Followers

Saturday 30 March 2013

శ్రీకాళహస్తి గురించి స్థల పురాణం

                  శ్రీకాళహస్తి గురించి  స్థల పురాణం  

శ్రీకాళహస్తి పేరు వినగానే అందరికీ గుర్తు వచ్చేది శ్రీ – సాలె పురుగు, కాళ – సర్పము, హస్తి – ఏనుగు అనే మూగజీవాలకు ముక్తి నిచ్చిన క్షేత్రమని చాలా మంది వినే ఉంటారు. కాబట్టి దీన్ని గురించి ఎక్కువగా విడమరిచి చెప్పడం లేదు. ఇది జరగక మునుపే ఇక్కడ చాలా సంఘటనలు జరిగున్నాయట. అప్పుడు ఈ ప్రాంతాన్ని గజకాననం అనే వారట.
బ్రహ్మ ముందు ఇక్కడ పరమశివుడి గురించి తపస్సు చేసిన తర్వాతనే సృష్టికార్యం ప్రారంభించాడట. ఇక్కడ శివుడు జ్ఞానానికి ప్రతీకయైన దక్షిణామూర్తి స్వరూపంలో కూడా వెలసిఉన్నాడు.
వశిష్ట మహర్షికి విశ్వామిత్రునితో వైరము వలన తన నూర్గురు పుత్రులనూ పోగొట్టుకుంటాడు. ఆయన జ్ఞాన సంపున్నుడే అయినా పుత్రశోకంతో మాయ కప్పివేయడం మూలాన గజకాననానికి వచ్చి ఓ పర్వతం ఎక్కి ఆత్మహత్య చేసుకోబోయాడట. అప్పుడు భూమత అతన్ని రక్షించింది. శివుని గురించి తపస్సు చేయమని కర్తవ్యబోధ చేసింది. అలా కొన్నేళ్ళపాటు తపస్సు గావించిన వశిష్టునికి మహాశివుడు, దక్షిణామూర్తి స్వరూపంలో మర్రిచెట్టు కింద దర్శనమిచ్చాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు. మహాజ్ఞానియైన ఆయన ప్రాపంచిక విషయాల గురించి ఏం కోరుకుంటాడు?. అయినా లోక కల్యాణం కోసం శివుడిని జ్ఞానప్రదాత గా ఆ క్షేత్రంలో కొలువై ఉండమని కోరుకున్నాడట. అలా శ్రీకాళహస్తి జ్ఞానక్షేత్రమైంది. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ.
శ్రీకృష్ణదేవరాయలు కొలువులోని అష్టదిగ్గజాల్లో ధూర్జటి ఒకరు. అవి ప్రభంద సాహిత్యపు రోజులు. అందరు కవులూ రాజుల గురించి ఇతివృత్తాలను ఎన్నుకుంటుంటే ఆయన మాత్రం ఆయన ఇష్టదైవమైన శ్రీకాళహస్తీశ్వరుని ఇతివృత్తంగా ఎన్నుకొని శ్రీకాళహస్తీశ్వర మహత్మ్యం రాశాడు. అలాగే శ్రీకాళహస్తీశ్వర శతకం కూడా రాశాడు. ఆయన శైలిని గురించి రాయలు స్వయంగా

స్తుతమతి యైన యాంధ్ర కవి ధూర్జటి పల్కుల కేల కల్గెనీ
యతులిత మాధురీ మహిమ ?

అని కీర్తించినట్లు చెబుతుంటారు. తర్వాత ఆస్థానంలో ఆయనపై కొంతమంది ఏవో నిందలు వేయడంతో రాయలవారు ధూర్జటికి రాజ్య బహిష్కార శిక్షను విధించారట. వెంటనే ధూర్జటి కట్టుబట్టలతో భార్యతో కలిసి ఒక అడవికి వచ్చేశాడట. అక్కడే ఇద్దరు ముని దంపతుల ఆశ్రమంలో ఉంటూ వాళ్ళకు సేవ చేస్తూ, వాళ్ళు పెట్టే భోజనం తింటూ దైవ ప్రార్థనలో ప్రశాంత జీవనం గడుపుతున్నారట.
ఒకరోజు ధూర్జటి దంపతులు నదీ స్నానం కోసం వెళ్ళగా అక్కడికి వచ్చిన రాయల వారి సైనికులు వీరిని గుర్తు పట్టి, ఆయన మీద వేసిన నిందలు అసత్యాలుగా నిరూపణలు అయ్యాయనీ,  రాజు వాళ్ళను తిరిగి రాజ్యానికి ఆహ్వానించారనీ చెప్పారు. వెళ్ళాలా? వద్దా అని ఆలోచిస్తూ ఆశ్రమం వైపు నడుస్తున్నారు. కానీ వారికి ఎంత సేపు వెతికినా ఆయాశ్రమమూ కనిపించలేదు, వృద్ధ దంపతులూ కనిపించలేదు. చివరికి అది శ్రీకాళహస్తీశ్వరుని మహత్తుగా భావించి తాము వారితో రావడం లేదని ఆ సైనికులను తిరిగి పంపించి వేసి తమ శేష జీవితాన్ని శ్రీకాళహస్తి క్షేత్రంలోనే గడిపాడని చెబుతారు.
ఇక్కడ ప్రవహించే స్వర్ణముఖీ నది అసలు పేరు సువర్ణముఖరీ నది. అగస్త్య మహర్షి ప్రభావంతో ఈ నదీ ప్రవాహం ఏర్పడ్డదని స్థల పురాణం చెబుతోంది.

Popular Posts