Followers

Friday 18 October 2013

కాలసర్పదోషం వుంటే నిజంగా జీవితం అంతా ఇబ్బంది పడతారా?



ఈ మధ్యన కాలసర్ప దోషం పూజలు కాళహస్తిలో ఎక్కువ చేస్తున్నారు మరి కాళహస్తి వెళ్లలేని వారి పరిస్థితి ఏమిటి? ఇది చాలా ఆలోచించవలసిన విషయమే. కాలసర్ప దోషం గురించి అతిగా భయపడవలసిన అవసరం లేదనే భావన. 1972 మరియు అతఃపూర్వం కాలసర్ప దోషం వున్న కాలంలో పుట్టిన వారి యొక్క జాతకములు మరియు అభివృద్ధి పరిశీలిస్తే, అభివృద్ధిలో వున్నవారు సాఫ్ట్‌వేర్ జాబ్స్ చేస్తూ బాగా సంపాదిస్తున్న వారు కనిపిస్తారు. కాలసర్ప దోషం కాలంలో పుట్టి నిత్యం వృద్ధి శాతంతో వున్నవారు మనకు ఎక్కువ మంది వున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు జాతక చక్రంలో వున్న గ్రహాలలో రాహుకేతువుల గురించి చరిత్ర పరిశీలిస్తే.. క్షీరసాగర మధన సమయంలో అమృతం తాగబోయిన రాహువు అనే రాక్షసుని శ్రీహరి తన యొక్క సుదర్శనంతో చీల్చివేయడంతో మొండెం క్రింద భాగం, మొండెం పై భాగం రాహు కేతువులు అయిరి. కాలసర్పదోషం అంటే రాహు కేతువుల మధ్యలో మిగిలిన రవి చంద్ర కుజ గురు శుక్ర శని గ్రహాలు ఒకపక్కన వుండి మరొక పక్కన అసలు గ్రహాలు లేకుండా ఉండడం. సరే బాగా జ్యోతిశ్శాస్త్రం రీసెర్చ్ చేసేవారు వారి అనుభవాలతో చెప్పే అంశాలు ఏమిటి అంటే రాహుకేతువుల మధ్య మాలికా యోగం (సప్తగ్రహ) అనగా వరుస ఏడు రాశులలో ఏర్పడితే అది ప్రమాదకరం అని రాహు కేతువులకు ఈ మాలికా యోగం వలన ప్రత్యక్ష సంబంధం కలగడం వంటివి ఏర్పడుతాయి. కావున ఇబ్బందికరం అని చెబుతారు. మిగిలిన విషయాలలో కేవలం కాలసర్పదోషం వలన జీవితం పాడయిపోతుంది. అభివృద్ధి వుండదు అనే భావన వాదన శాస్త్ర దూరమైన విషయమే. మిగిలిన గ్రహాలు వాటి స్థితి బాగుండకపోతే వచ్చే ఫలితాలు బాగుంటే వచ్చే ఫలితాలు గూర్చి పరిశీలింపక కేవలం కాలసర్ప దోషం వలన జాతకం పాడయిపోతున్నది అని చెప్పే సిద్ధాంతులు నేటి సమాజంలో ఎక్కువ వున్నారు. మీరు గతంలో కాలసర్ప దోషంలో పుట్టినవారు, వారి జీవన శైలి, స్టాటిస్టికల్ డేటా తీయండి. వృద్ధిలో మంచి స్థాయిలో ఉన్నవారు తప్పక గోచరిస్తారు. మరి ఈ భయంకర వాదనకు ఆధారం ఏమిటి? శాస్త్ర ఆధారం లేదనే చెప్పాలి. సరే ఇక శాంతి విషయం శ్రీకాళహస్తిలోనే చేయించాలా? అలాగని శాస్త్రంలో ఎక్కడా లేదు. 1990 దగ్గర్లో కొన్ని వాస్తు పుస్తకాలలో శ్రీకాళహస్తికి వాస్తుదోషం వున్న కారణంగా ఎక్కువ టూరిస్టులు రావడం లేదు అని రాసిన పుస్తకాలు ఉన్నాయి. అలాగే 1990 వరకు కాళహస్తికి భక్తుల రద్దీ తక్కువ అని స్థానికుల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. మరి మీడియా, టూరిజం శాఖ వారి ప్రభావంగా మరియు అప్పటికే అక్కడ వున్న విశేషమైన కాలసర్ప దోష విధానాన్ని పబ్లిక్‌లో బాగా ప్రచారం చేశారు. తద్వారా రాహు కేతు పూజ బాగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. అయితే కాలసర్ప దోష శాంతి కేవలం శ్రీకాళహస్తి మాత్రమే వెళ్లి చేసుకోవాలి అనడం శాస్త్ర విషయం కాదు. అసలు దోష శాంతి ఏమిటి? రాహు కేతువుల మధ్య మిగిలిన ఏడు గ్రహాలు చేరడం వలన వచ్చిన దోషం కావున శాంతి కోసం తొమ్మిది గ్రహాలకు జపం దానం హోమం తర్పణం చేయుట వైదిక ప్రక్రియ. తద్వారా దోష శాంతి చేకూరుతుంది. ఇది వైదీక విజ్ఞానం వున్న బ్రాహ్మణులు, నవగ్రహ మంటపం వున్న ప్రతి దేవాలయంలోనూ చేయించుకోవచ్చు. మన ఎండోమెంట్ వారు దీనిపై సరియగు దృష్టి చేకూర్చని కారణంగా అందరూ కాళహస్తి వెళ్లవలసి వస్తోంది. అలాగ కాకపోతే ఎవరి ఊరిలో వారు కాలసర్ప దోష శాంతి చేసుకోవచ్చు. ఇక కేవలం కాలసర్ప దోషమే జీవితం పాడు చేయదు అనుకున్నాం కదా. మరి కాలసర్పదోషమే ప్రధాన కారణంగా జరిగే నష్టాలు ఏమిటి అని పరిశీలిస్తే పంచాంగ గణిత ఫలితాంశాలు చెప్పే గ్రంథాలలో ‘్ధ్వజేపురోవర్తిని పృష్ఠ సంనే్థ విధుంతుదే మధ్య గతా గ్రహేంద్రాః/ తారాబిధా నాస్త్విహ కాల సర్వస్సస్యావనీ పాల వినాశహేతు’ గ్రంథాంతరం ‘అగ్రేకేతు రథో రాహుః సర్వే మధ్యగతా గ్రహః యోగోయం కాల సర్పాభ్యో నృపసస్య వినాశకృత్’ ఇలాగ కాలసర్ప దోషం జరిగే కాలంలో రాజులకు (పాలకులకు) అలాగే పంటలకు నాశనం కలుగును అని చెప్పబడినది. అందువలన కాలసర్ప దోషం కాలంలో దేశారిష్టము అనే అంశం సరిఅయినది. కేవలం కాలసర్ప దోషం మనిషి జీవితం పాడు చేస్తుంది అని కాలసర్పదోష శాంతి కేవలం కాళహస్తిలో మాత్రమే చేయించుకోవాలి అనే వాదనలు అపహాస్య వాదనలుగా గుర్తించమనవి. 1990 ముందు శ్రీకాళహస్తి కాలసర్ప దోష శాంతి అంతగా ప్రాచుర్యం లేని అంశాలు కావాలి అంటే పెద్దలను అడిగి తెలుసుకోండి.

Popular Posts