Followers

Sunday 4 August 2013

పెళ్ళినాటి ప్రమాణాల పరమార్ధం

వ్యక్తి తానే కేంద్రబిందువుగా ఉండే స్థితినుంచి మరో వ్యక్తి కేంద్రబిందువుగా ఉండే స్థితికి ఎదిగే నిజమైన జీవిత యాత్ర వివాహంతోనే

పెళ్ళి


ఆరంభమవుతుంది. ఒక శిశువుకు తన కుటుంబము నుండి, పరిసరాల నుండి తన అంతఃచేతన ద్వారా అందిన నైతిక సూత్రాలనే బీజాలు వివాహం తరువాతనే మొలకెత్తి వేగంగా పెరగనారంభిస్తాయి. ప్రేమ, తన్మయత, త్యాగం, భక్తి, ఓరిమి మొదలైన సద్గుణాలు పూర్తిగా ఎదిగేందుకు వివాహ జీవితం ఎన్నో అవకాశాలను ఇస్తుంది. కుటుంబ జీవనంలో ఎదగడానికి వివాహ వ్యవస్థ అవసరం. ఈ భావాన్ని పెండ్లి కుమారునికి కలిగించడానికే వేదాలు ఇలా ప్రకటించమని అతనికి సలహా ఇస్తుంది.

ప్రియా! ఆవాహనం చేయబడిన దేవతల సన్నిధిలో, మన జీవితంలోని పవిత్ర సందర్భంలో, నీ పాణిగ్రహణం చేస్తున్నాను. ఆశీర్వదించబడిన ఓ స్త్ర్రీ రత్నమా! దీర్ఘకాలం నా జీవిత భాగస్వామిగా ఉండు. నా కుటుంబ బాధ్యతలను నీ కప్పగిస్తున్నాను. సంతోషముగా నీ బాధ్యతను నెరవేర్చు. పవిత్రమైన ఈ ప్రమాణం దైవసన్నిధిలో పెండ్లి కుమారుడు చేసే ఆ క్షణం నిజానికి ఎంతో ఆనందకరమైనది. ఆ రోజే ఇంటి బాధ్యతల విభజన జరుగుతుంది. జీవనోపాధి సంపాదనకు భర్త బాధ్యత వహిస్తే, గృహనిర్వహణను భార్య నిర్వహిస్తుంది. ఇద్దరూ శ్రధగా తెలివిగా తమ భాధ్యతలను నిర్వహించినప్పుడే వివాహ జీవితం సఫలమౌతుంది. పవిత్రమైన హిందూ వివాహంతో జీవితంలో పరీక్ష మొదలౌతుంది. కనుక చేసిన ప్రమాణాలకు పూర్తిగా కట్టుబడి ఉన్నప్పుడే వైవాహిక జీవితం అర్ధమవుతుంది.

త్యాగం, నిష్టల నిర్వహణయే నిజమైన జీవితానికి మార్గదర్శకమౌతుంది. వివామాహోత్సవంలో చేసిన ప్రమాణాన్ని పూర్తిగా పాటించినట్లయితే, వైవాహిక జీవితంలో స్వర్గ సుఖాన్నిచ్చే వాతావరణాన్ని వ్యక్తి సృష్టించుకోగలుగుతాడు. నిజానికి భార్య భాగ్యాధి దేవతయైన లక్ష్మి అవతారమే. ఈ సంపద లేకపోతే మానవజీవితం సారవిహీనం, అనాకర్షణీయం అవుతుంది. పెండ్లికుమారుని ఈ ప్రకటనలో ఎంతో నిజం ఉంది. నీవు లక్ష్మివి. నీవులేని నేను ధనహీనుడను. నీవులేకపోతే నా జీవితంలో ఆనందమేలేదు. ఓ అందాలరాశీ! మన కలయిక సామవేదం, దానిలోని మంత్రం; అది భూమి, ఆకాశాల కలయిక వంటిది. పై వైదిక మంత్రంలో ఋషి వివాహానికి ఒక మంచి వివరణ ఇచ్చారు. వివాహ వ్యవస్థ ఒక వ్యక్తికి సంబంధించినది మాత్రమే కాదు. పూర్తి సంఘానికి సంబంధించినది. వివాహాలు ప్రమాణాలకు కట్టుబడే, పవిత్రత ముద్రను పొందలేవు. అందువల్ల ప్రతి జంటా తమ సాంఘికబాధ్యతలను గుర్తెరగాలి.

తరతరాల శక్తినీ, సార్వభౌమాధికారాన్నీ, గౌరవాన్నీ యధాతధంగా నిలుపుతామనే ప్రమాణమే వివాహం. పురాణాలలో చెప్పబడిన శ్లోక సారంశం ఇది -

వివాహ ముఖ్యోద్దేశం - పస్పర ప్రేమమయ జీవితం గడుపుతూ, దేశానికి నీతివంతులైన, శ్రేష్ట సంతానాన్ని అందించడం. పిల్లలకు జన్మనిచ్చి వంశవృక్షాన్ని నిలపడమే వివాహానికి ముఖ్య ఉద్దేశం. ప్రేమలోని ఘాడతను గుర్తిస్తూ కుటుంబాన్ని ఆనందంతో, ఐక్యంగా ఉంచడం కోసమే వివాహం. ఇతరుల మంచికోసం ఆత్మసమర్పణా భావాన్ని కలిగి ఉండి, నిజమైన జీవిత గమ్యాన్ని చివరికి గుర్తించగలగడమే. యదార్ధానికి వివాహం యొక్క పవిత్రోద్దేశం. స్త్రీ పురుష వివక్షత అనే అసాంఘిక ద్రుష్టిని విడనాడాలి. పరిపూర్ణ మైన ఆనందమయ జీవితాన్ని పొందడానికి ఆధారాన్ని వివరించిన మంత్రసారం ఇది -

పరిపూర్ణమైన ప్రేమ, అభిమానాలతో కూడిన ఉత్తమమైన జీవితాన్ని మనం గడప గలగాలి. మన భావాలు పవిత్రంగా ఉండాలి. శత సంవత్సరాలు ఆరోగ్యకరమైన జీవితాన్ని చూస్తూ, వసంతఋతు సంగీతాన్ని వింటూ, జీవించగలగాలి. భార్యాభర్తల ఐక్యత, ప్రేమ, సాన్నిహిత్యాలే వారి ఆనందమయ వివాహ జీవితానికి ఆధారాలు. కనుక వివాహాన్ని శారీరక ఆనందాన్ని ఇచ్చేదిగా కాక, జీవితాంతం వుండే సాంఘిక, ఆత్మ సంబంధమైన బాధ్యతగా గుర్తించాలి. జీవిత భాగస్వాములైన ఇద్దరు వ్యక్తులకు ఆత్మ భాగస్వాములుగా ఎదిగే అవకాశం కల్పించేదే వైవాహిక జీవితం.

Popular Posts