Followers

Wednesday 28 August 2013

నిద్రో రక్షతి రక్షితః


చెప్పటానికి కాస్త చిత్రంగా ఉన్నా నిద్రో రక్షతి రక్షితః అన్న సూక్తిని సమర్థించు కోవచ్చు. నిద్ర ను జాగ్రత్తగా కాపాడుకొంటే ఆ నిద్రే ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుతుంది. నిద్ర కు ఉన్న బలం అదే. వాస్తవానికి నిద్ర అంటే జీవితంలో ఒక అత్యంత అవసరమైన అంశం అన్న మాట. శరీరమంతా నిద్ర లోనే తగిన విశ్రాంతిని పొందగలుగుతుంది. మెదడు, ఆవశ్యక అంగాలు తప్ప మిగిలిన అవయవాలన్నీ పూర్తిగా పనిచేయటం నిలిపివేసి విశ్రాంతినొందుతాయి.

రోజుకి ఎంత సేపు నిద్ర పోవాలి అనే దాన్ని ఏకరీతిన నిర్ధారించలేం. వయస్సు, ఆరోగ్య పరిస్తితుల్ని ద్రష్టిలో ఉంచుకోవాలి. ఆరోగ్యవంతమైన మనుషుల్లో రోజుకి7-8 గంటల పాటు నిద్ర అవసరం. పెద్ద వయస్సు వారు, చిన్నారుల్లో ఎక్కువ సేపు నిద్ర కావాల్సి ఉంటుంది. నిద్ర ద్వారా శరీరంలోని అవయవాలన్నీ రీ చార్జ్‌ అవుతాయి.ఎదుగుదల కు తోడ్పడే గ్రోత్‌ హార్మోన్‌ నిద్ర తో ముడివడి ఉంటుంది. అందుకే చిన్నారులు ఎక్కువ సేపు నిద్ర పోతారు. దీని వలన వారిలో గ్రోత్‌ హార్మోన్‌ ఎక్కువగా స్రావితం అవుతుంది. ఫలితంగా చిన్నారులు చక్కగా ఎదగగలుగుతారు. అందుకే పసికందులు 15-18 గంటల పాటు నిద్రలోనే ఉంటారు. ఎదిగే కొద్దీ ఈ సమయం తగ్గుతూ వస్తుంది. బడికి వెళ్లే పిల్లలకు 10-12 గంటల పాటు నిద్ర అవసరం. పెద్ద వాళ్లలో ముఖ్యంగా మహిళల్లో నిద్ర అవసరం చాలా కనిపిస్తుంది.

తగినంత నిద్ర లేకపోతే వ్యాధి నిరోధక శక్తి జనించదు. దీని వలన తేలిగ్గానే చిన్నా చితక రోగాల బారిన పడతారు. అంతేగాకుండా మెదడులో హార్మోన్‌ ల స్రావం దెబ్బ తింటుంది. పలితంగా చికాకులు, విసుగుదల పెరిగిపోతాయి. తెలియకుండానే శరీరం లోపల మైక్రో స్లీపర్లు రెడీ అవుతాయి. వీటి విడుదల వలన మగత గా తయారు అవుతుంది. దీని వలన సరైన నిర్ణయం తీసుకొనే శక్తిని కోల్పోతారు. చివరకు నిద్ర లేని లక్షణంతో డిప్రెషన్‌ కు లోనయ్యే అవకాశం ఉంటుంది.నిద్రను నిర్లక్ష్యం చేస్తే నిద్ర లేమికి గురయ్యే అవకాశం ఉంటుంది. కావాలని నిద్ర ను తప్పించుకొనే వారికి అది అలవాటుగా మారిపోతుంది. కొన్ని రోజులకు నిద్ర పోదామని అనుకొంటున్నా నిద్ర పట్టని స్థితి ఏర్పడుతుంది. అప్పుడు చింతించి ఉపయోగం ఉండదు. శరీరం లోపల రెండు రకాల గ్రంథులు ఉంటాయి.


నాళ గ్రంథులు (అంటే గ్రంథి నుంచి ఒక నాళం ఉంటుది) నుంచి ఎంజైమ్‌ లు స్రావితం అవుతాయి. వీటి ని జీర్ణ ప్రక్రియలో ఉపయోగిస్తారు. నిద్ర లేకపోవటం వలన ఈ స్రావం సరిగ్గా ఉండదు. నిద్ర సరిగ్గా లేకపోతే కొన్ని సార్లు జీర్న ప్రక్రియ మీద ప్రభావం చూపవచ్చు. వినాళ గ్రంథులు (అంటే నాళం లేకుండా ఉండే గ్రంథులు)హార్మోన్‌లను స్రవిస్తాయి. ఇవి నేరుగా రక్తంలోకి విడుదల అయి ఎక్కడ అవసరం ఉంటాయో అక్కడ పనిచేస్తాయి. వీటి విడుదలను మెదడు క్రమబద్దీకరిస్తుంది. సరిగ్గా నిద్ర లేకపోతే ఈ సమన్వయం తగ్గిపోయి సక్రమంగాహార్మోన్‌ల స్రావం ఉండకుండా పోతుంది. ఎక్కువ కాలం నిద్ర లేని అలవాటు తో ఒత్తిడి పెరిగిపోతుంది. ఇది రెస్టులెస్‌ కండీషన్‌ కు, డిప్రెషన్‌ కు దారి తీస్తుంది.

Popular Posts