Followers

Sunday 23 March 2014

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం తొమ్మిదవ అధ్యాయం


శ్రీశుక ఉవాచ
తస్యాసన్విశ్వరూపస్య శిరాంసి త్రీణి భారత
సోమపీథం సురాపీథమన్నాదమితి శుశ్రుమ

ఏ విశ్వరూపుని వలన ఇంద్రుడు రాక్షసులను గెలిచి త్రైలోక్య రాజ్యం పొందాడో అతనికి మూడు తలకాయలు. ఒక తలకాయ సోమరసాన్ని పానం చేస్తూ ఉంటుంది, ఇంకో తలకాయ అన్నం తింటుంది అని విన్నాము. అంటే ఇంత జ్ఞ్యానం సంపాదించి కూడా భోగమునకే ప్రాధాన్యం. మనం కూడా ఇంతే.. 

స వై బర్హిషి దేవేభ్యో భాగం ప్రత్యక్షముచ్చకైః
అదదద్యస్య పితరో దేవాః సప్రశ్రయం నృప

ఇంద్రునికి రాజ్యం రాగానే భగవంతునికి కృతజ్ఞ్యతగా ఒక యజ్ఞ్యం చేసి ప్రాచీనాగ్ర దర్భలను పరచి ఆహుతులను ఇస్తున్నాడు. దేవతల ఆహుతులను పితృస్థానములో ఉన్న వారికి స్పష్టముగా వినయముగా పెద్దగా ఆహుతులిస్తున్నాడు 

స ఏవ హి దదౌ భాగం పరోక్షమసురాన్ప్రతి
యజమానోऽవహద్భాగం మాతృస్నేహవశానుగః

మాత్రే వంశం (దితి) వారైన రాక్షసులకు చాటుగా ఆహుతులిస్తున్నాడు తల్లి మీద ప్రేమతో 

తద్దేవహేలనం తస్య ధర్మాలీకం సురేశ్వరః
ఆలక్ష్య తరసా భీతస్తచ్ఛీర్షాణ్యచ్ఛినద్రుషా

ఇది ధర్మము కాదు, దేవహేళనం చేస్తున్నాడని దేవతలు తెలుసుకున్నారు. దేవతలకు జరిగిన అవమానం తెలుసుకుని ఇంద్రుడు ఆయన తలలను నరికేసాడు. ఒక శిరస్సు కపిజరం అనే పక్షిగా సోమ శిరస్సు, కలజింక పక్షిగా సోమ శిరస్సు, తిత్తిరి పక్షిగా అన్నం శిరస్సు అయి ఇంద్రున్ని వెంటాడాయి. బ్రహ్మ హత్యకు ఇంద్రుడు శిరస్సు వంచి స్వీకరించాడు. సంవత్సరము అనుభవించాడు. 

సోమపీథం తు యత్తస్య శిర ఆసీత్కపిఞ్జలః
కలవిఙ్కః సురాపీథమన్నాదం యత్స తిత్తిరిః

బ్రహ్మహత్యామఞ్జలినా జగ్రాహ యదపీశ్వరః
సంవత్సరాన్తే తదఘం భూతానాం స విశుద్ధయే
భూమ్యమ్బుద్రుమయోషిద్భ్యశ్చతుర్ధా వ్యభజద్ధరిః

భూమిస్తురీయం జగ్రాహ ఖాతపూరవరేణ వై
ఈరిణం బ్రహ్మహత్యాయా రూపం భూమౌ ప్రదృశ్యతే

తరువాత ఇంద్రుడు ఆ పాపాన్ని నలుగురికి పంచాడు భూమికీ వృక్షమునకూ జలమునకూ స్త్రీలకు. నాలగవ భాగాన్ని భూమి తీసుకుంది 

తుర్యం ఛేదవిరోహేణ వరేణ జగృహుర్ద్రుమాః
తేషాం నిర్యాసరూపేణ బ్రహ్మహత్యా ప్రదృశ్యతే

అలా తీసుకున్నందుకు "తవ్విన ప్రదేశం మళ్ళీ పూడుకుని పోవాలి" అన్న వరం తీసుకుంది. బ్రహ్మ హత్యా పాతకం భూమిలో పుండుగా (ఊభి) మారింది. దీన్ని కర్బుదం అంటారు. చెట్టును నరికినా కొన్నాళ్ళకు మళ్ళీ అది చిగురిస్తుంది. ఆ వరాన్ని తీసుకుని చెట్లు నాలగవ భాగం తీసుకున్నాయి. చెట్టు నుండి వచ్చే జిగురు రూపములో బ్రహ్మ హత్య ఉంటుంది. సంతానం కలిగిన తరువాత కూడా మాకు భర్తృ సంగమ అభిలాష ఉండాలి అని వరం తీసుకుని స్త్రీలు ఇంకో నాలగవ వంతు భాగం తీసుకున్నారు. ఇది వారికి మాసిక ధర్మము రూపములో కనపడుతుంది. బ్రహ్మ హత్య కాబట్టే ఆ రోజులలో తాకకూడదంటారు. ఊట అనే వరం తీసుకుని జలం మిగిలిన నాలగవ వంతు పాపం తీసుకున్నాయి. బ్రహ్మ హత్య బుడగల రూపములో కనపడుతుంది. అందుకే బుడగలు ఉన్న నీరు పనికి రాదు. 

శశ్వత్కామవరేణాంహస్తురీయం జగృహుః స్త్రియః
రజోరూపేణ తాస్వంహో మాసి మాసి ప్రదృశ్యతే

ద్రవ్యభూయోవరేణాపస్తురీయం జగృహుర్మలమ్
తాసు బుద్బుదఫేనాభ్యాం దృష్టం తద్ధరతి క్షిపన్

హతపుత్రస్తతస్త్వష్టా జుహావేన్ద్రాయ శత్రవే
ఇన్ద్రశత్రో వివర్ధస్వ మా చిరం జహి విద్విషమ్

త్వష్ట, తన కుమారుడిని చంపినందుకు, ఇంద్రున్ని చంపే వాడు కొడుకుగా రావాలని యజ్ఞ్యం మొదలుపెట్టి "ఇంద్ర శత్రువుగా పెరుగు" అని మంత్రాన్ని చదివాడు . అతను మంత్రం చదవగానే యజ్ఞ్య కుండమునుంచి ఒకడు ఆవిర్భవించాడు. ప్రతీ రోజు మూడు అడుగుల (బాణమంత) పెరుగుతూ, సంద్యాకలములో కాలిన మబ్బులా ఉన్నాడు. కాలిన రాగిలాంటి శిఖలూ మీసములూ . మధ్యాన్న సూర్యుని ప్రకాశము గలవాడై, ప్రకాశించే  శూలముతో నాట్యం చేస్తూ గర్ఝిస్తూ ఉన్నాడు. ఆకాశాన్నే తాగుతున్నట్లు నోరు తెరిచి, నాలుకతో నక్షత్రాలను నాకేస్తూ, నోటితో లోకాలను మింగేస్తూ, దన్ష్ట్రలో లోకాలు లోపలకు పోయేట్లు ఆవాలిస్తూ,ఉండగా దేవతలందరూ భయపడి అన్ని దిక్కులకూ పారిపోయారు. అన్ని లోకాలకూ ఆవరించాడు కాబట్టి అతనిపేరు వృత్తుడు. ఇతను పాపి మహాభయంకరుడు. దేవతలు అతన్ని చంపడానికి వచ్చి కొడుతున్నారు. దేవతలు ప్రయోగించే  దివ్యాయుధాలను మింగేస్తున్నాడు. తమ ఆయుధాలూ తేజస్సు బలమూ మింగేసాడు. 

అథాన్వాహార్యపచనాదుత్థితో ఘోరదర్శనః
కృతాన్త ఇవ లోకానాం యుగాన్తసమయే యథా

విష్వగ్వివర్ధమానం తమిషుమాత్రం దినే దినే
దగ్ధశైలప్రతీకాశం సన్ధ్యాభ్రానీకవర్చసమ్

తప్తతామ్రశిఖాశ్మశ్రుం మధ్యాహ్నార్కోగ్రలోచనమ్

దేదీప్యమానే త్రిశిఖే శూల ఆరోప్య రోదసీ
నృత్యన్తమున్నదన్తం చ చాలయన్తం పదా మహీమ్

దరీగమ్భీరవక్త్రేణ పిబతా చ నభస్తలమ్
లిహతా జిహ్వయర్క్షాణి గ్రసతా భువనత్రయమ్

మహతా రౌద్రదంష్ట్రేణ జృమ్భమాణం ముహుర్ముహుః
విత్రస్తా దుద్రువుర్లోకా వీక్ష్య సర్వే దిశో దశ

యేనావృతా ఇమే లోకాస్తపసా త్వాష్ట్రమూర్తినా
స వై వృత్ర ఇతి ప్రోక్తః పాపః పరమదారుణః

తం నిజఘ్నురభిద్రుత్య సగణా విబుధర్షభాః
స్వైః స్వైర్దివ్యాస్త్రశస్త్రౌఘైః సోऽగ్రసత్తాని కృత్స్నశః

తతస్తే విస్మితాః సర్వే విషణ్ణా గ్రస్తతేజసః
ప్రత్యఞ్చమాదిపురుషముపతస్థుః సమాహితాః

శ్రీదేవా ఊచుః
వాయ్వమ్బరాగ్న్యప్క్షితయస్త్రిలోకా బ్రహ్మాదయో యే వయముద్విజన్తః
హరామ యస్మై బలిమన్తకోऽసౌ బిభేతి యస్మాదరణం తతో నః

సకల చరాచర లోకములూ జగత్తులూ బ్రహ్మాదులూ మేమూ ఎవరికి భయపడి పూజ చేస్తామో 

అవిస్మితం తం పరిపూర్ణకామం స్వేనైవ లాభేన సమం ప్రశాన్తమ్
వినోపసర్పత్యపరం హి బాలిశః శ్వలాఙ్గులేనాతితితర్తి సిన్ధుమ్

అటువంటి అన్ని కోరికలూ తీరిన స్వామి అయిన పరమాత్మను కాక ఇంకొకరిని ఆరాధించేవాడు కుక్క తోక పట్టుకుని సముద్రమును దాటినట్లు అవుతుంది. 

యస్యోరుశృఙ్గే జగతీం స్వనావం మనుర్యథాబధ్య తతార దుర్గమ్
స ఏవ నస్త్వాష్ట్రభయాద్దురన్తాత్త్రాతాశ్రితాన్వారిచరోऽపి నూనమ్

మత్స్యావతారములో చేప కొమ్ములో భూమి పడవగా మారగా, భూమిని కట్టి సత్యవ్రతుడిని ప్రళయకాలమంతా అతన్ని పడవలో ధరించి, ప్రళయకాల భయాన్ని నావలో తొలగించాడు. అటువంటి మత్స్యమూర్తి ఈ త్వాష్ట్ర భయాన్ని తొలగించాలి.

పురా స్వయమ్భూరపి సంయమామ్భస్యుదీర్ణవాతోర్మిరవైః కరాలే
ఏకోऽరవిన్దాత్పతితస్తతార తస్మాద్భయాద్యేన స నోऽస్తు పారః

పరమాత్మ నాభి పద్మములో పుట్టిన బ్రహ్మను సముద్ర తరంగముల నుండి పద్మాన్ని పడిపోకుండా కాపాడిన పరమాత్మ మమ్ము కాపాడు గాక. ఎవరు ఈ ప్రపంచాన్ని సృష్టించాడో దానిని అనుసరించి మేము సృష్టి చేస్తున్నాము

య ఏక ఈశో నిజమాయయా నః ససర్జ యేనానుసృజామ విశ్వమ్
వయం న యస్యాపి పురః సమీహతః పశ్యామ లిఙ్గం పృథగీశమానినః

మాలో ప్రతీ ఒక్కరమూ మేమే నాయకులమని భావిస్తున్నాము. మాకీ అధికారాన్నిచ్చినవారిని మరచిపోతున్నాము. 

యో నః సపత్నైర్భృశమర్ద్యమానాన్దేవర్షితిర్యఙ్నృషు నిత్య ఏవ
కృతావతారస్తనుభిః స్వమాయయా కృత్వాత్మసాత్పాతి యుగే యుగే చ

శత్రువులతో మాటి మాటికీ పీడించబడుతున్న మేము దేవతలూ ఋషులూ పశుపక్ష్యాదులూ మానవులలో నిత్యమూ బాధపడుతున్నవారికి నీవు ఈ నాలిగింటిగా పుట్టావు. దేవతగా ఋషిగా మానవుడుగా పశు పక్షాదులుగా పుట్టావు. ప్రతీ యుగములో ఆయా అవతారాలుగా వచ్చి మమ్ము కాపాడుతున్నాడు

తమేవ దేవం వయమాత్మదైవతం పరం ప్రధానం పురుషం విశ్వమన్యమ్
వ్రజామ సర్వే శరణం శరణ్యం స్వానాం స నో ధాస్యతి శం మహాత్మా

నీవే ప్రధానం నీవే ప్రకృతి నీవే పరుడివి నీవే అన్యం. నిన్ను మేము శరణు వేడుతున్నాము. నీవు మహానుభావుడివి కాబట్టి నీవారికి శుభం కలిగిస్తావు. 

శ్రీశుక ఉవాచ
ఇతి తేషాం మహారాజ సురాణాముపతిష్ఠతామ్
ప్రతీచ్యాం దిశ్యభూదావిః శఙ్ఖచక్రగదాధరః

ఇలా స్తోత్రం చేస్తే పశ్చిమ దిక్కులో వారికి కనిపించాడు. పదహారు విభూతులతో కనపడ్డాదు. ఆయనకు పద్దెనిమిది విభూతులు. శ్రీవత్సం కౌస్తుభం లేకుండా వచ్చాడు. 

ఆత్మతుల్యైః షోడశభిర్వినా శ్రీవత్సకౌస్తుభౌ
పర్యుపాసితమున్నిద్ర శరదమ్బురుహేక్షణమ్

వికసించిన శర్త్కాల పద్మము వంటి నేత్రము గల స్వామిని చూచి

దృష్ట్వా తమవనౌ సర్వ ఈక్షణాహ్లాదవిక్లవాః
దణ్డవత్పతితా రాజఞ్ఛనైరుత్థాయ తుష్టువుః

ఆ సంతోషముతో భూమి మీద పడి సాష్టాంగ నమస్కారం చేసారు

శ్రీదేవా ఊచుః
నమస్తే యజ్ఞవీర్యాయ వయసే ఉత తే నమః
నమస్తే హ్యస్తచక్రాయ నమః సుపురుహూతయే

నీవు యజ్ఞ్య వీరుడవు, అన్ని రకముల పక్షులకూ అవస్థలకూ మూలం. నీవు పురుహూతుడవు (మొదలు పిలవబడినవాడు). అటువంటి నీకు నమస్కారం. అగ్ర పూజను నీవే అందుకుంటావు

యత్తే గతీనాం తిసృణామీశితుః పరమం పదమ్
నార్వాచీనో విసర్గస్య ధాతర్వేదితుమర్హతి

మూడు లోకములూ మూడు స్థానములు మూడు గతులను శాసించేవాడవు. సృష్టి తరువాత లేని వాడవు (పుట్టుక లేని వాడవు). నీవంటి వారిని మేము తెలియలేము

ఓం నమస్తేऽస్తు భగవన్నారాయణ వాసుదేవాదిపురుష మహాపురుష మహానుభావ పరమమఙ్గల
పరమకల్యాణ పరమకారుణిక కేవల జగదాధార లోకైకనాథ సర్వేశ్వర లక్ష్మీనాథ
పరమహంసపరివ్రాజకైః పరమేణాత్మయోగసమాధినా
పరిభావితపరిస్ఫుటపారమహంస్యధర్మేణోద్ఘాటితతమఃకపాటద్వారే చిత్తేऽపావృత ఆత్మలోకే
స్వయముపలబ్ధనిజసుఖానుభవో భవాన్

అన్ని విడిచ్పెట్టిన మహానుభావుల చేత సర్వోత్కృష్టమైన సమాధిలో స్పష్టముగా ప్రకాశింపచేసే సకల ధర్మ పరిత్యాగముతో పరమాత్మను సాక్షాత్కరించుకునే వారికి అజ్ఞ్యానాన్ని తొలగించి జ్ఞ్యానాన్ని ప్రసాదించిన వాడా. మనసులో అజ్ఞ్యానాన్ని తొలగించి నీ స్వరూపాన్ని మాకు సాక్షాత్కరింపచేసే వాడా. నీ పనులూ విహారం మాకు అర్థం కావు.
మనసు యందు అజ్ఞ్యానాన్ని తొలగించి ఆత్మలోకములో తనకు తానుగా తన స్వరూపాన్ని మాకు సాక్షాత్కరింపచేసే వాడివి. 

దురవబోధ ఇవ తవాయం విహారయోగో యదశరణోऽశరీర ఇదమనవేక్షితాస్మత్సమవాయ
ఆత్మనైవావిక్రియమాణేన సగుణమగుణః సృజసి పాసి హరసి

ఏ గుణములూ లేని నీవు గుణములు గల ప్రకృతిని సృష్టిస్తున్నావు రక్షిస్తున్నావు, నశింపచేస్తున్నావు. సృష్టి చేసే నీకు ఎలాంటి వికారము, గుణమూ ఉండదు. కానీ సృష్టిలో అన్ని రకాల వికారాలూ, గుణాలూ ఉంటాయి

అథ తత్ర భవాన్కిం దేవదత్తవదిహ గుణవిసర్గపతితః పారతన్త్ర్యేణ స్వకృతకుశలాకుశలం
ఫలముపాదదాత్యాహోస్విదాత్మారామ ఉపశమశీలః సమఞ్జసదర్శన ఉదాస్త ఇతి హ వావ న విదామః

లోకములో సామాన్య జీవునిలా సృష్టించిన దాని ఫలమును అనుభవిస్తావా, లేక వైరాగ్యం పొందిన యతిలా ఉంటావా, అని మాకు అర్థం కాదు. నీ సృష్టిలో జీవునిలా ఫలితాన్ని అనుభవిస్తావా, నీ సృష్టిలో యతిలాగ ఫలమును ఆశించవా?

న హి విరోధ ఉభయం భగవత్యపరిమితగుణగణ ఈశ్వరేऽనవగాహ్యమాహాత్మ్యే
ऽర్వాచీనవికల్పవితర్కవిచారప్రమాణాభాసకుతర్కశాస్త్రకలిలాన్తఃకరణాశ్రయదురవగ్రహవాదినాం
వివాదానవసర ఉపరతసమస్తమాయామయే కేవల ఏవాత్మమాయామన్తర్ధాయ కో న్వర్థో దుర్ఘట ఇవ భవతి
స్వరూపద్వయాభావాత్

నీలో రెండూ కనపడుతున్నాయి. నీవు చేసే సృష్టి స్థ్తి లయములు వైరాగ్యములో భాగమా? అనుభవములో భాగమా. పరమాత్మలో ఏ గుణము వ్యాపిస్తుందో మాకు అర్థం కాదు. నీ సృష్తి వ్యాపారం తెలియాలంటే వికల్పం  (అదా ఇదా అన్న ఆలోచన) వితర్కం  (ఊహ) విచారం (ఆలోచన) ప్రమాణము, కుతర్కం (లోకములో కర్తలకు పుట్టుకా చావూ ఉన్నట్లు భగవంతునికీ ఉంటాయి అని వాదించడం) మొదలైన వాటితో వాదించే వారికి,అలాంటి వివాదాలతో సంబంధం లేకుండా వారికి అర్థం కాని మాయకు ఆశ్రయముగా ఉన్న నీవు, నీ మాయను నీవే సృష్టించి అంతర్థానం చేస్తావు. 

సమవిషమమతీనాం మతమనుసరసి యథా రజ్జుఖణ్డః సర్పాదిధియామ్

అలాంటి నీ విషయములో "చేయలేనిది" అని ఏమి ఉంటుంది. నీవు కూడా మా ఆలోచనలను అనుసరిస్తావు . చీకట్లో తాడుని చూసి పామనుకొని పామును చూసినప్పుడు కలగాల్సిన భావనలు కలుగుతాయి. అలాగే మాయతో ఇలాంటి వన్నీ కలుగుతాయి. నీవు అన్నిటిలో ఉంటావు. ఎందులోనూ ఉండవు. అన్నిటినీ సృష్టిస్తావు, ఏ దోషమూ నీకంటదు. 

స ఏవ హి పునః సర్వవస్తుని వస్తుస్వరూపః సర్వేశ్వరః సకలజగత్కారణకారణభూతః
సర్వప్రత్యగాత్మత్వాత్సర్వగుణాభాసోపలక్షిత ఏక ఏవ పర్యవశేషితః

ఇకాడ ఏ తర్కమూ పని చేయదు. ప్రతీ వస్తువులో ఏ వస్తువులో ఆ వస్తువులాగే ఉంటావు. నీవు సర్వేశ్వరుడవు. అన్ని జగత్తులనూ సృష్టించేవారిని నీవు సృష్టిస్తావు. ప్రతీఇ వాడి ఆత్మలో అంతర్యామిగా ఉంటావు. 

అథ హ వావ తవ మహిమామృతరససముద్రవిప్రుషా సకృదవలీఢయా స్వమనసి
నిష్యన్దమానానవరతసుఖేన విస్మారితదృష్టశ్రుతవిషయసుఖలేశాభాసాః పరమభాగవతా ఏకాన్తినో
భగవతి సర్వభూతప్రియసుహృది సర్వాత్మని నితరాం నిరన్తరం నిర్వృతమనసః కథము హ వా ఏతే
మధుమథన పునః స్వార్థకుశలా హ్యాత్మప్రియసుహృదః సాధవస్త్వచ్చరణామ్బుజానుసేవాం విసృజన్తి న యత్ర
పునరయం సంసారపర్యావర్తః

పరమాత్మ మహిమ ఒక పెద్ద రసామృతం. మనం ఆ అమృతమనే ఒక మహాసముద్రములో ఒక చిన్న తుంపర తాగితే అన్ని మరచి అపరిమితానందములో మునుగుతాము. అప్పటిదాకా ఉన్న ప్రాపంచిక సుఖ దు@ఖాలను మరచిపోతాము. అలాంటి వారు పరమభక్తులు, పరమ భాగవతులు. సర్వభూత మిత్రుడైన పరమాత్మ  యందు మాత్రమే వారు ఆనందం పొందుతారు.  నీ పాద పద్మాల సేవ లభించిన వారు, మళ్ళీ దాన్ని విడిచిపెట్టి ఈ సంసారములో ఎలా పడతారు. అటువంటి వారు మళ్ళీ పుట్టరు.

త్రిభువనాత్మభవన త్రివిక్రమ త్రినయన త్రిలోకమనోహరానుభావ తవైవ విభూతయో
దితిజదనుజాదయశ్చాపి తేషాముపక్రమసమయోऽయమితి స్వాత్మమాయయా
సురనరమృగమిశ్రితజలచరాకృతిభిర్యథాపరాధం దణ్డం దణ్డధర దధర్థ ఏవమేనమపి భగవన్జహి
త్వాష్ట్రముత యది మన్యసే

మూడు లోకములూ నీకు నివాసం. నీవు త్రివిక్రముడివి. మూడు లోకాల మనసునీ హరిస్తావు. దేవతలూ దానవులూ మానవులూ మృగములూ పక్షులూ నీ విభూతులే. అందరిలో నీవు ఉన్నావు, అన్ని రూపాలలో ఉన్నావు, అన్ని రూపాలలో వస్తావు. తప్పు చేసిన వారే రూపములో ఉంటే నీవారూపములోనే వచ్చి శిక్షిస్తావు.మరి ఏ రూపములో ఉన్న వారిని ఆ రూపములో దండిస్తావు కదా, ఈ వృత్తాసురున్ని కూడా నీవు తలచుకుంటే ఇతన్ని దండించు. 

అస్మాకం తావకానాం తతతత నతానాం హరే తవ
చరణనలినయుగలధ్యానానుబద్ధహృదయనిగడానాం
స్వలిఙ్గవివరణేనాత్మసాత్కృతానామనుకమ్పానురఞ్జితవిశదరుచిరశిశిరస్మితావలోకేన
విగలితమధురముఖరసామృతకలయా చాన్తస్తాపమనఘార్హసి శమయితుమ్


మేము నీ భక్తులమూ నిన్ను ఆశ్రయించి నీ పాదపద్మముల ధ్యానముతో ఉంటాము. దయతో నీ చిరునవ్వు మా మీద ప్రసరింప్చేసి. అన్ని ఆపదలూ తొలగించి మకరందం యొక్క అమృతాన్ని మా మీద చిలికి మా సంతాపాన్ని తొలగించడానికి నీవే సమర్ధుడవు 

అథ భగవంస్తవాస్మాభిరఖిలజగదుత్పత్తిస్థితిలయనిమిత్తాయమానదివ్యమాయావినోదస్య
సకలజీవనికాయానామన్తర్హృదయేషు బహిరపి చ బ్రహ్మప్రత్యగాత్మస్వరూపేణ ప్రధానరూపేణ చ
యథాదేశకాలదేహావస్థానవిశేషం తదుపాదానోపలమ్భకతయానుభవతః సర్వప్రత్యయసాక్షిణ
ఆకాశశరీరస్య సాక్షాత్పరబ్రహ్మణః పరమాత్మనః కియానిహ వార్థవిశేషో విజ్ఞాపనీయః
స్యాద్విస్ఫులిఙ్గాదిభిరివ హిరణ్యరేతసః

సకల జగత్తునీ ఆటగా సృష్టించి సంహరించి రక్షిస్తావు. అన్ని ప్రాణుల లోపలా బయటా ఉంటావు. పరమాత్మ జీవాత్మ ప్రకృతి రూపముగా ఆయా దేశ కాల శరీరములలో ఉంటూ ఆ వస్తువుగా నీవుంటావు, ఆ వస్తువుకు కారణముగా కూడా ఉంటావు. అన్ని అనుభూతులకూ నీవే సాక్షి. మా దహరాకాశములో ఉన్నావు. అందరిలో ఉండి అందరితో అన్ని పనులూ చేయించేవాడికి మాకీ ఆపద వచ్చింది అని చెప్పవలసిన పని ఏముంది. నిప్పు రవ్వలు "మేమొచ్చాము" అని అగ్నిహోత్రులకు వేరే చెప్పాలా.

అత ఏవ స్వయం తదుపకల్పయాస్మాకం భగవతః పరమగురోస్తవ చరణశతపలాశచ్ఛాయాం
వివిధవృజినసంసారపరిశ్రమోపశమనీముపసృతానాం వయం యత్కామేనోపసాదితాః

నిరంతరం నీ పాదములనే శరణు వేడిన మాకు సంసారము వలన కలిగే శ్రమను ఉపశమించి దేన్ని కోరి నీ దగ్గరకు చేరామో అది నెర్వేర్చవలసినది. 

అథో ఈశ జహి త్వాష్ట్రం గ్రసన్తం భువనత్రయమ్

గ్రస్తాని యేన నః కృష్ణ తేజాంస్యస్త్రాయుధాని చ

హంసాయ దహ్రనిలయాయ నిరీక్షకాయ కృష్ణాయ మృష్టయశసే నిరుపక్రమాయ
సత్సఙ్గ్రహాయ భవపాన్థనిజాశ్రమాప్తావన్తే పరీష్టగతయే హరయే నమస్తే

మూడు లోకములనూ మింగేస్తున్న వృత్తాసురున్ని వధించు నీవు పరమ హంసవు, దహరాకాశములో ఉండేవాడివీ సర్వసాక్షివి, అపరిమిత ఆనంద స్వరూపుడివి  అందరిలో ఉండేవాడివి సర్వ సాక్షివి, వృద్ధి పొందిన కీర్తిగల వాడివి, ఆది లేని వాడివి, సజ్జనులను కాపాడేవాడు, సంసారములో నడిచినందు వలన కలిగిన శ్రమను తొలగించేవాడివి

శ్రీశుక ఉవాచ
అథైవమీడితో రాజన్సాదరం త్రిదశైర్హరిః
స్వముపస్థానమాకర్ణ్య ప్రాహ తానభినన్దితః

వారి ప్రార్థనను చూసి నవ్వి అభినందించి, మీ స్తోత్రముతో నేను ప్రీతి చెందాను. ఆపద వచ్చినప్పుడు మాత్రమే నేను జ్ఞ్యాపకం వస్తాను. భక్తులు మాత్రమే నా స్థితిని కనుక్కోగలరు

శ్రీభగవానువాచ
ప్రీతోऽహం వః సురశ్రేష్ఠా మదుపస్థానవిద్యయా
ఆత్మైశ్వర్యస్మృతిః పుంసాం భక్తిశ్చైవ యయా మయి

కిం దురాపం మయి ప్రీతే తథాపి విబుధర్షభాః
మయ్యేకాన్తమతిర్నాన్యన్మత్తో వాఞ్ఛతి తత్త్వవిత్

న వేద కృపణః శ్రేయ ఆత్మనో గుణవస్తుదృక్
తస్య తానిచ్ఛతో యచ్ఛేద్యది సోऽపి తథావిధః

నేను ప్రీతి చెందితే లభించరానిది అంటూ ఏదీ ఉండదు. తత్వం తెలిసినవాడెవడూ నా కంటే వేరే వాటిని కోరడు. ఆపదలతో కొట్టబడిన దీనుడు , అజ్ఞ్యానికి తనకు ఏది మేలు కలిగిస్తుందో తెలియడు, ఎదురుగా ఉన్న గుణాలను (భార్యలనూ బంగారన్ని) చూస్తాడు. నన్ను చూడడు

స్వయం నిఃశ్రేయసం విద్వాన్న వక్త్యజ్ఞాయ కర్మ హి
న రాతి రోగిణోऽపథ్యం వాఞ్ఛతోऽపి భిషక్తమః

తన శ్రేయస్సు ఏదో తెలియని వాడికి అడిగింది ఇస్తే ఇచ్చిన వాడు కూడా తెలియని వాడే అవుతాడు. ఏది హితమునూ మేలునూ కలిగిస్తుందో తెలిసిన వాడు తెలియని వాడికి దుఃఖాన్ని ఇచ్చే కర్మను చేయమని చెబుతాడా 

మఘవన్యాత భద్రం వో దధ్యఞ్చమృషిసత్తమమ్
విద్యావ్రతతపఃసారం గాత్రం యాచత మా చిరమ్

స వా అధిగతో దధ్యఙ్ఙశ్విభ్యాం బ్రహ్మ నిష్కలమ్
యద్వా అశ్వశిరో నామ తయోరమరతాం వ్యధాత్

దధ్యఙ్ఙాథర్వణస్త్వష్ట్రే వర్మాభేద్యం మదాత్మకమ్
విశ్వరూపాయ యత్ప్రాదాత్త్వష్టా యత్త్వమధాస్తతః

రోగి ఎప్పుడూ అపథ్యమే కోరతాడు. రోగి కోరినా వైద్యుడు అపథ్యాన్ని  ఇస్తాడా. అజ్ఞ్యాని కోరినా జ్ఞ్యాని కోరికలను ఇవ్వడు. మీరడగకుండానే నేను మీకు కోరికను తీరుస్తాను. మీరు ధధీచి మహర్షి వద్దకు వెళ్ళి అతని విద్యా వ్రతం తపస్సు నిండి ఉన్న అతని శరీరాన్ని కోరండి. ఈయనే అశ్వనీ దేవతలకు హయశీర్ష వేషములో హయగ్రీవ బ్రహ్మ విద్యను బోధించాడు. అయాన అధర్వ వంశం వాడు. ఆయనే విశ్వరూపునికీ త్వష్టకూ నా (నారాయణ కవచం) కవచం ఇచ్చాడు. అందుకే అతని కొడుకైన వృత్తాసురునికీ వచ్చింది. అందుకే ఎవరి వలన ఈ విద్య వచ్చిందో ఆ ధధీచినే ఆశ్రయించండి. ధధీచి శరీరం అంతా నారాయణ కవచమే ఉంది.  నారాయణ కవచమే నారాయణ కవచాన్ని ఎదుర్కోగలదు. 

యుష్మభ్యం యాచితోऽశ్విభ్యాం ధర్మజ్ఞోऽఙ్గాని దాస్యతి
తతస్తైరాయుధశ్రేష్ఠో విశ్వకర్మవినిర్మితః
యేన వృత్రశిరో హర్తా మత్తేజౌపబృంహితః

శిష్యులైన అశ్వనీ దేవతలడిగితే ధధీచి తన శరీరాన్ని ఇస్తాడు. దానితో విశ్వకర్మ అత్యుత్తమమైన ఆయుధం నిర్మిస్తాడు. ఆ ఆయుధం తీసుకుని, ఆ ఆయుధములో నా తేజస్సును నేను పెట్టాక, ఇంద్రుడు వృత్తాసురున్ని సంహరిస్తాడు. అప్పుడు అతను మింగిన మీ మీ తేజస్సును పొందుతారు. 

తస్మిన్వినిహతే యూయం తేజోऽస్త్రాయుధసమ్పదః
భూయః ప్రాప్స్యథ భద్రం వో న హింసన్తి చ మత్పరాన్

నా భక్తులెవరూ నా భక్తులను హింసించరు

Popular Posts