Followers

Friday 7 February 2014

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం పదకొండవ అధ్యాయం


మైత్రేయ ఉవాచ
నిశమ్య గదతామేవమృషీణాం ధనుషి ధ్రువః
సన్దధేऽస్త్రముపస్పృశ్య యన్నారాయణనిర్మితమ్

ఆచమనం చేసి ధౄవుడు నారాయణాస్త్రాన్ని ఎక్కుపెట్టాడు

సన్ధీయమాన ఏతస్మిన్మాయా గుహ్యకనిర్మితాః
క్షిప్రం వినేశుర్విదుర క్లేశా జ్ఞానోదయే యథా

ధౄవుడు నారాయణాస్త్రాన్ని ఎక్కుపెట్టడముతోనే జ్ఞ్యానం కలిగినతరువాత కష్టాలు పోయినట్లు అన్ని రాక్షస మాయలూ పోయాయి

తస్యార్షాస్త్రం ధనుషి ప్రయుఞ్జతః సువర్ణపుఙ్ఖాః కలహంసవాససః
వినిఃసృతా ఆవివిశుర్ద్విషద్బలం యథా వనం భీమరవాః శిఖణ్డినః

ఒక్క సారి నారాయణాస్త్రాన్ని ఎక్కుపెడితే కొన్ని లక్షల బాణ పరంపరలు బయలు దేరాయి. ఆకాశములో మబ్బులు బాగా పడితే నెమళ్ళు కేకలు వేసుకుంటూ అడవిలోకి పరిగెట్టినట్లు ఆ బాణాలు వారి మీదకు బయలు దేరాయి

తైస్తిగ్మధారైః ప్రధనే శిలీముఖైరితస్తతః పుణ్యజనా ఉపద్రుతాః
తమభ్యధావన్కుపితా ఉదాయుధాః సుపర్ణమున్నద్ధఫణా ఇవాహయః

ఆ బాణాల దెబ్బలు తట్టుకోలేక అందరూ అటూ ఇటూ పరిగెత్తారు. కానీ ఆ బాణాలు వెంటపడి మరీ కొడుతున్నాయి పగబట్టిన పాములాగ. 

స తాన్పృషత్కైరభిధావతో మృధే నికృత్తబాహూరుశిరోధరోదరాన్
నినాయ లోకం పరమర్కమణ్డలం వ్రజన్తి నిర్భిద్య యమూర్ధ్వరేతసః

వీళ్ళంతా అర్కమండలానికీ యమ మండలానికి వెళ్ళిపోతున్నారు

తాన్హన్యమానానభివీక్ష్య గుహ్యకాననాగసశ్చిత్రరథేన భూరిశః
ఔత్తానపాదిం కృపయా పితామహో మనుర్జగాదోపగతః సహర్షిభిః

ఇలా ధృవుడు చాలా మంది యక్షులని చంపేశాడు. నిరపరాధులని ఇలా సంహరిస్తుంటే దాన్ని ఆపడానికి  తాత గారైన మనువు మహర్షులతో కలిసి వచ్చాడు. 

మనురువాచ
అలం వత్సాతిరోషేణ తమోద్వారేణ పాప్మనా
యేన పుణ్యజనానేతానవధీస్త్వమనాగసః

వత్సా, చాలు నీ కోపము. ఈ కోపము తమో ద్వారము. అజ్ఞ్యానానికి ద్వారం. ఇది నరకానికి మారుపేరూ. ఆ కోపముతోనే నిరపరాధులైన వారిని చంపావు

నాస్మత్కులోచితం తాత కర్మైతత్సద్విగర్హితమ్
వధో యదుపదేవానామారబ్ధస్తేऽకృతైనసామ్

నీవు చేసిన పని మన కులములో పుట్టినవారు చేయదగినది కాదు. నింద్యమైనది. తప్పు చేయని ఉపదేవతలను నీవు సంహరించరాదు
నన్వేకస్యాపరాధేన ప్రసఙ్గాద్బహవో హతాః
భ్రాతుర్వధాభితప్తేన త్వయాఙ్గ భ్రాతృవత్సల

తప్పు ఒక్కడు చేసాడు. ఒక్కడి తప్పుకు ఇంతమందిని శిక్షించడం నేరము. నీ తప్పు కూడా పూర్తిగా లేదు.నీకు తమ్ముడంటే ప్రేమ ఎక్కువ. 

నాయం మార్గో హి సాధూనాం హృషీకేశానువర్తినామ్
యదాత్మానం పరాగ్గృహ్య పశువద్భూతవైశసమ్

శ్రీమన్నారాయణున్ని అనుసరించే వారు నడిచే దారి ఇది కాదు. శ్రీమన్నారాయణుని భక్తులు వారు వేరు వీరు వేరు అని  భిన్న దృష్టి పెట్టరు. ప్రతీ శరీరములో అంతరాత్మగా పరమాత్మే ఉన్నాడు. 

సర్వభూతాత్మభావేన భూతావాసం హరిం భవాన్
ఆరాధ్యాప దురారాధ్యం విష్ణోస్తత్పరమం పదమ్

నీవు సకల జగత్తులను కడుపులో దాచుకున్న పరమాత్మను తపస్సు చేసి ఆరాధించి సంతోషింపచేసావు.  ఇతరులెవ్వరూ పొందలేని ఉత్తమ స్థానన్ని పొందిన నీవు ఈ పని చేయకూడదు

స త్వం హరేరనుధ్యాతస్తత్పుంసామపి సమ్మతః
కథం త్వవద్యం కృతవాననుశిక్షన్సతాం వ్రతమ్

నిన్ను పరమాత్మ భక్తులు కూడా మెచ్చుకున్నారు. భాగవతోత్తములకు కూడా నీవు స్మరించదగినవాడవు.  సజ్జనుల మార్గాన్నీ వ్రతాన్ని ఆచరించే నీవు నలుగురూ నిందించే పని ఎలా చేస్తావు?

తితిక్షయా కరుణయా మైత్ర్యా చాఖిలజన్తుషు
సమత్వేన చ సర్వాత్మా భగవాన్సమ్ప్రసీదతి

పరమాత్మ సంతోషించాలంటే ఓర్పూ దయా స్నేహం సర్వాభూత సమ దర్శనం కావాలి. అలా ఉంటేనే భగవానుడు సంతోషిస్తాడు 

సమ్ప్రసన్నే భగవతి పురుషః ప్రాకృతైర్గుణైః
విముక్తో జీవనిర్ముక్తో బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి

ఒక్క సారి పరమాత్మ సంతోషిస్తే ప్రాకృతికమైన సత్వ రజో తమో గుణాలు తొలగిపోయి ఆ జీవుడు శరీరాన్ని విడిచిపెట్టి పరమాత్మలో చేరతాడు 

భూతైః పఞ్చభిరారబ్ధైర్యోషిత్పురుష ఏవ హి
తయోర్వ్యవాయాత్సమ్భూతిర్యోషిత్పురుషయోరిహ

ఐదు భూతములతో ఏర్పడిన రెండు శరీరముల కలయికతో ఇంకో శరీరం ఏర్పడుతుంది. ఆ స్త్రీ పురుషుల సమాగమముతో ఇంకో శరీరం పుడుతుంది. ఆ స్త్రీ పురుషులు కూడా పాంచభౌతిక శరీరాలకు పేర్లే. 

ఏవం ప్రవర్తతే సర్గః స్థితిః సంయమ ఏవ చ
గుణవ్యతికరాద్రాజన్మాయయా పరమాత్మనః

ఇదే సృష్టి సంహారం స్థ్తి. పరమాత్మ యొక్క మాయచేత గుణ వైషమ్యం ఏర్పడి నిర్గుణమైన పరమాత్మ పురుషోత్తముడు

నిమిత్తమాత్రం తత్రాసీన్నిర్గుణః పురుషర్షభః
వ్యక్తావ్యక్తమిదం విశ్వం యత్ర భ్రమతి లోహవత్

ఆయన యందే స్థూల సూక్ష్మాత్మకమైన జగత్తు అయస్కాంతం చుట్టూ ఇనుము తిరిగినట్లుగా తిరుగుతూ ఉంటాయి

స ఖల్విదం భగవాన్కాలశక్త్యా గుణప్రవాహేణ విభక్తవీర్యః
కరోత్యకర్తైవ నిహన్త్యహన్తా చేష్టా విభూమ్నః ఖలు దుర్విభావ్యా

ఈ గుణప్రవాహములో ఉండి కూడా మళ్ళీ సృష్టి చేయాలనుకున్నా, ప్రళయం చేయాలనుకున్నా, మనలాగ గొప్పలు చెప్పుకోడు. ప్రకృతి తనకు తానుగా ఏమీ చేయలేదు. పరమాత్మే అన్నీ చేసి కూడా ఏమీ చేయని వాడిలాగే ఉంటాడు
ఎవరినీ చంపుతున్నట్లు చెప్పడు కానీ, ఆయనే లోకక్షయం చేస్తాడు. కర్త కానట్లు చేస్తాడు, సంహర్త కానట్లు సంహరిస్తాడు. ఆయన లీలలు మనకు అందవు.

సోऽనన్తోऽన్తకరః కాలోऽనాదిరాదికృదవ్యయః
జనం జనేన జనయన్మారయన్మృత్యునాన్తకమ్

ఈ కాలానికి అంతము లేదు గానీ, అంతము చేసేవాడిని అంతం చేస్తుంది. కాలము అనాది అయిన ఎన్నిటినో సృష్టిస్తుంది. దానికి హెచ్చు తగ్గులు లేవు. ఒక జనముతో ఇంకో జనాన్ని సృష్టి చేస్తుంది. మృత్య్వుతో చంపుతుంది.

న వై స్వపక్షోऽస్య విపక్ష ఏవ వా పరస్య మృత్యోర్విశతః సమం ప్రజాః
తం ధావమానమనుధావన్త్యనీశా యథా రజాంస్యనిలం భూతసఙ్ఘాః

అలాంటి కాల రూపి అయిన పరమాత్మకు తన వాడూ లేడూ శత్రువూ లేడు. మన దగ్గరకు వచ్చే మృత్యువుకు అందరూ సమానులే. పరిగెత్తుతున్న కాలం వెంట, మనమందర్మ్ నిస్సహాయులం కాబట్టి పరిగెత్తుతూ ఉటాము. ఏలాగ గాలి బాగా వీస్తూ ఉంటే ధూళి కూడా గాలిలో కలుస్తుంది. అలాగే కాలములో జీవులు కలుస్తారు

ఆయుషోऽపచయం జన్తోస్తథైవోపచయం విభుః
ఉభాభ్యాం రహితః స్వస్థో దుఃస్థస్య విదధాత్యసౌ

కొందరు "వీడి ఆయువు తగ్గిపోయింది " అంటారు. కొందరు "ఆయువు పెరిగిందీ " అంటారు. నిజానికి జీవునికి ఈ రెండూ లేవు.

కేచిత్కర్మ వదన్త్యేనం స్వభావమపరే నృప
ఏకే కాలం పరే దైవం పుంసః కామముతాపరే

దీనికి కొందరు స్వభావం కారణమంటారు, కాలం కారణమంటారు దవైమని కొందరూ, కోరికా అని కొందరు. 

అవ్యక్తస్యాప్రమేయస్య నానాశక్త్యుదయస్య చ
న వై చికీర్షితం తాత కో వేదాథ స్వసమ్భవమ్

ఎవ్వరికీ తెలియదా దీని గురించి? అంటే, ఇది అవ్యక్తమూ, ఇంతా అని కొలతకు అందనిది. అనేక శక్తులు పుడుతూ ఉంటాయి. కాలం ఏమి చేయాలనుకుంటోందో ఎవరికి తెలుసు. మనకు ఏర్పడే సంబంధం ఈనాడు మనకు అనుకూలం అనుకోవచ్చు, ఆనందం కలిగిస్తుంది అనుకోవచ్చు. అలా ఇష్టపడి మనం కొన్ని కూర్చుకుంటాము. వాటి వలన ఆనందమే కలుగుతుందా? మనము హితము అనుకున్నదానితో అహితమూ చేయిస్తాడు పరమాత్మ. అలాంటి పరమాత్మ ఏమి చేయాలనుకుంటున్నాడో ఎవరికి తెలుసు?

న చైతే పుత్రక భ్రాతుర్హన్తారో ధనదానుగాః
విసర్గాదానయోస్తాత పుంసో దైవం హి కారణమ్

నీ తమ్మున్ని చంపింది వీరు కాదు. మనకు ఒక వస్తువు రావాలన్నా పోవాలన్నా దైవమే కారణం. 

స ఏవ విశ్వం సృజతి స ఏవావతి హన్తి చ
అథాపి హ్యనహఙ్కారాన్నాజ్యతే గుణకర్మభిః

ఆయనే వస్తువును ఇప్పిస్తాడూ, తీసుకుంటాడు. ఆయనే సృష్టిస్తున్నాడు, కాపాడుతున్నాడు సంహరిస్తున్నాడు. ఇన్ని చేస్తున్న ఆయనే "నేను సృష్టిస్తున్నాడు" అని చెప్పుకోడు. అహంకారముతో అంటబడడు, గుణాలతో అంటుబడడు

ఏష భూతాని భూతాత్మా భూతేశో భూతభావనః
స్వశక్త్యా మాయయా యుక్తః సృజత్యత్తి చ పాతి చ

ఈ పరమాత్మే భూతాత్మ (అంతర్యామి), నియామకుడూ, అన్ని ప్రాణులనూ సృష్టించేవాడు. తన మాయ శక్తితో కలిసి సృష్టి స్థితి లయములు చేస్తాడు

తమేవ మృత్యుమమృతం తాత దైవం సర్వాత్మనోపేహి జగత్పరాయణమ్
యస్మై బలిం విశ్వసృజో హరన్తి గావో యథా వై నసి దామయన్త్రితాః

పరమాత్మకే రెండు పేరులు ఉన్నాయి. ఆయనే మృత్యు, ఆయనే అమృతం.  నీవు కూడా పరిపూర్ణముగా అన్ని భోగాలతో సంపదలతో కైంకర్యములతో ఆయననే శరణు వేడు. ప్రజాపతులు కూడా ఆయనకే దాస్యం చేస్తారు. బలించిన కోడెలు ఏ వ్యవసాయముకూ పనికిరానట్లుగా మొండికేస్తాయి. వాటికి ముక్కుతాడు వేసి వశం చేసుకుంటారు. అలాగే మదించిన పశువులమైన మనని పరమాత్మ లొంగదీసుకుంటాడు

యః పఞ్చవర్షో జననీం త్వం విహాయ మాతుః సపత్న్యా వచసా భిన్నమర్మా
వనం గతస్తపసా ప్రత్యగక్షమారాధ్య లేభే మూర్ధ్ని పదం త్రిలోక్యాః

ఐదేళ్ళ వయసు ఉన్నప్పుడు పిన తల్లి వాడి మాటలకు హృదయం భిన్నమైతే అడవికి వెళ్ళి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని వరము పొందావు. నీకు పరమాత్మ అంటే అర్థం అయింది కదా. 

తమేనమఙ్గాత్మని ముక్తవిగ్రహే వ్యపాశ్రితం నిర్గుణమేకమక్షరమ్
ఆత్మానమన్విచ్ఛ విముక్తమాత్మదృగ్యస్మిన్నిదం భేదమసత్ప్రతీయతే

నిరాకారమూ నిర్గుణమూ ఏనాడూ నశించనిదీ అయిన ఆ పరమాత్మను పొందుటకు ప్రయత్నించు. ఆయన యందే ఈ జగత్తు ఉన్నట్లూ ఉంటుందీ , లేనట్లూ ఉంటుంది. 

త్వం ప్రత్యగాత్మని తదా భగవత్యనన్త ఆనన్దమాత్ర ఉపపన్నసమస్తశక్తౌ
భక్తిం విధాయ పరమాం శనకైరవిద్యా గ్రన్థిం విభేత్స్యసి మమాహమితి ప్రరూఢమ్

ఆయనే ప్రత్యగాత్మా, పరమాత్మ, అనంతుడు, ఆనంద స్వరూపుడు, సర్వ శక్తిమంతుడు. ఆయన యందు భక్తి కలిగించుకుని నీ హృదయములో ఉన్న "నేనూ నాదీ" అన్న గ్రంధిని భేధించగలవు. 

సంయచ్ఛ రోషం భద్రం తే ప్రతీపం శ్రేయసాం పరమ్
శ్రుతేన భూయసా రాజన్నగదేన యథామయమ్

కోపాన్ని నిగ్రహించుకో. నీకు మేలు జరుగుతుంది. ఆ పరమాత్మను పొందితే ఆపదలన్నీ తొలగిపోతాయి. వేద శాస్త్ర పురాణాలని పెద్దల వలన వినడం వలన ఇవన్నీ మందుతో రోగం తొలగినట్లు తొలగిపోతాయి.

యేనోపసృష్టాత్పురుషాల్లోక ఉద్విజతే భృశమ్
న బుధస్తద్వశం గచ్ఛేదిచ్ఛన్నభయమాత్మనః

ఏది వచ్చి మనని చేరితే లోకమంతా భయపడి పారిపోతుందో అలాంటిది మనకు రాకూడదు. దాన్ని మనం కోరుకోకూడదు. నిజముగా అభయం కావాలి అనుకుంటే భయాన్ని కలిగించే వాటి జోలికి వెళ్ళకూడదు

హేలనం గిరిశభ్రాతుర్ధనదస్య త్వయా కృతమ్
యజ్జఘ్నివాన్పుణ్యజనాన్భ్రాతృఘ్నానిత్యమర్షితః

శంకరుని మిత్రునికి నీవు అవమానం చేసావు. నా తమ్మున్ని చంపారన్న అసహనముతో చాలా మంది యక్షులని సంహరించావు. 

తం ప్రసాదయ వత్సాశు సన్నత్యా ప్రశ్రయోక్తిభిః
న యావన్మహతాం తేజః కులం నోऽభిభవిష్యతి

నీవిప్పుడు చేతులు జోడించి కుబేరున్ని ప్రసన్నం చేసుకో. గొప్పవారిని అవమానిస్తే వారి తేజస్సు మన కులాన్నీ వంశాన్నీ లేకుండా చేస్తుంది. 

ఏవం స్వాయమ్భువః పౌత్రమనుశాస్య మనుర్ధ్రువమ్
తేనాభివన్దితః సాకమృషిభిః స్వపురం యయౌ

ఈ ప్రకారముగా స్వాయంభువ మనువు ధృవున్ని ఓదార్చి, ఆజ్ఞ్యాపించగా ధృవుడు ఒప్పుకుని నమస్కరించగా మనువు ఋషులతో కలిసి తన లోకానికి వెళ్ళిపోయాడు 

                                     సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు 

Popular Posts