Followers

Friday 7 February 2014

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం పదమూడవ అధ్యాయం


సూత ఉవాచ
నిశమ్య కౌషారవిణోపవర్ణితం ధ్రువస్య వైకుణ్ఠపదాధిరోహణమ్
ప్రరూఢభావో భగవత్యధోక్షజే ప్రష్టుం పునస్తం విదురః ప్రచక్రమే

పరమాత్మ ఆర్తత్రాణ పరాయణుడు. అనన్యమైన శరణం వేడిన వారు జడులైనా జ్ఞ్యానులైనా పిలిస్తే వెంటనే వస్తాడు. పరమాత్మ ఎక్కడో ఉంటాడు, మనం పిలిస్తే పలుకుతాడా అని అనుకునే మనకు ధృవ చరిత్ర చదివితే పరమాత్మ వాత్సల్యం అర్థమవుతుంది. దూడ ప్రసవించగానే తల్లి తన నాలుకతో దూడ ఒంటిని శుభ్రపరుస్తుంది. పరమాత్మ కూడా తప్పులు చేసిన వారిని విశేషముగా కరుణిస్తాడు. ఇలాంటి చరిత్ర చదివితే పరమాత్మ యందు భక్తి కలుగుతుంది. ఆయన ఇంద్రియ వ్యాపారములను కిందుగా చేసేవాడు 
ధృవుడు వైఖుంఠానికి వెళ్ళిన గాధ విన్న విదురుడు మళ్ళీ ఇంకా అడగటానికి ప్రారంభించాడు.

విదుర ఉవాచ
కే తే ప్రచేతసో నామ కస్యాపత్యాని సువ్రత
కస్యాన్వవాయే ప్రఖ్యాతాః కుత్ర వా సత్రమాసత

ధృవుని యొక్క గొప్ప్ప తనాన్ని నారదుడు ప్రాచేతసుల యజ్ఞ్యములో గానము చేసాడని చెప్పరు. ఆ ప్రచేతసులు ఎవరూ, ఏ వంశం వారు. ఎక్కడ యజ్ఞ్యం చేసారు.

మన్యే మహాభాగవతం నారదం దేవదర్శనమ్
యేన ప్రోక్తః క్రియాయోగః పరిచర్యావిధిర్హరేః

నారదుడు భగవంతునికి అత్యంత ప్రీతి పాత్రుడైన భక్తాగ్రేసుడు. భగవంతుని సాక్షాత్కరించుకున్న వాడు నారదుడు అని అనుకుంటున్నాను. పరమాత్మకు ఎలా ఉపచారములు చేయాలి, ఎలా పరిచర్యలు చేయాలి ( పాంచరాత్ర ఆగమ రీత్యా పరమాత్మను ఎలా ఆరాధించాలి - అర్ఘ్య పాద్య ఆచమనీయం స్నానం వస్త్రం ధూపం దీపం నైవేద్యం మొదలిన పరిచర్యలు అన్నీ ఆరాధనా విధి. ఉదా: చల్లటి నీటితో భగవానునికి స్నామ చేయించకూడదు. గోరువెచ్చని నీటితో చేయించాలి. నవ కలశాలు స్థాపించి 9,16, మొదలైన కలశాలు స్థాపించి స్నానం చేయించాలి. ఏ సమయములో ఎటువంటి వస్త్రాలు ధరింపచేయాలి. అవి మనకు కూడా వర్తిస్తాయి. ఉదా పెళ్ళికి వెళుతూ నలుపు వస్త్రాలు ధరిస్తారు. అది తప్పు. అలాగే పరమాత్మని దర్శించడానికి వెళ్ళేప్పుడు ఎలాంటి వస్త్రాలు ధరించాలి, ఎలాంటివి స్వామికి అలంకరించాలి, ఎలాంటి జలముతో పరమాత్మకి స్నానం చేయించాలి. ఎలాంటి నీరైనా గోరువెచ్చటి నీటితోనే స్నానం చేయించాలి ) అనే క్రియా యోగాన్ని రచించిన వాడు నారదుడు. క్రియాయోగమంటే భగవంతుని పరిచర్య. 

స్వధర్మశీలైః పురుషైర్భగవాన్యజ్ఞపూరుషః
ఇజ్యమానో భక్తిమతా నారదేనేరితః కిల

తనతో సమానమైన పురుషుల చేత భగవానుడు, యజ్ఞ్య పురుషుడు, యజ్ఞ్య యాగాదులు చేయబడుతూ. 

యాస్తా దేవర్షిణా తత్ర వర్ణితా భగవత్కథాః
మహ్యం శుశ్రూషవే బ్రహ్మన్కార్త్స్న్యేనాచష్టుమర్హసి

నారదుడు ఏ ఏ విషయాలను ఆ సభలో చెప్పారో నిన్ను సేవిస్తున్న నాకు చెప్పాలని ప్రార్థిస్తున్నాను. 

మైత్రేయ ఉవాచ
ధ్రువస్య చోత్కలః పుత్రః పితరి ప్రస్థితే వనమ్
సార్వభౌమశ్రియం నైచ్ఛదధిరాజాసనం పితుః

ధృవుని కుమారుడైన ఉత్కలుడు ధృవుడు వనానికి వెళ్ళిన తరువాత "నాన్న లేని రాజ్యం నాకెందుకనుకున్నాడు". ఆ  రాజ్య లక్ష్మిని కోరుకోలేదు. 

స జన్మనోపశాన్తాత్మా నిఃసఙ్గః సమదర్శనః
దదర్శ లోకే వితతమాత్మానం లోకమాత్మని

పుట్టుకతోనే ఇతడు ప్రశాంతమైన మనసునే కలిగి ఉన్నాడు. ఆటలూ పాటలన్నా మనసు లేక. ప్రాపంచిక విషయాల యందు నిస్సంగుడై, అందరిలో సమాన రూపములో ఉన్న పరమాత్మను చూసేవాడు. ప్రపంచములో అంతటా ఉన్న పరమాత్మనూ పరమాత్మలో ఉన్న ప్రపంచాన్నీ చూడగలిగాడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఎవరికి ప్రాపంచిక విషయాల మీద ధ్యాస ఉండదో వాడు అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మను దర్శించగలడు. అంతర్యామిగా ఉన్న స్వామిని పర  వ్యూహ విభవాది ఆకారలలో ఉన్న పరమాత్మని ప్రతీ ప్రాణిలోనూ చూస్తారు. 

ఆత్మానం బ్రహ్మ నిర్వాణం ప్రత్యస్తమితవిగ్రహమ్
అవబోధరసైకాత్మ్యమానన్దమనుసన్తతమ్

ఇటువంటి మహాత్ముడు కాబట్టి, బ్రహ్మానందాన్ని పొందీ ఎలాంటి వారిమీదా ద్వేష భావము లేక. ఆకారము యందూ దేహము యందూ ప్రత్యేకమైన అభిమానం లేని వాడు. పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడమే అన్ని రసముల కన్నా (అవబోధ రసం - జ్ఞ్యానమనే రసం) మిన్న అయిన పరమాత్మను ఆనంద రసముగా తెలుసుకొని

అవ్యవచ్ఛిన్నయోగాగ్ని దగ్ధకర్మమలాశయః
స్వరూపమవరున్ధానో నాత్మనోऽన్యం తదైక్షత

నిరంతర సమాధి యోగాగ్నితో అంతవరకూ చేసిన పాపాలని, కర్మ మలాన్నీ కాల్చాడు. మనకు తెలియకనే మనం చేసే మంచి పనులలో కూడా చెడు భాగమే ఉంటుంది. ఆత్మ స్వరూపాన్ని నిరంతరం మనసులో ధ్యానం చేయడం వలన, ఆత్మ కన్నా వేరే వస్తువు ఉన్నదని చూడలేదు. అంతా పరమాత్మ మయమని తెలుసుకున్నాడు. (ఈశావాస్యమిదం సర్వం) తన ఆత్మకంటే వేరే స్వరూపాన్ని తాను ఎక్కడా చూడలేదు.

జడాన్ధబధిరోన్మత్త మూకాకృతిరతన్మతిః
లక్షితః పథి బాలానాం ప్రశాన్తార్చిరివానలః

సంసారము యందు ఆసక్తి లేకుండా ఉన్నాడనడానికి గుర్తు - అన్నీ ఉండి కూడా ఏమి లేనివాడిలాగ ఉన్నాడు. చెవులుండీ చెవిటి వాడిలా, మూగవాడిలా ఉన్మత్తుడిలా ఉన్నాడు.  సంసారము యందు మనసు లేకుండా ఉన్నాడు. పరమాత్మ జ్ఞ్యానామృత రసాన్ని పానము చేసిన వాడికి ఈ అవస్థలేమీ ఉండవు. 

మత్వా తం జడమున్మత్తం కులవృద్ధాః సమన్త్రిణః
వత్సరం భూపతిం చక్రుర్యవీయాంసం భ్రమేః సుతమ్

ఇతను దారిలో వెళుతూ ఉంటే బాలురు పిచ్చివాడనుకున్నారు. పెద్దలూ కుల వృద్ధులు కూడా నివురు గప్పిన నిప్పులా ఉన్న ఈయనను చూసి పిచ్చివాడనుకున్నారు. ఎప్పుడైతే రాజ్యము మీద ఆశలేకుండా వెళ్ళిపోయాడో వతలున్ని రాజుగా చేసారు. ఈయన భ్రమి కుమారుడు. 

స్వర్వీథిర్వత్సరస్యేష్టా భార్యాసూత షడాత్మజాన్
పుష్పార్ణం తిగ్మకేతుం చ ఇషమూర్జం వసుం జయమ్

ఇతని యొక్క భార్య ఆరుగురు కుమారులను ప్రసవించింది

పుష్పార్ణస్య ప్రభా భార్యా దోషా చ ద్వే బభూవతుః
ప్రాతర్మధ్యన్దినం సాయమితి హ్యాసన్ప్రభాసుతాః

పుష్పార్ణుడికి దోషా ప్రభా అని ఇద్దరు భార్యలు. ప్రభకు ప్రాతః మధ్యాన్నం సాయం అని పేర్లు. పుష్పార్ణ అంటే సూర్యుడు. సూర్యుని భార్య ప్రభ (కాంతి). 

ప్రదోషో నిశిథో వ్యుష్ట ఇతి దోషాసుతాస్త్రయః
వ్యుష్టః సుతం పుష్కరిణ్యాం సర్వతేజసమాదధే

దోషకు (రాత్రికి) ముగ్గురు కుమారులు ప్రదోష (రాత్రికన్నా ముందు వచ్చేది - సాయం) నిశీధ (రాత్రి) వ్యుష్ట (మధ్య రాత్రి). వ్యుష్టుడు పుష్కరిణి అన్న భార్య యందు సర్వ తేజసుడనే వాడికి జన్మనిచ్చాడు

స చక్షుః సుతమాకూత్యాం పత్న్యాం మనుమవాప హ
మనోరసూత మహిషీ విరజాన్నడ్వలా సుతాన్

సర్వ తేజసుడు అకూతి యందు చక్షువును పుత్రుడుగా పొందాడు. మనోర సుతి కుమారులను కలిగింది

పురుం కుత్సం త్రితం ద్యుమ్నం సత్యవన్తమృతం వ్రతమ్
అగ్నిష్టోమమతీరాత్రం ప్రద్యుమ్నం శిబిముల్ముకమ్

ఉల్ముకోऽజనయత్పుత్రాన్పుష్కరిణ్యాం షడుత్తమాన్
అఙ్గం సుమనసం ఖ్యాతిం క్రతుమఙ్గిరసం గయమ్

ఉన్ముఖునికి ఇంకో ఆరు కుమారులు కలిగారు

సునీథాఙ్గస్య యా పత్నీ సుషువే వేనముల్బణమ్
యద్దౌఃశీల్యాత్స రాజర్షిర్నిర్విణ్ణో నిరగాత్పురాత్

అంగుడు సునీధి యందు వేనుడు పుట్టాడు. ఈ వేనుడి దుష్ట స్వభావాన్ని చూచి తండ్రి అయిన అంగుడు నగరము నుండి అన్నీ వదిలి వెళ్ళిపోయాడు. పరమ శాంత స్వభావులైన ఋషులు కూడా వేనున్ని శపించారు. 

యమఙ్గ శేపుః కుపితా వాగ్వజ్రా మునయః కిల
గతాసోస్తస్య భూయస్తే మమన్థుర్దక్షిణం కరమ్

రాజు ఒకడు దుష్టులని శిక్షించడానికి కావాలి గనుకు ఇతని ప్రాణము పోయిన తరువాత అదే మునులు ఇతని దక్షిణ బాహువుని చిలకగా

అరాజకే తదా లోకే దస్యుభిః పీడితాః ప్రజాః
జాతో నారాయణాంశేన పృథురాద్యః క్షితీశ్వరః

దక్షిణ బాహువు నుండి పృధు చక్రవర్తి పుట్టాడు. 

విదుర ఉవాచ
తస్య శీలనిధేః సాధోర్బ్రహ్మణ్యస్య మహాత్మనః
రాజ్ఞః కథమభూద్దుష్టా ప్రజా యద్విమనా యయౌ

అంగుడు ధర్మాతుడూ సాధువు బ్రహ్మణ భక్తి కలవాడు, రాజర్షీ ఉత్తముడూ అన్నావు. ఇలాంటి వాడికి ఇంత దుష్టుడైన కుమారుడు ఎలా కలిగాడు. ఇతని వలన తండ్రి వెళ్ళిపోయాడు రాజ్యం వదిలి. 

కిం వాంహో వేన ఉద్దిశ్య బ్రహ్మదణ్డమయూయుజన్
దణ్డవ్రతధరే రాజ్ఞి మునయో ధర్మకోవిదాః

పరమ శాంత స్వభావులైన బ్రాహ్మణులు అన్ని మర్యాదలు దాటిపోతేనే కోపిస్తారు. ఋషులు శపించారంటే ఆశ్చర్యం కాదు, సంహరించడం ఆశ్చర్యం. బ్రాహ్మణున్ని చంపడం కంటే పరిపాలించే రాజుని చంపడం ఆశ్చర్యం కద. ధర్మ కోవిదులైన మునులు ...

నావధ్యేయః ప్రజాపాలః ప్రజాభిరఘవానపి
యదసౌ లోకపాలానాం బిభర్త్యోజః స్వతేజసా

... తమని పరిపాలించేవారు ఎంత పాపం చేసినా చంపరు కదా. దేశ బహిష్కారం చేయవచ్చు. పదవి నుంచి దింపవచ్చు. ప్రజలు తమ పాలకుడిని చంపకూడదు కదా. అగ్ని వాయు ఇంద్ర యమ కుబేర మొదలైన అంశలను రాజు ధరించి ఉంటాడు. అష్ట దిగ్పాలకుల అంశనూ త్రిమూర్తుల తేజస్సు కలిగి ఉంటాడు రాజు అని శాస్త్రం. 

ఏతదాఖ్యాహి మే బ్రహ్మన్సునీథాత్మజచేష్టితమ్
శ్రద్దధానాయ భక్తాయ త్వం పరావరవిత్తమః

ఈ సునీధ కుమారుడూ అంతటి పరమ దుర్మార్గుడా? నాకా కధ వినాలని శ్రద్ధ కలుగుతోంది. నీ భక్తుడనైన నేను శ్రద్ధగా వినాలనుకుంటున్నాను. నీవు అంతా తెలిసిన వాడవౌఉ (కొద్దిగానూ తెలుసూ పెద్దగానూ తెలుసు అంటే ఒక్క శ్లోకాన్ని మూడు రోజులూ చెప్పగలగడం మూడు వందల శ్లోకాలని ఒక్కరోజులోనూ చెప్పగలగడం - పరావరవిత్తమః)

మైత్రేయ ఉవాచ
అఙ్గోऽశ్వమేధం రాజర్షిరాజహార మహాక్రతుమ్
నాజగ్ముర్దేవతాస్తస్మిన్నాహూతా బ్రహ్మవాదిభిః

అశ్వమేధ యజ్ఞ్యాన్ని ఆచరించాడు అంగుడు. అతను ఆచరించిన అశ్వమేధ యాగములో ఆహుతులు తీసుకోవడానికి దేవతలెవ్వరూ రాలేదు. 

తమూచుర్విస్మితాస్తత్ర యజమానమథర్త్విజః
హవీంషి హూయమానాని న తే గృహ్ణన్తి దేవతాః
రాజన్హవీంష్యదుష్టాని శ్రద్ధయాసాదితాని తే
ఛన్దాంస్యయాతయామాని యోజితాని ధృతవ్రతైః

అప్పుడు హోతా అధ్వర్యువూ వచ్చి "మేము హవిస్సు శ్రద్ధగానే ఇస్తున్నాము. మేము వేదాధ్యాయనం చేసిన నాటినుండీ చదువుకున్న వేద మంత్రాలని ఏ ఒక్క పూటా కూడా చదవకుండా ఉండలేదు.  మేము శ్రాద్ధాళువులము.""

న విదామేహ దేవానాం హేలనం వయమణ్వపి
యన్న గృహ్ణన్తి భాగాన్స్వాన్యే దేవాః కర్మసాక్షిణః

ఇన్ని ఉన్నా దేవతలెందుకు తిరస్కరించారో మాకు తెలియదు. దేవతలు కర్మ సాక్షులు. మనమాచరించే ప్రతీ పనీ వారు చూస్తున్నారూ, చేయిస్తున్నారు. అంతర్యామిగా ఉన్న పరమాత్మకు మనమనుకునే ప్రతీదీ తెలుస్తుంది. తలుపులన్నీ వేసుకుని మనం పనులు చేయాలన్నా మనం పని చేసే ఇంద్రియాలకు ఉన్న దేవతలు ఆ పనికి సాక్షులు. ఉదా కన్ను చూస్తున్నదంటే సూర్యుడు చూస్తున్నాడనే అర్థం. మన ప్రీ ఇంద్రియానికీ ఉన్న అధిష్ఠాన దేవతలకు తెలియకుండా మనం ఏ పనీ చేయలేము. మనకు తెలియకుండానే మనం ఏవో తప్పులు చేసి ఉంటాము. 

మైత్రేయ ఉవాచ
అఙ్గో ద్విజవచః శ్రుత్వా యజమానః సుదుర్మనాః
తత్ప్రష్టుం వ్యసృజద్వాచం సదస్యాంస్తదనుజ్ఞయా

బ్రాహ్మణుల వాక్యం విన్న అంగదుడు దుఃఖపడి అసలు విషయం తెలుసుకుందామని ఋత్విక్కుల ఆజ్ఞ్య పొంది అందరినీ అడిగాడు

నాగచ్ఛన్త్యాహుతా దేవా న గృహ్ణన్తి గ్రహానిహ
సదసస్పతయో బ్రూత కిమవద్యం మయా కృతమ్

మేము అర్పించిన హవిస్సును దేవతలు తీసుకోవటం లేదు. నేనేమి తప్పు చేసాను. బ్రాహ్మణులు తమ లోపం లేదని చెప్పారు. నా తప్పేముంది

సదసస్పతయ ఊచుః
నరదేవేహ భవతో నాఘం తావన్మనాక్స్థితమ్
అస్త్యేకం ప్రాక్తనమఘం యదిహేదృక్త్వమప్రజః

మహారాజా నీ విషయములో కూడా ఏ చిన్న తప్పు కలుగలేదు. నీవీ జన్మలో ఏ పాపమూ చేయకపోయినా పూర్వ జన్మలో ఏదో పాపం చేసి ఉంటావు ఎందుకంటే నీకన్నీ ఉన్నాయి గానీ సంతానం లేదు. సంతానం లేని వాడు చేసే హోమ హవిస్సులు దేవతలు స్వీకరించరు. 

తథా సాధయ భద్రం తే ఆత్మానం సుప్రజం నృప
ఇష్టస్తే పుత్రకామస్య పుత్రం దాస్యతి యజ్ఞభుక్

హవిస్సులు దేవతలు తీసుకోవాలంటే నీకు సత్సంతానం కలగాలి. పరమాత్మని ఆరాధిస్తే ఆయన నీ ఇష్టాన్ని నెరవేరుస్తాడు. 

తథా స్వభాగధేయాని గ్రహీష్యన్తి దివౌకసః
యద్యజ్ఞపురుషః సాక్షాదపత్యాయ హరిర్వృతః

పరమాత్మ సంతానాన్ని ప్రసాదిస్తే దేవతలు కూడా హవిస్సును స్వీకరిస్తారు. 

తాంస్తాన్కామాన్హరిర్దద్యాద్యాన్యాన్కామయతే జనః
ఆరాధితో యథైవైష తథా పుంసాం ఫలోదయః

భగవంతున్నే కుమారుడిగా కోరితే ఆయనే పుట్టాడు. అలాంటి దృష్టాంతాలు చాలా కలవు. భక్తులడిగిన ప్రతీ కోరికనూ దగ్గరుండి మరీ తీరుస్తాడు. మానవులు ఎలా ఆరాధిస్తారో అవి ఇస్తాడు. ధర్మార్థ కామ మోక్షాలన్నీ ఇచ్చేది ఆయనే

ఇతి వ్యవసితా విప్రాస్తస్య రాజ్ఞః ప్రజాతయే
పురోడాశం నిరవపన్శిపివిష్టాయ విష్ణవే

ఉత్తమ సంతానం కావడం కోసం పుత్రకామేష్టి మొదలుపెట్టి శిపి విష్టుడైన విష్ణువు యొక్క యజ్ఞ్యాన్ని చేసారు

తస్మాత్పురుష ఉత్తస్థౌ హేమమాల్యమలామ్బరః
హిరణ్మయేన పాత్రేణ సిద్ధమాదాయ పాయసమ్

ఆ యజ్ఞ్య కుండం నుండి పీత మాల్యాంబరములతో బంగారు పాయసముతో ఒక పురుషుడు వచ్చి పాయసం ఇచ్చాడు. 

స విప్రానుమతో రాజా గృహీత్వాఞ్జలినౌదనమ్
అవఘ్రాయ ముదా యుక్తః ప్రాదాత్పత్న్యా ఉదారధీః

చుట్టూ పెద్దలు ఉన్నప్పుడు వారి అనుమతిపొందిన తరువాతే తీసుకోవాలి. కనుక బ్రాహ్మణుల అనుమతి తీసుకుని పాయసాన్ని యజ్ఞ్య పురుషుడి నుండి తీసుకుని వాసన చూసి, 

సా తత్పుంసవనం రాజ్ఞీ ప్రాశ్య వై పత్యురాదధే
గర్భం కాల ఉపావృత్తే కుమారం సుషువేऽప్రజా

ఉదార బుద్ధి కలవాడగుటచే భార్యకు ఇచ్చాడు. భర్తనుండి వచ్చిన ఆ పాయసాన్ని తీసుకుని గర్భమును పొంది ప్రసూతి సమయానికి ఉత్తముడైన కుమారుడిని ప్రసవించింది

స బాల ఏవ పురుషో మాతామహమనువ్రతః
అధర్మాంశోద్భవం మృత్యుం తేనాభవదధార్మికః

పుట్టిన పిల్లవాడికి తల్లి యొక్క తండ్రి అయిన మృత్యువు పోలికలు వచ్చాయి. అధర్మమునుండి పుట్టినవాడైన మృత్యువు పోలికలూ గుణాలూ వచ్చాయి. అందువలన అధార్మికుడయ్యాడు. 

స శరాసనముద్యమ్య మృగయుర్వనగోచరః
హన్త్యసాధుర్మృగాన్దీనాన్వేనోऽసావిత్యరౌజ్జనః

వీడెంత దుర్మార్గుడంటే ధనుర్బాణాలు తీసుకుని వేట యందు ఆసక్తి కలవాడై, దుష్ట మృగాలనే కాకుండా సాధు మృగాలను కూడా చంపాడు. అందు వలన జనాలందరూ మొత్తుకున్నారు. 

ఆక్రీడే క్రీడతో బాలాన్వయస్యానతిదారుణః
ప్రసహ్య నిరనుక్రోశః పశుమారమమారయత్

తన వయసున్న పిల్లలతో ఆడుకుంటూ, వారిని కింద పడేసి కాలితో తొక్కి పశువులను చంపినట్లు చంపేవాడు. 

తం విచక్ష్య ఖలం పుత్రం శాసనైర్వివిధైర్నృపః
యదా న శాసితుం కల్పో భృశమాసీత్సుదుర్మనాః

ఇంతటి పరమ దుర్మార్గుడైన పుత్రున్ని చూచిన రాజు చాలా సార్లు చాలా రకములుగా దండించాడు. ఎన్ని చేసినా మారకపోయే సరికి మనసులో బాగా కలత చెందాడు. 

ప్రాయేణాభ్యర్చితో దేవో యేऽప్రజా గృహమేధినః
కదపత్యభృతం దుఃఖం యే న విన్దన్తి దుర్భరమ్

లోకములో చాలా మంది సంతానం కావాలని మొక్కుతారు గానీ దుష్ట సంతానం కలిగడం వలన కలిగే బాధ వారికి తెలియదు. దుష్ట సంతానం వలన కలిగే ఇబ్బంది తెలిస్తే పొరబాటున కూడా సంతానం కోసం ప్రాకులాడరు.

యతః పాపీయసీ కీర్తిరధర్మశ్చ మహాన్నృణామ్
యతో విరోధః సర్వేషాం యత ఆధిరనన్తకః

సంతానం చెడ్డదైతే అపకీర్తి వస్తుంది, అంతులేని మనోవ్యధ వస్తుంది. 

కస్తం ప్రజాపదేశం వై మోహబన్ధనమాత్మనః
పణ్డితో బహు మన్యేత యదర్థాః క్లేశదా గృహాః

సంతానం ఆత్మను కట్టి పడేస్తుంది. భార్య మీద విరక్తి పుడుతుందేమో గానీ కొడుకు మీద పుట్టదు. ఇలాంటి సంతానాన్ని ఏ పండితుడైనా కావాలని కోరుకుంటాడా. ఏ సంతానం వలన ఇల్లు అన్ని రకముల కష్టాలు కల్పించేదవుతుందో, నిత్యమూ సమస్యల వలయమవుతుందో అలాంటి సంతానం కోసం బుద్ధిమంతుడెవడూ దేవతలను సంతానం కొరకు ప్రార్థించడు.

కదపత్యం వరం మన్యే సదపత్యాచ్ఛుచాం పదాత్
నిర్విద్యేత గృహాన్మర్త్యో యత్క్లేశనివహా గృహాః

అయినా కొంత ఆలోచిస్తే సత్సంతానం కంటే దుష్ట సంతానమే మేలు. వారి వలన తండ్రికి విరక్తి పుట్టి సంసారం విడిచి వెళతాడు. వందమంది మంచి సంతానం కన్నా ఒక దుష్ట సంతానమే మేలు. విరక్తి కలిగించే వారు దుష్ట సంతానమే. త్వరగా విరక్తి పుడుతుంది. 

ఏవం స నిర్విణ్ణమనా నృపో గృహాన్నిశీథ ఉత్థాయ మహోదయోదయాత్
అలబ్ధనిద్రోऽనుపలక్షితో నృభిర్హిత్వా గతో వేనసువం ప్రసుప్తామ్

ఇలా ఆ అంగరాజు పూర్తిగా విరక్తి చెంది నిద్రపట్టని వాడై సూర్యోదయం కంటే ముందే లేచి ఇల్లు వదిలిపెట్టి, పడుకుని ఉన్న వేనున్నీ, భార్యనీ చూసి, వారికి చెప్పకుండా వెళ్ళాడు 

విజ్ఞాయ నిర్విద్య గతం పతిం ప్రజాః పురోహితామాత్యసుహృద్గణాదయః
విచిక్యురుర్వ్యామతిశోకకాతరా యథా నిగూఢం పురుషం కుయోగినః

తెల్లవారగానే విరక్తి చెంది రాజు వెళ్ళిపోయాడని ప్రజలు తెలుసుకున్నారు. పురోహితులూ మంత్రులూ మొదలైన వారు "కొడుకును వెళ్ళగొట్టక ఇంత మంచి వాడు వెళ్ళిపోయాడని" బాధపడ్డారు. అతి రహస్యముగా దాగి ఉన్న అంతర్యామి అయిన పరమాత్మను కుయోగి సాక్షాత్కరించుకోలేనట్లుగా ఈ మంత్రులు ఎంత వెదికినా రాజును పట్టుకోలేకపోయారు. 

అలక్షయన్తః పదవీం ప్రజాపతేర్హతోద్యమాః ప్రత్యుపసృత్య తే పురీమ్
ఋషీన్సమేతానభివన్ద్య సాశ్రవో న్యవేదయన్పౌరవ భర్తృవిప్లవమ్

ఇలా రాజుగారెక్కడికి వెళ్ళారో తెలియక అన్నీ వెతికి వెతికీ తిరిగి అదే నగరానికి వచ్చారు. అక్కడ కూడి ఉన్న ఋషులకు నమస్కరించి కన్నీరు గారుస్తూ, మహారాజుగారు దొరకలేదంటే ఆయన లోకాన్నే విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటారు అన్న్న విషయాన్ని ఋషులకు నివేదించారు. విరక్తి పొందిన రాజులు ఏ ఏ ప్రాంతాలలో ఉంటారు తెలిసిన్ వారు కాబట్టి అవన్నీ గాలించి రాజు ఎవరికీ అందని ప్రాంతానికి వెళ్ళి ఉంటారని తెలుసుకొని ఋషులకు ఆ విషయాన్ని నివేదించారు.

Popular Posts