Followers

Saturday 1 February 2014

శ్రీమద్భాగవతం రెండవ స్కంధం ప్రధమ అధ్యాయం


                                                         ఓం నమోభగవతే వాసుదేవాయ


శ్రీశుక ఉవాచ

వరీయానేష తే ప్రశ్నః కృతో లోకహితం నృప
ఆత్మవిత్సమ్మతః పుంసాం శ్రోతవ్యాదిషు యః పరః

ఉత్తమోత్తమమైన (వరీయాన్) లోకానికి ఉపకారం జరిగేది, ఆత్మ అంటే తెలిసిన వారు మెచ్చుకునే ప్రశ్న అడిగావు.

ఆత్మ అచ్చేద్యం - శరీరం దేహం. ఆత్మ అక్లేద్యం - శరీరం క్లేద్యం. తన స్వరూపానికి పరిపూర్ణంగా విరుద్దమైన స్వరూపం గల దానిలో (శరీరంలో) చిక్కుకున్నది ఆత్మ. జడమైన శరీరంలో చైతన్యం ఉన్న ఆత్మ ఉంది. తనకన్న తక్కువ దానిలో, తన కన్న తక్కువ అయిన దానిలో ఉంది ఆత్మ. నశించే శరీరంలో ఉండే ఆత్మ మళ్ళీ అలాంటి శరీరంలో ఉండకుండా ఉండాలి అంటే ఏమి చేయాలి

శ్రోతవ్యాదిషు యః పరః - వినదగిన దానిలో ఇదే చివరిది శ్రేష్టమైనది. తెలియవలసినదేమిటో తెలియవలసిన మనమేమిటో తెలియవలసిన ఉపాయం ఎమిటో తెలిస్తే కలిగే ఫలమేమిటో, అది తెలియకుండా ఆపేది ఎమిటో తెలియాలి. దీన్నే అర్థ పంచకం అంటారు. మనం పరమాత్మని చేరాలి. పరమాత్మ ఎలా ఉంటాడు పరమాత్మను చేరే మన స్వరూపం ఏమిటి, పరమాత్మని చేరడానికి ఉపాయం ఏమిటి, పరమాత్మని చేరితే ఫలం ఏమిటి, పరమాత్మని చేరకుండా ఆపేది ఏమిటి. ఈ అయిదవదైన విరోధి జ్ఞ్యానం అన్నిటికన్నా బలీయమైనది. ఇన్ని కోట్లమందిని అడ్డగిస్తోంది అంటే అది ఎంత బలీయము.  పరమాత్మ కంటే జీవాత్మ కంటే ఉపాయం కంటే ఫలం కంటే బలీయం. మనని పరమాత్మని చేరకుండా ఆపేది ఏమిటి.

శ్రోతవ్యాదీని రాజేన్ద్ర నృణాం సన్తి సహస్రశః
అపశ్యతామాత్మతత్త్వం గృహేషు గృహమేధినామ్

వినవలసినవి వేలకి వేలు ఉన్నాయి ఆత్మజ్ఞ్యానం లేని వారికి. అసలైన ప్రయత్నం చేయని వాడు (అవ్యవసాయి - ప్రయత్నమూ సంకల్పమూ లేని వాడు) ఆలోచించే ఆలోచనలు లక్షలు కోట్లు. అంతే కాదు ఆలోచనలకు వర్గాలు శాఖలూ ఎక్కువ. అలాంటి వారు వినదగినవి చాలా ఉన్నాయి. అవి ఆత్మ తత్వము తెలియని మానవులకు. మేధం అంటే హింస. మనం గృహమేధులం. మేధ శబ్దానికి ఆసక్తి అని కూడా అర్థం. మేధ అంటే పశువు, మేధ్యం అంటే యాగమునకు తగిన దాన్ని. పశువునే ఎందుకు యాగం చేస్తున్నాము. దేవతలకు అది ఇష్టం కాబట్టి (అశ్వమేధం, గోమేధం) అశ్వమునందు ఆసక్తి గల దేవతలకు చేసే యాగం. అలాగే మనం గృహమంటే ఆసక్తి కాబట్టి మనం గృహమేధి. గృహమంటే - 1. గృహం 2. స్త్రీ 3. శరీరం (ఆత్మకి గృహం). ఈ మూడు వస్తాయి. వీటిని కోరేవాళ్ళు, వీటిని హింసించేవాళ్ళు, వీటియందు ఆసక్తి గలవాళ్ళు, వారిని గృహమేధులంటారు

నిద్రయా హ్రియతే నక్తం వ్యవాయేన చ వా వయః
దివా చార్థేహయా రాజన్కుటుమ్బభరణేన వా

జీవితమునకు రాత్రి పగలు వయసు ముఖ్యములు. మనము వృధాగా గడిపేది ఈ మూడింటిని. పగలు ఎలా గడుపుతున్నాము రాత్రి ఎలా గడుపుతున్నాము. ఈ పగలూ రాత్రీ రెండూ ఉండే వయసును ఎలా గడుపుతున్నాము. ఇవి తెలుసుకుంటే వైరాగ్యం అదే వస్తుంది. పగలంతా అర్థం సంపాదించడంలో, కుటుంబం పోషించడంలో గడుపుతున్నాము. పగలు ఇంత కష్టపడి రాత్రి నిద్రలో గడుపుతాము. ఈ రెంటితో ఉంటే ఇబ్బందిలేదు గానీ, ఈ రెండూ వయసుకోసం అని అనుకొని స్త్రీ పురుష సంగమానికి (వయః) గడుపుతాము. సంగమానికోసమే అర్థం సంపాదించడం, కుటుంబాన్ని పోషించడం, నిద్రపోవడం చేస్తాం. దానికోసమే అన్నీ కూర్చుకుంటాము. భగవంతుడు ఇచ్చిన మూడింటినీ దానికోసం పాడుచేస్తున్నాము.
ప్రాణి అన్న ప్రతీది ఇలా వృధా చేస్తున్నది

దేహాపత్యకలత్రాదిష్వాత్మసైన్యేష్వసత్స్వపి
తేషాం ప్రమత్తో నిధనం పశ్యన్నపి న పశ్యతి

ఆత్మసైన్యం - దేహం, దేహంతో వచ్చిన సైన్యం పోతూ ఉన్న్నా సరే ప్రమత్తుడైన వాడు చూచీ చూడనట్లే ఉంటాడు.

తస్మాద్భారత సర్వాత్మా భగవానీశ్వరో హరిః
శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ స్మర్తవ్యశ్చేచ్ఛతాభయమ్

మనకి భయము అంటే - పుట్టుక. అలాంటి అభయాని కోరేవాడు. ఆత్మ తత్వం తెలిసిన్వాడు విందగినది భగవంతుని గురించే. అభయం కోరినవాడు పరమాత్మనే కీరించాలి, స్మరించాలి.

ఏతావాన్సాఙ్ఖ్యయోగాభ్యాం స్వధర్మపరినిష్ఠయా
జన్మలాభః పరః పుంసామన్తే నారాయణస్మృతిః

సాంఖ్యముతో (జ్ఞ్యానం) గానీ యోగముతో గానీ, తమ తమ ధర్మముని సేవించడం వలన కలిగే లాభం ఆత్మ శరీరం కాదు అని తెలియుట ఒకటి, అలా బ్రతికినంత కాలాం బ్రతికి తరువాత ప్రాణము పోయే ముందు నారాయణ స్మృతి కలగడం మరొక లాభం. ఎటువంటి వ్యామోహం లేని వారికి చివరిలో నారాయణ స్మృతి లభిస్తుంది.

ప్రాయేణ మునయో రాజన్నివృత్తా విధిషేధతః
నైర్గుణ్యస్థా రమన్తే స్మ గుణానుకథనే హరేః

మునులు విధినిషేధాలను విరమిస్తారు (చేయవలసిన వాటినీ చేయరు చేయకూడని వాటినీ చేయరు. కామ్య కర్మలు చెయ్యరు ). వీరు గుణములయందు రమించరు. నరిగుణ్యమైనటువంటి అలాంటివారు కూడా పరమాత్మ కధలను వినుటలో చెప్పుటలో ఆసక్తి కలిగి ఉంటారు

ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మసమ్మితమ్
అధీతవాన్ద్వాపరాదౌ పితుర్ద్వైపాయనాదహమ్

ఇప్పుడు నేను చెప్పినదంతా భాగవత పురాణం. ఇది వేదంతో సమానం (బ్రహ్మసమ్మితమ్). కలియుగ ప్రారంభములో మా తండ్రిగారైన వ్యాసభగవానుని వలన చదువుకున్నాను.

పరినిష్ఠితోऽపి నైర్గుణ్య ఉత్తమశ్లోకలీలయా
గృహీతచేతా రాజర్షే ఆఖ్యానం యదధీతవాన్

(భారతమంతా ధనేషణ పుత్రేషణ రామాయణమంతా ధారేషణ. ఒక వ్యాఖ్యానములో శుకున్ని కొంతకాలమైన దగ్గర ఉంచుకోవాలని వ్యాసుడు భాగవతాన్ని బోధించాడని అంటారు )
నేను గుణములు లేని పరిపూర్ణుడనే గానీ స్వామి లీలలతో ఆకర్షింపబడ్డాను. ఈ భాగవత ఆఖ్యానాన్ని మా తండ్రిగారినుండి అధ్యయనం చేసాను.

తదహం తేऽభిధాస్యామి మహాపౌరుషికో భవాన్
యస్య శ్రద్దధతామాశు స్యాన్ముకున్దే మతిః సతీ

మహాపురుషుడు పరమాత్మ. పరీక్షిత్తు మహా పౌరుషీకుడు. అంత పెద్ద పరమాత్మను ఎవరు మనసులో దాచుకుంటాడు అతను మహా పౌరుషీకుడు. అట్టివాడివి నీవు. ఎవరి యందు ఉంటాడు
ఇలాంటి భగవత్ తత్వాన్ని ఆత్మ తత్వాన్ని తెలుసుకోవాలనే శ్రద్ద ఉంది అనడానికి గుర్తు పరమాత్మ యందు భక్తి.

ఏతన్నిర్విద్యమానానామిచ్ఛతామకుతోభయమ్
యోగినాం నృప నిర్ణీతం హరేర్నామానుకీర్తనమ్

ఏ దిక్కునుండి ఎలాంటి భయం లేకుండా ఉండాలని కోరేవారు, విరక్తిని పొందుతున్నటువంటి (నిర్విద్యమానానాం యోగులకు కర్తవ్యముగా నిర్ణయించబడినది ఒకటే - హరి యొక్క నామాలను కీర్తించడమే

కిం ప్రమత్తస్య బహుభిః పరోక్షైర్హాయనైరిహ
వరం ముహూర్తం విదితం ఘటతే శ్రేయసే యతః

సంసారమంటే ఏంటో పరమాత్మ అంటే ఏంటో తెలియని వాడికి ఎన్నేళ్ళు ఉన్నా ప్రయోజనం లేదు. జ్ఞ్యానం కలవాడికి ఒక ముహూర్తం (48 నిముషాలు ) చాలు మోక్షం పొందడానికి. జ్ఞ్యానం పొందడానికి పరమాత్మ స్వరూపం అర్థం కావడానికి సరిపడే 48 నిముషాలు చాలు జీవితానికి.

ఖట్వాఙ్గో నామ రాజర్షిర్జ్ఞాత్వేయత్తామిహాయుషః
ముహూర్తాత్సర్వముత్సృజ్య గతవానభయం హరిమ్

ఇక్షాకు వంశంలో ఉన్న ఖట్వాంగుడు ఇంద్రుని తరపున రాక్షసులతో పోరాడి, స్వర్గంలో నాలుగు రోజులు ఉండి అయోధ్యకు వెళ్ళే సరికి ఎన్నో యుగాలు అయిపోయి కృష్ణావతారం రావడానికి సిధ్ధంగా ఉంది. ఈ విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయిన ఖట్వాంగుడు మోక్షం కావాలని కోరాడు. అది ఇవ్వలేనని అన్నప్పుడు 'నాకెంత ఆయుష్షు ఉందీ అని అడిగాడు. ఒక ఘడియ మాత్రమే ఉందని తెలియడంతో ఆయన భూలోకానికి వచ్చి శరీరం మీద, ప్రపంచం మీద ఉన్న ఆసక్తిని అరఘడియలో వదిలి, మిగిలిన అరఘడియలో ఆత్మను పరమాత్మలో నిలిపి మోక్షానికి వెళ్ళాడు.

తవాప్యేతర్హి కౌరవ్య సప్తాహం జీవితావధిః
ఉపకల్పయ తత్సర్వం తావద్యత్సామ్పరాయికమ్

నీకు ఏడు రోజులు ఉంది. మోక్షానికి కావలసిన సామగ్రిని ఈ ఏడు రోజుల్లో సమకూర్చుకో

అన్తకాలే తు పురుష ఆగతే గతసాధ్వసః
ఛిన్ద్యాదసఙ్గశస్త్రేణ స్పృహాం దేహేऽను యే చ తమ్

మొదలు నీవు అంతకాలం సమీపించినపుడు మొదలు మరణం అంటే ఉన్న భయం  దిగులు వేదన తత్తరపాటు తొలగాలి (గతసాధ్వసః). అసంగం (విరక్తి) అనే ఖడ్గం తీసుకుని శరీరం మీద ఆసక్తి అనే గొళుసులను, ఆ దేహం వెంట ఏమి ఉంటాయో (ఉంటారో) వాటి మీద కూడా ఆసక్తిని వదలాలి (అను యే చ తం - వెంట ఏమి ఉంటాయో వాటిని ). ఇది యమ నియమాలు అష్టాంగ యోగములో

గృహాత్ప్రవ్రజితో ధీరః పుణ్యతీర్థజలాప్లుతః
శుచౌ వివిక్త ఆసీనో విధివత్కల్పితాసనే

ధీరుడవై (ధీ: బుద్ధిలో రమించేవాడు ధీరుడు. సుందరకాండలో హనుమంతుని ధీరుడు అంటారు. ఆయన సముద్రాన్ని దాటబోతు పచ్చిక బయళ్ళయందు సంచరిస్తున్నాడు ధీరుడై. అందుకే వాల్మీకి ధీరస్సలిలకల్పేషు... అని వ్రాశారు) మొదలు ఇంటిలోంచి బయటకు వెళ్ళాలి. వెళ్ళి ఇంతకాలం సంసారంలో ఉండటం వలన ఓంటికంటిన మురికి పోగొట్టుకోవాలి. అప్పుడు అరణ్యమునకు వెళ్ళి పరిశుద్దమైన ఏకాంత (వివిక్త ) ప్రదేశంలో కూర్చోవాలి.
విధివత్కల్పితాసనే - మరీ ఎత్తు లేకుండా, మరీ కిందకి లేకుండా, వస్త్రం గాని జింక చర్మం గానీ ధర్భ గానీ, అవలంబించే మార్గానికి అనుగుణమైన ఆసనం వేసుకుని. ఇది జిత ఆసన

అభ్యసేన్మనసా శుద్ధం త్రివృద్బ్రహ్మాక్షరం పరమ్
మనో యచ్ఛేజ్జితశ్వాసో బ్రహ్మబీజమవిస్మరన్

ఇంటివద్ద అన్నీ వదిలిపెట్టి రావడంలో 'యమం' ఉంది. పుణ్యతీర్థజలాప్లుతః - దీనిలో నియమం ఉంది. విధివత్కల్పితాసనే - ఇది ఆసనం.
త్రివృద్బ్రహ్మాక్షరం  - అంటే అకార ఉకార మకారం. దీనికే బ్రహ్మాక్షరం అని పేరు. ఈ ఓంకారాన్ని పరిశుద్దమైన మనసుతో, నియమించబడిన మనసుతో అభ్యసించాలి. ప్రాణాయామముతో మనసును మన వశం చేసుకోవాలి. మనసు కూడా వాయు రూపమే (నిరాకారమే) , వాయువుతోటే కలిసి ఉంటుంది. ప్రాణాయామంతో మనసును నియమించాలి. ఓంకారాన్ని అనుస్మరిస్తూ చేయాలి.

నియచ్ఛేద్విషయేభ్యోऽక్షాన్మనసా బుద్ధిసారథిః
మనః కర్మభిరాక్షిప్తం శుభార్థే ధారయేద్ధియా

మనసులో ఉండే ఇంద్రియాలను వెనక్కు తిప్పడం (దీన్ని ప్రత్యాహారం - ప్రతి ఆహారం అంటారు). మొదట మనసుని నిగ్రహించి, నిగ్రహించిన మనసుతో ఇంద్రియాలను వెనక్కు మరల్చాలి. వెనక్కుతిప్పడానికి సారధ్యం బుద్ధికి ఇవ్వాలి. బుద్ధితో ఇంద్రియాలను వెనక్కు మరల్చాలి.
ఇంద్రియాలు మనసు బుద్ధి ద్వారా వెనక్కు మళ్ళాయి. వెనక్కు మళ్ళించిన మనసును పరమాత్మ యందు నిలపాలి - అదే ధారణ. ఇప్పుడు మనసుని నిగ్రహించినా, ఇంతవరకూ అన్నిచోట్లకీ తిరిగిన మనసుకి సంస్కారం అనేది ఒకటి అంటుకుంటుంది. ఆ సంస్కార ప్రభావంతో ఉన్న మనసు వెన్నక్కి మళ్ళీ తిరిగి వెళ్ళకుండా పరమాత్మ యందు ఉంచాలి. కర్మభిరాక్షిప్తం  - ఇక్కడ కరభి: అంతే సంస్కారం. శుభార్థే అంటే - అనంత కళ్యాణ గుణాలు గల్గిన పరమాత్మ యందు ఉంచాలి. ఎలా? ద్ధియా: బుద్ధితో.

తత్రైకావయవం ధ్యాయేదవ్యుచ్ఛిన్నేన చేతసా
మనో నిర్విషయం యుక్త్వా తతః కిఞ్చన న స్మరేత్
పదం తత్పరమం విష్ణోర్మనో యత్ర ప్రసీదతి

ఎక్కడ మనసు ఉంచాలో అక్కడ ధ్యానం చేయాలి. పరమాత్మని నఖం నుంచీ కేశముల వరకూ ధ్యానించాలి. అంతా ఒక్క సారి చేయలేము కాబట్టి, ముందు ఒక్క దాన్ని పట్టుకోవాలి. ముందు పాదాలను పట్టుకుని ధ్యానం చేయాలి. అది బాగా కుదిరాక మెల్లిగా పైపైకి వెళ్తూ శిరసు వరకూ వెళ్ళాలి. ఆ అవయవం వరకూ బాగా మనసు నిలిచే దాకా ఆ అవయవాన్ని ధ్యానం చేయాలి. ఎలా చేయాలి? పాదములనే ధ్యానం చేయాలి. విచ్చిన్నం కాకూడదు. ఎక్కడ మనసు ఉంచబడిందో దాని మీదే ఉండాలి - ఇంకో దాని మీదకు వెళ్ళకూడదు.
మరే విషయములు సాక్షాత్కరించకూడదు. అన్ని అశుభాలలోంచి మనసును దాని పూర్తి వ్యతిరేకమైన పరమ శుభమైన పరమాత్మ యందు ఉంచాలి. దాన్నే పరమపదం (పరంధామం) అంటాం. అక్కడ మనసు ప్రసన్నమవుతుంది.

రజస్తమోభ్యామాక్షిప్తం విమూఢం మన ఆత్మనః
యచ్ఛేద్ధారణయా ధీరో హన్తి యా తత్కృతం మలమ్

సకల శుభాస్పదుడైన పరమాత్మ యందు ఉంచిన మనసు మరి దేన్నీ స్మరించదు. ఇంతకాలం రజస్సు (దుమ్ము) తమస్సుతో బాగా మురికి పట్టి ఉన్న మనసు, పరమాత్మయందు లగ్నం చేయడంతో మనసుకు అంటిన మలాన్ని పోగొడుతుంది.
హన్తి యా తత్కృతం మలమ్ (ఇక్కడ యా  అంటే ధారణ, అ ధారణ ఆ మురికిని తొలగిస్తుంది)
ఏమి చేయాలన్నా మనో నిగ్రహం కావాలి, మనో ధారణ కావాలి. అందుకే సుందరకాండలో హనుమ  'మన్సా చ గతా' అంటారు. ముందు మనసును పంపిన్స్తాడు. అలాగే సీతమ్మవారిని చూసి 'జగామ మనసా రామం'. ఏ పని చేయాలనుకున్నా ముందు మనసును పంపాలి. వాటి వెంట మిగతావి వస్తాయి.

యస్యాం సన్ధార్యమాణాయాం యోగినో భక్తిలక్షణః
ఆశు సమ్పద్యతే యోగ ఆశ్రయం భద్రమీక్షతః

అష్టాంగాల్లో ప్రధానమైనది ధారణ. మనసు పరమాత్మ యందు కుదిరినపుడే ధ్యానం చేయగలదు. ఈ ధారణే యోగం కలగడానికి మూలం. యోగమంటే పరమాత్మతో కలిసి ఉండుట. యోగము ధారణ వలన కలుగుతుంది.
ఈ అష్టాంగాలతో భక్తి కలుగుతుంది (యమ నియమ ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన). మనసుకు గాని బుద్ధికి గానీ ఆధారం మంచిది కావాలి. పరమాత్మ ఆశ్రయంతో శుభం కలుగుతుంది. ఆ రక్షణ కలగడంతో భక్తి కలుగుతుంది.

రాజోవాచ
యథా సన్ధార్యతే బ్రహ్మన్ధారణా యత్ర సమ్మతా
యాదృశీ వా హరేదాశు పురుషస్య మనోమలమ్

ఎక్కడ మనసుని ఉంచాలి ఎలా ధారణ చేయాలి, దానికంటే ముందు ఏమి ఉండాలి.
ఈ ధారణ చేస్తే మనసుకు అంటిన మురికి పోతుంది అంటున్నారు. ఎలాంటి మురికి పోతుంది.
ధారణ ఎలాంటి మలములు పోగొడుతుంది. ఎలాంటి ధారణ మనసుకు అంటిన మలములు పోగొడుతుంది.

శ్రీశుక ఉవాచ
జితాసనో జితశ్వాసో జితసఙ్గో జితేన్ద్రియః
స్థూలే భగవతో రూపే మనః సన్ధారయేద్ధియా

జితాసనో జితశ్వాసో జితసఙ్గో జితేన్ద్రియః - ముందు శరీరానికి స్థిరత్వాన్ని ఏర్పరచాలి. కూర్చున్న భంగిమలో మార్పు రాకూడదు. అదే ఆసన్ విజయం. మన ముక్కుకు రెండు నాళికలుంటాయి, సూర్య నాళిక చంద్ర నాళిక. ప్రతీ నలుగున్నర నిముషాలకు మారుతూ ఉంటుంది. శ్వాస ఏ వైపుందో గుర్తిస్తే ఆ శ్వాస వెళ్ళే మార్గాన్ని మార్చుకోవచ్చు. సూర్య నాళం జ్ఞ్యాన మార్గమైతే చంద్ర నాళం భక్తి మార్గం. నిరాకారం యందు మనసు లగ్నం చేయాలంటే సూర్యనాళిక వాయు శ్వాసతో చేయాలి. భక్తి మార్గానికి చంద్రనాళిక. మొదట మనసు దాని మీద ఉంచడం మొదలుపెట్టాలి, కూర్చున్నా నించున్న. ఏ నాసికా రంధ్రం నుండి శ్వాస బయటకు వెళ్తొంది, ఎక్కడ శ్వాస నిలుస్తోందో, గుర్తించాలి. మరి మామూలుగా మనకు ఎందుకు ఇది తెలియట్లేదు. మనం తీస్తున్న శ్వాసే కదా? మన మనసు అక్కడ లేదు కాబట్టి.
సూర్యనాళిక నిరోధం వచ్చిన వాడు యోగి అవుతాడు, చంద్ర నాళిక యందు సాధన చేసిన వాడు భోగి అవుతాడు.
మనం అనుకున్నప్పుడు మనం అనుకున్న నాళము నుండి శ్వాస విడుచుట పీల్చుట చేయగలిగితే మనసు మనం చెప్పినట్టు వింటుంది. జ్ఞ్యాన సాధనకు అవసరమయ్యే పనులలో సూర్యనాళంలో శ్వాస తీసుకోవాలి. సూర్య నాళంలో శ్వాస తీసుకున్నప్పుడు హృదయ వేగం తగ్గుతుంది. అంటే భోగం యందు మనసు ఎపుడు లగ్నం చేసామో (చంద్ర నాళం నుండి శ్వాస తీసుకునేప్పుడు, మన కోరిక తీరుతుందో లేదో అన్న ధ్యాసలో మన హృదయస్పందన హృదయ వేగం పెరుగుతుంది).శ్వాస నియమంతో హృదయ గతి యొక్క నియమం కలుగుతుంది, మనోనియమం కలుగుతుంది, దానితో ఇంద్రియనిగ్రహం కలుగుతుంది, దానితో ధారణ కలుగుతుంది, ధ్యానం నిలుస్తుంది.
శ్వాసను గెలిచిన వాడు కోరికను గెలిచినవాడే
మనసు పక్కకి పోకుండా ఉండటానికి స్థూలమైన భగవంతుని రూప్పాన్ని ధయానించాలి. అదే అనిరుధ్ధ తత్వం, విరాట్ పురుషుడు అంటాం. మొదట పెద్ద ఆకారంలో మనసు పెట్టు. అన్ని లోకాలను పరమాత్మ అవయవాలుగా ధ్యానించగలగాలి. మనం భగవంతుని కంటే బయట లేము.

విశేషస్తస్య దేహోऽయం స్థవిష్ఠశ్చ స్థవీయసామ్
యత్రేదం వ్యజ్యతే విశ్వం భూతం భవ్యం భవచ్చ సత్

 స్థవిష్ఠశ్చ స్థవీయసామ్ - ఉన్న దేహాలన్నిటికంటే పరమాత్మ పెద్దవాడు. పెద్దవాటన్నిటికీ పెద్దది.
ఎంత పెద్దదంటే, ఇపుడున్న ప్రపంచం ఇంతకు ముందు ఉన్నది రాబోయేది అంతా ఆయన్లో ఉన్నది.

అణ్డకోశే శరీరేऽస్మిన్సప్తావరణసంయుతే
వైరాజః పురుషో యోऽసౌ భగవాన్ధారణాశ్రయః

పరమాత్మ శరీరం బ్రహ్మాండం. అంటే లోకాలే కాదు, లోకముల చుట్టు ఉన్న ఆవరణ కూడా. బ్రహ్మాండం చొట్టూ ఏడు ఆవరణలుంటాయి: పృధ్వీ, అప్, తేజో,వాయు, ఆకాశం, మహత్, అహంకారం. అక్కడ ఉండే వాడు విరాట్ పురుషుడు (విశెషేన రాజతే)
భగవంతుని విశ్వాకారునిగా చూడాలి. ఇతనే అనిరుద్ధ తత్వం.

పాతాలమేతస్య హి పాదమూలం పఠన్తి పార్ష్ణిప్రపదే రసాతలమ్
మహాతలం విశ్వసృజోऽథ గుల్ఫౌ తలాతలం వై పురుషస్య జఙ్ఘే

పరమాత్మ అరికాళ్ళు పాతాళం
పార్ష్ణిప్రపదే - పాదాలకు పక్క భాగాలు రసాతలం
మహాతలం విశ్వసృజోऽథ గుల్ఫౌ - మడమలు మహాతలం
తలాతలం వై పురుషస్య జఙ్ఘే - పిక్కలు తలాతలం

ద్వే జానునీ సుతలం విశ్వమూర్తేరూరుద్వయం వితలం చాతలం చ
మహీతలం తజ్జఘనం మహీపతే నభస్తలం నాభిసరో గృణన్తి
ఉరఃస్థలం జ్యోతిరనీకమస్య గ్రీవా మహర్వదనం వై జనోऽస్య
తపో వరాటీం విదురాదిపుంసః సత్యం తు శీర్షాణి సహస్రశీర్ష్ణః

మోకాళ్ళు - సుతలం
ఉరూరుద్వయం వితలం చాతలం చ - తొడలు ఒకటి వితలం అతలం
నడుము - భూమి
నాభి - ఆకాశం
ఉరస్థలం వక్షస్థలం - నక్షత్రాలు
గ్రీవం - మహా లోకం
వదనం - జనోలోకం
లలాటం - తపోలోకం
శిరస్సు - సత్య లోకం

ఇన్ద్రాదయో బాహవ ఆహురుస్రాః కర్ణౌ దిశః శ్రోత్రమముష్య శబ్దః
నాసత్యదస్రౌ పరమస్య నాసే ఘ్రాణోऽస్య గన్ధో ముఖమగ్నిరిద్ధః

బాహువులు - ఇంద్రాదులు
చెవులు - దిశలు
శ్రోత్రం - శబ్దం
నాసిక - నాసత్యదస్రౌ (అశ్వనీ దేవతలు)
ముఖం - అగ్ని

ద్యౌరక్షిణీ చక్షురభూత్పతఙ్గః పక్ష్మాణి విష్ణోరహనీ ఉభే చ
తద్భ్రూవిజృమ్భః పరమేష్ఠిధిష్ణ్యమాపోऽస్య తాలూ రస ఏవ జిహ్వా

నేత్రేందిర్యం - ద్యవ్ (స్వర్గం)
కన్నులు - సూర్యుడు
కను రెప్పలు - రాత్రి పగలు
కనుబొమ్మలు - బ్రహ్మలోకం
దవడలు (తాలూ) - జలం
నాలిక - రసం

ఛన్దాంస్యనన్తస్య శిరో గృణన్తి దంష్ట్రా యమః స్నేహకలా ద్విజాని
హాసో జనోన్మాదకరీ చ మాయా దురన్తసర్గో యదపాఙ్గమోక్షః

శిరోభాగం - అఖిలవేదాలు
దమ్ష్ట్ర - యముడు
దంతములు - ప్రీతి, స్నేహం
నవ్వు - సకల ప్రాణులకు మత్తెకించే మాయ
దురన్తసర్గో యదపాఙ్గమోక్షః - పరమాత్మ క్రీగంటి చూపు - సృష్టి

వ్రీడోత్తరౌష్ఠోऽధర ఏవ లోభో ధర్మః స్తనోऽధర్మపథోऽస్య పృష్ఠమ్
కస్తస్య మేఢ్రం వృషణౌ చ మిత్రౌ కుక్షిః సముద్రా గిరయోऽస్థిసఙ్ఘాః
నాడ్యోऽస్య నద్యోऽథ తనూరుహాణి మహీరుహా విశ్వతనోర్నృపేన్ద్ర
అనన్తవీర్యః శ్వసితం మాతరిశ్వా గతిర్వయః కర్మ గుణప్రవాహః

పైపెదవి - సిగ్గు (వ్రీడ)
కిందిపెదవి - లోభం
స్తనం - ధర్మం
వీపు - అధర్మం
మేడ్రం - బ్రహ్మ (క:)
వృషణ - విశ్వావసువులు
పొట్ట - సముద్రం
ఎముకలు - పర్వతాలు
నరములు - నదులు
రోమములు - వృక్షములు
శ్వాస - వాయువు
గమనం - పక్షులు
అనత గుణాలు - కర్మలు

ఈశస్య కేశాన్విదురమ్బువాహాన్వాసస్తు సన్ధ్యాం కురువర్య భూమ్నః
అవ్యక్తమాహుర్హృదయం మనశ్చస చన్ద్రమాః సర్వవికారకోశః
విజ్ఞానశక్తిం మహిమామనన్తి సర్వాత్మనోऽన్తఃకరణం గిరిత్రమ్
అశ్వాశ్వతర్యుష్ట్రగజా నఖాని సర్వే మృగాః పశవః శ్రోణిదేశే

కేశాలు - మేఘాలు
వస్త్రం - సంధ్య
హృదయం - అవ్యక్తం (ప్రకృతి)
మనసు - చంద్రుడు (సర్వవికారకోశః - అన్ని వికారాలకు కోశం)
పరమాత్మ మహత్ తత్వం - విజ్ఞ్యానం
పరమాత్మ అంత: కరణం - శంకరుడు (గిరిత్రమ్)
గోళ్ళు - కంచరగాడిదలు, గుఱ్ఱములు, ఒంటెలు, ఏనుగులు (అశ్వాశ్వతర్యుష్ట్రగజా. అశ్వ తరి - కంచర గాడిద)
పిరుదులు - ఇతర మృగాలు (శ్రోణి - పిరుదులు)

వయాంసి తద్వ్యాకరణం విచిత్రం మనుర్మనీషా మనుజో నివాసః
గన్ధర్వవిద్యాధరచారణాప్సరః స్వరస్మృతీరసురానీకవీర్యః

పరమాత్మ వ్యాక్రణం - వేదాన్ని బయటకు తీసుకుని వచ్చిన తిత్తిరి పక్షులు. (వయాంసి  - తిత్తిరిపక్షులు)
బుద్ధి - మంత్రం (మను: మనీషా)
ఆయన ఇల్లు - మనుషులు
పరమాత్మ స్వరం (రాగం తానం పల్లవి )- గంధర్వ విద్యధరులు అప్సరసలు
స్మృతి - సకల రాక్షస కుల అలంకారమైన ప్రహ్లాదుడు

బ్రహ్మాననం క్షత్రభుజో మహాత్మా విడూరురఙ్ఘ్రిశ్రితకృష్ణవర్ణః
నానాభిధాభీజ్యగణోపపన్నో ద్రవ్యాత్మకః కర్మ వితానయోగః

బ్రాహ్మణులు - ముఖము
క్షత్రియులు - భుజాలు
వైశ్యులు (విట్) - ఊరువు
శూద్రులు - పాదములు
పరమాత్మ వితానం(శయ్య) - అన్ని రకాల పేర్లు వ్యవహారము. ద్రవ్యాత్మకమైన అన్ని రకాల వ్యాప్తి.

ఇయానసావీశ్వరవిగ్రహస్య యః సన్నివేశః కథితో మయా తే
సన్ధార్యతేऽస్మిన్వపుషి స్థవిష్ఠే మనః స్వబుద్ధ్యా న యతోऽస్తి కిఞ్చిత్

నేను నీకు ఈ సన్నివేశాన్ని చెప్పాను. ఇలాంటి (స్థవిష్ఠే  - ఉన్నవాటికన్న పెద్దది) ఉన్నవాటికన్న పెద్దది, దీని మీద మనసు ఉంచు. ఆయన కన్న భిన్నమైనది ఏమీ లేదు. (చెట్టుకింద కూర్చున్నా అనుకోకుండా పరమాత్మ రోమకూపాల్లో ఉన్నా అనుకోవడం ఉత్తమం)
పరమాత్మ లేనిదీ కనిదీ ఇంకోటి లేదు. నీవున్న ప్రపంచం మొత్తం పరమాత్మ ఆకారమే

స సర్వధీవృత్త్యనుభూతసర్వ ఆత్మా యథా స్వప్నజనేక్షితైకః
తం సత్యమానన్దనిధిం భజేత నాన్యత్ర సజ్జేద్యత ఆత్మపాతః

సర్వధీవృత్త్యనుభూతసర్వ  - ప్రపంచంలో ఉండే అన్ని రకాల ప్రాణుల బుద్ధి వృత్తులు ఆయనే, ఆ బుద్ధి వృత్తులకి జరిగే అనుభవం కూడా ఆయనే. (దదామి బుద్ధియోగం... అన్నట్లుగా) బుద్ధి ఆయనే ఇచ్చి ఆలోచన ఆయనే ఇచ్చి సంకల్పం ఆయనే కలిగించి పని అతనే చేయిస్తాడు. ఇది గుర్తిస్తే మన అహంకారం పోతుంది. అలా అనుకున్న వాడికి పరమాత్మ పాప బుద్ధి కలిగించడు.  (అందుకే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు. ) కర్తుత్వ భోక్తృత్వ జ్ఞ్యాతృత్వ అభిమాన రాహిత్యం ఏర్పడితే పరమాత్మ యందు ధారణ ఉంచగలం. ప్రపంచంలో ఉండే అన్ని రకాల ప్రాణులు బుద్ధి వృత్తులు పరమాత్మే. ఆ బుద్ధి వృత్తుల చేత అనుభవించబడే అన్ని అనుభవాలు ఆయనే, అన్ని ఆత్మలూ ఆయనే.
రకరకాల స్వప్నాలు వస్తాయి
ఎలా ఐతే రకరకాలైన కలలు ఒక్కడికే వస్తాయో, ఆ చూచే వాడు ఒక్కడే అయి ఎలా ఉంటాడొ, అన్ని రకాల బుద్ధి భావనలూ బుద్ధి అనుభావాలు ఒక్కడే, ఆ పరమాత్మే
కాబట్టి నీవు ఆ అనందైలయుడు అయిన పరమాత్మని ధ్యానం చేయాలి. పొరబాటున కూడా మన మనసును అతని కంటే వేరే దానిమీద ఉంచకూడదు ఎనుకంటే సకల ఆనందములకు ఆయనే నిధి కాబట్టి. ఆనందమే ఆయన ఐపుడు ఆయన కంటే భిన్నమైనదాని మీద ఉంచితే ఆత్మ పతనం అవుతుంది. ఆత్మ ఉజ్జీవనం కావలంటే పరమాత్మ యందు మనసు లగ్నం చేయి, మనకి కనపడని వాడిమీద ఎలా ధారణ చేస్తామని బెంగపెట్టుకోకు, నీవు చూచేదంతా ఆయనే. అష్టాంగములతో మొదలుపెట్టి మనసును సకల శుభాశ్రయమైన పరమాత్మ యందు ధారణ చేస్తే ఆత్మ ఉజ్జీవింపబడుతుంది.

Popular Posts