Followers

Wednesday 5 February 2014

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం పన్నెండవ అధ్యాయం


మైత్రేయ ఉవాచ
ఇతి తే వర్ణితః క్షత్తః కాలాఖ్యః పరమాత్మనః
మహిమా వేదగర్భోऽథ యథాస్రాక్షీన్నిబోధ మే

కాలమనే భగవంతుని మహిమ చెప్పాను. ఇపుడు బ్రహ్మ ఎలా ఎలా సృష్టి చేసాడో చెబుతాను. జాగ్రత్తగా విను

ససర్జాగ్రేऽన్ధతామిస్రమథ తామిస్రమాదికృత్
మహామోహం చ మోహం చ తమశ్చాజ్ఞానవృత్తయః

మొదట బ్రహ్మ అజ్ఞ్యాన సృష్టి చేసాడు. సృష్టి రెండు రకాలు అబోధ సృష్టి (అజ్ఞ్యాన సృష్టి) బోధ సృష్టి. బ్రహ్మగారికి కూడా "నేను తప్పు చేసానేమో" అనిపించే సృష్టి. అందులో మొదటిది అంధ తామిశ్రమూ, తామిశ్రమూ, మహా మోహము, మోహమూ, తమస్సు. ఈ ఐదూ అజ్ఞ్యాన వృత్తులు. అంటే చీకటి అని కూడ తెలుసుకోలేని స్థితి.

దృష్ట్వా పాపీయసీం సృష్టిం నాత్మానం బహ్వమన్యత
భగవద్ధ్యానపూతేన మనసాన్యాం తతోऽసృజత్

పాపమే అజ్ఞ్యానానికి కారణం. అలాంటి పాపం మన దరికి రాకుండా చేయమని స్వామిని ప్రార్థిస్తాము. మనం ఏ సమయములో ఏమి అనుభవించాలో ముందే రాసి ఉంటుంది. పూర్వ జన్మలో చేసిన పాపమే ఇపుడు ఆలోచన రూపములో బుద్ధిరూపములో వచ్చి పాప కర్మ అనుభవించేట్లు చేస్తింది. ఎపుడైతే మనం చేసిన పుణ్యం సాత్విక భావాన్ని భక్తినీ కలిగించిందో, ఎపుడైతే మనం పుణ్య ఫలితాన్ని అనుభవిస్తున్నమో ఆ సమయాములోనే "పరమాత్మా, మళ్ళీ నా దగ్గరకి పాపం వంతు రానివ్వకూ, నీవు సర్వ సమర్ధుడవు, దయా మయుడవు. ఆ పాపమును శమింపచేసి నాకు ఇలాంటి సాత్విక బుద్ధినే కలగనీ". మనం చెడుపని చేసామంటే అది పాప ఫలితమే. గతం అనుభవించడానికే కాదు, ముందు అనుభవించాల్సిన దానికి కూడా సిద్ధం చేసుకుంటున్నాము. అలా సిద్ధం చేసుకోకుండా చేయమని ప్రార్థిస్తాము.
బ్రహ్మగారు సృష్టి చేసి తనను తానే నిందించుకున్నాడు. అపుడు భగవానుని మరలా ధ్యానం చేసి, ఆ ధ్యానము ద్వారా పవిత్రమైన మనసుతో మరొక సృష్టి చేసాడు.

సనకం చ సనన్దం చ సనాతనమథాత్మభూః
సనత్కుమారం చ మునీన్నిష్క్రియానూర్ధ్వరేతసః

నలుగురు మునులని సృష్టించాడు. వీరు నిష్క్రియులు. ఫలా కాంక్షతో కర్మలు ఆచరించేవారు కాదు. దేహం కోసం గానీ మోహం కోసం గానీ లోకం కోసం గానీ ఎలాంటి పని చేయని వారు. వీరు ఊర్ధ్వరేతస్కులు, అస్ఖలిత బ్రహ్మచారులు.

తాన్బభాషే స్వభూః పుత్రాన్ప్రజాః సృజత పుత్రకాః
తన్నైచ్ఛన్మోక్షధర్మాణో వాసుదేవపరాయణాః

వారితో సృష్టి చేయమని బ్రహ్మగారు చెప్పగా, మోక్ష ధర్మం గలవారైన వారు, నిరంతరం శ్రీమన్నారాయణ ధ్యానముతో ఉండేవారు కాబట్టి వారు సృష్టి చేయడానికి ఒప్పుకోలేదు

సోऽవధ్యాతః సుతైరేవం ప్రత్యాఖ్యాతానుశాసనైః
క్రోధం దుర్విషహం జాతం నియన్తుముపచక్రమే

తండ్రి గారి ఆజ్ఞ్యను ధిక్కరించడముతో బ్రహ్మగారికి చాలా కోపం వచ్చింది. జాగ్రత్తగా ఆ కోపాన్ని నిగ్రహించుకున్నాడు (నిగ్రహించుకోవడానికి ప్రయత్నించాడు).

ధియా నిగృహ్యమాణోऽపి భ్రువోర్మధ్యాత్ప్రజాపతేః
సద్యోऽజాయత తన్మన్యుః కుమారో నీలలోహితః

ఇలా వచ్చిన కోపాన్ని బుద్ధితో నిగ్రహించుకున్నాడు. గానీ కోపం ఎక్కువ వచ్చినా శరీరం మారుతుంది. శరీరములో కోపము చేత వచ్చిన వికారం నిగ్రహింపబడక, కనుబొమ్మలు ముడిపడ్డాయి. దాని నుంచి నలుపూ ఎరుపూ కలిపి ఉన్న ఆకారముతో పుట్టాడు.

స వై రురోద దేవానాం పూర్వజో భగవాన్భవః
నామాని కురు మే ధాతః స్థానాని చ జగద్గురో

దేవతలందరికన్నా ముందు పుట్టాడు, పుట్టగానే పెద్దగా రోదించాడు, తనకి పేరు పెట్టమని, ఉండటానికి ఇల్లు ఏర్పరచమని అడిగాడు

ఇతి తస్య వచః పాద్మో భగవాన్పరిపాలయన్
అభ్యధాద్భద్రయా వాచా మా రోదీస్తత్కరోమి తే

ఆయన మాట విని మంగళ కరమైన వాక్కుతో బ్రహ్మగారు పలికారు "రోదించకు, అలాగే చేస్తాను"

యదరోదీః సురశ్రేష్ఠ సోద్వేగ ఇవ బాలకః
తతస్త్వామభిధాస్యన్తి నామ్నా రుద్ర ఇతి ప్రజాః

ఎంతో ఉద్వేగముగా ఏడిచావు కావున, నీ పేరు రుద్ర. ఈయన అంతఃకరణ దేవత, అభిమాన దేవత, అహంకార దేవత. హృదయములో ఉండి ఈ స్వామే మన శరీరములో మనసునీ బుద్ధినీ కూర్చేవాడు. ఈయనే పాతాళ లోకానికి వెళితే ఆదిశేషుడు.

హృదిన్ద్రియాణ్యసుర్వ్యోమ వాయురగ్నిర్జలం మహీ
సూర్యశ్చన్ద్రస్తపశ్చైవ స్థానాన్యగ్రే కృతాని తే

రుద్రుడు ఉండే స్థానాలు పదకొండు 1. హృదయము 2. ఇంద్రియములూ 3. ప్రాణములు 4. ఆకాశము 5. వాయువు 6. అగ్ని 7. జలం 8. భూమి 9. సూర్యుడు 10. చంద్రుడు 11. తపస్సు

మన్యుర్మనుర్మహినసో మహాఞ్ఛివ ఋతధ్వజః
ఉగ్రరేతా భవః కాలో వామదేవో ధృతవ్రతః

ఈ పదకొండూ ఆయన పేర్లు: మన్యువు, మను, మహి, మహాన్, శివ, ఋతధ్వజ, ఉగ్రరేతా, భవ, కాల, వామదేవ, ధృతవ్రత

ధీర్ధృతిరసలోమా చ నియుత్సర్పిరిలామ్బికా
ఇరావతీ స్వధా దీక్షా రుద్రాణ్యో రుద్ర తే స్త్రియః

ఈయన భార్యలు: ధీః, వృత్తిః, ఉమా , ఉసన, నియుత్, సర్పి, ఇల, అంబిక, ఇరావతీ స్వధా దీక్షా

గృహాణైతాని నామాని స్థానాని చ సయోషణః
ఏభిః సృజ ప్రజా బహ్వీః ప్రజానామసి యత్పతిః

నీవు చాలా మందిని సృష్టి చేయి. నీవే మొదటి ప్రజాపతివి.

ఇత్యాదిష్టః స్వగురుణా భగవాన్నీలలోహితః
సత్త్వాకృతిస్వభావేన ససర్జాత్మసమాః ప్రజాః

అందరూ తనలాంటి వారినే సృష్టించాడు.

రుద్రాణాం రుద్రసృష్టానాం సమన్తాద్గ్రసతాం జగత్
నిశామ్యాసఙ్ఖ్యశో యూథాన్ప్రజాపతిరశఙ్కత

ఆయన గుంపులు గుంపులుగా సృష్టించాడు. ఆ వచ్చిన పిల్లలు జగత్తుని మింగివేస్తున్నారు.

అలం ప్రజాభిః సృష్టాభిరీదృశీభిః సురోత్తమ
మయా సహ దహన్తీభిర్దిశశ్చక్షుర్భిరుల్బణైః

అపుడు బ్రహ్మగారు, "సురోత్తమా, నీ సృష్టి చాలు" ఈ రుద్రులందరూ పుట్టగానే తినడం మొదలుపెట్టారు. నిప్పులు గ్రక్కే చూపుతో పచనం చేసి తింటున్నారు.వీరు నాతో కలిపి కాలుస్తున్నారు.

తప ఆతిష్ఠ భద్రం తే సర్వభూతసుఖావహమ్
తపసైవ యథా పూర్వం స్రష్టా విశ్వమిదం భవాన్

నీకు మేలు జరుగుగాక. అన్ని ప్రాణులూ సంతోషముగా ఉండే తపస్సు చేయి.

తపసైవ పరం జ్యోతిర్భగవన్తమధోక్షజమ్
సర్వభూతగుహావాసమఞ్జసా విన్దతే పుమాన్

ఈ తపస్సు ఎందుకంటే పరంజ్యోథి స్వరూపుడు అయిన, సర్వ రూప గుహావాసుడైన నారాయణున్ని పొందుతాము.

మైత్రేయ ఉవాచ
ఏవమాత్మభువాదిష్టః పరిక్రమ్య గిరాం పతిమ్
బాఢమిత్యముమామన్త్ర్య వివేశ తపసే వనమ్

ఇలా బ్రహ్మ చెప్పిన తరువాత, ఆయన చుట్టూ ప్రదక్షిణం చేసి. అలా చెప్పి తపస్సుకోసమని వనానికి బయలు దేరాడు

అథాభిధ్యాయతః సర్గం దశ పుత్రాః ప్రజజ్ఞిరే
భగవచ్ఛక్తియుక్తస్య లోకసన్తానహేతవః

అపుడు పదిమంది ప్రజాపతులను సృష్టించాడు. వీరు లోకమును వ్యాపింపచేయడానికి కారణం.

మరీచిరత్ర్యఙ్గిరసౌ పులస్త్యః పులహః క్రతుః
భృగుర్వసిష్ఠో దక్షశ్చ దశమస్తత్ర నారదః

1. మరీచి 2. అత్రి 3. అంగిరస 4. పులస్త్య 5. పులహ 6. క్రతు 7. బృగుః 8. వసిష్ఠ 9. దక్ష 10. నారద

ఉత్సఙ్గాన్నారదో జజ్ఞే దక్షోऽఙ్గుష్ఠాత్స్వయమ్భువః
ప్రాణాద్వసిష్ఠః సఞ్జాతో భృగుస్త్వచి కరాత్క్రతుః

ఉత్సఙ్గాన్నారదో జజ్ఞే - తొడ నుండి నారదుడు. అంగుష్ఠం నుండి దక్షుడు. ప్రాణము నుండి వసిష్టుడు
బృగువు చర్మం నుంచి, చేతి నుండి క్రతు

పులహో నాభితో జజ్ఞే పులస్త్యః కర్ణయోరృషిః
అఙ్గిరా ముఖతోऽక్ష్ణోऽత్రిర్మరీచిర్మనసోऽభవత్

పులహుడు నాభి నుండి, చెవులనుండి పులస్త్యుడు, అంగిరసుడు ముఖము నుండి, కనులనుండి అత్రి, మరీచి మనసు నుండి

ధర్మః స్తనాద్దక్షిణతో యత్ర నారాయణః స్వయమ్
అధర్మః పృష్ఠతో యస్మాన్మృత్యుర్లోకభయఙ్కరః

కుడి స్థనం నుండి ధర్ముడు. ఈ ధర్మునికే మూర్తి అనే భార్య నుండి శ్రీమన్నారాయణుడూ, నరుడు ఆవిర్భవించారు. వీపు నుండి అధర్మం. లోక భయంకరుడైన మృత్యువు అధర్మానికి పుత్రుడు

హృది కామో భ్రువః క్రోధో లోభశ్చాధరదచ్ఛదాత్
ఆస్యాద్వాక్సిన్ధవో మేఢ్రాన్నిరృతిః పాయోరఘాశ్రయః

హృదయం నుండి మన్మధుడు, కనుబొమ్మల నుండి క్రోధం. కింది పెదవి లోభానికి చిహ్నం. నోటినుండి వాక్కు, జననేంద్రియం నుంచి సముద్రం, మలవిసర్జన అవయవం నుండి నిరృతి

ఛాయాయాః కర్దమో జజ్ఞే దేవహూత్యాః పతిః ప్రభుః
మనసో దేహతశ్చేదం జజ్ఞే విశ్వకృతో జగత్

చాయ నుండి కర్దముడు పుట్టాడు. ఈయన దేవహూతి పతి. ఈ రీతిలో కొంతమంది మనసు నుండి, శరీరం నుండి సృష్టి జరిగింది

వాచం దుహితరం తన్వీం స్వయమ్భూర్హరతీం మనః
అకామాం చకమే క్షత్తః సకామ ఇతి నః శ్రుతమ్

అధర్మాన్ని చెప్పేప్పుడు ఇలానే జరిగిందీ అనకుండా, "ఇలా అయ్యిందట " అంటాము. బ్రహ్మ తన శరీరము నుండి సుకుమారముగా ఉండే, సౌందర్యముగా ఉండే, కామము లేని, పుత్రికని బ్రహ్మగారు కామించాడని విన్నాము.

తమధర్మే కృతమతిం విలోక్య పితరం సుతాః
మరీచిముఖ్యా మునయో విశ్రమ్భాత్ప్రత్యబోధయన్

తన పిల్లలందరూ అక్కడే ఉండి, "ఇది అధర్మం " అని చెప్పారు. అలా చెప్పి అపహాస్యముగా నవ్వారు. ఇలా చేసిన పాపానికే హిరణ్యకశిపునికి ఆరుగురు సంతానముగా పుట్టారు. తరువాత వీరే దేవకీ వసుదేవులకి ఆరు శిశువులుగా పుట్టారు.

నైతత్పూర్వైః కృతం త్వద్యే న కరిష్యన్తి చాపరే
యస్త్వం దుహితరం గచ్ఛేరనిగృహ్యాఙ్గజం ప్రభుః

ఇలాంటి పని మీకంటే ముందు వారు చేయలేదు. ఇక ముందు వారు కూడా చేయరు. శరీరం వలన కలిగిన కోరికను నిగ్రహించుకోకుంటే అది ధర్మం కాదు.

తేజీయసామపి హ్యేతన్న సుశ్లోక్యం జగద్గురో
యద్వృత్తమనుతిష్ఠన్వై లోకః క్షేమాయ కల్పతే

నీవు జగత్గురువువి, నీకు పాపం అంటదు. ఐనా గొప్పవారంతా మాకు పాపం అంటదు  కాబట్టి చేస్తాము అంటే, తరువాతి వారు కూడా చేస్తారు. మీ వంటి వారికి రెండూ సమానమే. కనీ ఇది సుశ్లోక్యం (అందరికీ చెప్పుకునేది) కాదు. తేజోవంతులు ఆచరించిన దానిని తరువాతి వారు ఆచరించి క్షేమపడాలి

తస్మై నమో భగవతే య ఇదం స్వేన రోచిషా
ఆత్మస్థం వ్యఞ్జయామాస స ధర్మం పాతుమర్హతి

తన దివ్య ప్రభావముతో తనలో దాగి ఉన్న సకల జగత్తునీ వ్యక్తీకరించిన పరమాత్మకు నమస్కారం.

స ఇత్థం గృణతః పుత్రాన్పురో దృష్ట్వా ప్రజాపతీన్
ప్రజాపతిపతిస్తన్వం తత్యాజ వ్రీడితస్తదా
తాం దిశో జగృహుర్ఘోరాం నీహారం యద్విదుస్తమః

ఇలా పుత్రులు బోధించే సరికి బ్రహ్మగారు సిగ్గుపడి తనువుని విడిచిపెట్టాడు. ఇలా విడిచి పెట్టిన శరీరం అన్ని దిక్కులకూ వ్యాపించింది. ఇది అన్ని దిక్కులకూ పొద్దున్న మంచు రూపములో వ్యాపించింది. అందుకే ప్రాతఃకాల మంచుని తాకకూడదు.

కదాచిద్ధ్యాయతః స్రష్టుర్వేదా ఆసంశ్చతుర్ముఖాత్
కథం స్రక్ష్యామ్యహం లోకాన్సమవేతాన్యథా పురా

ధ్యానం చేస్తున్న బ్రహ్మనోటి నుండి నాలుగు వేదాలు బయటకి వచ్చాయి. ఎంత కష్టపడ్డా, అంతకు ముందు ఉన్నట్లు సృష్టి రావట్లేదు అని

చాతుర్హోత్రం కర్మతన్త్రముపవేదనయైః సహ
ధర్మస్య పాదాశ్చత్వారస్తథైవాశ్రమవృత్తయః

నాలుగు వేదములను వ్యక్తీకరింపచేసి, మీమాంస, జ్యోతీషము, న్యాయ వ్యాకరణమునూ, ఉపవేదములు (ఆయుర్వేదమూ, ధనుర్వేదమూ, గాంధర్వవేదం(సంగీతమూ), తర్క, రాజ నీతులనూ సృష్టించాడు. ధర్మము యొక్క నాలుగు పాదములనూ సృష్టించాడు. నాలుగు ఆశ్రమాలనూ సృష్టించాడు. నాలుగు వర్ణములనూ సృష్టించాడు.

విదుర ఉవాచ
స వై విశ్వసృజామీశో వేదాదీన్ముఖతోऽసృజత్
యద్యద్యేనాసృజద్దేవస్తన్మే బ్రూహి తపోధన

అపుడు విద్రుడు "నాలుగు వేదాలనూ ముఖం నుండి సృజించారన్నారు. మరి తక్కిన వాటిని ఎక్కడి నుంచి సృజించారు".

మైత్రేయ ఉవాచ
ఋగ్యజుఃసామాథర్వాఖ్యాన్వేదాన్పూర్వాదిభిర్ముఖైః
శాస్త్రమిజ్యాం స్తుతిస్తోమం ప్రాయశ్చిత్తం వ్యధాత్క్రమాత్

ఋక్ యజు సామ అధర్వా అనే వేదాలను తూర్పు దక్షిణ పశ్చిమ ఉత్తరం నుంచి సృష్టించాడు. స్తుతి మీమాంస,  ప్రాయశ్చిత్తం వీటిని కూడా అలాగే సృష్టించాడు

ఆయుర్వేదం ధనుర్వేదం గాన్ధర్వం వేదమాత్మనః
స్థాపత్యం చాసృజద్వేదం క్రమాత్పూర్వాదిభిర్ముఖైః

ఆయుర్వేదం ధనుర్వేదం గాన్ధర్వం స్థాపత్య (శిల్పవేదం) - ఇవి ఉపవేదాలు. ఇవి కూడా ఆయా ముఖాలనుండి సృష్టించాడు

ఇతిహాసపురాణాని పఞ్చమం వేదమీశ్వరః
సర్వేభ్య ఏవ వక్త్రేభ్యః ససృజే సర్వదర్శనః

ఐదవ వేదముగా ఇతిహాస పురాణములను సృష్టించాడు. అన్నిటినీ చూడగలిగేవాడు కాబట్టి అన్ని ముఖములతో అన్ని శాస్త్రాలనూ సృష్టించాడు.

షోడశ్యుక్థౌ పూర్వవక్త్రాత్పురీష్యగ్నిష్టుతావథ
ఆప్తోర్యామాతిరాత్రౌ చ వాజపేయం సగోసవమ్
విద్యా దానం తపః సత్యం ధర్మస్యేతి పదాని చ
ఆశ్రమాంశ్చ యథాసఙ్ఖ్యమసృజత్సహ వృత్తిభిః

యజ్ఞములనూ, విద్యా దానం తపసు సత్యమనే నాలుగు పాదాలున్న ధర్మాన్ని,

సావిత్రం ప్రాజాపత్యం చ బ్రాహ్మం చాథ బృహత్తథా
వార్తా సఞ్చయశాలీన శిలోఞ్ఛ ఇతి వై గృహే

సావిత్రం ప్రాజాపత్యం చ బ్రాహ్మం సృష్టించాడు. బతుకు తెరువుకు (వార్తా) కూర్చుకోవడం (సఞ్చయ) పండించి తినడం (శాలీనం) శిలోంచ (పండించిన వారు తీసుకుపోగా మిగిలినవి తీసుకోవడం)

వైఖానసా వాలఖిల్యౌ దుమ్బరాః ఫేనపా వనే
న్యాసే కుటీచకః పూర్వం బహ్వోదో హంసనిష్క్రియౌ

ఆశ్రమాలలో కొందరు వైఖానసా (నిత్యం తపసులో ఉండి అజగర వృత్తిని అవలంబించేవారు) వాలఖిల్యౌ (తల్లక్రిందులుగా ఉండి నిరాహారముగా ఉండేవారు) ఔదుమ్బరాః (పళ్ళని మాత్రం తినేవారు) ఫేనపా ( నురుగును మాత్రమే తిని బ్రతికే వారు).
కొందరు సన్యాసములో కుటీచకః (కుటీరములో ఉండి భిక్షకు కూడా వెళ్ళని వారు),
బహ్వోద - బాగా తినే సన్యాసులు. కొందరు హంసనిష్క్రియౌ - ఏ పనీ తనకోసం చేయరు.

ఆన్వీక్షికీ త్రయీ వార్తా దణ్డనీతిస్తథైవ చ
ఏవం వ్యాహృతయశ్చాసన్ప్రణవో హ్యస్య దహ్రతః

ఆన్వీక్షికీ  - గురువు వెంట ఉండి ధ్యానం చేసి చూచేది - వేదాంతం. వారతా - గృహస్థాశ్రం జీవనం
దణ్డనీతి - అర్థ శాస్త్రం.
బ్రహ్మ యొక్క దహరాకాశం నుండి మూడు వ్యాహృతులు పుట్టాయి, భూః భువః సువః. తరువాత ఓంకారం.

తస్యోష్ణిగాసీల్లోమభ్యో గాయత్రీ చ త్వచో విభోః
త్రిష్టుమ్మాంసాత్స్నుతోऽనుష్టుబ్జగత్యస్థ్నః ప్రజాపతేః

మజ్జాయాః పఙ్క్తిరుత్పన్నా బృహతీ ప్రాణతోऽభవత్
స్పర్శస్తస్యాభవజ్జీవః స్వరో దేహ ఉదాహృత

ఊష్మాణమిన్ద్రియాణ్యాహురన్తఃస్థా బలమాత్మనః
స్వరాః సప్త విహారేణ భవన్తి స్మ ప్రజాపతేః

తరువాత పరమాత్మ యొక్క కేశములనుండి ఉష్ణిక్ అనే చందస్సు. చర్మం నుండి గాయత్రీ చందస్సు, మాన్సము నుండి త్రిష్టుప్, ఎముకల నుండి జగత్తు, కొవ్వు నుండి పంక్తి, బృహతీ అనే చందస్సు ప్రాణం నుండి. అప్పటినుండే స్పర్శ ఏర్పడి దేహం నుండి స్వరం ఏర్పడింది. శ్ ష స హ అనేవి ఊష్మాలు. ఇవే బ్రహ్మగారికి ఇంద్రియములు.  ఇవి జఠరాగ్ని నుండి వస్తాయి. స్వరములూ అంటే అచ్చులు. కా నుంచి మా వరకూ ఉండేది స్పర్శలు. య ర ల వ అనేవి అంతస్థములు. ఇవే బ్రహ్మకు బలం. స్వరములు అంటే అచ్చులు అ ఎ ఉ ఋ ఎ ఓ అనే పరమాత్మ విహారం నుండి పుట్టాయి. శబ్దాలు సృష్టించాడు కాబట్టి ఆయనని శబ్ద బ్రహ్మ అంటారు.

శబ్దబ్రహ్మాత్మనస్తస్య వ్యక్తావ్యక్తాత్మనః పరః
బ్రహ్మావభాతి వితతో నానాశక్త్యుపబృంహితః

ఈయనే కనపడాడు కనపడడు, తెలియబడతాడు, తెలియబడడు. ఏ  ఏ సృష్టి చేసేప్పుడు ఆయా సృష్టిని తనదిగా చేసుకుని చేస్తాడు.

తతోऽపరాముపాదాయ స సర్గాయ మనో దధే
ఋషీణాం భూరివీర్యాణామపి సర్గమవిస్తృతమ్

ఇలా ఒక శరీరాన్ని తీసుకుని చేసిన సృష్టి బాగుందనిపించింది గనీ, తన శరీరాన్ని విడిచిపెట్టడం వలన, వేరొక శరీరాన్ని తీసుకుని సృష్టి చేసాడు. అయినా సృష్టి ఆశించినంత లేదు. విస్తరించలేదు.

జ్ఞాత్వా తద్ధృదయే భూయశ్చిన్తయామాస కౌరవ
అహో అద్భుతమేతన్మే వ్యాపృతస్యాపి నిత్యదా

ఏమి చేస్తే సృష్టి బాగా వ్యాపిస్తుందీ అని, ఇంత తపసు చేస్తున్న, ఇంత కష్టపడుతున్నా వ్యాప్తి చెందటం లేదంటే

న హ్యేధన్తే ప్రజా నూనం దైవమత్ర విఘాతకమ్
ఏవం యుక్తకృతస్తస్య దైవం చావేక్షతస్తదా

దైవమే విఘాతం కల్పిస్తోంది అని. తాను చేసే పనీ చేసాడు, వచ్చిన అడ్డూ చూచాడు. స్వామి అడ్డువస్తున్నాడంటే ఇది సరి అయిన విధానం కాదు. కొత్త పద్దతిని సృష్టి కొరకు ఏర్పరచాలి అని. బ్రహ్మ తన శరీరాన్ని రెండు భాగాలు చేసాడు.

కస్య రూపమభూద్ద్వేధా యత్కాయమభిచక్షతే
తాభ్యాం రూపవిభాగాభ్యాం మిథునం సమపద్యత

ఒకటి పూర్వ భాగం ఇంకోటి ఉత్తర భాగం. అప్పుడు శరీరం కాయం అయ్యింది. ఆ రెండు శరీరములతో రెండు ఆకారాలు ఏర్పడ్డాయి.

యస్తు తత్ర పుమాన్సోऽభూన్మనుః స్వాయమ్భువః స్వరాట్
స్త్రీ యాసీచ్ఛతరూపాఖ్యా మహిష్యస్య మహాత్మనః

అందులో ఒక ఆకారం పురుష రూపముగా పుట్టింది. ఆయనే మనువు. రెండవ ఆకారమైన స్త్రీ శతరూప. ఈ మనువుకు శతరూప భార్యగా ఏర్పడింది

తదా మిథునధర్మేణ ప్రజా హ్యేధామ్బభూవిరే
స చాపి శతరూపాయాం పఞ్చాపత్యాన్యజీజనత్

అప్పటినుంచీ స్త్రీ పురుష మిధునముతో సృష్టి జరిగింది. మనువు నుండి పుట్టినవారు మానవులు అయ్యారు.

ప్రియవ్రతోత్తానపాదౌ తిస్రః కన్యాశ్చ భారత
ఆకూతిర్దేవహూతిశ్చ ప్రసూతిరితి సత్తమ

వీరికి ఐదుగుర్ పుట్టారు. ప్రియవ్రత ఉత్తానపాదులనే మగ సంతానం, ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ఆడ సంతానం పుట్టారు.

ఆకూతిం రుచయే ప్రాదాత్కర్దమాయ తు మధ్యమామ్
దక్షాయాదాత్ప్రసూతిం చ యత ఆపూరితం జగత్

ఆకూతిని రుచి అనే ప్రజాపతికీ, దేవహూతిని కర్దమునికీ, రుచిని దక్ష ప్రజాపతికీ ఇచ్చి వివాహం చేసాడు. ఈ ఉన్న ముగ్గురిలో దక్షుడు చేసిన సృష్టితో ప్రపంచం నిండిపోయింది.

Popular Posts