Followers

Friday 7 February 2014

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం ఇరవై తొమ్మిదవ అధ్యాయం - కపిల దేవహూతి సంవాద, - భక్తి యోగ సమగ్ర వివరణ



                                                              ఓం నమో భగవతే వాసుదేవాయ

దేవహూతిరువాచ
లక్షణం మహదాదీనాం ప్రకృతేః పురుషస్య చ
స్వరూపం లక్ష్యతేऽమీషాం యేన తత్పారమార్థికమ్

ప్రపంచాన్ని సంగరముగా వివీరించారు. మోక్షం లభించడానికి కావలసిన జ్ఞ్యాన భక్తి యోగ కర్మ సాధనాలు వివరించారు. అన్నింటి కన్నా ముఖ్యమైంది భక్తీ అని చెప్పారు. ఇలాంటి భక్తి యోగం ఎన్ని రకములు, విస్తరముగా వివరించారు. ఏ సాధనముతో పరమాత్మ జ్ఞ్యానం కలుగుతుందో అది కూడా చెప్పారు. ప్రకృతి పురుషుడు మహత్తు అవ్యక్తమూ అహంకారమూ, వాటి లక్షణాలు, దేవ దానవ తిర్యక్ మనుష్య స్వరూపాలు. 

యథా సాఙ్ఖ్యేషు కథితం యన్మూలం తత్ప్రచక్షతే
భక్తియోగస్య మే మార్గం బ్రూహి విస్తరశః ప్రభో

సాంఖ్య సిద్ధాంతాలలో ప్రకృతి లక్షణం, జీవుడంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి అనే భక్తికి మూలమైన సాంఖ్యజ్ఞ్యానాన్ని గురించి చెప్పారు. ఈ భక్తి యోగం యొక్క మార్గం గురించి విస్తరముగా చెప్పండి. సాంఖ్య యోగం వచ్చాక భక్తిలోనికి ప్రవేశిస్తేనే దాని ఫలం. భక్తిగా మారితేనే జ్ఞ్యానానికి ప్రయోజనం. 

విరాగో యేన పురుషో భగవన్సర్వతో భవేత్
ఆచక్ష్వ జీవలోకస్య వివిధా మమ సంసృతీః

జీవుడు పొందే అనేక జన్మలను విస్తరించి చెప్పండి. ఏ సంసారాలని తెలుసుకుంటే జీవునికి సర్వాత్మనా (పరిపూర్ణమైన) విరక్తి కలుగుతుందో దానిని గురించి చెప్పండి. 

కాలస్యేశ్వరరూపస్య పరేషాం చ పరస్య తే
స్వరూపం బత కుర్వన్తి యద్ధేతోః కుశలం జనాః

జీవుని గురించీ ప్రకృతిని గురించి ఆ రెంటి సంబంధాన్ని గురించి, ఈశ్వర రూపమైన కాలం గురించీ, గొప్పవారందరికంటే గొప్పవాడైన పరమాత్మ స్వరూపమైన కాలము గురించి చెప్పండి. ఆ కాలం వలనే జీవుడు కర్మ నివృత్తి పొందుతాడు. కాలం స్వరూపం తెలిస్తే కలిగిన విరక్తి పెరుగుతుంది. కాలం అంటే రూపములో స్పర్శలో శబ్దములో రసములో గంధములో మార్పు తెచ్చేది కాలం. (పిందే - కాయ - పండు, బాలుడు - యువకుడు - వృద్ధుడు). అలాంటి కాల స్వరూపాన్ని వివరించండి

లోకస్య మిథ్యాభిమతేరచక్షుషశ్చిరం ప్రసుప్తస్య తమస్యనాశ్రయే
శ్రాన్తస్య కర్మస్వనువిద్ధయా ధియా త్వమావిరాసీః కిల యోగభాస్కరః

శరీరాన్ని ఆత్మగా భావించే ఈ లోకం గుడ్డిదై, అంతులేని తమస్సు ఆవరించి కర్మ చేత కట్టి వేయబడి బాగా అలసిపోయి అనతము లేని ప్రకృతిలో నిరంతరమూ పడుకుని ఉన్నాడు. లేచినా చూడలేని వాడు, ఎందుకంటే తన స్వరూపాన్ని తెలుసుకోలేని గుడ్డివాడు. దేహాత్మభావనతో పిచ్చివాడు. నిరంతరం కర్మలు చేస్తూ అలసిపోయాడు. చీకటిలో నిరంతరమూ ఉన్నాడు. అవాస్తమైన దాన్ని వాస్తవమనుకుంటున్న గుడ్డివాళ్ళం.
స్వామిని యోగ భాస్కరుడు అన్నాడు. నిద్రనీ చీకటినీ, అలసటనూ పోగొట్టేవాడు సూర్యుడు. పైన చెప్పిన మూడిటినీ పొగొట్టేవాడు కాబట్టి ఆయన యోగ భాస్కరుడు. అలసటనూ నిద్రనూ గుడ్డితనాన్ని పోగొట్టేవాడు. 

మైత్రేయ ఉవాచ
ఇతి మాతుర్వచః శ్లక్ష్ణం ప్రతినన్ద్య మహామునిః
ఆబభాషే కురుశ్రేష్ఠ ప్రీతస్తాం కరుణార్దితః

తల్లి యొక్క వినయపూర్వకమైన వాక్యం విన్న కపిలుడు అభినందించి ప్రీతితో కరుణతో పూర్తిగా నిండిన వాడై  ఇలా సమాధానం చెప్పాడు 

శ్రీభగవానువాచ
భక్తియోగో బహువిధో మార్గైర్భామిని భావ్యతే
స్వభావగుణమార్గేణ పుంసాం భావో విభిద్యతే

భక్తి యోగం బహు విధాలుగా ఉంటుంది ఎందుకంటే మార్గాలు చాలా ఉన్నాయి కాబట్టి, వారు అనుసరించే మార్గం బట్టి ఉంటుంది. భగవంతుని కూడా అందరూ ఒకే తీరుగా ఆరాధించరు. సత్వ రజో తమో గుణాలవారందరూ ఆరాధిస్తారు. తామస భక్తి కలవాడైతే ఆ భక్తి కూడా తామస భక్తి. భక్తి తాంసం కాదు. ఆ భక్తుడు తామసుడు. సత్వ రజో తమస్సు భావనలతో పురుషుల భావన కూడా భేధించబడుతుంది

అభిసన్ధాయ యో హింసాం దమ్భం మాత్సర్యమేవ వా
సంరమ్భీ భిన్నదృగ్భావం మయి కుర్యాత్స తామసః

మరి తామసుడంటే ఎవరు. హింసనే మనసులో పెట్టుకుని భక్తికి ఉపక్రమించేవాడు. కోపము కలవాడై (సంరమ్భీ ), ధంభముతో (పూజ చేస్తున్నట్లు కనపడే వారు) , మాత్సర్యముతో (నేనే పూజ చేస్తున్నా) చేస్తాడు. ఇలా హింసతో ధంభముతో మాత్సర్యముతో మూడు రకాలుగా ఉంటుంది తామస భక్తి. దీనికి మూలము కోపము. పరమాత్మను కోపముతో పూజిస్తాడు. ఇవన్నీ ఎందుకు పుడతాయంటే (భిన్నదృగ్) పరమాత్మ వేరు ప్రపంచం వేరు అనే భావన ఉండటమే. ధంభమంటే లేనిదాన్ని ఉన్నట్లు చూపడం. తామస భక్తికి మూలం భేధ దృష్టి. అలాంటి భావన్ నా యందు ఉంచితే అది తామస భక్తి

విషయానభిసన్ధాయ యశ ఐశ్వర్యమేవ వా
అర్చాదావర్చయేద్యో మాం పృథగ్భావః స రాజసః

నాకు భోగములు బాగా కావాలి అని, నాకు గొప్ప కీర్తి కావాలి అని, నాకు గొప్ప ఐశ్వర్యం (శాసకత్వం, ప్రభుత్వం) కావాలని, వాటిని కోరి, భేధ దృష్టితో పరమాత్మ విగ్రహన్ యందు ఆరాధన చేసేవాడు రాజస భక్తి కలవాడు

కర్మనిర్హారముద్దిశ్య పరస్మిన్వా తదర్పణమ్
యజేద్యష్టవ్యమితి వా పృథగ్భావః స సాత్త్వికః

ఇది వరకు నేను ఆచరించిన కర్మల వలన కలిగిన పాప పుణ్యములు తొలగిపోవాలి అనుకుంటాడు, నేను చేసే అన్ని పనులు పరమాత్మార్పితం (కృష్ణార్పణం) చేయాలి, పరమాత్మ ఇచ్చిన ఉపకరణములతో పరమాత్మను ఆరాధించడం నా విధి (అలా చేయకపోతే పరమాత్మ శిక్షిస్తాడు) అని అంతర్యామిగా పరమాత్మ ఉన్నడని నమ్మి, అపృధగ్భావముతో ఆరాధించేవాడిది సాత్విక భక్తి.  సాత్వికం అంటే ఉన్నదున్నట్లు చూపడం.  ఉన్నదున్నట్లు చూపనిది రాజసం కానీ, తామసం గానీ అవుతుంది ("సత్వాత్‌ సంజాయతే జ్ఞానం" -గీత) .
ఈ తొమ్మిది రకాలలో తొమ్మిదవదే భక్తి - అంటే, ఇది నా విధి అనుకొని పరమాత్మను ఆరాధించడమే భక్తి. పరమాత్మ మనకోసం నిరంతరముగా మన జీవనం గురించి చేస్తూ ఉన్న ఏర్పాట్లని చూచి పరమాత్మ మీద ప్రేమ కలిగి ఆయనను ఆరాధించడమనేది మన విధి అని పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం భక్తి. ఆరాధించడం వలన వచ్చిన ఫలితాన్ని కూడా స్వామికే అర్పించడం ఉత్తమ భక్తి. 
ప్రతీ భక్తిలో అధమం మధ్యమం ఉత్తమం ఉన్నాయి. తామస భక్తిలో - హింస అధమం, ధంభం మధ్యమం, మత్సరం ఉత్తమ తామసం. 
విషయాభిలాష కోసం చేసేది ఉత్తమం, యశస్సు కోసం చేసేది రాజసం, ఐశ్వర్యం కోసం చేసేది అధమం. 
సాత్విక భక్తిలో కూడా కర్మ నిర్హారణం కోసం చేసేది అధమం.

మద్గుణశ్రుతిమాత్రేణ మయి సర్వగుహాశయే (సర్వగుణాశ్రయే)
మనోగతిరవిచ్ఛిన్నా యథా గఙ్గామ్భసోऽమ్బుధౌ

ఈ చివరిదైన తొమ్మిదవ రకమైన భక్తి ఉన్నవారు, పరమాత్మ యందే ఎలాంటి విచ్చేధమైన లేని మానసిక స్థితో మనసు ఉంచాలి. నిరంతరం నా (పరమాత్మ) గుణాలు వింటే అదే కలుగుతుంది. స్తోత్రము చేయడానికి కావలసిన అనంత కళ్యాణ గుణములు కలవాడు పరమాత్మ. అటువంటి నా గుణాలకు సంబంధించిన కథలను వింటే నాయందు అవిచ్చిన్నమైన భావం కలుగుతుంది. సముద్రములో కలవడానికి బయలుదేరిన గంగాప్రవాహం ఎలా విచ్చిన్నం కాదో నాయందు ఉంచిన భక్తి కూడా విచ్చిన్నం కాదు. దానికి ఆశ్రయించవలసిన ప్రధాన సాధనం. నా గుణాలని వినడం. 

లక్షణం భక్తియోగస్య నిర్గుణస్య హ్యుదాహృతమ్
అహైతుక్యవ్యవహితా యా భక్తిః పురుషోత్తమే

భక్తి యోగ లక్షణం చెబుతున్నాను.  నిర్గుణమైన (సత్వమూ  కాదూ, రజస్సూ కాదూ, తమస్సూ కాదు, నేను పరమాత్మ యందు నిర్హేతుకముగా మనసు లగ్నం చేసాననే జ్ఞ్యానం కూడా ఉండకూడదు - అదే నిర్గుణం. మనం చేస్తున్న పని మీద మనసు ఉండాలి కానీ, మనం చేస్తున్న పని వలన కలిగే ఫలితాల మీద ఉండకూడదు. వాహనం నడుపుతూ దారిని చూడాలి గానీ, ఎక్కడికి వెళుతున్నామో దాని గురించి ఆలోచిస్తూ, దాన్ని చూస్తే ముందుకు వెళ్ళలేము) భక్తి యోగం. నిర్గుణమైన భక్తి అంటే కలగబొయే ఫలముతో వ్యవధానం ఉండకూడదు (అవ్యవహితా). నేనీ భక్తితో ఉంటే స్వామిని చూస్తాను అన్నది కూడా నిర్గుణ భక్తి కాదు. ప్రహ్లాద నారదులది అట్టి భక్తి.  అహైతుకి (ఫలము మీద ఆసక్తి లేకుండా, ధర్మము కాబట్టి ఆరాధించాలి, కారణము లేని భక్తి. ఎలా ఐతే పరమాత్మ కటాక్షం నిర్హేతుకమో, మన భక్తి కూడ నిర్హేతుకమై ఉండాలి ), అవ్యవహితా (పరమాత్మకి మనకి మధ్య ఇంకోటి ఉండకూడదు, వ్యవధానం ఉండకూడదు. "అది కావాలి, ఇది కావాలి" అనే కోరిక ఉంటే, పరమాత్మకూ మనకూ మధ్య "కోరిక" అనే తెర ఉంటుంది)
ఫలాపేక్షలేకుండ్దా, పరమాత్మకూ మనకూ మధ్య ఇంకోటి లేకుండా ఉండే భక్తే నిర్గుణమైన భక్తి. 

సాలోక్యసార్ష్టిసామీప్య సారూప్యైకత్వమప్యుత
దీయమానం న గృహ్ణన్తి వినా మత్సేవనం జనాః

నా మీద భక్తి ఉన్నవారు నన్ను తప్ప మరేదీ కోరరు. మోక్షం కూడా కోరరు. సాలోక్యం (పరమాత్మ ఉండే లోకం), సార్జి( పరమాత్మకు ఎంతభోగం ఉందో అంత భోగం) సామీప్యం( పరమాత్మ దగ్గరలో ఉండటం) సారూప్యం (పరమాత్మలా మనం మారడం) ఏకత్వం (పరమాత్మ స్థితి పొందుట) 
ఈ ఐదు రకాలని కానీ, మోక్షాన్ని కానీ, నేను ఇస్తానన్నా నిర్గుణ భక్తి కలవారు తీసుకోరు. నన్ను సేవించడం తప్ప మరి దేన్నీ కోరుకోరు. నేను ఇస్తానన్నా (దీయమానం ) తీసుకోరు 

స ఏవ భక్తియోగాఖ్య ఆత్యన్తిక ఉదాహృతః
యేనాతివ్రజ్య త్రిగుణం మద్భావాయోపపద్యతే

ఇదే ఆత్యంతిక భక్తి. దీనిని మించిన ఇంకొక భక్తి లేదు. ఇలాంటి భక్తి యోగం అలవడితే ప్రకృతిని దాటి నా భావాన్ని (సామ్యం గానీ, సారూప్యం గనీ, సామీప్యం గానీ) పొందుతారు. ఇలా నా భావాన్ని పొందడమే ఆత్యంతికమైన భక్తి. నా స్వభావాన్నీ పొందాలి, అది కూడా నా స్వభావన్ని పొందడం కూడా ఫలముగా అనుకోకూడదు. అది నేను ఇచ్చేది కదు, తీసుకునేది కాదు. సహజముగా జరగాలి. అది జరగాలంటే ఏమి చేయాలి? పరమాత్మ గుణాలు వినాలి. 

నిషేవితేనానిమిత్తేన స్వధర్మేణ మహీయసా
క్రియాయోగేన శస్తేన నాతిహింస్రేణ నిత్యశః

ఇలా వింటున్న కొద్దీ, ముందు వచ్చేది ఫలమును ఆశించకుండా ధర్మాన్ని ఆచరించే అనుష్ఠానం (నిషేవితేనా) , ఆచరణ జరుగుతుంది. కర్మ ఆచరించే వారు కర్మ స్వరూపాన్ని తెలుసుకుని ఆచరించాలి గానీ, ఫలాని గురించి కాదు. అలా ఫలం గురించి ఆలోచిస్తే అది ధర్మ భ్రష్టమే. 
స్వధర్మేణా - వర్ణాశ్రమ ధర్మాలు, ఏ వర్ణం వాడో, ఏ ఆశ్రమం వాడో, ఏ వయసు వాడో, ఏ అవస్థ వాడో దానికొరకు నియోగించబడిన కర్మలు చేయాలి. వాటి వలన మనసు పావనమవుతుంది. సన్యాసం అంటే కామ్యకములను విడిచిపెట్టాలి. స్వధర్మం కాబట్టి ఆచరించాలి. తన ధర్మమే గొప్పదని ఆచరించాలి. 
ఇవన్నీ చేస్తూ కూడా (క్రియా యోగేన మహీయశా) పరమాత్మ ఆరాధన చేయాలి. క్రియా యోగం అంటే పరమాత్మ ఆరాధనా విధానం. అంటే ఆగమం. పాంచరాత్ర, వైఖానస, శైవాగమాలు చెప్పినట్లుగా ఆరాధాన చేయాలి. అది కూడా ప్రశస్త్మైన విధముగా చేయాలి. ఎక్కువ హింస కలిగేది కాకూడదు. హింస లేకుండా ఎవరూ ఏ పనీ చేయలేరు. తులసి తెంపడం గానీ, పూలు కోయడం గానీ, ప్రసాదానికి మంట వెలిగించడం గానీ, ఊడవడం గానీ, దంచడం గానీ, వీటి వలన జరిగేది హింసే. అందుకే, అసలు హింస లేకుండా జరగదు కాబట్టి, స్వల్ప హింసేనా అన్నాడు.

మద్ధిష్ణ్యదర్శనస్పర్శ పూజాస్తుత్యభివన్దనైః
భూతేషు మద్భావనయా సత్త్వేనాసఙ్గమేన చ
మహతాం బహుమానేన దీనానామనుకమ్పయా
మైత్ర్యా చైవాత్మతుల్యేషు యమేన నియమేన చ

నా స్వరూపం, లేదా ఆలయములో నా విగ్రహాన్ని దర్శనముతో స్పర్శతో పూజతో వందనముతో గానీ, అన్ని ప్రాణులలో పరమాత్మే ఉన్నాడు అనే భావముతో పూజించాలి స్తుతించాలి అభినందించాలి వందనం చేయాలి. అన్ని ప్రాణులలో నా భావన కలిగి ఉండాలి. ఇవన్నీ ఉండి కూడా సత్వం (ధైర్యం) ఉండాలి.  సిగ్గుపడడానికి హేతువైన ఎన్నో పనులు ధైర్యముగా చేస్తూ, పరమాత్మని అర్చించడానికి సిగ్గుపడటం ధైర్యం లేకపోవడం. భక్తి ఉన్నా, ఉన్న భక్తితో పరమాత్మను అర్చించడానికి ధైర్యం కావాలి,. ఆ ధైర్యం కలగాలంటే సంసారం యందు ఆసక్తి ఉండకూడదు. పక్కవారేమనుకున్నా నేను భగవదార్చన చేస్తాను అనుకునేదెప్పుడు? వాడి వలన మనకు కలిగే ప్రయోజనం పోతుందేమో అన్న భయం పోయిన నాడు అనుకుంటాము. ఎదుటి వారు అవహేళన చేస్తారేమో అనుకున్నవాడు భక్తుడు కాలేడు. అందుకు ధైర్యముండాలి, అది కలగడానికి అసంగముండాలి. అసంగం కలగాలంటే పెద్దలను సేవించాలి, దీనులని చూచి జాలి చూపాలి. 
అసూయ అమర్షమూ ద్వేషమూ - ఇవే ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక తాపములు. పక్కవాడికి మనకన్నా ఏదో కొద్దిగా ఎక్కువ ఉంది అనగానే మనకు కలిగేది అసూయ. మనకంటే గొప్పవాన్ని చూస్తే అసూయ, మనకన్నా చిన్నవాన్ని చూస్తే అసహనం కలుగుతుంది. మనతో సమానున్ని చూస్తే అమర్షం కలుగుతుంది (ఉదా వాడు నా అంత వాడా? )
మనకంటే గొప్పవాన్ని చూసి సంతోషించాలి (మహతాం బహుమానేన), మనకంటే చిన్న వాడిని చూచి జాలిపడాలి (దీనానామనుకమ్పయా), మనతో సమానుడితో మైత్రి సలుపు (మైత్ర్యా చైవాత్మతుల్యేషు). 
 ఇవి కలగాలంటే యమ నియమాదులు కలగాలి ( యమేన నియమేన చ). 
వేదాంత శాస్త్రమును వినడము వలన కలుగుతుంది. పురాణం వినాలన్న బుద్ధి ఎలా పడుతుంది - నామ సంకీర్తనతో పుడుతుంది. 

ఆధ్యాత్మికానుశ్రవణాన్నామసఙ్కీర్తనాచ్చ మే
ఆర్జవేనార్యసఙ్గేన నిరహఙ్క్రియయా తథా

భగవంతుని నామాన్ని ధైర్యముగా సంకీర్తన చేయాలంటే నిజాయితీ కలగాలి. మనసులో ఏముందో అది మాట్లాడాలి, అదే చెప్పాలి. మనసులో ఏమంకుంటామో దాన్నే మాట్లాడి దాన్నే చేయాలి. అలాంటి వారే పరమాత్మ నామాన్ని కీర్తన చేయగలరు. "నేను కూడా  భగవన్నామాన్ని సంకీర్తన చేస్తున్నారు"  అని నా చుట్టూ ఉన్న వారు అనుకోవాలని చేసే కీర్తన, లేదా "భగవన్నామ సంకీర్తన చేస్తే నాకు కూడా సౌకర్యాలు వస్తాయి" అనే భావనతో చేసేది ఆర్జవం కాదు. 
ఆర్జవం అంటే మనోవాక్కాయేషు ఏకరూపతా. అది ఎలా కలుగుతుంది? పెద్దలతో కలిసి ఉండటం వలన కలుగుతుంది (ఆర్జవేనార్యసఙ్గేన). అలా జరగాలంటే ముందు మనకన్నా వారు పెద్దలూ అని ఒప్పుకోవాలి. అంటే అహంకారం పోవాలి. 

మద్ధర్మణో గుణైరేతైః పరిసంశుద్ధ ఆశయః
పురుషస్యాఞ్జసాభ్యేతి శ్రుతమాత్రగుణం హి మామ్

ఇలా పరిపూర్ణముగా నా ధర్మాలను, పరమాత్మను పొందడానికి కీర్తించడానికి దర్శించడానికి అన్ని ధర్మాలు ఆచరించే వారు ఈ గుణాలన్నీ కలిగి ఉంటారు. ఈ గుణాలన్నీ కలిగి ఉంటే మనసు పరిశుద్ధమవుతుంది. మనసుకున్న మురికి పోవాలంటే ఇవన్నీ చేయాలి. మనసు శుద్ధి అయిన తరువాత, "నేను ఇవన్నీ చేస్తున్నానని" వారికీ తెలియదు, పక్కవారికీ తెలియదు. "నేను ఇవన్నీ చేస్తున్నాను" అని చెప్పుకునే వాడు ధంభం కలవాడు. అలాంటి వారు చేసేది కొంగజపమే

యథా వాతరథో ఘ్రాణమావృఙ్క్తే గన్ధ ఆశయాత్
ఏవం యోగరతం చేత ఆత్మానమవికారి యత్

అలాంటి వాడు నాగుణములు విని ఎలాంటి నన్ను సాక్షాత్కరించుకోవాలని భావించాడో , అలాంటి గుణములు గల నన్ను చేరతారు 
భక్తి యోగమంటే ఏమిటి, ఏది ఉత్తమ భక్తి యోగం, అది ఎలా కలుగుతుంది, అది కలిగిన వాడు ఏమి పొనుతాడు అనేది ఈ పై ఇరవై శ్లోకాలలో చెప్పాడు.సంసారములో ఉండి ఆశా పాశాలకు కట్టుబడిన వాడు ఇంత మురికిలో ఉండి కూడా ఇవన్నీ పొందగలరా? ఇన్ని బంధాలు ఉన్నప్పుడు, అడ్డంకులు ఉన్నప్పుడు, ఇంత మురికి మన చుట్టూ ఉన్నప్పుడు, ఇవి కాదని మనం భగవంతుని చేరగలమా? 
మన ప్రయత్నముతో చేయగలమా? కొన్ని మన ప్రయత్నం లేకుండా అవుతాయి.  ఉదా: వాయును ఆవేశించి పుష్పము యొక్క సుగంధము మన నాసికను చేరి శుభ్రపరుస్తుంది.దానికి మనం చేయాల్సింది మన ఘ్రాణం ఆ పూల తోట దగ్గరలో ఉండాలి. అలాగే మన చిత్తం యోగాన్ని ఆశ్రయించి ఆ మార్గములో ఉంటే ప్రయత్నం లేకుండానే చేరుతుంది. మన మనసు పరమాత్మను చేరినట్లు ధ్యానం చేస్తున్నట్లు ఎలా తెలుస్తుంది. అలాంటి వాడు ఎలా ఉంటాడు? పరమ కోపిష్టీ ఆరాధన చేస్తున్నాడు, పరమ సాత్వికుడూ ఆరాధన చేస్తున్నాడు. వీరిలో ఎవరు ఎవరని ఎలా గుర్తించాలి?

అహం సర్వేషు భూతేషు భూతాత్మావస్థితః సదా
తమవజ్ఞాయ మాం మర్త్యః కురుతేऽర్చావిడమ్బనమ్

పరమాత్మ అన్ని వేళలా అన్ని చోట్లా అందరిలో అంతర్యామిగా ఉంటాడు. ఈ విషయాన్ని కాస్తా మరచిపోయి, నిర్లక్షం చేసి, ఆ భావాన్ని వదిలిపెట్టి, ఆరాధనకు అర్భాటం చేస్తాడు. సర్వభూతాంతర్యామిగా ఉన్న నన్ను గుర్తించకుండా ఆరాధనలో ఆడంబరం చూపిస్తే అది ఆడంబరం మాత్రమే. అంతటా పరమాత్మను చూడగలిగినవాడు, పరమాత్మ రూపముగా ఉన్నవారందరినీ సమానముగా ఆదరిస్తాడు, ఆదరిస్తాడు. వారందరి సహకారముతో భగవానున్ని ఆరాధిస్తాడు. దాన్ని మర్చిపోయి అర్చావిడంబనం చేస్తున్న వారికి నా మీద భక్తి ఉండదు.

యో మాం సర్వేషు భూతేషు సన్తమాత్మానమీశ్వరమ్
హిత్వార్చాం భజతే మౌఢ్యాద్భస్మన్యేవ జుహోతి సః

నేను అందరిలో ఉన్నా అన్న సంగతి మరచిపోయి "నాకు మాత్రమే ఆరాధనార్హత ఉంది. నేను మాత్రమే భగవానుని పొందుతాను" అంటారు. అర్చావతారముండాలి, కానీ భాగవతోత్తములని అవమానించే భగవదారాధన చేయాలి. ఒకవేళ భగవదారాధనలో ఆచార్యులు వస్తే, భగవదారాధన ఆపి, ఆచార్యులని ఆరాధించాలి. అది పూజ ఆపినట్లు కాదు. భాగవతారాధన కూడా భగవదారాధనలో భాగమే. అది తెలుసుకోని వారి పూజ, అగ్నిహోత్రములో వేసిన బూడిద లాంటిది.

ద్విషతః పరకాయే మాం మానినో భిన్నదర్శినః
భూతేషు బద్ధవైరస్య న మనః శాన్తిమృచ్ఛతి

పరమాత్మని ఆరాధిస్తూ కొందరిని ద్వేషిస్తారు. అంటే వారిలో ఉన్న నన్ను ద్వేషించినట్లే. ఎదుటివారి శరీరములో అంతర్యామిగా ఉన్న నన్ను ద్వేషించి, "వీడు శత్రువు", "పరమాత్మ నా ఎదురుగా ఉన్న విగ్రహములోనే ఉన్నాడు. పక్కనున్న ప్రాణిలో పరమాత్మ లేడు" అని తలుస్తాడు. ఇతరులతో వైరం పెట్టుకున్నవారు మనశ్శాంతిన్ పొందలేరు. వారి మనసుకి ఉన్న మురికి తొలగదు. మన ఇంట్లో స్వామికి ఆరాధన చేయడములో ఉద్దేశ్యం, ఆరాధన చేయని వాళ్ళని నిందించమని కాదు. 

అహముచ్చావచైర్ద్రవ్యైః క్రియయోత్పన్నయానఘే
నైవ తుష్యేऽర్చితోऽర్చాయాం భూతగ్రామావమానినః

అందరిలో పరమాత్మని చూడకుండా ఎంత పూజ చేసినా నేను సంతోషించను. తోటి ప్రాణులని అవమానించి నాకు లక్షలు ఖర్చుపెట్టి పూజ చేసినా నేను సంతోషించను. 

అర్చాదావర్చయేత్తావదీశ్వరం మాం స్వకర్మకృత్
యావన్న వేద స్వహృది సర్వభూతేష్వవస్థితమ్

అలా అని విగ్రహారాధన మానివేయొచ్చా? విగ్రహములో ఎప్పటిదాకా ఆరాధించాలంటే, తన హృదయములో ఉన్న అంతర్యామి తనకు సాక్షాత్కరించేవరకు. ఎప్పటివరకూ పరమాత్మ సాక్షాత్కారం పొందలేమో అంతవరకూ అర్చారాధన చేయాలి. అంతే కాదు, దానిలో పాల్గొనడానికి వచ్చిన భక్తులని అవమానించకుండా, వారిని ఆదరిస్తూ చేయాలి.  పరమాత్మని ఆరాధిస్తున్నప్పుడు వచ్చినవారు కూడా పరమాత్మే అని భావించాలి. అటువంటి పూజ నేను స్వీకరిస్తాను. ఎప్పటిదాకా నీలో నన్ను చూడలేవో (యావన్న వేద స్వహృది సర్వభూతేష్వవస్థితమ్), ఎదురుగా విగ్రహములో నన్ను ఆరాధించు. 

ఆత్మనశ్చ పరస్యాపి యః కరోత్యన్తరోదరమ్
తస్య భిన్నదృశో మృత్యుర్విదధే భయముల్బణమ్

తనను గొప్పవాడిగా భావించుకొని, పక్కవారిని తక్కువచేసేవాడిని, నేనేమీ అనను, తనకూ ఇతరులకూ ఏ చిన్ని భేధాన్నైనా చూస్తే, అలాంటి వానికి, మృత్యువు మహా ఘోరమైన భయాన్నిస్తుంది. "వాడు వేరు, నేను వేరు" అనే భావన వీడాలి. "నన్ను పెద్దవాన్ని చేయడానికి స్వామి వీడిని చిన్నవాడిని చేసాడు. నా పెద్దతనానికి వాడి చిన్నతనం గొప్ప కారణం అని" భావించి కృతజ్ఞ్యతా భావముతో ఉండాలి. 

అథ మాం సర్వభూతేషు భూతాత్మానం కృతాలయమ్
అర్హయేద్దానమానాభ్యాం మైత్ర్యాభిన్నేన చక్షుషా

అన్ని ప్రాణులలో ఉన్న నన్ను గౌరవించాలి. పెద్దవారైతే పూజించండి (మానము), చిన్నవారికి సహకరించండి (దానం),  లేదా దానం చేయండి, సమానులైతే స్నేహం చేయండి. ఇలా జరగాలంటే పరమాత్మానుగ్రహం ఉండాలి. మరి ఎవరు పెద్దవారు, ఎవరు చిన్నవారు? అందరికంటే గొప్పవారెవరు

జీవాః శ్రేష్ఠా హ్యజీవానాం తతః ప్రాణభృతః శుభే
తతః సచిత్తాః ప్రవరాస్తతశ్చేన్ద్రియవృత్తయః

చనిపోయిన వాటి కంటే బ్రతికున్నవారు గొప్ప (ప్రాకృతిక ప్రళయములో కూడా ఎవరు మరణించరో వారు గొప్పవారు. నైమిత్తిక ప్ర్రళయములో బ్రహ్మకు సాయంకాలం ఐనప్పుడు భూః భువః స్వః ఉండవు), 
బ్రతికి ఉన్నవారి కన్నా ప్రాణం ఉన్నవారు గొప్ప (ఉదా: శిలల కన్నా జీవులు శ్రేష్టులు) 
ప్రాణం ఉన్న వారి కంటే మనసు ఉన్నవారు గొప్ప (చెట్లకి ప్రాణం ఉంది గానీ మనసు లేదు)
మనసు ఉన్న వారి కంటే ఇంద్రియ జ్ఞ్యానం ఉన్నవారు గొప్ప ( కొన్ని చెట్లు చూస్తాయి, కొన్ని చెట్లు మనిషి వస్తే ముడుచుకుంటాయి, కొన్ని చెట్లు వాసన వలన ముడుచుకుంటాయి) 

తత్రాపి స్పర్శవేదిభ్యః ప్రవరా రసవేదినః
తేభ్యో గన్ధవిదః శ్రేష్ఠాస్తతః శబ్దవిదో వరాః

ఇంద్రియజ్ఞ్యానం కలవాటి కంటే స్పర్శ జ్ఞ్యానం కలవి గొప్పవి
స్పర్శ జ్ఞ్యానం కలవాటి కంటే రుచి చూసేవి (ఉదా చేపలు) గొప్పవి (చేపలకంటే తుమ్మెదలు గొప్పవి)
వాటి కంటే శబ్దం వినేవి గొప్పవి (ఉదా: పాములు)

రూపభేదవిదస్తత్ర తతశ్చోభయతోదతః
తేషాం బహుపదాః శ్రేష్ఠాశ్చతుష్పాదస్తతో ద్విపాత్

వాటి కన్నా రూపాన్ని చూసేవి గొప్పవి
వాటిలో కూడా రెండువైపులా పళ్ళు ఉన్నవి గొప్పవి (గేదెలకు ఒకవైపే ఉంటాయి, గుఱ్ఱాలకు రెండువైపులా ఉంటాయి) 
వాటికంటే చాలా కాళ్ళు ఉన్నవి శ్రేష్టమూ
వాటికన్నా నాలుగు కాళ్ళు ఉన్నవి శ్రేష్టము 
వాటికంటే రెండుకాళ్ళు ఉన్నవి శ్రేష్టము. వాటిలో కూడా మానవులు శ్రేష్టులు.

తతో వర్ణాశ్చ చత్వారస్తేషాం బ్రాహ్మణ ఉత్తమః
బ్రాహ్మణేష్వపి వేదజ్ఞో హ్యర్థజ్ఞోऽభ్యధికస్తతః

రెండుకాళ్ళు ఉన్నవారిలో కూడా వర్ణములు ఉన్నవారు శ్రేష్టులు. 
ఈ నాలుగు వర్ణాలలో బ్రాహ్మణులు గొప్పవారు
బ్రాహ్మణులలో వేదము తెలిసిన వాడు శ్రేష్టుడు. 
వేదము తెలిసిన వారి కంటే వేదార్ధం తెలిసిన వాడు శ్రేష్టుడూ

అర్థజ్ఞాత్సంశయచ్ఛేత్తా తతః శ్రేయాన్స్వకర్మకృత్
ముక్తసఙ్గస్తతో భూయానదోగ్ధా ధర్మమాత్మనః

వేదార్థం తెలిసిన వాడి కంటే వేదార్థం చెప్పేవాడు గొప్ప,
చెప్పేవాడి కంటే చెప్పిన దాన్ని ఆచరించేవాడు గొప్ప
ఆచరించే వాడి కంటే ఫలమును ఆశించని వాడు గొప్ప (ఆసక్తి లేకుండా ఆచరించేవాడు)
సంగములేనివాడికంటే, ఫలమును కావాలని అడగని వాడు గొప్ప 

తస్మాన్మయ్యర్పితాశేష క్రియార్థాత్మా నిరన్తరః
మయ్యర్పితాత్మనః పుంసో మయి సన్న్యస్తకర్మణః
న పశ్యామి పరం భూతమకర్తుః సమదర్శనాత్

వీరందరికంటే, తాను ఆచరించిన అన్ని కర్మల ఫలితాన్ని నాకు అర్పించేవాడు గొప్పవాడు,
నా యందే మనసు ఉంచి, అన్ని పనులు నాకే అర్పించేవాడికంటే గొప్పవాడేవడొ నాకు కూడా తెలియదు. ఇదే సన్యాసం అంటే. ఫలమంతా భగవంతునికి అర్పించి పని చేయడం సన్యాసం. (మనం ఇవ్వకున్నా ఫలితం ఆయనదే. కానీ మన భావనలో మార్పు ఉండాలి. ఏ అనుభూతి అయినా వచ్చేది, మనసుకూ, మనసు ద్వారా బుద్ధికీ, బుద్ధి ద్వారా ఆత్మకూ, ఆత్మ ద్వారా పరమాత్మకు )
అన్ని కర్మలు పరమాత్మ యందు అర్పించేవాడికి కర్తృత్వాభిమానము లేదు, అందరియందూ సమదృష్టి కలవాడు (అకర్తుః సమదర్శనాత్)

మనసైతాని భూతాని ప్రణమేద్బహుమానయన్
ఈశ్వరో జీవకలయా ప్రవిష్టో భగవానితి

ఎదురుగా ఒక ప్రాణి కనపడితే "మనసుతో" అందులో అంతర్యామిగా ఉన్న పరమాత్మకి నమస్కరించాలి. ఆ ప్రాణి కూడా పరమాత్మ రూపం అని భావించి, మనసా నమస్కారం చేయి. పరమాత్మే జీవ రూపములో ఆ శరీరములోకి ప్రవేశించాడు. ఏ ప్రాణి కనపడ్డా మనసుతో నమస్కారము చేయి. పరమాత్మే ఈ జీవకళతో ప్రవేశించాడని గుర్తించాలి

భక్తియోగశ్చ యోగశ్చ మయా మానవ్యుదీరితః
యయోరేకతరేణైవ పురుషః పురుషం వ్రజేత్

మానవీ! ( మను పుత్రికా), నీకు భక్తి యోగమూ, జ్ఞ్యాన యోగమూ చెప్పాను. (పరమాత్మని ఆరాధించే విధానం భక్తి యోగం. అన్ని భూతములలో పరమాత్మ ఉన్నడని గుర్తించి ఆరాధించుట భక్తి యోగం. జ్ఞ్యాన యోగమంటే ఆత్మసాక్షాత్కారం , ఆత్మ పరమాత్మాత్మకం అని తెలుసుకోవడం) 
ఈ రెంటిలో దేన్ని ఆశ్రయించాలి? వీటిలో దేన్ని ఆశ్రయించినా నేను దొరుకుతాను. జీవాత్మ పరమాత్మలో చేరతాడు. 

ఏతద్భగవతో రూపం బ్రహ్మణః పరమాత్మనః
పరం ప్రధానం పురుషం దైవం కర్మవిచేష్టితమ్

ఇదే భగవంతుని రూపము. పరమాత్మ పరబ్రహ్మగా మనం చెప్పుకునే స్వామి రూపం ఇదే. ప్రకృతీ, జీవుడూ, సంకల్పమూ, మనలో కదలికా, పరమాత్మా, జరిగే కర్మా, కర్మకు కావలసిన కదలిక (స్పందన - కొన్ని సార్లు మనం చేయాలనుకున్నా మనం చేయలేము.), ఇవన్నీ పరమాత్మ రూపములే. 

కాలము: 

రూపభేదాస్పదం దివ్యం కాల ఇత్యభిధీయతే
భూతానాం మహదాదీనాం యతో భిన్నదృశాం భయమ్

ప్రపంచములో ప్రతీ దానిలోనూ రూప భేధాన్ని కలిగించేది కాలం. ఉదా: పూవు, పిందె, కాయ, పండు. మన శరీరములోనే క్రమక్రమముగా కాలానుగుణముగా మార్పు వస్తూ ఉంటుంది. ఒక్క రూపమే కాదు, రూపమూ, రసమూ, గంధమూ, స్పర్శ, శబ్దమూ, అన్నీ కాలానుగుణముగా మారుతాయి. ఇలా అన్ని విషయాలనూ మార్హ్చేదే కాలము. ఎంత గొప్పవారికైనా దాని నుంచే భయము. అన్నిటినీ మార్చేదీ, అందరికీ భయం కలిగించేదీ కాలం. భగవంతుని కంటే నేను వేరు అనుకున్న వారు భయపడతారు. కాలాన్ని భగవంతునిగా ఆరాధించని వారు భయపడతారు. భేధ దృష్టిని కలిగించేదీ కాలమే, స్నేహాన్ని కలిగించేదీ కాలమే. 

యోऽన్తః ప్రవిశ్య భూతాని భూతైరత్త్యఖిలాశ్రయః
స విష్ణ్వాఖ్యోऽధియజ్ఞోऽసౌ కాలః కలయతాం ప్రభుః

కాలము అఖిలాశ్రయము. అందరికీ ఆధారమైనది కాలము. అన్ని ప్రాణులలోపల ప్రవేశించి, ఒక ప్రాణితో ఇంకో ప్రాణిని తిని వేస్తాడు. ప్రాణులతోటే ప్రాణులని తింటున్నాడు. తినే వాడూ, తినబడే వాడూ పరమాత్మే. 
అలాంటి వాడు శ్రీమన్నారాయణుడే. ఈయన అధి యజ్ఞ్యుడు - సర్వ భూత శాసకుడు. వశం చేసుకునే వారందరికీ ప్రభువు (కలయతాం). సర్వ భూతాధికుడు. 

న చాస్య కశ్చిద్దయితో న ద్వేష్యో న చ బాన్ధవః
ఆవిశత్యప్రమత్తోऽసౌ ప్రమత్తం జనమన్తకృత్

ఈ కాలానికి మిత్రుడూ లేడు, శత్రువూ లేడూ, బంధువూ లేడు, కాలము నిత్య జాగరూకం. కాలం ఎప్పుడూ పొరపడదు. ఎప్పుడూ పొరబడని కాలం, పొరబడే వారిలో ప్రవేశించి మింగేస్తుంది. పొరబడిన వాడంటే భేధజ్ఞ్యానం ఉన్నవాడు. పరమాత్మ సర్వభూతాంతర్యామి అని తెలుసుకున్నవారికి కాల ప్రభావం ఉండదు. 

యద్భయాద్వాతి వాతోऽయం సూర్యస్తపతి యద్భయాత్
యద్భయాద్వర్షతే దేవో భగణో భాతి యద్భయాత్

కాలముకు భయపడే గాలి వీస్తోంది, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, వరుణుడు వర్షిస్తున్నాడు, నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి. 

యద్వనస్పతయో భీతా లతాశ్చౌషధిభిః సహ
స్వే స్వే కాలేऽభిగృహ్ణన్తి పుష్పాణి చ ఫలాని చ

వనస్పతులూ, లతలూ చెట్లూ కాలానికి భయపడి, తమ తమకి నిర్దేశించిన పనిని కాలానుగుణముగానే చేస్తున్నాయి. పూలు పళ్ళు చెట్లూ లతలూ తమ తమ కాలములోనే వస్తున్నాయి. 

స్రవన్తి సరితో భీతా నోత్సర్పత్యుదధిర్యతః
అగ్నిరిన్ధే సగిరిభిర్భూర్న మజ్జతి యద్భయాత్

నదులు కూడా కాలానికి భయపడే ప్రవహిస్తున్నాయి. కాలభయముతోనే సముద్రము కూడా చెలియలికట్ట దాటి రాదు. అగ్ని సమిధలను కాలుస్తున్నది కూడా కాల భయముతోనే. పర్వతాలు భూమిలో కుంగిపోకుండా ఉన్నాయి. 

నభో దదాతి శ్వసతాం పదం యన్నియమాదదః
లోకం స్వదేహం తనుతే మహాన్సప్తభిరావృతమ్

ఆకాశము వాయువుకి అవకాశం ఇస్తోంది. (మనము వదిలే గాలి వెళ్ళేది ఆకాశములోకి. అదే ఆకాశము ఆ గాలి వెళ్ళడానికి చోటివ్వకపోతే ?.కానీ కాలనికి భయపడి చోటు ఇస్తున్నది.)  . ఆకాశము పీల్చే వారికి దారిని ఇస్తోంది. మహత్ తత్వమూ పంచభూతములూ అన్ని కలిసి బ్రహ్మాండము అదే రూపములో ఉన్నదంటే, ఎవరి వల్ల? మనకు ఉన్న ఇన్ని గోళాలకు ఆధారం ఏమిటి? గ్రహాల ఆకర్షణ శక్తి ఉండడానికి ఆధారం ఏమిటి? ఇవి అన్నీ కాలం వలననే.
ఏడు ఆవరణలతో ఉన్న బ్రహ్మాండం తన దేహాన్ని విస్తరింపచేస్తున్నా, తగ్గించుకున్నా, అది కాలము వలననే. 

గుణాభిమానినో దేవాః సర్గాదిష్వస్య యద్భయాత్
వర్తన్తేऽనుయుగం యేషాం వశ ఏతచ్చరాచరమ్

మనం గొప్పవారని చెప్పుకుంటున్న దేవతలందరూ గుణాభిమానులే. ఆ దేవతలు పని చేయడము కూడా కాలమునకు భయపడే. కృత త్రేతా ద్వాపర కలియుగాలు, సృష్టి రక్షణ లయములూ, అన్నీ కాలానుగుణముగానే జరుగుతాయి. అవి అన్నీ కాల భయముతోనే జరుగుతాయి. 

సోऽనన్తోऽన్తకరః కాలోऽనాదిరాదికృదవ్యయః
జనం జనేన జనయన్మారయన్మృత్యునాన్తకమ్

సకల చరాచర జగత్తూ కాలం వశములో ఉంటుంది. ఈ కాలము అనతము. అంతము లేనిది కాలం. అన్నిటినీ అంతం చేసేది కాలం. కాలానికి ఆదిలేదు. కానీ చలా వాటికి ఆదిని కలిగిస్తుంది. అది వాక్కుకు కూడా అందదు. పుడుతున్న వారితో కొత్తవారిని పుట్టిస్తుంది, చచ్చేవారితో చంపిస్తుంది. అందరినీ తాను సృష్టి చేస్తుంది. అందరినీ చంపేవారిని కూడా చంపుతుంది. బ్రహ్మను కూడా పుట్టిస్తుంది. కానీ ఈ కాలానికి అంతమూ లేదు, ఆదీ లేదు.

                                                          సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు 

Popular Posts