Followers

Saturday 1 March 2014

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ఇరవైయ్యవ అధ్యాయం

మైత్రేయ ఉవాచ
భగవానపి వైకుణ్ఠః సాకం మఘవతా విభుః
యజ్ఞైర్యజ్ఞపతిస్తుష్టో యజ్ఞభుక్తమభాషత

తొంబైతొమ్మిది యజ్ఞ్యాలతో పరమాత్మ సంతోషించాడు. ఎందుకంటే ఆయానే యజ్ఞ్య భోగి (యజ్ఞ్య భుక్). పృధు చక్రవర్తితో పరమాత్మ ఇలా అన్నాడు

శ్రీభగవానువాచ
ఏష తేऽకార్షీద్భఙ్గం హయమేధశతస్య హ
క్షమాపయత ఆత్మానమముష్య క్షన్తుమర్హసి

ఇంద్రుడు నీ గుర్రము అపహరించాడు. నిన్ను నీవు శాంతింపచేసుకో. మనం చేసే ఏ పనీ ఆత్మ చేసినది కాదు. శరీరమే ఆత్మ అనుకున్నవారికే ఈ యజ్ఞ్యాలు

సుధియః సాధవో లోకే నరదేవ నరోత్తమాః
నాభిద్రుహ్యన్తి భూతేభ్యో యర్హి నాత్మా కలేవరమ్

ఒక పేరు పెట్టి ఒక ప్రాణిని సంబోదిస్తున్నావంటే ఆ పేరు ఆ ఆకారానికి గానీ ఆత్మకు కాదు. సత్పురుషులూ బుద్ధిమంతులూ ప్రాణులకు ద్రోహం చేయరు ఎందుకంటే శరీరమాత్మ కాదు కాబట్టి.
శరీరమే నేననే భావన కలగడముతో ఆ ఆత్మ బంధానికి గురవుతున్నదే గానీ ఆత్మ ఏ పనీ చేయదు. ఫలితం పొందేది శరీరం. ఆత్మ "నేను ఫలితాన్ని పొందుతున్నాను" అని అనుకుంటోంది.

పురుషా యది ముహ్యన్తి త్వాదృశా దేవమాయయా
శ్రమ ఏవ పరం జాతో దీర్ఘయా వృద్ధసేవయా

నీలాంటి వాడు కూడా దేవమాయతో మోహం చెందితే ఎంతో కాలం నుంచీ చేస్తోన్న పెద్దల సేవ కేవలం శ్రమగానే ఫలిస్తుంది. ఆత్మ జ్ఞ్యానం (శరీరం వేరు ఆత్మ వేరని) కలగడం  పెద్దలను సేవించడం వలన ప్రయోజనం.

అతః కాయమిమం విద్వానవిద్యాకామకర్మభిః
ఆరబ్ధ ఇతి నైవాస్మిన్ప్రతిబుద్ధోऽనుషజ్జతే

ప్రతీ వాడూ తెలుసుకోవలసినది, "ఇమం విద్వానవిద్యాకామకర్మభిః" - ఈ శరీరం పాంచభౌతికం (ఏ ప్రాణికైనా). ఆయా భూతముల ఆకారములు ఏర్పడడానికి ఏది కారణం. అజ్ఞ్యానం, కోరికా, ఆచరించిన పనులూ. కోరిక అజ్ఞ్యానము వలన కలుగుతుంది. జ్ఞ్యానికి కోరిక ఉండదు. ఆత్మకు ఇవేవీ ఉండవు. కోరిక పుట్టడం అంటే అజ్ఞ్యానమే. ఆ కోరిక తీర్చుకోవడానికే పని చేస్తారు. ఈ మూడిటితోటి (అవిజ్ఞ్యా కామ కర్మలు). తెలుసుకున్నవాడు (మేలుకొన్నవాడు) ఎవడూ ఈ శరీరం మీద ఆసక్తి కనపరచడు

అసంసక్తః శరీరేऽస్మిన్నమునోత్పాదితే గృహే
అపత్యే ద్రవిణే వాపి కః కుర్యాన్మమతాం బుధః

శరీరం మీదనే ఆసక్తి లేని వాడికి, శరీరముతో ఏర్పడిన ఇంటిమీదా పిల్లల మీదా ధనము బంధువుల మీదా ఆశ ఉంటుందా? శరీరం మీద వ్యామోహం తొలగించుకుంటేనే తక్కినవాటి మీద వ్యామోహం పెంచుకుంటాము. విరక్తి పొందినవాడు "నాకు - నేను" అనడు.

ఏకః శుద్ధః స్వయంజ్యోతిర్నిర్గుణోऽసౌ గుణాశ్రయః
సర్వగోऽనావృతః సాక్షీ నిరాత్మాత్మాత్మనః పరః

 ఇవి ఆత్మ లక్షణాలు. ఆత్మ ఏకః - ఇలాంటిది ఇంకోటి లేదు. జీవాత్మలు చాలా ఉన్నా అన్ని జ్ఞ్యానాశ్రయములే కాబట్టి ఏకః. ఆత్మకు రాగ ద్వేషాలు లేవు కాబట్టి శుద్ధము. ఆత్మ స్వయం జ్యోతి. ఆత్మకు సత్వ రజఓ తమో గుణాలు లేవు. ప్రకృతి సంబంధమైన గుణాలు లేవు కాబట్టి నిర్గుణః. గుణాశ్రయః - ఆత్మకున్న అష్టగుణాలు  కలవాడు. అంతటా వ్యాపించి ఉండేది ఆత్మ. కనుక సర్వగః. ఆత్మకు ఎలాంటి ఆవరణా లేదు, అనావృతః. పరమాత్మకు కూడా ఎలాంటి ఆవర్ణా లేదు. ఇంద్రియాలూ, పంచ్భూతములు అంతఃకరణమూ బుద్ధీ మనసూ చేసే వాటిని సాక్షిగా చూస్తూ ఉంటుంది. ప్రేరణా నివారణ ఉండదు. అందుకు సాక్షిః. . ఈ ఆత్మ శరీరము లేనివాడు. శరీరానికంటే వేరుగా ఉండేవాడు. ఇదీ ఆత్మయొక్క లక్షణం



య ఏవం సన్తమాత్మానమాత్మస్థం వేద పూరుషః
నాజ్యతే ప్రకృతిస్థోऽపి తద్గుణైః స మయి స్థితః


ఈ ఆత్మ పరమాత్మలో ఉంటుందీ, అంతటా వ్యాపించి ఉంటుందీ, అన్ని శరీరాలలోనూ ఉంటుంది, అన్ని ఆత్మలలో పరమాత్మ ఉంటాడని ఎవరైతే తెలుసుకుంటారో సంసారములో ప్రకృతిలో ఉన్నా ప్రకృతి గత గుణములు అంటుకోవూ. ఆత్మకు ఎటువంటి బంధమూ సంబంధమూ లేవు అని తెలుసుకున్నవాడు ప్రకృతిలో ఉన్నప్పటికీ ప్రకృతి యొక్క సత్వ రజ తమో గుణాలతో అంటుకోడు ఎందుకంటే వీడు నాలో ఉంటాడు


యః స్వధర్మేణ మాం నిత్యం నిరాశీః శ్రద్ధయాన్వితః
భజతే శనకైస్తస్య మనో రాజన్ప్రసీదతి

భాగావతం చెప్పేదే కపటము లేని ధర్మాన్ని. ఫలమును ఆశించి చేయుటే కాపట్యం
తన ధర్మముతో వారి వారి ధర్మాలకు అనుగుణముగా భగవంతుని కోరికలు లేకుండా ఆరాధించాలి. ధర్మమని ఆరాధించాకి. కోరికలు లేకపోయినా కోరికలు కోరేవారికంటే ఎక్కువ శ్రద్ధగా ఆరాధించాలి. ఇలా ఆరాధిస్తే మెల్లగా వారి మనసు ప్రసన్నమవుతుంది.  మనసుకి ఉన్న మురికంతా పోతుంది. మనసు యొక్క అసలు మురికి కోరిక.
ఆ మురికి పోవాలంటే భగవంతుని ఆరాధించాలి.

పరిత్యక్తగుణః సమ్యగ్దర్శనో విశదాశయః
శాన్తిం మే సమవస్థానం బ్రహ్మ కైవల్యమశ్నుతే

ఎపుడైతే మనసు నిర్మలమవుతుందో (రాగ ద్వేషములు వదిలిపెట్టి) ఉన్నదన్ని ఉన్నట్లు (శరీరమూ ఆత్మా వేరు అని) తెలుసుకుని పరిశుద్ధమైన మనసు కలిగి, శాంతుడై (ఎలాంటి ఉపద్రవాలు ద్వేషమూ కోపమూ లేకుండా) ఏకాకారముతో ఉన్న పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుంటాడు.

ఉదాసీనమివాధ్యక్షం ద్రవ్యజ్ఞానక్రియాత్మనామ్
కూటస్థమిమమాత్మానం యో వేదాప్నోతి శోభనమ్

ఎవరు శాంతినీ శుభాన్నీ మంగళాన్నీ పొందుతారు? ఈ ఆత్మ నిర్వికారమూ నిరంజనమూ. దీనికి దేనితోనూ సంబంధము లేదు. ఈ ఆత్మకు ఏ వికారమూ లేదు అని తెలుసుకోవాలి. ఆత్మంటే ద్రవ్య జ్ఞ్యాన క్రియలకు ( పంచభూతాలు, జ్ఞ్యానేంద్రియాలు కర్మేంద్రియాలు) ఈ ఆత్మ అధ్యక్షుడు. అంటే వీటి ప్రవృత్తి కలిగేదీ కలిగించేదీ ఆయనలోనే. అధ్యక్షుడై ఉండి కూడా ఆత్మ కూటస్థుడు (నిర్వికారుడని) అని తెలుసుకుంటారో వారు మంగళాన్ని పొందుతారు. ఆసక్తీ అనాసక్తి ఉండదు ఆత్మకు అని ఎవరు తెలుసుకుంటారో వారు శుభాన్ని పొందుతారు

భిన్నస్య లిఙ్గస్య గుణప్రవాహో ద్రవ్యక్రియాకారకచేతనాత్మనః
దృష్టాసు సమ్పత్సు విపత్సు సూరయో న విక్రియన్తే మయి బద్ధసౌహృదాః

ప్రకృతీ ప్రపంచం శరీరాం మానావమానాలు సుఖదుఃఖాలు ఇవన్నీ శరీరానివి
ప్రకృతి కంటే వేరుగా ఉన్నవాడు ఆత్మ. కానీ ప్రకృతితో ఉండి ప్రకృతినే తన గుర్తుగా పెట్టుకున్నాడు. ఒక పంచభూతాలను ముద్ద చేసి ఆ ముద్దలో సత్వ రజ తమస్సు వేసి పంచభూతాలూ జ్ఞ్యాన కర్మేంద్రియాలు వేస్తే శరీరం. ఇది ఆత్మకంటే భిన్నం. ప్రకృతితో ఏర్పడిన ఆకారం.

ఆత్మకు వీటితో ఏ సంబంధమూ లేదు. ఇందులో వచ్చి ఆత్మ చేరి ఇవన్నీ నావి అనుకుంటోంది. అది తప్ప ఆత్మకూ శరీరానికీ సంబంధము లేదు. ఈ స్వరూపం తెలిస్తే. ద్రవ్య క్రియా కారకాలతో ఏర్పడిన ఆకారములో ఆత్మ ఉంటుందీ. సంపత్తులూ విపత్తులూ మానావమానాలు సుఖమూ దుఃఖమూ ఎవరికి? శరీరానికి. రోగమంటే పంచభూతములు ఈ శరీరములో ఎక్కువ తక్కువలైతే రోగము వస్తుంది. మొత్తం శరీరానికి తగ్గితే ఒక రోగము, ఒక భాగములో తగ్గితే ఒక రోగమూ వస్తుంది. కాబట్టి ఆపదలలో గానీ సంపత్తులలో గానీ జ్ఞ్యానులెవరూ వికారం చెందరు నా యందు దృఢమైన భక్తి కలవారు కాబట్టి. వారికి కావలసింది నేనే.


సమః సమానోత్తమమధ్యమాధమః సుఖే చ దుఃఖే చ జితేన్ద్రియాశయః
మయోపక్లృప్తాఖిలలోకసంయుతో విధత్స్వ వీరాఖిలలోకరక్షణమ్

ఆత్మ తత్వం తెలిసిన వాడు సమముగా ఉంటాడు. అందరిలో సమముగా ఉంటాడు. ఉత్తమ మధ్య అధములలో కూడా సమానముగా ఉంటాడు. అలాంటి వాడికి సుఖము మీదా దుఃఖము మీదా అనురక్తీ విరక్తీ ఉండదూ ఎందుకంటే ఇంద్రియాలనూ మనసునూ జయించినవాడు. నీవు రాజ్యాన్ని ఇలా పరిపాలించు. నేను ప్రసాదించిన సకల లోకములూ కలిగినవాడవవి వాటిని ఈ రీతిలో రక్షించు

శ్రేయః ప్రజాపాలనమేవ రాజ్ఞో యత్సామ్పరాయే సుకృతాత్షష్ఠమంశమ్
హర్తాన్యథా హృతపుణ్యః ప్రజానామరక్షితా కరహారోऽఘమత్తి


ఈ ఆత్మ ఏ శరీరన్ని తీసుకుని వచ్చిందో, అది ఏ జాతికి చెందినదో ఆ ధర్మాన్ని పాలించాలి. కానీ నేను చేస్తున్నాను అనకూడదు. రాజుకు ప్రజాపాలన వలనే కీర్తి పెర్గుతుంది. రాజు సక్రమముగా ప్రజాపాలన చేస్తే అతను శరీరన్ని విడిచి వెళ్ళేప్పుడు అతని చేత పరిపాలించబడిన ప్రజలు చేసిన పుణ్యములో ఆరవ భాగం తీసుకుని వేలతాడు. లేకుంటే వారు చేసిన పాపములో ఆరవ భాగాన్ని తీసుకుని నరకములోకి వెళతాడు. రాజు చేసిన పుణ్యాన్ని కూడా వారే తీసుకుంటారు. ప్రజలు పాపం చేసారంటే ఆ పాపం వారితో ఆ పాపం చేయనిచ్చిన రాజుది.
ప్రజలు పన్ను కట్టేది "మా జీవనం సక్రమముగా కొనసాగడానికి అడ్డంకులు తొలగించమని" కడతారు. ధర్మ బద్ధముగా సంపాదించుకునేందుకు అవకాశం కోసం ఆదాయపు పన్ను. ఏమీ చేయకుండా పన్ను తీసుకుంటే వారి పాపం రాజుకీ రాజు పుణ్యం ప్రజలకూ వస్తాయి. రక్షించకుండా పన్ను తీసుకునే వాడు ప్రజల పాపాన్ని భుజిస్తాడు.
అందుకే కరువు వస్తే పృధు చరిత్ర పదకొండు రోజులు చెప్పుకునేవారు

ఏవం ద్విజాగ్ర్యానుమతానువృత్త ధర్మప్రధానోऽన్యతమోऽవితాస్యాః
హ్రస్వేన కాలేన గృహోపయాతాన్ద్రష్టాసి సిద్ధాననురక్తలోకః

నీవు బ్రాహ్మణులతో అథితులతో ఆమోదించబడిన ధర్మాన్ని అనుసరిస్తూ, ప్రజలందరినీ వారిలో ఒకడివై పరిపాలించాలి (నేను ప్రజా సేవకున్ని అన్న భావనతో చేయాలి). వారిలో తాను కూడా ఒకడన్న భావనతో పరిపాలించాలి. ఇలా చేస్తే చాలా సిద్ధులు (సనకాదులు) నీ దగ్గరకు వస్తారు (పద్మ పురాణం - అధర్మం పోకూడదని వారు సామాన్యుల ఇంటికి రారు). వారిని నీవు చూడగలవు.

వరం చ మత్కఞ్చన మానవేన్ద్ర వృణీష్వ తేऽహం గుణశీలయన్త్రితః
నాహం మఖైర్వై సులభస్తపోభిర్యోగేన వా యత్సమచిత్తవర్తీ

ఇంత సేపు ఇక్కడ ఉండి నీ పూజలను పొందాను. నీ స్వరూప స్వభావాన్ని చూచాను. నీకు ఏమి కావాలో చెప్పు. నా నుండి ఏదైనా వరమును పొందు. నేను నీ గుణమునకూ స్వభావానికీ వశమయిపోయాను. నేను  యోగాలూ యాగాలు యజ్ఞ్యాలు మొదలైన వాటితో లొంగేవాడిని కాదు. నాకు అందరూ సమానమే. అందరితో సమానమైన భావనతో ఉన్న నన్ను కూడా నీవు ఆకర్షించి వశం చేసుకున్నావు. నీవు పుణ్యాత్ముడవు

మైత్రేయ ఉవాచ
స ఇత్థం లోకగురుణా విష్వక్సేనేన విశ్వజిత్
అనుశాసిత ఆదేశం శిరసా జగృహే హరేః

లోకగురువైన స్వామి చేత ఆదేశించబడి ఆయన ఆజ్ఞ్యను శిరసా వహించాడు. పరమాత్మ మాట్లాడినంత సేపూ ఇంద్రుడు పక్కనే ఉన్నాడు. పరమాత్మ మాట్లాడటం పూర్తి అవ్వగానే పక్కన ఉన్న ఇంద్రుడు

స్పృశన్తం పాదయోః ప్రేమ్ణా వ్రీడితం స్వేన కర్మణా
శతక్రతుం పరిష్వజ్య విద్వేషం విససర్జ హ

తను చేసిన పనికి సిగ్గుపడి పృధు చక్రవర్తి కాళ్ళు పట్టుకోబోతుంటే అతన్ని వారించి పృధు చక్రవర్తి పగని మరచిపోయి ఆలింగనం చేసుకున్నాడు. (నూరు యజ్ఞ్యాల ఫలితాన్ని పాడు చేసినా ఇంద్రుని మీద కోపం విడిచి పెట్టాడు)

భగవానథ విశ్వాత్మా పృథునోపహృతార్హణః
సముజ్జిహానయా భక్త్యా గృహీతచరణామ్బుజః

ఇలా పరమాత్మ పృధు చక్రవర్తితో అన్ని రకాల ఆరాధనలతో ఆరాధించబడ్డాడు. పరమాత్మ ఎదురుగా ఉన్న కొద్దీ పృధు చక్రవర్తికి ఆయన మీద భక్తి పెరుగుతోంది. స్వామి పాదాలను గట్టిగా పట్టుకున్నాడు

ప్రస్థానాభిముఖోऽప్యేనమనుగ్రహవిలమ్బితః
పశ్యన్పద్మపలాశాక్షో న ప్రతస్థే సుహృత్సతామ్

పుండరీకాక్షుడైన స్వామి కూడా వెళ్ళడానికి లేవబోతూ, పృధువును వదిలి వెళ్ళడం ఇష్టం లేక, ఆయన మీద అనుగ్రహముతో వెళ్ళలేకపోయాడు. ఆయన మంచి వారికి మిత్రుడు - సుహృత్సతామ్

స ఆదిరాజో రచితాఞ్జలిర్హరిం విలోకితుం నాశకదశ్రులోచనః
న కిఞ్చనోవాచ స బాష్పవిక్లవో హృదోపగుహ్యాముమధాదవస్థితః

ఆది రాజైన పృధు చక్రవర్తి పరమాత్మకు చేతులు జోడించి బాగా చూడాలనుకున్నాడు గానీ స్వామి వెళ్ళబోతుంటే నీళ్ళు నిండిన కళ్ళతో స్పష్టముగా స్వామిని చూడలేకపోతున్నాడు. కన్నీళ్ళ వలన, గొతు పూడ్చుకు పోయి మాటలు కూడా సరిగా మాట్లాడలేకపోయాడు.  భావనతో పరమాత్మను ఆలింగనం చేసుకున్నాడు

అథావమృజ్యాశ్రుకలా విలోకయన్నతృప్తదృగ్గోచరమాహ పూరుషమ్
పదా స్పృశన్తం క్షితిమంస ఉన్నతే విన్యస్తహస్తాగ్రమురఙ్గవిద్విషః

కన్నీళ్ళు తుడుచుకుని స్వామిని చూస్తూ తృప్తి పొందక రెండు కాళ్ళూ భూమి మీద ఉంచి గరుత్మంతుని భుజము మీద చేయి వేసి ఉన్న పరమాత్మతో ఇలా అన్నాడు
(దేవతల పాదాలు భూమిని తాకవు. పరమాత్మ పాదాలని భూమిని తాకించాడంటే? ఎదురుగా భక్తుడుంటే దైవత్వాన్ని కూడా మరచిపోయాడు. భక్తానుగ్రహ కాంక్షలో పరవశుడై ఉన్నాడు. గరుడుని మీద చేయి వేయడం అంటే తనను మరి కాస్త చూడాలని ఆలస్యం చేస్తున్నాడు. నేను మీ వాన్ని అని మనకు చెప్పే ప్రయత్నం)

పృథురువాచ
వరాన్విభో త్వద్వరదేశ్వరాద్బుధః కథం వృణీతే గుణవిక్రియాత్మనామ్
యే నారకాణామపి సన్తి దేహినాం తానీశ కైవల్యపతే వృణే న చ

స్వామీ! వరముని కోరుకోమన్నావు గానీ, జ్ఞ్యానమున్నవాడెవరైనా వరాలు అడుగుతాడా. మాటి మాటికీ మారిపోయేవి, గుణములచేత వికారం చెందేవి అయిన వరములను ఎందుకు కోరాలి. కోరుకునే ప్రతీ వరమూ కలిగే ప్రతీ ఫలం అంతలోనే మారిపోయేదే కదా? కర్మల వలన కలిగే ఫలితం నశించేదే. నశించని ఫలితం మనం చేసే పనుల వలన రాదు. పరమాత్మ కృపతో రావాలి. నరకములో ఉన్న వారు కూడా కోరికలు కలిగే ఉంటారు. ఆ కోరికలు ప్రతీ క్షణమూ మారేవే. సుఖము పేరుతో దుఃఖాన్ని కలిగిస్తాయి. నీవు కైవల్య పతివి. మోక్షం ఇచ్చేవాడివి

న కామయే నాథ తదప్యహం క్వచిన్న యత్ర యుష్మచ్చరణామ్బుజాసవః
మహత్తమాన్తర్హృదయాన్ముఖచ్యుతో విధత్స్వ కర్ణాయుతమేష మే వరః

అయినా నీలాంటి వారు వరము కోరుకోమంటే కోరకుంటే తప్పు. నాకు మోక్షం కూడా వద్దు. మహానుభావుల ముఖ పద్మమునుండి వచ్చే నీ కథలు లేని మోక్షము నాకు వద్దు. నాకోక కోరిక ఉంది. నకు పదివేల చెవులు కావాలి. వాటితో నిరంతరం నీ కథలను వినాలి.

స ఉత్తమశ్లోక మహన్ముఖచ్యుతో భవత్పదామ్భోజసుధా కణానిలః
స్మృతిం పునర్విస్మృతతత్త్వవర్త్మనాం కుయోగినాం నో వితరత్యలం వరైః

మహానుభావా (ఉత్తమశ్లోక) మహానుభావుల ముఖము నుండి వెలువడే నీ పాదపద్మముల వలన వెలువడే నీ కథ అనే గాలి దేహాత్మ తత్వాన్ని భాగవత తత్వాన్నీ భగవత్ తత్వాన్నీ మరచిపోయిన మాలాంటి కుయోగులకు గుర్తు చేస్తుంది.

యశః శివం సుశ్రవ ఆర్యసఙ్గమే యదృచ్ఛయా చోపశృణోతి తే సకృత్
కథం గుణజ్ఞో విరమేద్వినా పశుం శ్రీర్యత్ప్రవవ్రే గుణసఙ్గ్రహేచ్ఛయా

చక్కని కీర్తి (కథా) గల మహానుభావా, సజ్జనులతో సమాగమమై నీ సంకల్పముతో నీ కథను చాలా సార్లు వినే వాడూ, నీ గుణముల యందు రుచి ఉన్నవాడూ "ఇంక చాలు" అనడు. పశువు తప్ప మరెవ్వరు చాలూ అంటారు?
అమ్మవారు నిన్ను వరించడానికి కారణం నిరంతరం నీ గుణాలను వినాలన్న కోరికతోనే.

అథాభజే త్వాఖిలపూరుషోత్తమం గుణాలయం పద్మకరేవ లాలసః
అప్యావయోరేకపతిస్పృధోః కలిర్న స్యాత్కృతత్వచ్చరణైకతానయోః

నీవు క్షేత్ర క్షేత్రజ్ఞ్యులకు పతివి. కారుణ్య వాత్సల్యాది గుణాలు కలవాడవు. నిన్ను నేను అమ్మవారి వలెనే కోరుకుంటున్నాను. మా ఇద్దరికి నీవే పతివి. ఇద్దరమూ ఒకే భర్తను కోరుతున్నాము. అయినా మాకు కలహం కలగదు. ఎందుకంటే మా ఇద్దరికీ నీ పాదాలే కావాలి. (నీవు సహస్ర పాదములు కలవాడివి)

జగజ్జనన్యాం జగదీశ వైశసం స్యాదేవ యత్కర్మణి నః సమీహితమ్
కరోషి ఫల్గ్వప్యురు దీనవత్సలః స్వ ఏవ ధిష్ణ్యేऽభిరతస్య కిం తయా

ఒక వేళ మా ఇద్దరికీ కలహం వచ్చినా మంచిదే. మా ఇద్దరి కోరికా ఒకే పని మీద ఉంది. నీ గుణాలు వినాలనే. అయినా నాకు భయం లేదు. భక్త పక్షపాతి అయిన నీవు మా వైపే ఉంటావు. ఇంద్రుడితో కలహం వచ్చినప్పుడు కూడా నీవు నా పక్షమే కదా. నీ భక్తులు ఎంత చిన్న సేవ చేసినా దాన్ని గొప్పగా చూస్తావు. నీవు దీన వత్సలుడివి. దైన్యం ఎక్కువగా ఉన్న నాయందు దయ ఎక్కువ చూపుతావు. ఏ కోరికలూ లేని నీవు నా వైపే ఉంటావు, అమ్మవారితో నీకేమి పని (కోరికలున్నవారు నిన్ను వదిలి అమ్మను ఆరాధిస్తారు).

భజన్త్యథ త్వామత ఏవ సాధవో వ్యుదస్తమాయాగుణవిభ్రమోదయమ్
భవత్పదానుస్మరణాదృతే సతాం నిమిత్తమన్యద్భగవన్న విద్మహే

ఇందుకోసమే సజ్జనులూ భక్తులూ ఉత్తములూ నిన్ను సేవిస్తారు. నీ భక్తులను చూస్తే కట్టుకున్న భార్యనే పట్టించుకోవు. మాయతో ఏర్పడే సత్వ రజ తమో గుణాభివృద్ధిని తొలగించేవాడివి. నీ పాదములను స్మరించడం కంటే వేరే వరము మేమే కాదు, భక్తులెవ్వరికీ తెలియదు. సత్పురుషులకు భగవానుని పాద పద్మాలు తప్ప వేరే కోరేది ఉందని తెలియదు

మన్యే గిరం తే జగతాం విమోహినీం వరం వృణీష్వేతి భజన్తమాత్థ యత్
వాచా ను తన్త్యా యది తే జనోऽసితః కథం పునః కర్మ కరోతి మోహితః

బహుశా అన్ని లోకాలను మోహింపచేసేది నీ మాట. నన్ను కూడా మోహింపచేయడానికే అది ప్రయోగించావు, వరము కోరుకోమని. ప్రేమతో మాట్లాడిన నీ మాటల మాయతో, మోహింపచేసే వాక్కుతో బంధిచబడిన వారు మళ్ళీ మోహం పొంది వేరే పని ఎలా చేస్తారు.

త్వన్మాయయాద్ధా జన ఈశ ఖణ్డితో యదన్యదాశాస్త ఋతాత్మనోऽబుధః
యథా చరేద్బాలహితం పితా స్వయం తథా త్వమేవార్హసి నః సమీహితుమ్

నీ మాయతో మోహించబడిన మానవులు నీ కంటే భిన్నమైనదాన్ని కోరుకుంటే వాడు అజ్ఞ్యాని. కాసేపు నీవు మాకు అమ్మ అనుకోకుండా నాన్న అనుకో. తల్లి అడిగినదిస్తుంది. తండ్రి మేలు కోరేదిస్తాడు. అలాగే మా హితాన్ని నీవు కోరాలి. మాచే వరమడిగిస్తావా లేదా నీ సేవ చేయించుకుంటావా? తండ్రి హితాన్ని కోరినట్లుగా మా హితం తెలిసినవాడవు నీవే ఏది మంచిదో అదే చేయి.

మైత్రేయ ఉవాచ
ఇత్యాదిరాజేన నుతః స విశ్వదృక్తమాహ రాజన్మయి భక్తిరస్తు తే
దిష్ట్యేదృశీ ధీర్మయి తే కృతా యయా మాయాం మదీయాం తరతి స్మ దుస్త్యజామ్

ఇలా అది రాజు స్తోత్రం చేస్తే పరమాత్మ "నీకు నా మీద భక్తి నిరంతరం ఇలాగే ఉండనీ. ఈ భక్తితో ఇతరులు దాటలేని సంసారాన్ని నీవు దాటుతావు"

తత్త్వం కురు మయాదిష్టమప్రమత్తః ప్రజాపతే
మదాదేశకరో లోకః సర్వత్రాప్నోతి శోభనమ్

నేను చెప్పినట్లుగా ఏమరుపాటు లేకుండా పాలించు. నా మాట వినే వారు అన్ని చోట్లా మంచే పొందుతారు.

మైత్రేయ ఉవాచ
ఇతి వైన్యస్య రాజర్షేః ప్రతినన్ద్యార్థవద్వచః
పూజితోऽనుగృహీత్వైనం గన్తుం చక్రేऽచ్యుతో మతిమ్

ఈ ప్రకారముగా పృధు చక్రవర్తి మాట్లను అభినందించి అతనిచే పూజించబడి పరమాత్మ వెళ్ళాలనుకున్నాడు

దేవర్షిపితృగన్ధర్వ సిద్ధచారణపన్నగాః
కిన్నరాప్సరసో మర్త్యాః ఖగా భూతాన్యనేకశః
యజ్ఞేశ్వరధియా రాజ్ఞా వాగ్విత్తాఞ్జలిభక్తితః
సభాజితా యయుః సర్వే వైకుణ్ఠానుగతాస్తతః

పరమాత్మే కాకుండా ఇతరులందరూ పృధు చక్రవర్తి చేసిన పూజలు స్వీకరించి పరమాత్మ వెళ్ళగానే అందరూ తమ తమ స్థానాలకు వెళ్ళారు

భగవానపి రాజర్షేః సోపాధ్యాయస్య చాచ్యుతః
హరన్నివ మనోऽముష్య స్వధామ ప్రత్యపద్యత

పరమాత్మ కూడా అందరి మనసునూ దొంగలించుకొని వెళ్ళినట్లుగా వెళ్ళాడు.

అదృష్టాయ నమస్కృత్య నృపః సన్దర్శితాత్మనే
అవ్యక్తాయ చ దేవానాం దేవాయ స్వపురం యయౌ

పరమాత్మ వెళ్ళిన తరువాత పృధు చక్రవర్తి పరమాత్మ వెళ్ళిన దిక్కుకి నమస్కరించాడు. దేవతలందరికీ దేవుడైన పరమాత్మకి నమస్కారం చేసి తన నగరానికి తాను వెళ్ళాడు 

Popular Posts