Followers

Wednesday 23 October 2013

మనిషి జీవితం ఎలా శాంతం గా ఉంటుంది ?సంతోషం ఎప్పుడు ,ఎలా కలుగుతుంది ?సత్సంగం అంటే ఏమిటి ?స్వ ధర్మం అంటే ఏమిటి ? అహంకారాన్ని ఎలా నిర్ములించాలి ?


మనిషి స్వధర్మాచరణ చేస్తూ సంతోషంగా,శాంతం గా బ్రతకాలి .

మనిషి జీవితం ఎలా  శాంతం గా ఉంటుంది ?
జీవనానికి నియమాలు , నదులకు చెలియలి కట్టలు
మనస్సుకి సత్సంగ సాధన -
ప్రాణానికి ఆయామం
శరీరానికి వ్యాయామం
బుధ్ధికి  ప్రగాడ సూక్ష్మత - ఇవన్నీ ఉంటేనే మనిషి జీవితం శాంతం గా ఉంటుంది .

మనిషికి సంతోషం ఎప్పుడు ,ఎలా కలుగుతుంది ?
హుషారుగా ,ఇష్టపడి కష్ట పడుట
ఇతరులకు ప్రేమతో సేవ చేయడం
నీ స్వ శక్తి పై గానీ , తోటి వారిపై గానీ ,దేవుని పై గానీ విశ్వాసం ఉంచి
ఎపుడూ  నీకు దేనిపై విశ్వాసముందో దానిని ప్రార్ధన చేస్తూ
మన పని విజయవంతం కావటానికి క్రుషి చేయడం - సంతోషానికి తొలి మెట్టు .

సత్సంగం అంటే ఏమిటి ?
ఓ మంచి గురువు ,మంచి స్నేహితుడు ,మంచి గ్రంధం తో గడపటమే సత్సంగం .
శరీరాన్ని , మనస్సుని ,ప్రాణ శక్తిని ఒకే కంపనంలో ఉంచడమే యోగానికి తొలి మెట్టు .
మనిషి జీవన  విధానం ఎలా ఉండాలి ?
మనస్సుని ఉత్సాహంతో నింపుకొని
ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోవడం
మనస్సుని అన్నివేళలా ఆశావహంగా ఉంచుకొని
దుఖాన్ని అధిగమించడం
ఇతరులు చేసిన తప్పిదాలను క్షమించడం
అన్యాయాలను ,అనినీతిని ఎదుర్కోవడం
కుటుంబం కోసం , సంఘంకోసం పాటుపడటం
వైఫల్యాలు మరిచి  నిరంతరం విజయంకోసం ప్రయత్నించడం
ధర్మమేమిటో అవగాహన చేసుకోవడం - ఇదే మనిషి జీవన విధానం .
మనిషి ఏది  వదులు కొంటే శాంతంగా ఉంటాడు ?
మనిషికి పంచ జ్ఞానేంద్రియాలు ,పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు , మానసం ,చిత్తం , బుద్ది, అహంకారం ,వీటన్నింటినీ ఆవరించి జీవాత్మ ఉంటాయి . శరీరంలో ప్రతి కణానికి మనస్సు ఉంటుంది . కణంలోని ప్రతి అణువుకూ మనస్సు ఉంటుంది . కానీ స్థాయిలోనే తేడా !
మనిషి ఏది సాధిస్తే నిత్యం  శాంతంగా ,సంతోషంగా ఉంటాడో కనిపెట్టడానికి ఎందరో ప్రవక్తలు , యోగులు ,రుషులు మొదలుకొని నేటి శాస్త్రజ్ఞులు వరకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు .
అందరూ అంగీకరించిన విషయం ఏమిటంటే , మనిషి నేను -నాది - నా వాళ్లు అనే అహంకార మమకారాలను  పూర్తిగా తొలగించుకొంటే ఎపుడూ శాంతిగా ఉండవచ్చును .
అహంకారాన్ని పరమాత్మలో నిమజ్జనం చేయడమే సాధనలో చివరి మెట్టు .
అహంకారాన్ని ఎలా నిర్ములించాలి ?
సాధనతో .
అది ఎలా చేయాలి ?
నిన్ను నువ్వు ఇష్టపూర్వకముగా కోల్పోవాలి .ఇలా జరగాలంటే పలు మార్గాలున్నాయి .
మొదటగా - ఇంద్రియాలను అదుపులోకి తెచ్చుకోవాలి.
మనస్సుని ఏకాగ్రతం చేయటం సాధన చేయాలి . దేని మీద చేయాలి ?

శబ్దం లేదా నాదం లేదా మంత్రం మీద చిత్తాన్ని నిలిపే టట్లు సాధన చేయాలి . - మంత్ర  యోగం
మనస్సుని సంపూర్ణముగా దేవునిపైగానీ ,నీకిష్టమైన పనిపైగానీ లేదా నీ స్వశక్తిపైగానీ కేంద్రీకరించి ఎల్లపుడూ స్థిత ప్రజ్ఞత్వంతో ఉండేటట్లుగా సాధన చేయాలి . -కర్మ ఫల సన్యాస యోగం .
కర్మ సన్యాసం చేసి ప్రతి కార్య కారణానికి దేవునిపై భారమేసి ,సుఖ దుఖాలకు చలించక సంపూర్ణ శరణాగతి తో త్యాగ  వైరాగ్య  జీవనం సాగించడాన్ని -భక్తి యోగం.
అన్ని కర్మలూ నిమిత్త మాత్రము గా ఎలాంటి అనుభూతిలేకుండా  చేస్తూప్రేమ తో కూడిన సేవ ఇష్టపూర్వకముగా చేయడాన్ని -రాజయోగం.
శరీరాన్ని సం రక్షించుకొంటూ ,మనస్సుని "నేనెవరు" అనేదానిపై విచారణ చేస్తూ విహిత కర్మాచరణ చేస్తూ ,త్యాగ బుద్దితో జీవనం -జ్ఞానయోగం.

పై న చెప్పిన విధంగా చేస్తే మనిషికి నిత్య సంతోషం ,శాంతి , ఆనందం కలుగుతాయి . అదే మోక్షం .అదే నిర్వాణం . ఇది మనం బతికున్నప్పుడే కలిగే అనుభూతి . ఇలాంటి ఆనందకరమైన జీవితం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకొంటారు .
 అంటే మన మనస్సుని రీ ప్రొగ్రాం చేసుకొవడమన్న మాట . ఏమని ? సుఖ శాంతులకు బయటి ప్రపంచం పై ఆధార పడనక్కరలేదు , మన మనస్సే వీటికి మూలం ,కాబట్టి మనస్సుని మౌల్డ్ చేసుకొంటే చాలు,నిత్యం శాంతంగా ఉండవచ్చు . మనిషి కనీస అవసరాలు తీర్చుకొంటూ విద్య వినయాలతో డాంబికాలు , దంభాలు లేకుండా కనీసపు వ్రుత్తి ఉద్యోగ , కుటుంబ మరియు  సంఘ ధర్మాన్ని ఆచరిస్తూ జీవనం చేయాలి. కోరికలను తన ఆరోగ్యానికి , ఇతరులకు ఇబ్బంది రానంతవరకు తీర్చుకోవచ్చు . ఆశ ఉండాలి . అత్యాశ ,దురాశ ఉండకూడదు . పట్టుదల ఉండాలి . మొండితనం కూడదు . అన్యాయ అధర్మాలను ప్రతిఘటించే కోపం ,ఆవేశం ,ఆలోచన   ఉండాలి . తన ఆరోగ్యాన్ని ,ఇతరులను నాశనం చేసే క్రోధం ,చింత ఉండరాదు . అన్ని ప్రాణులపై సమ ధర్మం ఉండాలి . ఏమి చేస్తే నువ్వు బాధ పడతావో ,వాటిని ఇతర ప్రాణులకు చేయకపోవటమే అహింస .

స్వ ధర్మం అంటే ఏమిటి ? 
జీవితం పైనా ,తోటివారి శాంతి పైనా ఉత్సాహం
శత్రువులనుకూడ క్షమించే గుణం
తనకున్నంతలో ఇష్టపడి చేసే సేవ
ఇతర ప్రాణులను ఆనందముగా ఉంచే ప్రేమ
ఎన్ని వైఫల్యాలు ఎదురైనాచలించని ఓర్పు
తనపైనా ,ప్రతి ప్రాణి పైనా శ్రద్ద - ఈ లక్షణాలతో జీవించడమే మనిషి కనీసపు స్వ ధర్మం.
నీ స్వధర్మాన్ని నువ్వు నిర్వర్తించు . శాంతి ఆనందాలు అవే వస్తాయి .
    
జన్మ రాహిత్యం ,సారూప్య , సాలోక , సాయుజ్య మోక్షం ,నిరాకార నిర్గుణ పరమాత్మ సన్నిధి చేరే సమాధి స్థితి ,-ఇవన్నీ ఎవరికివారు అనుభూతించవలసిన అధి భౌతిక అధి ఆత్మిక విషయాలు .

తెలుసుకోతగినది ,తెలుసుకొనే వాడు ,తెలుసుకొన్న విషయం - ఇవన్నీ ఏకమైన సమయంలో అంతా శూన్యమే ! ఆ శూన్యం ఇలా ఉంటుందని ,అలా ఉంటుందని వివరించే స్మ్రుతులు ,శ్రుతులు ,గీతాసారాలు ,మరెందరో ప్రవక్తలు నుడివిన సిద్దాంతాలు మనకెన్నో ఉన్నాయి . వాటిని మార్గం చూపించే మైలు రాళ్ళుగా , దీప జ్ఞాన కాంతులుగా స్వీకరిద్దాం .

Popular Posts