Followers

Tuesday 8 April 2014

శ్రీమద్భాగవతం ఎనిమిదవ స్కంధం పన్నెండవ అధ్యాయం




శ్రీబాదరాయణిరువాచ
వృషధ్వజో నిశమ్యేదం యోషిద్రూపేణ దానవాన్
మోహయిత్వా సురగణాన్హరిః సోమమపాయయత్

శ్రీమన్నారాయణుడు స్త్రీ వేషముతో రాక్షసులను మోహింపచేసాడన్న వార్తను విన్నాడు వృషధ్వజుడు (వృషం అంటే ధర్మం, ధర్మానికి ధ్వజుడు - శంకరుడు) విన్నాడు

వృషమారుహ్య గిరిశః సర్వభూతగణైర్వృతః
సహ దేవ్యా యయౌ ద్రష్టుం యత్రాస్తే మధుసూదనః

వృషభాన్ని అధిరోహించి ప్రమద గణములతో భూత గణములతో అమ్మవారితో కలిసి పరమాత్మ ఉన్న చోటికి వచ్చాడు. 

సభాజితో భగవతా సాదరం సోమయా భవః
సూపవిష్ట ఉవాచేదం ప్రతిపూజ్య స్మయన్హరిమ్

పార్వతీ పరమేశ్వరులను చూచి స్వామి ఆదరించాడు గౌరవించాడు. పూజకు ప్రతి పూజ చేసి చిరునవ్వుతో శ్రీహరితో శంకరుడు ఇలా అన్నాడు

శ్రీమహాదేవ ఉవాచ
దేవదేవ జగద్వ్యాపిన్జగదీశ జగన్మయ
సర్వేషామపి భావానాం త్వమాత్మా హేతురీశ్వరః

దేవ అంటే ఆడేవాడూ, గెలిచేవాడు, గెలిపించేవాడు, గెలవాలనే కోరిక ఉన్నవాడు. ఇది దేవ శబ్దానికి అర్థం. నీవు జగమంతా వ్యాపించి ఉన్నావు. సకల జగత్తుకూ నీవు అధిపతి. నీవే జగద్స్వరూపం. నీవే జగత్తుగా మారుతావు. సకల ప్రాణులకూ నీవే కారణం నీవే ఈశ్వరుడవూ ఆత్మవూ.

ఆద్యన్తావస్య యన్మధ్యమిదమన్యదహం బహిః
యతోऽవ్యయస్య నైతాని తత్సత్యం బ్రహ్మ చిద్భవాన్

ఆది అంత మధ్యములు నీవే, నేను బయటి వాడిని (లయ కారకున్ని). వ్యయం లేనిది నాశం లేనిది. అది సత్యం. ఆది మధ్యము అంతమూ లేనిది సత్యం. ఆ సత్యం నీవే. 

తవైవ చరణామ్భోజం శ్రేయస్కామా నిరాశిషః
విసృజ్యోభయతః సఙ్గం మునయః సముపాసతే

శ్రేయస్సును కోరేవారు, ఇతర కోరికలు లేనివారు మునులు (ముక్తిని కోరేవారు సంసారాన్ని కోరరు) ఇహ పరములలో ఆసక్తిని విడిచిపెట్టిన మునులు నీ పాదపద్మాలను ఉపాసిస్తారు. 

త్వం బ్రహ్మ పూర్ణమమృతం విగుణం విశోకమ్
ఆనన్దమాత్రమవికారమనన్యదన్యత్

నీవు పూర్ణుడివి (పూర్ణమద: పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావిశిష్యతే ) నాశం లేనివాడవు సత్వాది గుణాలు లేనివాడవు ప్రకృతి వలన శోకం లేనివాడవు ఆనంద స్వరూపుడివి, వికారం లేనివాడివి, ప్రపంచం కంటే వేరు కాకుండా ఉండీ వేరుగా కనపడతావు. కళ్యాణ గుణములు కలవాడూ, కళ్యాణ స్వరూపుడు. 

విశ్వస్య హేతురుదయస్థితిసంయమానామ్
ఆత్మేశ్వరశ్చ తదపేక్షతయానపేక్షః

సకల ప్రపంచమునకూ కారణం, సృష్టి స్థితి రక్షణకు హేతువు, అంతటా వ్యాపించీ అంతా శాసించేవాడివి నీవు. నీకెటువంటి అపేక్షా లేదు. కానీ జగత్తుకుమాత్రం అపేక్ష ఉంది

ఏకస్త్వమేవ సదసద్ద్వయమద్వయం చ
స్వర్ణం కృతాకృతమివేహ న వస్తుభేదః

నీవే ఉన్నవాడివి, ప్రకృతీ జీవుడూ నీవే, భిన్నమూ అభిన్నమూ నీవే. బంగారం ఆభరణం ఒకటే ఐనట్లు. కృతమైతే ఆభరణం, కృతం కాకుంటే అది బంగారం. జగత్తుగా ఉన్నదీ విడిగా ఉన్నదీ రెండూ పరమాత్మే. స్వరూపం మారినా వస్తు తత్వం మారదు. అందుకే అద్వయం నీవే, ద్వయం నీవే. కృత భేధం ఉంది కానీ వస్తు భేదం లేదు

అజ్ఞానతస్త్వయి జనైర్విహితో వికల్పో
యస్మాద్గుణవ్యతికరో నిరుపాధికస్య

నీవు వేరు జగత్తు వేరు అని అజ్ఞ్యానులు చెబుతారు. నీకు ఏ ఉపాధీ లేదు. కానీ ప్రాకృతికమైన గుణముల వ్యాప్తిగా ఉన్న ప్రపంచాన్ని చూపెడతావు. అది చూసి, నీవూ జగత్తూ వేరూ అని నీలో వికల్పాన్ని చూస్తారు

త్వాం బ్రహ్మ కేచిదవయన్త్యుత ధర్మమేకే
ఏకే పరం సదసతోః పురుషం పరేశమ్

కొందరు నిన్ను పరబ్రహ్మ అంటారు, కొందరు నిన్ను ధర్మునిగా కొలుస్తారు. మరి కొందరు సత్తు కంటే అసత్తు కంటే పరునివి నీవు అంటారు. కొందరు నిన్ను ఆ పరునికి కూడా ఈశుడంటారు. 

అన్యేऽవయన్తి నవశక్తియుతం పరం త్వాం
కేచిన్మహాపురుషమవ్యయమాత్మతన్త్రమ్

కొందరు నిన్ను ప్రకృతి (8)జీవుల (1) రూపముగా చూస్తారు. కొందరు మహా పురుషునిగా అవ్యయునిగా సర్వ తంత్ర స్వతంత్రునిగా చూస్తారు

నాహం పరాయురృషయో న మరీచిముఖ్యా
జానన్తి యద్విరచితం ఖలు సత్త్వసర్గాః

నేను కూడా నాశము లేని వాడను కాను. ఋషులూ, మరీచాది ప్రజాపతులు, నీ చేత సృజించబడిన సకల ప్రపంచములో వారూ నిన్ను తెలియలేరు. 

యన్మాయయా ముషితచేతస ఈశ దైత్య
మర్త్యాదయః కిముత శశ్వదభద్రవృత్తాః

నీ మాయ చేత దొంగిలించబడిన మనసు కలవారైన్ దైత్య మర్త్యాదులే నీ మాయను తెలియలేనప్పుడు అమంగళ ప్రవృత్తి కలవారు, ప్రకృతి చేత కప్పి పుచ్చబడిన స్వభావం కలవారు తెలియలేరు అని వేరే చెప్పాలా

స త్వం సమీహితమదః స్థితిజన్మనాశం
భూతేహితం చ జగతో భవబన్ధమోక్షౌ

నీవు ఈ ప్రపంచం యొక్క (అదః) సృష్టి స్థితి ప్రళయములు సంకల్పించావు. సకల భూతముల యొక్క ఆకాంక్ష, నీవే జగత్తుకి బంధము, నీవే మోక్షము.

వాయుర్యథా విశతి ఖం చ చరాచరాఖ్యం
సర్వం తదాత్మకతయావగమోऽవరున్త్సే

వాయువు సకల ప్రపంచాన్నీ వ్యాపించి ఉంటుంది. ప్రపంచం అంతా వాయువులో ఉంది. వాయువు ప్రపంచములో ఉంది. సకల జగత్తూ వాయు మయమే ఐనట్లు నీవు అంతా వ్యాపించి ఉంటావు

అవతారా మయా దృష్టా రమమాణస్య తే గుణైః
సోऽహం తద్ద్రష్టుమిచ్ఛామి యత్తే యోషిద్వపుర్ధృతమ్

ప్రాకృతికమైన గుణాల మీద రమించదలచి నీవు ధరించిన అవతారాలను వేసాను. నీ యోషిద్ రూపాన్ని చూడాలని నాకు కోరిక కలిగింది.

యేన సమ్మోహితా దైత్యాః పాయితాశ్చామృతం సురాః
తద్దిదృక్షవ ఆయాతాః పరం కౌతూహలం హి నః

దేవతలకు మాత్రమే అమృతాన్ని తాగించావట. మా భాగం మాకిమ్మని రాక్షసులు కూడా అడగలేదు. దేవతలుకూడా రాక్షసులకు భాగం ఇవ్వమని అడగలేదు. ఒకే సారి ఒకే రూపముతో ఇద్దరినీ మోహింపచేసావు.అలాంటి నీ స్త్రీ రూపాన్ని చూడాలని మాకు (నః) కోరిక

శ్రీశుక ఉవాచ
ఏవమభ్యర్థితో విష్ణుర్భగవాన్శూలపాణినా
ప్రహస్య భావగమ్భీరం గిరిశం ప్రత్యభాషత

స్వామి చేత అర్థించబడి, గంభీరముగా నవ్వి ఇలా అన్నాడు

శ్రీభగవానువాచ
కౌతూహలాయ దైత్యానాం యోషిద్వేషో మయా ధృతః
పశ్యతా సురకార్యాణి గతే పీయూషభాజనే

రాక్షసులకు కుతూహలం కలిగించాలని ఆ రూపం ధరించాను. వారి మనసుని అమృతం మీద నుంచి మళ్ళించడానికి ఆ వేషం వేసాను. అది కూడా దేవ కారం కొరకే చేసాను. అమృతం దేవతల నుండి జారిపోయింది కాబట్టి నేను ఆ రూపం ధరించాను. 

తత్తేऽహం దర్శయిష్యామి దిదృక్షోః సురసత్తమ
కామినాం బహు మన్తవ్యం సఙ్కల్పప్రభవోదయమ్

సురోత్తమా నీకు చూడాలని ఉంది కాబట్టి ఆ కోరిక తీరుస్తా. నీ సంకల్పం నుంచి వచ్చిన కోరికను తీరుస్తాను. (కాముకలందరూ బాగా తలచే నా రూపాన్ని చూడగోరుతున్న నీకు చూపుతాను. అది సంకల్పాన్ని కలిగించేది, అందరి చేతా తలచబడేది ఆ రూపం).

శ్రీశుక ఉవాచ
ఇతి బ్రువాణో భగవాంస్తత్రైవాన్తరధీయత
సర్వతశ్చారయంశ్చక్షుర్భవ ఆస్తే సహోమయా

అలా అని వెంటనే అంతర్ధానమయ్యాడు. అప్పుడు శంకరుడు అన్ని వైపులా దృష్టి సారించాడు

తతో దదర్శోపవనే వరస్త్రియం విచిత్రపుష్పారుణపల్లవద్రుమే
విక్రీడతీం కన్దుకలీలయా లసద్దుకూలపర్యస్తనితమ్బమేఖలామ్

అంతలో ఒక ఉద్యాన వనం కనిపించింది. అక్కడ ఒక యువతిని చూచాడు. విచిత్రమైన ఆకులూ పుష్పాలు ఉన్న తోటలో పీతాంబరాన్ని ధరించి బంతితో ఆడుతూ ఉంది.

ఆవర్తనోద్వర్తనకమ్పితస్తన ప్రకృష్టహారోరుభరైః పదే పదే
ప్రభజ్యమానామివ మధ్యతశ్చలత్పదప్రవాలం నయతీం తతస్తతః

బంతిని కిందకు కొట్టి పైకి తీస్తోంది. అలా చేయడం వలన మెడలో ఉన్న ఆభరణాలు పదే పదే కిందకీ పైకీ ఊగుతున్నాయి. అలా కదులుతూ ఊగుతూ ఉంటే నడుము ఎక్కడ జారిపోతుందో అని చూచే వారికి భయం  కలుగుతుంది. 

దిక్షు భ్రమత్కన్దుకచాపలైర్భృశం ప్రోద్విగ్నతారాయతలోలలోచనామ్
స్వకర్ణవిభ్రాజితకుణ్డలోల్లసత్కపోలనీలాలకమణ్డితాననామ్

తన నేత్ర సౌందర్యాన్ని అందరికీ చూపుతోంది. బంతి ఎటుపోతోందో అటువైపు దృష్టి ప్రసరింపచేస్తోంది. కలవరం చెందుతున్న విశాలమైన చంచలమైన నేత్రాలతో అన్ని వైపులనూ ప్రకాశింపచేస్తోంది. నల్లని చెక్కిళ్ళూ నల్లని ముంగురుల మీదా కుండలముల కాంతి పడుతోంది, దానితో కేశములు నల్లటివా ఎర్రటివా అన్నట్లు ఉంది. 

శ్లథద్దుకూలం కబరీం చ విచ్యుతాం సన్నహ్యతీం వామకరేణ వల్గునా
వినిఘ్నతీమన్యకరేణ కన్దుకం విమోహయన్తీం జగదాత్మమాయయా

ఎడమ చేత్తో వస్త్రాన్ని సర్దుకుంటూ కేశ పాశాన్ని సరిచేస్తూ రెండవ చేత్తో బంతిని కొడుతూ తన మాయతో సకల జగత్తునూ మోహింపచేస్తోంది. అలా ఆడుతోన్న అమ్మాయిని శంకరుడు చూచాడు. 

తాం వీక్ష్య దేవ ఇతి కన్దుకలీలయేషద్వ్రీడాస్ఫుటస్మితవిసృష్టకటాక్షముష్టః
స్త్రీప్రేక్షణప్రతిసమీక్షణవిహ్వలాత్మా నాత్మానమన్తిక ఉమాం స్వగణాంశ్చ వేద

శంకరుడు ఎప్పుడు చూచాడో అప్పుడే ఆ అమ్మాయి కూడా శంకరున్ని చూచింది. సిగ్గుచేత చిరునవ్వును ప్రయోగిస్తోంది. బంతిని చూస్తున్నట్లుగా నటిస్తూ శంకరున్ని చూస్తోంది. ఇలాంటి వాటిచేత, అమ్మాయిని చూచుటా, అమ్మాయి చేత చూచబడుట వలన మన్సు కలవరపడింది. తానెవరో మరచిపోయాడు, తన పక్కన పార్వతీ, తన గణాలనూ మరచిపోయాడు. 

తస్యాః కరాగ్రాత్స తు కన్దుకో యదా గతో విదూరం తమనువ్రజత్స్త్రియాః
వాసః ససూత్రం లఘు మారుతోऽహరద్భవస్య దేవస్య కిలానుపశ్యతః

ఇంతలో ఆ బంతి దూరముగా పోయింది. బంతి వెంట తానూ వెళ్ళింది. ఆమె వెంట శంకరుడు కూడా వెళ్ళాడు. ఈమె సౌందర్యాన్ని మొత్తం శంకరుడు చూసేందుకు వాయు దేవుడు శంకరుడు చూస్తుండగా ఆమె వస్త్రాన్ని అపహరించాడు

ఏవం తాం రుచిరాపాఙ్గీం దర్శనీయాం మనోరమామ్
దృష్ట్వా తస్యాం మనశ్చక్రే విషజ్జన్త్యాం భవః కిల

అందమైన క్రీగంటి చూపు కలిగినదీ, చూడదగిన ఆమె యందు శంకరుడు మనసు పడ్డాడు. ఆమె ఇబ్బంది పడుతోంది అటూ ఇటూ వెళుతూ. ఆ మోహిని యందు మనసు పడ్డాడు శంకరుడు

తయాపహృతవిజ్ఞానస్తత్కృతస్మరవిహ్వలః
భవాన్యా అపి పశ్యన్త్యా గతహ్రీస్తత్పదం యయౌ

అమ్మవారు చూస్తుండగా సిగ్గు విడిచి ఆమె ఉన్న ప్రాంతానికి వెళుతున్నాడు.

సా తమాయాన్తమాలోక్య వివస్త్రా వ్రీడితా భృశమ్
నిలీయమానా వృక్షేషు హసన్తీ నాన్వతిష్ఠత

వస్త్రం అపహరించబడటముతో శంకరున్ని చూచి సిగ్గుపడి చెట్టు దాటునా దాక్కుని మధ్యలో చిరునవ్వు నవ్వుతూ, పరిగెడుతూ ఆగుతూ ఉన్నది. 

తామన్వగచ్ఛద్భగవాన్భవః ప్రముషితేన్ద్రియః
కామస్య చ వశం నీతః కరేణుమివ యూథపః

శంకరునికి అన్ని ఇంద్రియములూ హరించబడ్డాయి. ఆమెను అనుసరించి ఆడ ఏనుగు వెంట మగ ఏనుగు పడినట్లుగా కామవశుడై

సోऽనువ్రజ్యాతివేగేన గృహీత్వానిచ్ఛతీం స్త్రియమ్
కేశబన్ధ ఉపానీయ బాహుభ్యాం పరిషస్వజే

ఆమె ఏ మాత్రం ఇష్టపడకున్నా, కేశబంధములను తీసుకుని ఆలింగనం చేసుకున్నాడు

సోపగూఢా భగవతా కరిణా కరిణీ యథా
ఇతస్తతః ప్రసర్పన్తీ విప్రకీర్ణశిరోరుహా

జుట్టు ముడి కాస్తా వీడిపోగా తనను తాను విడిపించుకుంది శంకరుని వక్షస్థలం నుండి. దేవ నిర్మితమైన మాయలా ఉంది

ఆత్మానం మోచయిత్వాఙ్గ సురర్షభభుజాన్తరాత్
ప్రాద్రవత్సా పృథుశ్రోణీ మాయా దేవవినిర్మితా

అది చూసి శత్రువుతో ఓడిపోఇనట్లుగా ఎటు పరిగెడితే అటు పరిగెట్టాడు

తస్యాసౌ పదవీం రుద్రో విష్ణోరద్భుతకర్మణః
ప్రత్యపద్యత కామేన వైరిణేవ వినిర్జితః

తస్యానుధావతో రేతశ్చస్కన్దామోఘరేతసః
శుష్మిణో యూథపస్యేవ వాసితామనుధావతః

ఆమె ముందు పరిగెడుతుంటే వెనక శంకరుడు పరిగెత్తాడు. అలా జరిగేసరికి అది మాయా అని తెలుసుకున్నాడు. శంకరుడు వ్యర్థమైన తేజస్సు కలవాడు కాడు. ఆ రేతస్సంతా బంగారమూ వెండీ అయ్యింది.

యత్ర యత్రాపతన్మహ్యాం రేతస్తస్య మహాత్మనః
తాని రూప్యస్య హేమ్నశ్చ క్షేత్రాణ్యాసన్మహీపతే

ఈ భూమి మీద ఆయన రేతస్సు ఏ ఏ ప్రాంతాలలో పడిందో అవి అన్నీ వెండికీ బంగారానికీ గనులు అయ్యాయి.

సరిత్సరఃసు శైలేషు వనేషూపవనేషు చ
యత్ర క్వ చాసన్నృషయస్తత్ర సన్నిహితో హరః

నదులలో పర్వతములలో సముద్ర ప్రాంతాలలో ఏ ఏ ప్రాంతాలలో ఆ రేతస్సు పడిందో, ఋషులెక్కడున్నారో నదులెక్కడున్నాయో సముద్రాలెక్కడున్నాయో,ఎక్కడెక్కడ ఆయన రేతస్సు స్ఖలనమైందో అవి అన్నీ వెండీ బంగారపు గనులు అయ్యాయి

స్కన్నే రేతసి సోऽపశ్యదాత్మానం దేవమాయయా
జడీకృతం నృపశ్రేష్ఠ సన్న్యవర్తత కశ్మలాత్

దానితో తనని తాను చూసుకున్నాడు. ఇది భగవంతుని మాయ. దానితో నేను జడున్ని అయ్యాను, అను తెలుసుకుని ఆ వ్యామోహం నుండి స్వస్థతను పొందాడు

అథావగతమాహాత్మ్య ఆత్మనో జగదాత్మనః
అపరిజ్ఞేయవీర్యస్య న మేనే తదు హాద్భుతమ్

అప్పుడు ఈ జగదాత్మ అయిన పరమాత్మ యొక్క మాయతో ఓడించబడటం పెద్ద ఆశ్చర్యముగా భావించలేదు

తమవిక్లవమవ్రీడమాలక్ష్య మధుసూదనః
ఉవాచ పరమప్రీతో బిభ్రత్స్వాం పౌరుషీం తనుమ్

విషయం తెలిసిన తరువాత కూడా దిగులు పడలెదు, సిగ్గు పడలేదు చింతా గ్రస్తుడు కాలేదు. శంకరున్ని చూచి స్వామి పురుష రూపం ధరించి ఇలా అన్నాడు

శ్రీభగవానువాచ
దిష్ట్యా త్వం విబుధశ్రేష్ఠ స్వాం నిష్ఠామాత్మనా స్థితః
యన్మే స్త్రీరూపయా స్వైరం మోహితోऽప్యఙ్గ మాయయా

దేవతా శ్రేష్టుడా అదృష్టం బాగుండి నీలో నిన్ను నిలుపుకునావు. నా స్త్రీ రూపముతో మోహింపచేయబడి కూడా వాస్తవాన్ని నీవు తెలుసుకోగలిగావు. 

కో ను మేऽతితరేన్మాయాం విషక్తస్త్వదృతే పుమాన్
తాంస్తాన్విసృజతీం భావాన్దుస్తరామకృతాత్మభిః

మనసును వశం చేసుకోని వారి చేత దాట రాని  ఇంత గొప్ప నా మాయను నీవు కాక మరి ఎవరు దాటగలరు. 

సేయం గుణమయీ మాయా న త్వామభిభవిష్యతి
మయా సమేతా కాలేన కాలరూపేణ భాగశః

ఈ నా మాయ ఇక ముందు నిన్ను కప్పిబుచ్చదు. నేనే ఆయా కాల రూపాలలో ఆయా పనులు చేసినపుడు తక్కిన వారందరూ బాధ పడినా నీవు మాత్రం బాధపడవు. ఇలా స్వామి చేత సత్కరించబడి స్వామి చుట్టూ ప్రదక్షిణం చేసి తన గణాలతో శంకరుడు కైలాసానికి వెళ్ళాడు

శ్రీశుక ఉవాచ
ఏవం భగవతా రాజన్శ్రీవత్సాఙ్కేన సత్కృతః
ఆమన్త్ర్య తం పరిక్రమ్య సగణః స్వాలయం యయౌ

ఆత్మాంశభూతాం తాం మాయాం భవానీం భగవాన్భవః
సమ్మతామృషిముఖ్యానాం ప్రీత్యాచష్టాథ భారత

శంకరునికి సగ భాగమైన పార్వతితో శంకరుడు ఋషులందరూ చూస్తుండగా ఇలా పలికాడు

అయి వ్యపశ్యస్త్వమజస్య మాయాం పరస్య పుంసః పరదేవతాయాః
అహం కలానామృషభోऽపి ముహ్యే యయావశోऽన్యే కిముతాస్వతన్త్రాః

నీవు పరమాత్మ యొక్క మాయను చూచావా, మనందరికీ పరదేవత ఆయన. సకల కలాధిపతి, ఐన నేనే మోహం చెందాను. మనసు తన వశం లేని వారి వలె నేను కూడా మోహం చెందానంటే ఇంక తక్కిన వారి గురించి ఏమని చెప్పాలి. 

యం మామపృచ్ఛస్త్వముపేత్య యోగాత్సమాసహస్రాన్త ఉపారతం వై
స ఏష సాక్షాత్పురుషః పురాణో న యత్ర కాలో విశతే న వేదః

వేయి సంవత్సరాలు తపస్సు చేసి విరమించగానే నీవు నన్ను అడిగావు. మీరే లోకాధీషులు. మీరు ఎవరిని ధ్యానిస్తున్నారని. ఆయన ఈయనే. ఈయననే నేను సమాధిలో ధ్యానం చేస్తూ ఉంటాను. కాలమూ వేదమూ ఈయన మీద ప్రభావం చూపవు.

శ్రీశుక ఉవాచ
ఇతి తేऽభిహితస్తాత విక్రమః శార్ఙ్గధన్వనః
సిన్ధోర్నిర్మథనే యేన ధృతః పృష్ఠే మహాచలః

శ్రీమన్నారాయణుని ప్రభావం నీకు చెప్పాను. ఇదంతా క్షీరసాగరమధనములో భాగం. 

ఏతన్ముహుః కీర్తయతోऽనుశృణ్వతో న రిష్యతే జాతు సముద్యమః క్వచిత్
యదుత్తమశ్లోకగుణానువర్ణనం సమస్తసంసారపరిశ్రమాపహమ్

ఇలాంటి క్షీరసాగర మధన వృత్తాంతం, చదివే వారికీ వినే వారికీ చెప్పేవారికీ ఏ ప్రయత్నం వ్యర్థం కాదు. ఉత్తమ శ్లోకగుణాలని వర్ణిస్తే సకల సంసార పరిశ్రమలనూ తొలగిస్తుంది. 

అసదవిషయమఙ్ఘ్రిం భావగమ్యం ప్రపన్నాన్
అమృతమమరవర్యానాశయత్సిన్ధుమథ్యమ్
కపటయువతివేషో మోహయన్యః సురారీంస్
తమహముపసృతానాం కామపూరం నతోऽస్మి

క్షీర సాగర మధన వృత్తాంతానికి సారం. దుర్మార్గులకు కనపడని ధ్యానముతో మాత్రం సాక్షాత్కారం చేసుకోదగిన పరమాత్మ పాదాలను ఆశ్రయించిన దేవతలకు అమృతాన్ని తినిపించాడు సముద్రాన్ని మధించి. పరమాత్మ పాదం అసదవిషయం (దుర్జనులకు అందనిది). మాయా మోహినీ వేషముతో రాక్షసులను మోహింపచేసాడు. ఆశ్రయించిన వారి కోరికలను తీర్చే శ్రీమన్నారాయణునికి నమస్కరిస్తున్నాను.

Popular Posts