Followers

Saturday 2 November 2013

కార్తీకమాసంలో ఆచరించాల్సిన విధులు.



కార్తీక స్నానాన్ని ఆశ్వీయుజ బహుళ అమావాస్య అంటే దీపావళి రోజు నుంచి
ప్రారంభించవలెను.

నెలంతా కార్తీక స్నానం చేయడం మంచిది. వీలుకానివారు సోమవారాల్లోనూ శుద్ధ
ద్వాదశి, చతుర్దశి, పౌర్ణిమరోజుల్లోనైనా తప్పక ఆచరించవలెను.

శుద్ధ ద్వాదశినాడు తులసి పూజ చేయవలెను.

ఈ నెలంతా శ్రీమహావిష్ణువును తులసీదళములు, జాజిపూలతో పూజించవలెను.

ఈ నెలంతా శివుడిని మారేడుదళములతోనూ , జిల్లేడుపువ్వులతోనూ పూజించవలెను.

ఈ మాసంలో కార్తీక పురాణాన్ని పారాయణం చేయడం మంచిది.

కార్తీక మాసంలో పండుగలు

శుక్లపక్ష విదియ : భాతృ ద్వితీయ

దీనికే యమ ద్వితీయ, భగినీ హస్త భోజనం అని పేర్లు, ఈ దినం పురుషులు సొంత ఇంటిలో
భోజనం చేయరాదు. ఈ దినం సోదరి ఇంటిలోగాని, లేదంటే సోదరితో సమానమైనవారి ఇంట
భోజనం చేయవలెను. ఈ విధంగా చేస్తే అపమృత్యుభయం, నరకలోకభయం తొలగిపోతాయి. అంతే
కాకుండా భోజనం పెట్టిన సోదరి కలకాలం పుణ్యస్త్రీగా ఉంటూందని శాస్త్రవచనం.

శుక్లపక్ష చవితి " నాగుల చవితి

కార్తీక శుక్లపక్ష చవితినాడు మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నాగులచవితి
పర్వదినం జరుపుకుంటారు.

శుక్లపక్ష ఏకాదశి : ప్రభోదన ఏకాదశి

ఆషాడ శుక్ల పక్ష ఏకాదశి నాడు పాలకడలిలో శేషశయ్యపై శయనించి, యోగనిద్రలో గడిపిన
శ్రీమహావిష్ణువు ఈ దినం నిద్ర నుంచి మేల్కొంటాడు. కాబట్టి దీనికి 'ఉత్థాన
ఏకాదశీ లేదా 'ప్రబోధన ఏకాదశి ' అని పేర్లు. ఈ దినం ఉపవాస వ్రతం పాటించి
శ్రీమహావిష్ణువును పూజించవలెను. అంతేకాకుండా తొలి ఏకాదశినాడు ప్రారంభమైన
చాతుర్మాస్య వ్రతానికి ఈ ఏకాదశి చివరిరోజు.

శుక్లపక్ష ద్వాదశి: క్షీరాబ్ది ద్వాదశి

పూర్వం కృతయుగంలో దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగర మధనం చేసింది ఈ రోజే.
అందుకే దీనికి క్షీరాబ్ది ద్వాదశి ,చిలుకుద్వాదశి అని పేర్లు.
శ్రీమహాలక్ష్మిని శ్రిమహావిష్ణువు వివాహం చేసుకున్నది కూడా ఈనాడే . ఈ రోజు
ఇంటి యందున్న తులసికోట వద్ద శ్రీమహావిష్ణువును లక్ష్మీసమానురాలైన తులసిని
పూజించవలెను.

శుక్లపక్ష చతుర్దశి : వైకుంఠ చతుర్ధశి

వైకుంఠవాసుడైన శ్రీమహావిష్ణువు ఈ దినం వైకుంఠంను వదిలి వారణాసి వెళ్ళి
పరమశివుడిని పూజించినట్లు కథనం. ఈ నాడు శైవాలయాలకు వెళ్ళి దీపం వెలిగించవలెను

శుక్లపక్ష పూర్ణిమ :

ఈ దినం శివాలయాల్లో నిర్వహించే 'జ్వాలాతోరణం ' ను దర్శించడం మంచిది. సాయంత్రం
సమయంలో శివాలయంలోగానీ,వైష్ణ్వాలయంలోగానీ దీపాలను వెలిగించవలెను. ఈ దినం శ్రీ
సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం, మార్కండేయ పురాణం దానం చేయడం విశేష ఫలితాలను
ఇస్తుంది.

కృష్ణపక్ష చవితి : కరక చతుర్ధి

ఇది వినాయకుడుకి సంబంధించినది. ఈ వ్రతం మహిళలు చేయడం మంచిది.

వృశ్చిక సంక్రమణం

ప్రత్యక్ష భగవానుడైన శ్రీసూర్యభగవానుడు ఈరోజు తులారాశి నుండి ఎనిమిదవ రాశి
అయిన వృశ్చికరాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా సంక్రమణ స్నానాలు,
పూజలు, జపాలు, దానాలు , దేవాలయ సందర్శనలు చేయడం వల్ల సర్వవిధాలా శుభఫలితాలను
ఇస్తుంది.

కార్తీకమాసంలో విధులను పాటించడం ద్వారా ఆధ్యాత్మిక పరమైన ఫలాలను పొందడమే
కాకుండా మారుతున్న సామాజిక పరిస్థితులు, ఆహారపు అలవాట్ల వల్ల కొత్తగా
తలెత్తుతూ ఉన్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపసమనం పొందవచ్చు.

Popular Posts