Followers

Sunday 2 March 2014

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ఇరవై ఏడవ అధ్యాయం

నారద ఉవాచ
ఇత్థం పురఞ్జనం సధ్ర్యగ్వశమానీయ విభ్రమైః
పురఞ్జనీ మహారాజ రేమే రమయతీ పతిమ్

ఆ ప్రియురాలు అలుక పేరుతో ప్రియుణ్ణి వశం చేసుకుంది. ఇలా భర్తను రమింపచేస్తూ తాను కూడా ఆనందించింది

స రాజా మహిషీం రాజన్సుస్నాతాం రుచిరాననామ్
కృతస్వస్త్యయనాం తృప్తామభ్యనన్దదుపాగతామ్

ప్రియురాలు ప్రసన్నురాలవడముతో రాజు కూడా అభినందించాడు.

తయోపగూఢః పరిరబ్ధకన్ధరో రహోऽనుమన్త్రైరపకృష్టచేతనః
న కాలరంహో బుబుధే దురత్యయం దివా నిశేతి ప్రమదాపరిగ్రహః

ఇలా ప్రియురాలితో కలిసి అన్ని రకముల భోగములు అనుభవించాడు. మెల్లగా చెవిలో చెప్పే మాటలతో మనసు ఆమె వశం చేసి ఉన్న జ్ఞ్యానము వదిలిపెట్టి ఎంత కాలము జరిగిందో తెలుసుకోలేకపోయాడు. దురత్యయమైన కాలమును మనం అందుకోలేము.

శయాన ఉన్నద్ధమదో మహామనా మహార్హతల్పే మహిషీభుజోపధిః
తామేవ వీరో మనుతే పరం యతస్తమోऽభిభూతో న నిజం పరం చ యత్

బాగా మదించినవాడై భోగాలను అనుభవించినవాడై భార్య యొక్క  భుజమును దిండుగా ఉంచుకొని "ఇంతకంటే నేను పొందవలసినది ఏదీ లేదు " అని అజ్ఞ్యానం బాగా ఆవరించి తానేమిటి ఇతరులేమిటీ ఏమి జరగాలి అని తెలియలేకుండా ఐపోయాడు.

తయైవం రమమాణస్య కామకశ్మలచేతసః
క్షణార్ధమివ రాజేన్ద్ర వ్యతిక్రాన్తం నవం వయః

ఆశ కోరిక అనేవాటితో మనసంతా మురికై ఒక అరక్షణములా తన వయసంతా కరిగిపోయింది.

తస్యామజనయత్పుత్రాన్పురఞ్జన్యాం పురఞ్జనః
శతాన్యేకాదశ విరాడాయుషోऽర్ధమథాత్యగాత్

ఇతనికీ ఆమెకూ పదకొండు వందల మంది పుత్రులు కలిగారు. (5 జ్ఞ్యానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు మనసు, ఒక్కో దానికి వంద ప్రవృత్తులు . అంటే బుద్ధితో జీవునికి ఇంత ఆలోచనలోస్తాయి) . ఈ సంతానముతో తన ఆయుష్షు సగం ఐపోయింది.

దుహితౄర్దశోత్తరశతం పితృమాతృయశస్కరీః
శీలౌదార్యగుణోపేతాః పౌరఞ్జన్యః ప్రజాపతే

నూటపది మంది కూతురులు , తండ్రికీ తల్లికీ కీర్తిని పెంచే కూతురులు, శీలము ఔదార్యమూ కలిగిన కుమార్తెలు కలిగారు.

స పఞ్చాలపతిః పుత్రాన్పితృవంశవివర్ధనాన్
దారైః సంయోజయామాస దుహితౄః సదృశైర్వరైః

ఇలా వారు పెద్దవారైన తరువాత పుత్రులకి తగిన అమ్మాయిలతో, కూతురులకు కూడా తగిన వరుళ్ళను చూసి పెళ్ళి చేసాడు.

పుత్రాణాం చాభవన్పుత్రా ఏకైకస్య శతం శతమ్
యైర్వై పౌరఞ్జనో వంశః పఞ్చాలేషు సమేధితః

రాజ్యం మొత్తం పుత్రులు పౌత్రులతో నిండిపోయింది.

తేషు తద్రిక్థహారేషు గృహకోశానుజీవిషు
నిరూఢేన మమత్వేన విషయేష్వన్వబధ్యత

ఎవరి భాగాలు వారు స్వీకరించారు. ఇళ్ళనీ ధనములనీ సేవకులనీ పంచుకున్నారు. పిల్లలు ఆస్తి గుంజుకున్నా మమకారముతో వాళ్ళేమి చేస్తున్నారో గుర్తించలేనంత అజ్ఞ్యానములో ఉన్నాడు.

ఈజే చ క్రతుభిర్ఘోరైర్దీక్షితః పశుమారకైః
దేవాన్పితౄన్భూతపతీన్నానాకామో యథా భవాన్

ఇవన్నీ సంపాధించడానికి కౄరమైన యజ్ఞ్యాలను చేసాడు. భూతములను హింసిస్తూ యజ్ఞ్యాలను చేసాడు. తాను ఎన్నో కోరుకుంటూ పశువులను బలి ఇస్తూ తనకు కావాలసిన కోరికలను తీర్చుకునేందుకు యజ్ఞ్యములు చేసాడు.

యుక్తేష్వేవం ప్రమత్తస్య కుటుమ్బాసక్తచేతసః
ఆససాద స వై కాలో యోऽప్రియః ప్రియయోషితామ్

ఇలా రాజ్యం పరిపాలించాడు యజ్ఞ్యములు చేసాడు పుత్రులకీ పౌత్రులకీ భాగం ఇచ్చాడు. అంతా నేనే, ఇంక నాకు దిగులేముంది అనుకుంటున్న దశలో నేను అనుకోవడానికి కూడా శక్తి లేని కాలము వచ్చింది. తమకు ప్రియురాలుగా ఉండేవారికి ఏది నచ్చదో అది వచ్చింది. యువతులకు నచ్చని వార్ధక్యం వచ్చింది.

చణ్డవేగ ఇతి ఖ్యాతో గన్ధర్వాధిపతిర్నృప
గన్ధర్వాస్తస్య బలినః షష్ట్యుత్తరశతత్రయమ్


చండవేగుడనే గంధర్వాధిపతి ఇతని రాజ్యాన్ని చూచాడు. ఇతనికి మూడు వందల ఆరు మంది, వారి భార్యలు ఇంకో మూడు వందల అరవై మంది (చండవేగుడంటే కాలం. కాలాన్ని సంవత్సరాలు గుర్తు. దానికి మూడు వందల అరవై మగవారు సైన్యం, వారి భార్యలు ఇంకో మూడు వందల అరవై అమంది. వీరిలో కొందరు తెల్లగా ఉన్నారు, కొందరు నల్లగా ఉన్నారు. అంటే మూడ్వందల అరవై పగళ్ళూ రాత్రులూ.)

గన్ధర్వ్యస్తాదృశీరస్య మైథున్యశ్చ సితాసితాః
పరివృత్త్యా విలుమ్పన్తి సర్వకామవినిర్మితామ్

వారి పత్నులు కూడా అలాంటి వారే. తెలుపు వారు నలుపు వారు. (రాత్రులూ పగళ్ళు) భ్రమణముతో అన్ని కోరికలూ తీరడానికి కావలసిన ఏర్పాటుతో ఈ ఏడువందల ఇరవై మందీ తిరుగుతూ తిరుగుతూ మోహింపచేస్తారు (ఒక్కో రోజు గడుస్తున్న కొద్దీ మన శరీరములో ఉన్న అన్ని శక్తులూ క్షీణిస్తూ ఉంటాయి). అది అన్ని కామనలనూ తీర్చుకోవడానికి సౌకర్యముగా నిర్మించబడిన నగరం.

తే చణ్డవేగానుచరాః పురఞ్జనపురం యదా
హర్తుమారేభిరే తత్ర ప్రత్యషేధత్ప్రజాగరః

ఈ గంధర్వులు నగరాన్ని చుట్టుముట్టి నగరాన్ని హరించడానికి ఆకరమించడానికి వచ్చారు. వారి ప్రయత్నం వారు చేస్తూ ఉంటే ఆ నగరానికి ఉన్న నిత్యమూ మేలుకొని ఉన్న కాపలాదారుడు ఆ చండవేగుని అనుచరులను అరికట్టాడు. (ప్రాణము, ప్రాణము బలీయముగా ఉన్నంత వరకూ వ్యాధులు ఏమీ చేయలేవు)

స సప్తభిః శతైరేకో వింశత్యా చ శతం సమాః
పురఞ్జనపురాధ్యక్షో గన్ధర్వైర్యుయుధే బలీ

ఏడువందల ఇరవై ఒక్క మంది సైన్యముతో పోట్లాడాడు.  ఇరవై ఏడుతో - 5 తన్మాత్రలు 5 భూతములు 5 జ్ఞ్యానేంద్రియములూ 5 కర్మేంద్రియములూ అపాన వ్యాన ఉదాన సమానములూ బుద్ధి మనసు అహంకారము, ఇవన్నీ కలిపిన్ ఇరవై ఏడు. సప్తవింశతి) ఇరవై ఏడింటిని ముందు పెట్టుకుని ప్రాణం కోట్లాడింది. ప్రాణం ఈ సైన్యాన్ని పెట్టుకుని ఆ సైన్యముతో నూరు సంవత్సరాలు కోట్లాడింది. గంధర్వులంటే మాయావులు. కనపడకుండానే అన్ని పనులూ చేసేవారు.

క్షీయమాణే స్వసమ్బన్ధే ఏకస్మిన్బహుభిర్యుధా
చిన్తాం పరాం జగామార్తః సరాష్ట్రపురబాన్ధవః

ఇలా యుద్ధం చేస్తోన్న కొద్దీ తన బలం తగ్గిపోతోంది. వారు యుద్ధం చేస్తూ ప్రాణాన్ని ఏమి చేయకుండా తక్కిన వాటిని హింసిస్తున్నారు. చాలా మందితో యుద్ధము చేయడం వలన తనకు సంబంధించినవారంతా పోతూంటే పురంజనుడు (జీవుడు) చింతాక్రాంతుడయ్యాడు. శరీరమూ మనసూ ఇంద్రియమూ చిత్తమూ మొదలైనవన్నీ కలిసి ఏ నగరములో ఆనందాన్ని అనుభవించాడో

స ఏవ పుర్యాం మధుభుక్పఞ్చాలేషు స్వపార్షదైః
ఉపనీతం బలిం గృహ్ణన్స్త్రీజితో నావిదద్భయమ్

తన సేవకులు అందించిన సేవను ఇంతవరకూ స్వీకరించాడు. బుద్ధికి లొంగాడు. (బుద్ధిమంతుడు చిత్తానికి లొంగాలి, బుద్ధికి కాదు.  బుద్ధిలో ఉన్నది విచారాత్మకం మాత్రమే. అదా ఇదా అని పరిశీలించడమే బుద్ధి చేసే పని) అలా లొంగడం వలన రాబోయే భయాన్ని తెలుసుకోలేకపోయాడు

కాలస్య దుహితా కాచిత్త్రిలోకీం వరమిచ్ఛతీ
పర్యటన్తీ న బర్హిష్మన్ప్రత్యనన్దత కశ్చన

ఇంతలో కాలుని పుత్రిక జరా వచ్చింది. ఆమె తనకనుగుణమైన భర్తను సంపాదించాలని వెతుకుతున్నదీ. ఆ అమ్మాయిని ఎవరూ వరించలేదు (జరా అంటే ముసలితనం)

దౌర్భాగ్యేనాత్మనో లోకే విశ్రుతా దుర్భగేతి సా
యా తుష్టా రాజర్షయే తు వృతాదాత్పూరవే వరమ్

యయాతి కొడుకైన పూరువనే వాడు ఆమెను వరించాడు. అతనికి ఆమె వరమిచ్చింది.

కదాచిదటమానా సా బ్రహ్మలోకాన్మహీం గతమ్
వవ్రే బృహద్వ్రతం మాం తు జానతీ కామమోహితా

ఇలా అన్ని లోకాలు తిరుగుతూ నన్ను చూఇన్సింది. బృహద్వ్రతుడనైన నా (నారదున్ని) గురించి తెలుసుకుని నన్ను వరించడానికి వచ్చింది. నేను ఒప్పుకోలేదు. కోపమొచ్చి నన్ను శపించింది

మయి సంరభ్య విపుల మదాచ్ఛాపం సుదుఃసహమ్
స్థాతుమర్హసి నైకత్ర మద్యాచ్ఞావిముఖో మునే

నా మాట ఒప్పుకోలేదు కాబట్టి నీవు నిలకడగా ఒక చోట ఉండకుందువు గాక. అని శపించింది.

తతో విహతసఙ్కల్పా కన్యకా యవనేశ్వరమ్
మయోపదిష్టమాసాద్య వవ్రే నామ్నా భయం పతిమ్

శపించినా నేను ఆమెకు తగిన వరున్ని చూపాను. అతని పేరు భయం (మృత్యువు). 

ఋషభం యవనానాం త్వాం వృణే వీరేప్సితం పతిమ్
సఙ్కల్పస్త్వయి భూతానాం కృతః కిల న రిష్యతి

ఆమె అక్కడికి వెళ్ళింది. "నిన్ను నేను భర్తగా వరిస్తున్నాను" అని చెప్పింది

ద్వావిమావనుశోచన్తి బాలావసదవగ్రహౌ
యల్లోకశాస్త్రోపనతం న రాతి న తదిచ్ఛతి

వీరిద్దరూ బాలురు (అవివేకులు). పరిశుద్ధ జ్ఞ్యానం లేని వారు. "మనిద్దరం కలిస్తే ఇంక మనకు ఎదురు ఉండదు" అని చెప్పింది. 

అథో భజస్వ మాం భద్ర భజన్తీం మే దయాం కురు
ఏతావాన్పౌరుషో ధర్మో యదార్తాననుకమ్పతే

"ఉత్తముడైన పురుషుడి ధర్మమే బాధ పడుతున్నవరిని దయ చూపుట" అని అడిగింది

కాలకన్యోదితవచో నిశమ్య యవనేశ్వరః
చికీర్షుర్దేవగుహ్యం స సస్మితం తామభాషత

ఆమె మాట విని దేవతా రహస్యాన్ని కాపాడదలచి చిరునవ్వుతో ఇలా అన్నాడు. మనిద్దరం కలిసి పని చేయడం కుదరదు. ముందు నీవు తరువాత నేను వస్తాను

మయా నిరూపితస్తుభ్యం పతిరాత్మసమాధినా
నాభినన్దతి లోకోऽయం త్వామభద్రామసమ్మతామ్

నీకు ఉత్తముడైన పతిని ఏర్పాటు చేసాను. నీవు అమంగళకరురాలవు. నిన్నెవరూ అభినందించరు

త్వమవ్యక్తగతిర్భుఙ్క్ష్వ లోకం కర్మవినిర్మితమ్
యా హి మే పృతనాయుక్తా ప్రజానాశం ప్రణేష్యసి

ఈ లోకమంతా నీవనుభవించు. నా సైన్యాన్ని (పగలూ రాత్రీ) నీకు ఇస్తాను. దానితో నీవు ప్రజలందరినీ నశింపచేస్తావు.

ప్రజ్వారోऽయం మమ భ్రాతా త్వం చ మే భగినీ భవ
చరామ్యుభాభ్యాం లోకేऽస్మిన్నవ్యక్తో భీమసైనికః

ప్రజ్వరుడనే నా తమ్ముడు ఉన్నాడు (పుట్టగానే రోగాలూ జరా మృత్యువూ వస్తాయి). వాడు నాకు సోదరుడూ నీవు సోదరివి. మన ముగ్గురమూ లోకాలను అనుభవిద్దాము. మీరు తోడుగా ఉంటే ఎవరికీ తెలియకుండా సిన్యముతో కలిసి లోకమంతా విహరిస్తూ ఉంటాను.

Popular Posts