Followers

Saturday 1 March 2014

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ఇరవై మూడవ అధ్యాయం


మైత్రేయ ఉవాచ
దృష్ట్వాత్మానం ప్రవయసమేకదా వైన్య ఆత్మవాన్
ఆత్మనా వర్ధితాశేష స్వానుసర్గః ప్రజాపతిః

ఈ పృధు చక్రవర్తి "నేను వృద్ధున్నయానని" తెలుసుకున్నాడు. తన కుటుంబమూ సంతానన్మూ రాజ్యమూ ప్రజలనూ బాగా పెంచాడు కాబట్టి

జగతస్తస్థుషశ్చాపి వృత్తిదో ధర్మభృత్సతామ్
నిష్పాదితేశ్వరాదేశో యదర్థమిహ జజ్ఞివాన్

స్థావర జంగములకి వృత్తి కల్పించాడు. మంచివారి ధర్మాన్ని పరిపాలించినవాడు (మంచివారిని తమ పని తాము చేసుకొనేలా చూచాడు). తాను దేని కోసం పుట్టాడో ఆ పని పూర్తి చేసాడు. పరమాత్మ ఆజ్ఞ్యను నిర్వర్తించాడు. 

ఆత్మజేష్వాత్మజాం న్యస్య విరహాద్రుదతీమివ
ప్రజాసు విమనఃస్వేకః సదారోऽగాత్తపోవనమ్

తన కుమారులకు తన కుమార్తే (భూమి) భారాన్ని అప్పగించాడు. భూమి విలపిస్తున్నట్లుగా ఉన్నది. ఇంతటి ఉత్తముడైన మహారాజు వెళుతున్నందుకు ప్రజలు కూడా బాధ పడుతున్నారు. భార్యతో కలిసి ఒంటిగా వెళ్ళాడు (మంత్రులూ సేనాపతులూ ఎవరూ వెంటలేరు). దీన్ని వానప్రస్థం అంటారు

తత్రాప్యదాభ్యనియమో వైఖానససుసమ్మతే
ఆరబ్ధ ఉగ్రతపసి యథా స్వవిజయే పురా

ఆ తపో వనములో వానప్రస్థ సమ్మతమైన అన్ని నియమాలను స్వీకరించాడు. భూమిని గెలిచేప్పుడు ఎంత పట్టుదలతో చేసాడో తపస్సు కూడా అంతే ఉగ్రముగా చేసాడు. 

కన్దమూలఫలాహారః శుష్కపర్ణాశనః క్వచిత్
అబ్భక్షః కతిచిత్పక్షాన్వాయుభక్షస్తతః పరమ్

కందమూలాలు ఎండిన ఆకులు తింటూ గడిపాడు. ఆ తరువాత నీటినీ, ఆ తరువాత వాయువూఉ భక్షించాడు

గ్రీష్మే పఞ్చతపా వీరో వర్షాస్వాసారషాణ్మునిః
ఆకణ్ఠమగ్నః శిశిరే ఉదకే స్థణ్డిలేశయః

వేసవి కాలములో పంచాగ్నుల నడుమ తపస్సు చేసాడు. వర్షం పడుతున్నప్పుడు బయట ఉండీ, చలికాలములో గొంతులోతు నీటిలో నిలబడి  ఇలా శీతోష్ణ బాధలను తట్టుకుంటూ

తితిక్షుర్యతవాగ్దాన్త ఊర్ధ్వరేతా జితానిలః
ఆరిరాధయిషుః కృష్ణమచరత్తప ఉత్తమమ్

మౌనముగా అంతరింద్రియ నిగ్రహము కలిగి ప్రశాంతముగా ఉండి, ప్రాణాయామ పరాయణుడై పరమాత్మను ఆరాధించదలచి ఉత్తమమైన తపస్సును ఆచరించాడు

తేన క్రమానుసిద్ధేన ధ్వస్తకర్మమలాశయః
ప్రాణాయామైః సన్నిరుద్ధ షడ్వర్గశ్ఛిన్నబన్ధనః

ఇలా పద్దతి ప్రకారం తపస్సు ఆచరిస్తుంటే మనసులో ఉన్న ప్రకృతి సంబంధమైన అన్ని దోషాలూ తొలగిపోయాయి. ఆశయః - కోశం. జీవుడు ఉన్న సంచీ జీవ కోశము. అన్ని కర్మలూ పోయి పరిశుద్ధమైన అంతఃకరణం కలవాడయ్యాడు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను ప్రాణాయామముతో గెలిచాడు. మనలో ఉండే కామాదులు పోవాలంటే ప్రాణాయామమే మంచి దారి. శారీరకమే కాదు, మనసు యొక్క ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. మనసు వశములో ఉంటుంది. మనసులో కామాదులు కలగవు. షడ్వర్గాన్ని పోగొట్టాలంటే ప్రధానమైన మార్గం ప్రాణాయామం. శరీర బంధాన్ని అలా తొలగించుకున్నాడు

సనత్కుమారో భగవాన్యదాహాధ్యాత్మికం పరమ్
యోగం తేనైవ పురుషమభజత్పురుషర్షభః

సనత్కుమారుడు చెప్పిన ఆధ్యాత్మ యోగమార్గాన్ని ఆచరిస్తూ, ఆయన చెప్పిన యోగమార్గముతో అదే యోగాన్నాశ్రయించి భగవదారాధన చేయడం మొదలుపెట్టాడు

భగవద్ధర్మిణః సాధోః శ్రద్ధయా యతతః సదా
భక్తిర్భగవతి బ్రహ్మణ్యనన్యవిషయాభవత్

ప్రాణాయామముతో శరీర బంధాన్ని శరీర స్పృషనూ మనసులో ఆశనూ కామ క్రోధాధి షడ్వర్గాలను జయిస్తే మనము భగవద్ధర్మాలు ఆచరించేవాడవుతాడు. ఇలా నిరంతరం పరమాత్మను సేవించడానికి ప్రయత్నశీలుడయ్యాడు. పరమాత్మ యందు అనన్యభక్తి కలిగింది - మరొకదాన్ని సేవించకుండా ఉండే భక్తి కలిగింది. 

తస్యానయా భగవతః పరికర్మశుద్ధ
సత్త్వాత్మనస్తదనుసంస్మరణానుపూర్త్యా
జ్ఞానం విరక్తిమదభూన్నిశితేన యేన
చిచ్ఛేద సంశయపదం నిజజీవకోశమ్

నిరంతరం పరమాత్మ సేవ చేయడం వలన పరిశుద్ధ మనసు కలిగి అనన్య భక్తి కలిగి, పరమాత్మ యందు నిరంతర స్మరణ కలిగి జ్ఞ్యానమూ విరక్తీ కలింగింది (స్వస్వరూప జ్ఞ్యానం). ఈ తీక్షణమైన జ్ఞ్యానముతో జీవమునకూ జీవునికీ కోశమైన ప్రకృతితో సంబంధం పోతుంది. తపసు బాగా చేసి నియమాలాచరిస్తే నిరంతర స్మరణా, దాని వలన భక్తీ, దాని వలన విరక్తీ, దాని వలన జ్ఞ్యానమూ కలిగి జీవకోశం పోతుంది. 

ఛిన్నాన్యధీరధిగతాత్మగతిర్నిరీహస్
తత్తత్యజేऽచ్ఛినదిదం వయునేన యేన
తావన్న యోగగతిభిర్యతిరప్రమత్తో
యావద్గదాగ్రజకథాసు రతిం న కుర్యాత్

ఇతర విషయ జ్ఞ్యానమంతా పోయి ఆత్మ స్వరూపమేమిటో తెలుసుకొని ఎలాంటి ఆసక్తీ ఆశా లేనివాడై, దాన్ని (శరీరాన్ని శరీర బంధాన్నీ) విడిచిపెడతాడు. ఏ జ్ఞ్యానముతో శరీర బంధాన్ని విడిచిపెడతాడో ఆ జ్ఞ్యానాన్ని కూడా వదిలిపెడతాడు. శరీరం వేరూ ఆత్మ వేరనే జ్ఞ్యానము కలిగినా పరమాత్మ యందు ప్రీతి కలిగిన నాడే యోగము కలిగినట్లు గుర్తు. పరమాత్మ కథల యందు ఎంత వరకూ ప్రీతి చూపరో అంతవరకూ యతి యోగమార్గములో జాగ్రత్త లేనట్లు గుర్తు( అంతవరకూ తప్పటడుగులేస్తూ ఉంటాడు) 

ఏవం స వీరప్రవరః సంయోజ్యాత్మానమాత్మని
బ్రహ్మభూతో దృఢం కాలే తత్యాజ స్వం కలేవరమ్

ఇలా జీవాత్మలో పరమాత్మనుంచి, తాను పూర్తిగా పరమాత్మ స్వరూపాన్ని అలవరచుకొని కాల క్రమములో తన శరీరాన్ని విడిచిపెట్టాడు. 

సమ్పీడ్య పాయుం పార్ష్ణిభ్యాం వాయుముత్సారయఞ్ఛనైః
నాభ్యాం కోష్ఠేష్వవస్థాప్య హృదురఃకణ్ఠశీర్షణి

మల ద్వారమును మడమతో గాలి బయటకు రాకుండా ఆపి, వాయువును పైకి తీసుకుని వెళ్ళి  (ఇడా పింగళలతో ఉన్న సుషుమ్నా నాడిని కదిలించాలంటే పాయు ద్వారాన్ని మూసి వేయాలి, అపుడు వాయువు పైకి వస్తుంది) నాభికి తీసుకువచ్చీ, ఉదరమూ హృదయమూ కంఠమూ చుబుకమూ ఆస్యమూ నాసాగ్రమూ భ్రూమధ్యమూ బ్రహ్మకపాలం వరకూ తీసుకు వచ్చాడు. 

ఉత్సర్పయంస్తు తం మూర్ధ్ని క్రమేణావేశ్య నిఃస్పృహః
వాయుం వాయౌ క్షితౌ కాయం తేజస్తేజస్యయూయుజత్

బ్రహ్మకపాలములో వాయువును ఉంచి, "ఆశ వదులుకొని" (ప్రకృతి యందు ఏమాత్రమూ ఆశ లేకుండా ఉంటేనే మోక్షం లభిస్తుంది) . శరీరములో ఉన్న వాయువును పంచభూతాలలో ఉన్న వాయువుగా స్మరించాడు, భూమిని పంచభూతాలలో ఉన్న భూమిగా, అలా పంచభూతాత్మకమైన శరీరాన్ని పంచభూతాలలో కలిపాడు. అలా దేనితో దాన్ని కలిపాడు

ఖాన్యాకాశే ద్రవం తోయే యథాస్థానం విభాగశః
క్షితిమమ్భసి తత్తేజస్యదో వాయౌ నభస్యముమ్

రంధ్రాలని ఆకాశములో జలాన్ని జలములో ఆయా స్థానాలలో ఏర్పాటుచేసాడు. తామసాహంకారం (భూతాది) నుండి పంచభూతాలు ఎలా పుట్టాయో అందులోనే చేరుతాయి. భూమి జలములో జలము అగ్నిలో అగ్ని వాయువులో వాయువు ఆకాశములో ఆకాశము మహత్ తత్వములో (ఈ పంచభూతములు మహత్ తత్వములోంచి వచ్చిన తామసాహంకారమునుండి పుట్టినవి. మళ్ళీ వాటిలోనే కలిపాడు) 

ఇన్ద్రియేషు మనస్తాని తన్మాత్రేషు యథోద్భవమ్
భూతాదినామూన్యుత్కృష్య మహత్యాత్మని సన్దధే

మనస్సుని ఇంద్రియములలో ఉంచాడు (మనసూ ఇంద్రియములూ రెండూ సాత్వికాహంకారం నుండే పుట్టాయి. ఇంద్రియాలు మనసుని ఆశ్రయిస్తాయి. విషయములు ఇంద్రియాలను ఇంద్రియాలు మనసునూ ఆకర్షిస్తాయి. ఉదా: శబ్దం చెవిని ఆక్రషిస్తుంది, చెవి మనసును ఆకర్షిస్తుంది మనసు బుద్ధిని ఆకర్షిస్తుంది. ఇంద్రియములు మనసును ఆకర్షిస్తాయి కాబట్టి మనసుని ఇంద్రియాలలో ఉంచాడు.) ఏ ఇంద్రియము ఏ గుణాన్ని గ్రహిస్తుందో ఆ గుణము ఏ మాత్రతో పుట్టిందో దానిలో పడేసాడు. శబ్దమునుండి పుట్టింది ఆకాశం, ఆకాశం యొక్క ఇంద్రియం శ్రోత్రం. శ్రోత్రేంద్రియం శబ్ద తన్మాత్రములో స్పర్శేంద్రియం రూప తన్మాత్రలో .... శబ్దాన్ని గ్రహించేది శ్రోత్రం కాబట్టి శ్రోత్రాన్ని శబ్ద తన్మాత్రలో ఉంచాడు. ఇలా అన్నిటినీ ఉంచి, వాటిని తామసాహంకారములో ఉంచి, వాటిని మహత్ తత్వములో, దాన్ని ప్రకృతి తత్వములో, దాన్ని ఆత్మ తత్వములో, దాన్ని పరమాత్మ తత్వములో ఉంచాడు. 

తం సర్వగుణవిన్యాసం జీవే మాయామయే న్యధాత్
తం చానుశయమాత్మస్థమసావనుశయీ పుమాన్
నానవైరాగ్యవీర్యేణ స్వరూపస్థోऽజహాత్ప్రభుః

ఇలాంటి అన్ని గుణాలూ కలిగి ఉండే ప్రకృతిని ప్రకృతి సంబంధముతో వచ్చిన జీవుని యందు. అలాంటి జీవుని ఆత్మలో అంతర్యామిగా ఉన్న పరమాత్మలో చేర్చాడు. ఇలా జ్ఞ్యాన వైరాగ్య బలముతో తన స్వరూపాన్ని తాను ఏర్పరచుకుని శరీరాన్ని వదిలిపెట్టాడు

అర్చిర్నామ మహారాజ్ఞీ తత్పత్న్యనుగతా వనమ్
సుకుమార్యతదర్హా చ యత్పద్భ్యాం స్పర్శనం భువః

అతని పత్ని ఐన అర్చి, భూమి మీద పాదము కూడా మోపజాలని సుకుమారి, అరణ్యానికి వచ్చి తపస్సు చేస్తోన్న భర్తకు సేవ చేసింది. భర్త చేసే వ్రతాన్ని చూస్తూ భర్తను సేవిస్తూ వానప్రస్థముతో బాధను ఏ మాత్రము తెలుసుకోలేకపోయింది. పూర్తిగా బక్క చిక్కిపోయినా ఆమెకు బాధ కలగలేదు

అతీవ భర్తుర్వ్రతధర్మనిష్ఠయా శుశ్రూషయా చార్షదేహయాత్రయా
నావిన్దతార్తిం పరికర్శితాపి సా ప్రేయస్కరస్పర్శనమాననిర్వృతిః

భర్త యొక్క చేతి స్పర్శతో కలిగిన సంతోషముతో  బాధ తెలియలేదు

దేహం విపన్నాఖిలచేతనాదికం పత్యుః పృథివ్యా దయితస్య చాత్మనః
ఆలక్ష్య కిఞ్చిచ్చ విలప్య సా సతీ చితామథారోపయదద్రిసానుని

భర్త శరీరములో ఉండే అన్ని అవయవాలు తమ ధర్మాన్ని విడిచిపెట్టాయని తెలుసుకుంది. కొద్దిగా విలపించింది. పర్వత శిఖరము మీద చితి ఏర్పాటు చేసి, కొలనులో స్నానం చేసి ఔదార్యకర్మలు గల పృధు మహారాజుకు తర్పణాలిచ్చి, 

విధాయ కృత్యం హ్రదినీజలాప్లుతా దత్త్వోదకం భర్తురుదారకర్మణః
నత్వా దివిస్థాంస్త్రిదశాంస్త్రిః పరీత్య వివేశ వహ్నిం ధ్యాయతీ భర్తృపాదౌ

స్వర్గములో ఉన్న దేవతలకు నమస్కారం చేసి మూడు సార్లు ప్రధక్షిణం చేసి భర్త పాదాలను స్మరిస్తూ అదే అగ్నిహోత్రములో చేరింది.

విలోక్యానుగతాం సాధ్వీం పృథుం వీరవరం పతిమ్
తుష్టువుర్వరదా దేవైర్దేవపత్న్యః సహస్రశః

అన్ని భోగాలనుభవించిన సుకుమారురాలు అగ్నిలో ప్రవేశించడం చూసి దేవపత్నులందరూ పొగిడారు

కుర్వత్యః కుసుమాసారం తస్మిన్మన్దరసానుని
నదత్స్వమరతూర్యేషు గృణన్తి స్మ పరస్పరమ్

ఆ మందర పర్వతం మీద పుష్ప వృష్టి కురిపించి దేవ వాద్యాలు మోగిస్తూ ఇలా అనుకున్నారు

దేవ్య ఊచుః
అహో ఇయం వధూర్ధన్యా యా చైవం భూభుజాం పతిమ్
సర్వాత్మనా పతిం భేజే యజ్ఞేశం శ్రీర్వధూరివ

ఈ మహాత్మురాలు ఎంత ధన్యురాలు. శ్రీమన్నారాయణున్ని లక్ష్మీ దేవి అనుసరించినట్లే సర్వాత్మనా (శరీరమున్నా లేకున్నా) భర్తనే అనుసరించింది. 

సైషా నూనం వ్రజత్యూర్ధ్వమను వైన్యం పతిం సతీ
పశ్యతాస్మానతీత్యార్చిర్దుర్విభావ్యేన కర్మణా

ఈ ఒక్క సుకృతముతో పృధు చక్రవర్తి అంత తపస్సూ చేసి ఏ లోకాన్ని పొందాడో ఈమే ఆ లోకాలనే పొందింది. మనం చూస్తుండగానే మనందరినీ దాటి వెళ్ళిపోతోంది కేవలం భర్తృ శుశ్రూష వలన

తేషాం దురాపం కిం త్వన్యన్మర్త్యానాం భగవత్పదమ్
భువి లోలాయుషో యే వై నైష్కర్మ్యం సాధయన్త్యుత

పరమాత్మనాశ్రయించిన మానవులకు పొందరానిదేమైనా ఉందా? కామనా రహితముగా పనిని చేసే వారు, అల్పాయుష్కులైనా కోరికలను వదిలిపెట్టిన వారు ఎంత గొప్ప వారు.

స వఞ్చితో బతాత్మధ్రుక్కృచ్ఛ్రేణ మహతా భువి
లబ్ధ్వాపవర్గ్యం మానుష్యం విషయేషు విషజ్జతే

మోక్షసాధనమైన శరీరాన్ని పొందీ మళ్ళీ శరీరాన్నిచ్చే విషయాలను చింతించేవాడు ఆత్మ వంచన చేసుకున్నవాడు. ఆత్మకు ద్రోహం చేసినవాడు. ఎంతో కష్టపడి ఎన్నో ఏళ్ళు తపస్సు చేసి మానవ జన్మ వస్తే విషయముల యందు ఆసక్తి కనపర్చిన వాడు ఆత్మద్రోహి 

మైత్రేయ ఉవాచ
స్తువతీష్వమరస్త్రీషు పతిలోకం గతా వధూః
యం వా ఆత్మవిదాం ధుర్యో వైన్యః ప్రాపాచ్యుతాశ్రయః

ఇలా దేవతా స్త్రీలు పొగుడుతూ ఉంటే అర్చి తన భర్త లోకానికి వెళ్ళింది. (గురు వెళ్ళిన లోకానికి వెళ్ళడం శిష్యుడికీ భర్త వెళ్ళిన లోకానికి వెళ్ళడం భార్యకు మోక్షము కన్నా విశేషము)

ఇత్థమ్భూతానుభావోऽసౌ పృథుః స భగవత్తమః
కీర్తితం తస్య చరితముద్దామచరితస్య తే

ఇంత గొప్పవాడు పరమాత్మకు ప్రీతి పాత్రుడు ఈ పృధువు

య ఇదం సుమహత్పుణ్యం శ్రద్ధయావహితః పఠేత్
శ్రావయేచ్ఛృణుయాద్వాపి స పృథోః పదవీమియాత్

అద్భుతమైన ఆ చైత్రను ఇప్పటివరకూ చెప్పుకున్నాము. ఈ చరిత్రను శ్రద్ధతో సావధానముతో చదివిన వాడూ వినిపించేవాడూ విన్నవాడూ కూడా పృధు చక్రవర్తి వెళ్ళిన లోకానికి వెళ్తాడు

బ్రాహ్మణో బ్రహ్మవర్చస్వీ రాజన్యో జగతీపతిః
వైశ్యః పఠన్విట్పతిః స్యాచ్ఛూద్రః సత్తమతామియాత్

ఈ చరిత్రను విన్న బ్రాహ్మణుడు బ్రహ్మతేజస్సునూ క్షత్రియుడు రాజ్యాన్నీ, వైశ్యుడు వ్యాపారములో రాణిస్తాడు శూద్రుడు ఉత్తముడవుతాడు.

త్రిః కృత్వ ఇదమాకర్ణ్య నరో నార్యథవాదృతా
అప్రజః సుప్రజతమో నిర్ధనో ధనవత్తమః

ఆదరముతో ఈ చరిత్రను మూడు సార్లు వింటే సంతానము లేని వారికి సంతానం కలుగుతుంది. ధనము లేని వారికి ధనమూ

అస్పష్టకీర్తిః సుయశా మూర్ఖో భవతి పణ్డితః
ఇదం స్వస్త్యయనం పుంసామమఙ్గల్యనివారణమ్

అంతంతమాత్రం పేరున్నవాడు మంచి పేరును పొందుతాడు, పరమ మూర్ఖుడు పండితుడవుతాడు. అన్ని శుభాలకూ మూలమూ, పురుషుల అశుభాన్ని తొలగిస్తుంది.

ధన్యం యశస్యమాయుష్యం స్వర్గ్యం కలిమలాపహమ్
ధర్మార్థకామమోక్షాణాం సమ్యక్సిద్ధిమభీప్సుభిః
శ్రద్ధయైతదనుశ్రావ్యం చతుర్ణాం కారణం పరమ్

ధన్యమైనదీ కీర్తినిస్తుంది ఆయుష్యాన్నిస్తుంది మోక్షాన్నిస్తుంది కలిమలాన్ని పోగొడుతుంది, ధర్మమునూ అర్థమునూ కామమునూ మోక్షమునూ కోరేవారికి సిద్ధి కలిగిస్తుంది. ఈ చరిత్రను శ్రద్ధగా వినాలి. చతుర్విధ పురుషార్థాలను ఇస్తుంది

విజయాభిముఖో రాజా శ్రుత్వైతదభియాతి యాన్
బలిం తస్మై హరన్త్యగ్రే రాజానః పృథవే యథా

యుద్ధానికి వెళ్ళేముందు ఈ చరిత్రను పారాయణం చేస్తే చంపడానికి వచ్చిన రాజులు అర్ఘ్య పాద్యాలతో వచ్చి పూజించి లొంగిపోతారు. 

ముక్తాన్యసఙ్గో భగవత్యమలాం భక్తిముద్వహన్
వైన్యస్య చరితం పుణ్యం శృణుయాచ్ఛ్రావయేత్పఠేత్

విన్నంతసేపూ ఇతర విషయముల యందు సంగమును వదిలి పరమాత్మ యందు భక్తి కలిగినవాడై ఈ చరిత్రను శ్రద్ధతో వింటే

వైచిత్రవీర్యాభిహితం మహన్మాహాత్మ్యసూచకమ్
అస్మిన్కృతమతిమర్త్యం పార్థవీం గతిమాప్నుయాత్

విదురుడికి చెప్పిన ఈ విషయాన్ని విని ఈ చరిత్ర మీద మతి ఉంచితే పృధు చక్రవర్తి వెళ్ళిన లోకానికి వెళ్తాడు

అనుదినమిదమాదరేణ శృణ్వన్పృథుచరితం ప్రథయన్విముక్తసఙ్గః
భగవతి భవసిన్ధుపోతపాదే స చ నిపుణాం లభతే రతిం మనుష్యః

అనుదినమూ ప్రాతఃకాలము ఈ చరిత్రను వింటూ నలుగురికి చెబుతూ అన్ని కోరికలనూ విడిచిపెట్టినవాడు సంసారమనే సముద్రానికి పడవ అయిన పరమాత్మ పాదముల యందు నిశ్చలమైన అచంచలమైన భక్తి కలుగుతుంది. 

                                             సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు

Popular Posts