Followers

Saturday 1 March 2014

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ఇరవై నాలగవ అధ్యాయం



మైత్రేయ ఉవాచ
విజితాశ్వోऽధిరాజాసీత్పృథుపుత్రః పృథుశ్రవాః
యవీయోభ్యోऽదదాత్కాష్ఠా భ్రాతృభ్యో భ్రాతృవత్సలః

పృధు చక్రవర్తి మోక్షానికి వెళ్ళడముతో అతని కుమారుడు విజితాశ్వుడు రాజయ్యాడు. అతను గొప్ప కీర్తి కలవాడు. చక్రవర్తి అయిన తరువాత ఇంకా తమ్ములు ఉన్నారు కాబట్టి ఆ నలుగురికీ రాజ్యములో భాగాలిచ్చాడు.

హర్యక్షాయాదిశత్ప్రాచీం ధూమ్రకేశాయ దక్షిణామ్
ప్రతీచీం వృకసంజ్ఞాయ తుర్యాం ద్రవిణసే విభుః

తూర్పు దిక్కును హర్య్క్షునికీ ధూమ్రకేశునికి దక్షిణ ప్రతీచునికి పశ్చిమం ఉత్తర దిక్కు ద్రవిణునికి

అన్తర్ధానగతిం శక్రాల్లబ్ధ్వాన్తర్ధానసంజ్ఞితః
అపత్యత్రయమాధత్త శిఖణ్డిన్యాం సుసమ్మతమ్

ఇంద్రుని వలన విజితాశ్వుడు అంతర్ధాన శక్తిని తెచ్చుకుని. శిఖండిని అన్న భార్య యందు ముగ్గురు పుత్రులు

పావకః పవమానశ్చ శుచిరిత్యగ్నయః పురా
వసిష్ఠశాపాదుత్పన్నాః పునర్యోగగతిం గతాః

పావక పవమాన శుచిః ఈ మూడూ అగ్నులు వశిష్టుని శాపము వలన (హవిస్సును తీసుకోవడములో క్రమము తప్పడము వలన క్రమము తప్పేవారిగా, మానవులుగా పుట్టమని శపించాడు) మానవులుగా పుట్టి యోగమార్గాన్ని అవలంబించి స్వస్థిని పొందారు

అన్తర్ధానో నభస్వత్యాం హవిర్ధానమవిన్దత
య ఇన్ద్రమశ్వహర్తారం విద్వానపి న జఘ్నివాన్

నభస్వతి అన్న భార్య యందు హవిర్ధానుడనే కుమారుడు పుట్టాడు. తన గుర్రాన్ని హరించిన ఇంద్రుని చూచి కూడా హాని కలిగించకుండా విడిచిపెట్టాడు కాబట్టి ఆ పేరును బిరుదుగా పొందాడు

రాజ్ఞాం వృత్తిం కరాదాన దణ్డశుల్కాదిదారుణామ్
మన్యమానో దీర్ఘసత్త్ర వ్యాజేన విససర్జ హ

అంతర్ధానుడు కూడా రాజ్యపరిపాలన పాప భూయిస్ఠము (పన్నులు వసూలు చేయాలి, శిక్షించాలి, బహిష్కరించాలి, జరిమానా విధించాలి,) అని దాన్ని వదిలిపెట్టి నదీ తీరములోకి వెళ్ళి దీర్ఘ సత్రం చేసాడు. రాజ్యం మీద విరక్తి కలిగి సత్రం ప్రారంభించాడు

తత్రాపి హంసం పురుషం పరమాత్మానమాత్మదృక్
యజంస్తల్లోకతామాప కుశలేన సమాధినా

దీర్ఘ సత్రం ఆచరిస్తూ కూడా ఆత్మ ధృక్ (ఆత్మసాక్షాత్కారాన్ని పొదిన వాడు) అయి, హంస అయిన పరమాత్మను (హంస అంటే సంసారాన్ని తొలగించేవాడు, సంసారములో ఉన్న మురికిని తీసేసేవాడు )పురుషుడైన (అందరి శరీరములో ఉన్న) పరమాత్మ అయిన వాడిని పూజిస్తూ హవిస్సునిస్తూ పరమ కుశలమైన సమాధి మార్గములో వైఖుంఠాన్ని చేరాడు

హవిర్ధానాద్ధవిర్ధానీ విదురాసూత షట్సుతాన్
బర్హిషదం గయం శుక్లం కృష్ణం సత్యం జితవ్రతమ్

హవిర్ధానుడికి ఆరుగురు కుమారులు.

బర్హిషత్సుమహాభాగో హావిర్ధానిః ప్రజాపతిః
క్రియాకాణ్డేషు నిష్ణాతో యోగేషు చ కురూద్వహ

బరిషత్ (దర్భలను పరిచినవాడు ) హవిర్ధాని యొక్క పుత్రుడు, యోగములో దిట్ట, యాగాదులు బాగా తెలిసినవాడు

యస్యేదం దేవయజనమనుయజ్ఞం వితన్వతః
ప్రాచీనాగ్రైః కుశైరాసీదాస్తృతం వసుధాతలమ్

యజ్ఞ్యముల ద్వారా పరమాత్మ ఆరాధన చేస్తున్న ఇతనికి సకల భూమండలము ప్రాచీనాగ్రమైనది (తూర్పు అగ్రముగా పరచబడింది). పుణ్యక్షేత్రం పుణ్యారణ్యమూ పుణ్యతీర్థములో దర్భలతో నింపేశాడు

సాముద్రీం దేవదేవోక్తాముపయేమే శతద్రుతిమ్
యాం వీక్ష్య చారుసర్వాఙ్గీం కిశోరీం సుష్ఠ్వలఙ్కృతామ్
పరిక్రమన్తీముద్వాహే చకమేऽగ్నిః శుకీమివ

సముద్రుని పుత్రిక శతద్రుతి ఇతని భార్య. ఆమెను వివాహం చేసుకున్నప్పుడు, అగ్నిహోత్రునికి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఆమె సౌందర్యము చూసి అగ్నిహోత్రుడు ఆమెను అభిలషించాడు (సప్తర్షులు యజ్ఞ్యం నిర్వహించినపుడు ఋషులు వారి భార్యలతో ప్రదక్షిణం చేసినపుడు అగ్నిహోత్రుడు వారిమీద వ్యామోహపడ్డాడు. ఆ వేదనతో అగ్నిహోత్రుడు చిక్కిపోయి, హవిస్సులను కూడా తీసుకోవట్లేదు. అది గమనించిన భార్య ఆయా భార్యల రూపములో వ్యవహరించింది. అగ్నిహోత్రుడు తృప్తి పడ్డాడు. ఋషులు ఆ విషయం తెలియక తమ భార్యలనూ అగ్నిహోత్రునీ శపించాడు. అగ్నిహోత్రుని భార్య నచ్చజెప్పడం వలన ఋషులు శాపాన్ని ఉపసంహరించారు. అప్పటినుంచీ భార్యాభర్తలు ప్రదక్షిణం చేస్తుంటే అగ్నిహోత్రునికి కళ్ళు కనపడకుండా ఉండాలన్న శాపమిచ్చారు. ఈ విషయం శంకరుడు స్కాంధ పురాణములో చెప్పాడు. అగ్నీ వాయువూ శంకరుని అంశలే. అందుకే కుమారస్వామి ఆరుగురి నుంచి జన్మించాడు: భూమి, భూమి భరించలేకపోతే అగ్ని, వాయువు, నీరు, శంకరుడు ఇలా ఆరుగురినుంచి షడ్యః అని కుమారస్వామి పుట్టాడు. అందుకే కృత్తికలు ఆరుగురు వచ్చారు. కుమారస్వామి అగ్ని పుత్రుడయ్యాడు. అలాగే హనుమంతుడు వాయు పుత్రుడు. అగ్నీ వాయువూ శంకరుడూ ఒకరే.  )
అలాగే ఇక్కడ కూడా అంత పరిశుద్ధుడైన అగ్నిహోత్రుడు కూడా మోహించేంత సౌందర్యవంతురాలు

విబుధాసురగన్ధర్వ మునిసిద్ధనరోరగాః
విజితాః సూర్యయా దిక్షు క్వణయన్త్యైవ నూపురైః

వీఎరంతా ఆమె నడకను చూచి మూర్చపోయారు.

ప్రాచీనబర్హిషః పుత్రాః శతద్రుత్యాం దశాభవన్
తుల్యనామవ్రతాః సర్వే ధర్మస్నాతాః ప్రచేతసః

శతద్రుతికీ ప్రాచీన బర్హికీ పదిమంది పుట్టారు. వీరందరికీ ఒకటే పేరు - ప్రాచేతసులు (ఈ పదిమందికీ ఒకే భార్య). వీరంతా ధర్మాచరణతో పరిశుద్ధులు

పిత్రాదిష్టాః ప్రజాసర్గే తపసేऽర్ణవమావిశన్
దశవర్షసహస్రాణి తపసార్చంస్తపస్పతిమ్

భార్యకోసమని తపించమని తండ్రి ఆజ్ఞ్యాపిస్తే తపస్సుకోసం సముద్ర ప్రాంతానికి వెళ్ళారు. పరమాత్మను పదివేల సంవత్సరాలు తపస్సుచే ఆరాధించాలని వెళ్ళారు

యదుక్తం పథి దృష్టేన గిరిశేన ప్రసీదతా
తద్ధ్యాయన్తో జపన్తశ్చ పూజయన్తశ్చ సంయతాః

మంత్రమేదీ లేకుండా తపస్సుకోసం వెళుతున్నారని శంకరుడు దయతలచి వారికి మంత్రముపదేశించాడు.

విదుర ఉవాచ
ప్రచేతసాం గిరిత్రేణ యథాసీత్పథి సఙ్గమః
యదుతాహ హరః ప్రీతస్తన్నో బ్రహ్మన్వదార్థవత్

దారిలో ప్రచేతసులకి శంకరునితో కలయిక ఎలా జరిగింది. ఆయన ప్రత్యక్షం కావాలని వీరు కోరారా? లేక శంకరుడే ప్రసన్నుడయ్యాడా.

సఙ్గమః ఖలు విప్రర్షే శివేనేహ శరీరిణామ్
దుర్లభో మునయో దధ్యురసఙ్గాద్యమభీప్సితమ్

శరీరం పొందినవాడికి శంకరునితో సమాగమం దుర్లభము. ఆయనను దర్శించాలని మునులందరూ ధ్యానము చేసి కూడా పొందలేకపోయారు. అలాంటి దర్శనం వీరెలాపొందారు

ఆత్మారామోऽపి యస్త్వస్య లోకకల్పస్య రాధసే
శక్త్యా యుక్తో విచరతి ఘోరయా భగవాన్భవః

ఆయన ఆత్మారాముడు, లోకకళ్యానం కొరకు అమ్మవారితో కలిసి సంచరిస్తూ ఉంటాడు.

మైత్రేయ ఉవాచ
ప్రచేతసః పితుర్వాక్యం శిరసాదాయ సాధవః
దిశం ప్రతీచీం ప్రయయుస్తపస్యాదృతచేతసః

తండ్రిమాటను పాలించి సాధువులై తపస్సు యందు మనసు లగ్నం చేసి పశ్చిమదిక్కుకు బయలుదేరారు.

ససముద్రముప విస్తీర్ణమపశ్యన్సుమహత్సరః
మహన్మన ఇవ స్వచ్ఛం ప్రసన్నసలిలాశయమ్

అలా వెళుతున్నవారికి సముద్రము దగ్గర విశాలమైన సరస్సు కనిపించింది. చాలా గొప్ప సరస్సు, మత్స్యాదులతో శోభిస్తోంది. మహానుభావుల మనస్సు వలె స్వచ్చముగా ఉంది.

నీలరక్తోత్పలామ్భోజ కహ్లారేన్దీవరాకరమ్
హంససారసచక్రాహ్వ కారణ్డవనికూజితమ్

హంసలూ కారణ్డవములూ చక్రవాకములూ

మత్తభ్రమరసౌస్వర్య హృష్టరోమలతాఙ్ఘ్రిపమ్
పద్మకోశరజో దిక్షు విక్షిపత్పవనోత్సవమ్

పూల చెట్లూ తుమ్మెదలూ, వాటి ఝంకారమూ, పద్మముల కోశములో ఉండే పుప్పొడిని వాయువు అంతా వెదజల్లుతోంది.

తత్ర గాన్ధర్వమాకర్ణ్య దివ్యమార్గమనోహరమ్
విసిస్మ్యూ రాజపుత్రాస్తే మృదఙ్గపణవాద్యను

ఇంత సుందరమైన సరస్సు చూస్తున్నవారికి కనులకే కాక, అక్కడి నుండి వచ్చే సంగీతముతో చెవులకీ ఆనందం కలిగింది. మృదంగములూ మొదలైన వాటి ద్వని వ్యాపించి ఉండటముతో చూచి ఆశ్చర్యము పొందారు

తర్హ్యేవ సరసస్తస్మాన్నిష్క్రామన్తం సహానుగమ్
ఉపగీయమానమమర ప్రవరం విబుధానుగైః

ఇలా ఆశ్చర్యం పొందుతుండగానే దేవతలు గానం చేస్తుండగా, వారు వెంట రాగా, అప్పుడే కాచిన బంగారములా మెరుస్తూ

తప్తహేమనికాయాభం శితికణ్ఠం త్రిలోచనమ్
ప్రసాదసుముఖం వీక్ష్య ప్రణేముర్జాతకౌతుకాః

మూడు కన్నులు గలవాడు, ప్రసన్నమైన చూపుతో ఉన్నాడు. ఆ భక్తవత్సలుడికి అందరూ నమస్కరించారు.

స తాన్ప్రపన్నార్తిహరో భగవాన్ధర్మవత్సలః
ధర్మజ్ఞాన్శీలసమ్పన్నాన్ప్రీతః ప్రీతానువాచ హ

ఆశ్రయించిన వారి ఆర్తిని తొలగించే శంకరుడు. ధర్మజ్ఞ్యులైన ప్రచేతసులతో ఇలా అన్నాడు

శ్రీరుద్ర ఉవాచ
యూయం వేదిషదః పుత్రా విదితం వశ్చికీర్షితమ్
అనుగ్రహాయ భద్రం వ ఏవం మే దర్శనం కృతమ్

ప్రాచీన బర్హి కుమారులైన మీరేమి చేయాలనుకుంటున్నారో నాకు తెలుసు. మీరడగకపోయినా మిమ్ములని అనుగ్రహించదలచి

యః పరం రంహసః సాక్షాత్త్రిగుణాజ్జీవసంజ్ఞితాత్
భగవన్తం వాసుదేవం ప్రపన్నః స ప్రియో హి మే

సత్వ రజో తమస్సు గుణాలు కలది ప్రకృతి, ఆ ప్రకృతి కంటే జీవునికంటే ఎవరు పరుడో ఆయనని శరణు పొందినవాడంటే నాకు చాలా ఇష్టము

స్వధర్మనిష్ఠః శతజన్మభిః పుమాన్విరిఞ్చతామేతి తతః పరం హి మామ్
అవ్యాకృతం భాగవతోऽథ వైష్ణవం పదం యథాహం విబుధాః కలాత్యయే

నూరు జన్మలు తన ధర్మం తాను అనుష్ఠిస్తే బ్రహ్మలోకాన్ని పొందుతాడు. అక్కడ కొన్నాళ్ళు ఉండి నా లోకాన్ని పొందుతాడు. అక్కడ ఒక కోటి సంవత్సరాలు ఉన్నాక వైఖుంఠానికి వెళ్తాడు. ప్రళయకాలములో దేవతలతో కలిసి నేను కూడా విష్ణువును చేరినట్లు మీరు కూడా అక్కడికి చేరతారు. శివసాయుజ్యం ద్వారానే వైకుంఠానికి వెళ్తారు

అథ భాగవతా యూయం ప్రియాః స్థ భగవాన్యథా
న మద్భాగవతానాం చ ప్రేయానన్యోऽస్తి కర్హిచిత్

మీరు పరమ భాగవతులు కాబట్టి నాకు పరమాత్మ అంటే ఎంత ప్రీతో మీరన్నా అంతే ప్రీతి. నాకు భాగవతోత్తములకంటే ప్రీతిపాత్రులు ఇంకొకరు లేరు.

ఇదం వివిక్తం జప్తవ్యం పవిత్రం మఙ్గలం పరమ్
నిఃశ్రేయసకరం చాపి శ్రూయతాం తద్వదామి వః

నేను మీకొక మంత్రోపదేశం చేస్తాను. దేనితో కలిసి ఉండనటువంటిదీ (వివిక్తం ), పరమాత్మ స్వరూపాన్ని బోధించేదీ, పవిత్రమూ మంగళమూ అన్నిటికీ పరమైనదీ. దీన్ని చెబుతాను మీరు వినండి

మైత్రేయ ఉవాచ
ఇత్యనుక్రోశహృదయో భగవానాహ తాఞ్ఛివః
బద్ధాఞ్జలీన్రాజపుత్రాన్నారాయణపరో వచః

చేతులు జోడించిన వారితో, ఇలా భగవానుడైన శంకరుడు అన్నాడు.

శ్రీరుద్ర ఉవాచ
జితం త ఆత్మవిద్వర్య స్వస్తయే స్వస్తిరస్తు మే
భవతారాధసా రాద్ధం సర్వస్మా ఆత్మనే నమః

ఇదంతా రుద్రగీత. మోక్ష ప్రదం
ఆత్మజ్ఞ్యానం కలవారి రక్షణకు పూనుకునే వారికి స్వస్తికలిగించేవాడా! వారి భారములను వహించేవాడా! వారికి శుభం కలిగించేవాడా! నీకు జయము. నాకు కూడా స్వస్తి కలగాలి. విషయానందము వలన కలిగే ప్రతీ ఫలమూ తాత్కాలికమే. అనుభవించేప్పుడు ఆనందముగా ఉండి తరువాత దుఃఖముగా మారుస్తుంది. మీరు సిద్ధమూ. ప్రపంచ విషయాలన్నీ సాధ్యములు. పరమాత్మ ఎవరి ప్రయత్నముతో ఏప్రడినవాడు కాడు. మనం ఒక రూపన్ని చూసినా, ఏదైనా తిన్నా, ఇవన్నీ సాధ్యములు, అంటే మన ప్రయత్నము వలన కలిగేవి. ప్రయత్నము వలన కలిగేవి ప్రయత్నములాగ తాత్కాలికములే. మనిషి గానీ మనిషి చేసే ప్రయ్త్నాలు కానీ ఎల్లకాలం ఉండవు. కనీ పరమాత్మ సహజముగా ఏర్పడినవాడు. ఆయనా ఆయన అనుభవిణ్చే ఆనందం నిలిచి ఉంటుంది. పరమాత్మ ఆనందానుభూత విషయాలు నిత్యములూ. అలాంటి నీ ఆనందాన్ని సాధించే భక్తి మాలో స్థిరముగా ఉండేట్లు ఉంచమని భగవంతుని అడగాలి. ఎందుకలా కోరాలంటే ఆయన అందరికీ ఆత్మ. శరీరం పోయినా ఆత్మ అలాగే ఉంటుంది. నీ ఉనికితోనే ఆత్మ ఉంటుందీ శరీరమూ ఉంటుంది. పరమాత్మ దేని దేనిలో ఉంటే అవి అన్నీ ఆయన శరీరాలే. వాటికి ఆత్మభూతుడు పరమాత్మ. అన్నిటికీ ఆత్మవైన నీకు నంసకారం

నమః పఙ్కజనాభాయ భూతసూక్ష్మేన్ద్రియాత్మనే
వాసుదేవాయ శాన్తాయ కూటస్థాయ స్వరోచిషే

పరమాత్మ పద్మనాబుడు - కార్యావస్థలో (కార్యావస్థ అంటే ప్రపంచం) ఉన్న ప్రపంచాన్ని సూచించేవాడు (లోకాత్మకం పంకజం). పంచ భూతములూ తన్మాత్రములూ పది ఇంద్రియములూ అన్నీ నీవే. కార్యకారణాలలో నీవు అంతర్యామిగా ఉన్నావు. జగత్తంతా నీలో ఉందీ, నీవు అందరిలో ఉన్నావు, కాబట్టి నీవు వాసు. అలా ఉండటము వలన కలిగే ఏ దోషమూ అంటను వాడు, ప్రకాశించేవాడివీ, జ్యోతిస్వరూపుడివి కాబట్టి దేవ. నీవు వాసుదేవుడవు. ప్రకృతి సంబంధమైన ఏ ఉపద్రవములూ లేని వాడవు. షడూర్ములూ లేని వాడవు. ఊర్మి అంటే తరంగాలు. నీవు నిర్వికారుడివి. కూటస్థుడవు. స్వయంప్రకాశశీలుడివి. నిత్య అసంకుచిత అపరిచ్చిన ప్రకాశశీలుడవు.

సఙ్కర్షణాయ సూక్ష్మాయ దురన్తాయాన్తకాయ చ
నమో విశ్వప్రబోధాయ ప్రద్యుమ్నాయాన్తరాత్మనే

నీవు సంకర్షణుడవు. అంతక రూపములో ప్రళయానికి కూడా నీవే కారణం. నీవు మాత్రం సూక్ష్ముడివే. నీకు నామ రూపాలు ఉండవు. ఇప్పుడూ ఉండవు, ప్రళయకాలములోనూ ఉండవు. నిరంతరమూ అంతరాత్మగానే ఉంటావు. ఉపసంహరించబడని వాడవు. ప్రకృతి తన ఆకారాన్ని ఉపసంహరించుకుంటుంది, జీవుడు కూడా ఉపసంహరిస్తాడు. ఉపసంహరణంటే కార్యావస్థ కారణావస్థలో చేరడం.
విశ్వప్రబోధాయ - సకల ప్రపంచమునకు జ్ఞ్యాన భిక్ష పెట్టినవాడవు. వేద శాస్త్ర పురాణాలని అందించినవాడవు. వేదం నీ నిశ్వాస.
ప్రద్యుమ్నాయాన్తరాత్మనే - సకల అవతార తత్వం ప్రద్యుమ్నుడు.

నమో నమోऽనిరుద్ధాయ హృషీకేశేన్ద్రియాత్మనే
నమః పరమహంసాయ పూర్ణాయ నిభృతాత్మనే

ఎవ్వరిచేతా అరికట్టబడని వాడవు. ఈయనే హృషీకేశుడు. ఇంద్రియములూ, వాటి అధిపతీ ఆయనే. మనం చేసే పాపాలను పుణ్యాలను ఉంచకుండా చేసేవాడు. అంతటా నిండి ఉన్నవాడు. శోకరహితుడవు (నిభృతాత్మనే)

స్వర్గాపవర్గద్వారాయ నిత్యం శుచిషదే నమః
నమో హిరణ్యవీర్యాయ చాతుర్హోత్రాయ తన్తవే

స్వర్గానికీ మోక్షానికీ నీవే మార్గం. ఇష్టాపూర్తములు కూడా నీవే. పవుత్రమైన భక్తుల హృదయములో ఉంటాడు - శుచిషద్.
హిరణ్యవీర్యాయ - అగ్నిహోత్రుడవు, ఋత్విక్, హోత అధ్వర్యువూ ఉద్గాత

నమ ఊర్జ ఇషే త్రయ్యాః పతయే యజ్ఞరేతసే
తృప్తిదాయ చ జీవానాం నమః సర్వరసాత్మనే

ఊర్జ అంటే పితృదేవతల భోజనం (స్వధాకారము). దేవతల భోజనాన్ని ఇష అంటారు (స్వాహా కారము). పరమాత్మే పితృదేవతలకూ దేవతలకూ అన్నం. హవిస్సూ హవిర్భోక్తా హవిస్సు ఇచ్చేవాడు. యజ్ఞ్యపతి యజమాని యజ్ఞ్యమూ ఆయనే.
రయ్యాః పతయే - వేదాలకు అధిపతి
యజ్ఞరేతసే - యజ్ఞ్యఫలం కూడా పరమాత్మే. కర్త కర్మ క్రియా ఈ మూడూ పరమాత్మ.
తృప్తిదాయ చ జీవానాం - అన్ని రకముల ప్రాణులకు ఎవరికి ఎలాంటి తృప్తి కలగాలంటే ఇచ్చేది పరమాత్మే. ఆయన అనుగ్రహముతోనే తృప్తిపొందుతారు. ఆ పొందే తృప్తి కూడా పరమాత్మే.
సర్వరసాత్మనే - కార్యమూ కారణమూ పరమాత్మే. ఈ రెంటినీ జ్ఞ్యానులు చూస్తారు. ప్రపంచములో పరమాత్మని, పరమాత్మలో ప్రపంచాన్ని చూడగలగడం. కటు లవణ ఆంల తిక్తం కషాయం మొదలైన షడ్రసాలు, శృంగార హాస్యాది నవరసాలు మొత్తం కలిపి పదిహేను రసాలు. ఈ పదిహేనే మనము వాడే పదిహేను తిథులు. ప్రతిపత్తునాడు కారం విదియ నాడు పులుపూ తదియనాడు ఉప్పూ తినకూడదు. అలాగే చవితి కటు కషాయం తిత్కం. దీని తరువాత సప్తమినాడు శృంగారానుభవం, అష్టమి నాడు హాస్యానుభవం, నవమి నాడు వీఎర రసము ఇలా రసాలు తొమ్మిది. అమావాస్యా పూర్ణిమ నాడు శాంతం. ఇవి రసాలు. కానీ పరమాత్మ సర్వ రసాలు. మనకు తృప్తి కలిగేది రసానుభవముతోనే, ఆ రసమే పరమాత్మ.

సర్వసత్త్వాత్మదేహాయ విశేషాయ స్థవీయసే
నమస్త్రైలోక్యపాలాయ సహ ఓజోబలాయ చ

అన్ని ఆత్మలూ, ఆత్మల శరీరమూ పరమాత్మే. స్థవీయసే - స్థూలము. విశేషాయ - పృధ్వీ స్వరూపాయ. పృధివిలో గంధమూ, జలములో రసమూ. అన్ని ఆత్మలకూ ఆయన దేహము (ప్రళయకాలములో) . అన్ని దేహములకూ ఆయన ఆత్మ. ఈయన మూడులోకాలను రక్షించేవాడు. బలము (ధారణ సామర్ధ్యం, శరీర బలం) ఓజః (ప్రవృతి సామర్ధ్యం) సహః (తేజస్సు, ప్రకాశ సామర్ధ్యం) కలవాడు

అర్థలిఙ్గాయ నభసే నమోऽన్తర్బహిరాత్మనే
నమః పుణ్యాయ లోకాయ అముష్మై భూరివర్చసే

అర్థలిఙ్గాయ  -- శబ్దస్వరూప్డు (అర్థమునకు లింగము లేదా అర్థమునకు కారణం),
నభసే - శబ్దమూ ఆయనే, శబ్దానికి కారణమైన ఆకాశమూ ఆయనే.
నమోऽన్తర్బహిరాత్మనే - శబ్దమంటే బయట ఉండేది, ఆకాశమంటే లోపల ఉండేది. వెలుపల శబ్దముగా లోపల ఆకాశముగా ఉంటాడు. శబ్దము నోటినుండి పుట్టి చెవికి చేరుతుంది. అంటే శబ్దం పుట్టేది ఆకాశమునుండే చేరేదీ ఆకాశములోకీ, వినగలిగేదీ ఆకాశము వలనే. మన అభిప్రాయాన్ని చెప్పే శబ్దమూ (అర్థమూ) ఆకాశమూ ఆయనే. లోపలా వెలుపలా ఆయనే ఉంటాడు.
అన్ని పవిత్రములకంటే పవిత్రుడు. అన్ని పదార్థాలను చూచేది ఆయనతోనే. చూడవలసినదీ ఆయననే. కనుల ఎదురుగా ఏ వస్తువు ఉన్నా చూడవలసినది తదంతర్యామిని. అముష్మై - ఈలోకమువాడూ ఆలోకము వాడూ ఆయనే
భూరివర్చసే  - సాటిలేని వర్చస్సు కలవాడు. వస్తువుకీ కంటికీ మధ్య ఉండే వెలుతురు స్వామే. వస్తువూ కన్నూ, కంటికీ వస్తువుకీ మధ్య వెలుతురూ ఆయనే.

ప్రవృత్తాయ నివృత్తాయ పితృదేవాయ కర్మణే
నమోऽధర్మవిపాకాయ మృత్యవే దుఃఖదాయ చ

ప్రవృత్తి కర్మా నివృత్తి కర్మా రెండూ ఆయనే. కర్మను భగవదారాధనగా చేయడం ఒక మార్గం (భరతుడు), కర్మను వదిలేసి భగవదారాధన చేయడమింకో మార్గం(లక్ష్మణుడు). ఈ రెండూ ఆయనే. నిత్య కర్మే కాకుండా నైమిత్తిక కర్మలైన శ్రాద్ధాదులూ ఆయనే. భోక్తా  భోగ్యమూ తృప్తీ ఆయనే. పితృదేవతా, పితృదేవతలకోసం చేసే శ్రాద్ధాది కర్మలూ ఆయనే. కర్మ కర్మ చేత ఆరాధించబడే వాడూ, కర్తా, ఫలమూ అన్నీ పరమాత్మే.
నమోऽధర్మవిపాకాయ - ధర్మ విపాకమంటే పుణ్యం, అధర్మ విపాకం పాపం. తప్పు చేస్తే అది తానే అయి మనని నరకానికి పంపిస్తాడు. ఒప్పు చేస్తే అది కూడా తానే అయి స్వర్గానికి పంపిస్తాడు . ఈ రెండూ ఆయనకే అర్పిస్తే మోక్షానికి పంపిస్తాడు.
మృత్యవే  - మృత్యువంటే సంసారము. యమ రూపములో ఫలితం ఇచ్చేవాడు ఆయనే. దుఃఖమునిచ్చే మృత్యువూ ఆయనే. దుఃఖమూ, పాపమూ ఆయనే.

నమస్త ఆశిషామీశ మనవే కారణాత్మనే
నమో ధర్మాయ బృహతే కృష్ణాయాకుణ్ఠమేధసే
పురుషాయ పురాణాయ సాఙ్ఖ్యయోగేశ్వరాయ చ

ధర్మాదులకు కారణమూ కార్యమూ  పరమాత్మే. ధర్మాదులకు పరమాత్మే ప్రభువు. (ధర్మే మతిర్భవతు వః పురుషోత్తమానాం| స హ్యేక ఏవ పరలోకగతస్య బన్ధుః| అర్థాః స్త్రియశ్చ నిపుణైరపి సేవ్యమానా| నైవ ప్రభావముపయాన్తి న చ స్థిరత్వమ్|)
పరలోకానికి వెళ్ళేవాడికి ధర్మమొక్కటే బంధువు. సంపదలూ స్త్రీలని మనమెంతగా సేవించినా వారు ఆప్తులు కారు. ఇది భారతానికి మొదటి శ్లోకం. భారతానికి ఇది ఫలశృతి.

నీవే స్వాయంభువ మన్వాదులవు. మనవే అంటే మంత్ర రూపాయ అని కూడా వస్తుంది.
నమో ధర్మాయ బృహతే - అంతకన్నా పెద్ద ధర్మం లేదు. అకుణ్ఠమేధసే - అసంకుచిత జ్ఞ్యాన స్వరూపుడు.
సాఙ్ఖ్యయోగేశ్వరాయ  - ఈయనే కపిలుడూ, చతుర్ముఖ బ్రహ్మ.

శక్తిత్రయసమేతాయ మీఢుషేऽహఙ్కృతాత్మనే
చేతఆకూతిరూపాయ నమో వాచో విభూతయే

సృష్టీ రక్షణ సంహార శక్తీ గలవాడు. మీఢుషే - ఈయనే సూర్యుడు (వర్షాన్నిచ్చేవాడు) వర్షమూ ఎండా పరమాత్మ స్వరూపమే.
అహఙ్కృతాత్మనే - అహంకారమే శరీరముగా కలవాడు. చేతఆకూతిరూపాయ - చూసే కన్నూ చూడబడే రూపమూ ఆయనే. ధ్యానములో ఆత్మా పరమాత్మ ఒక్కటిగా భాసిస్తారు. అనుభవ దశలో ఇద్దరూవిడిగా భాసించరూ. ఇంద్రియ జ్ఞ్యానం విషయ జ్ఞ్యానం విడిగా భాసించదు. విషయాలు ఇంద్రియాలు విడిగా ఉంటాయి. ఇంద్రియాలు విషయాన్ని తీసుకుంటాయి. ఆ గ్రహించబడిన విషయములని గ్రహించే ఇంద్రియములనుండి వేరు చేయగలమా? ఉదా: రూపాన్ని చూసాక చూసిన తరువాత ఆ అనుభవాన్ని రూపాన్ని వేరు చేయగలమా? పాలూ తీయగా ఉంటాయీ, చక్కెరా తీయగా ఉంటుంది. రెండూ కలిస్తే ఆ తీపి దేనినుంచీ వచ్చింది. చక్కెర తీపినీ పాల తీపినీ వేరుగా చొఓడగలమా.  విడి విడిగా ఉన్నప్పుడు ఆ తీపీ ఈ తీపీ వేరుగా అనిపించినా రెండు కలిస్తే వాటిని విడిగా చూపలేము. అలాగే మనం పరమాత్మ వేరు నేను వేరూ అనుకుంటాము కానీ ఆయన ధ్యానములో పడ్డ తరువాత ధ్యానములో రెండూ వేరుగా ఉండవు (అనుభవించే వస్తువూ అనుభవించే కర్తా ).
ఇదే (విశిష్ట) అద్వైతం. అనుభవ దశలో ఈ రెండూ విడిగా భాసించవు.
ఆయనే మనో వాక్కాయ రూపుడు.
చేతఆకూతిరూపాయ - ఈయన వాక్కునకు విభూతి. వక్కుకు అందని వాడు. శబ్దాతిగః శబ్ద సహః - శబ్దము చెప్పగలదానికంటే అవతల ఉన్నవాడు, ఏ పేరుతో పిలిచినా పలికే వాడు.

దర్శనం నో దిదృక్షూణాం దేహి భాగవతార్చితమ్
రూపం ప్రియతమం స్వానాం సర్వేన్ద్రియగుణాఞ్జనమ్

ఇది వరకు పరమభాగవతోత్తములకు సాక్షాత్కరింపచేసిన దివమంగళ విగ్రహాన్ని మాకు దర్శింపచేయు. నీ వారికి నీ రూపం పరమ ప్రీతి పాత్రమైనది. అన్ని ఇంద్రియ గుణాలను ప్రకటింపచేసేది నీవే (సర్వేన్ద్రియగుణాఞ్జనమ్).

స్నిగ్ధప్రావృడ్ఘనశ్యామం సర్వసౌన్దర్యసఙ్గ్రహమ్
చార్వాయతచతుర్బాహు సుజాతరుచిరాననమ్

నల్లని మబ్బు వంటి రూపము. అన్ని రకముల సౌంద్రయ్ములూ నీలోనే అభివ్యక్తమవుతాయి. సుందర విశాలమైన నాలుగు భుజాలు, చక్కని పలువరసతో ఉన్న ముఖము

పద్మకోశపలాశాక్షం సున్దరభ్రు సునాసికమ్
సుద్విజం సుకపోలాస్యం సమకర్ణవిభూషణమ్

పుండరీకాక్షుడూ, చక్కని కనుబొమ్మలూ ముక్కూ, కపోలము (చెంపలు), నోరు, చెవులూ, వాటి భూషణాలు

ప్రీతిప్రహసితాపాఙ్గమలకై రూపశోభితమ్
లసత్పఙ్కజకిఞ్జల్క దుకూలం మృష్టకుణ్డలమ్

సంతోషముతో కలిగే చిరునవ్వుతో కూడిన క్రీగంటి చూపు. కనులలో చిరునవ్వు తొణికిసలాడేది నీ చూపు. ముగుర్లు నీ కళ్ళ మీద పడుతూ ఉంటాయి. పసుపుపచ్చని పీతాంబరమూ, శుభ్రమైన కుండలాలు

స్ఫురత్కిరీటవలయ హారనూపురమేఖలమ్
శఙ్ఖచక్రగదాపద్మ మాలామణ్యుత్తమర్ద్ధిమత్

కిరీట కంకణ హార మొలతాడు,శంఖ చక్ర గదా పద్మ వనమాలాతో

సింహస్కన్ధత్విషో బిభ్రత్సౌభగగ్రీవకౌస్తుభమ్
శ్రియానపాయిన్యా క్షిప్త నికషాశ్మోరసోల్లసత్

సింహం లాంటి స్కంధం కలవాడు, కాంతికలవాడు,ఆ కంఠానికున్న మణి మణికే అలంకారం. అనపాయి అయిన అమ్మవారి చేత ఒరిపిడి రాయిగా ఉంచుకున్న ఉరస్సు.

పూరరేచకసంవిగ్న వలివల్గుదలోదరమ్
ప్రతిసఙ్క్రామయద్విశ్వం నాభ్యావర్తగభీరయా

ఉచ్చ్వాస నిశ్వాసలతో కదులుతున్న సుందరమైన రేఖలు ఉదరములో గలవాడు. గంభీరమైన సుడులు తిరిగే సుడులు గలవాడు. కడుపులో ఉన్న లోకాలు బయటకు రావడం వలన ఏర్పడ్డట్లు ఉన్న సుడులు

శ్యామశ్రోణ్యధిరోచిష్ణు దుకూలస్వర్ణమేఖలమ్
సమచార్వఙ్ఘ్రిజఙ్ఘోరు నిమ్నజానుసుదర్శనమ్

బంగారపు కాంతిని తలపింపచేసే పట్టు పీతాంబరముతో శోభించే పిరుదులు.పాదములూ పిక్కలూ మోకాలు అరికాలు సమముగా ఉన్నవి. మోకాల్లు పిక్కలూ లోపలకూ. ఊరువులు బయటకు ఉండాలి. తొడలకంటే మోకాళ్ళు లోపలకూ, మోకాళ్ళ కంటే పిక్కలు లోపలకి, పిక్కల కంటే పాదములు ముందుకీ, పిక్కల కంటే మడమలు లోపలకూ ఉండాలి.

పదా శరత్పద్మపలాశరోచిషా నఖద్యుభిర్నోऽన్తరఘం విధున్వతా
ప్రదర్శయ స్వీయమపాస్తసాధ్వసం పదం గురో మార్గగురుస్తమోజుషామ్

శరత్కాలములో ఉండే పద్మ రేకులతో సమానమైన పాదముల చేత గోళ్ళ కాంతులతో మాలో ఉన్న పాపాన్ని తొలగిస్తున్న పాదముచేత, అజ్ఞ్యానికి దారి చూపే వాడివైన నీకు నీ రూపం చూపవల్సింది

ఏతద్రూపమనుధ్యేయమాత్మశుద్ధిమభీప్సతామ్
యద్భక్తియోగోऽభయదః స్వధర్మమనుతిష్ఠతామ్

మనశ్శుద్ధి కావాలంటే పరమాత్మ యొక్క ఈ రూపాన్ని ధ్యానం చేయాలి. తమ ధర్మాన్ని అనుష్ఠానం చేసే వారికి భక్తి యోగమే ప్రధానం.
ఆతం శుద్ధి కోసం ఇపుడు నేను చెప్పిన రూపాన్ని ధ్యానం చేయండి. బ్రాహ్మణ క్షత్రియాదులు గానీ, బ్రహ్మచర్యాది వర్ణాశ్రమాలు గలవారు గానీ తమ తమ వర్ణాశ్రమాలనుష్ఠించే వారికి అభయమిచ్చేది భక్తియోగం మాత్రమే.భయమంటే భ్రష్టమవడం. ఉదా: స్నాన సంధ్యాదులు మానడం.

భవాన్భక్తిమతా లభ్యో దుర్లభః సర్వదేహినామ్
స్వారాజ్యస్యాప్యభిమత ఏకాన్తేనాత్మవిద్గతిః

నీవు ఎవ్వరికీ అందుబాటులో ఉండవు. భక్తి ఉన్న వారికి మాత్రం కనపడతావు. స్వారాజ్యానికి నీవు అభిమతము. కైవల్యాన్ని కూడా పక్కకి జరిపి ఏకాంతమైన నీ మోక్ష సామ్రాజ్యాన్నీ నీవు అందజేయగలవు
భక్తి కలవారికి తప్ప మిగతావారికి మీరు దుర్లభులు. ఆత్మ జ్ఞ్యానులకు మీరే ఉపాయము

తం దురారాధ్యమారాధ్య సతామపి దురాపయా
ఏకాన్తభక్త్యా కో వాఞ్ఛేత్పాదమూలం వినా బహిః

సజ్జనులకు కూడా పొందశక్యము కాని వాడవు, కష్టపడి ప్రయత్నించినా లభించవు. నిన్నెవ్వరూ ఆరాధించలేరు. అనన్య భక్తి మాత్రమే నిన్ను చేరే మార్గము. ంజమైన భక్తుడు మోక్షాన్ని కూడా కోరడు. భక్తుడు కోరేది నీ పాదమూలాన్నే

యత్ర నిర్విష్టమరణం కృతాన్తో నాభిమన్యతే
విశ్వం విధ్వంసయన్వీర్య శౌర్యవిస్ఫూర్జితభ్రువా

అరణం - చరణము. పరమాద్మ పాద మూలాన్ని శరణముగా తీసుకున్నవాడు యమున్ని కూడా లెక్కించడు. సకల ప్రపంచనమునూ తన పరాక్రమముతో ధ్వంసం చేసే యమున్ని కూడా పరమాత్మ పాదాలను శరణు వేడినవాడు లెక్కించడు.

క్షణార్ధేనాపి తులయే న స్వర్గం నాపునర్భవమ్
భగవత్సఙ్గిసఙ్గస్య మర్త్యానాం కిముతాశిషః

పరమాత్మ భక్తులతో అరక్షణం కలిసి ఉండటం కలిగిన వాడు స్వర్గాన్ని మోక్షాన్ని కూడా లెక్కించరు. స్వర్గ మోక్షాలనే పరిగనించని వారు మానవుల కోరికలను పరిగణిస్తారా. నిరంతర పరమాత్మ దర్శనం కోరుకునే వారు ఎప్పుడూ పరమాత్మ భక్తులతో కలిసి ఉండేలా చూడమని కోరతాడు

అథానఘాఙ్ఘ్రేస్తవ కీర్తితీర్థయోరన్తర్బహిఃస్నానవిధూతపాప్మనామ్
భూతేష్వనుక్రోశసుసత్త్వశీలినాం స్యాత్సఙ్గమోऽనుగ్రహ ఏష నస్తవ

పాపములను నశింపచేసే పాదములు గలవాడు. ఆయన పాదములకు తీర్థం ఆయన కీర్తే. (పవిత్రాణాం చ పవిత్రం). నీ తీర్థముతో కీర్తితో అంతర్దోషమూ బహిర్దోషమూ (దేహమూ మనసు) రెండూ తొలగించబడతాడు. సత్వ గుణము కలిగి అన్ని ప్రాణుల మీదా దయ కలిగి ఉండేవారితో సమాగమం కలిగి ఉండాలి. నీ పాద తీర్థముతో కీర్తి తీర్థముతో మానసిక శారీరిక శుద్ధి పొందిన వారు. కామ క్రోధాదులకు లోబడని వారు, అన్ని జీవుల మీద దయ చూపే వారు, ఇలాంటి వారితో సంగం కావాలి

న యస్య చిత్తం బహిరర్థవిభ్రమం తమోగుహాయాం చ విశుద్ధమావిశత్
యద్భక్తియోగానుగృహీతమఞ్జసా మునిర్విచష్టే నను తత్ర తే గతిమ్

భాగవత సంగం వలన ప్రయోజనమేమిటి? భగవంతుని భక్తిచే అనుగ్రహించబడిన వారి వలన రజస్సు తమస్సు తొలగిపోయి కేవలం సత్వ గుణం మాత్రమే ప్రకాశకమవుతుంది. పరమాత్మ భక్తులతో కలిసి ఉన్నవారికి విషయాల యందు ఆశ పోతుంది, శుద్ధ సత్వమవుతుంది మనస్సు లోపలా వెలుపలా . శబ్దాది విషయాల యందు ఆశ కలిగి ఉండడు. అజ్ఞ్యానమయమైన వాటిలోకి ఆ మనసు చేరదు. అలాంటి వారు నిన్ను పొందుతారు. మనసుకున్న అన్ని మురుకులూ తొలగుతాయి, విషయాల మీద ఆశా పోతుంది

యత్రేదం వ్యజ్యతే విశ్వం విశ్వస్మిన్నవభాతి యత్
తత్త్వం బ్రహ్మ పరం జ్యోతిరాకాశమివ విస్తృతమ్

అంతర్భిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఈ సకల ప్రపంచం ఎవరిలో కనపడుతోందో ఎవరు ప్రపంచములో కనపడుతున్నారో అది నీవే. ఆకాశమన్నిటిలో ఉండి కూడా వాటి మాలిన్యం అంటనట్లు నీకు కూడా ఏ దోషాలూ అంటవు.

యో మాయయేదం పురురూపయాసృజద్బిభర్తి భూయః క్షపయత్యవిక్రియః
యద్భేదబుద్ధిః సదివాత్మదుఃస్థయా త్వమాత్మతన్త్రం భగవన్ప్రతీమహి

విశిష్టమైన బాగా వ్యాపించి ఉన్న యోగ మాయతో ఈ ప్రపంచాన్ని సృష్టించి రక్షించి నశింపచేస్తున్నాడు. ఇవన్నీ ఏ వికారమూ లేకుండా చేస్తున్నాడు. ఆయనే ఉపాదాన నిమిత్త సహకారీ కారణం. కుండ చేసేప్పుడు మట్టి  ఉపాదానం, కుండ చేసే వాడు నిమిత్త కారణం, వానికి సహాయం చేసే వారు సహకారీ కారణం. సృష్టి చేసే పరమాత్మ తానే ఈ మూడు అవుతాడు.
మనకు భయము కలగడానికి కారణం భేధ బుద్ధి. ఉన్నది ఒకటే ఐనప్పుడు అక్కడ వికారం కలగడానికి వీలు లేదు. కర్తృత్వమే సహకారీ ఉపాదాన నిమిత్త కారణాలు. జ్ఞ్యానం కలిగితే ఈ భేధ బుద్ధి పోతుంది.
నిన్ను ఆరాధించే మాకు నీ యధార్థ స్వరూపం ఇలా అవగతం కావాలి

క్రియాకలాపైరిదమేవ యోగినః శ్రద్ధాన్వితాః సాధు యజన్తి సిద్ధయే
భూతేన్ద్రియాన్తఃకరణోపలక్షితం వేదే చ తన్త్రే చ త ఏవ కోవిదాః

అష్టాంగయోగాలూ తపస్సులూ యజ్ఞ్యాలతో ఈ విధముగానే పరమాత్మను ఆరాధిస్తారు సిద్ధిని పొందడానికి. ఎవరు నీ ఈ స్వరూపాన్ని తపస్సమాధులూ స్వాధ్యాయాలతో కోరుతారో వారే తెలిసినవారు . నిజమైన జ్ఞ్యానులు నిన్నుమాత్రమే తమ అఖిల కర్మలతో శమదమాలతో ఆరాధిస్తారు. వారికి ఇంకొకరు కనపడరు
భూతేన్ద్రియాన్తఃకరణోపలక్షితం - పంచ భూతాలూ జ్ఞ్యాన కర్మేంద్రియాలతో మనసుతో కనపడేది నీవే. వేరే దేవతలన్నిటి కన్నా ముందు ఇవి పుట్టించబడ్డాయి పరమాత్మ చేత. అన్ని భూతేంద్రియ అంతః కరణాలతో ఎవరిని చూడగలమే వాడినే ధ్యానం చేస్తాము. అలా చేస్తేనే వారు పండితులు.

త్వమేక ఆద్యః పురుషః సుప్తశక్తిస్తయా రజఃసత్త్వతమో విభిద్యతే
మహానహం ఖం మరుదగ్నివార్ధరాః సురర్షయో భూతగణా ఇదం యతః

నీవొక్కడవే ఆది పురుషుడవు. సృష్టి కంటే పూర్వం నీవొక్కడివే ఉన్నావు. ప్రళయావస్థలో యోగ నిద్రలో ఉంటావు. సృష్టి చేయాలని సంకల్పించిన నీవు ప్రకృతి నుండి గుణ త్రయాలను క్షోభింపచేసావు. దాగి ఉన్న గుణ త్రయాలు అప్పుడు బయటకు వచ్చాయి. అందులో సత్వ రజో తమస్సులు వచ్చాక, అందులోంచి మహత్తు, దాని నుండి అహంకారమూ, దాని నుండి పంచ్భూతములు, పంచ జ్ఞ్యానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు, దాని నుంచి మిగతా సృష్టి వచ్చింది. ఎవరూ పుట్టక ముందూ ఉన్నదీ, అందరూ పుట్టాక ఉన్నదీ నీవొక్కడవే.

సృష్టం స్వశక్త్యేదమనుప్రవిష్టశ్చతుర్విధం పురమాత్మాంశకేన
అథో విదుస్తం పురుషం సన్తమన్తర్భుఙ్క్తే హృషీకైర్మధు సారఘం యః

నీవే యోగ శక్తితో సృష్టించావు, అందులో నీవు ప్రవేశించావు. నాలు రకముల శరీరాలను, దేవ మానవ అసుర తిర్యక్ శరీరాలను సృష్టించి, ఆ శరీరమనే పురములోకి ప్రవేశించావు. అందుకే నీవు పురుషుడవయ్యావు. నాలుగు రకముల పురములలో ప్రవేశించావు కాబట్టి నిన్ను పురుషుడంటున్నారు. ఈ పురము చతుర్విధం. లోపలా బయటా ఉన్నవాడు ఒకడే. అందరిలో ఉన్న అనుభవాలు అనుభవించేది ఆయనే. జఠరాగ్ని రూపములో ఉన్నదీ ఆయనే. రసముగా ఉన్నదీ ఆయనే. మనమనుభవించే ఇంద్రియాలు ఆయనే. మన లోపల ఉండి "మనం మనం" అని చెప్పుకునే ఇంద్రియాలను అనుభవించేది ఆయన. సార్ఘం మధు - తేనెటీగ రకరకాల పుష్పాల నుండి కూడబెడుతుంది. కాని అది మాత్రం తినదు. అలాగే మనం తింటున్నామని, చూస్తున్నామని అనుకున్నా నిజముగా తినేదీ చూసేదీ ఆయనే. 

స ఏష లోకానతిచణ్డవేగో వికర్షసి త్వం ఖలు కాలయానః
భూతాని భూతైరనుమేయతత్త్వో ఘనావలీర్వాయురివావిషహ్యః

కాలమనే రూపము తీసుకుని మహావేగము కలవాడవై మొత్తం నీవే మింగి వేస్తావు. ప్రాణులతోటి ప్రాణుల రాకపోకలు జరిపేది నీవే. భూతలని  భూతములతోనే సంహరిస్తావు. పుట్టడానికి ఒకరూ రక్షించడానికి ఒకరూ సంహరించడానికి ఒకరూ కారణం అనిపించేట్లు భూతలని సృష్టించి, వాటిలో నీవే ఉండి ఆ పనులు చేస్తావు. మహా వేగం కలవాడవై ప్రాణులని ప్రాణులతో ఆకర్షిస్తుంటావు. నీ కార్యములతోనే కారణాన్నూహించాలి. 

ప్రమత్తముచ్చైరితి కృత్యచిన్తయా ప్రవృద్ధలోభం విషయేషు లాలసమ్
త్వమప్రమత్తః సహసాభిపద్యసే క్షుల్లేలిహానోऽహిరివాఖుమన్తకః

నోరు తెరిచి నాలుక బాగా చాపుతూ ఎర కోసం ఎదురు చూస్తున్న పాములాగ మమ్మల్ని నీవు నోటిలో వేసుకుంటున్నావు. మేము ఎప్పుడూ ప్రమత్తముగా ఉంటాము. నేను అనుకున్న పనులన్నీ పూర్తి చేసే దాకా నాకు మృత్యువు రాదు అని ప్రమత్తుడై మానవుడు భ్రమిస్తాడు. చేయవలసిన పనులను గురించి ఆలోచిస్తూ ఉండుట వలన ప్రమత్తులవుతారు మానవులు. 
శబ్ద స్పర్శ రూప రస గంధముల యందు లాలస కలిగి ఉంటాము. దాని వలన విషయాల మీద వ్యామోహం కలిగి ఉంటాము.  నీవు ఏమాత్రం ఏమరపాటులేకుండా ఉండి ఏమరపాటుతో ఉన్న మమ్మల్ని మింగివేస్తావు. ఎలుకను పాము ఎంత వేగముగా వచ్చి పడుతుందో నీవు కూడా అలాగే పడతావు. 

కస్త్వత్పదాబ్జం విజహాతి పణ్డితో యస్తేऽవమానవ్యయమానకేతనః
విశఙ్కయాస్మద్గురురర్చతి స్మ యద్వినోపపత్తిం మనవశ్చతుర్దశ

అందుకే ఇవన్నీ తెలిసిన్వాడెవడైనా నీ పాద పద్మాలను విడిచిపెడతాడా? ఆదరమూ అదారమూ అని భావన నీకుండదు. మానావమానములకు నిల్యమైన శరీరము కలవారు ఇది తెలిస్తే నీ పాదాలు తప్ప వేరేదాన్ని పట్టుకుంటాడా? మా తండ్రిగారైన బ్రహ్మగారూ, నాతో పుట్టిన మనువులూ ఎలాంటి శంకా లేకుండా నిన్నే ఆరాధిస్తున్నారు. అలాంటి నీ పాదపద్మాలని ఏ పండితుడైనా విడిచిపెడతాడా. అందరికీ పొందదగిన వాడవు నువ్వు. 

అథ త్వమసి నో బ్రహ్మన్పరమాత్మన్విపశ్చితామ్
విశ్వం రుద్రభయధ్వస్తమకుతశ్చిద్భయా గతిః

పండితులకూ జ్ఞ్యానులకూ నీవే అభయాన్నిచ్చేవాడవు. ప్రళయభయముతో ఉన్న వారికి నీవే అభయమిచ్చేవాడవు. 

ఇదం జపత భద్రం వో విశుద్ధా నృపనన్దనాః
స్వధర్మమనుతిష్ఠన్తో భగవత్యర్పితాశయాః

మీరు ఈ విషయాన్ని ఈ మంత్రాలనూ జ్ఞ్యానాన్ని ధ్యానం చేయండి. మీకు మేలు కలుగు గాక. పరిశుద్ధులై సేవించండి. శరీర మలో వాక్కు మలము లేకుండా స్వధర్మాన్ని ఆచరిస్తూ త్రికరణ శుద్ధితో దీన్ని జపించండి. 

తమేవాత్మానమాత్మస్థం సర్వభూతేష్వవస్థితమ్
పూజయధ్వం గృణన్తశ్చ ధ్యాయన్తశ్చాసకృద్ధరిమ్

అందరిలో అంతరాత్మగా ఉన్నవాడిని పూజించండీ, కీర్తించండీ, ధ్యానించండి.

యోగాదేశముపాసాద్య ధారయన్తో మునివ్రతాః
సమాహితధియః సర్వ ఏతదభ్యసతాదృతాః

మీరు ఈ యోగాదేశాన్ని పొంది ధ్యానం చేసి మునులుగా సావధాన చిత్తులై అందరూ ఆదరముతో దీన్ని అభ్యసించండి 

ఇదమాహ పురాస్మాకం భగవాన్విశ్వసృక్పతిః
భృగ్వాదీనామాత్మజానాం సిసృక్షుః సంసిసృక్షతామ్

దీన్ని ఇదివరకు మా తండ్రిగారైన బ్రహ్మగారు సృష్టి చేయగోరిన భృగువాదులకు చెప్పారు. 

తే వయం నోదితాః సర్వే ప్రజాసర్గే ప్రజేశ్వరాః
అనేన ధ్వస్తతమసః సిసృక్ష్మో వివిధాః ప్రజాః

ఇలా ఉపదేశించబడిన మేము అజ్ఞ్యానము తొలగి సృష్టి చేసాము

అథేదం నిత్యదా యుక్తో జపన్నవహితః పుమాన్
అచిరాచ్ఛ్రేయ ఆప్నోతి వాసుదేవపరాయణః

ఈ మంత్రాన్ని సర్వ దేశ సర్వకాలాలలో సర్వావస్థలో ధ్యానం చేసిన వారు పరమాత్మ మీద పరిపూర్ణముగా మనసు ఉంచిన వారై ఆయనను చేరతారు.

శ్రేయసామిహ సర్వేషాం జ్ఞానం నిఃశ్రేయసం పరమ్
సుఖం తరతి దుష్పారం జ్ఞాననౌర్వ్యసనార్ణవమ్

 అన్ని శ్రేయస్సులకంటే ఉత్తమ శ్రేయస్సు జ్ఞ్యానము. కష్టాల కడలిని జ్ఞ్యానమనే పడవలో సులభముగా దాటగలరు

య ఇమం శ్రద్ధయా యుక్తో మద్గీతం భగవత్స్తవమ్
అధీయానో దురారాధ్యం హరిమారాధయత్యసౌ

నేను పాడిన పరమాత్మ యొక్క ఈ స్తోత్రాన్ని శ్రద్ధతో చదివితే ఎంత కష్టపడ్డా ఆరధించరాని పరమాత్మను ఇది విన్నవాడు ఆరాధించగలుగుతాడు. 

విన్దతే పురుషోऽముష్మాద్యద్యదిచ్ఛత్యసత్వరమ్
మద్గీతగీతాత్సుప్రీతాచ్ఛ్రేయసామేకవల్లభాత్

ఇది జపం చేసి ఏమి కోరుకుంటాడో అది పొందుతాడు. నేను గానము చేసిన దాన్ని గానము చేసినందు వలన, గానము చేసిన నాకూ విన్న మీకు ప్రియుడు ఒక్కడే కాబట్టి మీకూ నాకూ కావలసినది ఆయనే ఇస్తాడు. అందరికీ ప్రియుడు ఆయనే. 

ఇదం యః కల్య ఉత్థాయ ప్రాఞ్జలిః శ్రద్ధయాన్వితః
శృణుయాచ్ఛ్రావయేన్మర్త్యో ముచ్యతే కర్మబన్ధనైః

ప్రాతః కాలమే లేచి చేతులు జోడించిన్ శ్రద్ధ కలవారై విన్నా వినిపించినా అన్ని కర్మ బంధముల నుండీ విడుదలవుతారు

గీతం మయేదం నరదేవనన్దనాః పరస్య పుంసః పరమాత్మనః స్తవమ్
జపన్త ఏకాగ్రధియస్తపో మహత్చరధ్వమన్తే తత ఆప్స్యథేప్సితమ్

పరమ పురుషుడైన పరమాత్మ స్తోత్రాన్ని నేను గానం చేసాను. సావధాన మనసు కలవారై దీన్ని జపిస్తూ గొప్ప తపస్సు చేయండి. తపస్సు ముగిసిన తరువాత ఆ పరమాత్మ నుండి మీరు కోరికను పొందుతారు.

Popular Posts