Followers

Monday 22 July 2013

తెలుసుకోర మానవుడా...!

కష్టం కలిగినప్పుడు కనిపించని వేలుపుకి ఎన్నో మొక్కులు మొక్కుకుంటాం. పూజలు, పునస్కారాలు చేస్తాం. ఇవ్వన్నీ మనం ఎదిగి జ్ఞానవంతులమయ్యాకా ఏర్పడే భక్తి భావాలు. వీటిని చిన్నతనం నుంచీ పాదుకొల్పేది తల్లి. ఇష్టదైవాన్ని మనసారా వేడుకుంటే, జీవితాంతం మనకి ఆయన తోడుగా ఉంటాడు. కలియుగంలో మానవులు విషయలోలురై ప్రకృతి ధర్మాలకి విరుద్ధంగా నడుచు కుంటారని తెలిసిన ఆ భగవంతుడే, అందుకు తరుణోపాయాన్ని కూడా సూచించాడు. ‘కలియుగే స్మరణా న్ముక్తిః’ అని, కేవలం కలియుగంలో తనను స్మరించినంత మాత్రం చేతనే ముక్తిని ప్రసాదిస్తానని చెప్పాడు. కేవలం ఆయన నామజపం చేసి, పాపాలు తొలగిపోయాయి అనుకుంటే పొరపాటే, అయితే మనసా, వాచ, కర్మణా ఆయనకి దాసోహం చేసి ఆ పరమేశ్వరుణ్ణి స్మరిస్తూవుంటే, కష్టాలు తొలగి ముక్తి కలుగు తుందని సద్గురువులు బోధిస్తున్నారు.

Neeaఅలాంటి సద్భక్తిని పొందడానికి కొన్ని నియమాలు ఆచరించాలి. మంచి ఆలోచనలతో, మంచి పనులు చేస్తూ అందరియందు సమభావాన్ని కలిగివుండాలి. ప్రకృతి ధర్మాల్ని పాటిస్తూ, గురువు ద్వారా జ్ఙానాన్ని సముపార్జించాలి. అప్పుడు ఆ గురువు చేసే మంత్రోపదేశంతో ఆ భగవంతుని అనుగ్రహం పొందడానికి వీలవుతుంది. గురువు సాక్షాత్‌ పరబ్రహ్మస్వరూపుడు. కనుక భగ వంతుని దర్శించే మార్గం గురుశుశ్రూష వల్ల కలుగుతుంది. అందుకనే, ‘గురుర్భ్‌హ్మ, గురుర్విష్ణుః, గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్‌ పరబ్రహ్మ , తసై్మఃశ్రీగురవే నమః’ అని గురువుని పరమేశ్వరునిగా భావించాలన్నారు.అయితే పుట్టిన ప్రతి మనిషికీ ప్రధమ గురువు తల్లి. బుల్లి బుల్లి పదాలు నేర్పుతూ, అవి పలుకుతుంటే విని ఆనందపరవశి అవుతుంది. బుడి బుడి అడుగుల్లో తప్పటడుగుపడి, పడిపోకుండా చిటికిన వేలితో నడిపిస్తుంది. 

ఇవే జీవితంలో మనం నేర్చుకునే మొదటి పాటాలు. ఆ తరువాత చిన్న చిన్న దేవుడి శ్లోకాలు నేర్పుతూ భగవంతుని పట్ల ఆసక్తిని, అనురక్తినీ కలిగిస్తుంది. ఎదుగుతున్న కొలదీ నడవడిని గమనించి మందలించి మంచిదారిలో పెడుతుంది. ఇలా ప్రధమ జ్ఞాన సంపదని గురువులా అందిస్తుంది. తండ్రి క్రమశిక్షణ, ఔన్న త్యాన్ని పెంపొందించు కోవడం, మంచి భవిష్యత్తు సముపార్జించడం ఎలాగో నేర్పుతాడు. అందుకే గురు పరంపరలో ద్వితీయ స్థానం తండ్రికి దక్కుతుంది. ఇక జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందించి చక్కటి బాటని ఏర్పరచేవాడే సద్గురువు. కనుక ఈ కలియుగంలో తల్లిదడ్రుల్ని మొదటగా పూజించి, గౌరవించినా ఆ భగవంతుడు మరింత సంతోషభరితుడై మనల్ని శీఘ్రంగా అనుగ్రహిస్తాడు. అందుకే కుమార శతక కారుడు కూడా తల్లి విలువని పదిరెట్లు చేసాడు. 

తనకు విద్యాభ్యాసం
బును జేసినవానికన్న బొలుపుగ బదిరె
ట్లను దూగు దండ్రి వానికి
జననీయు బదిరెట్లు దూగు జగతి కుమారా!


అంటూ, విద్యాభ్యాసం చేసే గురువు కన్నా తండ్రి పదిరెట్లు తూగుతాడు. తండ్రికన్నా, తల్లి పదిరెట్లు తూగుతుందని నిక్కచ్చిగా చెప్పాడు కుమార శతక కారుడు. విఘ్నేశ్వరుడంతటి వాడు తల్లిదండ్రులకి ప్రదక్షిణ గావించి లోకాలన్నిటినీ చుట్టివచ్చిన ఫలితాన్ని పొందాడు. గణాధిపత్యాన్ని పొందాడు. అందుకే మనకి ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులే.

Popular Posts