Followers

Thursday 30 May 2013

నిద్రించేటప్పుడు తూర్పున తలబెట్టుకోవడం ఆరోగ్యప్రదం!



సుఖదుఃఖాలు నిద్రపై ఆధారపడి ఉన్నాయి. పగలంతా ఇంద్రియాలు పనిచేసి అలసిపోయి ఉంటాయి. కాబట్టి వాటికి విశ్రాంతి అవసరం. నిద్రకుమూలం తమోగుణం. కడుపునిండా భుజిస్తే కంటినిండా నిద్రవస్తుంది. సహజంగా రాత్రి పూట నిద్రవస్తుంది. అంతేకాకుండా మనం భుజించిన ఆహారం రసంగా మారి శరీరంలోని మార్గాలను అడ్డుపడి ఇంద్రియాలను పనిచేయనీదు.   కాబట్టి నిద్ర వస్తుంది. నియమానుసారం నిద్రపోవలె. భుజిస్తూనే నిద్రపోరాదు. కనీసం 2 గంటలైనా వ్యవధి ఉండవలె. ఆరోగ్యవంతుడికి 6గంటలు నిద్ర పరిమితం. అంటే రాత్రి 10గంటలకు పరుండవలెను. తెల్లవారుజామున 4గంటలకు లేవవలెను. వృద్ధులకు 5గంటలు చాలు. ఇంతకంటే ఎక్కువకాలం నిద్రపోవడం సోమరితనం.   పరుండునప్పుడు భగవంతుని ధ్యానించి పరుండవలెను. అంతకుమునుపు తనదిన చర్యను మననం చేసుకొనవలెను. గుణదోషాలను విశ్లేషించుకొనవలెను. ఆ దోషములు తిరిగి చేయకుండవలెను. అప్పుడే భగవదను గ్రహానికి పాత్రుడౌతాడు.  పగటినిద్ర ఆరోగ్యానికి భంగం చేస్తుంది. కావున పగలు నిద్రపోరాదన్నారు. రాత్రి నిద్రబట్టనివారు, అనారోగ్యంతో బాధపడేవారు పగలు నిద్రపోవచ్చు. వేసవి కాలంలో పగలు నిద్రించవచ్చు. నిష్కారణంగా పగలు నిద్రపోతే తలనొప్పి, ఒళ్లు నొప్పులు, తలతిరగడం, జ్వరం వచ్చినట్లుండడం. బుద్ధి పనిచేయకపోవడం, కఫం పెరగడం. ఆకలి తగ్గిపోవడం, కామెర్లు మొదలైన జబ్బులు వచ్చే అవకాశముంది. కాబట్టి ఆరోగ్యవంతులు పగలు నిద్రించకుండడం మంచిది.  రాత్రి 10గంటలకు పడుకుంటే గాఢనిద్రపట్టుతుంది. అలవాటుచేసుకుంటే 4 గంటలకు లేవవచ్చును. లేచేటప్పుడు భగవంతుని ధ్యానించవలెను. భగవధ్యానంలో నిద్రమేల్కొన్న ఆ దినమంతా శుభ్రంగా గడుస్తుంది.  నిద్రించేటప్పుడు తూర్పు తలబెట్టుకోవడం ఆరోగ్యప్రదం. అంతేకాక అన్ని విధాలమంచిది. అది దేవతల దిక్కు. దేవతలుండేవైపు తలబెట్టి పడుకొంటే వారి అనుగ్రహం కలుగుతుంది. దక్షిణము తలబెట్టుకొని పడుకోవడం ఆరోగ్యం బాగుంటుంది. పడమటివైపు ఉత్తరంవైపు ఎప్పుడు తలబెట్టుకొని నిద్రించరాదు. ప్రత్యగుత్తదశిరాశ్చనస్యపితి.   పడమట, ఉత్తరంవైపు తల పెట్టుకొని నిద్రించరాదని వైఖాసనగృహసూత్రం నిషేధించింది. పురాణాలు నిషేధించాయి. మెదడుకు కీడు కలిగించే అలలు ఉత్తరంవైపునుండి దక్షిణంవైపుకు ప్రసరిస్తున్నాయని సైన్సు చెబుతోంది కావున నిషేధించారు. శవము తలను ఉత్తరంవైపుకు పెడతారు. ప్రాచీహి దేవానాందిన్, తూర్పు దేవతలదిక్కుకావున ఆ వైపు పాదాలు ఉంచడంవల్ల దేవతల నవమానించినవారవుతాము. తూర్పువైపు తలబెట్టుకొని నిద్రిస్తే దేవతల గౌరవించినవారమౌతాము. దీనికి సుశ్రుతం సూత్రస్థానంలో ప్రయాణముంది. ప్రాచ్యాందిశిస్థితాదేవాస్త త్పూజార్థంచతచ్ఛిరః గ్రహనక్షత్రాదులన్నీ పడమటినుండి తూర్పుకు పయనిస్తున్నాయి. కావున తూర్పు దక్షిణం శిరస్సుంచి పరుండడం మంచిది.   గాఢనిద్ర ఆరోగ్యం. భగవధ్యానంచేసి పండుకొన్న చెడుకలలు రావు.  'రామంస్కందం హనుమంతం వైనతేయం వృకోదరమ్  శయనే యస్స్మరేన్నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి-' రాత్రిపూట పరుండునపుడు ఈ శ్లోకం చెప్పుకొని పరుండే సంప్రదాయమున్నది.  'సహస్రపరమాదేవీ శతమూలా శతాంతురా సర్వగం హరతు మే పాపం దుర్వా దుస్వప్ననాశిన్-' ఈ శ్లోకం దుస్వప్నాల నుండి పరిహరిస్తుంది. ప్రశాంత చిత్తంతో పరుండి ప్రశాంతచిత్తంతో లేవవలెనని పండితులు చెబుతున్నారు.

Popular Posts