Followers

Wednesday 5 February 2014

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం సప్తమోధ్యాయం


సృష్టి అనేది లీల అనుకున్నా, లీల కూడా ఒక వినోదం కాబట్టి, విణొదం కూడా ఒక ఫలం కాబట్టి, పరమాత్మ ఫలం కోరినవాడైతే అవాప్తసమస్త కాముడెలా అవుతాడు. పరమాత్మ అంతటా వ్యాపించి ఉంటే వాటిలో ఉండే దోషం ఆయనకు అంటుతుందా? మన శరీరంలో ఉండే ఆయనకు, అందులో దోషాలు వస్తాయా? జీవుడు కర్మబద్ధుడు కాబట్టి కర్మవశాన వచ్చిన దేహంతో ఆ ఫలితాలు అనుభవిస్తాడు. పరమాత్మ కర్మవశ్యుడు కాడు. కర్మలే సుఖాన్ని దుఖాన్ని ఇస్తున్నాయా? ఆ ఇచ్చిన సుఖాలను శరీరం ద్వారానే అనుభవిస్తాము. అటువంటి అనుభవించే శరీరాన్ని ఇచ్చేది కర్మ. ఇపుడు ఏది అపురుషార్థం, ఏది పురుషార్థం. ఇందులో కర్మ జ్ఞ్యాన భక్తి ప్రపత్తి, ఇవి పురుషార్ధాలు. ఇందులో కర్మతోటి గానీ జ్ఞ్యానంతోటి గాని కలగబోయే ఫలితానికి కారణమైన శరీరాన్ని ఇచ్చే తత్వం ఉంది. శరీరం అనేక కష్టాలను సుఖాక్లనూ ఇస్తుందంటే శరీరం పురుషార్థమా అపురుషార్థమా? అది అపురుషార్థమే. అపురుషార్థమైన శరీరాన్ని కర్మ ఇస్తున్నపుడు, దానిలో పరమాత్మ ఉన్నప్పుడు ఆయనకు కూడా శరీరం ఉన్నట్లేనా? పరమాత్మ మనలాగ సుఖ దుఖాలను అనుభవించకున్నా సుఖదుఖాలను అనుభవించడానికి సాధనమైన శరీరం ఆయనకి కూడా లభిస్తుంది కాబట్టి పరమాత్మ కూడా అపురుషార్థాన్నే పొందుతున్నట్టే కద? మరి ఆయనకు సృష్టి ఎలా కుదురుతుంది?

ఈ ప్రశ్నలకు ఈ అధ్యాయంలో సమాధానం వస్తుంది
శ్రీశుక ఉవాచ
ఏవం బ్రువాణం మైత్రేయం ద్వైపాయనసుతో బుధః
ప్రీణయన్నివ భారత్యా విదురః ప్రత్యభాషత

మైత్రేయుని వాక్యాన్ని విన్న ద్వైపాయన సుతుడు (విదురుడు) తమ వాక్కుతో గురువుగారిని సంతోషింపచేస్తున్నట్లుగా ఇలా అడిగాడు

విదుర ఉవాచ
బ్రహ్మన్కథం భగవతశ్చిన్మాత్రస్యావికారిణ
లీలయా చాపి యుజ్యేరన్నిర్గుణస్య గుణాః క్రియాః

సృష్టి పరమాత్మ ఎందుకు చేయాలి? అది ఆటకోసం ఐతే ఆట వలన కలిగే వినోదం కోసం సృష్టించాడా. ఏదైనా ప్రయోజనం ఆశించి ఆడాడా. ఆయన పొందవలసినది ఏమీ లేదు అన్నారు కదా. అలాంటప్పుడు లీలకోసం సృష్టించడం ఎలా కుదురుతుంది. గుణములు లేని వారికి గుణములు గల సృష్టి చేయడం ఎలా సాధ్యం. కేవల జ్ఞ్యాన స్వరూపుడు, అవికారుడు అయిన పరమాత్మ, లీలతో అనుకున్నా గుణరహితుడైన పరమాత్మకు గుణసహితమైన క్రియలు ఎలా కుదురుతాయి.

క్రీడాయాముద్యమోऽర్భస్య కామశ్చిక్రీడిషాన్యతః
స్వతస్తృప్తస్య చ కథం నివృత్తస్య సదాన్యతః

క్రీడ అంటే అర్భకులు ఆడతారు కోరికవలన. లేకపోతే ఏదైనా అన్యమైన కోరికౌండి ఉండాలి. సహజముగా తృప్తుడైన పరమాత్మకు తృప్తి కలిగించడానికి ఏదైనా చేయాలా. ఆయన నిత్యతృప్తుడు. అలాంటి పరమాత్మ ఇతరులకంటే (ప్రకృతి మహత్ తత్వాలకు) వేరు అయిన వాడు. ఇలాంటి పరమాత్మకు వినోదించాలని కోరిక ఎందుకుంటుంది.

అస్రాక్షీద్భగవాన్విశ్వం గుణమయ్యాత్మమాయయా
తయా సంస్థాపయత్యేతద్భూయః ప్రత్యపిధాస్యతి

పరమాత్మ ప్రపంచాన్ని సృష్టించాడు అంటున్నాము. ఆయన నిర్గుణుడు. ప్రకృతి గుణమయి. పరమాత్మ మాయతో జగత్తుని సృష్టి చేసాడు. ఆ మాయతోనే జగత్తుని సృష్టించి రక్షించి లయం చేస్తున్నాడు.

దేశతః కాలతో యోऽసావవస్థాతః స్వతోऽన్యతః
అవిలుప్తావబోధాత్మా స యుజ్యేతాజయా కథమ్

గుణవత్తైన మాయతో పరమాత్మ ఈ మూడు పనులు చేస్తుంటే, పరమాత్మను మాయ ఆవేశించిందా? మాయతో పరమాత్మ కూడుకుని ఉన్నాడా? వికారం కలగడానికి కారణాలు దేశమూ (ప్రదేశం నుంచి) కాలము (ఉదా: ప్రాతః కాలంలో ప్రశాంతంగా ఉంటుంది) వ్యవస్థ (పిల్లవాడు ఒకలాగ, యువకుడు ఒక లాగ, లేదా కడుపు నిండుగా ఉన్నప్పుడు ఒకసారి, ఆకలిగా ఉన్నపుడు ఒకసారి, తినేప్పుడు ఒకసారి), స్వతః (మన స్వభావం), అన్యతః (పక్కవాడు తిడితే మనం తిట్టడం, పక్కవాడు పొగిడితే ఆనందించడం. ఎలాంటి మనసైన ఎదుటివారి బట్టి మారుతుంది), ఇలా ఐదు రకములుగా మనము ఈ ఐదింటితో మన జ్ఞ్యానాన్ని పోగొట్టుకుంటాము. కానీ పరమాత్మ ఇలాంటి వాటికి వేటికీ ఆయన జ్ఞ్యానం స్వరూపం సకోచింపదు. అలాంటి పరమాత్మ మాయతో కలిసి ఎలా ఉంటాడు.

భగవానేక ఏవైష సర్వక్షేత్రేష్వవస్థితః
అముష్య దుర్భగత్వం వా క్లేశో వా కర్మభిః కుతః

పరమాత్మలోపలా వెలుపలా అంతటా వ్యాపించి ఉన్నాడు, మన చేత ప్రతీ పనీ పరమాత్మే చేయిస్తున్నాడు. మరి ఆయనే చేయిస్తే మానవులకు పాపం ఎలా వస్తోంది. చేసేది ఆయనే ఐతే అజ్ఞ్యానం మానవులకు ఎలా వస్తోంది. అలాగే మనం పాపం చేస్తుంటే మనలో ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా అంటాలి కదా?

ఏతస్మిన్మే మనో విద్వన్ఖిద్యతేऽజ్ఞానసఙ్కటే
తన్నః పరాణుద విభో కశ్మలం మానసం మహత్

మీరు చెప్పిన విషయం విన్న నేను అజ్ఞ్యాన సంకటంలో పడ్డాను. దాని వలన నా మన్సు బాధ పడుతోంది. నా మనసుకి అంటిన ఈ బురదను మీరు తొలగించండి.
ఇది విదురుని ప్రశ్న అయినా, వాస్తవంగా ఇది మనందరి ప్రశ్న.

శ్రీశుక ఉవాచ
స ఇత్థం చోదితః క్షత్త్రా తత్త్వజిజ్ఞాసునా మునిః
ప్రత్యాహ భగవచ్చిత్తః స్మయన్నివ గతస్మయః

జిజ్ఞ్యాసతో అడిగిన ప్రశ్న విన్న మైత్రేయుడు ఏమాత్రం అహంకారంలేని వాడు (గతస్మయః) నవ్వుతున్నట్లుగా (స్మయన్నివ - స్మయ శబ్దానికి మూడు అర్థాలు ఉన్నాయి. అహంకారం అని, నవ్వు అని కూడా అర్థం), పరమాత్మ యందే మనసు లగ్నం చేసినవాడై.

మైత్రేయ ఉవాచ
సేయం భగవతో మాయా యన్నయేన విరుధ్యతే
ఈశ్వరస్య విముక్తస్య కార్పణ్యముత బన్ధనమ్

పరమాత్మ మాయ హేతువాదానికి అందదు. ప్రతీ శరీరం సుఖం దుఖం అనుభవించాలన్న నియమం లేదు. పరమాత్మ స్వీకరించిన శరీరాలలో సుఖ దుఖాలు ఉండవు. మరి మన శరీరంలో మనం పొందే సుఖ దుఖాలను పరమాత్మ అనుభవిస్తాడని చెప్పగలమా? చెరసాలలోనే ఖైత్దీ ఉంటాడు, అధికారీ ఉంటారు. అంతమాత్రాన అధికారి కూడా శిక్ష అనుభవిస్తున్నట్లు కాదు. ఈ శరీరంలో జీవాత్మకి ఏ దేహాలు వచ్చాయో ఆ జీవుడు ఇదివరకు చేసిన కర్మలకు తగిన ఫలితాన్ని అనుభవిస్తున్నప్పుడు, ఆ జీవిలో మార్పు కలిగినపుడు దయ కలిగిన పరమాత్మ ఆ జీవుని కర్మ శేషాన్ని (సంచితాన్ని, ఆగామిని) తొలగించవచ్చు. ఆయన అంతర్యామిగా ఉన్నప్పుడు ఆయన అంతర్యామిగా ఉన్న శరీరంలో జీవుని కర్మ ఫలాన్ని తప్పించగల అధికారం పరమాత్మకు ఉంది.. అలా కర్మ ఫలితాన్నే తప్పించగల పరమాత్మకు కర్మ ఫలం అంటుతుంది అనడంలో అర్థము లేదు. దీనికి హేతువును చెప్పలేము.
విముక్తస్య ఈశ్వరస్య - ఆయన విముక్తుడు. ఆయనకు ఎటువంటి బంధమూ అంటదు. అలాంటి పరమాత్మకు దైన్యం బంధం బాధలూ ఉండవు.

యదర్థేన వినాముష్య పుంస ఆత్మవిపర్యయః
ప్రతీయత ఉపద్రష్టుః స్వశిరశ్ఛేదనాదికః

దేన్ని జ్ఞ్యానం, వివేకం, మన స్వరూపం అంటాము?శరీరం కంటే ఆత్మ వేరు. బాల్య కౌమార వార్దక్యాలన్న అవస్థలు శరీరానికి. ఆత్మకు కావు. ఈ శరీరంలో ఉన్న ఆత్మకు శరీరంలో ఉన్న భేదాలు లేనప్పుడు. ఆత్మలో ఉన్న పరమాత్మకు ఎలా దోషాలు అంటుతాయి?ఏ స్వరూప జ్ఞ్యానం లేని వలన " ఈ దేహమే నేను" అనుకుంటున్నామో, శరీరానికి ఉన్న అన్ని అవస్థలూ ఆతమకే ఉన్నాయని భ్రమిస్తున్నాము. తల నరికినట్లు కల వస్తే ఎలా ఐతే మనం అది కల అని గుర్తించక మనకే అయినట్లు భావిస్తామో అలాగే ఇది కూడా

యథా జలే చన్ద్రమసః కమ్పాదిస్తత్కృతో గుణః
దృశ్యతేऽసన్నపి ద్రష్టురాత్మనోऽనాత్మనో గుణః

మడుగులో రాయి వేస్తే అందులో ఉన్న చంద్రుడు కదిలినట్లు కనపడతాడు. మనం ఆ ప్రతిబింబం కదులుతోంది కాబట్టి అందులో ఉన్న చంద్రుడు కదులుతున్నాడనుకుంటాం. శరీరం బాధపడుతోంది కాబట్టి అందులో ఉన్న ఆత్మకూడా బాధ పడుతోంది అనుకుంటాము.
ఆత్మకాని శరీరానికి లభించే గుణములు ఆత్మకే ఉన్నట్లు కనపడుతున్నాయి. నిదురపోతున్నాపుడు నేను బాగా నిదురపోతున్నాను అనుకుంటారా ఎవరిన? ఉన్న 24 తత్వాలు విశ్రాంతి తీసుకున్నా ఆత్మ మాత్రం విశ్రాంతి లేకుండా సంచరిస్తూ ఉంటుంది. శరీరంలో ఉన్న అన్ని అవస్థలూ తనవే అన్నట్లు భావించి నిదుర లేవగానే మనసుతో "నేను బాగా నిదురపోయాను" అని అనిపించేట్లు చేస్తుంది. అందులో ఉన్న ఆత్మకే ఏమీ అంటనప్పుడు అందులో ఉన్న పరమాత్మకు ఎలా అంటుతాయి. అందుకే శరీరం ఉన్నంత మాత్రాన సుఖ దుఖాలు అనుభవించి తీరాలి అన్న నియమం లేదు

స వై నివృత్తిధర్మేణ వాసుదేవానుకమ్పయా
భగవద్భక్తియోగేన తిరోధత్తే శనైరిహ

ఈ శరీరంలో ఉండి ఈ సుఖదుఖాలు నావి కావు అన్న భావన ఎవరికి కలుగుతుంది? నివృత్తి ధర్మంతో కలుగుతుంది. శరీరన్ని ఎవరు ఇచ్చారో వారే ఆ శరీరంతో పని చేయించుకుంటారు. అలా ఫలితాన్ని ఆశిచకుండా చేసే వారు నివృత్తి ధర్మపరులు. అలా చేయడానికి పరమాత్మ కృప కావాలి. ఈ ఉపకరణంతో (శరీరంతో) ఏమి పొందిచాలనుకుంటాడో ఆయనే పొందిస్తాడు. అలాంటి జ్ఞ్యానం భగవంతుని మీద భక్తిగా మారుతుంది. ఈ సంసారంలో మనం చేసే ప్రతీ పనీ ఆయన కోసమే. అలాంటి భక్తితో మెల్ల మెల్లగా దేహాత్మాభిమానం కనుమరుగవుతుంది. 

యదేన్ద్రియోపరామోऽథ ద్రష్ట్రాత్మని పరే హరౌ
విలీయన్తే తదా క్లేశాః సంసుప్తస్యేవ కృత్స్నశః

ఇంద్రియముల ప్రవృత్తే అన్నిటికీ కారణం. విషయములను చూచి అవి అనుభవిస్తే మనకు సుఖంగా ఉంటుంది అనే భావనే దుఖానికి కారణం. విషయముల యందు ఇంద్రియాలను ప్రవర్తింపచేయకుండా పరమాత్మ యందు ప్రవర్తింపచేస్తే ఇంక సుఃకం దుఃఖం ఉండదు, పరమాత్మ మాయా ఉండదు. శరీరాన్ని ఆత్మనీ కాకుండా అందులో ఉన్న ద్రష్ట (పరమాత్మ) వరకూ వెళ్ళినపుడు అన్ని కష్టములూ అందులోనే లీనమవుతాయి. ఎలా ఐతే నిదురపోయినపుడు ఎలా మానసిక బాధలు అనుభవానికి రావో

అశేషసఙ్క్లేశశమం విధత్తే గుణానువాదశ్రవణం మురారేః
కిం వా పునస్తచ్చరణారవిన్ద పరాగసేవారతిరాత్మలబ్ధా

నిద్ర ఎలా ఐతే దుఃఖాలని లేకుండా చేస్తుందో, మెలుకువలో కూడా అలా ఉండాలంటే పరమాత్మ గుణాను శ్రవణం ఒక్కటే మార్గం. కీర్తన చేస్తేనే కష్టాలు పోతే, అలాంటి పరమాత్మ పాదారవింద పరాగ సేవ యందు ప్రీతి ఉన్నవారికి బాధలెక్కడివి?

విదుర ఉవాచ
సఞ్ఛిన్నః సంశయో మహ్యం తవ సూక్తాసినా విభో
ఉభయత్రాపి భగవన్మనో మే సమ్ప్రధావతి

నా సంశయాన్ని సూక్తి అనే కత్తితో కోసేసావు. ఇపుడు నా మనసు రెండు వైపులకూ పోతోంది. పరమాత్మ శ్రవణమూ, పరమాత్మ పాద సేవనం మీదకూ పోతోంది. 

సాధ్వేతద్వ్యాహృతం విద్వన్నాత్మమాయాయనం హరేః
ఆభాత్యపార్థం నిర్మూలం విశ్వమూలం న యద్బహిః

సృష్టి తత్వాన్ని బాగా వివరించారు. పరపంచం యొక్క రహస్యం ఎమిటంటే ప్రపంచాన్ని చూచిన వారందరికీ మొదలు కలిగేది అపార్థమే (ఉదా: మనిషి కోతి నుంచే వచ్చాడు. మరి అనంతకోటి జీవరాశులు ఎక్కడినుంచి వచ్చాయి?) ప్రపంచం నిర్మూలం అనిపిస్తుంది (నాస్తిక వాదుల ప్రకారం ఈ సృష్టి అంతా సహజంగా ఏర్పడింది). ప్రపంచం అవతల ఏముందో తెలీదు, లోపల ఏముందో తెలీదు. కారణం లేకుండా ఏ కార్యం పుట్టదన్న హేతువాదం ప్రపంచం సృష్టికి కూడా ఒక కారణం ఉండాలి అన్నదానితో ఒప్పుకోవాలి. మరి ఆ కారణం పరపంచానికి అవతల ఉందా? ప్రపంచానికి లోపల ఉందా? విత్తు నుండి పుట్టిన చెట్టు, చెట్టు వచ్చాక ఆ విత్తు కనపడదు. ప్రపంచానికి మూలం అవతల ఎక్కడో లేదు, ప్రపంచంలోనే ఉంది. చెట్టులో విత్తు కనపడలేదు కాబట్టి విత్తు నుండి చెట్టు రాలేదు అనగలమా?

యశ్చ మూఢతమో లోకే యశ్చ బుద్ధేః పరం గతః
తావుభౌ సుఖమేధేతే క్లిశ్యత్యన్తరితో జనః

ఈ  లోకంలో ఆనందంగా ఉండేవాడు అతి మూర్ఖుడు లేదా పరమ జ్ఞ్యాని. శరీరంలో ఆత్మ, అంతర్యామిగా పరమాత్మ ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఎవరికి ఫలితం కలుగుతోందో వాడు కర్త కాదు. కర్త అయిన వాడికి ఫలితం రావట్లేదు. పని చేసేది శరీరం. దానితో చేయించేది బుద్ధి. వాటిని కూర్చేది ఆత్మ. దానిలో ఉన్నది పరమాత్మ. 

అర్థాభావం వినిశ్చిత్య ప్రతీతస్యాపి నాత్మనః
తాం చాపి యుష్మచ్చరణ సేవయాహం పరాణుదే

ఆత్మ కానిదాన్ని ఆత్మ అనుకునే అపార్థం మీ లాంటి మహానుభావుల పాదసేవతో తొలగించుకుంటాను. 

యత్సేవయా భగవతః కూటస్థస్య మధుద్విషః
రతిరాసో భవేత్తీవ్రః పాదయోర్వ్యసనార్దనః

భగవంతుని పాదముల సేవను చేయాలనే కోరిక కలిగేది భాగవతోత్తముల పాదసేవ చేసినపుడే. అపుడే భగవంతుని పాదపద్మముల యందు ప్రీతి విచ్చుకుంటుంది. పెద్దలే మనకు బుద్ధినిచ్చేవారు 
పరమాత్మ యందు కలిగే ప్రీతి అన్ని బాధలూ తొలగిచేది 

దురాపా హ్యల్పతపసః సేవా వైకుణ్ఠవర్త్మసు
యత్రోపగీయతే నిత్యం దేవదేవో జనార్దనః

ఇది అందరికీ అందేది కాదు. కొద్ది పూజలు చేసే వారికి ఇది కలగదు. ఎంత భగవత్భక్తి కలిగితే అంత భాగవత భక్తి కలుగుతుంది. ఎంత భాగవత భక్తి కలిగితే అంత భగవత భక్తి లభిస్తుంది. మహాతపస్సుతోనే లభిస్తుంది. . నిరనతరం భగవంతుని కీర్తించే భక్తుల యందు భక్తి కలుగుట కష్టసాధ్యం

సృష్ట్వాగ్రే మహదాదీని సవికారాణ్యనుక్రమాత్
తేభ్యో విరాజముద్ధృత్య తమను ప్రావిశద్విభుః

స్వామి మొదలు ప్రకృతిని క్షోభింపచేసి తద్వారా వచ్చిన అంతటినీ సృష్టించాడు, అండం నుంచి విరాట్ పురుషున్నీ సృష్టించి, అందులో ఆయన ప్రవేశించాడు, ఆయనే ఆది పురుషుడు. అని చెప్పరు

యమాహురాద్యం పురుషం సహస్రాఙ్ఘ్ర్యూరుబాహుకమ్
యత్ర విశ్వ ఇమే లోకాః సవికాశం త ఆసతే

ఆ పరమాత్మ యందే ఈ చరాచర సృష్టి అంతా వికసించింది.

యస్మిన్దశవిధః ప్రాణః సేన్ద్రియార్థేన్ద్రియస్త్రివృత్
త్వయేరితో యతో వర్ణాస్తద్విభూతీర్వదస్వ నః

ఇక్కడే దశ ప్రాణ వాయువులూ, ఇంద్రియములూ విషయములూ, సత్వ రజ తమో గుణాలు, అన్నీ చెప్పారు. వాటి విభూతులని మాకు వివరించు 

యత్ర పుత్రైశ్చ పౌత్రైశ్చ నప్తృభిః సహ గోత్రజైః
ప్రజా విచిత్రాకృతయ ఆసన్యాభిరిదం తతమ్

ఆయా వర్ణములు, వారి పుత్రులు పౌత్రులు వారి పుత్రులు గోత్రాలు,

ప్రజాపతీనాం స పతిశ్చక్లృపే కాన్ప్రజాపతీన్
సర్గాంశ్చైవానుసర్గాంశ్చ మనూన్మన్వన్తరాధిపాన్

ప్రజాపతులకు పతి అయిన బ్రహ్మ నవ ప్రజాపతులను ఎలా సృష్టించాడు. మనువులెందరూ, మన్వంతరములు ఏమిటీ,

ఏతేషామపి వేదాంశ్చ వంశానుచరితాని చ
ఉపర్యధశ్చ యే లోకా భూమేర్మిత్రాత్మజాసతే

ఆ వంశం యొక్క అనుచరితములూ ఉపర్లోకములూ అధోలోకములు వారికి మిత్రులూ (గ్రహములూ) వారి సంతానము, వీటినీ, వాటి సృష్టి,

తేషాం సంస్థాం ప్రమాణం చ భూర్లోకస్య చ వర్ణయ
తిర్యఙ్మానుషదేవానాం సరీసృపపతత్త్రిణామ్
వద నః సర్గసంవ్యూహం గార్భస్వేదద్విజోద్భిదామ్

పశు పక్ష మానవ దేవత కీటకముల , జంతుజాలముల, (జంతువులు నాలుగు రకాలు: జరాయుజ (మావి వలన), అండజములు (పక్షులు) స్వేదజములు ఉద్భిజ్జములు (లతలు వృక్షములు) ). 

గుణావతారైర్విశ్వస్య సర్గస్థిత్యప్యయాశ్రయమ్
సృజతః శ్రీనివాసస్య వ్యాచక్ష్వోదారవిక్రమమ్

ప్రపంచం యొక్క సృష్టి రక్షణ లయమూ ఇవన్నీ వివరించు, ఎందుకంటే ఇదంతా పరమాత్మ కృపా విశేషం వలన ఏర్పడినది. సృష్టిలోనూ, సృష్టి నిర్మాణంలోనూ, రక్షణలోనూ ఉన్నదంతా స్వామి ఔదార్యమే

వర్ణాశ్రమవిభాగాంశ్చ రూపశీలస్వభావతః
ఋషీణాం జన్మకర్మాణి వేదస్య చ వికర్షణమ్

వర్ణములు ఆశ్రములూ రూపములూ శీలమూ స్వభావం, ఋషులు జన్మ కర్మలు

యజ్ఞస్య చ వితానాని యోగస్య చ పథః ప్రభో
నైష్కర్మ్యస్య చ సాఙ్ఖ్యస్య తన్త్రం వా భగవత్స్మృతమ్

యజ్ఞ్యయాగాదులూ

పాషణ్డపథవైషమ్యం ప్రతిలోమనివేశనమ్
జీవస్య గతయో యాశ్చ యావతీర్గుణకర్మజాః

పాషణ్డుల మార్గములూ, ఎన్ని కర్మలు ఉన్నాయో వాటినీ

ధర్మార్థకామమోక్షాణాం నిమిత్తాన్యవిరోధతః
వార్తాయా దణ్డనీతేశ్చ శ్రుతస్య చ విధిం పృథక్

ధర్మార్థ కామ మోక్షములు నిమిత్తము, వార్త లౌకిక వృత్తి, 

శ్రాద్ధస్య చ విధిం బ్రహ్మన్పిత్ణాం సర్గమేవ చ
గ్రహనక్షత్రతారాణాం కాలావయవసంస్థితిమ్

శ్రాద్ధం, విధి, గ్రహములు, కాలము, 

దానస్య తపసో వాపి యచ్చేష్టాపూర్తయోః ఫలమ్
ప్రవాసస్థస్య యో ధర్మో యశ్చ పుంస ఉతాపది

దానమటే ఏమిటి, తపసు, యజ్ఞ్య యాగాదులూ, నదీ తటాక నిర్మాణాలు వీటినీ, మానవ ధర్మాలు, ఆపద్ధార్మాలు, ప్రవాస ధర్మం, నివాస ధర్మాలు

యేన వా భగవాంస్తుష్యేద్ధర్మయోనిర్జనార్దనః
సమ్ప్రసీదతి వా యేషామేతదాఖ్యాహి మేऽనఘ

భగవంతుడు సంతోషించే ధర్మాలు చెప్పు, ఏమి చెప్తే ధర్మ స్వరూపుడైన పరమాత్మ సంతోషిస్తాడో అవి చెప్పు

అనువ్రతానాం శిష్యాణాం పుత్రాణాం చ ద్విజోత్తమ
అనాపృష్టమపి బ్రూయుర్గురవో దీనవత్సలాః

అనుసరించే వారికి, శిష్యులకు పుత్రులకు అడగకున్నా దీనవత్సలురైన గురువులు చెబుతారు. 

తత్త్వానాం భగవంస్తేషాం కతిధా ప్రతిసఙ్క్రమః
తత్రేమం క ఉపాసీరన్క ఉ స్విదనుశేరతే

తత్వములెన్ని, సృష్టి ఎంత, ప్రళయములెంతా, ఎవరెవరు ఎవరెవరిని ఉపాసించారు, ఎవరెవరు ఎవరెవరిలో లీనమయ్యారు. 

పురుషస్య చ సంస్థానం స్వరూపం వా పరస్య చ
జ్ఞానం చ నైగమం యత్తద్గురుశిష్యప్రయోజనమ్

జీవ పరమాత్మ ప్రపంచ స్వరూపం, గురుశిష్య ప్రయోజనమైన వైదిక జ్ఞ్యానాన్ని. జ్ఞ్యానులతోటి పండితులతోటి ఏవి నిర్దేశించబడ్డాయో

నిమిత్తాని చ తస్యేహ ప్రోక్తాన్యనఘసూరిభిః
స్వతో జ్ఞానం కుతః పుంసాం భక్తిర్వైరాగ్యమేవ వా

భక్తి జ్ఞ్యానాలు స్వయంగానే కలుగుతాయా? అందరికీ అనుకోకుండానే వస్తాయా? ఎవరిన బోధిస్తే కలుగుతాయా?

ఏతాన్మే పృచ్ఛతః ప్రశ్నాన్హరేః కర్మవివిత్సయా
బ్రూహి మేऽజ్ఞస్య మిత్రత్వాదజయా నష్టచక్షుషః

ఈ ప్రశ్నలు అడుగుతున్నది మాకోసం కాదు, భగవత్ తత్వాన్ని తెలుసుకోడానికి, పరమాత్మ కర్మను తెలుసుకోవడానికి. జ్ఞ్యామూ వివేకమూ (చక్షు) రెండూ లేని నాకు మిత్రులు, మిత్రాపుత్రులు కాబట్టి దయచేయండి

సర్వే వేదాశ్చ యజ్ఞాశ్చ తపో దానాని చానఘ
జీవాభయప్రదానస్య న కుర్వీరన్కలామపి

పధ్నాలుగు లోకాలలో ఎన్ని వేదములున్నాయో యజ్ఞ్యాలున్నాయో దానాలున్నాయో ఇవన్నీ ఒక్క జీవునికి అభయమివ్వడం అనేదానిలో చిన్న అంశానికి కూడా సరిపోవు. యజ్య్న దాన తప శాస్త్రాలు ఏవీ అభయానికి సాటిరావు

శ్రీశుక ఉవాచ
స ఇత్థమాపృష్టపురాణకల్పః కురుప్రధానేన మునిప్రధానః
ప్రవృద్ధహర్షో భగవత్కథాయాం సఞ్చోదితస్తం ప్రహసన్నివాహ

కురుప్రధానుడు (విదురుడు) మునిప్రధానుడు (మైత్రేయుని) అడిగితే కట్టలు తెంచుకున్న ఆనందంతో భగవత్ కధలను అడిగినందు వలన, అవి చెప్పే అవకాశం వచ్చినందుకు ఆనందించాడు. 
విదురుడు అడిగినవి చెప్పాలంటే పురాణమే అవుతుంది. పురాణ లక్షణాలన్నీ అందులో . పరమాత్మ కథలు చెప్పమని అడగడం వలన పెరిగిన సంతోషం కలవాడై నవ్వుతున్నట్లుగా  ఇలా అన్నాడు

Popular Posts