరడానికి. విరజా నది వరకూ వెళ్ళినా మనమంతట మనం స్వామి వద్దకు వెళ్ళలేము. స్వామే రప్పించుకోవాలి. ఇక్కడ కూడా స్వామి పంపిన గోపాలకులు ఋషిపత్నులను తీసుకుని స్వామి వద్దకు వెళుతున్నారు. ఈ ఉదంతం అర్చిరాది మార్గానికి వివరణ )

నిషిధ్యమానాః పతిభిర్భ్రాతృభిర్బన్ధుభిః సుతైః
భగవత్యుత్తమశ్లోకే దీర్ఘశ్రుత ధృతాశయాః

వెళుతుంటే భర్తలూ సోదరులూ అన్నలూ తండ్రులూ మిత్రులూ మొదలైన వారందరూ అడ్డారు. ఎంతమంది వారిస్తున్నా పరమాత్మయందు మాత్రమే మనసు లగ్నమై ఉన్నవారు కాబట్టి కృష్ణుని గురించి ఎంతో కాలం నుండీ వినడం వలన మనసు నిలిపిన వారై.

యమునోపవనేऽశోక నవపల్లవమణ్డితే
విచరన్తం వృతం గోపైః సాగ్రజం దదృశుః స్త్రియః

యమునా నదీ తీరములో రకరకాల చిగురుటాకులూ పుష్పాలూ ఫలాలతో అలంకరించబడి తోటి గోపాల బాలకులతో విహరిస్తున్న కృష్ణ పరమాత్మను చూసారు

శ్యామం హిరణ్యపరిధిం వనమాల్యబర్హ
ధాతుప్రవాలనటవేషమనవ్రతాంసే
విన్యస్తహస్తమితరేణ ధునానమబ్జం
కర్ణోత్పలాలకకపోలముఖాబ్జహాసమ్

శ్యామ వర్ణముతో పీతాంబరధారి అయి, అడవిలో దొరికే పూలతో గుచ్చిన మాలలూ నెమలి పించములూ గైరికాధి ధాతువులూ మొదలైన వాటితో అలంకరించుకుని నటునిలా ఉన్నాడు. ఒక చేయి ఎప్పుడూ పక్కన ఉన్న (సుదాముని) వారిపై వేసి ఉంటాడు. ఇంకో చేత్తో విలాసముగా పద్మాన్ని తిప్పుతూ ఉన్నాడు. చెవిలో కూడా కలువలను పెట్టుకున్నాడు, వాటి మీద నుంచి వెంట్రుకలు వచ్చి ముఖాన్ని కప్పేస్తున్నాయి. ఆ వెంట్రుకల సందులోంచి తెల్లటి పలు వరుసలు కనిపిస్తున్నాయి. ఆయన చిరునవ్వు కనపడుతోంది. అలాంటి కృష్ణ పరమాత్మను మునిపత్నులు దర్శించారు.

ప్రాయఃశ్రుతప్రియతమోదయకర్ణపూరైర్
యస్మిన్నిమగ్నమనసస్తమథాక్షిరన్ద్రైః
అన్తః ప్రవేశ్య సుచిరం పరిరభ్య తాపం
ప్రాజ్ఞం యథాభిమతయో విజహుర్నరేన్ద్ర

చెవులతో వినడముతోనే ఆ కృష్ణుడి మీద ప్రీతి కలిగింది ఆ మునిపత్నులకి. మునిపత్నులకే కాదు అందరికీ ప్రీతి కలిగింది. పరమాత్మ కూడా శ్రుతులతోనే కొనియాడ బడుతూ ఉంటాఉ. చూడకపోయినా ఆయనంటే ఇష్టం అందరికీ. వేదముచే కొనియాడబడిన ఆయన గుణములని వినడముచేతనే అందరికీ ఇష్టం. మునిపత్నులకు కూడా కృష్ణ పరమాత్మ లీలలను వినడము చేతనే ఇష్టం. అలాంటి స్వామి ముందు ఉన్నాడు. చెవులతో వినీ వినీ ఎవరి యందు మనసు నిలిపారో ఆయన ఎదురుగా ఉన్నాడు. ఒకరికి తెలియకుండా ఒకరు కౌగిలించుకున్నారు. స్వామి హృదయములో ప్రవేశించారు. కనుల రంధ్రములలోనుంచి లోపలకు ప్రవేశించి మనసుతో ఆలింగనం చేసుకున్నారు. అలా చాలా సేపు కౌగిలుంచుకున్నారు. పరమాత్మ యొక్క జ్ఞ్యానం కలవారు జ్ఞ్యానముతో పరమాత్మని తెలిసి ఆలింగనం చేసుకుంటే ఎలాంటి ఆనందాన్ని పొందుతారో, ఋషి పత్నులు కూడా ఇంతకాలమూ ఉన్న తాపాన్ని విడిచిపెట్టారు.

తాస్తథా త్యక్తసర్వాశాః ప్రాప్తా ఆత్మదిదృక్షయా
విజ్ఞాయాఖిలదృగ్ద్రష్టా ప్రాహ ప్రహసితాననః

వారు ఎలా వచ్చారు స్వామి తెలుసుకున్నాడు. అన్నీ, అందరినీ విడిచిపెట్టి వచ్చారు. ఎవరు వద్దన్నా పట్టించుకోలేదు. ఇలా అన్నీ అందరినీ వదిలిపెట్టి వచ్చిన వారిని చూచి, సంసతాన్ని చూచే పరమాత్మ చిరునవ్వుతో ఇలా అంటున్నాడు

స్వాగతం వో మహాభాగా ఆస్యతాం కరవామ కిమ్
యన్నో దిదృక్షయా ప్రాప్తా ఉపపన్నమిదం హి వః

మహానుభావులారా మీకు స్వాగతం. మీకు ఏ సపర్యలు చేయాలో చెప్పండి. మమ్ములను చూడాలని వచ్చారు మీరు. ఇలా వచ్చుట యోగ్యమే.

నన్వద్ధా మయి కుర్వన్తి కుశలాః స్వార్థదర్శినః
అహైతుక్యవ్యవహితాం భక్తిమాత్మప్రియే యథా

నైపుణ్యం కలిగిన నిజమైన స్వార్థపరులు నన్ను చూడడానికే వస్తారు. ఆత్మకు స్వార్థం పరమాత్మను చేరుటే. వారు నాయందు ప్రయోజనాన్ని ఆశించని భక్తి కలిగి ఉంటారు. అది కూడా నిరంతరమూ ఉండాలి. నిరంతరమూ ఉండాలీ, నిష్ప్రయోజనముగా ఉండాలి. ఆయన స్వామి, మనం దాసులం. ఆయన భర్తా మనం భార్యలము. ఆయన యజమాని మనం సేవకులం. ప్రయోజనాన్ని ఆశించకుండా నిరంతరం ఉండే భక్తినే స్వార్థం తెలిసిన భక్తులు నిరంతరం చేస్తారు.

ప్రాణబుద్ధిమనఃస్వాత్మ దారాపత్యధనాదయః
యత్సమ్పర్కాత్ప్రియా ఆసంస్తతః కో న్వపరః ప్రియః

నన్ను ద్వేషిస్తున్నా, నన్ను పూజించకున్నా, అందరూ నన్నే ప్రేమిస్తూ ఉంటారు. ప్రతీ వారికీ తమ ప్రాణం మీద తీపి, బుద్ధీ మనసూ తన శరీరం భార్యా సంతానం ధనం, వీటి మీద ఇష్టం. ఇవన్నీ ఆత్మ ఉన్నప్పుడే. నేను లోపల ఉంటేనే ఇవన్నీ ప్రియం. అటువంటి నాయందు ప్రేమ సహజముగానే ఉంటుంది. కాని అది నా వరకూ రాదు. ఏ నా కలయికతో ఇవన్నీ ప్రియం అవుతున్నాయో అటువంటి నాకన్నా ప్రియమైన వారు ఇంకొకరు ఉంటారా. వీటన్నిటినీ ప్రేమిస్తున్నవాడు నన్ను ప్రేమిచేవాడే.

తద్యాత దేవయజనం పతయో వో ద్విజాతయః
స్వసత్రం పారయిష్యన్తి యుష్మాభిర్గృహమేధినః

ఇక మీరంతా మీ యజ్ఞ్య శాలకు వెళ్ళండి. అక్కడ మీ భర్తలు మీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పత్ని లేకుండా యజ్ఞ్యం చేయలేరు. (యజ్ఞ్యములో హవిస్సు అందించేవారినే భార్య అంటారు. యజ్ఞ్యములో పనికొచ్చే ఉపకరణం అందించే వారినే పత్ని అంటారు)

శ్రీపత్న్య ఊచుః
మైవం విభోऽర్హతి భవాన్గదితుం న్ర్శంసం
సత్యం కురుష్వ నిగమం తవ పదమూలమ్
ప్రాప్తా వయం తులసిదామ పదావసృష్టం
కేశైర్నివోఢుమతిలఙ్ఘ్య సమస్తబన్ధూన్

ఇటువంటి మాట మీరు మాట్లాడ కూడదు. నీ పాద మూలం చేరిన వారిని తిప్పి పంపరు అని వేదం చెబుతుంది. మేము నీ పాద మూలాన్ని చేరాము. అక్కడ ఉండే తులసిని మా శిరస్సున ఉంచడానికి బంధువులందరినీ దాటి వచ్చాము.

గృహ్ణన్తి నో న పతయః పితరౌ సుతా వా
న భ్రాతృబన్ధుసుహృదః కుత ఏవ చాన్యే
తస్మాద్భవత్ప్రపదయోః పతితాత్మనాం నో
నాన్యా భవేద్గతిరరిన్దమ తద్విధేహి

భర్తలూ తల్లి తండ్రులూ కొడుకులూ సోదరులూ బంధువులూ మిత్రులూ ఎవ్వరూ మమ్ము స్వీకరించరు. ఇంక వేరే వారి సంగతి చెప్పాలా? మేము నీ పాదాల చెంత పడ్డాము. నీ పాదాలు చేరినవారికి ఇంకో గతి ఉంటుందా. మాకు నీ పాదములనే ప్రసాదించు. మేము వెళ్ళినా వారు స్వీకరించరు.

శ్రీభగవానువాచ
పతయో నాభ్యసూయేరన్పితృభ్రాతృసుతాదయః
లోకాశ్చ వో మయోపేతా దేవా అప్యనుమన్వతే

భర్తను స్వీకరించరు అన్నదే మీ భయం ఐతే మీ భర్తలూ తల్లి తండ్రులూ పుత్రులూ బంధువులూ మిత్రులూ  లోకమూ మిమ్ములని తప్పు బట్టరు. నన్ను పూజిస్తే దేవతలు కూడా ఒప్పుకుంటారు.

న ప్రీతయేऽనురాగాయ హ్యఙ్గసఙ్గో నృణామిహ
తన్మనో మయి యుఞ్జానా అచిరాన్మామవాప్స్యథ

జీవులందరికీ శరీరాన్ని ఇచ్చింది ఐహిక సాంసారిక విషయ భోగానికి కాదు, నాయందు ప్రీతి కలగడానికీ, నాయందు ఉంచడానికే. జీవులకు దేహ సంబంధం కలిగింది అందుకే. అది తెలుసుకున్న మీకు ప్రత్యక్షముగా కలిగింది. నా యందు మనసు ఉంచిన మీరు త్వరలోనే నన్ను చేరుతారు.

శ్రవణాద్దర్శనాద్ధ్యానాన్మయి భావోऽనుకీర్తనాత్
న తథా సన్నికర్షేణ ప్రతియాత తతో గృహాన్

శ్రీశుక ఉవాచ
ఇత్యుక్తా ద్విజపత్న్యస్తా యజ్ఞవాటం పునర్గతాః
తే చానసూయవస్తాభిః స్త్రీభిః సత్రమపారయన్

ఇలా చెప్పగా వారు యజ్ఞ్య వాటానికి వెళ్ళారు. స్వామి చెప్పినట్లుగా ఆ భర్తలు కూడా వారి మీద కోపించలేదు. యజ్ఞ్యాన్ని పూర్తి చేసారు.

తత్రైకా విధృతా భర్త్రా భగవన్తం యథాశ్రుతమ్
హృడోపగుహ్య విజహౌ దేహం కర్మానుబన్ధనమ్

ఇలా గోపాల బాలకులు వచ్చి చెబితే మునిపత్నులు అందరూ వెళ్ళగా, అలా వెళుతున్న వారిలో ఒక ముని పత్ని వెనకబడింది. ఆమెను భర్త గట్టిగా నిర్భందించాడు, వెళ్ళనివ్వలేదు. అందుచేత ఆమె శరీరముతో కృష్ణి వద్దకు వెళ్ళలేదు. పరమాత్మను చూడడానికి అడ్డు వచ్చిన శరీరాన్ని విడిచి స్వామినే చేరింది. రక రకముల కర్మల చేత వచ్చిన శరీరాన్ని విడిచిపెట్టింది.

భగవానపి గోవిన్దస్తేనైవాన్నేన గోపకాన్
చతుర్విధేనాశయిత్వా స్వయం చ బుభుజే ప్రభుః

ఇలా మునిపత్నులు తెచ్చిన చతుర్విధ అన్న పానీయాలను తన తోటి గోపాలురకు పెట్టి బలరామ కృష్ణులిద్దరూ భుజించారు.

ఏవం లీలానరవపుర్న్ర్లోకమనుశీలయన్
రేమే గోగోపగోపీనాం రమయన్రూపవాక్కృతైః

శరీరముతో రూపముతో మాటలతో చేతలతో ఈ ప్రపంచాన్ని రమింపచేస్తూ పరమాత్మ కాలం గడిపాడు. కొందరు సౌందర్యాని చూచి సేవించారు, కొందరు మాటలను చూచి సేవించారు, మరికొందరు కర్మలను చూచి సేవించారు.ఇలా అందరి మనసులనూ ఆనందింపచేస్తూ కాలం గడిపాడు.

అథానుస్మృత్య విప్రాస్తే అన్వతప్యన్కృతాగసః
యద్విశ్వేశ్వరయోర్యాచ్ఞామహన్మ నృవిడమ్బయోః

దీని తరువాత ఋషులు యజ్ఞ్యం పూర్తి చేయగా, ఋషిపత్నులలో ఒకరు మోక్షానికే వెళ్ళగా ఇది చూసిన ఋషులకు పశ్చాత్తాపం కలిగింది. మేము ఏ స్వామిని చూచుటకు యజ్ఞ్యం చేసామో వారు ఆ స్వామి వద్దకే వెళ్ళారు. మానవాకారం ధరించి ఉన్న జగన్నాధుని కోరికనే కాదన్నామే.

దృష్ట్వా స్త్రీణాం భగవతి కృష్ణే భక్తిమలౌకికీమ్
ఆత్మానం చ తయా హీనమనుతప్తా వ్యగర్హయన్

వారు స్త్రీలై ఉండి కూడా పరమాత్మయందు అలౌకికమైన భక్తి కలిగి ఉన్నారు. ఇలా ప్రతీ క్షణం తపించారు. నిందించుకున్నారు.

ధిగ్జన్మ నస్త్రివృద్యత్తద్ధిగ్వ్రతం ధిగ్బహుజ్ఞతామ్
ధిక్కులం ధిక్క్రియాదాక్ష్యం విముఖా యే త్వధోక్షజే

మా జన్మ వ్యధం, మా వేదం, మా జ్ఞ్యానం మా కులం సకల యజ్ఞ్యములూ అన్నీ వ్యర్థం. పరమాత్మ యందు వైముఖ్యం వహించి ఎన్ని యజ్ఞ్యాలు చేసి ఏమి లాభం. స్వామి మాట కాదని చేసిన యజ్ఞ్యాలూ వ్రతములూ నోములూ ఫలిస్తాయా?

నూనం భగవతో మాయా యోగినామపి మోహినీ
యద్వయం గురవో నృణాం స్వార్థే ముహ్యామహే ద్విజాః

"మనం జ్ఞ్యానం ఉన్న వారం " అని అనుకుంటే చెల్లదు. పరమాత్మ ఎవరికి జ్ఞ్యానం కలిగించాలనుకుంటాడో , ఎవరిని దయ చూడాలనుకుంటాడో వారికి జ్ఞ్యానం కలిగిస్తాడు. "నన్ను చేరడానికి కావలసిన బుద్ధిని నేనే కలిగిస్తాను" అన్నాడు గీతలో.అందుకే జ్ఞ్యానం మనది కాదు. అది ఆయనే ఇవ్వాలి. అందుకే పరమాత్మ మాయ మామూలు వారినే కాదు, యోగులను కూడా మోహింపచేస్తుంది. మమ్ములను అందరూ గురువులని అంటారు అందరూ. కానీ సామాన్య మానవులకున్న భక్తిలో మాకు ఎన్నో వంతు ఉంది?

అహో పశ్యత నారీణామపి కృష్ణే జగద్గురౌ
దురన్తభావం యోऽవిధ్యన్మృత్యుపాశాన్గృహాభిధాన్

జగద్గురువు ఐన పరమాత్మయందు స్త్రీలకు ఉన్న దృఢమైన భక్తి భావం ఏదైతే ఉందో అది ఎంత ఘనమైన భక్తి. ఆ భక్తి గట్టిగా అల్లుకుని ఉన్న సాంసారిక పాశములను చేదించింది. అడ్డు వచ్చిన వారందరినీ తోసి పారేసేట్లు చేసింది వారి భక్తి.

నాసాం ద్విజాతిసంస్కారో న నివాసో గురావపి
న తపో నాత్మమీమాంసా న శౌచం న క్రియాః శుభాః

ఆడువారికి ఉపనయనం. గురు కుల వేదాధ్యయనం లేదు, తపస్సూ ఆత్మ జ్ఞ్యానం లేదు, శౌచమూ ఆచారమూ ఏదీ లేదు.

తథాపి హ్యుత్తమఃశ్లోకే కృష్ణే యోగేశ్వరేశ్వరే
భక్తిర్దృఢా న చాస్మాకం సంస్కారాదిమతామపి

ఇవేమీ లేకున్నా ఉత్తశ్లోకుడూ యోగీశ్వరులకు ఈశ్వరుడైన కృష్ణ పరమాత్మ మీద భక్తి ఉంది. ఆ సంస్కారాలన్నీ మాకున్న మాకు భక్తిలేదు. పరమాత్మయందు భక్తిలేని అవి అన్నీ ఎందుకు. భక్తి ఉంటే అవేవీ అక్కరలేదు. అవేమీ లేని ఆడువారే నయం.

నను స్వార్థవిమూఢానాం ప్రమత్తానాం గృహేహయా
అహో నః స్మారయామాస గోపవాక్యైః సతాం గతిః

పరమాత్మ తన పిల్లలను పంపి గుర్తు చేసాడు తాను వచ్చానని. వారు అంత స్పష్టముగా చెప్పినా సంసారం మీద ఆశతో స్వార్థముతో మూఢులమై మత్తులో ఉన్నాము. సజ్జనులు ఎలా ప్రవర్తించాలో స్వామి చాలా స్పష్టముగా చెప్పాడు

అన్యథా పూర్ణకామస్య కైవల్యాద్యశిషాం పతేః
ఈశితవ్యైః కిమస్మాభిరీశస్యైతద్విడమ్బనమ్

 మేము తెలుసుకోలేకపోయాము. అన్నం అడుగుతున్నారు బలరామ కృష్ణులు అని అంటే, గొల్లపిల్లల మాటలు అనుకున్నాము. జీవూలందరూ పరమాత్మకు అన్నం. ప్రళయకాలములో జీవూలందరినీ ఒక ముద్దగా చేసుకుని మింగేస్తాడు. యమధర్మరాజు అంటాడు : ప్రపంచమంతా అన్నమైతే నన్ను పెరుగుగా కలుపుకుని తింతాడు. అటువంటి స్వామికి అన్నంకావాలా. నిరంతరం పరమాత్మనే యాచించే మనతో ఆయనకేమి పని. ఇది పరమాత్మకు ఒక నాటకం. పరమాత్మకు ఏ విధమైన కోరికా ఉండదు. "నేను పొందవలసినదీ, పొందనిదీ అంటూ ఏదీ లేదు. ఐనా నేను పని చేస్తూనే ఉంటాను - గీత వాక్యం".

హిత్వాన్యాన్భజతే యం శ్రీః పాదస్పర్శాశయాసకృత్
స్వాత్మదోషాపవర్గేణ తద్యాచ్ఞా జనమోహినీ

ఒక్కసారి పరమాత్మ పాదములను స్పృశించాలన్న కోరికతో లక్ష్మీ దేవి బ్రహ్మరుద్రేంద్రాదులను కాదని ఎవరికోసం తపస్సు చేసిందో, తప్పులూ పాపాలూ (లక్ష్మీ దేవికి చాంచల్యం అనే ఒక లక్షణం ఉంది) పోగొట్టుకోవడానికి ఎవరి గురించి తపస్సు చేసిందో అటువంటి స్వామి అన్నం యాచించాడంటే మనను మోహింపచేయడానికా నిజముగా యాచించడానికా.

దేశః కాలః పృథగ్ద్రవ్యం మన్త్రతన్త్రర్త్విజోऽగ్నయః
దేవతా యజమానశ్చ క్రతుర్ధర్మశ్చ యన్మయః

ప్రపంచములో ఉన్నవన్నీ పరమాత్మ స్వరూపమే. దేశ కాల ద్రవ్య మంత్ర తంత్ర ఋత్విక్ దేవతలూ యజమానులూ అందరూ పరమాత్మ స్వరూపమే.

స ఏవ భగవాన్సాక్షాద్విష్ణుర్యోగేశ్వరేశ్వరః
జాతో యదుష్విత్యాశృణ్మ హ్యపి మూఢా న విద్మహే

అటువంటి పరమాత్మే యదువంశములో పుట్టాడని విని ఉన్నాము. ఐనా మూఢులమై మరచిపోయాము. ఐన తెలుసుకోలేకపోయాము. మనం కూడా రామాయణ భారత భాగవతాలు చదివీ కోట్లాడుతూ ఉంటాము. అది ఆయన మాయే.

తస్మై నమో భగవతే కృష్ణాయాకుణ్ఠమేధసే
యన్మాయామోహితధియో భ్రమామః కర్మవర్త్మసు

ఒక రకముగా మనం అదృష్టవంతులమే. పరమాత్మ యందు అత్యంత భక్తికలిగిన భార్యలు ఉన్నారు. వారి సంబంధముతో మనం తరిస్తాము. వారి వలననే మాకు ఈనాడు స్వరూపం తెలిసి మాకూ భక్తి కలిగింది. పొరబాటు పడని మేధస్సు గల పరమాత్మకు నమస్కారం.

స వై న ఆద్యః పురుషః స్వమాయామోహితాత్మనామ్
అవిజ్ఞతానుభావానాం క్షన్తుమర్హత్యతిక్రమమ్

ఎవరి మాయచే మాబుద్ధి మోహించబడి కర్మ మార్గములో పడి సంసారములో సంచరిస్తూ ఉన్నామో. అటువంటి మాయ చే మోహించబడిన బుద్ధి మనసు గల మాకు ఆయన ప్రభావం తెలియదు. అటువంటి మా తప్పును స్వామి క్షమించుగాక.

ఇతి స్వాఘమనుస్మృత్య కృష్ణే తే కృతహేలనాః
దిదృక్షవో వ్రజమథ కంసాద్భీతా న చాచలన్

ఈ రీతిలో పరమాత్మ యందు అపరాధం చేసి మళ్ళీ తమ స్వరూపం తెలుసుకుని. ఐనా సరే "ఇపుడు చూస్తే కంసుడు ఏమనుకుంటాడో" అని భయపడి ఆ ఋషులు స్వామి వద్దకు వెళ్ళలేకపోయారు. పరమాత్మ మాయ తెలుపుతుందీ, మోహింపచేస్తుంది.


                                                           సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 

Popular Posts