Followers

Sunday 19 May 2013

కైలాస దర్శనం: మానసరోవర యాత్ర(ManasaSarovara Yathra)



సర్వజగత్తునూ నడిపించే లయకారుడు పరమ శివుడు. భక్తసులభుడిగా పేరు తెచ్చుకున్న ఆ భోళా శంకరుడి ఉండేది కైలాసంలో. హిమాలయాల్లోనే ఈ కైలాసం ఉందన్నది భక్తుల విశ్వాసం. ఆ పర్వతాన్ని దర్శించుకుంటే వచ్చే అనుభూతి మాటల్లో వర్ణించలేదని.. పదాలకు అంతుచిక్కనిది. ఒక్కసారి కైలాసగిరిని దర్శించుకుంటే.. సర్వపాపవిమోచనం కలుగుతుంది. అంత పవిత్రమైన స్థలం.. కైలాసపర్వతం. ఆ కైలాసం విశ్వాంతరాల్లోనో, పాతాళలోకంలోనే లేదు.. భూమిపైనే ఉంది. శివపార్వతులు అక్కడే కొలువై ఉన్నారు. ప్రమథగణాలతో ఈ లోకాన్ని పాలిస్తున్నారు. పరమపవిత్రమైన హిమాలయాల్లో.. దేవాదిదేవతలు కొలువైన మంచుకొండల మధ్యలో... ఈ భూలోక కైలాసం ఉంది. అదే.. హిమాలయ పర్వతాల్లోని కైలాస శిఖరం. కేవలం మహాశివుడు మాత్రమే కాదు.. అక్కడికి వెళితే మహాలక్ష్మితో సేవలందుకుంటూ పాలసముద్రంలో పవళించిన విష్ణుమూర్తి దర్శనమూ లభిస్తుంది. బ్రహ్మమనస్సు నుంచి ఉద్భవించిన పరమపవిత్రమైన సరోవరమూ ఇక్కడ ఉంది. దేవతలు స్నానమాచరించే, ఈ పవిత్ర జలాల్లో ఒక్క మునకేసినా... పాపలన్నీ నశించి.. ఎంతో పుణ్యాన్ని దక్కించుకున్నవారవుతారు. కైలాస పర్వతంపైనే మహాశివుడి నివాసం ఉందని పురాణాలు చెబుతున్నాయి. తరతరాలుగా భక్తుల నమ్మకం కూడా అదే. అందుకే, భోళాశంకరుడి దర్శనం కోసం ఎన్నో కష్టాలకు ఓర్చి మానససరోవర యాత్రను చేస్తుంటారు. ఈ యాత్ర చేయాలంటే, డబ్బు మాత్రమే ఉంటే సరిపోదు. అంతకు ముంచి ఆధ్యాత్మిక బలం, సంకల్పం ఉండాల్సిందే. ఇంకా చెప్పాలంటే మహాశివుడి కటాక్షం లేనివారికి ఈ యాత్ర చేయడం దుర్లభమే.  శివ భగవానుడే కాదు, ఆయన వాహనమైన నందీశ్వరుడు, విఘ్నాలకు అధిపతి గణపతి, దేవతల సేనాధిపతి కుమారస్వామి కైలాస పర్వతంపై దర్శనమిస్తారు. సూర్యభగవనాడు భక్తితో అర్పించే కిరణాలు... కైలాస శిఖరాన్ని తాకగానే... వెండికొండ కాస్తా బంగారు మయమై.. శోభిస్తుంది. ఆ దర్శనం జన్మజన్మల సుకృతం. సముద్ర మట్టానికి 22 వేల 778 అడుగుల ఎత్తులో ఉందీ భూలోక కైలాసం. ఇక్కడికి వెళ్లిన ప్రతీఒక్కరినీ శివరూపదర్శనం లభిస్తుందన్నది భక్తుల విశ్వాసం. అడుగడుగునా ఆధ్యాత్మికత పరుచుకున్న ఈ అందమైన శిఖరాన్ని దర్శించుకుంటే దొరికే అనుభూతి.. దేన్ని చూసినా రాదంటారు శివభక్తులు. మౌంట్ కైలాస్‌ భూలోకంలో ఉన్న ఓ అద్భుతమనే చెప్పాలి. ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో రహస్యాలు ఈ పర్వతం చుట్టూ దాగిఉన్నాయి. నాలుగువైపులా నాలుగు రంగుల్లో కనిపించడం కైలాస పర్వతానికి ఉన్న మరో ప్రత్యేకత . అందుకే.. హిమాలయాల్లోనే అత్యంత అరుదైన పర్వతంగా పేరుగాంచింది.. మహాశివుడికి నివాసం అయ్యింది కైలాసగిరి. ఎన్నో వ్రతాల ఫలాన్నిచ్చే మానససరోవరం.. పాపప్రక్షాళన చేసే కైలాస పర్వతాన్ని దర్శించుకునే మహద్భాగ్యాన్ని కల్పిస్తుంది మానససరోవర యాత్ర. కైలాసయాత్ర కైలాస్ మానసరోవర్ యాత్రను రెండు రకాలుగా చేయవచ్చు. మొదటిది కేంద్ర ప్రభుత్వం ద్వారా అయితే.. ప్రైవేటు టూర్ ఆపరేటర్ల ద్వారా వెళ్లడం రెండో పద్దతి. ।ప్రతీ ఏడాది జూన్‌ 9 నుంచి సెప్టెంబర్ 9 మధ్య కొద్ది మందిని మాత్రమే ప్రభుత్వం ఈ యాత్రకు అనుమతిస్తుంది. ఈ ఏడాది వెయ్యా 80 మందికి మాత్రమే అవకాశం దక్కనుంది. వీరిని 60 మంది చొప్పున 18 బృందాలుగా విభజించి యాత్రకు పంపిస్తుంది. దీనికోసం ఇప్పటికే షెడ్యూల్‌ విడుదలయ్యింది. ఆన్‌లైన్‌లో అయితే, మార్చి నాలుగో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ నింపడం పూర్తైన తర్వాత ప్రింటవుట్ తీసుకుని మార్చి 11 వ తేదీ లోగా విదేశీ మంత్రిత్వ శాఖకు సమర్పించాలి. నేరుగా దరఖాస్తు చేసుకునేవారికి కూడా మార్చి పదకొండే ఆఖరు తేది. రానుపోను 27 రోజుల పాటు సాగే మానసరోవరయాత్రకు ఎన్నో రకాలుగా సిద్దం కావాల్సి ఉంటుంది. చైనా వీసాతో పాటు, ఆరోగ్యపరీక్షలు చేసుకోవడానికి రెండు మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండాల్సి ఉంటుంది. సముద్రమట్టానికి దాదాపు 20వేల అడుగుల ఎత్తున పర్వతాలపై నడవాల్సి ఉంటుంది కాబట్టి, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవాళ్లకే అనుమతి లభిస్తుంది. గుండెజబ్బులు, రక్తపోటు, శ్వాససంబంధ సమస్యలతో బాధపడేవారు ఈ యాత్ర చేయడానికి అనర్హులు. వైద్యపరీక్షల్లో అర్హత సాధించినవారికి ఢిల్లీ నుంచి యాత్ర మొదలవుతుంది. పగలు ప్రయాణం రాత్రి పూట విశ్రాంతి పద్దతిలో ఈ యాత్ర సాగుతుంది. మూడోరోజు దార్‌చులాకు చేరుకుంటారు. 25 కిలోలకు మించి లగేజ్‌ను మోసుకు వెళ్లడానికి ఇక్కడినుంచి అనుమతి ఉండదు. గుర్రాలను, పోర్టర్లను అద్దెకు కావాలంటే.. ఇక్కడే డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. నాలుగోరోజు ప్రయాణం మొదలై.. నారాయణస్వామి ఆశ్రమానికి చేరుకుంటుంది. అక్కడి నుంచి ట్రెక్కింగ్ మొదలవుతుంది. ఆ తర్వాత మూడు రోజుల పాటు టెక్కింగ్ చేసిన యాత్రికులు గుంజి అనే గ్రామానికి చేరతారు. పచ్చని ప్రకృతి అందాలు, కాళీ నది పరవళ్లు.. పర్వతాలను ముద్దాడుతున్నట్లు కనిపించే మేఘాల మధ్య ఎంతో ఆహ్లాదభరితంగా సాగుతుందీ యాత్ర. ట్రెక్కింగ్ చేయడం వల్ల వచ్చే అలసటను ఈ ప్రకృతి అందాలు మాయం చేస్తుంటాయి . మధ్యలో ఎదురయ్యే గ్రామాల్లో స్థానికులు యాత్రికులకు ఘనంగా స్వాగతం పలుకుతుంటారు. ఏడో రోజుకు యాత్ర గుంజి గ్రామానికి చేరుతుంది. మంచుతో కప్పబడిన పర్వతాలు ఇక్కడ సమనోహరంగా కనిపిస్తాయి. సూర్యకిరణాలు పడగానే బంగారు రంగులో ప్రకాశిస్తూ.. అచ్చెరువొందిస్తాయి. రెండు రాత్రుళ్లు గుంజిలోనే గడపాల్సి ఉంటుంది. ఎనిమిదో రోజు ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్ అధికారులు యాత్రికులకు మళ్లీ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో ఫిట్‌గా ఉన్నారని తేలినవారికే.. ముందడుగు వేయడానికి అనుమతి లభిస్తుంది. అనారోగ్యంతో ఉన్నవారిని వెనక్కి పంపించేస్తారు. తొమ్మిదో రోజు గంజి నుంచి ప్రయాణం నవీడాగ్‌ అనే ప్రాంతానికి సాగుతుంది. మధ్యలో వ్యాసమహర్షి గుహ కనిపిస్తుంది. ఇక్కడే ఆయన మహాభారతాన్ని రచించారట. నవీడాగ్ చేరుకున్నాక.. ఓం పర్వత దర్శనం లభిస్తుంది. అయితే.. ఎప్పుడూ మేఘాలు ముసురుకుని ఉండే ఈ పర్వతంపై ఓం ఆకారాన్ని చూడాలంటే, ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. పర్వతాల మధ్య ఓం రూపంలో కనిపించే ఆకారం.. ప్రతీఒక్కరిలో ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తుంది. నవీడాగ్ నుంచి టిబెట్ సరిహద్దు ప్రాంతమైన లిపులేక్ వరకూ మరుసటి రోజు ట్రెక్కింగ్ సాగుతుంది. మంచుపై నడుస్తూ యాత్రికులు ఎంతో జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. టిబెట్ సరిహద్దు దాటిన తర్వాత, తటలా కోట్‌కు బస్సులో ప్రయాణం సాగుతుంది. ఆ తర్వాతి రోజు, అక్కడి వాతావరణానికి అలవాటు పడడానికి తటలా కోట్‌లోనే బస చేయాల్సి ఉంటుంది. పన్నెండో రోజు.. కైలాస పర్వతం బేస్ క్యాంప్ అయిన డార్చెన్‌ కు యాత్ర మొదలవుతుంది. మధ్యలో రాక్షసతాల్ అనే సరస్సు ఎదురుపడుతుంది. మానసరోవరానికన్నా ముందు కనిపించే సరస్సిది. శివ కటాక్షం కోసం రావణాసురుడు ఇక్కడే తపస్సు చేశాడని ప్రతీతి. కైలాస పర్వతం యాత్రికులకు తొలిసారి ఇక్కడి నుంచే కనిపిస్తుంది. కొండలమధ్య మహాశివలింగం కొలువైనట్లు కనిపించే.. ఆ దృశ్యం చూడగానే, యాత్రికులు అంతవరకూ పడ్డ అలసట మాయమైపోతుంది. కైలాస శిఖరం దగ్గరకు ఎప్పుడెప్పుడు చేరుకుందామా... అన్న ఆతృత పెరుగుతుంది. కాస్త ముందుకు వెళ్లగానే.. అతిమనోహరమైన మానసరోవరం దర్శనమిస్తుంది. సూర్యకాంతి పడి నక్షత్రాలు నేలకు దిగినట్లు కనిపించే దృశ్యం.. యాత్రికులను మదిని పులకరింపచేస్తుంది. డార్చెన్‌కు చేరుకున్న యాత్రికులు.. పవిత్రమైన మానసరోవరం స్నానమాచరించి.. మరుసటి రోజు కైలాస్ పరిక్రమకు సిద్ధమవుతారు. ఇలా ప్రభుత్వం ద్వారా డార్చెన్ చేరుకోవాలంటే.. పన్నెండు రోజుల పాటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇంత సుదీర్ఘ యాత్ర చేయలేని వారి కోసం ప్రైవేటు సంస్థలు మానసరోవరయాత్రను అందిస్తున్నాయి. నేపాల్ రాజధాని ఖాట్మండు మీదుగా సాగే ఈ యాత్ర ద్వారా అయితే, ఐదు రోజుల్లోనే మానససరోవర్‌కు చేరుకోవచ్చు. అయితే, చిన్నపాటి విమానాల ద్వారా ఈ యాత్రంతా సాగుతుంది. వాతావరణం అనుకూలించకపోతే, యాత్రకు మధ్యలోనే అడ్డంకులు ఏర్పడవచ్చు. పరిక్రమంతో పుణ్యం  కైలాస పర్వతాన్ని, మానసరోవరాన్ని వేరువేరుగా చూడలేం. హిమాలయాల్లో ఉన్న ఈ రెండు ప్రాంతాలు పరమపవిత్రమైనవి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కైలాస పర్వతాన్ని చూస్తే.. అమరేశ్వరుడిని చూసిన అనుభూతే కలుగుతుంది. గడ్డకట్టే చలిలో.. మంచు పర్వతాల మధ్య.. ఎప్పుడూ స్వచ్చమైన నీళ్లతో కనిపించే మానసరోవరం.. అందరికీ మిస్టరీలానే ఉంటుంది. అందుకే, అటు కైలాస పర్వత పరిక్రమను, మానసరోవర పరిక్రమనూ పూర్తి చేసి పుణ్యం కట్టుకుంటారు భక్తులు. కైలాస పర్వత పాదభాగంలో ఉన్న డార్చెన్ నుంచి యాత్రికులు ముందుగా మానసరోవర పరిక్రమను మొదలుపెడతారు. బ్రహ్మమానస సరోవరాన్ని చుట్టూ తిరిగి రావడానికి మూడు రోజుల సమయం పడుతుంది. తొలిరోజు డార్చెన్ నుంచి కుహు కు.. రెండో రోజు కుహూ నుంచి కుగుకూ యాత్ర సాగుతుంది. కుగు నుంచి చూస్తే.. మానసరోవరం, కైలాసపర్వతం కలిసి ఉన్నట్లే కనిపిస్తాయి. ఇదో అద్భుతమైన దృశ్యం. అంతేకాదు.. ఒక్కోసారి కైలాస శికరం నుంచి కాంతిపుజం మానస సరోవరంలోకి ప్రవహిస్తున్నట్లు కూడా కనిపిస్తుంది.. తిరిగి డార్చెన్‌కు చేరుకోవడంతో మానసరోవర పరిక్రమ ముగుస్తుంది. భూమ్మీద మరెక్కడా కనిపించని స్వచ్చమైన నీరు.. కేవలం మానసరోవరంలో మాత్రమే కనిపిస్తుంది. గంటగంటకూ ఒక్కో తరహాలో కనిపించే సరోవరం పర్యాటకులకు అంతులేని అనుభూతిని కలిగిస్తుంది. ఆ తర్వాత రోజు డార్చెన్ నుంచి కైలాస పరిక్రమ మొదలవుతుంది. కైలాసనాథుడి కొలువైన పర్వతాన్ని చుట్టిరావడానికి మూడురోజుల సమయం పడుతుంది. మొత్తం యాత్రలో అత్యంత కష్టమైన ప్రయాణమిది. యమద్వారం మీదుగా తొలిరోజు భక్తులు నడకసాగిస్తారు. ఈ ద్వారాన్ని దాడటం ద్వారా మృత్యుభయం తొలిగిపోతుందని విశ్వసిస్తారు. ఆ తర్వాతే, బ్రహ్మపుత్ర నది దర్శనమిస్తుంది. కైలాసపర్వతంపైనే బ్రహ్మపుత్ర నది జన్మస్థలం ఉంది. దీంతో పాటు గంగ, సింధు, సట్లైజ్ నదులు కూడా ఇక్కడే పుట్టి దక్షిణాసియాను సస్యశ్యామలం చేస్తున్నాయి. అది మహాశివుడు మానవాళికిచ్చిన మహా ప్రసాదం. కష్టమైన దారిలో జాగ్రత్తగా నడుస్తూ.. కైలాసగిరి అందాలను చూస్తూ.. ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగుతారు శివ భక్తులు. మధ్యలో బ్రహ్మపుత్రానదిని దాటాల్సి ఉంటుంది. ఆ తర్వాత డేరాపుక్ క్యాంప్ వస్తుంది. అప్పటికే సాయంత్రం అయిపోతుంది. కైలాస పర్వత శిఖరం.. ఇక్కడికి అత్యంత సమీపం నుంచి కనిపిస్తుంది. వాతావరణం త్వరత్వరగా మారిపోతుంటుంది. కైలాస శిఖరం కూడా దానికి తగ్గట్లే రంగులు మార్చుతూ, యాత్రికులను భక్తపారవశ్యంలో ముంచెత్తుతుంది. డేరాపుక్ నుంచి డోల్మా పర్వతం మీదుగా యాత్ర సాగుతుంది. ఈ దారి దారి చాలా క్లిష్టంగా ఉంటుంది. సముద్రమట్టానికి దాదాపు 20 వేల అడుగుల ఎత్తున ఉండడం కారణంగా ఆక్సిజన్ సరిగా అందదు. శివనామస్మరణ చేస్తూ, భగవంతుడిపైనే భారం వేసి ముందుకు కదులుతారు యాత్రికులు. ఆ శివనామ స్మరణే.. భక్తులకు కావాల్సిన శక్తిని అందిస్తుంది. మధ్యలో గౌరీకుండ్ కనిపిస్తుంది. ఎమరాల్డ్‌ లా కనిపించే ఈ కొలనులోనే పార్వతీదేవి స్నానమాచరిస్తుందట. కొండల నడుమ కనువిందు చేస్తుందీ ప్రాంతం. జోంగ్‌ జెర్బును చేరుకోవడంతో ఆరోజు యాత్ర ముగుస్తుంది. ఆ తర్వాతి రోజు.. అక్కడి నుంచి డార్చెన్‌కు ప్రయాణం సాగడంతో కైలాస పరిక్రమ ముగుస్తుంది. ఈ యాత్రలో నాలుగు వైపులా నాలుగు రకాలుగా కనిపిస్తుంది కైలాస పర్వతం. ఒక వైపు నుంచి చూస్తే స్ఫటికంలా కనిపిస్తుంది. ఇంకో వైపు నుంచి చూస్తే బంగారు వర్ణంలో మెరుస్తుంది. మూడో వైపు రూబీలాగా, నాలుగో వైపు నీలం రాయిగా సాక్షాత్కరిస్తుంది. ఇక నాలుగు వైపులా నాలుగు రూపాలు భక్తులకు దర్శమనిస్తాయి. హయగ్రీవ రూపమైన గుర్రం, పార్వతీ దేవి వాహనమైన సింహం, వినాయకుడికి ప్రతిరూపమైన ఏనుగు, కుమారస్వామి వాహనమైన నెమలి రూపాలు కనిపిస్తాయంటారు భక్తులు. ఇవన్నీ ఈశ్వర స్వరూపానికి ప్రతీకలే పరమపవిత్రమైన కైలాస శిఖర పరిక్రమే భక్తులు పరిమితమవుతారు తప్ప, శిఖరాన్ని అధిరోహించడానికి ఎవరూ ప్రయత్నించారు. పదో శతాబ్ధంలో ఓ బౌద్ధగురువు శిఖరాధిరోణ చేసినట్లు చెప్తారు. ఆ తర్వార ఎవరికీ ఇది సాధ్యం కాలేదు. ఈ విషయంలో చైనా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అత్యంత ఎత్తైన ఎవరెస్టును ఎంతోమంది ఎక్కగలిగారు గానీ, కైలాస పర్వత అంచును మాత్రం ఎవరూ చూడలేకపోయారు. అందుకే, ఇది మహాఅద్భుతంగా మిగిలిపోయింది. కైలాస,మానసరోవర పరిక్రమ యాత్రను పూర్తి చేసుకున్నవాళ్లకు ఎంతో పుణ్యాన్ని, అంతులేని ఆధ్యాత్మిక అనుభూతులను మూటగట్టుకుని తిరుగు ప్రయాణవుతారు.

Popular Posts