Followers

Friday 27 September 2013

వేదాలు మంత్రాల రూపంలో ఉంటాయి. 'మన్' ఎవరైతే వాటిని మననం చేస్తారో 'త్ర' వారిని కాపాడేవి మంత్రాలు



వేదాలు మంత్రాల రూపంలో ఉంటాయి. 'మన్' ఎవరైతే వాటిని మననం చేస్తారో 'త్ర' వారిని కాపాడేవి మంత్రాలు అని అంటారు. ఆ మంత్రాల లక్షణాలను బట్టి ఒక్కో పేరుతో వ్యవహరిస్తారు.

వేదం - నాలుగు భాగాలు

వేదం అంటే విజ్ఞాన శాస్త్రం. మన చుట్టూ ఉన్న ప్రకృతి లో ఎన్నో శక్తి విశేషాలు ఉన్నాయి. మనం బ్రతకాలంటే నీరు కావాలి, గాలి కావాలి, నిప్పు కావాలి, ఇలా ఎన్నో ఉంటే తప్ప మన జీవనం గడవదు. మనం తినే ఆహారం తయారు అవ్వడానికి ఈ భూమి సహకరించాలి. మట్టి ఒక్కటి ఉంటే సరిపోదు, సూర్యరశ్మి సోకితేనే అవి పెరిగి మనకు ఆహారంగా కాగలవు. నీరు వర్ష రూపకంగా అందాలి. మనకు అనారోగ్యం చేస్తే కావల్సిన ఔషదాలు మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఉంటాయి. ప్రకృతి లోని శక్తి విశేషాల గురించి తెలిపే వాటిని ఋగ్వేదం అని అంటారు.

ఆ శక్తి విశేషాలను మనం పొందాలంటే కొంత మనం చేయాల్సి ఉంటుంది. ఒక చెట్టుని పెంచాలంటే ముందు నేలని తవ్వాలి, శుద్ది చేయాలి, ఒక విత్తనాన్ని నానబెట్టాలి, అది మొలకెత్తాలి, అప్పుడు మొక్కను నాటి పెంచుతాం. ఏది ముందు చేయాలో, ఏది తరువాత చేయాలో అంటూ ఒక పద్దతి ఉంటుంది. ఇలా మనం ఫలితాన్ని పొందాలంటే ఏమేమి ఎట్లా చేయాలో నియమాలని తెలిపేది యజుర్వేదం.

మనం ఏదైనా కోరినప్పుడు మన చుట్టూ ఉన్న శక్తి విశేషాలని వాడుకుంటాం. అవి మనకు సహకరించాలి అంటే మనం వాటిని ఎట్లా పూజించాలి. వాటిని మెప్పించడానికి గానాత్మకంగా ఉన్న వాటిని సామ వేదం అని అంటారు.


ఋగ్వేదంలో చెప్పే విషయాలు ఎక్కువగా పరలోకానికి సంబంధించినవి ఉంటాయి. మనకు ఇహలోకం మరియూ పరలోకం రెండూ ప్రధానమే. ఈ లోకంలో  ఉండగా కొన్ని ఫలితాలు మనం కోరుకుంటాం. అట్లా మనం ఆచరించాల్సిన నియమాలు, పద్దతుల గురించి చెప్పే వాటిని ఆదర్వణ వేదం అని అంటారు.

అయితే అన్ని వేదాలను కలిపి చూస్తే అవి మనం ఆచరించాల్సిన ధర్మం గురించి తెలుపుతాయి. ఎట్లా ఆచరించాలి ? అంటే క్రమశిక్షణ తో ఆచరించాలి. మనకు వెంటనే ఫలితం రాకుంటే ఏం చేయాలి ? ఆపకూడదు, మన కృషి చేస్తూనే ఉండాలి. ఫలితం వస్తుందా ? అంటే తప్పక వస్తుంది. మనం అలవర్చుకోవాల్సింది ఈ లోకంపై , పరలోకం పై నమ్మకం మరియూ మనపై, భగవంతునిపై విశ్వాసం. వేదాలు మన ఆచరణ ఎట్లా ఉండాలో తెలుపుతాయి, దాన్నే ధర్మం అని అంటారు.

Popular Posts