Followers

Saturday 1 February 2014

శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధం తొమ్మిదవ అధ్యాయం

                                                         ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధం తొమ్మిదవ అధ్యాయం

ఏడు ధాతువులూ లేని జీవునికి శరెరంతో సంబంధం ఎలా వచ్చింది. ఈ ఏడు ధాతువులూ లేనిది జీవుడు. ఈ శరీర సంబంధం జీవుడికి అకారణంగా ఏర్పడుతుందా, సకారణంగా ఏర్పడుతుందా? అనేది పరీక్షిత్తు మొదటి ప్రశ్న కిందటి అధ్యాయంలో

శ్రీశుక ఉవాచ
ఆత్మమాయామృతే రాజన్పరస్యానుభవాత్మనః
న ఘటేతార్థసమ్బన్ధః స్వప్నద్రష్టురివాఞ్జసా

శరీరానికి ఉన్నవాటిని నాకు ఉన్నాయి అనుకుంటున్నాడు జీవుడు. అనుభవమే స్వరూపముగా కలది ఆత్మ. తనవి కానిది తనకి కానిది తనది అనుకుంటున్నాడు. అన్నీ నేనే అనుభవిస్తున్నాను అనుకునేది ఆత్మ. ఈ ఆత్మ పరస్య - అంటే ప్రకృతి కంటే విలక్షణము. ప్రకృతిలో ఉన్న గుణత్రయం ఆత్మకు అంటదు. ఆత్మ పుట్టదు. ప్రకృతి లేకుండా జీవునికి శరీరముతో సంబంధం కుదరదు. ఆ సంబంధానికి కారణం ఉందా? కారణముంది. తనది కాని ప్రకృతిని తనది అనుకుంటున్నాడు. ప్రకృతితో నాకు సంబంధం లేదు అనుకుంటే తనకి శరీరమూ జన్మ లేదు. జీవునికి శరీర సంబంధం సహేతుకమే, నిర్హేతుకం కాదు. స్వప్నంలో అనుభవించే మనం ఎక్కడున్నము, అనుభవించే వస్తువులు ఎక్కడ ఉన్నాయి?  ఇక్కడ పొందలేని విషయాలు మనసు స్వపనంలో పొందుతుంది. ఆ అనుభవాలన్నీ ఎక్కడివి? అవి కేవలం అనుభవమే. ఈ శరీరానికీ మనసుకూ ఆత్మకూ సంబంధం లేదు. శరీరమూ మనసు కలిసి ఉన్నప్పుడు వచ్చిన తలపులే కలలుగా వస్తాయి. నిద్ర వేరు స్వప్నం వేరు. కల వచ్చింది అంటే నిద్ర రాలేదు అని అర్థం. అలాగే ఆత్మకు లేని శరీరాన్ని కూడా, ప్రకృతియొక్క గుణాలు కావాలి అనుకోవడంతో శరీరం వస్తుంది. సంసారానికి శరీరానికి మూలం కోరిక. సుఖదుఖాలకి మూలం అనుభవం

బహురూప ఇవాభాతి మాయయా బహురూపయా
రమమాణో గుణేష్వస్యా మమాహమితి మన్యతే

ఏ రూపమూ లేని జీవుడు అన్ని రూపాలు నావే అనుకుంటాడు. ప్రకృతి రూపాలని చూసి తనవే అనుకుంటాడు. ప్రకృతి గుణాలలో రమిస్తూ ఉంటాడు. ప్ర్కృతి గుణాలతో రమిచాలనుకోవడం వలనే అవి సంక్రమిస్తాయి. దాని వల్ల నేను నాది అనుకుంటాడు

యర్హి వావ మహిమ్ని స్వే పరస్మిన్కాలమాయయోః
రమేత గతసమ్మోహస్త్యక్త్వోదాస్తే తదోభయమ్

కాలముతోటి మాయతోటి బంధిచబడుతున్నాము. ప్రకృతితో ఘనిష్టమైన సంబంధం ఏర్పడుతుంది. మనల్ని బంధిచేది ఒకటి కాలం అయితే, ఇంకోటి మాయ. అలాంటి వాడు ఎలాంటి మోహం లేకుండా పరమాత్మ యందు రమిస్తాడు. ప్రకృతి సంబంధం నాది కాదు అనుకున్నవాడికి కాలముతో గానీ ప్రకృతితో గానీ సంబంధం ఉండదు.

ఆత్మతత్త్వవిశుద్ధ్యర్థం యదాహ భగవానృతమ్
బ్రహ్మణే దర్శయన్రూపమవ్యలీకవ్రతాదృతః

ప్రకృతి సంబంధాన్ని గుర్తించి, నాకు ప్రకృతికీ సంబంధం లేదు, కనపడేవి ఏవీ నావి కావు అనుకున్నవాడి ఏ బాధ ఉండదు. మనసు శుద్ధి ఉన్నవాడికి ప్రకృతి సంబంధముండదు. ప్రకృతిని నుంచి అహంకారం పుడితే, అహంకారమునుంచి మనసు పుట్టింది. అది ఎలా శుద్ధిగా ఉంటుంది అంటే, ఇదే విషయాన్ని పరమాత్మ బ్రహ్మగారికి బోధించాడు. కపటములేని స్వచ్చమైన నిష్కామమైన వ్రతముని ఆచరించుట వలన ప్రసన్నుడైన పరమాత్మ తన దివ్య మంగళ విగ్రహాన్ని సాక్షాత్కరింపచేసి ఏమి చెప్పడొ అదే నీకు చెప్పబోవుతున్నాను

స ఆదిదేవో జగతాం పరో గురుః స్వధిష్ణ్యమాస్థాయ సిసృక్షయైక్షత
తాం నాధ్యగచ్ఛద్దృశమత్ర సమ్మతాం ప్రపఞ్చనిర్మాణవిధిర్యయా భవేత్

ఆదైదేవుడైన బ్రహ్మ తన నివాసమైన వేయి రేకుల పద్మము మీద చేరి సృష్టి చేయాలని సంకల్పంతో చుట్టూ చూచాడు. ఎంత ఆలోచించినా ప్రపంచాన్ని సృష్టించడానికి కావలిసిన జ్ఞ్యానాన్ని పొందలేకపోయాడు. తన మూలాన్ని తెల్సుకోవడానికి సృష్టిచేసే విధానాన్ని ఆలోచిస్తున్న బ్రహ్మకు రెండు అక్షరములు కలది రెండు సార్లు వినపడింది.

స చిన్తయన్ద్వ్యక్షరమేకదామ్భస్యుపాశృణోద్ద్విర్గదితం వచో విభుః
స్పర్శేషు యత్షోడశమేకవింశం నిష్కిఞ్చనానాం నృప యద్ధనం విదుః

స్పర్శలలో పదహారవది ఇరవైయొకటవది వినపడింది. క నించి మ వరకు ఉన్న అక్షరాలు స్పర్శలు (క చ ట త ప లు, ఐదక్షరాలు ఉంటే వర్గలు ఐదు. ఈ ఇరవై అయిదు అక్షరాలకు స్పర్శలు ). క నుంచి పదహారవది త, ఇరవై ఒకటవది ప. ఈ రెందూ వినపడ్డాయి. "తప తప" అని వినపడింది. నాది అంటూ ఏదీ లేని వారికి, పరమాత్మను పొందడానికి ఏ సాధనం లేని వారు నిష్కించనులు, అలాంటి నిష్కించులకు ఇది ధనం. నాది అని చెప్పుకోడానికి ఏది లేని వారికి ఇది ధనం.

నిశమ్య తద్వక్తృదిదృక్షయా దిశో విలోక్య తత్రాన్యదపశ్యమానః
స్వధిష్ణ్యమాస్థాయ విమృశ్య తద్ధితం తపస్యుపాదిష్ట ఇవాదధే మనః

ఒక వెయ్యి ఏళ్ళు వెతికాడు ఆ శబ్దం అన్నవారి గురించి. చూచి, ఏమి దొరకక, తన ఆసనాన్నే చేరి, ఉపదేశించిన విధానంలోనే తపస్సుని ఆచరించాడు.

దివ్యం సహస్రాబ్దమమోఘదర్శనో జితానిలాత్మా విజితోభయేన్ద్రియః
అతప్యత స్మాఖిలలోకతాపనం తపస్తపీయాంస్తపతాం సమాహితః

దివ్యమైన వేయి సంవత్సరములు సఫలమైన జ్ఞ్యానము కల వాడై, వాయువును గెలిచి, జ్ఞ్యాన కర్మేంద్రియాలను గెలిచి, అన్ని లోకాలను తపింపచేసే తపసు (అన్ని లోకాలను సృష్టింపచేసే తపసు )
తపసులో చాల శ్రేష్టుడై, తపసు యొక్క మూలాన్ని దర్శించగల వాడైన బ్రహ్మ తపస్సు చేసాడు.

తస్మై స్వలోకం భగవాన్సభాజితః సన్దర్శయామాస పరం న యత్పరమ్
వ్యపేతసఙ్క్లేశవిమోహసాధ్వసం స్వదృష్టవద్భిర్పురుషైరభిష్టుతమ్

ఇంత ఘోరమైన ఏకాగ్రమైన తపసు చేసిన బ్రహ్మకు మన్నింపుగా తన లోకాన్ని చూపించాడు. ఆ లోకం కన్నా పరమైన లోఖం ఇంకోటి లేదు. ఆలోకంలో కష్టములూ మోహములూ బాధలూ తొందరపాటులూ ఏమీ లేవి, తనకి కనపడే దేవతల చేతా (నిత్యసూరులు) స్తోత్రం చేయబడుతున్నాడు

ప్రవర్తతే యత్ర రజస్తమస్తయోః సత్త్వం చ మిశ్రం న చ కాలవిక్రమః
న యత్ర మాయా కిముతాపరే హరేరనువ్రతా యత్ర సురాసురార్చితాః

ఆ వైకుంఠములో రజ తమ సత్వ గుణాలు పనిచేయవు, కాలము తన ప్రభావం చూపించదు, అగ్ని ప్రభావం కూడాలేదు. అక్కడ ప్రకృతీ, గుణాలూ లేవు లేదు. అక్కడున్నవారందరూ శ్రీహరి భక్తులు. వారు దేవతలచేతా అసురులచేతా నిత్యమూ పూజింపబడే వారు.

శ్యామావదాతాః శతపత్రలోచనాః పిశఙ్గవస్త్రాః సురుచః సుపేశసః
సర్వే చతుర్బాహవ ఉన్మిషన్మణి ప్రవేకనిష్కాభరణాః సువర్చసః
ప్రవాలవైదూర్యమృణాలవర్చసః పరిస్ఫురత్కుణ్డలమౌలిమాలినః

వారందరూ నీలమేఘశ్యాములే పద్మాక్షులే పీతాంబరధారులే, చక్కని కాంతి, ప్రభావం, అందరూ చతుర్భుజులూ, నవరత్నఖచితమైన ఆభరణాలను ధరించినవారే

భ్రాజిష్ణుభిర్యః పరితో విరాజతే లసద్విమానావలిభిర్మహాత్మనామ్
విద్యోతమానః ప్రమదోత్తమాద్యుభిః సవిద్యుదభ్రావలిభిర్యథా నభః

వారి దివ్యదేహ కాంతులూ ఆభరణాలు, విహరించడానికి విమానాలు, విమానాలతో పైన తిరుగుతూ ఉంటే మెరుపులతో కూడిన మేఘంలాగ వైకుంఠం భాసించింది.

శ్రీర్యత్ర రూపిణ్యురుగాయపాదయోః కరోతి మానం బహుధా విభూతిభిః
ప్రేఙ్ఖం శ్రితా యా కుసుమాకరానుగైర్విగీయమానా ప్రియకర్మ గాయతీ

అక్కడ అమ్మవారు రూపుదాల్చి పరమాత్మ పాదములను అన్ని రకములుగా అన్ని విభూతులతో సంవాహనం చేస్తూ గౌరవం చేస్తూ ఉన్నారు. అమ్మవారు తూగుటుయలలో ఊగుతూ పరమాత్మ పాద సంవాహనం చేస్తోంది. (అమ్మవారు వక్షస్థలంలో ఉంటుంది, అక్కడే స్వామి వనమాల ఉంటుంది. అలా ఆ వనమాలలో ఊగుతూ తనకున్న సకల విభూతులతో సంవాహనం చేస్తోంది). సకల ఋతువులతో ఏర్పడిన సుగంధములకు ఆశపడిన తుమ్మెదలతో గానం చేయబడుతున్న అమ్మవారు, స్వామివారి పాదాలను సంవాహనం చేస్తోంది.

దదర్శ తత్రాఖిలసాత్వతాం పతిం శ్రియః పతిం యజ్ఞపతిం జగత్పతిమ్
సునన్దనన్దప్రబలార్హణాదిభిః స్వపార్షదాగ్రైః పరిసేవితం విభుమ్

ఇవన్ని చూచిన తరువాత బ్రహ్మగారు, శ్రియపతి, యజ్ఞ్యపతి అయిన స్వామిని చూచారు. వీరందరిచేతా ఆరాధించబడే పరమాత్మను చూచారు.

భృత్యప్రసాదాభిముఖం దృగాసవం ప్రసన్నహాసారుణలోచనాననమ్
కిరీటినం కుణ్డలినం చతుర్భుజం పీతాంశుకం వక్షసి లక్షితం శ్రియా

అధ్యర్హణీయాసనమాస్థితం పరం వృతం చతుఃషోడశపఞ్చశక్తిభిః
యుక్తం భగైః స్వైరితరత్ర చాధ్రువైః స్వ ఏవ ధామన్రమమాణమీశ్వరమ్

వనమాలా పీతాంబరం కౌస్తుభంతో ప్రకాశిస్తూ, భగములన్నీ (జ్ఞ్యానాది షడ్ గుణాలు) రూపు దాల్చి ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఈ భగములు (జ్ఞ్యాన శక్తి ఐశ్వర్య వీర్య తేజస్సులు) ఇంకోచోట చంచలంగా ఉండేవి, పరమాత్మ ధామంలో పరమాత్మను సేవిస్తూ ఉన్నాయి.


తద్దర్శనాహ్లాదపరిప్లుతాన్తరో హృష్యత్తనుః ప్రేమభరాశ్రులోచనః
ననామ పాదామ్బుజమస్య విశ్వసృగ్యత్పారమహంస్యేన పథాధిగమ్యతే

పరమాత్మ దివ్య మంగళ రూపాన్ని చూచి భక్తితో ఆనందాశ్రువులు నిండి ఉండగా ఆయనకు నమస్కారం చేసాడు. ఈయన పాదాలు దొరకాలంటే పరమహంస మార్గాన్ని అవలంబించాలి. అలా పొందదగినవి ఆయన పాదాలు

తం ప్రీయమాణం సముపస్థితం కవిం ప్రజావిసర్గే నిజశాసనార్హణమ్
బభాష ఈషత్స్మితశోచిషా గిరా ప్రియః ప్రియం ప్రీతమనాః కరే స్పృశన్

తనను చూచి తన సాక్షాత్కారంతో ఆనందిస్తూ, తన ఆజ్ఞ్యతో సకల జగత్తునూ సృష్టిచాలనై ఉవ్విళ్ళొరుతున్న బ్రహ్మగారిని చూస్తూ, చిరునవ్వు అనే అలంకారాన్ని కూర్చి ఆ వాక్కుతో, ప్రీతిపాత్రుడైన బ్రమ్హగారి చేతిని చేతితో స్పృశిస్తూ సంతోషాన్ని ప్రక్టిస్తూ మాట్లాడాడు.

శ్రీభగవానువాచ
త్వయాహం తోషితః సమ్యగ్వేదగర్భ సిసృక్షయా
చిరం భృతేన తపసా దుస్తోషః కూటయోగినామ్

నీచేత నేను చాలా చక్కగా సంతోషింపచేయబడ్డాను, నీవు సృష్టి చేయాలన్న కోరికతోటి, నీవు చేసిన తపసుతోటి నేను సంతోషించాను. నన్ను సంతోషింపచేయుట అంత సులభం కాదు. "యోగిలాగ" ఆచరించేవారికి నేను సులభంగా సంతోషించను.

వరం వరయ భద్రం తే వరేశం మాభివాఞ్ఛితమ్
బ్రహ్మఞ్ఛ్రేయఃపరిశ్రామః పుంసాం మద్దర్శనావధిః

నేను సంతోషించాను కాబట్టి ఏదైనా వరము కోరుకో. ప్రపంచంలో మేలు కలగకుండా ఎంత కాలం ఉంటుంది లేదా అసలు శ్రేయస్సు కలగడం అనేది ఎప్పటినుంచి  ప్రారంభవముతుంది? ఎప్పుడు నా సాక్షాత్కారమవుతుందో అప్పటినుంచి. నా దర్శనం ఐతే పరిశ్రంలేకుండా ఫలితం కలుగుతుంది. నా దర్శనంతో నిశ్రేయసం (మోక్షం) లభిస్తుంది.

మనీషితానుభావోऽయం మమ లోకావలోకనమ్
యదుపశ్రుత్య రహసి చకర్థ పరమం తపః

నా అనుగ్రహం, సంకల్పం వలననే నీకు నా లోకం చూసే అవకాశం కలిగింది. (శ్రీమన్నారాయణుడు మొదట అహంకారం పోగొడతాడు. మనం ఏమేమి చేయాలనుకుంటున్నామో అది అంతా ఆయన సంకల్పమే అని మనకు తెలుస్తుంది.)
నా మాట విని, నా సంకల్పానుగుణంగా నీవు చాలా పెద్ద తపస్సు చేసావు, నీవు నాలోకం చూచుటా నా అనుగ్రహప్రభావం.

ప్రత్యాదిష్టం మయా తత్ర త్వయి కర్మవిమోహితే
తపో మే హృదయం సాక్షాదాత్మాహం తపసోऽనఘ

ఏమి చేయాలో తెలియక నీవు ఇబ్బంది పడుతున్నప్పుడు తపసు చేయమని నేను చెప్పాను. తపసు అంటే నా హృదయం. తపసుకు నేనే ఆత్మను. నేను కూడా తపసుతోటే జగత్తుని సృష్టించి రక్షించి లయం చేస్తున్నాను

సృజామి తపసైవేదం గ్రసామి తపసా పునః
బిభర్మి తపసా విశ్వం వీర్యం మే దుశ్చరం తపః

నా అసలైన బలం తపస్సే

బ్రహ్మోవాచ
భగవన్సర్వభూతానామధ్యక్షోऽవస్థితో గుహామ్
వేద హ్యప్రతిరుద్ధేన ప్రజ్ఞానేన చికీర్షితమ్

అపుడు బ్రహ్మగారు "అందరినీ కనిపెట్టే వారు మీరు (అధ్యక్షులు), అందరి హృదయంలో నీవు అంతర్యామిగా ఉన్నావు". ఎవరెవరు ఏమేమి చేయాలనుకుంటున్నారో నీవు అదే తెలుసుకుంటావు. నీ జ్ఞ్యాన వీర్య తేజస్సులకు అడ్డు ఉండదు.

తథాపి నాథమానస్య నాథ నాథయ నాథితమ్
పరావరే యథా రూపేజానీయాం తే త్వరూపిణః

నేనేమి చేయాలనుకుంటున్నానో నీకు తెలుసు. నీవు నన్ను తపస్సు చేయమని చెప్పావంటే నీవనుకున్నది తపస్సుతోనే సాధ్యము. నాథితమ్ నాథయ - నా కోరికను పరిపూర్తి చేయవలసింది. పరిపూర్ణ ప్రదున్ని నాథుడు అంటారు. పరమాత్మ పరావరుడు (అందరికంటే పెద్దవాడు, అందరికంటే చిన్నవాడూ. ప్రపంచంలో అతి చిన్న వస్తువుకంటే చిన్నవాడు, అతి పెద్దవస్తువుకంటే పెద్దవాడు). వాస్తవముగా నీకు ఏ రూపమూ లేదు, ఆచరించిన కర్మలు అనుభవించవలసిన పాంచభౌతికరూపం లేదు. నీ రూపం అప్రాకృతం. కర్మఫలంగా వచ్చే రూపం కాదు నీది. అలాంటి నీయొక్క రూపం (పెద్దరూపమూ, చిన్నరూపమూ రెండూనూ) నాకు తెలియాలి. నీవు ఎంత చిన్నగా ఉంటావో ఎంత పెద్దగా ఉంటావో తెలియాలి. నీ సౌలభ్యం తెలియాలి, నీ స్వామిత్వం తెలియాలి.

యథాత్మమాయాయోగేన నానాశక్త్యుపబృంహితమ్
విలుమ్పన్విసృజన్గృహ్ణన్బిభ్రదాత్మానమాత్మనా

సత్వ రజ తమ శక్తులు గల పరమాత్మ, ఈ త్రిగుణాత్మకములైన కార్యక్రమములు చేస్తున్నాడు. ఏ పని ఏ గుణానిదో ఆ పని చేయడానికి ఆ గుణాన్ని నీవు తీసుకుంటావు. ప్రకృతిలో నీవు ప్రవేశించి, ఆ గుణాలు స్వీకరించి, అ గుణాలతో విలుంపన్ - లోపింపచేస్తూ, విసృజన్ - లోపించిన దాన్ని సృష్టిచేసి విగృహ్ణన్ - మళ్ళి దాన్ని కాపాడుతూ (విలుంపన్ - సృష్టి తరువాత ముగించుట, విసృజన్ -పోయినదాన్ని రప్పించుట విగృహ్ణన్ - రప్పించిన దాన్ని రక్షించుట )

క్రీడస్యమోఘసఙ్కల్ప ఊర్ణనాభిర్యథోర్ణుతే
తథా తద్విషయాం ధేహి మనీషాం మయి మాధవ

నీ సంకల్పం అమోఘం (వ్యర్థం కాదు). సాలె పురుగు ఎలా నోటినుండి దారాన్ని సృష్టించి, తను వెళ్ళదలచుకున్నప్పుడు ఎలా దాన్నే తింటుందో. ఆ సృష్టిలో నీవు ఎలా ఉంటున్నావో, నీలో ఆ సృష్టిని ఎలా ఉంచుకుంటున్నావో అది నాకు చెప్పవలసింది.

భగవచ్ఛిక్షితమహం కరవాణి హ్యతన్ద్రితః
నేహమానః ప్రజాసర్గం బధ్యేయం యదనుగ్రహాత్

మీరు నాకు ఏ విషయం చెప్పారో, నేను దాన్ని ఏ మాత్రం సోమరితనం లేకుండా చేస్తాను. మీరు నేర్పిన విధంగా సృష్టిస్తాను గానీ, నీ అనుగ్రహంతో నేను చేసిన సృష్టిలో నేనే బంధించబడకుండా ఉంచమని ప్రార్థన.

యావత్సఖా సఖ్యురివేశ తే కృతః ప్రజావిసర్గే విభజామి భో జనమ్
అవిక్లవస్తే పరికర్మణి స్థితో మా మే సమున్నద్ధమదో ఞ్జ మానినః

నీవు నాకు సాక్షాత్కరించి నన్ను కూడా నీ యంతటి వాడిగా భావించి ఒక మిత్రుడిలాగ చేతిలో చేయి వేసావు, కాబట్టి నీవు చెప్పినట్లుగా నీ సంకల్పానుగుణంగా సృష్టి చేస్తాను. నీ సంకల్పానుగుణంగా సృష్టిస్తాను. నీవాజ్ఞ్యాపించిన పనిలో నేను దైన్యం పొందకుండా నిర్వహిస్తాను. కానీ "నేనే నిర్వహించాను అనిపించవద్దు" ఆ మదం నాకు రాకుండా అనుగ్రహించు. అహకారాన్ని రానీయకు

దీనిని చతు శ్లోకీ భాగవతం అంటారు. పరమాత్మ బ్రహ్మగారికీ, బ్రహమ నారదునికీ, నారదుడు, వ్యాసునికి, వ్యాసుడు శుకునికీ బోధించినది. ఈ నాలుగు శ్లోకాలలో, పరమాత్మ అంటే ఏమిటి, జగత్తు అంటే ఏమిటి,

శ్రీభగవానువాచ
జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞానసమన్వితమ్
సరహస్యం తదఙ్గం చ గృహాణ గదితం మయా

విజ్ఞ్యానంతో (శాస్త్ర జ్ఞ్యానంతో) కూడిన అతిరహస్యమైన నా తత్వాన్ని చెప్పే జ్ఞ్యానం, రహస్యములతో కూడి ఉన్న (మంత్రములతో కూడి ఉన్న) దానిని నేను ఉపదేశిస్తున్నాను, స్వీకరించు.
(మంత్రములు మంత్రాంగములు యోగము శాస్త్రము వేదాంగములతో కూడిన దాన్ని చెప్పబోవుతున్నాను అని వ్యాఖ్యానం). ఈ శ్లోకంతో విధురమైత్రేయ, కృష్ణ ఉద్ధవ సంవాదం, ప్రహ్లాద అవధూత సంవాదం, రుద్రహీతలు , మొదలైన సంవాదాలన్నీ ఈ శ్లోకంతో వస్తుంది. అవి నాలుగున్నరవేల శ్లోకాలు.

యావానహం యథాభావో యద్రూపగుణకర్మకః
తథైవ తత్త్వవిజ్ఞానమస్తు తే మదనుగ్రహాత్

అహం యావాన్: నా స్వరూపం ఏమిటీ. నా వ్యాప్తి ఎంతవరకూ ఉందో
యధా భావ: నా స్వభావమేమిటో,
యద్రూపగుణకర్మకః - నేను ఏ రూపంలో ఉంటానో ఏ గుణములతో ఉంటానో ఏ కర్మలు చేస్తానో
(ఈ ఒక్క పాదంతో భాగవతంలో ఉన్న బ్రహ్మ సృష్టి, ప్రజాపతి సృష్టి, ప్రకృతి సృష్టి, ఆత్మ సృష్టి అన్ని వస్తాయి, )
తథైవ తత్త్వవిజ్ఞానమస్తు తే మదనుగ్రహాత్ - నా స్వరూప స్వభావ రూప గుణ కర్మలు అన్నీ ఉన్నదున్నట్లుగా నా అనుగ్రహంతో నీకు కలగాలి.

అహమేవాసమేవాగ్రే నాన్యద్యత్సదసత్పరమ్
పశ్చాదహం యదేతచ్చ యోऽవశిష్యేత సోऽస్మ్యహమ్

అహమేవాసమేవాగ్రే  - ప్రళయకాలంలో, సృష్టి ప్రారంభం కాకముందు ఉన్నది నేను ఒక్కడినే
నాన్యద్యత్సదసత్పరమ్- నేను తప్ప సత్, అసత్ , కాలం లేదు. జీవుడు ప్రకృతి పరం ఏవి లేవు. (పరమాత్మ సంకల్పమే కాలం). ప్రళయకాలంలో నాకంటే భిన్నమైనవి ఏమీ లేవు.
సృష్టికి ముందు నేనే ఉన్నాను, సృష్టి కాలంలోనూ నేనే ఉన్నాను, సృష్టి లయం అయ్యాక కూడా (పశ్చాదహం ) నేనే ఉన్నాను.
యోऽవశిష్యేత సోऽస్మ్యహమ్ - ఏది మిగులుతుందో అదే నేను

(ఈ శ్లోకం వలన భాగవతంలో ఉన్న అన్ని రకాల సృష్టి రక్షణ ప్రళయములూ చెప్పబడ్డాయి)

ఋతేऽర్థం యత్ప్రతీయేత న ప్రతీయేత చాత్మని
తద్విద్యాదాత్మనో మాయాం యథాభాసో యథా తమః

ఋతేऽర్థం యత్ప్రతీయేత - నా సంకల్పం మేరకే అన్నీ జరుగుతాయి
నేను ఉన్నాను కాబట్టే ఇవన్నీ కనపడుతున్నాయి. నేను లేకపోతే నీకు నీవే కనపడవు. (మనలని "మనం" అని మనం అనుకోవడానికి కూడా మనలో ఆయన ఉంటేనే అనుకోగలము. మనకు ఏమైన విషయం తెలిసిందీ అంటే తెలియబడిన విషయంలోనూ, తెలుసుకున్నవాడిలోనూ, తెలుసుకోవడంలోనూ, జ్ఞ్యాతా జ్ఞ్యేయమూ జ్ఞ్యానము ఈ మూడింటిలోనూ ఆయన ఉన్నప్పుడే ఆ జ్ఞ్యానం కలుగుతుంది. అనుభూతి మనకి కలుగ్తోంది అంటే అది పరమాత్మ కలిగించిందే. ఏ జ్ఞ్యానమైనా అతని సంబంధంతోటే కలుగుతుంది )
న ప్రతీయేత చాత్మని - నేను లేకుంటే ఆత్మలో ఎలాంటి స్వరూప స్వభావ జ్ఞ్యానములు కలగవు
తద్విద్యాదాత్మనో మాయాం యథాభాసో యథా తమః
తెలిసినదీ అన్నా, తెలియందీ అన్నా, ఈ రెండూ నా మాయే. వెలుతురూ చీకటి లాగ ప్రకృతి సంబంధం ఉంటే నా జ్ఞ్యానం ఉండదు. నా జ్ఞ్యానం ఉంటే వాడు ప్రకృతితో మోహింపబడడు. ఐతే ఈ ఆత్మజ్ఞ్యానమైనా ప్రకృతి జ్ఞ్యానమైనా నా సంకల్పంతోనే కలుగుతాయి.

యథా మహాన్తి భూతాని భూతేషూచ్చావచేష్వను
ప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషు న తేష్వహమ్

సకల జగత్తులో పరమాత్మ అంతర్యామిగా ఉంటున్నాడు. (కుండ పగలగొట్టినా అందులో ఉండే ఆకాశం అలాగే ఉంటుంది ఎందుకంటే కుండ కూడా ఆకాశంలో ఉంటుంది. అయినా మనం కుండలో ఆకాశం ఉంది అంటాం. మరి కుండ విరిగితే ఆకాశం ఎక్కడికీ పోకుండా అలాగే ఉంటుంది. )
ప్రతీ ప్రాణిలోనూ (చిన్న ప్రాణిలోనూ పెద్ద ప్రాణిలోనూ) పంచభూతాలు ఉన్నాయి. పంచభూతములతోనే మనం ఏర్పడ్డాము. మనమే పంచభూతములలోకి వెళ్ళాము. పంచభూతములు ప్రవేశించినట్లూ ఉంటాయి, ప్రవేశించనట్లూ ఉంటాయి. మనలో అన్ని రంధ్రములలో ఆకాశం ఉంది, ద్రవమంతా జలం, వేడి అంతా అగ్ని, ఘనమైన శరీరమంతా భూమి, శరీరమంతా వాయువూ, ఇలా అన్ని భూతాలు మనలో ఉన్నాయి. పంచభూతాలు మనలో ప్రవేశించినట్లు అనిపిస్తుంది, అలాగే వెళ్ళిపోయినట్లు కనపడతాయి. అలా పంచభూతాలు వచ్చి వెళ్ళినట్లు అనిపిస్తాయి.
నేను ఆ పంచభూతాలలో ఉంటాను. కనీ అవి నాకు అంటవు. పాప పుణ్యాలు, న్యాయాన్యాలు, హితాహితాలు అన్నీ ప్రకృతి సంబంధాలు. ప్రకృతికి సంబంధించిన ఏ దోషాలూ నాకు అంటవు. నేను అన్నింటిలోనూ ఉంటాను. నాకేదీ అంటదు. అన్నిట్లో ఉన్నట్లే ఉంటాను, ఎందులోనూ ఉండను. వేటిలో లేను అనుకుంటారు, గానీ అన్నిటిలో నేను ఉంటాను

(దీనితో మొత్తం భక్తుల చరిత్రలు వస్తాయి)

ఏతావదేవ జిజ్ఞాస్యం తత్త్వజిజ్ఞాసునాత్మనః
అన్వయవ్యతిరేకాభ్యాం యత్స్యాత్సర్వత్ర సర్వదా

ప్రతీ వ్యక్తీ ప్రపంచములో తెలుసుకోవలసినది ఇదే. ఆత్మ తత్వం తెలుసుకోవాలి అనుకునే వాడు తెలుసుకోవలసిన విషయం ఇదే. అన్వయవ్యతిరేకాభ్యాం  - ఏది తెలిస్తే మనకు విషయం తెలుస్తుందో అది అన్వయం. ఏది లేకపోతే మనకి విషయం తెలియదో అది వ్యతిరేక్వ్యాప్తి (వ్యతిరేకం కారణం నుంచి వస్తుంది. ఉదా: "జ్య్నానం లేకుంటే పరమాత్మ తెలియబడదు"). ఏ జ్ఞ్యానంతో పరమాత్మ తెలుస్తాడొ, ఏ అజ్ఞ్యానంతో పరమాత్మ ప్రచ్చనంగా ఉంటాడో , ఇలాంటి రెంటితోటీ. పరమాత్మ అన్ని వేళలా, అన్ని రూపాలలో, అన్ని సంకల్పాలలో ఉన్నాడు.

ఏతన్మతం సమాతిష్ఠ పరమేణ సమాధినా
భవాన్కల్పవికల్పేషు న విముహ్యతి కర్హిచిత్

మీరు ఇంక తపస్సు చేయాండి. కానీ ఈ సూత్రాన్ని మర్చిపోవద్దు. ఈ విజ్ఞ్యానాన్ని నీవు మనసులో పెట్టుకుంటే ఎన్ని వికల్పములు వచ్చినా నీవు మోహింపబడవు, నా మాయ నిన్ను ఏమీ చెయ్యదు

శ్రీశుక ఉవాచ
సమ్ప్రదిశ్యైవమజనో జనానాం పరమేష్ఠినమ్
పశ్యతస్తస్య తద్రూపమాత్మనో న్యరుణద్ధరిః

ఇలా పరమాత్మ బ్రహ్మగారు చూస్తుండగానే అంతర్థానమయ్యాడు

అన్తర్హితేన్ద్రియార్థాయ హరయే విహితాఞ్జలిః
సర్వభూతమయో విశ్వం ససర్జేదం స పూర్వవత్

బ్రహ్మగారు ఆ దిక్కుకే నమస్కారం చేసి పరమాత్మ సంకల్పంతో జరిగిన దానిని చూచి జరగబోయే దానిని ఏర్పరచాడు

ప్రజాపతిర్ధర్మపతిరేకదా నియమాన్యమాన్
భద్రం ప్రజానామన్విచ్ఛన్నాతిష్ఠత్స్వార్థకామ్యయా

ఇలా సృష్టి చేసి, తాను చేసిన సృష్టిలో క్షేమం ఎలా కలుగుతుందో అని ధ్యానమగ్నుడయ్యాడు. ఆయన ధ్యానంలో ఉండగా

తం నారదః ప్రియతమో రిక్థాదానామనువ్రతః
శుశ్రూషమాణః శీలేన ప్రశ్రయేణ దమేన చ

నారదుడు భాగములు తీసుకునే వారితో (రిక్థాదానామనువ్రతః - అన్నలతో) కలిసి వచ్చాడు, ఉత్తమ స్వభావంతో నియమంతో ఇంద్రియ నిగ్రహంతో బ్రహ్మను సేవిస్తూ శ్రీమన్నారాయణుని ప్రభావాన్ని తెలుసుకుందామని వచ్చాడు.

మాయాం వివిదిషన్విష్ణోర్మాయేశస్య మహామునిః
మహాభాగవతో రాజన్పితరం పర్యతోషయత్

తన శుశ్రూషతో సేవతో తండ్రిని మెప్పించాడు

తుష్టం నిశామ్య పితరం లోకానాం ప్రపితామహమ్
దేవర్షిః పరిపప్రచ్ఛ భవాన్యన్మానుపృచ్ఛతి

అన్ని లోకాలకు ముత్తాత అయిన బ్రహ్మగారు సంతోషించాడన్న విషయాన్ని తెలుసుకుని, ఇప్పటిదాకా నీవేమి అడిగావో అది నారదుడు బ్రహ్మగారిని అడిగాడు.

తస్మా ఇదం భాగవతం పురాణం దశలక్షణమ్
ప్రోక్తం భగవతా ప్రాహ ప్రీతః పుత్రాయ భూతకృత్

ఇలా అడిగిన నారద మహర్షికి బ్రహ్మగారు భాగవత పురాణ లక్షణం చెప్పారు. శ్రీమన్నారాయణుడు తనకు ఇంతకు ముందు ఏమి చెప్పాడో బ్రహ్మగారు నారదునికి అదే చెప్పారు.

నారదః ప్రాహ మునయే సరస్వత్యాస్తటే నృప
ధ్యాయతే బ్రహ్మ పరమం వ్యాసాయామితతేజసే

అలాంటి నారదుడు విని తాను బయలుదేరి వచ్చి బదరికాశ్రమంలో సరస్వతీ తీరంలో పరమాత్మయొక్క ధ్యాన ముద్రలో ఉన్న, మహాతేజస్వి అయిన, వేదవ్యాసునికి చెప్పాడు.

యదుతాహం త్వయా పృష్టో వైరాజాత్పురుషాదిదమ్
యథాసీత్తదుపాఖ్యాస్తే ప్రశ్నానన్యాంశ్చ కృత్స్నశః

ఇప్పుడు నీవడిగినట్లుగా విరాట్ పురుషున్నించి ఎలా సృష్టి జరిగిందీ అని, దానికి సమాధానంతో బాటుగా, నీవు అడగని దానికి కూడా సమాధానం చెబుతాను.

                                               సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు

Popular Posts